దేవి చౌధురాణి

(మూడవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

వైశాఖ శుక్ల సప్తమి దగ్గర పడింది. ఋణం తీర్చటం గురించి హరివల్లభ బాబు ప్రయత్నమేమీ మొదలుపెట్టలేదు.  ఇప్పుడు సంపన్నుడే, ఋణం చెల్లించటానికి డబ్బు కూడబెట్టగలడు, కానీ, ఆ ప్రసక్తి ఎక్కడా లేదు. సమయం మీదకు వస్తున్నదని వ్రజేశ్వర్ తండ్రికి గుర్తు చెయ్యబోతే, తండ్రి కొడుకు మీద కేకలు వేసాడు. ఋణం చెల్లించటానికి ఇంకొక నాలుగు రోజులు మాత్రమే వుంది అనగా వ్రజేశ్వర్ మళ్లీ గుర్తు చెయ్యబోతే, “తొందరేమీలేదు, నేను ఇప్పుడు అదే పని మీద వెళ్తున్నా. షష్ఠికి తిరిగివస్తాను” అంటూ పల్లకీ ఎక్కి, తీరికగా కాపలావాళ్లతో సహా బయలుదేరాడు.

హరివల్లభ బాబు బయల్దేరిని మాట నిజమే. కానీ, అది డబ్బు కూడబెట్టే ప్రయత్నానికి కాదు. నేరుగా రంగాపురంలోని ఇంగ్లీషు కలక్టేరు దగ్గరకు వెళ్లాడు. “దేవి చౌధురాణిని పట్టి తీసుకువస్తా, మరి నాకు ఏం బహుమతి ఇస్తారు?” అంటూ లాలూచి మొదలు పెట్టాడు. ఆ మాట వింటూనే కలక్టేరు ఉత్సాహం పట్టలేకపోయాడు. దేవి చౌధురాణిని పట్టుకోవడం ఇంగ్లీషువాడి వల్ల కావటంలేదు. వెంటనే లాలూచి కుదిరింది. బహుమతి వివరాలూ, దేవి చౌధురాణిని పట్టుకునే వ్యూహం, అన్ని చర్చలు పూర్తి అయ్యాయి. కలక్టేరు హుకుంతో లెఫ్టినెంట్ బ్రెన్నన్ అనే వాడి నాయకత్వంలో ఐదు వందల మంది సిపాయిలు హరివల్లభ బాబుకి సహాయంగా బయలుదేరారు.

దేవి చౌధురాణి ఏ ఘాట్ దగ్గర వుంటుందో అనే విషయం వ్రజేశ్వర్ తండ్రికి చెప్పనే చెప్పాడు కదా! లెఫ్టినెంట్ బ్రెన్నన్ నదిపై ఆ ఘాట్‌కి కొంత దూరంగా నాగతరులతో కూడిన నావికా దళంతో చుట్టుముట్టి దాడికి సిద్ధంగా ఉంచాడు. దేవి చౌధురాణి ఒడ్డుపై నుండి తప్పించుకోకుండా దాడికి భూమార్గంగా ఒక సిపాయి దళాన్ని పంపించాడు. లెఫ్టినెంట్ బ్రెన్నన్ ఒక నాగతరి ముందు భాగాన కూర్చుని, ఆ దళం రావటం కోసం ఎదురుచూస్తున్నాడు. హరివల్లభ బాబు భూమార్గంగా వస్తున్న సిపాయి దళంతో కూడి వస్తున్నాడు.

ఈ యుద్ధ సన్నాహం అంతా ఒక ఆడదాన్ని పట్టుకోవటానికే! దేవికి కూడ యోధులతో కూడిన దళాలు వున్నాయి. ఆ యోధులందరూ అన్ని శస్త్ర విద్యలూ వచ్చినవారే, ముఖ్యంగా కర్ర సాములో ఆరితేరిన వారు.

అసలు ఆ రోజుల్లో కర్ర సాముకి వాడే కర్రలే వేరు. గట్టి వెదురు కర్రను నిప్పులో కాక బట్టితే ఇంకా గట్టిగా తయారయ్యేది. ఆ దుడ్డు కర్రలు ఎంత మంది తలలు పగలు కొట్టాయో, ఎన్ని తుపాకులను ఎదిరించాయో! అదంతా ఒక గుర్తు మాత్రమే, ఇప్పుడు అదే వెదురు కర్రలని పుగాకు గొట్టాలకి, గాలి పాటలకి వాడతున్నారు. ప్చ్, ఆ వెదురు కర్రల వైభోగమే పోయింది!

***

మరి ఆ దేవి ఇప్పుడు ఎక్కడ వుంది?

ఏ ఘాట్ దగ్గరైతే వ్రజేశ్వర్ దేవికి పట్టుబడ్డాడో, అదే ఘాట్ దగ్గర దేవి ప్రస్తుతం తన నావను నిలిపి వున్నది. నావ పైన వున్న డాబా కట్టడం కప్పు మీద కూర్చుని వున్నది. సాయం సంధ్య గడిచింది. నావైతే వున్నది కానీ, కొంత గమనికతో వ్యత్యాసాలు కూడా కనబడతాయి. నావకు లంగరు వెయ్యలేదు, ఒడ్డున వున్న గూటానికి వదులుగా కట్టి వున్నది.ఆ ప్రక్కన వుండే నాగతరి, దాని మీద వుండే యోధులు లేరు. నావ పైన కూడా ఏ ఒక్క పురుషుడి ఆచూకీ  లేదు. వంటవాళ్లు, దాసీలు ఎక్కడా కనబడటం లేదు. నావలో ఇదివరకటి అలంకరణలూ, తివాచీలూ, ద్వారాలకు వేలాడే తెరలూ, జరీబుటాలతో నిండిన బాలీశులూ లేవు.

“పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేనా” అంటు దివ ఒక విరుపు విసిరింది.

“ప్రత్యక్షమంటే మన కళ్లకి కనబడటం మాత్రమే అని నేను అనటంలేదు. ప్రత్యక్షమనేది ఆరు రకాలుగా జరగవచ్చు. నువ్వు నా మాటలు వింటున్నావు కదా, అది శ్రవణ ప్రత్యక్షం. నువ్వు నాకు పూలు కడుతున్నావు కదా …”

“అవును, పూలు కడుతున్నాను.”

“వాటి సుగంధం నాసికా ప్రత్యక్షం. అదే నేను నిన్ను చేతితో తాకితే అది త్వచ ప్రత్యక్షం. దివ నీకు మిఠాయి తినిపిస్తే అది రసన ప్రత్యక్షమవుతుంది” అన్నది దేవి.

“అది సరే కాని,  ప్రభువు ఇప్పుడు కనబడటం లేదు, వినబడటం లేదు, వాసనా లేదు, స్పర్శా లేదు, తిననూ తినలేము. మరి ఏ రకంగా ప్రత్యక్షమవుతాడు?”

“లోచనములూ, నాసిక, కర్ణము, జిహ్వ, చర్మము, ఇవి కర్మేంద్రియాలు. ఇవి కాక ఒక జ్ఞానేంద్రియం వుంటుంది. అక్కడే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు.”

“ఓ, అలాగా. మన కళ్లకు కనబడనివి జ్ఞానేంద్రియంతో చూడవచ్చనమాట” అన్నది దివ.

“ఇంకొక సాధనం వుంటే” అంటూ మందంగా నవ్వింది దేవి.

ఆ నవ్వు దివకు నచ్చలేదు. “అసలు విషయమేమిటి దేవి?” అని సూటిగా అడింది.

“ఈవేళ ఇంగ్లీషు సిపాయి దళాలు నన్ను బంధించటానికి వస్తున్నాయి, తెలుసా?”

దివ ఒక నిట్టూర్పు విడిచి “తెలుసు” అన్నది.

“నీకు కనబడుతున్నారా?”

“లేదు.”

దేవి “ఈ సాధనంతో చూడవచ్చు” అంటూ ఒక దూరదర్శినిని అందించి అటు ప్రక్కగా చూడమంది.

“దూరంగా సిపాయిలతో నిండి వున్న ఒక నాగతరి కనుపడుతున్నది.”

“ఇంకొచెం పరిశీలిస్తే ఇంకొక ఐదు నాగతరులను కూడా చూడవచ్చు.”

నిశి కూడా దూరదర్శిని అందుకుని చూసి, “అక్కడే ఎందుకు ఆగారు? దాడి ఎందుకు చెయ్యటం లేదు?” అని అడిగింది.

“మన దగ్గర దూరదర్శిని వున్నదని ఆ ఇంగ్లీషు వాళ్లకు తెలియదు. వాళ్లు మనకు కనబడటం లేదని అనుకుంటున్నారు. అందుకే అక్కడ దూరంగా వేచి వున్నారు.”

“భూమార్గంగా వచ్చే దళాలు ఇంకా వచ్చినట్టులేవు. వాళ్లు కూడా వచ్చిన తరువాత ఇంగ్లీషు నావికా దళం మన మీద దాడి చేస్తుంది. అప్పుడు మనం భూమార్గంగా తప్పించుకోకుండా అటు నుంచి వచ్చే ఇంగ్లీషు దళాలు అడ్డుపడతాయి. అదీ, వారి వ్యూహం.”

దివ కొంత ఆశ్చర్యం, కొంత విసుగుతో, “ఇప్పుడు మనకి వాళ్లు కనబడుతున్నారు కదా, మనం తప్పించుకోవటానికి అడ్డేమిటి?” అన్నది.

“ఓసి నా చిట్టి చెల్లెల్లా, నీ ప్రాణేశుడిని నువ్వు తప్పకుండా మళ్లీ చూసుకుంటావు. ఇప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. ఇంగ్లీషు వాళ్లు ఇంకా దాడి మొదలు పెట్ట లేదు. ఈ అడవి దారి గుండా వెళ్లవచ్చు. తప్పించుకోవటానికి ఇంకా సమయముంది, పద, పద తొందరగా” అన్నది నిశి.

“నేను పారిపోయేదాన్నే అయితే, తెలిసి కూడా ఇక్కడకు వచ్చేదాన్ని కాదు. నాకు చారులు వున్నారు, వెయ్యి మందికి పైగా యోధులతో కూడిన దళాలు వున్నాయి. వాళ్లనందరిని ఇక్కడ నుండి పంపిచి వేశాను. మీరిద్దరూ వదలి వెళ్లనని మొండిగా ఇక్కడే కూర్చున్నారు.”

“ఈ విషయమంతా నాకు ముందు తెలిస్తే, ఈ మూర్ఖపు పనులన్నీ కట్టి పెట్టి వుండేదాన్ని” అన్నది దివ.

“దివ, నువ్వు నన్ను ఆపలేవనే విషయం నీకు పూర్తిగా తెలుసు. నా భర్తను నేను మళ్లీ తప్పక చూస్తాను. ఆ తరువాత నేను పట్టుబడితే ఉరి తీస్తారేమో, అయితేనేం?. మీరిద్దరూ మాత్రం నాకు ఒక మాట ఇవ్వండి, నా భర్త వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు అదే పడవలో మీరు కూడా వెళ్లండి.”

“ఆ మాట ఇవ్వటం కుదరదు, ఈ దేహంలో ప్రాణం వుండగా నిన్ను విడిచి వెళ్లం. ప్రాణం అంటూ పోతే, నీతో పాటే” అన్నది నిశి. తన చేతిలో ఇంకా దూరదర్శిని వున్నది. మళ్లీ నదిని పరిశీలనగా చూస్తూ, “అదిగో, అక్కడ ఒక చిన్న పడవ ఇటు వస్తూ కనబడుతున్నది” అన్నది.

ఒక చిన్న పడవ నావ దగ్గరకు వచ్చింది.  దేవి తన సహచరిణులిద్దరినీ క్రిందకు వెళ్లి కనబడకుండా వుండమని చెప్పింది. వాళ్లిద్దరూ క్రిందకు వెళ్ళారు. దేవి ప్రశాంత వదనంతో, నిర్మలంగా కూర్చుని వున్నది. వ్రజేశ్వర్ తన పడవవాళ్లని నావకి ఆనుకునేటట్లు ఆపమని చెప్పి, నావకి వున్న తాళ్ల నిచ్చెనతో పైకి ఎక్కి వచ్చాడు.

వ్రజేశ్వర్ పైకి వచ్చి కనబడగానే, దేవి పతి పాదాల వద్దకు వంగి ప్రణామం చేసి, ఆ పాదధూళిని తలపై అద్దుకుంది.

ఇద్దరూ కూర్చున్నారు. వ్రజేశ్వర్ “సమయానికి డబ్బు కూడబెట్ట లేదు. ఇంకొన్ని రోజులలో చెల్లిస్తాను. నువ్వు అప్పటి దాకా ఇక్కడే వుంటావా?” అన్నాడు.

దేవి మదిలో ఆలోచనలు పెల్లుబికాయి. మనసులో ‘ఓ వ్రజేశ్వరా! పది సంవత్సరాల తరువాత నువ్వు ప్రఫుల్లని ఏకాంతంగా కలుసుకుంటున్నావు. డబ్బు గురించేనా నువ్వు మాట్లాడవల్సింది?’ దేవికి కళ్లు నిండాయి. తుడుచుకుంది. చివరకు పెగుల్చుకుని “కలవటం కుదరదు కానీ ఋణం చెల్లించటానికి ఇంకొక మార్గం వుంది. దీనులకు, దరిద్రులకు దానధర్మాలు చెయ్యండి. వాటితో నాకు ఋణం చెల్లించినట్టే.” ఆ మాటలతో దేవి గొంతు పూడుకుపోయి ఇంక ఏమీ మాట్లాడలేకపోయింది.

వ్రజేశ్వర్ దేవి చేతిని అందుకుని “ప్రఫుల్లా, నీ డబ్బు …” అంటూ ఏదో చెప్పబోయాడు. వ్రజేశ్వర్ తనను ప్రఫుల్ల అని సంబోధించి మృదువగా తాకగానే, ఒక పుష్పం పూరేకల మధ్య అప్పటి దాకా తాను నింపుకున్న వర్ష బిందువులను ఎలా జలజల రాలుస్తోందో, ఆ విధంగా వ్రజేశ్వర్ తనను తాకగానే ప్రఫుల్ల కన్నీరు జలజలా రాలాయి.

ఈ అనూహ్య పరిణామానికి వ్రజేశ్వర్‌కి ఎమీ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తోచక ఒక విచిత్ర దశలోకి చేరాడు. ఇంగ్లీషు వాడిని కూడా భయపెట్టే డాకూ రాణి ఇలా విలా విలా విలపించటం ఏమిటి? వ్రజేశ్వర్‌కి అర్థం కాలేదు. దేవి కన్నీరు వ్రజేశ్వర్ చేతిని తడపగానే అతనికి కూడా కళ్లు నిండాయి. అతనికి కూడా కన్నీరు చెక్కిలిపై నుండి కారుతూ ప్రఫుల్ల చేతిని తడిపాయి. ఇద్దరి కన్నీటి వరద కట్టలు తెంచుకుంది. అది ఒక విచిత్ర పరిస్థితి.

దేవి వద్దకు బయలుదేరే ముందు వ్రజేశ్వర్ ఒక గట్టి నిర్ణయంతోనే బయలుదేరాడు. డాకూరాణి అయ్యి దోపిడీలు చెస్తున్నది కాబట్టి, ప్రఫుల్లను తిరస్కరించుతున్నానని చెప్పుతానని నిర్ణయించుకున్నాడు. పైగా, నువ్వు పాపివి, జన్మలో మళ్లీ నీ ముఖం చూడనని అందామనుకున్నాడు. కానీ ఈ కన్నీటి కలయికలో అన్నీ మరచిపోయాడు.

వ్రజేశ్వర్ కొంత తేరుకుని కళ్లు తుడుచుకున్నాడు. “ప్రఫుల్లా, నీ సొమ్ముని నా సొమ్ముగానే కాపాడాను. కానీ ఇప్పటికి ఇప్పుడు నేను నీకు చెల్లించలేని స్థితిలో వున్నాను. గత పది సంవత్సరాలనుండి నీ ధ్యానంలోనే వున్నాను. నాకు ఇంకొక ఇద్దరు భార్యలు వున్నారు, కానీ వారిని అర్థాంగులగా తలచటంలేదు. నువ్వే నా అర్థాంగివి అనుకున్నాను. ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నీకు అర్థమయ్యేటట్లు వివరించలేను. నువ్వు ఈ ప్రపంచం లేవు అని అన్నారు, కానీ నువ్వు నాకు ఆపత్కాలంలో సహాయంగా చేయూతనిచ్చావు. పది సంవత్సరాల క్రితం నువ్వు మరణించావనే వార్త విన్నప్పుడు నేను కూడా చనిపోతే బాగుండునని అనుకున్నాను. నువ్వు మరణించినా బాగుండేదేమో! నేను ముందుగా మరణించితే ఇంకా బాగుండేదేమో, నీ మరణం గురించి విని బాధపడటం తప్పేది. ఏదైతేనేం, ఈవేళ గత పది సంవత్సరాలుగా పోగుట్టుకున్న సంపద దొరికింది, కానీ నిన్ను ఈ అవస్థలో చూస్తుంటే మాత్రం సంతోషంగా లేదు, నాకు ఏదో శాపం వున్నట్లుంది” అంటూ ప్రఫుల్ల చేతులు పట్టుకుని మళ్లీ కన్నీరు కార్చాడు. మళ్లీ తేరుకుని “ప్రఫుల్ల, నా మనోమందిరంలో నీ ప్రతిమనే నిలబెట్టుకున్నాను. కాని నువ్వు ఇలా డాకూ పని చెయ్యటమేమిటి?”

ప్రఫుల్ల బాధగా “నేను డాకూనని అంటున్నారా?” అన్నది.

“ఏం, నువ్వు డాకూవి కాదా?”

ప్రఫుల్ల చెప్పదల్చుకుంటే పది సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్పగలదు. ప్రఫుల్ల మరువగల విషయం కాదది. ఆ రోజున “నేను దిక్కులేనిదానను, మీరు ఇంటినుండి తరిమేస్తే నేనేమి తింటాను, ఎలా బ్రతుకుతాను” అని ప్రాధేయపడితే వ్రజేశ్వర్ తండ్రి “దొంగతనమో, డోపిడీనో, డాకూ పనో, లేకపోతే అడుక్కు తిను” అని తరిమేసాడు. అవి అన్నీ గుర్తు చెయ్యగలదు. కానీ, మాటకు మాట పెంచి పతిని దూరం చేసుకోవటం తనకు తగదు.

ప్రఫుల్ల తన చేతులను ఒక్కసారిగా విదిలించుకుని వెనుకకు తీసుకుని, “నేను డాకూని కాదు. నేను శపథం చేసి చెపుతున్నాను, నేను ఎప్పుడూ దోపిడీలు చెయ్యలేదు, నేను చేసిన దాడులతో వచ్చిన సొమ్ములోనుంచి ఒక్క సత్తు కానీ కూడా నేనెప్పుడూ తీసుకోలేదు. ప్రజల సొమ్ము ప్రజలకు చేర్చాను, అంతే. నన్ను వేరే వాళ్లు డాకూ అని ముద్రవేస్తే వెయ్యవచ్చు. ఎవరు ఏమని అన్నా ఈ జరిగిన కాలంలో ఎప్పుడూ మీరే నాకు దేవత. వేరే దేవతార్చనకు ప్రయత్నించాను, కానీ చెయ్యలేకపోయేదాన్ని. జరిగిన కథ మీకు చెప్పాలనే తపనతో మీకోసం ఈ రోజు వేచివున్నాను.”

గత పది సంవత్సరాలుగా తన జీవనయానం వివరించింది దేవి. ఆంతా విని వ్రజేశ్వర్ విస్మయం పొందాడు, సిగ్గుపడ్డాడు కూడా, చివరకు అనందంతో పొంగిపోయాడు. ప్రఫుల్ల మళ్లీ వ్రజేశ్వర్ చేతులు తీసుకుని “నేను చెప్పిన విషయాలు మీరు నమ్ముతున్నారు కదా?” అన్నది.

వ్రజేశ్వర్‌కి నమ్మకం కలగపోవటానికి కారణాలేమీ కనబడలేదు. కానీ నోట మాట రాలేదు. దేవి అతని ముఖ కవళికలు గమనించి విశ్వాసం కుదిరిందనే అనుకున్నది. మళ్లీ వ్రజేశ్వర్ చేతులని తీసుకుని “మీ చరణ ధూళి నాకు ప్రసాదించి ఇక మీరు శలవు చెప్పండి, ఇంక ఆలస్యం చెయ్యకూడదు. ఓ పెద్ద విపత్తు రాబోతున్నది. మీరు వెళ్లండి. మీతో బాటు పడవలో నా ఇద్దరి సహచారిణిలను కూడా తీసుకు వెళ్లండి, వాళ్లకి కావాల్సిన చోటుకు వారిని చేర్చండి. వారిద్దరంటే నాకెంతో ఇష్టం, నాకు కావల్సినవాళ్లు. మీరు నన్నెప్పుడూ గుర్తుంచుకుంటారు కదూ? సాగర్‌ని కూడా అడిగానని చెప్పండి, సాగర్ మంచి పిల్ల, తనంటే నాకెంతో ఇష్టమని చెప్పండి” అన్నది దేవి.

వ్రజేశ్వర్ రెండు క్షణాలు మౌనంగా వుండి, “ప్రఫుల్లా, నా కేమీ అర్థం కావటంలేదు. నీ వెంట బోలేడు మంది మనుష్యులున్నారు కదా, వాళ్లేమయ్యారు? ఇద్దరు స్త్రీలు అంటున్నావు, వాళ్లని నాతో తీసుకు వెళ్లమంటున్నావు, మరి వాళ్లెక్కడా కనపడరేం? ఇదంతా ఏమిటి? విపత్తు అంటున్నావు, ఈ విషయాలన్నీ నాకు చెప్పకపోతే నేను ఇక్కడినుంచి వెళ్లేది లేదు.?

“ఈ విషయాలు మీకు అనవసరం.”

“అనవసరమా!? ప్రఫుల్లా, నేను నీకేమీ అవ్వనా?”

దేవి ప్రతిస్పందించేలోగా దూరంగా ఒక తుపాకి పేలిన శబ్దం వినబడింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.