మేనత్త

(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-సరసిజ పెనుగొండ

తేజు పెళ్లి అని తలచుకోగానే మనసులో ఎంతో సంతోషం. ఈరోజు కోసం ఎంతగా ఎదురు చూశానో? ఇన్నాళ్ళకి ఆ సమయం రానే వచ్చింది. హడావిడిగా బీరువాలోని బట్టలన్నీ తీసి మంచం మీద కుప్పగా పోసాను. పెళ్ళికి తీసుకువెళ్లాల్సిన సామాన్ల లిస్టు చూస్తూ ఒక్కొక్కటిగా సర్దడం మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉండగానే  “అమ్మాయి “అంటూ పక్కింటి ఆంటీ గొంతు వినిపించింది. “ఆ “అంటూ బయటికి వచ్చాను.

“రండి ఆంటీ” అని తనని పిలిచి ఇద్దరం హాల్లో కూర్చున్నాం.

“ఏంటి పని మీద ఉన్నావా నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశానా”? అని అడిగారు.

అబ్బే! అదేం లేదు ఆంటీ! ఇంకా ఐదు రోజుల్లో మా మేనకోడలు తేజు పెళ్లి కదా ! ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్తున్నాం. దానికోసమే ఏర్పాట్లు చేస్తున్నాను “.అంటూ బదులు ఇచ్చాను.

“అదేంటి అమ్మాయి? మేనకోడలు అంటున్నావు నీకు అన్నదమ్ములు లేరు కదా!” అంటూ అడిగింది .

“అదే ఆంటీ! తేజు అంటే మా ఆడపడుచు కూతురు. నేను వరుసకు అత్తను అవుతాను కదా”

“అవుననుకో కానీ ఎంత అత్త అయినా మేనత్తవు కాదు కదా”! అంది ఆంటీ.

ఒక్కసారిగా మనసు అవును కదూ! మేనత్తను కాదు ! ఎవరైనా నన్ను పరిచయం చేయాలి అంటే మేనత్త అని ఎందుకు చేస్తారు? మేనమామ భార్య అని అంటారు కదూ! అని మనసులో మెదలగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత బాగుంటుంది “మేనత్త” అనే పదం అని అనుకుంటూ ఉండగానే,

“ఏమీ లేదు అమ్మాయి నేను కాస్త బయటకు వెళ్తున్నాను. మీ అంకుల్ వస్తే ఇదిగో ఈ తాళం చేయి ఇవ్వు ఇది ఇవ్వడానికే వచ్చాను” అంటూ ఆంటీ వాళ్ళ ఇంటి తాళం చేతులను నా చేతిలో పెట్టి వెళ్లిపోయింది.

నేను మాత్రం అక్కడ నుంచి కదల లేకపోయాను. అమ్మా నాన్నకి నేను, చెల్లి ఇద్దరమే సంతానం. తమ్ముడో , అన్ననో ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నిసార్లు అనుకున్నానో. ఎందుకంటే ఎంచక్కా అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు, ” అత్త అత్త” అంటూ కాళ్లలో తిరిగితే ఎంత బాగుంటుంది.

నాన్న కూడా నానమ్మ తాతయ్యలకు ఒక్కడే పాపం. ఆయనకి కూడా ఇద్దరు అక్కలు ఉండేవారట! ఒక అక్క చిన్నతనంలోనే చనిపోతే, ఒక అక్క పెళ్లి అయ్యి ఒక బాబు పుట్టాక చనిపోయింది అని చెప్పేవారు. మాకు మేనత్తలు లేరు అలాగే నన్ను మేనత్త అని పిలిచేవారు ఎవరూ లేకుండా పోయారు.

అమ్మ నాన్న తిట్టినా, ఒక మాట అన్నా, అందరూ ఎంచక్కా మేనత్తలకు చెప్పుకుంటారట. మాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మా చుట్టాలు,స్నేహితులు వాళ్ల అత్తల గురించి చెప్పినప్పుడల్లా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉండేది.

పెద్దమ్మ పిల్లలు సెలవులకు వచ్చినప్పుడల్లా అన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళ అత్తలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు గోరింటాకులు పెట్టడం, ఎంచక్కా రకరకాల జడలు వేయడం, వాళ్ళ అత్తలతో కలిసి అప్పుడప్పుడు అలా సినిమాలకు, షికార్లకు వెళ్లడం, వాళ్ళ సెలవుల రోజుల్లో వాళ్ళ అత్తల ఇంటికి వెళ్లడం వింటున్నప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తూ ఉండేది.

నేను అప్పుడప్పుడు ఆడపడుచు మానస దగ్గర ఈ విషయం ఎత్తినప్పుడల్లా “ఎందుకు వదిన అలా బాధపడతావ్ ? తేజు మాత్రం నీ కోడలు కాదా? అది పుట్టిన దగ్గరనుంచి అత్త అత్త అంటూ నువ్వు ఎప్పుడు వచ్చినా, నేను నీ దగ్గరికి వచ్చినా కూడా నీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది కదా! ఇంకా ఏం కావాలి చెప్పు? నీకు అన్నదమ్ములు లేరు అనే కదా ప్రకాష్ కి ప్రతి సంవత్సరం రాఖీ కడుతూ ఉంటావు !ఇంకా ఎందుకు బాధపడతావు చెప్పు? మా ఆడపడుచును తేజు “ఆంటీ” అని పిలుస్తుంది దానికి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. కానీ నిన్ను మాత్రం “అత్తా” అని పిలుస్తుంది కదా! ఇంకా నీకేం బాధ చెప్పు”? అంటూ ఓదార్చుతూనే ఉంటుంది.

కానీ ఎంతైనా మేనత్త మేనత్తె కదా ! అని అనుకుంటాను.” కానీ నిజమే ఎప్పుడూ మానస కానీ, ప్రకాష్ కానీ, ఆ లోటు నాకు రానివ్వలేదు. దానికి తోడు తేజు “అత్త “అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ ఉంటే నాకు కూడా మేనత్తలానే ఉండేది.”

పాపం ప్రకాష్ అన్నయ్య కూడా వాళ్ళ చెల్లిని ఎలా అయితే ప్రేమగా చూసుకుంటాడో నన్ను కూడా అలాగే చూసేవాడు.

“ఎందుకమ్మా సుధ !అలా బాధపడతావ్ ? నిన్ను ఎప్పుడైనా పరాయి దానిలాగా చూశానా చెప్పు. నువ్వు కూడా నా చెల్లెలు వే కదా?” అంటూ ఓదార్చేవాడు.

మా వారికి కూడా ఇద్దరు మేనత్తలు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ప్రతి విషయానికి ఆడపడుచులు ముందు ఉండాలి అంటూ అత్తయ్య, మామయ్య ఎంతో ప్రేమగా, గౌరవంగా ఎప్పుడు పిలుచుకునే వాళ్ళు. నాకు మానస విషయంలో కూడా అదే అలవాటు అయింది.

నా పెళ్ళప్పుడు తేజు రెండు ఏళ్ల పాప. పాలు గారే బుగ్గలతో గుండ్రటి కళ్ళతో ఎంత ముద్దొచ్చేదో. పెళ్లి అయిన తర్వాత నెల రోజులు అంతా హడావిడి, సందడి. ఇంట్లో అందరూ ఉండేవారు. మానస కూడా ఈయనకు ఒక్కతే చెల్లెలు అవడంతో నాకు తోడుగా నెల రోజులు ఇక్కడే ఉండిపోయింది. ఆ నెల రోజుల్లో తేజు ఎంత దగ్గర అయిందో చెప్పలేను. తేజును ఎత్తుకొని తిరగడం, ఆడించడం, పాలు పట్టించడం, స్నానం చేయించడం చిన్ని పిలకలు వేసి మురిసిపోవడం అన్ని ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. అది మొదలు ఎప్పుడు పండగలకి వచ్చిన, సెలవులకు వచ్చిన, మేము మానస దగ్గరికి వెళ్ళిన,” అత్త “అంటూ నా వెనకాలే తిరిగేది. మాటలు వచ్చిన తర్వాత మానస ఒకటి రెండు సార్లు “ఆంటీ” అని చెప్పింది. కానీ నేను మాత్రం అలా పిలిస్తే నేను ఊరుకోను “అత్త” అని పిలిస్తేనే పలుకుతాను అంటూ మానసకి గట్టిగా చెప్పాను. అప్పటికి మొదలు ఇప్పటివరకు తేజు “అత్త అత్త “అన్న పిలుపుతో నేను తన మేనత్తనే అయిపోయాను.

టంగుమని ఫోన్ మోగడంతో ఆలోచనల నుంచి ఒక్కసారిగా బయటపడ్డాను.

“సుధా! ఏం చేస్తున్నావ్ రెడీ అవుతున్నావా లేదా ప్రయాణానికి?” అన్న మోహన్ ప్రశ్నలతో ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి , “ఇప్పుడే బట్టలు సర్దడం స్టార్ట్ చేశాను. సాయంత్రం వరకల్లా పనులు అయిపోతాయి”. అంటూ చెప్పాను.

“ఇంతకీ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు? సర్దుకుంటున్నారా”? అని అడిగాడు.

“బాబు కాలేజీలో ఏదో పని ఉంది అని వెళ్ళాడు. అమ్మాయి సర్దడం స్టార్ట్ చేసింది “అంటూ చెప్పి ఫోన్ కట్ చేశాను.

ఇంతలో అమ్మాయి ఏం చేస్తుందో చూద్దామని తన గదిలోకి వెళ్ళాను. ఇంకా సర్దడం ఏమి స్టార్ట్ చేయకుండా కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంది.

“ఏం చేస్తున్నావ్ హర్ష ? ఇంకా ఎంతసేపు చెప్పు ? సర్దడం తొందరగా స్టార్ట్ చెయ్! డాడీ ఫోన్ కూడా చేశాడు. పనులు అవుతున్నాయా అంటూ?” తనని తొందర పెట్టాను.

“ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదు మమ్మీ”? నువ్వు నాకు కాస్త గైడెన్స్ ఇవ్వు”! అన్న హర్ష మాటలకు

“ఈ సంవత్సరంతో 10th అయిపోయి ఇంటర్లోకి వెళ్తునావ్! ఇంకా నీ బట్టలు నువ్వు సర్దుకోవడం రాకపోతే ఎలా”? అంటూ ఏవేవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో తనకి చెప్పేసి నేను రూమ్ లోకి వెళ్లి సర్దడం స్టార్ట్ చేశాను.

రాత్రి ట్రైన్ కి బయలుదేరి వెళ్లిపోయాం పొద్దుటికల్లా మానస ఇంటికి చేరుకున్నాము .

గేటు దగ్గరికి వెళ్ళగానే మానస ఎదురు వచ్చింది. “రండి వదినా! రండి జర్నీ ఎలా అయింది”? అంటూ లోపలికి తీసుకువెళ్లింది.

“హాయిగానే వచ్చేసాము మానస! ఏసియే  కదా !పర్వాలేదు.

ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కదా !పోనీలే మరీ ముదురు ఎండల్లో మన తేజు పెళ్లి ముహూర్తం రాలేదు! అంటూ మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాము.

“ఇంతకీ తేజు ఏది “?అంటూ తన గదిలోకి వెళ్లాను.

నేను వెళ్లేసరికి తేజు ఫోన్ మాట్లాడుతూ కనిపించింది.

“హాయ్ అత్త” అంటూ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది.

“ఏంటి మీ వారితోనేనా? ఫోన్లో కబుర్లు అంటూ” అడిగాను.

“పో అత్త “అంటూ సిగ్గుపడుతూ,

“అవును” అంటూ బదులిచ్చింది.

“సరే సరే కానీ “అంటూ బయటికి వచ్చేసాను.

ఇంతలో మానస “రా వదిన “అంటూ పిలిచింది.

“అవును మానస! మీ ఆడపడుచు వాళ్లు ఇంకా రాలేదా”? అని అడిగాను.

“లేదు వదిన! వాళ్లు రాత్రి వరకు వస్తారు. ఇక రేపటి నుండి కార్యక్రమాలు మొదలు అవుతాయి కదా!

వాళ్ల వారికి రేపటి నుంచి లీవ్ దొరికింది” అంది మానస.

ఇంతలో ప్రకాష్ అన్నయ్య వచ్చారు.

“ఏమ్మా! సుధా బాగున్నారా?” హాయ్ మోహన్ ఎలా ఉన్నారు”? అంటూ మమ్మల్ని ఇద్దరినీ పలకరించారు.

“బాగున్నాం బావ మీరందరూ ఎలా ఉన్నారు?”

“ఇంతకీ ఎన్నాళ్ళు లీవ్ తీసుకున్నారు”? అంటూ అడిగాడు మోహన్.

“వన్ మంత్ లీవ్ తీసుకున్నాను. అన్ని పనులకి ఆ తర్వాత కూడా చాలా పనులు, ప్రయాణాలు ఉంటాయి కదా! అందుకని ముందే లీవ్ అప్లై చేసేసా “!అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ అన్నయ్య.

“కబుర్లు తర్వాత ముందు అందరూ టీ తీసుకోండి” అంటూ మానస అందరికీ టీ ఇచ్చింది. గబగబా స్నానాలు చేసేయండి టిఫిన్లు తిందురు గాని” అంటూ తొందర పెట్టింది.

ఇంతలో “బాగున్నారా అమ్మ !”అంటూ మానస అత్తగారు గదిలోంచి బయటకు వచ్చింది.

“ఆ బాగున్నాం పెద్దమ్మ !మీరు బాగున్నారా”? అంటూ పలకరించాను.

“బాగున్నాం సుధా ” అంటూ.. “మీరైనా తొందరగా వచ్చారు నా బిడ్డ అయితే రాత్రికి వస్తుందట “!

అంటూ తన కూతురు ఇంకా రాలేదు అని అలక ప్రదర్శించింది.

ఇంతలో నేను సూట్ కేసులన్నీ పెట్టడానికి రూమ్ లోకి వెళ్తుంటే నా వెనకాలే మానస, ప్రకాష్ ఇద్దరు వచ్చారు.

“చూడు సుధా !మా చెల్లెలుకి నేను అంటే చాలా ప్రేమనే.. మనిషి మంచిదే! కానీ కొంచెం మాట మాత్రం గడుసుగా ఉంటుంది. నీకు తెలిసినదే కదా ! మీరు ఇద్దరూ కలిసి వారం రోజులు ఉండబోతున్నారు . ఇద్దరూ నాకు చెల్లెళ్ళే !తను కాస్త అటు ఇటుగా ఏదైనా మాట్లాడిన నువ్వు అదేమీ పట్టించుకోవద్దు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ అన్నయ్య.

” అదేం లేదు అన్నయ్య! తను నాకు అక్క లాంటిదే కదా! అదేమీ పట్టించుకోను. ఏదైనా తను అన్నా కూడా నా అక్కనే అన్నది అని అనుకుంటాను “అంటూ బదులిచ్చాను.

“థాంక్యూ వదిన నువ్వు అర్థం చేసుకుంటావు అని నాకు తెలుసు! అందుకే నీకు చెప్పాను. నీకు తేజు సంగతి తెలుసు కదా చిన్నప్పటి నుంచి అది ఏ విషయమైనా నా తర్వాత నీకే చెప్పుకుంటుంది. వాళ్ల అత్త దగ్గర తనకి కొంచెం చనువు తక్కువ”. అంది మానస.

“పరవాలేదు మానస !నేను చూసుకుంటానులే “అంటూ తన చేతిలో చేయి వేసాను.

రాత్రి 8 గంటలకల్లా మానస ఆడపడుచు పద్మ వాళ్ళ ఆయన సురేష్ వాళ్ల ఇద్దరు అబ్బాయిలు వచ్చారు.

వాళ్లు రాగానే గుమ్మంలోకి అందరం వెళ్ళాము.

“బావున్నారా పద్మక్క? బాగున్నారా బావగారు”? అంటూ పలకరించుకుంటూ వెళ్లాను.

“బాగున్నాం సుధా !మీరు బాగున్నారా? పొద్దున్నే వచ్చేసారట కదా! పోనీలే నీకైనా వీలు పడింది. మీ బావగారికి తీరడానికి ఇంత సమయం పట్టింది”. అంటూ వాళ్ళు రావడానికి అయిన ఆలస్యానికి కారణం చెప్పింది.

ఆడపడుచు అయినా ఆలస్యంగా వచ్చాను అన్న అలక తన ముఖంలో కాస్త కనబడింది.

అందరం భోజనాలు చేసి పడుకుందాము అని అనుకునేసరికి 11 దాటిపోయింది. ఇంతలో మానస వచ్చి “రేపు పొద్దున 11 గంటలకు అమ్మాయికి మంగళ స్నానాలు చేయించుదాము అనుకున్నాం కదా! బంధువులు స్నేహితులు అందరూ వస్తారు అందరూ తొందరగా పడుకొని పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి” అంటూ చెప్పి వెళ్ళింది.

***

పొద్దున కార్యక్రమం మొదలు పెట్టడానికి 11 అయింది. అందరం పసుపు కలర్ బట్టలు వేసుకున్నాం. అమ్మాయిని కూర్చోబెట్టి బొట్టు పెట్టింది మానస. తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయికి బొట్టు పెట్టి పసుపు రాసి అక్షంతలు వేశారు.

ఇంతలో తేజు “రా అత్త!” అంటూ నన్ను పిలిచింది.

నేను వద్దంటూ సైగ చేశాను. మానసను పిలిచి చెవిలో చెప్పాను. “మీ ఆడపడుచును  పిలువు తను మేనత్త కదా”! అని.

“సరే వదిన “!అంటూ

తన ఆడపడుచు పద్మను వాళ్ల ఆయనను పిలిచి ఇద్దరిచేత పసుపు పెట్టించి అక్షంతలు వేయించింది.

ఆ తర్వాత మా ఇద్దరి వంతు.

ఇక ఈ కార్యక్రమం అయ్యాక అమ్మాయికి మంగళ స్నానాలు చేయించాము. అప్పుడు కూడా మానస వాళ్ళ తర్వాత, వాళ్ళ ఆడపడుచు, ఆ తర్వాత మేము ఇదే వరుస కొనసాగింది.

ఇక సాయంత్రం అమ్మాయికి గోరింటాకు పెట్టడానికి బ్యూటీ పార్లర్ వాళ్ళు, ఆ హడావిడి అంతా సాగింది.

పద్మ  గ్రాండ్గా గోరింటాకు పెట్టించుకుంది.

తేజు “అత్త ! నువ్వు కూడా పెట్టించుకో “అంటూ నా వెంట పడింది. ఇంతలో పద్మ “పెట్టించుకో సుధా ! పరవాలేదు. నేనంటే మేనత్తను కదా! ప్రతిదానికి ముందే ఉండాలి కాబట్టి పెట్టించుకుంటున్నాను. నువ్వు కూడా పెట్టించుకో! ఏముందిలే “! అంటూ అవునంటూనే కాదన్నట్టుగా సమాధానం చెప్పింది.

“లేదులే పద్మక్క !నాకు అంత పెద్దగా ఏం ఇష్టం ఉండదు.

సింపుల్ గానే నచ్చుతుంది” అంటూ సింపుల్గా పెట్టించేసుకున్నాను.

“రేపు పొద్దున పెళ్లికూతుర్నిచేసి కూరాళ్ళు పట్టాలి కదా” అంటూ మానసకు గుర్తు చేసింది పద్మ.

“అవును వదిన “అంటూ సమాధానం చెప్పింది మానస.

“అయితే మరి పుట్టమన్ను తెప్పించారా”?

“కూరాటి కుండలు పెట్టడానికి పొయ్యిరాళ్ళను వేయాలి కదా”! అంటూ పనులను పురమాయించింది.

“అవునంటూ” సమాధానం ఇచ్చింది మానస.

ఇంతలో నా వైపు తిరిగి “సుధ !రేపు నువ్వు, నేను కలిసి పొద్దున కూరాళ్ళ కోసం అక్కడ ఏర్పాట్లు చేద్దాము” అంటూ చెప్పింది.

“సరే పద్మక్క” అన్నాను.

మరుసటి రోజు పుట్టమన్నుతో ఇద్దరం కలిసి కూరాటి కుండల కోసం పోయ్యిరాళ్లను వేసాము. అప్పుడు కూడా మొదటి చెయ్యి పద్మదే అయింది.

“నేను మేనత్తను కానప్పుడు ఎందుకు నేను ఇలా ఆలోచించాలి? ఈ ఆలోచన తప్పు అని చాలాసార్లు నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తను కూడా ఒక్కతే చెల్లెలు కదా! తనకి కూడా ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి కదా! పైగా అది తన హక్కు. అదే కదా తాను చేస్తుంది.కేవలం హక్కు, అధికారాన్ని మాత్రమే తాను చూపించుకోవడం లేదు కదా! ఎంత చక్కగా తన మేన కోడలికి అన్ని పనులు ముందుండి మీద వేసుకొని చేస్తుంది! నేను బాధపడడం సరైనది కాదు. అంటూ నాకు నేను సర్ది చెప్పుకున్నాను.

 

“ఏంటి సుధా! ఆలోచిస్తున్నావ్ “?అన్న పద్మ మాటలతో ఉలిక్కిపడ్డాను .

“అబ్బే ఏమీ లేదు పద్మక్క! ఊరికే “!అంటూ మాట మార్చాను.

“సరే తయారవ్వాలి కదా! అమ్మాయిని పెళ్లికూతురు చేయాలి” అంటూ నన్ను కదిలించింది.

అందరం తయారయ్యాము. అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి బొట్టు పెట్టడానికి అన్ని సామాన్లు దగ్గర పెట్టమని నన్ను పురమాయించింది పద్మ.

ఇంతలో మానస వచ్చింది.

“పెళ్లి బొట్టు పెట్టాలి కదా” అంటూ అనగానే

అక్కడ ఉన్న బంధువులలో ఒకరు “ఇంకెవరు ? మేనత్త ఉంది కదా! ఏ పని అయినా ఇంటి ఆడబిడ్డతో మొదలు కదా!” అంటూ సలహా ఇచ్చారు.

పద్మ పెళ్లి బొట్టు పెట్టి, పారాణి , పసుపు , బుగ్గ చుక్కతో తేజును అలంకరించి కుందనపు బొమ్మలాగా తయారు చేసింది.

అందరం కలిసి కూరాటికుండల్లో నీళ్లు తేవడానికి దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్లి అక్కడ నీళ్లను తీసుకొని వచ్చాము. అందరూ ప్రతి చోట “మంగళహారతి, ఆడబిడ్డ ముందు నడవాలి ఎప్పుడైనా” అంటూ అన్ని పద్ధతులు చెబుతూ ముందు నడిపించారు. కురాటి కుండలతో ఫోటోలు దిగేటప్పుడు కొన్నిసార్లు మంగళహారతి నాకు ఇచ్చి ఫోటోలు దిగింది.

ఎప్పుడైనా కాస్త తను వెనుకబడ్డ కూడా అందరూ “అదేంటమ్మా ఆడపడుచు ముందు నడవాల్సింది పోయి వెనక ఉంటున్నావు! అంటూ, వెంటనే నన్ను “అదేంటి సుధా! తనకు దారి ఇవ్వు, మర్చిపోతే ముందు నడిపించు .ఇలాంటివన్నీ నువ్వే చూసుకోవాలి కదా !అనేవారు.

కొన్నిసార్లు నాకు బాధ అనిపించినా ఆడపిల్ల పెళ్లి కదా !ఎన్నో పనులు, బాధ్యతలు ఉంటాయి గుర్తు చేయాలి కదా! అని నాకు నేను సర్ది చెప్పుకునేదాన్ని.

తేజును పెళ్లికూతురు చేసే క్రమంలో ఎప్పుడు తేజుతో మాట్లాడినా, తేజును పిలిచినా “సరే ఆంటీ! అలాగే !అంటూ పద్మకు సమాధానం ఇచ్చేది.

ఆరోజు పడుకునే ముందు తేజుతో పద్మ “ఏంటి తేజు! నన్నేమో ఆంటీ !ఆంటీ !అంటూ మీ సుధ అత్తమ్మని మాత్రం అత్త !అత్త! అంటూ పిలుస్తావు” అని అడిగింది.

“అదేంటి ఆంటీ! అలా అంటారు. చిన్నప్పటి నుంచి మీరే అలా అలవాటు చేశారు కదా! నాకు అదే అలవాటు అయింది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏముంటుంది చెప్పండి? మీరు కూడా అత్త అని అనమని చెప్తే అలాగే అనేదాన్ని కదా “! అంటూ సమాధానమిచ్చింది తేజు.

“అది కాదే! మేనత్తని ఆంటీ అని , మీ మేనమామ భార్యని మాత్రం అత్త అనడం ఎంతవరకు కరెక్టు “అంటూ కాస్త గట్టిగా అడిగింది. ఇంతలో మానస మా మాటలు వినబడడంతో అక్కడికి వచ్చి “అదేంటి వదిన అలా అంటారు? అది పుట్టిన దగ్గరనుంచి మీరే కదా ఆంటీ! ఆంటీ ! అని అనమని అలవాటు చేశారు ఇప్పుడు అలా అంటారేంటి ? పోనీలే !ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటుంది “అంటూ కాస్త వాతావరణం చల్లబరిచింది.

నేను పద్మకి కనపడకుండా తేజునీ “ఏమి అనొద్దు “అంటూ సైగ చేశాను. తేజు కాస్త బాధపడింది.

ఇక పెళ్లిలో మంగళసూత్రం కట్టడానికి ముందు తాళిబొట్టును దండం పెట్టించడానికి మేనమామ కావాలంటూ మోహన్ ని పిలిచారు. తను మంగళసూత్రం అందరి దగ్గరికి తీసుకు వెళ్లడానికి వెళ్తుంటే నేను ఆయనతోపాటు అక్షింతల పళ్లెం పట్టుకొని ఆయన వెనకాలే పరిగెత్తాను. ఈ ఒక్క హోదా మాత్రం భలేగా దొరికింది అనుకుంటూ తెగ సంబరపడిపోయాను.

అమ్మాయికి హారతి ఇచ్చే దగ్గర, దిష్టి తీసే దగ్గర, అరుంధతి నక్షత్రం చూపించే దగ్గర , ప్రతిచోట ఆడబిడ్డ ఎక్కడ అంటూ అందరూ పిలవడం, ఆడబిడ్డకు కట్నం పెట్టండి అంటూ అయ్యగారు హారతి పళ్లెంలో పద్మకు కట్నం పెట్టించడం ఇవన్నీ చూస్తూ నేను చాలా మిస్ అయ్యాను.

అబ్బాయి తరపు బంధువులు కూడా అందరూ బట్టలు పెట్టేటప్పుడు పెళ్లికూతురు తల్లిదండ్రులకు పెట్టిన తర్వాత ఆడబిడ్డ ఎక్కడ ఎక్కడ అంటూ పిలిచి మరి అన్ని మర్యాదలు చేశారు.

ఇంతలో అబ్బాయి మేనత్త వచ్చి పెళ్లి కట్నం అబ్బాయికి తేజుకు పెట్టింది. నేను కాస్త దూరంగా నిల్చున్నాను. నన్ను కూడా రమ్మని సైగ చేసింది నాకు కూడా చీర బొట్టు పెట్టేసింది. ఎంతైనా “మేనత్తను ఎలా మర్చిపోతాము “అంది.

ఇంతలో ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. విషయం ఏమిటంటే పద్మ, వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టడానికని తీసుకువెళ్లింది. అబ్బాయి మేనత్త దుబాయ్ లో ఉంటుంది. పెళ్లి మాటలకు, సంబంధం ఖాయం చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆమె లేదు. పెళ్లికి వచ్చి కూడా మూడు రోజులు అయింది అంట. ఆమెకు ఎవరు  తేజు మేనత్త అన్న విషయం సరిగ్గా తెలియలేదట. దానికి తోడు తేజు నన్ను అత్త అత్త అని పిలవడం పద్మని ఆంటీ అని పిలవడంతో ఆమె కాస్త కన్ఫ్యూజ్ అయిందట. పద్మకు పెట్టాల్సిన కట్న కానుకలు నాకు పెట్టేసింది పొరపాటున. ఇంతలో పద్మ అక్కడికి వచ్చింది.

అక్కడ ఉన్న బంధువుల్లో ఒకరు “అదేంటమ్మా !ఈ అమ్మాయి కాదు మేనత్త! అదిగో ఇప్పుడే వచ్చింది చూడు! ఆవిడే పెళ్లికూతురు మేనత్త పద్మ! ఈమె వాళ్ళ మేనమామ భార్య” అంటూ చెప్పారు.

ఇంతలో పద్మ అక్కడికి వచ్చి “ఏంటి సుధ! ఆవిడ కంటే తెలియలేదు నువ్వైనా చెప్పొచ్చు కదా !నేను కాదు మేనత్తని “అని అంటూ కోప్పడింది.

“అయ్యో అదేం లేదు పద్మక్క! అసలు తాను మేనత్తకు పెట్టడానికి వచ్చింది అని నాకు తెలియదు కదా! తను పిలిస్తే నేను వచ్చాను” అంటూ బదులిచ్చాను.

“అలా ఎలా అనుకుంటావ్ సుధా ! అన్నా వదిన తర్వాత ఎవరైనా సరే ముందు నన్నే పిలుస్తారు కదా ! ఆ మాత్రం కూడా తెలియదా? నీకు” అంది.

అక్కడ ఉన్న వాళ్ళలో కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా “అవును కదా అమ్మ ! నువ్వు మేనత్తవు కాదు కదా !అలా ఎలా కూర్చుంటావు. తల్లిదండ్రుల తర్వాత ఏ పని అయినా సరే మేనత్తతోనే కదా చేపిస్తారు. మరీ చిన్న పిల్లలాగా మాట్లాడతావేంటి? అది కూడా తెలియదా ?”అంటూ కాస్త కోప్పడ్డారు.

ఇంతలో నేను తేరుకొని “సారీ పద్మక్క !మీరు కూర్చోండి మీకే పెట్టమంటాను “అన్నాను.

“అదేంటి సుధా! అలా మాట్లాడతావ్ ?నీకు పెట్టిన కట్నాన్ని మళ్ళీ తీసుకొని నేనెందుకు పెట్టించుకుంటాను. ఏం పర్వాలేదు. నువ్వే ఉంచుకో”. అన్నది.

“అదేంటి పద్మక్క అలా అంటారు? తెలియక ఏదో పొరపాటు జరిగింది. అంతమాత్రానికే అలా అనుకోకండి. పరవాలేదు !నేను తిరిగి ఇచ్చేస్తాను” అన్నాను.

“వద్దు సుధా! ఒకరికి ఇచ్చింది మళ్ళీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నీది నువ్వు ఉంచుకో” అంది.

ఇంతలో అబ్బాయి మేనత్త కల్పించుకొని “అయ్యో ఏమీ అనుకోకండి. నాకు కూడా తెలియదు కదా !అందుకే అలా జరిగింది” అంటూ అయినా “సుధ గారు మీరేనా చెప్పొచ్చు. తను మేనత్త కదా బాధపడడం సహజం. మేనత్త హోదా నాకు తెలుసు కదా !ఆ స్థానంలో నేను ఉన్న అలాగే ఫీల్ అవుతాను “అంటూ బదులిచ్చింది.

మానసకి అటు నా వైపు మాట్లాడాలో, పద్మవైపు మాట్లాడాలో కాసేపు అర్థం కాలేదు. ఇంతలో పెళ్లి కోసం తీసుకున్నటువంటి బట్టల నుంచి ఒక పట్టు చీర తీసుకొని వచ్చి అబ్బాయి మేనత్తకు ఇచ్చి.”ఇది మీరు మా ఆడపడుచుకు పెట్టండి అంటూ ఇచ్చింది”. ఇంతలో పద్మ కల్పించుకొని “అదేంటి వదిన ఏం పర్వాలేదు” అంటూ కాస్త అలక ప్రదర్శించింది.

“అదేంటి వదిన అలా అంటారు? ఆడబిడ్డ అలిగితే మాకే మంచిది కాదు. నువ్వు కూర్చో అవన్నీ పట్టించుకోకు “అంటూ కాస్త బతిమిలాడి కూర్చోబెట్టింది.

కాస్త వాతావరణం చల్లబడింది. తేజు ముఖం చిన్నబోయింది. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను. పద్మ నా పక్కకు వచ్చి “ఏది ఏమైనా సుధ నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు నేను చాలా హర్ట్ అయ్యాను అంటూ కోప్పడింది”.

“సారీ పద్మక్క! ఏమీ అనుకోవద్దు” అంటూ బదులిచ్చాను.

“నేను ఇప్పుడే వస్తాను” అంటూ బాత్రూమ్ లోకి వెళ్ళాను.

వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బాత్రూంలో ఏడ్చేశాను. మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చాను. ఇక అప్పటినుంచి మొదలు సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలు అన్నిటిలలో నేను కాస్త వెనక్కి నడిచాను. ఒకటికి రెండుసార్లు పిలిస్తే గాని వెళ్ళి పనులలో పాల్గొనలేదు. పెళ్లి ఇంట్లో ఎటువంటి రాద్ధాంతాలు జరగవద్దని మౌనంగా ఉండిపోయాను. నన్ను చూసి మోహన్ కూడా చాలా బాధపడ్డాడు. ప్రకాష్ అన్నయ్య కూడా నన్ను చూసినప్పుడల్లా కళ్ళతోనే బాధపడొద్దు అంటూ బ్రతిమిలాడాడు.

అమ్మాయిని అప్పగించే సమయం వచ్చింది. అందరి కళ్ళల్లో సంతోషం, దుఃఖం ఒకేసారి కనిపించాయి. అందరికీ వెళ్ళొస్తానని చెప్పి తేజు ఏడుస్తుంటే తేజు వెళ్తుంది అన్న దుఃఖం ఒకవైపు ఇప్పటిదాకా జరిగినటువంటి సంఘటన తాలూకు దుఃఖం ఒకవైపు అన్ని కలిసి విపరీతంగా ఏడ్చేసాను. అమ్మాయి వెళ్ళే ముందు “అమ్మాయికి దిష్టి తీయండి రా”! అంటూ అబ్బాయి నానమ్మ పనిని పురమాయించింది.

ఇంతలో నేను ఆవిడ దగ్గరికి వెళ్లి “అమ్మ !అప్పటి నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్లారు ?”అంటూ పలకరించాను.

“ఏం చేయాలి బిడ్డ !పెళ్లి అయ్యేంతవరకు అక్కడే ఉన్నాను. అక్షంతలు వేసి , ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యేసరికి అలా రూమ్ లోకి వెళ్లి గోలీలు వేసుకొని పడుకున్నాను. ఇదిగో! ఈ సమయానికి మెలకువ వచ్చింది. నేను లేచే సరికి చాలా పనులు అయిపోయినట్టు ఉన్నాయి “అంటూ అసలు విషయం చెప్పింది. “అవునమ్మా !మీరు లేచేసరికి అమ్మాయికి ఓడిబియ్యము, కట్న కానుకలు పెట్టడం అన్నీ జరిగాయి. మీరు కూడా ఉండి ఉంటే బాగుండేది” అన్నాను.

“ఏం చేస్తాం? వయసు అయిపోయింది. అందరికీ అన్ని ముచ్చటలు చేసాము. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా! ఇప్పుడు మీ వంతు “అంటూ నవ్వింది.

“సరే !సరే !చాలా టైం అయింది ఇప్పటికే. పద !పద !అమ్మాయికి దిష్టి తీద్దురుగాని అంటూ పద్మని పిలిచింది.

“అమ్మాయి ఓ మేనత్త! నీ కోడలుకు కొడుకుకు దిష్టి తియ్యి” అంటూ సందడి చేసింది .

ఇంతలో పద్మ దిష్టిపళ్లెంతో వచ్చి ఇద్దరికీ దిష్టి తీయడానికి రెడీ అవుతుంటే “ఒక్క నిమిషం ఆగు అంటూ సుధా నువ్వు కూడా వెళ్ళు “అంటూ నన్ను పురమాయించింది.

“అదేంటి అమ్మ పద్మక్క కదా !మేనత్త నేను కాదు కదా”! అన్నాను.

“అయితేనే ఒకరు తండ్రి తరఫు మేనత్త! ఒకరు తల్లి తరుపు మేనత్త! నిన్ను కాదన్న వాళ్ళు ఎవరు ఇక్కడ? అంటూ కానివ్వండి కానివ్వండి !ఇద్దరు మేనత్తలు దిష్టి తీయండి మీ కోడలికి !”అంటూ నవ్వింది.

ఎంత గొప్ప మాట చెప్పింది. ఇప్పటివరకు పందిట్లో నన్ను నిష్టూర మాడిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్దావిడకి వంత పాడుతూ “అవునవును అంతే కదా !ఇద్దరు అత్తలే కదా!” అంటూ, “తల్లి తరుపు అయితేనేం? తండ్రి తరుపు అయితేనేం? అత్త అత్తే కదా! రండి రండి” అంటూ మమ్మల్ని పిలిచారు.

“రా సుధ!” అంటూ పద్మ నన్ను పిలిచింది.

“వాళ్లందరూ అలా అనేసరికి నాకు కూడా కాస్త రోషం వచ్చి, అలా అన్నాను తప్పుగా అనుకోకు సుధా! నిన్ను బాధ పెట్టినందుకు సారీ! తల్లి తరపు తండ్రి తరపు అని ఏముంది ? ఇద్దరం అత్తలమే కదా! ఆ అమ్మ చెప్పినట్టు తల్లితరపు మేనత్త! తండ్రి తరఫున మేనత్త! ఇంకెప్పుడు మనిద్దరం వేరు వేరు అని నేను అనుకోను. నేను కాస్త దూరంగా బెంగళూరులో ఉండడం వల్ల తేజు చిన్నప్పటి నుంచి నీకే దగ్గర. దాని పెళ్లి అని అనేసరికి ఒక్కసారిగా ఆ ఆనందంలో నేను మేనత్తను అనేటువంటి సంతోషం ఒకవైపు మా అన్నయ్యకి ఒక్కతే చెల్లెలు కదా ! పెత్తనమంతా నాదే! హక్కు అంతా నాదే! అన్నటువంటి ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయ్యి.. ఆ సంతోషంలో అలా అయ్యేసరికి ,కాస్త హర్ట్ అయ్యి అలా నిష్టూర మాడాను .నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు సుధా! నిండు మనసుతో నన్ను మీ అక్కలా అనుకో !” అంటూ అక్కున చేర్చుకుంది.

“అదేం లేదు పద్మక్క! నేను అదంతా మనసులో పెట్టుకొను లే. నేను చాలా బాధ పడ్డాను నిజమే! కానీ నువ్వు అంతా నిండు మనసుతో నన్ను ఓదార్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ప్రకాష్ అన్నయ్య కు ఇద్దరం చెల్లెలం. అలాగే ఉందాం” అంటూ ఇద్దరం కలిసి దిష్టిపల్లాన్ని తీసుకువెళ్లి సంతోషంగా తేజుకు దిష్టి తీశాము .

మేమిద్దరం కలిసి అలా నవ్వుతూ తన దగ్గరికి వెళ్లేసరికి తేజు ముఖంలో తృప్తితో కూడిన చిరునవ్వు కనిపించి ఇద్దరిని గట్టిగా కౌగిలించుకుంది.

“థాంక్యూ సో మచ్ అత్త “అంటూ

“నాకెందుకురా థాంక్యూ. ఏం పరవాలేదు! నేనేమీ అనుకోలేదు” అంటూ సర్ది చెప్పాను .

“థాంక్యూ నీకు కాదు అత్త”.

“పద్మ అత్తకి” అంటూ బదులిచ్చింది.

“హమ్మయ్య ఇప్పటికైనా “ఆంటీ” అని మానేసి అత్త అన్నావు చాలా థాంక్స్ నా కోడలా”! అంటూ తేజును గట్టిగా ముద్దు పెట్టుకుంది పద్మ.

“మా అత్త అంటే అత్తే” అంటూ పద్మను గట్టిగా కౌగిలించుకొని, అందరికీ సంతోషంగా వెళ్ళొస్తానని చెప్పి తేజు అత్తగారింటికి వెళ్ళింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.