నా అంతరంగ తరంగాలు-12

-మన్నెం శారద

నేను… నా రచనలు… నన్ను ప్రోత్సహించిన సంపాదకులు..

చిన్నతనం నుండీ అక్కడా ఇక్కడా ఏదో ఒకటి రాస్తూనే వున్నా ప్రముఖ పత్రికల్లో నా రచనలు చూసుకోవాలని చాలా ఆశగా వుండేది.

          అయితే నాకు మార్గదర్శకులు ఎవరూ లేరు. ఎలా పంపాలో కూడా తెలియదు.
చిన్నప్పటి నుండీ పప్పు రుబ్బినట్లు ప్రమదావనానికి ఉత్తరాలు రాస్తే ఎప్పటికో నేను కాలేజీలో చదివేనాటికి జవాబిచ్చారు మాలతీ చందూర్ గారు.

          అలాంటి తరుణంలో మా బావగారు ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు సీలేరు చూసి ఆ థ్రిల్ తో ‘ అడవిగులాబీ’ అనే కథరాసి ఆంధ్రజ్యోతి వీక్లీకి పంపించాను. పబ్లిష్ అవుతుందన్న ఆశ ఏమీ లేదు.

          కానీ, ఆ రోజు మా నాన్నగారికి ఆయన కొలీగ్ ఆంధ్రజ్యోతి డైలీ పేపర్ తెచ్చి చూపించి “చూడండి సర్, రేపు వచ్చే ఆంధ్రజ్యోతి వీక్లీలో మీ అమ్మాయి రాసిన కథ వస్తుందట,, ఇందులో వేశారు “అని చెప్పారు. మా నాన్న నాకు ఆ పేపర్ చూపించి ‘కంగ్రాట్స్’ అన్నారు సంతోషంగా.

          నిజానికి నేను నమ్మలేకపోయాను.

          అందులో బాక్స్ కట్టి మరీ “మన్నెం శారద రచన ‘అడవిగులాబి ‘చదవండి ‘ అని వుంది. మొదటి కథకే అలాంటి పబ్లిసిటీ ఇవ్వడం నిజంగా నన్ను ఎంతో సంభ్రమానికి గురి చేసింది.

          ఇక నా ఆనందానికి అంతులేదు.

          పేపర్ని పదే పదే చూసుకున్నాను.

          పత్రిక రానే వచ్చింది.

          కథని ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కలేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. కళ్ళు పోడారిపోయాయి ఓవర్ సెన్సిటివ్ నెస్ తో.

          కథకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

          ఆఁ సంతోషంతో  “రూపసి.. రూమ్ నెంబర్..7” అని కాలేజ్ కుర్రాళ్ళ అల్లరి మీద మరో కధ రాసాను. అది కూడా ఆంధ్ర జ్యోతిలో పబ్లిష్ అయ్యింది.

          ఆఁ విధంగా నన్ను సంయుక్తంగా ప్రోత్సహించిన ప్రముఖ సంపాదకులు, శ్రీ నండూరి రామ్మోహనరావు గారు, శ్రీ పురాణం సుభ్రమణ్యం శర్మగారు. ఆఁ ఊపుతో పట్టువదలకుండా వరకట్నం మీద ఆంధ్ర పత్రికలో పొటీ పెడితే మగాళ్ళని తిట్టిపొస్తూ వ్యాసం రాసాను. ఆఁ ఘాటుకి… దెబ్బకి ఊపిరాడక నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు జడ్జీలు 
ఇంతలో నా ఖ్యాతి నలుదిశలా వ్యాపించి గుంటూరులో ఎవరో ‘ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి కథలు రాస్తుందట ‘అని చెబితే మధువని ‘ అనే కథల సంపుటి వేస్తూ సదరు సాహిత్యాభిలాషులు నా దగ్గరకు వచ్చారు .

          అప్పటికే మళ్ళీ ఆంధ్రజ్యోతి మీద దాడి చేద్దామని రాసి పెట్టుకున్న “శాపగ్రస్తుడు “అనేకధ వాళ్ళకిచ్చాను.

          రెండు పిలకలు వేసుకుని చదువు వెలగబెడుతున్న నన్ను ఒక పెద్ద రైటర్ గా గౌరవించి మాట్లాడుతుంటే నాకు తెగ ముచ్చటేసింది మరి! మా సిస్టర్స్ అవతలి గది లోంచి నన్ను చూసి వేస్తున్న కోతి వేషాలకు నవ్వు బిగబెట్టుకుని గంభీరంగా పోజ్ పెట్టి మాట్లాడాలంటే మాటలా… ఆఁ కథ ఆఁ సంకలనంలో అచ్చువేశాకా ఆఁ పుస్తకంతో పాటూ ఒక ఉత్తరం అందించారు నాకు మధువని సంపాదకులు.

          ఆఁ ఉత్తరం రాసింది ఆఁ సంకలానికి ముందు మాట రాసిన ప్రముఖ రచయిత గణేష్ పాత్రో గారు.

          నా శైలి బాగుందని, కథరాసే విధానం, కొసమెరుపు చాలా బాగా ఇచ్చానని అచిరకాలంలో నేను ఒక మంచి రచయిత్రిని కాగలనని, రాయడం మానొద్దని ఆయన రాశారు.

          నాకు అప్పటికి గణేష్ పాత్రో గారి గురించి ఏ మాత్రం తెలియదు. అంత అజ్ఞానిని.
ఓహో అనుకున్నాను.

          తెలిసాక ఆయన నాటికలు, రచనలు చూసాక నేను చాలా ఫీలయిపోయాను.
ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ లెటర్ రాయని గిల్ట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

          ఆయనే మన కుప్పిలి పద్మ గారి మేనమామ గారని తెలిసి మరింత సంతోష పడ్డాను. 

          తర్వాత “దూరపు కొండలు ” అనే మానసిక విశ్లేషణ ఉన్న కథ రాస్తే ఆంధ్రజ్యోతి వారు తిరగ్గొట్టేరు. మళ్ళీ పట్టువదలకుండ ఆంధ్ర ప్రభకు పంపితే అది రాజేంద్రగారి సంపాదకత్వంలో ప్రభలో అచ్చయ్యింది.

          ఆఁ కథ చదివి మా బావగారు నా తల మీద చిన్నగా కొట్టి”ఏంటి, అప్పుడే మానసిక విశ్లేషణల మీద కథలు రాసేంత స్థాయికి వచ్చేసేవా? “అంటూ పత్రిక వారు 15 రూపాయలిస్తే ఆయన 50/-రూపాయలిచ్చారు. ఆయన పెళ్ళికి నేను అయిదేళ్ళ పిల్లని మరి! 

          అన్నట్లు ఆ కథకు బాపు గారు బొమ్మ వేశారు సంతోషం కదా!

          అయితే రచనా వ్యాసంగంని నేను సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు. అందుకే నా కెరీర్ లో చాలా గేప్స్ ఉంటాయి. సెలవులిస్తే తరచూ చెన్నయ్ వెళ్ళే నాకు ఒకసారి అక్కయ్య వాళ్ళింట్లో సరళ అని ఒకామె పరిచయం అయ్యింది. అక్కా వాళ్ళకి నాయరమ్మ అని ఒక పనమ్మాయి ఉండేది.

          నన్ను చూడగానే “అమ్మ రొంబ నల్ల ఇరిక్కీ “అంది.

          నాకు సర్రున కోపం వచ్చేసింది.

          నాయరమ్మ చాలా నలుపు. పైగా ఎక్కడ చూసినా ఈ నలుపు గోలేంటని మా మణ క్కతో అన్నాను.

          అక్కనవ్వి” నువ్వు చాలా బాగున్నావని అంటుందే, నలుపని కాదు ” అంది. హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నా నేను.

          సరళది గుంటూరు, ఏమయినా సహాయం చేయడానికి అక్క దగ్గరకొస్తుండేది. చిన్న చిన్న పనులేవో అక్కకి చేసి సహాయ పడుతుండేది. భర్త డ్రైవర్, సకల లక్షణ శోభితుడు.
ఆమె దగ్గర మేము తమిళం నేర్చుకునేవాళ్ళం. అక్క ఆమెకు ఆర్ధిక సహాయంచేస్తుండేది.

          ఒకసారి ఆమె మేము అడగ్గా తన కథ చెప్పింది.

          తండ్రి పేరున్న డాక్టర్. కాని స్టెప్ ఫాదర్. అతను పెట్టె హింసలు భరించలేక ఈ డ్రైవర్ ని పెళ్ళి చేసుకుని చెన్నై వచ్చేసింది.

          ఆ కథ విని మనసు చలించి “మహిళ “మాస పత్రికలో “స్టెప్ ఫాదర్ “పేరుతో చిన్న నవలికలా రాసాను.

          మళ్ళీ పెద్ద గేప్!

          ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంతేకాక అప్పట్లో ఆర్ట్ మీదే ఎక్కువ ఇంటరెస్ట్!
చాలా work లోడ్ ఉన్న సీట్ కావడం వలన కూడ నేను రచనల్ని పక్కన పెట్టేసాను.
హైదరాబాద్ వచ్చాక నాకు కొంత లీజర్ దొరికి మళ్ళీ రాయడం మెదలు పెట్టాను.
ఆంధ్ర జ్యోతిలో నా కథ “అరకులోయలో కూలని శిఖరం ” ( కథకు ఈ పేరు పురాణం గారే పెట్టారు ) అది చూసి కనకాంబర రాజు గారు నన్ను పిలిచి ఆంధ్ర భూమికి రాయమ న్నారు. వారి ప్రోత్సాహంతో చాలా కథలు ఆంధ్రభూమికి రాసాను.

          ఉరిశిక్ష వుండాలని నేను రాసిన “ఆగండి.. ఆలోచించండి “కధకు వచ్చిన ఫాన్ మెయిల్ చూసి అబ్బురపడి శికరాజు గారు నేను వారి ఆఫీస్ కి వెళ్తే “రండి శారదగారు, మీకు రెడ్ కార్పెట్ ఆహ్వానం! ఒక షార్ట్ స్టోరీకి నా ఆఫీసంతా ఫాన్ మెయిల్ తో నిండి పోయింది “అని లేచి నిలబడి ఆహ్వానిస్తుంటే నేను చాలా సిగ్గు పడ్డాను.

          ఆ యేడు నా కధ “ఆగండి.. ఆలోచించండి “ని “best story of the year “గా ప్రకటించారు.

          అయితే అది చూసి సహించలేని కొందరి రాజకీయంతో నేను ఆఁ పత్రిక నుండి బయటకి వచ్చేసాను.

          ఆయన తప్పు తెలుసుకుని నన్ను పిలిపించి తిరిగి రాయమన్నా నేను రాయలేదు.
అవమానం జరిగినచోట నేను రాజీ పడను. సహజంగా నా కోపం తాటాకు మంటలాంటిది, త్వరగానే మరచి పోతాను..But i cannot bear insult!

          అయితే ఎన్నో పత్రికలు నన్ను ఆదరించాయి.

          అందరూ నన్ను గౌరవించి నా రచనలు ప్రచురించారు. నేను రాయని పత్రిక లేదు.
యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక, వాటి అనుబంధ దిన పత్రికలు, వనిత, మహిళ, వనితజ్యోతి,ఉదయం వీక్లీ, దినపత్రిక, మయూరి, ఆదివారం స్వాతి, ఇండియా టుడే, పల్లకి రిపీటెడ్ గా నా సీరియల్స్, నా కథలు, సెటైర్స్, ఫీచర్స్ , ఇంట ర్వ్యూ లు ప్రచురించాయి.

          మారేమండ సీతారామయ్య గారు, తాళ్లూరి నాగేశ్వర రావు గారు, యువ శారద గారు  (ఈమె విజయ ప్రొడక్షన్ వారి సంచాలకుడు చక్రపాణి గారి కోడలు ) జొన్నలగడ్డ సత్యనారాయణ, శాతవాహన (గౌస్ )గారు, కందనాతి చెన్నారెడ్డి గారు, కిషోర్ జొన్నలగడ్డ, విక్రమ్!

          ఇక్కడ ప్రముఖ ఆంధ్ర పత్రిక, దిన, వార పత్రికల సంపాదకులు వీరాజీ గారి పేరు చెప్పక పోవడం పెద్ద అపరాధమే అవుతుంది.

          సినీ నటుడు సుమన్ తన జీవిత కథ ఆధారంగా నవల రాయమన్నప్పుడు నేను దాన్ని ఆంధ్ర పత్రిక వీక్లీలో వేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు వెంటనే సీరియల్ గా వేయడమే కాకుండా నేను సుమన్ గారిని చేసిన ఇంటర్వ్యూ కూడా అందులో ప్రచురిం చారు.

          స్వాతి బలరామ్ గారు ఊపిరిపోతున్న కథని తిరిగి బ్రతికించిన నవ్య సంపాదకులు జగన్నాధ శర్మ గారు ప్రత్యేకులు. అంతా నన్ను సాదరంగా ఆహ్వానించి కుటుంబ సభ్యురాలిగా చూసి నన్ను ప్రముఖ రచయిత్రిని చేశారు.

          నా మొదటి మూడు నవలలు గౌతమి, చంద్రోదయం, పిలుపు నీకోసమే… అంధ్ర జ్యోతి దిన, వార పత్రికలలో బహుమతులు పొందినవే!

          “ఎప్పుడూ మీరే రాస్తే ఇంకెవరికి బహుమతులు రావు “అని పురాణం గారు సరదాగా అన్నమాటకు నేను తర్వాత పోటీలకు రాయడం మానేసాను.

          “నేను సరదాగా అన్నాను, రాయండి ” అని పురాణం గారు చెప్పినా కూడా రాయ లేదు. నా చాలా కధలు బహుమతులు సంపాదించుకున్నవే! కొన్ని పరిస్థితులకు మనసు వికలమై 15సంవత్సరాలు విరామం తీసుకున్న నాచేత తిరిగి మళ్ళీ కలం పట్టించిన
ఘనత కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారు, వారి శ్రీమతి కాంతి కిరణ్ గారిదయితే, ‘కధ రాస్తే మన్నెం శారద రాయాలి’ అన్న సిక రాజుగారికి, ‘మంచి కధా రచయితల్లో మీరు కూడా ఒకరు!’అని నేను ఆయనని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా పేరు కూడా చెప్పిన పురాణం గారికి, నా రచనల మీద ఎంతో ప్రేమతో మా ఆఫీస్ కి నన్ను చూడవచ్చిన జగన్నాధ శర్మగారికి, “మొదటి నవలైనా చాలా సీనియారిటీ ఉన్న రచయిత్రి లా రాసారు ” అని మెచ్చుకున్న నండూరి రామ్మోహన రావు గారికి సర్వదా కృతఙ్ఞతురాలిని.

          నిజం గా ఆఁ రోజులు చాలా మంచివి. నిష్ణాతులయిన ఆఁ సంపాదకుల దగ్గర నేర్చుకోవడానికి ఎంతో ఉండేది. ఎన్నడూ వాళ్ళు కించిత్తు గర్వం ప్రదర్శించి ఎరుగరు.
రఫ్ రాసే అలవాటు లేనందు వలన నేను దాదాపు 50 నవలలు, కథలు, ఫీచర్స్, సెటైర్స్, విశ్లేషణలు కలిపి వెయ్యిదాకా రాసాను.

          అన్నీ క్వాలిటీ రచనలే చేశానని నేను చెప్పను. చిన్న తనం నుండి చుట్టూ ప్రపంచాన్ని గమనించడం అనే అలవాటు నాకు తెలియకుండా పనికి వచ్చింది.
దాదాపు సీనియర్ రచయిత్రులు అందరు రిటైర్ అయ్యాక నా రచనా వ్యాసంగం మొదల య్యింది.

          ఇలా నాకు అవకాకాశాలిచ్చిన సంపాదకుల్ని ఒకసారి స్మరించి కృతజ్ఞతలు చెప్పడం నా ధర్మం అనిపించింది.

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.