2020 ఆటా బహుమతి పొందిన మధురాంతకం నరేంద్ర నవల
‘మనోధర్మ పరాగం’ పరిచయం

-పి. యస్. ప్రకాశరావు

19, 20 శతాబ్దాలలో తంజావూరు, మధురై పట్టణాలలోని దేవదాసీలబాధాతప్త హృదయాల చిత్రీకరణే ‘మనోధర్మ పరాగం’ నవల. స్త్రీ, పురుషుడి పడక సుఖం కోసమే అని భావించే వాతావరణం నుంచి పుట్టినదే దేవదాసీ వ్యవస్థ. రచయిత ఈ సమాచారం కోసం చాలా పరిశోధన చేసినట్టు తెలుస్తోంది.

బ్రిటిష్ వాళ్ళు పన్నులద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతోందని దేవదాసీల ఈనాం భూముల్ని రద్దు చేశారు. దానితో సంగీతాన్నీ నాట్యాన్నీ నమ్ముకుని జీవనం సాగిస్తున్న దేవదాసీల బతుకులు వీధిన పడ్డాయి. తమ మనుగడ కోసం పోషకులను పెట్టుకునేవారు. ఏ కళలోనూ ప్రవేశంలేని దేవదాసీలు పొట్టకూటి కోసం వ్యభిచారాన్ని ఆశ్రయించారు. కళల్లోప్రవేశం ఉన్న దేవదాసీలుపోషకుల నీడలో ఉంటూ వారికి పిల్లల్ని కూడా కనేవారు. కాకపోతే ఆ పిల్లలకు తల్లిపేరే కానీ తండ్రి పేరు ఉండదు. దేవదాసీలకూ పోషకులకూ మధ్య వయోభేదం ఒక్కోసారి 60 ఏళ్ల వరకూ ఉండేది. ఆ పోషకులు ఇంటిదగ్గర ఉసూరుమనే భార్యలను వదిలేసి రాత్రిపూట రహస్యంగా దేవదాసీల దగ్గరకి వచ్చి పోయేవారు. కొన్ని సందర్భాల్లో ఒక దేవదాసీ దగ్గరకి ఇద్దరు పోషకులు కూడా ఉండి ఒకడికి తెలియకుండా ఒకడు వచ్చే సందర్భాలు కూడా ఉండేవి. ఈ పోషకులు వయసు మీద పడ్డవాళ్ళు. వీళ్లకు ఆడదాని సుఖం కావాలి. కానీ వాళ్లు పెద్ద రసికులయినట్టు సంగీతం నాట్యం వచ్చిన వాళ్ళని కోరుకుంటారు. “ దేవదాసీ అనే ఆడదానికి  శరీరంతో బాటు మనసు కూడా ఉంటుందని వారికి తెలియదు. మెడనిండా నగలూ చేతులనిండా ఉంగరాలూ ఉన్నట్టే దేవదాసీలు గూడా హంగు మాదిరి ఉండాలంతే” కొందరు దేవదాసీలు పోషకులను కూడూ గూడూ అడిగితే కొందరు ఏడువారాల నగలు అడిగేవారు. ఈ వృద్ధ రసికుల గురించి మాట్లాడుతూ ‘ఇళ్ళలో ఉండే ఆడోళ్ళు దేవుళ్ళకంటే ఎక్కువగా మొగుళ్ళనే సేవ జేసుకొని పతివ్రతల మని పేరు తెచ్చుకుంటారు. అదే మొగోళ్ళు మా దగ్గరకొచ్చినపుడు మేము చెప్పినట్టే ఇంటారు. వినకపోతే ఏం జరుగుద్దో వాళ్లకి బాగా తెలుసు’ అంటుంది కుముదవల్లి.

వంశోద్ధారకుల కోసం దేవదాసీలు తపించేవారు కాదు. ఆడపిల్ల పుడితేనే వారికి మనుగడ. మగపిల్లలు పుడితే మృదంగం, నాదస్వరం వంటివి నేర్చుకుని పక్కవాద్యగాళ్ళుగా జీవితాలను వెళ్ళబుచ్చాలి. అందుకే కూతుళ్లు పుట్టాలని దేవదాసీలుదేవుళ్ళకు మొక్కు కునేవారు. ఆడపిల్లలు పుట్టక పోతే మరో దేవదాసి ఆడబిడ్డను దత్తత చేసుకునేవారు. బాధాకరమైన విషయం ఏమిటంటే దేవదాసీలను నిత్య సుమంగళులుగా భావించి పెళ్లిళ్లప్పుడు వారిని పిలిచి ముత్తైదుపూజ చేస్తారు. కానీ అదే దేవదాసీలను అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఇళ్లల్లోకి రానివ్వరు.

ఈ నవలలో 30 మంది దేవదాసీలు రచయిత దగ్గరకు వచ్చి తమ బతుకుల్లోని వెతల్ని వివరిస్తారు. ఇది  రచయిత ఎన్నుకున్న శిల్పం.

1889లో మదురైలోని దేవదాసీ కుటుంబంలో పుట్టిన కుముదవల్లితో నవల మొదలవుతుంది. స్వాతంత్రం వచ్చాక సంఘ సంస్కర్తల కృషితో దేవదాసీ వ్యవస్థ అంతమవుతుంది. కానీ ఆ వంశస్తుల సంగీతోపాసన కొనసాగుతుంది. కుముదవల్లి పెద్ద కూతురు నాగలక్ష్మి. ఆమె ముని మనుమరాలు నాగలక్ష్మీ  నటరాజన్ సంగీత కళాకారిణి. ఆమెకి 2020 లో  చెన్నైలో వాళ్ల గ్రేట్ గ్రాండ్ మదర్ సి కె నాగలక్ష్మి పురస్కారం ఇవ్వడంతో నవల ముగిస్తుంది. ఈ రెండువందల ఏళ్ల కాలంలో జరిగిన మార్పులన్నీ నవలలో మనం చూడవచ్చు.

కుముదవల్లి పూర్వీకులు తంజావూరు ఆస్థాన నాట్యగత్తెలుగా ఉండేవారు. కుముదవల్లి పుష్పవతి అయిన వెంటనే ఆమె తల్లి ఆమెకు ప్రాయోజితం (అంటే దేవదాసి తన కూతుర్ని దేవాలయానికి సమర్పించడం. అంటే దేవుడితో పెళ్లి చేయడం) అయ్యాక చిదంబరయ్యరు అనే పోషకుణ్ణి కుదిర్చి చనిపోయింది. ఆ పోషకుడు మూడేళ్ళ తరువాత చనిపోయాడు. అప్పుడామె తమ్ముడు చిత్తూరులో ఉండే వెంకటరమణ అయ్యర్ అనే వకీలుని పోషకుడిగా కుదిర్చాడు. ఆవిధంగా కుముదవల్లి తన వాళ్ళందర్నీ వదిలి మదురై నుంచి చిత్తూరుకు చేరింది. వెంకటరమణ అయ్యర్ము సలివాడయ్యాక అతని శిష్యుడు కుముదవల్లికి రహస్య పోషకుడయ్యాడు. వెంకటరమణ అయ్యర్ కుముద వల్లికి రాముడి గుడిలో రంగభోగం చేసే పనిలో కుదిర్చాడు. (రంగభోగం అంటే కోవెలలో నాట్యం చేయడం.) కుముదవల్లి జీవితంలోకి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు పోషకులు వచ్చారు. ముగ్గురు పిల్లలు పుట్టారు. కొడుకు దండపాణి, కూతుళ్లు నాగలక్ష్మి, మరకతవల్లి, వీరి జీవిత చరిత్రలు ముఖ్యమైనవి. 40 ఏళ్ళ వయసులో కూడా కుముద వల్లి తన ఇద్దరు పిల్లలకు పోషకుల్ని చూడటంతో పాటు తన పోషకుణ్ణి కూడా వెతుక్కోవాల్సిన దుస్థితికి చేరుకుంది.

నాగలక్ష్మి కుముదవల్లి పెద్ద కూతురు. ఈ నవలలో ప్రముఖ పాత్ర. ఆమెకి తల్లి బాల్యంలోనే సంగీతం నేర్పించింది. ఆ సంగీతాన్నే సర్వస్వంగా భావించిన నాగలక్ష్మి పోషకుడుతో వెళ్లడం కంటే ఆత్మహత్యమేలు అనుకుంది. తనకు పోషకులను చూడ వద్దని బ్రాహ్మణుల పిల్లలాగ పెళ్లి చేసుకుంటానని తల్లికి తెగేసి చెప్పింది. ఆమె ఎంత మొత్తుకున్నా తల్లి పోషకుణ్ణి కుదర్చడంతో నాగలక్ష్మి ఇల్లు విడిచి మద్రాస్ పారిపోయింది. అక్కడ విశ్వనాథన్ అనేపత్రికా సంపాదకుడు ఆమెకి ఆశ్రయమిచ్చాడు. ఈలోగా నాగలక్ష్మిని వెతుక్కుంటూ ఆమె అన్న రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి ఆమెను తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. సినిమా వాళ్ళ సాయంతో విశ్వనాథన్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. కట్టుకున్న భార్య చనిపోవడంతో విశ్వనాథన్ నాగలక్ష్మిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెకు పుట్టిన  పిల్లల్ని బ్రాహ్మణులుగా సమాజం అంగీకరించదనే భయంతో ముందుగానే కుటుంబ నియంత్రణ  ఆపరేషన్ చేయించుకున్నాడు. కాబట్టి నాగలక్ష్మి మొగుడి పిల్లల్ని తన పిల్లలుగా పెంచింది. పాపం ఆ విషయం నాగలక్ష్మి తల్లి కుముదవల్లికి తెలియక నాగలక్ష్మికి సంతానం కలగాలని తపిస్తుంది. విశ్వనాథన్ ప్రవర్తనలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. ఆమెనూ ఆమె ఇష్టాలనూ గౌరవిస్తాడు. ఓ పక్క పురుషాహంకారంతో ఆమెపై పెత్తనాన్ని చలాయిస్తాడు. మరోపక్క ఆమె సంగీత సామ్రాజ్నిగా ఎదగడానికి సహకరిస్తాడు. తన ఉద్యోగం మానేసి నాగలక్ష్మితో సినిమా తీశాడు. నాగలక్ష్మి, సినిమా పూర్తయిన వెంటనే సంగీత కచేరీలు చేసుకోవాలని అనుకుంది. కానీ అతను ఆమెని మభ్యపెట్టి మరో సినిమాకి కాంటాక్ట్మీద సంతకాలు పెట్టించుకున్నాడు. సినిమా కాదని వెళ్ళిపోతే ఆమె తల్లి కుముదవల్లి  మళ్ళీ పోషకుడి దగ్గరికి పంపిస్తుందని భయపెట్టాడు. నాగలక్ష్మి సినీతారగా తారాస్థాయికి చేరింది.

ఆర్ధికస్థితి సామాజికస్థితిని నిర్ణయిస్తుందనే మాట నాగలక్ష్మి విషయంలో రుజువైంది. పూర్వం ఆమె సమాజం దృష్టిలో అంటరాని స్త్రీ. కానీ ఆర్ధికహోదా కలకత్తాలోని బ్రాహ్మణ దంపతులతో కాళ్లకు నమస్కారం చేయించుకునే స్థాయికి తెచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయడం కోసం సంగీతకచేరీలు చేసింది. దేశానికి స్వాతంత్రం వచ్చినపుడు విశ్వనాథన్ వారం రోజులపాటు రేడియోలో నాగలక్ష్మి పాడిన దేశభక్తి గీతాలువచ్చేలా చూశాడు. ఆమెను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకుల దృష్టిని ఆకర్షించాడు. నాగలక్ష్మి నటించిన హిందీ సినిమా వల్ల విశ్వనాథన్ కి భారీగా డబ్బు వచ్చింది. ఖాదీ పేరుతో, గాంధీ పేరుతో, కస్తూరిబా పేరుతో ఉన్న సంస్థలన్నిటికీ నాగలక్ష్మిని అనధికార ఆస్థాన గాయనిని చేశాడు. పద్మభూషణ్ వచ్చేలా చేశాడు. ఆమె పేరసంగీత పురస్కారం ఏర్పాటయింది. నాగలక్ష్మిఇల్లు కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిపేటంత పెద్ద భవనం అయిపోయింది. నాగలక్ష్మి విశ్వనాధ్ లు తమ ఇద్దరి కూతుళ్ళకి పెళ్లిళ్లు చేశారు. వాళ్లు వీరిద్దరికీ షష్టిపూర్తి చేశారు. విశ్వనాథన్ మరణించాక నాగలక్ష్మి సంగీత సన్యాసం తీసుకుని, కొన్నాళ్లకు భౌతిక దేహాన్ని విడిచిపెట్టింది.

మరకతవల్లి కుముదవల్లి రెండో కూతురు. ఈమెకు వాళ్ళక్కలాగా సంగీతం పిచ్చి లేదు. అందుకే కుముదవల్లి తనకంటే వయసులో పెద్దవాడూ గొప్ప ధనవంతుడూ అయిన అయ్యంగారిని కూతురికి పోషకుడిగా కుదిర్చింది. అప్పటికే అతనికి మరకతం కంటే పెద్దవాడైన ఒక కొడుకూ మరకతం వయసున్న ఇద్దరు కూతుళ్ళూ ఉన్నారు. అతను మరకతానికి సకల రాజభోగాలు అమర్చాడు. కానీ కొన్నాళ్ళకి వ్యాపారాలు దివాలా తీసి అప్పులపాలయ్యాడు. అప్పిచ్చిన వాళ్ళు అతన్ని కోర్టుకు ఈడ్చారు. చివరికి అతని భార్య పిల్లలు ఆస్తిపాస్తుల విషయంలో అతనిపై కేసులు పెట్టారు. అయ్యంగారి వల్ల మరకతానికి సంతానం కలగలేదు. అతను బతికుండగానే కొంత ఆస్తి రాయించుకోమని ఆమె తల్లిపోరు పెట్టింది. చివరకు మరకతం న్యుమోనియాతో చనిపోయింది.

దండపాణి కుముదవల్లికి మొదటి సంతానం. ఇతనిది వినసొంపైన స్వరం. ఎక్కడ ఏ సభ జరిగిన అతనితోనే ప్రార్థన చేయిస్తారు. మృదంగం కూడా బాగా వచ్చు. కానీ అలాంటివన్నీ మానేసి తాలూకా ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగంలో చేరాడు. మొదటి భార్య ప్రసవ సమయంలో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి చనిపోయింది. అతని రెండో భార్య కనకరంజని. ఆమెకు ముగ్గురు కొడుకులు. అతను భార్యను బయటకి అడుగుపెట్టనివ్వడు. ఉద్యోగంలో రిటైయ్యాక కొన్నాళ్లకు లక్కవాయువుతో చనిపోయాడు. మిగిలిన 27 పాత్రలూ  ప్రాసంగికంగా వచ్చినవే కాలాను గుణంగా వచ్చిన రాజకీయ సామాజిక మార్పులు దేవదాసీల జీవన విధానంలో తెచ్చిన మార్పులను కూడా రచయిత కథతో పాటు చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ వాళ్ల కాలం వచ్చాక మధురైలో అయ్యర్లు దేవదాసీలను రెండో భార్యగా చెప్పుకోవడానికి భయపడే పరిస్థ్తితి వస్తుంది. ఒకప్పుడు దేవదాసీల ఇంటికి రహస్యంగా రాకలు రాకపోకలు సాగించిన  పోషకులు కాలం గడిచాక తమవల్ల ఆ దేవదాసీలకు పుట్టిన పిల్లలను తమ ఇంటికి కూడా తీసుకెళ్లేవారు. తన వెంటబడిన సంగీత విద్వాంసుడిని పోషకుడుగా అంగీకరించనని, శాస్త్రోక్తంగా పెళ్లిచేసుకోవాలని కచ్చితంగా  తేల్చి చెప్పి తన మాట నెగ్గించుకుంటుంది కళారంజని అనే దేవదాసి. బ్రాహ్మణ వర్గాలపై తిరగబడిన పెరియార్ రామస్వామి, దేవదాసీ వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్యమించిన డా. ముత్తులక్ష్మీరెడ్డి, ఓ పక్క దేవదాసి రద్దు చట్టానికి అడ్డుపడుతూ ఆ చట్టం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోని బ్రాహ్మణ నాయకుల ప్రస్తావన ఈ నవలలో వస్తాయి. మూకీలు టాకీలవడం, గుడారాల సినిమాలు టూరింగ్ టాకీసులుగానూ, థియేటర్లుగానూ మారేక్రమం, స్వాతంత్ర సమరం, జాతీయ కాంగ్రెస్, రెండో ప్రపంచ యుద్ధం, హిందీ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్రసాధన, రాష్ట్ర విభజన వంటి అంశాలన్నీ ఇందులో రేఖామాత్రంగా కనిపిస్తాయి. మద్రాస్ అనే పదం ఎలా వచ్చిందో, చిత్తూరులోని నీవా నదికి ఆపేరెలావచ్చిందో చెప్పారు.

చిత్తూరు, తంజావూరుస్థానిక చరిత్రతో బాటు దేవదాసీల నాట్యశిక్షణ సంప్రదాయాలు కూడా ఈ నవలలో ఉన్నాయి. అక్షరాలు నేర్పే గురువుల్లాగే నాట్యం నేర్పే గురువులు కూడా శిష్యులను శిక్షిస్తుంటారు. (వరలక్ష్మి అనే దేవదాసికి) మెడ నేరుగా పెట్టడం లేదని ఆమె గురువు నెల రోజులకు పైగా ఇసుక బస్తా తల మీద పెట్టి నాట్యం చేయించాడు. చేయి సక్రమంగా వంగడం లేదని నిప్పుతో కాల్చాడు. వరలక్ష్మి అమ్మగాని అమ్మమ్మగాని ఆ గురువుని అడ్డుకోలేదు. దేవదాసీలు నిత్యసుమంగళులని విశ్వాసం. అందుకే బ్రాహ్మణ వైశ్య కుటుంబాల పెళ్ళిళ్ళలో దేవదాసీతాళిబొట్టులోంచి గురివింద గింజంత తీసుకుని వాళ్ళ తాళిబొట్లలో కలుపుకుంటారు. దేవదాసీలు చనిపోయినపుడు ప్రత్యేక సంప్రదాయాలు పాటిస్తారు. గుడిలో అమ్మవారికి కట్టిన చీర తెచ్చి కప్పుతారు. అరిటాకుల్లో తెచ్చిన పసుపు కుంకుమల్ని శవం ముఖంపై చల్లుతారు. బూడిద రంగు వస్త్రాన్ని తలకు చుడతారు. దేవదాసులంతా బొంగురు పోయిన గొంతులతో అర్థం కాని పాట పాడుతూ శవ యాత్ర జరుపుతారు.

రచయిత ప్రాంతీయ భాష వాడటం అభినందించదగిన విషయమే కానీ ఫుట్ నోట్ లో వివరణ లేకపోతే కొన్ని మాటలు అర్ధం కావు. అనవరించు (బుద్ధిచెప్పు), చిత్రి (చైత్రమాసం) జంబము (బడాయి), తళిగ (దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఆహారం), దాయాలాట (పాచికలాట, గవ్వలాట), నట్టువకార్లు (నాట్యగురువులు), ముదిగారం (గారాబం) లక్క వాయువు (పక్షవాతం), లాయికి (తగినది), వరుమానం (ఆదాయం) వంటి పదాలు నిఘంటువుల్లో దొరికినా బాసాలి, పలాస్త్రము, పూనా పంగాడు, నాలీసుబహుమానాలు, పొట్టుకట్టు ఉత్సవం, ప్రాయోజితము, తంగము, మహిడీ, సంచితము, మత్తేబులు, తొక్కడాలు వంటి మాటలకు అర్ధాలు స్థానికేతరులకు అర్ధం కావు. సందర్భానుసారంగా ఊహించుకోవాల్సిందే. కొన్ని పాత్రల సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటే ఈ నవల 440 పేజీలు  అయ్యేది కాదు.

చంద్రుడిలోని మచ్చలను పట్టించుకోకుండా వెన్నెల చల్లదనాన్ని అనుభవించాలంటారు. అలాగే  ఇలాంటి చిన్న చిన్న విషయాలను వదిలేసి నవలలోని గొప్పతనాన్ని ఆస్వాదిద్దాం. ఒక సాంఘిక దురాచార చరిత్రను సామాన్య పాఠకులను ఆకట్టుకునే  సృజనాత్మక ప్రక్రియగా తీర్చిదిద్దిన రచయిత  ప్రశంసనీయుడు. ‘మంచి గతమున కొంచమేనోయ్’ అన్న గురజాడ మాటలను విశ్వసించే వాళ్లంతా చదవాల్సిన నవల ‘మనోధర్మ పరాగం’

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.