విక్టోరియా రాణి స్మారక చిహ్నం

-డా.కందేపి రాణి ప్రసాద్

యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండు దేశాల రాణి క్వీన్ విక్టోరియా అత్యధిక కాలం పరిపాలన సాగింది. 1837 వ సం.. నుండి 1901 లో ఆమె మరణించేంత వరకూ రాణిగా కొనసాగింది. 1857 వ సం..లో సిపాయిల తిరుగుబాటు తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి క్రౌన్ కు భారతదేశం మార్చబడింది. ఈ సమయంలో గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయిగా పిలవడం మొదలైంది. 1877 వ సం.. నుండి 1901 దాకా రాయల్ టైటిల్స్ చట్టం ప్రకారం విక్టోరియా రాణి భారత దేశ సామ్రాజ్ఞిగా మారింది. ఈమె పేరు మీదనే విక్టోరియన్ యుగం అనే పేరు కూడా వచ్చింది. భారత దేశ సామ్రాజ్ఞిగా పేరు పొందిన బ్రిటన్ మహారాణి మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్ధంగా తాజ్ మహల్ లాంటి అద్భతమైన కట్టడాన్ని కోల్ కత్తాలో నిర్మించాలనుకున్నారు. అలా పాల రాతితో తయారైన కట్టడాన్ని తాజ్ మహాల్ కన్నా అద్భుతంగా కట్టాలని ప్రయత్నించారు. కేవలం నాలుగు అడుగుల 11 అంగుళాల ఎత్తుతో ఉండే విక్టోరియా రాణి  63 సం..ల ఏడు నెలలు అత్యధిక కాలం పరిపాలన సాంగించింది. విక్టోరియా రాణి జ్ఞాపకార్థం నిర్మించిన ‘విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్’ గురించి తెలుసుకుందాం!

విక్టోరియా రాణి మరణానికి స్మారక చిహ్నంగా నిర్మించిన విక్టోరియా మహల్ కు ఆలోచన 1901వ సం..లో ఆమె మరణం తర్వాత పడింది. పునాది రాయిని 1906 వ సం..లో వేల్స్ యువరాజు వేశారు. ఆనాటి భారత వైశ్రాయి లార్డ్ కర్జన్ పర్యవేక్షణ ఈ నిర్మాణం మొదలయింది. ఈ మహల్ కట్టడాన్ని గమనిస్తే, బ్రిటిష్ వారి వైభవం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. లోపల ఉన్న అనాటి ఫిరంగులు, కత్తులు, చిత్రాలు, చిహ్నాలు, సంగీత వాయిద్య పరికరాలు, శిల్పాలు చూస్తే ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఒక్కొక్క సన్నివేశాన్ని గుర్తు చేస్తాయి.

నేను ఇంతకు ముందు ఈ ప్యాలెస్ ను రెండుసార్లు చూశాను. అయినా మళ్ళీ కలకత్తా వెళ్ళగానే మొదటగా ఈ విక్టోరియా మహల్ కే వెళ్ళాను. ఎన్ని సార్లు చూసినా ఆ పాలరాతి మెరుపులు శిల్పి చెక్కిన శిల్పాల నునుపుదనం, కోట గోడల గంభీరత్వం చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. తాజ్ మహల్ కన్నా అద్భుతంగా కట్టాలని పోటిపడి కట్టించిన మహల్ ఇది. ఈ సారి మాత్రం ఎప్పుడూ లేనంత రష్ గా ఉన్నది. అందులోనూ సాయంత్రం నాలుగ్గంటల సమయంలో వెళ్ళటం వలన మూసే సమయం మించి పోకుండా చూడాలకి ఆరాట పడ్డాం. సాయం సంధ్య వెలుగుల్లో మకరానా పాల రాయి కట్టడం తెల్లదనం మెరుస్తూ కనిపిస్తున్నది.

హుగ్లీ నది ఒడ్డున రాచరిక దర్పంతో ఠీవిగా నిలబడ్డ మహల్ ప్రముఖ ఆర్కిటెక్ట్ సర్ విలియం ఎమర్సన్ ఈ మహల్ ను మొగల్ ఆర్కిటెక్ట్ స్టైల్ తో ఇండో శార్సినిక్ రూపంలో నిర్మించాడు. 1906 జనవరి 4వ తేదీన శంకుస్థాపన జరిగింది. 1921వ సం.. దాకా ఈ నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. గోపురం, మిగిలిన నిర్మాణాలన్నీ కూడా తాజ్ మహల్ నిర్మాణాన్ని పోలి ఉంటాయి. ఔరంగాబాద్ లోని రాణి కా మక్టరా కోట కూడా తాజ్ మహల్ నే పోలి ఉంటుంది. తాజ్ మహల్ నిర్మాణం చాలా మంది రాజుల మనసు చూరగొన్నది. ఈ మహల్ కట్టడం సాగుతూ ఉండగానే భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి ఆనాటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్-V ప్రకటించాడు. అలా బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిపోయింది.

లేటయిపోతుందనే హడావిడిలో చూసుకోకుండా వెళ్ళి లైనులో నిలబడ్డాం నేను నాఫ్రెండ్. తీరా దగ్గరకు వచ్చాక గానీ తెలియలేదు. టికిట్ తీసుకోవాలని. మళ్ళీ బయటకు వచ్చి టికెట్ తీసుకుని మరల లోపలికి వెళ్ళాము. ఫుట్ పాత్ లు కాకుండా మధ్యనున్న ఖాళీలో నువుటి చిన్న చిన్న పాలరాళ్ళతో నింపారు. లోపలికి వెళ్ళగానే పెద్ద సింహాసనం మీద ఆసీనులై ఉన్న విక్టోరియా రాణి విగ్రహం ఉంటుంది. దాదాపు 20,25 అడుగుల ఎత్తులో ఉన్నది. దూరం నుంచి మహాల్ ను చూస్తుంటే నాకు మైసూరు ప్యాలెస్ కూడా గుర్తుకు వచ్చింది. చుట్టూ మినార్లు ఉన్నాయి. గార్డెన్ కు వేరే టికెట్, మహల్ చూడటానికి వేరే టికెట్ తీసుకోవాలి. గార్డెన్ టికెట్ తీసుకొని వాకింగ్ చేసేవారు, పిల్లలను ఆడించుకునేవారు కనిపించారు. దీనిని మ్యూజియం అని కూడా అనవచ్చు. రాజ భవనం వాడిన వస్తువులన్నీ ఇక్కడ చూస్తాము. సంఘ సంస్కర్తలైన రాజారామమోహన్ రాయ్, పండిత మదన్ మోహన్ మాలవ్య చిత్ర రంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహానుభావుల తైలవర్ణ చిత్ర పటాలున్నాయి. వాటితో పాటు వారి గురించిన వివరాలు పటాల కింద ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ భాషల్లో రాసి ఉన్నాయి. ప్రతి సోమవారం, శలవు దినాల్లో మూసేస్తారట. రవీంద్ర సదన్ మెట్రో స్టేషన్ కు ఒక కిలో మీటర్ దూరంలో ఉన్నది. ఇంతకు ముందు ఈ కట్టడాన్ని చూడటానికి వచ్చినపుడు కలకత్తా జామకాయలు అమ్ముతూ ఒక బండి కనిపించింది. ఆ కాయలు చూసి నోరూరి కాయను కొని ముక్కలు కోయించుకుని తింటూ లొపలికి వెళ్ళాం. అంతకు ముందు అంటే 2005లో వచ్చినపుడు జర్మన్ సిల్వర్ గొలుసులు, చెవి లోలాకులు అమ్ముతూ తిరిగే వ్యక్తి వెంట పడటంతో ఆ గొలుసులు కొన్నాం. బట్టతో తయారైన విసన కర్రలు కూడా బలవంతగా అంటకట్టాడు.

ఇందులో దాదాపు 20 వేల వరకూ తైలవర్ణ చిత్రాలు, మామూలు పెయింటిగ్సూ ఉన్నాయి ఇంకా మ్యూజియంలలో ఉండే ఆ కాలపు నాణేలు, స్టాంపులు, పటాలు, చిత్రాలు, వస్తువులు ఉన్నాయి. ఈ మహాల్ లో మొత్తం 25 గ్యాలరీలు ఉన్నాయట. కానీ అన్నిటినీ చూడనివ్వడం లేదు. కొన్ని రూములకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. నేను 2013లో చూసిన రూముల కన్నా తక్కువే ఉన్నాయని అనిపించింది. శిల్పకళా గ్యాలరీ, ఆయుధాల గ్యాలరీ, సెంట్రల్ హాల్, రాయల్ గ్యాలరీ, కలకత్తా, గ్యాలరీ, పోర్టయిట్ గ్యాలరీ వంటివి ఉన్నాయి. ఈ కట్టడం కట్టక ముందు ఇక్కడ ప్రెసిడెన్సీ జైలు ఉండేదట. ఈ స్మారక చిహ్మన్ని నిర్మించాలని నిర్ణయించుకోవడంతో ఆ జైలును కూల గొట్టేసి జైలును అలీపూర్ కు మార్చారట. ఈ అద్భుత కట్టడానికి నిధులు విరాళాలు భారతీయులు ఇచ్చినవే కొంతవరకు మాత్రమే బ్రిటీషు ప్రభుత్వం నిధులు సమకూర్చి ఇచ్చిందట.

ఈ మహల్ గోపురంపై ‘ఏంజెల్ ఆఫ్ విక్టరీ’ బొమ్మను ఏర్పాటు చేశారు. పెద్ద బాల్ బేరింగులపై అమర్చబడిన ఈ బొమ్మ గాలికి ఊగుతూ ఉంటుంది. ఈ బొమ్మ 3500 కిలోల బరువుతోనూ ఐదు మీటర్ల ఎత్తుతోనూ ఉంటుంది. ఇది విక్టోరియా రాణి యొక్క నల్లని కాంస్య విగ్రహం. ఈ విగ్రహం చేతిలో ట్రంపెట్ లాంటి చిన్న వాయిద్య పరికరం ఉంటుంది. యుద్ధంలో సైనికులకు సూచనిచ్చేందుకు ఈ వాయిద్యాన్ని వాడతారు. విగ్రహం కాళ్ళ వద్ద వాల్ బేరింగులు ఉండటం వలన ఈ బొమ్మ గాలికి కదులుతూ ఉంటుంది. ఈ కోటకు దక్షిణాన కలకత్తా, మైదానం ఉన్నది ఈ మైదానం 64 ఎకరాలలో వ్యాపించి ఉన్నది. ఇక్కడ చక్కగా గడ్డి పెంచబడి ఉంటుంది. ప్రతినిత్యం వాకింగ్ చేసే వాళ్ళతో సందడిగా ఉంటుంది. ప్రశాంతంగా, ఆహ్లాద కరంగా ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు.

పూర్వ కాలంలో డ్రైవర్లే గైడ్ గా మారి అన్ని విషయాలూ చెప్పేవారు. అప్పట్లో నెట్ లేకపోయినా నాకీ విషయాలన్నీ డ్రైవరే చెప్పినట్లు గుర్తు, నిన్న మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్  విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ కు వెల్దామ్ అని చెప్తే అది ఎక్కడ నాకు తెలియదు అన్నాడు. మనం వెళ్ళే రోడ్డులో చూడాల్సిన ప్రదేశాలున్నా చెప్పటం లేదు. కలకత్తాలో మంచి చీరలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే “మీ ఆడవాళ్ళ చీరల గురించి మాకెలా తెలుస్తాయి” అన్నాడు. ట్రావెల్స్ నుంచి కారును వారం రోజులు బుక్ చేసుకుంటే డబ్బులు తీసుకోవడం తెలుసు గానీ ఒక్క దర్శనీయ స్థలం గురించీ చెప్పలేదు. పూర్వం టూర్లకు వెళ్ళినపుడు అన్ని విషయాలూ చెపుతూ మాకు చక్కని దర్శనీయ స్థలాలు చూపించిన డ్రైవర్ల పోటోలు తీసుకుని మా ఆల్బమ్ లో పెట్టుకున్నాం. అదీ వారి నిబద్ధత. ఇప్పుటి వాళ్ళంతా పని దొంగలు. పని చేయడం ఇష్టం లేదు గానీ డబ్బులు మాత్రం కావాలి ఏది అడిగినా “అక్కడ పార్కింగ్ దొరకదు. ఈ టైమ్ లో చాలా రష్ ఉంటుంది. అది చాలా దూరం” అంటూ అన్నీ అబద్ధాలే చెప్పి యాత్రికుల చూడాలన్న కోరికను చప్పబరిచే డ్రైవర్లే ఉన్నారు. పార్కులు, జూపార్కులు చూడమని మాత్రం చెబుతారు. వాటిని చూసే సరికి సాయంత్రం అవుతుంది. హాయిగా చెట్టు కింద కూర్చుని నిద్ర  పోవచ్చని ఆలోచనే గానీ వేలకు వేల డబ్బులు తీసుకుంటున్నాం పనిచేయాలని ఉండదు. ఇలాంటి డ్రైవర్లతో మన ఉత్సాహం చచ్చిపోతుంది. దారే తెలియదని అబుద్ధమాడే వాళ్ళు ఆ ప్రదేశం గురించి ఏమి చెబుతారు అప్పట్లో టిక్కెట్లు తీసుకునీ మనతో పాటు లోపలికి వచ్చి ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళ కూడదో అన్ని విషయాలూ వివరించి చెప్పేవారు. ఇప్పట్లో నాకెవరూ అలా కనిపించ లేదు.

విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ వద్ద సాండ్ అండ్ లైట్ షోల ద్వారా చరిత్రను తెలుపుతున్నారు. అది గంట సేపు పడుతుందని మేము ఉండలేకపోయాం. మొఘల్  శైలిలో గోపురాలు అందంగా తీర్చి దిద్దారు. తాజ్ మహల్ కూడా ఇండో సార్సినిక్ పునరుజ్జీవన నిర్మాణ శైలిలోనే ఉండటం వల్ల దీనికి కూడా తాజ్ మహల్ పోలికలున్నాయని అంటుంటారు. 19వ శతాబ్దం నాటి పడవల మోడల్ ను కూడా చూశాం. లోపలున్న తైలవర్ణ చిత్రాలలో ఏనుగుల అంబూరీపై ఊరేగింపుగా వెళుతున్న రాజుల చిత్రం అతి పెద్దదిగా ఉన్నది. విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ మోడల్ కూడా అద్భుతంగా గాజు పెట్టెలో భద్రపరచబడి ఉన్నది. సైనిక దుస్తులు వేసుకున్న జార్జి.వ. అనే అతని ప్రతిమ పాలరాతితో చెక్కి హాలులో ప్రతిష్టించబడి ఉన్నది. విక్టోరియా మనవడు వేల్స్ యువరాజు పేరు ప్రిన్స్ జార్జి అని రాసి ఉన్నది. బహుశ అతను యువరాజు జార్జి కావచ్చేమో. అక్కడున్న వస్తువుల్లో మొదటి పర్షియన్ గల్ఫ్ కేబుల్ కనిపించింది. టెలిగ్రాఫిక్ పరికారాలు మ్యూజియంలో చాలా కనిపించాయి.

సంఘ సంస్కర్త బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ పెద్ద తైల వర్ణ చిత్ర పటం ఉన్నది. 1924లో కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా ఎన్నికైన దేశబంధం చిత్తరంజన్ దాస్ తైలవర్ణ చిత్ర పటం పెద్ద సైజులో ఉన్నది. ఈ ఇండియా కంపెనీని బ్రిటిష్ ఇండియాగా మార్చడానికి కృషి చేసిన రాజ తంత్రజ్ఞుడు రాబర్ట్ క్లైవ్ విగ్రహం కూడా మెయిన్ హాల్లో ప్రతిష్టించబడి ఉన్నది. ఆ కాలం నాటి మత గ్రంధాలను ఒక గాజు అరలో భద్రం చేశారు. బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కీ మధ్య జరిగిన ప్లాసీ యుద్ధపు చిహ్నాలన్నీ ఇక్కడ చూడవచ్చు. 1757వ సం.. జూన్ 23వ తేదీన జరిగిన ప్లాసీ యుధ్ధంలో వాడబడిన కృపాణములు శిరస్త్రాణములు వంటి రక రకాల యుద్ధ సామాగ్రిని ఇక్కడ చూడవచ్చు. ప్లాసీ యుద్ధంలో సైనికులు నిలుచున్న మోడల్  సైతం కనిపించింది. కత్తులు, ఢాల్ లు చాలా ప్రదర్శనలో ఉన్నప్పటికీ ఇంకా చాలా రూములను మూసివేశారు. ఇలాంటి కట్టడాలను దర్శించటం వల్ల ఆనాటి శిల్పుల సృజనాత్మకతను, కళా నైపుణ్యాన్ని వీక్షించవచ్చు.

చారిత్రాత్మక మైన, కళాత్మకమైన పాలరాయి కట్టడమైన విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ ను చూడడం ఆనందంతో పాటు విజ్ఞాన దాయకం కూడా. మొఘల్ శైలులతో పాటుగా రాజ పుత్రుల శైలి అయిన పాలరాయి వాడకం కూడా ఈ మహల్ లో కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ అద్భుత కట్టడాన్ని చూడడం సంతోషంగా అనిపించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.