యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-12

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఇంగ్లాండ్ -లండన్ (రోజు-2)

లండన్ నగర విహారం – హైడ్ పార్క్ & ట్రఫాల్గర్ స్క్వేర్

మర్నాడు పొద్దున్నే మేం ట్రిప్ మాస్టర్స్ ద్వారా బుక్ చేసుకున్న సిటీ టూరుకి బయలుదేరాం. ఆ రోజు నించి ట్రిప్పు ప్రకారం మా అసలు విహారం ప్రారంభమైంది.

ఈ సిటీ టూరు మాకు మాత్రమే ప్రత్యేకమైనది. ఈ టూరుకి ఒక రోజుకి మా ముగ్గురికి ఆరువందల డాలర్లు చెల్లించాం. మా సిరితో ఎక్కువ దూరాలు నడవడం కష్టం కావడం వల్లా, వీల్ ఛైర్ ని మాతో తీసుకెళ్లగలిగే సిటీ టూరు ఆన్ లైనులో ఇదొక్కటే కనిపించడం వల్లా, నచ్చినంత సమయం నచ్చిన చోటల్లా గడపడం కోసమని ఈ టూరుని బుక్ చేసుకున్నాం.

ఉదయం తొమ్మిది గంటలకి మా హోటలు దగ్గరికి పన్నెండు మంది పట్టే పికప్ వ్యాను వచ్చింది. మా ముగ్గురికి ఇది చాలా పెద్దది. అయినా తప్పలేదు. ఇంతకీ ఈ టూరులో ఏమేం ఉచితంగా చూపిస్తారో, ఏమేం టిక్కెట్లు మేం కొనుక్కోవాలో టూరు బుక్ చేసినప్పుడు సరైన వివరాలేవీ లేవు. వ్యాను ఎక్కేక అసలు విషయమేమిటో అడిగాం. మేం సిటీ పరిధిలో ఏమేం చూడాలనుకుంటున్నామో వాటిలో అయిదారు ప్రదేశాల వరకు చూడొచ్చని అన్నాడు డ్రైవరు. మేం చూడాలనుకున్న కొన్నిటిని ఏకరువు పెట్టాం. అలాగే అసలు వాళ్ళు టూరులో సాధారణంగా ఏం చూపిస్తారో వాకబు చేశాం. ఇంతకీ విషయం ఏవిటంటే అతను చెప్పిన వాటిలో కొన్ని ముందురోజు చూసేసాం. ఇక చూడాల్సిన వాటిలో టిక్కెట్లు కొనుక్కోవాల్సినవన్నీ మేం విడిగా కొనుక్కోవలసిందే. ఈ టూరు ధరలో ఏ టిక్కెట్లూ కలప బడవు. ఆరువందలు దేనికో అర్థం కాక మొహామొహాలు చూసుకున్నాం.

ఇక డ్రైవర్ భారతీయుడు కావడం చూసి మొదట కాస్త సంతోషించాం. అయితే మా సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. మా మొత్తం యూరపు ప్రయాణంలో కెల్లా డబ్బులు వృథా చేసుకున్నామనిపించిన టూరు ఇదొక్కటే. అందుకు కారణాలు బోల్డు.

చూడాల్సిన ప్రదేశాలు ఒక్కొక్కచోట కనీసం రెండు, మూడు గంటలు గడపాల్సి ఉండడం వల్ల ఒక్కరోజులో ఎన్నో చూడలేకపోయాం. ఇక దగ్గర దగ్గరే ఉన్నవాటిని వరసగా చూడడానికి ఆయా ప్రదేశాలకి దగ్గర్లో వ్యాను పార్కింగు లేకపోవడం వల్ల ఎక్కడో దిగి నడవాల్సి వచ్చేది. కొన్ని దగ్గర్లో ఉన్నవి నిజానికి ఎక్కడో ఒకచోట దిగి నడిస్తే సరిపోయేదానికి వ్యానులో, బిజీ ట్రాఫిక్కులో ఒన్ వే ట్రాఫిక్ రూల్సు వల్ల ఒక్కొక్క చోటికి చేరడానికి గంట గంట సేపు పట్టేది. అలా శ్రమ, సమయం రెండూ వృథా అయ్యాయి. ఇక వ్యానులో సిరిని అతని దగ్గిర వదిలి కనీసం రోడ్డు పక్క ఫోటో తీసుకోవడానికి ఒక్క నిమిషం దిగి వెళ్ళడానికి కూడా డ్రైవర్ అస్సలు సహకరించలేదు. దాంతో ప్రతిసారీ కార్టు దించడం, ఎక్కించడం, సర్దుకోవడంతో బాగా అలసిపోయాం.

ఇక ఆ రోజు మేం చూడాలనుకున్న ప్రదేశాల్లో బకింగ్ హామ్ ప్యాలస్ దగ్గిర “గార్డు ఛేంజింగ్ ఈవెంట్” , గాంధీ లండన్ నివాసం, వెస్ట్ మినిష్టర్ ఆబీలోని పోయెట్స్ కార్నెర్, బరో మార్కెట్, షేక్స్ పియర్ థియేటర్, కెన్సింగ్ టన్ ప్యాలెస్ మొ.వి ఏకరువు పెట్టాం. అందులో ఎన్ని చూడగలమో మాకు కూడా తెలియదు.

అందులో మొదటిదైన బకింగ్ హామ్ ప్యాలస్ దగ్గర గార్డు ఛేంజింగ్ పదిన్నర ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి అక్కడికి మొదట తీసుకువెళ్ళమని అడిగాం. అప్పటికి ఉదయం తొమ్మిదే అయ్యింది కాబట్టి మొదట మాకు హైడ్ పార్క్ (Hyde Park) చూపించి అక్కణ్ణించి మా టూరు మొదలు పెడతానని చెప్పేడు డ్రైవరు.

హైడ్ పార్క్ లోని సర్పెంటైన్ సరస్సు (The Serpentine lake) దగ్గిర మొదట ఆపేడు. అది చాలా పెద్ద పార్కు. ఇక సరస్సు కూడా నలభై ఎకరాల మేర విస్తరించి ఉన్న పెద్ద సరస్సు. 1730 ప్రాంతంలో అప్పటి మహారాణి కెరొలిన్ కాలంలో నిర్మించబడింది. ఈ సరస్సు మీద హైడ్ పార్కుని, కెన్సింగ్ టన్ గార్డెన్స్ ని విడదీస్తూ మధ్య సర్పెంటైన్ వంతెన నిర్మించబడింది. సరస్సు దాపున ఉన్న సర్పెంటైన్ స్విమ్మింగ్ క్లబ్ ద్వారా 1861 నించి ప్రతి సంవత్సరం ఇక్కడ “పీటర్ పాన్ కప్” పేరుతో ఈత పోటీలు నిర్వహిస్తూ ఉంటారట. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో కొన్ని ఈత పోటీలు ఇక్కడే జరిగాయి. సువిశాలమైన ఈ సరస్సు మీద బోటింగ్ వంటివి కూడా చెయ్యొచ్చు.

మేం పొద్దుటే వెళ్లడం వల్ల ఆహ్లాదంగా ఉంది. కానీ ఎండ కాస్త కూడా లేకుండా మబ్బు ముసిరిన రోజు కావడం వల్ల చలి ఎక్కువగా ఉంది. ఏప్రిల్ నెల అయినా ఇంగ్లాండులో పొరలు పొరలుగా బట్టలు వేసుకుని, స్వెట్టర్లు, జాకెట్లు ధరించాల్సిందే. అప్పుడప్పుడే కురిసి, వెలిసిన వాన వల్ల బాగా చెమ్మ చెమ్మగా ఉంది. అయినా సరస్సు ఒడ్డున ఎక్కడా మట్టి కనబడకుండా గచ్చు చేసి ఉన్నందువల్ల నడవడానికి అనువుగా ఉంది. సరస్సులో చిన్నా, పెద్దా బాతులు గుంపులుగా జలకాలాడుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నప్పుడు ఒకటో తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో చూసిన లాంటి హంసలు (Swans) అందంగా నీటిలో ఊయలలూగుతున్నాయి. మనుషుల దాపున, దాదాపు ఒడ్డునే అవి ఆహారం కోసం తిరుగుతూ, భయం లేకుండా నీటిలోకి తలలు ముంచి తీస్తూ ఉన్నాయి.

కాస్సేపు వాటి వైపు నడిచి, ముచ్చటగా చూసేం. నాకైతే జగ్గంపేట హైస్కూల్ లో ఆరో తరగతిలో మా డ్రాయింగ్ మాస్టారు శ్రీ నాదిళ్ళ సుబ్బారావు గారు మాకు మొట్టమొదటి రోజు నేర్పిన “హంస బొమ్మ” గుర్తుకు వచ్చింది. బోర్డు మీద రెండు అంకెలా మొదలు పెట్టి ఎంతో సునాయాసంగా హంస బొమ్మని గీసే వారాయన. నాకూ అదే విధంగా ఏ బొమ్మయినా గీయగల నేర్పు అబ్బింది అంటే ఆయన వల్లే.

అక్కడ పదిహేను నిముషాలు గడిపేక పార్కులో నించి బయటికి వచ్చేసేటపుడు మరేవో వివరాలు చెపుతూ “డయానా మెమోరియల్ ఇక్కడే ఉంది” అన్నాడు డ్రైవరు. “మరయితే వెళదాం” అన్నాను. “సరే” అన్నాడు. కానీ వాహనాన్ని మళ్ళీ వెనక్కి తిప్పనే లేదు. బహుశా: సాయంత్రంలోగా చూపిస్తాడేమో అనుకున్నాను. ఇక మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళనే లేదు.

అక్కణ్ణించి బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham Palace) పక్క రోడ్డులో నించి చుట్టి వచ్చి అడ్మిరల్టీ ఆర్చ్ (Admiralty Arch) మీదుగా ముందుకు వెళ్లాం. ఈ అడ్మిరల్టీ అనేది నేవీకి సంబంధించినది. సువిశాలమైన రోడ్డుకి అటు మూల నించి ఇటు మూల వరకూ ఎత్తైన పెద్ద తోరణ భవనంలా ఠీవిగా నిలబడి ఉంది. మధ్య కింది నించి మూడు త్రోవలు ఉన్నాయి. కానీ అదంతా ఒన్ వే చేస్తూ ఒక్క దారి మాత్రమే తెరిచి ఉంచారు. ఆ భవనమ్మీద పైన ఎదురుగా లాటిన్ లో పెద్ద పెద్ద అక్షరాలు
: ANNO : DECIMO : EDWARDI : SEPTIMI : REGIS :
: VICTORIÆ : REGINÆ : CIVES : GRATISSIMI : MDCCCCX :
(In the tenth year of King Edward VII, to Queen Victoria, from most grateful citizens, 1910) అని చెక్కబడిఉన్నాయి. క్వీన్ విక్టోరియా కుమారుడు ఏడవ ఎడ్వర్డు తాను రాజైన పదోయేట కట్టించిన భవనమట ఇది.

ఇక మా వ్యాను డ్రైవరు ట్రఫాల్గర్ స్క్వేర్ (Trafalgar Square) చుట్టూ పార్కింగ్ కోసం మాంఛి ట్రాఫిక్కులో రెండు రౌండ్లు కొట్టాడు. మొత్తానికి దగ్గర్లో ఓ చోట వ్యాను ఆపి పరుగున వెళ్లి చూసి రమ్మన్నాడు. అప్పటికే బాగా ట్రాఫిక్ లో ఇరుక్కుని పది గంటలు కావచ్చింది. ట్రఫాల్గర్ స్క్వేర్ అంటే 1805 లో బ్రిటిషు వారికి, స్పానిషు, ఫ్రెంచి వారికి జరిగిన ట్రఫాల్గర్ యుద్ధ స్మారక స్తూపం ఉన్న ప్రదేశం.ఈ స్క్వేర్ మధ్య “నెల్సన్ స్తూపం” నెలకొని ఉంటుంది. ఈ యుద్ధంలో అసువులు బాసిన వైస్ అడ్మిరల్ హోరేషియో నెల్సన్ పేరిట నిల్పినదే ఈ స్తూపం. నాలుగువైపులా నాలుగు పెద్ద పెద్ద నల్లరాతి సింహాలు కాపలా కాస్తూ ఉన్నట్లున్న ఈ ట్రఫాల్గర్ స్క్వేర్ నగరంలో కెల్లా అత్యంత రద్దీ అయిన ప్రాంతం. ఇక్కడే ప్రతియేటా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉంటాయి.

ఇక్కడ అందమైన రెండు పెద్ద పెద్ద ఫౌంటెన్లు ఉన్నాయి. నిజానికి ఇవి అక్కడ వేసవిలో వేడిమిని చల్లబరచడానికి నిర్మించబడినా, చక్కని లేత నీలం రంగులో సొగసులొలుకుతూ చూపరులని ఆకర్షిస్తూ ఉంటాయి.

ఒకప్పుడు ఈ ప్రదేశం వందలాది పావురాలకి ఆలవాలమై సందర్శకులకు కనువిందుగా ఉండేదట. సందర్శకులు వీటికి మేత కొని మరీ వేసే కార్యక్రమం జోరుగా జరుగుతూ ఉండేదట. ఈ పావురాల రెట్టల వల్ల నెల్సన్ స్తూపం ఏటా పాడవుతూ వస్తూ ఉండడం, దాన్ని బాగు చేయించడానికి వేలాది పౌండ్లు ఖర్చవుతూ ఉండడం వల్ల 2007 లో పావురాలకి మేత వెయ్యడాన్ని నిషేధించే చట్టం తీసుకు వచ్చారట. ఇప్పుడిక్కడ ఒక్క పావురం కూడా కనిపించదు.

ఇక ఈ స్క్వేర్ లో మొదటి ఛార్లెస్ మహారాజు గుర్రపుస్వారీ చేస్తున్న కాంస్య విగ్రహంతో బాటూ నాలుగు వైపులా నాలుగు విగ్రహాలు ఉంటాయి, ఒకప్పుడు బ్రిటిషు సర్వ సైన్యాధ్యక్షుడైన సర్ ఛార్లెస్ జేమ్స్ నేపియర్, మేజర్ జనరల్ హెన్రీ హేవలాక్, నాలుగవ జార్జి మహారాజు విగ్రహాలతో బాటూ నాలుగవది ఏటా మారుతూ ఉంటుంది.

స్థిమితంగా కాస్సేపు కూర్చుని చూడగలిగిన ప్రదేశమైనా వానొచ్చినా, ఎండా కాసినా ఎక్కడా తలదాచుకుందుకు చోటు లేక ఇక్కడ ఎక్కువసేపు గడపలేం.

మొత్తానికి ఉదయం పదింబావు ప్రాంతంలో స్క్వేర్ సందర్శన త్వరత్వరగా పూర్తిచేసుకుని వ్యాను ఎక్కినా, నిజానికి దగ్గర్లోనే ఉన్న బకింగ్ హామ్ ప్యాలెస్ కి వచ్చిన త్రోవనే వెనక్కి వెళ్ళడానికి వన్ వే కావడం వల్ల కుదరక మళ్ళీ వెస్ట్ మినిష్టర్ బ్రిడ్జి దాకా వెళ్లి చుట్టు తిప్పుకుని రావాల్సి వచ్చింది వ్యానుని. పనిలోపనిగా వ్యానులోనించే టెన్ డౌనింగ్ స్ట్రీట్ (10 Downing Street) లో బ్రిటన్ ప్రధాని నివాసం, ఆఫీసు అంటూ చూపించాడు. గేటు మాత్రమే కనిపించినా, భారతీయ సంతతివాడైన యువప్రధాని రిషి సునాక్ కి వ్యానులోనించే శుభాకాంక్షలు తెలియజేసాం.

తీరా బకింగ్ హామ్ ప్యాలెస్ దరిదాపుల్లోకి వెళ్లేసరికి దాదాపుగా 10:45 అయిపోయింది. ఆ చుట్టుపక్కల రోడ్డు అప్పటికే మూసి వేయడంతో వ్యానుని ఎక్కడో దూరంగా ఆపుచేశాడు. ఇక తప్పక అక్కడ నుంచి నడక ప్రారంభించాం. మాకు నడక అలవాటు కాబట్టి, సిరి కార్టులో కూర్చుంది కాబట్టి పదినిమిషాల్లో బకింగ్ హామ్ ప్యాలెస్ గేటుకి కూతవేటు దూరానికి చేరుకున్నాం. ఇసక వేస్తే రాలనంత మంది జనం ఉన్నారు ఆ చుట్టుపక్కల. మరొక వైపు దట్టంగా మబ్బు ముంచుకురాసాగింది. అప్పుడు గుర్తుకొచ్చింది వ్యాను దిగే హడావిడిలో వెంట తెచ్చుకున్న రైన్ పాంచోలు, గొడుగులు వ్యానులోనే వదిలేశాం అని.

https://www.facebook.com/geetamadhavikala/posts/

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.