ఈ తరం నడక – 23

ఓల్గా “రాజకీయ కథలు”

-రూపరుక్మిణి

మగువగా పుట్టి మనిషిగా మారిందా మనిషిగా పుట్టి మగువగా మారిందా!?

ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేసుకున్న నన్ను చీల్చుకుని సమాధానం మాత్రం బోధ పడడం లేదు. పుట్టకముందే అంతరాలు ఏంచే సామాజిక వ్యవస్థ నాది. పుట్టి బుద్ధి పెరిగి ఆలోచన బలపడినప్పుడు ఈ అంతరాలని ప్రశ్నించకుండా ఉండలేము.

ఈ అంతరం మగువకు సమాజం ఇచ్చింది. సమాజం ఇచ్చిన ఆలోచనలు పునికి పుచ్చుకున్న పురుష స్వామ్యం మా’నవ’ ధర్మాన్ని పక్కన పెట్టి మను ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తుంది.

జాతి బేధం – వర్గ బేధం ఇక్కడ విచ్చలవిడిగా తారసపడుతుంది. ఈ జాతి భేదంలో మగ- ఆడ అన్న జాతి బేధం, అమ్మ,ఆలీ,బిడ్డ ఎవరైనా ఒక్కటే. ఇక్కడ  మనుషుల ఆలోచనలు ఎంతగా పాలిష్ చేయబడ్డాయి అంటే తరాల నుంచి వస్తున్న బానిస వాసనల్ని వదిలి పెట్టడానికో, వదిలించుకోవడానికో ఎవరు సిద్ధంగా లేకపోవడం ఇక్కడ మన దుస్థితికి కారణం.

ఒక ఆడపిల్ల అసలు పుట్టాలా వద్దా!?  పుడితే వడ్ల గింజ వేయాలో వద్దో  నిర్ణయం ఎవరిది.!? కాలికి గజ్జ కట్టాలో లేదో, ఒంటికి చీర కట్టాలో లేదో నిర్ణయం ఏదైనా  ఈ పితృ స్వామిక వ్యవస్థదే. ఆ వ్యవస్థలో కాస్త చలాకీగా ఉండి నిర్ణయాధికారాన్ని చేత పట్టుకున్న ఓ అమ్మాయి తన కథ చెబితే అది ఒక రాజకీయ కథ అవుతుంది . ఈ రాజకీయం ఎక్కడిది అని ప్రశ్నించుకుంటే మన సంస్కృతిలో ఉంది,  సాంప్రదాయాల మధ్య ఇరుక్కుపోయిన ఇరుకు మనుషులది. మనసుకు గెంతులేయాలన్న కోరిక కలిగితే ఒక ఆడపిల్ల పరిగెత్తడానికి కూడా అభ్యంతరం పెట్టే పాలిష్డ్ వ్యవస్థలో ఉంది.

పురుషుడు ఉద్యోగం చేస్తే అతనికి ఉద్యోగ భద్రత కల్పించడానికి, యూనియన్లు అనేక సంఘాలు అతని కోసం పని చేస్తాయి. ఉద్యోగ భద్రతను కల్పిస్తాయి. అదే ఆడపిల్ల పిల్లల్ని కని పెంచే ఉద్యోగంలో 50 వేల రూపాయలు లంచంగా ఇచ్చి కొనుక్కున్న ఉద్యోగం ఇంటి చాకిరి అటువంటి పనికి కూడా పనికిరాకుండా పోతుంది. ఆమెను ఆ ఉద్యోగం నుంచి తొలగించడానికి కారణం ఆమె గర్భసంచిని కోల్పోవడం పిల్లలు పుట్టే యంత్రంగా మాత్రమే చూసే చోట స్త్రీ ఓ పనికిరాని ఫ్యాక్టరీ మిషిన్ ఆ మిషన్ ని తీసేసి కొత్త మిషన్ ని ఆపరేట్ చేసుకునే అవకాశం కలిగిన పురుష స్వామ్య వ్యవస్థ ఒక రాజకీయం.

జింక పిల్లల్లా.. చెంగుచెంగున ఎగిరే మనసు సీతాకోకచిలుకల రెక్కల గుర్రాలని పగడపు దీవులని పగడపు దీవులను కలలుకని ఆడపిల్లలను పట్టి బంధించి చీకటి గోడల మధ్య బంధించి ఆ ఆడపిల్లకు ఉన్న ఒకే ఒక్క గంట యోని ఒక్కటే పని చేసే వస్తువుగా మార్కెట్లో అమ్మకానికి పెట్టినప్పుడు ఆ యోనిని ధరించిన దేహం చెప్పే ఆత్మకథలో ఓ ఆడపిల్ల అయోనిజగా పుట్ట లేకపోయినా అయోనిగా పుట్టలేకపోయాను అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు కలిగే బాధని వర్ణించేది అయోని కథ

బాలికకు బాల్యం అన్న ఆలోచనతో పని లేకుండా శారీరక హింసకు గురి అయ్యే రాతి గుండెల కథ. మెత్తని వక్షస్థలాన్ని హత్తుకునేందుకు అర్రులు చాచే ప్రపంచం నుంచి విసిగి వేసారిన ఓ మాతృమూర్తి గడ్డకట్టుకుపోయిన పాలిండ్ల చాటున దాగిన రాతి గుండెల కథ ఇది. ఎన్ని చూపుల కొరడాలు ఎన్ని భస్మాసుర హస్తాలు దాటుకుని ఆడపిల్ల పైట సర్దుకోవడంలో ఎన్ని వేల సార్లు తలలు వంచుకోవాల్సి వస్తుందో.  సమాజం సిగ్గుపడవలసిన వ్యవస్థ తీరుని వర్ణించిన కథ ఈ రాతి మనుషుల ఆలోచనలకు అద్దం పట్టేది.

ఆడవాళ్లకు ఉండవలసింది సన్నని నడుమ నాజూకు నయగారాలు అంటూ వర్ణించే వర్ణనలా బలమైన వెన్నుపూసలా అని అడిగినప్పుడు ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క అక్షరం బలమైన వెన్నుముక కావాలి అని ప్రస్ఫుటంగా చెప్తుంది మగువ తన కాళ్ళ మీద తను నిలుచగల శక్తిని వెన్నుముక అందిస్తుంది. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఎంతటి అవసరము ఆ ఆర్థిక స్వాతంత్రము నిటారుగా నిలబడి లాగా చేసే వెన్నుముకై స్త్రీని నిలబెడుతుంది. ఒక స్త్రీ తిండి కోసం ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడమే ఆమె వెన్నుపూస బలంగా ఉందని ధైర్యం చెప్పిన కథ వెన్నెముక

కుటుంబంలో ఏదైనా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో నోరు మెదపక్కరలేని పరిస్థితి ఎవరికైనా ఉంది అంటే అది ఆడపిల్లకు మాత్రమే. పెద్దవాళ్లు చిన్నపిల్లల్ని అన్నట్టు పురుషుడికి ఉన్న తండ్రి బిడ్డను భార్యను ఎదిగిన కొడుకు తల్లిని అతి తేలికగా నిర్మొహమాటంగా అనగలిగిన మాట నోర్ముయ్. ఒక ఆడపిల్ల ఎందుకు నోరు మూసుకొని బతకాలి తనకు నచ్చిన పనిని నచ్చింది అని చెప్పే వాక్ స్వాతంత్రాన్ని ఎందుకు కోల్పోతుంది. అలా కోల్పోవడంలోని రాజకీయ కోణం ఏమిటి ? ఈ రాజకీయం వల్ల లబ్ధి పొందే వారి కంటే తీవ్రంగా నష్టపోతున్న వారే ఎక్కువ.

ఆడపిల్ల అనగానే సర్వాలంకార భూషిత. అలంకారాన్ని వెలివేసిన ఆడపిల్లకు విచ్చలవిడితనం అన్న ట్యాగ్ లైన్ ని తగిలిస్తుంది ఈ సమాజం. ఈ ట్యాగ్ లైన్ ఏదో సరదాగా వచ్చింది కాదు. ఈ సమాజ నిర్మాణంలో ఆడపిల్లకు అలంకరించబడిన ఆభరణం. పొడుగు జడ, ముక్కుకి ముక్కెర, చెవులకు జుంకీలు కాళ్లకు పట్టీలు కనిపించి కనిపించని నడుముకు దోపుకున్న కొంగుముడులు ఇవన్నీ ఓ ఆడపిల్ల అలంకార వస్తువులు. బుద్దేరిగిన నాటినుండి తాను పుట్టిన వర్గంలోని అలవాట్లనే ఆభరణాలుగా తొడిగి ఆమెలోని సౌందర్యానికి హింసను కానుకగా ఇచ్చే ఆలోచన ఓ రాజకీయం మన సమాజంలో.

మహిళ వందల ఏళ్లుగా సమానత్వం కోసం పోరాడుతూ పోరాడుతూ… అలసిపోయి గుక్కెడు నీళ్ల కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. స్త్రీకి నిర్ణయాధికారము ఏ పరిమితుల్లో ఉంటుందో మనకి తెలియనిది కాదు గడప దాటని ఈ నిర్ణయాధికారాలు ఆమెకు కుటుంబ పెత్తనాల్లో దొరకదు. స్వతహాగా స్త్రీకి గుర్తింపు వచ్చిన దానికంటే 100 రెట్లు తెలివి ఆమెకు ఉంటుంది అంటారు ఓల్గా గారు. ఆ తెలివిని అణచటం సాధ్యం కాక ప్రతి పనిలో కొంచెం అవకాశం ఇస్తారు దానికి పొంగిపోయి ఆ చోటిలోనే స్థిరపడతాం అనే అవకాశవాదం నుండి బయటపడి 19 సార్లు ముద్రించబడిన ఈ పుస్తకం ఓల్గా గారి కథా శైలిని, కథలు మగువ జీవితానికి ఏం కావాలి అన్న ఒక స్పష్టమైన అవగాహనను పెంచేలా, ఆడపిల్లలకు మగ పిల్లలకు ఈ పుస్తకం మానసికంగా ఎదగడానికి ఒక థెరపీలా పని చేస్తుంది.

ఓల్గా గారి రచనల్లో చదువుతున్నప్పుడు ఎవరికి వారు అద్దంలో తమ ప్రతిబింబాలని చూస్తూ తామే మాట్లాడుకుంటున్నట్టు తమ చుట్టూ ఉన్న మనుషుల హావభావాలను పూర్తిగా చదివి వినిపించినట్టు ఉంటుందీ పుస్తకం. ఆధునిక సమాజంలో హింస ప్రేరేపిత వస్తువై అనేక రూపాలు మార్చుకున్నా, నేటికి హింస పరిణామం చెందుతూనే ఉంది. నాటికి నేటికి ఎక్కడైనా మార్పు వచ్చిందా!  స్త్రీ మనుగడలో ఆమెపై పెరుగుతున్న హింసను ప్రేరేపిస్తుంది ఎవరు అని ఆలోచించేలా నేటి తరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిన తరణం, అనిశ్చిత అవసరాన్ని గుర్తుచేస్తుంది ఈ 10 కథలు చెప్పే మగువ జీవితాలపై సృష్టించబడిన రాజకీయ ఆలోచనలు. ఆధునికంగా  రచయితలు వెల్లడి చేయాల్సిన భావాల్లో స్పష్టత , ముందు చూపు అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ పుస్తకంలోని ప్రతి కథ. తప్పకుండ ఒక్కసారి అయినా చదవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

పుస్తకం పేరు: రాజకీయ కథలు

రచయిత:  ఓల్గా గారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.