ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1

-డా.సిహెచ్.సుశీల

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

        అని మహాకవి కాళిదాసు ప్రార్థించి నట్లు ‘వాక్కు’ లేకుండా ‘అర్థం’ లేదు ‘అర్థం’ ‘వాక్కు’ను వదిలి ఉండలేదు. ఇవి పరస్పరం ఆధార ఆధేయాలు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఎలా అర్థనారీశ్వరులో ఎలా అవిభక్త జాయాపతులో  అలానే స్త్రీపురుషులు అవిభక్తాలు.

       కానీ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి పురుషులతో పాటు సమాన స్థాయి సంపాదనలో సాధ్యాసాధ్యాలు చర్చించే అరుదైన వేదిక “స్త్రీవాదం”. కొందరు దీనిని “స్త్రీ విముక్తి ఉద్యమం” అన్నారు. ఆ మాటల్లోనే ఉద్యమించాలని అవగతమవుతుంది. మరికొందరైతే “స్త్రీ స్వేచ్ఛ ఉద్యమం”,”స్త్రీ విమోచన ఉద్యమం ” అని పేర్లు మార్చి”‘  లక్ష్యం ఒకటిగానే ఉద్యమించారు.

      స్త్రీలకు ఆవిద్య, ఆర్థిక స్వాతంత్రం లోటు వారు నిస్సహాయంగా మిగిలిపోవడానికి ముఖ్య కారణాలు అయ్యాయి. వారు మరొకరి మీద ఆధారపడి బ్రతికే వలసిన అగత్యం ఏర్పడింది.

ఎన్ని రకాలుగా స్త్రీలు ఏమేమి కోల్పోతున్నారో సింహావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రక్రియ జరగడానికి స్త్రీవాద రచయితలు కలం పట్టారు. గళమెత్తారు. స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ స్వాతంత్ర్యం గురించి,  భావ స్వాతంత్రం గురించి, ఆర్థిక సమత స్వాతంత్రం గురించి,  ఆర్థిక స్వాతంత్రం గురించి,  అనేక సాహిత్య ప్రక్రియల్లో తమ కలా లతో విప్లవ శంఖం పూరించారు. పితృస్వామ్య భావజాలానికి కళ్ళెం వేసి, స్త్రీ విముక్తికి మార్గం వేయాలని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం పురుషులతో సమానంగా కోరుకుంది. సమసమాజ స్థాపన, సాంస్కృతిక విప్లవ చైతన్యాన్ని రగిల్చింది.

    “రచయిత్రి తో పాటు, కొందరు రచయితలు కూడా స్త్రీవాద సాహితీ సృజన సాగిస్తున్న ఈ స్త్రీ వాద భావజాలాన్ని పరిచయం చేసి, విశ్లేషించే సాహిత్యం రావాల్సి ఉంది” — అని కాత్యాయనీ విద్మహే అన్నట్లు కొందరు రచయితలు కూడా రచయిత్రులు రాస్తున్న స్త్రీవాద రచనల పట్ల “సహా అనుభూతిని” పొంది స్త్రీల యొక్క మనోభావాలను గౌరవించి అనేక రచనలు చేశారు. కేవలం స్త్రీలే కాక వారికి తోడుగా పురుష రచయితలు తమ వంతు సహకారాన్ని ఆమోదయోగ్యంగా అందిస్తున్నారు. వాటిలో కవిత్వం కథలు నవలలు కూడా ఉన్నాయి.

     ఆధునికాంధ్ర సాహిత్యంలో *స్త్రీ* *వాదము- పురుష* *రచయితలు* అన్న అంశమే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆధునిక కాలంలో స్త్రీ యొక్క ఆవేదన. ఆక్రోశం అర్థం చేసుకున్న రచయితలు గురజాడ, చలం, కె.శివారెడ్డి, భగ్వాన్, ఎండ్లూరి సుధాకర్, కొలకలూరి ఇనాక్, పాపినేని శివశంకర్ ,సలీం మొదలైన ప్రముఖ కవులు రచయితల రచనలను పరిశీలిద్దాం.

 *గురజాడ* 

     స్త్రీ జనోద్ధరణకు కంకణం కట్టుకున్న సంస్కారవంతులు లో సాహిత్యాన్ని ఆయుధంగా పట్టిన గురజాడ అభ్యుదయ వాదులకు అడుగుజాడ. స్త్రీని గౌరవించే పురుషునికి గౌరవం వస్తుందని సత్యాన్ని గ్రహించిన సాంఘిక సంస్కరణ యోధుడు. తాను *పూర్ణమ్మను* గూర్చి వ్రాసినా, *దేవుళ్ళారా మీ పేరేమిటి* అని విద్యావంతురాలైన నాంచారమ్మని సృష్టించినా, *దిద్దుబాటుని* చాకచక్యంగా వర్ణించినా, చదువుకున్న మూర్ఖుడైన భర్తతో కాపురం *కర్పూరం* చెట్లు మార్చుకున్న *మెట్టెల్డా* ను  తీర్చిదిద్దినా, దెయ్యం గా మారిన పూటకూళ్ళమ్మ పై సానుభూతి వర్షం కురిపించినా, *కన్యాశుల్కంలో* మీనాక్షి బుచ్చమ్మ పాత్రలతో ఆనాటి సమకాలీన సమాజంలోని సహజత్వానికి అద్దం పట్టినా, స్త్రీ జన విమోచనా లక్ష్యంగానే గురజాడ కలం కదిలింది.

   గురజాడ పాత్రలు కళ్ళకి వెలుగును ఇస్తాయి. మారుతున్న సమాజ స్వరూపాన్ని దర్శించటానికి కావలసిన సాధనాన్ని సమకూరుస్తాయి. అవి ఆనాటి బ్రతుకు నుంచి పుట్టిన వాస్తవ పాత్రలు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ జీవించే ఉంటాయి – అని చాగంటి తులసి గారు గురజాడ జాడను సూక్ష్మీకరించి గురజాడ ఆత్మను ఆవిష్కరించారు. స్త్రీవాద మని ఎక్కడ తొణక్కుండా ప్రతి పాత్రలోనూ స్త్రీ ఔన్నత్యాన్ని చూపించిన ఘనత గురజాడవారి ది.

    ఆధునిక స్త్రీ చరిత్రను తిరగ రాస్తుంది అన్నారు. పాత కొత్తల మేలుకలయికతో అటు “అర్ధనారీశ్వరుడు” ఇటు ఇంగ్లీష్ “బెటర్ హాఫ్”కనిపిస్తుంది. మొగుడు దేవుడు అన్న పాత మాట. సహచరుడు అన్న కొత్త మాట వినిపిస్తుంది.

    కన్యాశుల్కం ఆనాటి సాంఘిక దురాచారం.  అసలు సమస్య కన్యాశుల్కం అయినా గురజాడ వారు నాటకంలో స్త్రీని పట్టి పీడిస్తున్న అనేక సాంఘిక సమస్యలను వ్యతిరేకిస్తూ, వ్యవహారిక భాష ఉద్యమంతో నాటకానికి పరిపుష్టిని చేకూర్చారు. వేశ్యావృత్తిని నిరసిస్తూనే స్త్రీ నైతికతకు, వ్యక్తిత్వానికి మధురవాణి ప్రతీకగా నిలిపారు. గురజాడ సృజించడం స్త్రీ పాత్రలు ఒక్కో ప్రత్యేకత. “వసంతసేన కంటే మధురవాణి గొప్ప సృష్టి”అని శ్రీశ్రీ ఆశ్చర్యపడ్డారు. ” కామందకి కన్నా గొప్పద”ని కేతవరపు రామకోటి శాస్త్రి అన్నారు. ” కాళ్ళకూరి వారి చింతామణి ,పానుగంటి సుందరి కన్నా మధురవాణి గొప్పద”ని రమణ రెడ్డి అన్నారు. మధురవాణి పాత్ర  మిగతా పాత్రలన్నింటినీ మింగేసింది అందుకే కన్యాశుల్కంలో ఎవరున్నారు, ఉన్నది ఒకటే పాత్ర , మధురవాణి అని శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారితో ఆయన మిత్రుడు అన్నారట. ( కన్యాశుల్కం మరోవైపు. పే.30 –  కోవెల సంపత్కుమారాచార్య)

    “రెండవ కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర అంటే నాకు నేనే ముచ్చట పడుతున్నాను” అని (గురజాడ లేఖలు – 1958 . పే.31) ఆయనే చెప్పుకోవడం విశేషం.

               ఈ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు డబ్బు కోసం గడ్డి తినే రకం. డబ్బు కోసం కన్న కూతురునే అమ్ముకునే బాపతు. పెద్ద కూతురు బుచ్చమ్మను ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడు చచ్చిపోయాక వారి ఆస్తి కోసం కోర్టుకెక్కిన డబ్బు పిశాచి. రెండో కూతురు ముసలివాడైనా లుబ్ధావధానులకి ఇవ్వటానికి సిద్ధపడ్డ బుద్ధిహీనుడు. అలా చేస్తుంటే అతని భార్య వెంకమ్మ నూతిలో దూకితే ఆపద్బాంధవుడి అవతరమెత్తి గిరీశం ఆమెను రక్షించాల్సివచ్చింది.  అయినా అగ్నిహోత్రావధానులు “తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి ” అన్నాడు.  బుచ్చమ్మ తన తమ్ముడు వెంకటేష్ కి ట్యూషన్ మాస్టర్ గా వచ్చిన గిరీశం ఉపన్యాసాలు విని చెల్లి పెళ్లి ఆపటానికి అతనితో వెళ్ళటానికి కూడా సిద్ధపడుతుంది.

 బాల్య వివాహాల వల్ల వితంతువులు అయిన స్త్రీలు శారీరక వాంఛలకు బలైపోయి, నాశనమై  పోవటానికి పూటకూళ్లమ్మ మీనాక్షి లు ఉదాహరణలు.  చిన్నపిల్లల్ని ముసలి వారికి ఇవ్వడం వల్ల సమాజంలో ఇలాంటి దుర్నీతి పెరిగిపోయింది. స్త్రీలు వెట్టిచాకిరి చేస్తూ , తిండి కూడా సరిగా తినక, అలంకరణకు దూరంగా, వంట ఇంటికి పరిమితమై, కట్టుబాట్లకి బానిసలుగా బ్రతుకు వెళ్లదీసే పరిస్థితి.

     నిజం చెప్పాలంటే , ఆనాటి స్త్రీల దుస్థితికి వేదన చెందిందీ సంస్కరణలకి నడుం కట్టిందీ పురుషులే . సంస్కరణకి కొందరు నడుం కడితే కొందరు కలం పట్టారు. గురజాడ స్త్రీ పాత్రల పక్షాన వకాల్తా పుచ్చుకొని అద్భుతంగా వాదించారు. తన భావాలను నాటకీయంగా నాటకంలో అక్షరీకరించారు .స్త్రీ జాతికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు. గురజాడ మానసిక వేదనను అర్థం చేసుకున్న సంస్కర్తలు ఆయన హృదయాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. స్త్రీల సమస్యలని అవి ఎంత బాధాకరమైనా, హాస్యం జోడించి వ్యవహారిక భాషలో రాయటం వల్ల ప్రేక్షకుల మనసులు పండించి, సంస్కరణ వైపు మళ్ళించడం వల్లనే మాననీయుడు అయినాడు గురజాడ. మానవత్వం సమతూకంలో చూడగలిగాడు కనుక తాను సృష్టించిన స్త్రీ పాత్రలలో ఆనాడే స్త్రీవాదాన్ని పరోక్షంగా వినిపించి నేటి తరానికి మార్గ దర్శకుడయ్యాడు. ఆనాడు ఇటువంటి సమస్యలు ఎత్తి చూపటానికి గుండె ధైర్యం కావాలి. సంప్రదాయాన్ని బెదిరిస్తున్న ఆమోదయోగ్యంగా అక్షరాల్లో పథకాలు అంత సామర్ధ్యం ఉన్నది కనుకనే ఆ పాత్రలు ఆ రచనలు ఇప్పటికీ మన కలుగుతున్నాయి.

 *చలం*

      గుడిపాటి వెంకటచలం స్త్రీల స్వేచ్ఛ కొరకు తెలుగునాట వెలసిన ధైర్యాచలం. స్త్రీ స్వేచ్ఛకై సాహిత్య పుటాయుద్ధంతో సాంఘిక వ్యవస్థ పై దాడి చేసిన సంస్కర్త. వ్యక్తిని సంఘం కట్టడి చేస్తే , సాంసారిక బంధాలు ముట్టడి చేస్తే ,ఊపిరాడని వ్యక్తిని బయటకు లాగి, రాజీలేని అభిప్రాయాలతో ఆలోచనలతో వాటిని బద్దలుకొట్టి స్వేచ్ఛ అందించాడు.

     యావత్ భారత దేశము రాజకీయ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లో – స్త్రీ  భావ స్వాతంత్రం కోసం తన కలంతో పోరాడిన వాడు ఈ చలం. “దేన్నయితే ఈ ఛాందసులంతా  కాలకూట విషం అనుకుంటున్నారో దాన్ని నేటి అభ్యుదయ ఆరోగ్య ప్రదాయక మైన అమృతంగా స్వీకరిస్తుంది” అని శ్రీశ్రీ కితాబిచ్చాడు. ” యువతరాన్ని పాడు చేస్తున్నావు'”  అని సోక్రటీస్ విధివిధానాలను తప్పుగా ఎలా అర్థం చేసుకున్నారో, ఎలా విషమిచ్చి త్రాపించి చంపారో – అలాంటి కరడుకట్టిన సంప్రదాయవాదులు చలాన్ని చలం సాహిత్యాన్ని వెలి వేశారు. ఆయన రచనల్ని పేరున్న ఏ పత్రికలు ప్రచురించలేదు.  ప్రచారం చేయలేదు.

       స్త్రీకి కూడా శరీరం ఉంది

     దానికి వ్యాయామం ఇవ్వాలి 

      ఆమెకు మెదడు ఉంది 

       దానికి జ్ఞానం ఇవ్వాలి 

       ఆమెకు హృదయం ఉంది 

       దానికి అనుభవం ఇవ్వాలి అనే సంగతిని గుర్తించని ఈ దేశానికి నేను రాసే సంగతులు అర్థమవుతాయా అని సందేహించాడు చలం 50 ఏళ్ల కిందట. అందుకే ఆయన రచనలు అనుకున్నంత త్వరగా వేళ్ళూన లేదు. స్త్రీని పురుషాధిక్య ప్రపంచం ఎలా దిగ్బంధం చేసిందో తన రచనల్లో వివరించాడు. వితర్కించి విమర్శించాడు.

   న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి- అన్న సూక్తిని బలంగా నమ్మి ఆరోజుల్లో “స్త్రీకి స్వాతంత్రమా” అని విస్తు పోయిన పెద్ద మనుషులు ఉన్నారు.

 “సంఘంలో స్త్రీ జీవితం చీకటి గాను, ఇరుకు గాను, నీచంగాను ఉండటం చూసి ఓర్వలేక,  భరించలేక, ఉద్రేకపడి యుగయుగాల గాఢనిద్ర నుంచి స్త్రీలను  తట్టీ, తిట్టీ మేల్కొల్పే మహా యజ్ఞం” – చలం చేస్తున్న సాహిత్య విప్లవం.  (రంగనాయకమ్మ)

      తమ ఆశలు, కోర్కెలు, తిరుగుబాటు నైజం, స్వేచ్ఛకోసం పెనుగులాట, ఉత్తమమని తెలియక, మనోవేదనతో అశాంతికి లోనైన నిస్సహాయ స్త్రీలకు నైతిక సహాయం ఇచ్చే అభయహస్తం చలం సృష్టించిన సాహిత్యం సమస్తం. సమ సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించి అందులోనే స్త్రీ పురుష సమానత్వాన్ని పాదుకొల్పి  భావ పరివర్తన కలిగించిన గుండె ధైర్యం ఉన్న సంస్కరణాభిలాషి చలం.

      “స్త్రీల కన్నీళ్ల నుండి విప్లవాన్ని మొలిపించిన ఘనత చలం కలానిదే. ‘స్త్రీ’ మానవజాతి నాగరికతకే ఒక కొలమానం, అని స్త్రీ ప్రాధాన్యతను గుర్తించమని, “మానవ మేధ దేవ రహస్యాన్ని చాలెంజ్ చేసే స్థాయికి ఎదిగింది, కానీ భూలోకంలో దేవతయైన ‘నిన్ను’ ఉద్ధరించే  స్థాయికి ఎదగలేదు”  అని – (అక్షర వేదన) లో ఎస్ వి కృష్ణారావు అంటారు.

       చలం సాహిత్యం మొత్తానికి “స్త్రీ” కేంద్రం అనిపిస్తుంది. స్త్రీకి ఉన్న అనేకానేక సమస్యలు, స్త్రీల వల్ల కలిగే వల్లమాలిన సమస్యలు, సామాజికమైన సమకాలిక సమస్యలు, పెళ్ళికాని స్త్రీ కి సమస్యలు, పెళ్లైన స్త్రీ కి సమస్యలు, ఉద్యోగం చేస్తున్న స్త్రీకి సమస్యలు, ఉద్యోగం లేని స్త్రీ కి సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు,మోహానికి సంబంధించిన సమస్యలు, స్వేచ్ఛకు సంబంధించిన సమస్యలు- వీటన్నిటిలో స్త్రీల కేంద్రబిందువు. ఇన్ని రకాల సమస్యలు చలం సాహిత్యానికి ఇతివృత్తాలు. దీనిలో పరిష్కారాలు, విప్లవాలు, విమర్శలు, సంప్రదాయానికి సవరింపులు. చలం సాహిత్యం స్త్రీ స్త్రీ హితైషిగా ఆంధ్రదేశాన్ని అట్టుగ చేసింది.  ఆయన సాహిత్య ప్రపంచానికి కుహనా సాంప్రదాయం కొట్టుకుపోయింది. కుటుంబ వ్యవస్థ కూలబడింది అని చెప్పవచ్చు.

      “వస్తువులోనూ, శైలిలోనూ తెలుగు కథలో చలం తీసుకు వచ్చిన మార్పు విప్లవ సదృశ్యమైంది. జనమే లేకుంటే తెలుగు కల్పనా సాహిత్యం ఈనాడు ఉన్నట్లు గా ఉండేది కాదు”

  (రాచమల్లు రామచంద్రుడు)

        చలం కథల్ని పరిశీలిస్తే వాటిలోని వివాహ స్వేచ్ఛ లైంగిక స్వాతంత్రం చదివిన వారికి మైండ్ బ్లాక్ అవుతుంది . అవును ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది అనిపిస్తుంది . పూర్వకాలం నుంచి ఒకపక్క స్త్రీని మాతృమూర్తి గానూ, ఇంటికి దీపం గానూ ,త్యాగశీలి పరిగణిస్తూ ,మరొకపక్క అసూర్యంపశ్య, వ్యక్తిత్వం స్వేచ్ఛ లేని దానిగా చూశారు. ఇవన్నీ గుండెల్లో గుబులు పుట్టించాయి. మానసిక తత్వశాస్త్రాన్ని జోడించి ఆయన తన ఆవేదనను తన రచనల్లో ప్రకటించాడు. స్త్రీ పుట్టింది మొదలు కొని స్త్రీలను బానిసలుగా చేసే గ్రంథాలను సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను తార్కికంగా ఎదుర్కొన్నాడు. తన పాత్రలన్నీ సాంఘిక కట్టుబాట్లను తెంచేటట్లు ఊపిరి పోశాడు.

  (మరి కొందరు రచయితలు వచ్చే సంచికలో)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.