దేవి చౌధురాణి

(మూడవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

“నిశి” అని పిలిచింది దేవి. ఒక్క ఉదుటున నావ పైకి నిశి వచ్చింది.

“ఆ శంఖానాదం ఎవరిది?”

“మన గడ్డపు వీరుడుది అనుకుంటాను” అన్నది నిశి.

“రంగరాజు?”

“అలాగే వున్నట్లుంది.”

“ఇది ఎలా? నేను రంగరాజుని దేవిగఢ్‌కి పంపించాను కదా?”

“తిరిగి వచ్చి వుంటాడు.”

“అలా అయితే పిలువు.”

“శంఖనాదం ఎక్కడో దూరంగా వినపడింది. నేను క్రిందకు వెళ్లి వెతికి పిలుచుకువస్తాను” అన్నాడు వ్రజేశ్వర్.

“అవసరం లేదు, మీరు క్రిందకు నిశితో వెళ్లండి, తన నైపుణ్యమేమిటో తెలుస్తుంది.”

వ్రజేశ్వర్ నిశితో క్రిందకు వెళ్లాడు. నిశి ఒక వేణువుని తీసి మల్హర రాగంలో ఏదో సందేశం ఆలాపించింది. నిశి సంగీత విద్వాంసురాలు, దేవికి వీణ నేర్పింది నిశినే.

ఆ వేణు నాదం దూరంగా వున్న రంగరాజుకు చేరింది. రంగరాజు వేగంగా దేవి నావ వద్దుకు వచ్చి, నావకు వేలాడుతున్న తాళ్లు పట్టుకుని పైకి ఎక్కటానికి ఎంతో సమయం పట్టలేదు.

“నువ్వు పైకి వెళ్లి ఏం మాట్లాడుకుంటున్నారో వచ్చి చెబుతావా? నేనేమన్నా చెయ్యగలనేమో చూస్తాను” అన్నాడు వ్రజేశ్వర్.

నిశి పైకి వెళ్లి వచ్చి, “కొంచెం బయటకు వచ్చి మీరే చూడండి” అన్నది. వ్రజేశ్వర్ బయటకి వచ్చి చూస్తే  అడవిలోనుంచి అసంఖ్యాకమైన మనుష్యులు చీమలదండుల వలె వెలువడుతున్నారు.

“వీళ్లెవరు?” ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అడిగాడు వ్రజేశ్వర్.

“బరకందాజ్, నిప్పుతో చెలగాటమాడగలరు. అందరూ మెరుపుదాడులు చేసే రంగరాజు దళంలోని అగ్నివీరులు.”

పైకప్పు మీద దేవి కూడా వీరందరినీ చూస్తున్నది. రంగరాజు వచ్చి దేవికి ఆశీర్వాద వచనాలు పలికాడు. “రంగరాజు, నువ్వు ఇక్కడ ఎందుకు వున్నావు?” సూటిగా అడిగింది దేవి.

రంగరాజు మౌనంగా వుండిపోయాడు.

“ఈవేళ ఉదయం నిన్ను దేవిగఢ్‌కి పంపించాను. నువ్వు నా ఆజ్ఞను ధిక్కరించటం ఎప్పటినుంచి?” దృఢ స్వరంతో ప్రశ్నించింది దేవి.

“నేను దేవిగఢ్ వెళ్తుంటే దారిలో భవానీ ఠాకూర్ కనపడ్డారు” అన్నాడు రంగరాజు.

“భవానీ ఠాకూరా!?”

“అవును. కంపెనీ సైన్యం మిమ్మల్ని బంధించటానికి వస్తున్నదని ఆయన చెప్పారు. వెంటనే మన యోధులను, బరకందాజ్‌ని కూడగట్టుకుని వచ్చాను. ఇప్పుడు కంపనీ వాళ్ల నాగతరులు మీ దగ్గరకు దూసుకు వస్తుండడం చూసి నేను శంఖాన్ని పూరించి అందరినీ సిద్ధపరిచాను.”

“ఆ అడవిలో కంపెనీ సైన్యముందా?”

“ఉంది, కంపెనీ సైన్యాన్ని మనవాళ్లు చుట్టుముట్టారు.”

“భవాని ఠాకూర్ ఎక్కడ?”

“ఆయన మన సైన్యాన్ని వెంటపెట్టుకుని వస్తున్నారు.”

“మన సైనికులు ఎంత మంది వున్నారు?”

“వెయ్యికి పైగా.”

“మరి కంపెనీ సిపాయిలు?”

“ఐదు వందలు వుండవచ్చు.”

“పదిహేను వందలమంది పోరాటంలో ఎంత మంది మరణించవచ్చు?”

“రెండు లేక నాలుగు వందల మంది.”

“వెళ్లి భవానీ ఠాకూర్‌తో చెప్పు, ఇంత మంది నేల కరిస్తే నాకు మహాపాతకం చుట్టుకుంటుందని.”

“మాతా, ఎందుకు?”

“నా ఒక్కదాని ప్రాణ రక్షణకు మీరు ఇంతమంది ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఇది సమంజసమా?”

“మాతా, నువ్వు జీవిస్తే, ఇంకెంత మందో జీవిస్తారు.”

దేవి క్రోధంగా రంగరాజును చూసింది. ఆ చూపుకి రంగరాజు చిన్నబోయాడు. ఆ క్రోధత్వములో దేవి సాక్షాత్తు కాళీ మాతను తలపించింది. రంగరాజుతో “వెళ్లి భవానీ పాఠక్‌గారితో తక్షణం మన సైనికులని తీసుకుని వెనుదిరగమను. అదే జరగకపోతే, నేను ఇంగ్లీషు సైనికుల కోసం ఆగను, వెంటనే గంగా నిమజ్జనమవుతాను. ఇది నా ప్రతిజ్ఞ” అన్నది.

రంగరాజు తల దించుకుని “నేను వెళ్తున్నాను, ఠాకూర్‌గారికి మీరు చెప్పమన్నది చెబుతాను. ఆయనకేమి ఉచితమనిపిస్తే అదే జరుగుతుంది. నేను మీ ఇద్దరి ఆజ్ఞలను పాటించవలసినవాడిని.”

రంగరాజు వెళ్లాడు. అక్కడే వుండి ఈ సంభాషణ వింటున్న నిశి “ఓ చెల్లెలా, నువ్వు చేసిన పని ఏమిటి? నీ ప్రాణాలు నీ ఇష్టం, కానీ, నీ పతి ఈవేళ నీతోబాటు ఇక్కడ ఉన్నాడు. ఆయన గురించి ఆలోచన లేదా?” అన్నది.

“అక్కా, ఆలోచన చేసాను, తప్పక ఆలోచన చేసాను. ఇప్పుడు  ఆ జగదీశ్వరుడి పైనే భారం. నా పతి ప్రాణాల కోసమైనా అంత మంది మనుష్యలు ప్రాణాలను హరించలేను. నా పతి నాకు దేవుడే, కానీ ఆ సైనికులందరికీ ఏమవుతాడు?”

నిశి కళ్లప్పగించి అలానే చూస్తూ వుండిపోయింది. కొంత ఊపిరి తీసుకుని “దేవి, నువ్వు నిష్కామధర్మాన్ని నిజంగా నేర్చుకున్నావు. నీతో పాటు నేను కూడా మరణించడమే ఆనందదాయకం” అన్నది.

నిశి క్రిందకు వెళ్లి వ్రజేశ్వర్‌కి జరిగిందంతా చెప్పింది. అప్పటిదాక వ్రజేశ్వర్ ప్రఫుల్లని తన భార్య అని మాత్రమే అనుకున్నాడు. “ఆవిడ నిజంగా దేవి. ఎంత పని  చేసాను!? డాకు అని, దొంగ అని అవమానించటానికి బయల్దేరాను కదా!” అంటు వాపోయాడు.

ఇంగ్లీషు వాళ్ల నాగతరులు నావను సమీపించాయి. దేవి పై కప్పు మీద నిశ్చలంగా కూర్చుని వున్నది. దూరంగా ఆకాశంలోకి చూస్తున్నది. ఉన్నట్టు వుండి “జయ జగదీశ్వర్” అని పైకప్పు దిగి క్రిందకు వెళ్లింది.

“దేవి, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?” అని ప్రశ్నించింది నిశి.

“నా పతిని రక్షించుతాను.”

“మరి నీ సంగతి?”

“నా గురించి అడగవద్దు. నేను చేప్పేది జాగ్రత్తగా విను. నువ్వూ నేను ఏమైనా, నా పతిని, దివను రక్షించుతాను” అని చెప్పి దేవి శంఖాన్ని పూరించింది.

“నువ్వు చెప్పింది బాగుంది” అన్నది నిశి.

“బాగుందో లేదో అన్నది నీ ఆలోచన. ఇప్పుడేం చెయ్యాలో మాత్రం నేను చెబుతాను. ఆ తరువాత నీ ఇష్టం.”

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.