వ్యాధితో పోరాటం-38

కనకదుర్గ

ఇలా తమకు వీలైనంత వారు సాయం చేసే వారిని చూస్తే రక్తసంబంధీకులే కుటుంబ సభ్యులు కానక్కర్లేదు, మన కష్టం అర్ధం చేసుకుని ముందుకు వచ్చి సాయం చేయడానికి వచ్చే వారంతా మన కుటుంబం వారే అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మనకి అవసరం వున్నపుడు కాక అంతా సద్దుకున్నాక దేశం చూడడానికి రావాలనిపిస్తే వారు కుటుంబ సభ్యులకన్నా మనతో ఏ సంబంధం లేని అపరిచితులనిపిస్తుంది. నాకు ఇంత మంచి స్నేహితులు దొరికినందుకు సంతోషమనిపిస్తుంది. వీళ్ళే లేకపోతే మేము ఇంత పెద్ద ఆరోగ్య సమస్య నుండి ఎలా బయటపడేవాళ్ళమో కదా అనిపిస్తుంది.

మాది రెండు బెడ్రూం అపార్ట్మెంట్ అయినా, ఈ సమయంలో అందరం ముందు లివింగ్ రూంలోనే పడుకునేవాళ్ళం. చైతన్యకి తన రూమ్లో పడుకోవడం అలవాటయినా, నేను హాస్పిటల్స్ కి వెళ్తున్నప్పటి నుండి శ్రీని లివింగ్ రూంలో కిందనే పక్కలేసి పిల్లలిద్దరినీ పడుకోబెట్టి తనూ పడుకునేవాడు. రాత్రయ్యిందంటే చాలు పక్కలేసుకుని పాపని దానిమీద వదిలి పెడితే పక్కమీద అంతా పాకుతూ, చేతులు పైకెత్తి, కింద పెట్టి కాళ్ళ మధ్య నుండి తల పెట్టి గట్టిగా నవ్వుతూ చూసేది. చైతన్య ఒక దుప్పటి పట్టుకుని కింద వేయడానికి ప్రయత్నిస్తుంటే పాప ప్రాకుతూ వచ్చి దాన్ని తన తల పైకి వేసుకుని కిల కిలా నవ్వేది. ఇలా పిల్లలతో సమయం దొరికినప్పుడల్లా సంతోషంగా గడిపేవాళ్ళం. చైతన్యకు ఈ టైమంటే చాలా ఇష్టముండేది, అందుకని రాత్రి భోజనాలయ్యాక డైనింగ్ టేబుల్, కిచెన్ క్లీన్ చేయడానికి సాయం చేసేవాడు. వాడికి అందరూ కల్సి ఆడుకుంటే ఆనందంగా వుండేది.

నా మొదటి సర్జరీ అయ్యింతర్వాత రెణ్ణెలకి అమ్మ వస్తుందని వార్త. ఇక నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అమ్మ పక్కన వుంటే ఎంత ధైర్యంగా ఉంటుంది, పాపని చూసుకుంటుంది, వంటలో సాయం చేస్తుంది. అపుడు శ్రీనికి కొద్దిగానైనా రిలీఫ్ వస్తుంది. మా అక్క వాళ్ళ స్నేహితులు, భార్యాభర్తలు వస్తున్నారంటే వారితో అమ్మ వస్తే కొంచెం సాయంగా వుంటుందని వాళ్ళతో పంపించారు. భర్త అమ్మకి సాయం చేయడానికి ప్రయత్నం చేసినపుడల్లా భార్య అతన్ని లాక్కుని తీసుకెళ్ళేదట. అమ్మకి బయటి తిండి పడదు, వీళ్ళు ఫ్లయిట్స్ లో బ్లాక్ కాఫీ ఒక లోటాతో తాగుతారు. అమ్మకి సరిగ్గా అడగడానికి రాక ఆ కాఫీయే తాగితే అస్సలు పడలేదట. తిండి మాత్రం వెజిటేరియన్ అని రాయించారు కాబట్టి ఏదో కొద్దిగా తిన్నదట. బాత్రూంకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందయ్యిందట. శ్రీని, చైతన్య ఏర్పోర్ట్ కి అమ్మని తీసుకురావడానికి వెళ్ళారు. నేను పాపని చూసుకుంటూ వున్నాను, కాసేపయ్యాక జోన్ వచ్చింది సాయానికి.

చలి కాస్త తగ్గి స్ప్రింగ్ సీజన్ మొదలవుతుంది. అమ్మకి ఈ చలి కూడా ఎక్కువవుతుంది కానీ చలికాలంలో వున్నంత చలి ఇప్పుడు వుండదు. స్నో పడటం కూడా తగ్గింది. చెట్లకి మొగ్గలొచ్చి కొన్ని రోజులయ్యాక పూలు పూచి చూడడానికి రంగు రంగుల ప్రపంచం అందంగా వుంటుంది. చెర్రీ పూలు, పింక్, తెల్ల రంగుల్లో పూసి చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అన్పిస్తుంది. ఎన్నో రకాల పూలు ముందు పూసి ఆ తర్వాత ఆకులొస్తాయి. రోడ్లకటు ఇటు బోల్డన్నీ చెట్లుంటాయి, చెట్టు నిండా పూలు విరబూసి స్ప్రింగ్ సీజన్ వచ్చిందని చాటుతుంటాయి. ఇన్ని రోజులు చలి, స్నోతో లోపల వున్న వారికి పెద్ద జైలులోనుండి బయటకు వచ్చినట్టవుతుంది. అదీ కాకుండా చలికాలం త్వరగా చీకటవుతుంది, ఆలస్యంగా తెల్లవారుతుంది. స్ప్రింగ్ వచ్చినప్పట్నుండి సాయంత్రం కొంచెం ఆలస్యంగా చీకటి పడుతుంది. ఎండాకాలం వచ్చాక రాత్రి తొమ్మిది గంటలవరకు చీకటి పడదు. అమ్మ వస్తే అమ్మను, పిల్లలను తీసుకుని శని, ఆదివారాల్లో బయటకు వెళ్ళొచ్చు.

అమ్మని చూసి నాకు ప్రాణాలు లేచి వచ్చాయి. అమ్మ అన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చిందేమో అలసిపోయి వుంది.

అమ్మ పాపని, చైతన్యని చూసి మురిసిపోయింది. “స్నానం చేసి వచ్చి పాపని ఎత్తుకుంటాను,” అని సూట్కేస్ నుండి బట్టలు తీసుకుంటుంటే చైతన్య సాయం చేసాడు.

“అమ్మా చిన్ని, కొంచెం మంచి కాఫీ కలిపి ఇయ్యమ్మా! తల నొప్పిగా వుంది,” అన్నది అమ్మ.

“కాఫీనా! ఏం తినవా? ఖాళీ కడుపుమీద కాఫీ తాగితే మంచిది కాదమ్మా!” అన్నాను.

“నాకేం తినాలనిపించడం లేదు… కాఫీ త్రాగి కాసేపు పడుకోవాలి,” అంది అమ్మ.

” సరేలే ఒకట్రెండు రోజులు అలాగే వుంటుంది. కాఫీ తాగి పడుకుంటే కొంచెం తెరిపిగా వుంటుంది.” అన్నాడు శ్రీని.

“పాపం అమ్మ ఇంటర్నేష్నల్ ఫ్లయిట్ ప్రయాణం మొదటిసారి, అదీ కాకుండా ఈ ఫారిన్ దేశాల మనుషులను చూసి కల్చర్ షాక్ కూడా అయ్యి వుంటుంది. కొన్ని రోజులు సమయం పడ్తుంది తనకి ఇక్కడ అలవాటు కావడానికి,” అన్నాను నేను.

“అమ్మా, అమ్మమ్మ నా రూంలో పడుకోవచ్చా ప్లీజ్!” అనడిగాడు చైతన్య.

“అవును. అక్కడే పడుకుంటుంది. ఇంకెక్కడ పడుకుంటుంది చెప్పు?,” అన్నాను నేను.

అమ్మ స్నానం చేసి వచ్చి చైతన్య రూంలో కెళ్ళి తలుపేసుకుని చీర కట్టుకుంటుంటే నేను కాఫీ తీసుకెళ్ళాను.

చీర కట్టుకోవడం అయిపోయింది. తలకు కట్టుకున్న టవల్ తీసేసి కుర్చీ మీది వేసింది.

“అమ్మా, కాఫీ తీసుకో,” అని అందించాను. అక్కడే వున్న కుర్చీ మీద కూర్చొని కాఫీ తాగుతుంటే, “చాలా అల్సిపోయావమ్మా!”

“అవునమ్మా. ఏయిర్పోర్ట్ లో చాలా నడవాల్సి వచ్చింది. మాకు తెలియదు కదా! ఇంతింత దూరాలుంటాయని, కొంతమంది పెద్దవాళ్ళు వీల్ చేయిర్లల్లో వచ్చారు. కాళ్ళు నొప్పులొచ్చాయి. ఫ్లయిట్ దిగితే నడవడం, లేదా ఫ్లయిట్లో కదలకుండా కూర్చోవడం, దాంతో కాళ్ళు ఒకటే నొప్పులు.” అని చెప్పింది అమ్మ కాఫీ గ్లాస్ టేబుల్ మీద పెడ్తూ.

“వచ్చినప్పటి నుండి నా గోలే సరిపోయింది. నీకిపుడు ఎట్లా వుందమ్మా? నొప్పి ఏమన్నా కొంచెం తక్కువుందా? అట్లాగే వుందా?” అని అడుగుతూనే లేచి నన్ను గట్టిగా కావిలించుకుంది. “ఇంత సన్నగా అయిపోయావే తల్లీ! హాస్పిటల్స్ లో ఎవ్వరూ లేకుండా ఒక్కదానివే ఎట్లా వున్నావమ్మా?” అని బాధ పడింది. ఇన్నాళ్ళుగా నా మనసులోవున్న బాధ కన్నీటి రూపంలో బయటకొచ్చేసింది. అమ్మ కూడా ఏడవడం మొదలు పెట్టింది.

శ్రీని పాపని ఎత్తుకుని, చైతన్య పరిగెత్తుకొచ్చారు వాడి రూంలోకి.

వాళ్ళని చూడగానే నేను కళ్ళు తుడుచుకున్నాను, అమ్మ కూడా ఏడవడం ఆపింది.

చైతన్య అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, “ఎందుకమ్మమ్మా ఏడుస్తావు? నువ్వొస్తున్నావని మాకెంత సంతోషంగా వుందో తెలుసా! మనమందరం కల్సి మంచి మంచి ప్లెసెస్ కి వెళ్ళి చూద్దాం సరేనా? నువ్వెడవకు అమ్మమ్మా, నువ్వేడిస్తే అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడిస్తే నాకేడుపొస్తుంది….,” అప్పటికే కంట్లోనుండి వచ్చిన నీళ్ళను తుడ్చుకుంటూ.

“ఏడవను నాన్న. అమ్మకు సర్జరీ అయిపోయింది, నిన్ను, పాపను నాన్న, జోన్ ఎంత బాగా చూసుకున్నారు. ఇపుడంతా బాగయిపోతుంది సరేనా? మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది కదా! అందుకే కొంచెం బాధగా అనిపించింది అంతే.” అంది అమ్మ.

అమ్మకి బాగా నిద్రవస్తుంది అప్పటికి చైతన్య బెడ్ పైన పడుకోమని తలుపు దగ్గరికి వేసి మేమంతా బయటికి వచ్చాము.

శ్రీని అమ్మకి జెట్ లాగ్ తగ్గి, పాపకి అమ్మ దగ్గర అలవాటు అయ్యేవరకు జోన్ ని రమ్మందామని అన్నాడు. వంట కూడా తనే చేసి పెట్టేవాడు. నేను కూరలు కోసి ఇచ్చేదాన్ని. నాకు మెత్తన్నం, పులుపు, కారం లేకుండా పప్పు, కూరలు నాకు తీసిపెట్టిం తర్వాత వాటిల్లో పులుపు, కారాలు వేసేవాడు. నేను మామూలుగా తినడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకోసారి బాగుంటుంది, ఒకోసారి, కడుపులో సన్నగా నొప్పి, కడుపులో తిప్పినట్టుగా అవుతుంది. అంటే సర్జరీతో కడుపులో అంత మారిపోయి వుంటుంది, అది అంతా మాని తిన్నది అరగడానికి సమయం పడుతుంది అని మేం అనుకునేవాళ్ళం. మరీ ఎక్కువగా వచ్చేది కాబట్టి తగ్గడానికి సమయం పడ్తుందనే అనుకుంటూ ఉండేదాన్ని.

అమ్మకి జెట్ లాగ్ కొంచెం తగ్గిన తర్వాత, శ్రీని పొద్దున ఆఫీస్ కి వెళ్ళడానికి ఒకరోజు ప్రయత్నం చేసాడు. నేను, అమ్మ, జోన్ ముగ్గురం పాప ఎక్కువ ఏడవకుండా ఉంచాలని మా ప్రయత్నం. మధ్యాహ్నం ఆఫీసుకి వెళ్ళడం అలవాటయ్యింది నేను హాస్పిటల్స్ లో ఉన్నప్పట్నుండి శ్రీనికి. పాప పడుకున్న తర్వాత జోన్ వస్తే తను ఆఫీస్ కి వెళ్ళేవాడు. ఆ రోజు మధ్యాహ్నం పడుకోలేదు. నేను, అమ్మ, జోన్ పాపను ఎత్తుకుని బాల్కనీలో కూర్చున్నాం. శ్రీని రెడీ అయ్యి వచ్చి తను వెళ్తున్నానని చెప్పాడు, అంతే తండ్రిని చూడగానే చెంగున దూకి ఆయన దగ్గరికి వెళ్ళింది, శ్రీని ముద్దు చేసి మా ముగ్గురిలో ఒకరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే తండ్రిని గట్టిగా పట్టుకుని రానంటే రానంటూ మొండిపట్టు పట్టింది. అమ్మా, నేను ఏం చేయాలో తెలియక చూస్తున్నాం. “పోనీ రెపట్నుండి పొద్దున్నే వెళ్ళనా….?” అన్నాడు శ్రీని. జోన్ అడిగింది, ఏంటని. ఇంగ్లీష్లో చెప్పాడు.

“నో, నో, నో… షీ నీడ్స్ టు లర్న్ టు బి విత్ మామ్, గ్రాండ్ మామ్ అండ్ విత్ మీ వెన్నెవర్ యూ నీడ్,” అని గట్టిగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే గుక్కపెట్టి ఏడవసాగింది.

నేను నీళ్ళ బాటిల్ అందించా, శ్రీని కొంచెం సముదాయించి నీళ్ళు పట్టాడు. జోన్ గబుక్కున శ్రీని చేతుల్లో నుండి పాపను లాక్కుని నాకు బయటికి వెళ్దాం అని సైగ చేసి బయటికి వెళ్ళిపోయింది. నేనూ, అమ్మ, శ్రీని ముగ్గురం ఒకటే సారి కిందికి దిగాము. శ్రీని తన కార్ ఉన్న వైపు వెళ్ళాడు, మేమిద్దరం జోన్ వెళ్ళిన వైపు వెళ్ళాము. పాప ఏడుపు ఆపలేదు.

“నేను తీసుకోనా జోన్?,” అని అడిగా.

“నీకు తనని ఎత్తుకొని నడవలేవు. చూడు ఎట్లా ఎగిరి పడుతుందో. కాసేపయితే కామ్ డౌన్ అవుతుంది. అపుడు ఇస్తాను.” అంది జోన్.

రెండు, మూడు రౌండ్స్ తిరిగిన తర్వాత కొంచెం ఊరుకుంది. మేము “హమ్మయ్యా,” అని ఊపిరి పీల్చుకున్నాం.

అమ్మ వచ్చిన తర్వాత జులై నాలుగవ తారీఖున, అమెరికా స్వతంత్రయ దినోత్సవం రోజున పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో, పార్కుల్లో చీకటి పడ్డాక బాణాసంచా పైకి కాలుస్తారు అందరూ క్రింద కూర్చొని, నుంచొని ఆనందిస్తారు. పాపకి ఏడవ నెల ఆ చప్పుళ్ళకు భయపడ్తుందేమోనని చెవుల్లో దూది పెట్టాం, అయినా భయపడితే చప్పుళ్ళు ఎక్కువగా వినిపించని చోట శ్రీని ఎత్తుకుని నిల్చోవడానికి, చైతన్య పాప భయపడకుండా ఆడిస్తానని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఎండలు మొదలయ్యాయి, కానీ ఆ రోజు సాయంత్రం కొంచెం చల్లబడింది. మేము వెళ్ళిన గ్రౌండ్స్ లో మనుషులు మెల్లి మెల్లిగా వస్తున్నారు. గడ్డిలో వేసుకుని కూర్చోవడానికి కొంతమంది చిన్న చిన్న జంపఖానాలు, ఫోల్డింగ్ చేయిర్స్ తెచ్చుకుని వేసుకుని కూర్చుంటున్నారు. మధ్యలో ఒక స్టేజీ మీద లోకల్ ఆర్కెస్ట్రా గ్రూప్ వాళ్ళు పాటలు సంగీత వాయిధ్యాలు వాయించుకుంటూ వాళ్ళు ఆడియన్స్ కి నచ్చే పాటలు అడిగి పాడుతున్నారు. చాలామంది కుటుంబాలతో వచ్చారు. పిల్లలు, బాల్ తో, రాకెట్ బొమ్మలతో…. మధ్యలో ఒక కర్రకు రాకెట్ పెట్టి, కర్రకు చివర ఒక ప్లాస్టిక్ డబ్బాలాంటిది వుంటుంది. దాన్నిపైకి పిల్లలు ఎగిరితే రాకెట్ లేచి పైకి పోతుంది.  పిల్లల, పరిగెత్తుతున్నారు, కొంతమంది తండ్రులు పిల్లలతో కల్సి ఆడుతున్నారు. టీనేజ్ పిల్లలు కూడా పరిగెత్తుతూ అడుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలా మంది అమెరికన్స్ వున్నారు, కానీ మాకు కొన్ని ఇండియన్ కుటుంబాలు కనిపించాయి. ఎండాకాలం కదా! రాత్రి దాదాపు ఎనిమిది గంటల నలభై అయిదు నిమిషాలకు చీకటి పడటం మొదలయ్యి తొమ్మిది గంటలకు పూర్తిగా చీకటి పడింది. అపుడు రంగు రంగుల బాణాసంచా (ఫైర్ వర్క్స్) గాల్లోకి కాలిస్తే పైన రకరకాల డిజైన్స్ లో కనిపిస్తూ అందంగా కనిపిస్తాయి. వాటికి తోడు మంచి సంగీతం పెట్టి ఆ సంగీతానికి తగట్టు బాణాసంచా కాలుస్తారు, అది చూడడానికి కనులవిందుగా వుంటుంది.

ఇదంతా దాదాపు అరగంట వరకుంటుంది. సిటీలో అయితే పెద్ద పెద్ద మ్యూజిక్ ఆర్టిస్ట్స్ వచ్చి బాగా పాపులరైన పాటలు పాడతారు. అక్కడ చాలామంది జనాలొస్తారు, కిక్కిరిసిపోతుంది. చిన్న చిన్న కమ్యూనిటీల్లో చేసేవయితే మరీ అంత జనం వుండరు. ఇక్కడ కూడా బాగానే వస్తారు. కార్లు పార్కింగ్ దూరంగా వుంటుంది. నడుచుకుంటూ అక్కడి దాక వెళ్ళి కార్లు మెల్లి మెల్లిగా ఒకో కార్ వెనక కార్లు పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు వెళ్తాయి. నాకు నడవడం కష్టం అవుతుందని శ్రీని వెళ్ళి కార్ తీసుకుని మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొచ్చాడు. ఇలాగే శని,ఆదివారాలు బయటకు వెళ్ళాలనుకున్నాం. కానీ నా నొప్పి కొద్ది, కొద్దిగా వచ్చేది కాస్త కొంచెం ఎక్కువగా రావడం మొదలయ్యింది. ఈ నొప్పి పాన్క్రియాటిక్ నొప్పి కాదని అనుకున్నారు డాక్టర్లు. మరి నా నొప్పికి ఏం చేయాలంటే నా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పేయిన్ ప్యాచ్ పెట్టుకుని ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. సరేనని ఒక ఆదివారం ఫెన్టనిల్ ప్యాచ్ పెట్టుకుని అందరం కల్సి జూ పార్క్ కి వెళ్ళాము. అది పెట్టుకున్నప్ప ట్నుంచి నాకు తలనొప్పి, తల తిరగడం మొదలైంది. అదే తగ్గిపోతుందిలే, ఇప్పుడు చెబితే చైతన్య నిరాశ చెందుతాడని ఏం చెప్పలేదు. కానీ శ్రీని నన్ను చూసినప్పుడల్లా, “అంతా బాగానే వుందా? ప్యాచ్ తో ఏమైనా అవుతుందా?” అని అపుడపుడు అడుగుతూనే వున్నాడు.

ఎండ బాగా వుంది. నాకు ప్రతి నిమిషానికి తలనొప్పి, కడుపులో తిప్పడం ఎక్కువవుతున్నాయి. అలాగే తిరుగుతున్నాను. పిల్లలకు జంతువులు చూపించుకుంటూ తిరుగుతున్నవారిని చూస్తే నాకన్పించింది, ’చాలా మంది ఈ ప్యాచ్ లు పెట్టుకుని ఆఫీసులకు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు అని డాక్టర్ చెప్పారు. అంటే వారందరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కాబట్టి అన్ని చేయగల్గుతారు. నాకెందుకు అన్ని మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? నేనెందుకు అందరిలా తిరగలేను? అసలు ఈ రోగం నాకెందుకొచ్చింది? సర్జరీ తర్వాత తగ్గిపోయింది అనుకుంటుంటే ఇది ఆ నొప్పి కాదు, మేజర్ సర్జరీ అయ్యింది కదా! లోపలంతా మొత్తం మానడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. అసలు ఆ రోగం నన్నొదిలి పెట్టిందా, లేదా? నీ అంతం చూసేదాక వదలను అని పట్టుకుని ఇంత విసిగిస్తుందా?’ కడుపులో బాగా తిప్పుతుంటే ఒక బెంచీ మీద కూర్చున్నా, వెంటనే పెద్ద వాంతయిపోయింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడ చాలా చోట్ల డస్ట్ బిన్స్ ఉంటాయి. ఎక్కడా చెత్త కనిపించదు ఎందుకంటే అందరికీ సివిక్ సెన్స్ ఎక్కువ ఇక్కడ. నేను శ్రీనితో, ’అయ్యో! ఎలా? ఇట్లా అయ్యింది? ఎవరన్నా క్లీనర్స్ కనిపిస్తారేమో చూడు. లేకపోతే బాత్రూం నుండి పేపర్ టవల్స్ తెచ్చి క్లీన్ చేద్దాం.”

“ఏం కాదు…మనకి తెలియకుండా వస్తే ఏం చేస్తాం? ముందే తెలిస్తే బాత్రూంలోకి పరిగెత్తొచ్చు.” అని మాట్లాడుతుండగానే ఒక క్లీనర్ డస్ట్ బిన్ నుండి చెత్త తీయడానికి వచ్చాడు, అతను నా వాంతి చూడగానే, నేను “అయాం సో సారీ! ఇట్ హాపెన్డ్ సో క్విక్లీ….,” అని చెబుతుంటే, “ఇట్స్ ఓకే! నో ప్రాబ్లెం, ఐ హోప్ యూ ఫీల్ బెటర్!” అని అక్కడ క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. చైతన్య వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అమ్మ, గాబరాగా చూస్తుంది. పాప స్ట్రోలర్లో నిద్ర పోతుంది. ఎండ ఇంకా ఎక్కువయ్యింది.

నేనే,”ఏం చేద్దాం?” అన్నాను.

“ఇంటికి వెళ్దామా చైతన్యా? అమ్మకి బాగాలేదు కదా! కొంచెం ఎండ తక్కువ ఉన్న రోజు వద్దాం. సరేనా?”

“ఏమయిందమ్మా? చేతికి ఏదో మందు పెట్టుకున్నావ్ కదా! అందుకే అట్లా అయ్యిందా?” అన్నాడు చైతన్య.

“దానితోనే ఇట్లా అయ్యిందామ్మా?” అని అమ్మ కూడా అడిగింది.

“ఏమో? నాకు తెలీదు. డాక్టరేమో ఎవ్వరికీ ఏం కాలేదు, నీకు కూడా ఏం కాదు అన్నాడు. ఇంటికెందుకు వెళ్ళడం? నేను ఎక్కడైనా నీడలో కూర్చుంటాను, మీరు వెళ్ళి చూసేసి రండి,” అన్నాను.

“ఏం వద్దమ్మా, ఎండ ఎక్కువగా ఉంది. ఇంకో రోజు ఎండ ఎక్కువగా లేని రోజొద్దాం. ఇపుడు ఇంటికెళ్దాం.” అన్నాడు చైతన్య.

” నిజంగా అంటున్నావా? డిస్సాప్పయింట్ అయ్యావు కదా!”

“ఊ.. కొంచెం డిస్సాప్పయింట్ అయ్యాను. హాలీడేస్ అయిపోయే లోపల మళ్ళీ వద్దాం. ఏం కాదు, చూడు స్ఫూర్తి కూడా ఎంత రెడ్ గా అయిపోయిందో!” అన్నాడు చైతన్య.

“సరే పదండి ఇంటికి వెళ్ళి చల్లగా పడుకుందాం కాసేపు.” అన్నాను.

బయటికి వెళ్ళినపుడు ఒకోసారి బాగానే వుండేది, ఒకోసారి ఇలాంటివి ఏవో జరిగేవి. నాకు జబ్బుకి ముందు ఎంత నార్మల్ గా తిరిగేదాన్నో అలా వుండాలని వుంటుంది. అది లేట్ అవుతున్న కొద్ది నాలో అసహనం పెరిగేది. మళ్ళీ నాకు నేనే సర్ధుకుని చెప్పుకునేదాన్ని.

మొత్తానికి శ్రీని ఆఫీసుకు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు. జోన్ అప్పటిదాకా సాయం చేసింది. ఎపుడైనా అవసరం పడితే వచ్చేది. మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎదురుగానే ఉండేది కాబట్టి ఎపుడు రమ్మన్నా వీలు చేసుకుని వచ్చేది.

అమ్మకి జెట్ లాగ్ పోయింతర్వాత మెల్లిగా పాపను చూసుకునేది, పాప పడుకున్నపుడు తను స్నానం చేసి వచ్చి వంట చేసేది. నేను కూరలు కోసి ఇచ్చేదాన్ని. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇండియాలో వున్న బందువుల గురించి నేను అడుగుతుంటే తను చెప్పేది. ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆ బందువులను చూసి నేను. మేము చందూలల్ బారాదరిలో వున్నపుడు కుటుంబ సభ్యుల్లాగ అయిపోయిన ఇరుగు పొరుగు వారి గురించి, వాళ్ళంతా ఇపుడు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరికి పెళ్ళిళ్ళయ్యాయి, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి, ఎవరికి పిల్లలు పుట్టారు? లాంటి విషయాలు వింటుంటే మళ్ళీ అక్కడకి వెళ్ళి వారందరిని చూడాలనిపించేది. కొంతమంది కాలేజి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడాను. అమ్మ రావడంతో కేవలం జబ్బు గురించి కాక నేను పుట్టి, పెరిగిన ప్రదేశం గురించి, అక్కడి మనుషుల గురించి మాట్లాడుతుంటే కొంచెం మార్పున్నట్టు అనిపించేది.

రోజు భోజనం చేసింతర్వాత మధ్యాహ్నం కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కునుకు తీస్తాం చైతన్య స్కూల్ నుండి వచ్చేవరకు.

ఒకరోజు  పడుకుందామనుకుంటున్నాం కడుపులో నొప్పిగా అనిపించింది. పడుకుంటే తగ్గిపోతుందనుకున్నాను. కానీ….వీపులో నుండి ఒక కత్తితో మెలి పెట్టి తిప్పుతున్న ఫీలింగ్, భయంకరమైన నొప్పి తట్టుకోలేక గట్టిగా అరిచాను. అమ్మ అప్పుడే పడుకోబోతున్నది, “ఏమయిందమ్మా?” అని తల పై చేయి పెట్టి అడిగింది. “నొప్పి… నొప్పమ్మా! చంపేస్తుందమ్మా! శ్రీనికి ఫోన్ చేయాలి… హాస్పిటల్ కి వెళ్ళాలి..” అన్నాను ఏడుస్తూనే. ఈ గొడవకి పాప లేచింది. అమ్మ వెళ్ళి పాపని ఎత్తుకుంది. ఊరుకోబెట్టటానికి ప్రయత్నిస్తుంది, అటు చంటి పిల్ల, ఇటు కన్న కూతురు నొప్పికి మెలి తిరిగిపోతూ,”అమ్మా నొప్పమ్మా! చిన్నప్పటి నుండి నా తల్లికి ఇంతలా నొప్పి ఎప్పుడూ రాలేదు. అసలు ఈ జబ్బేమిటో దీనికి ఎందుకు వచ్చిందో,” బాధ పడ్తుంది అమ్మ.

ఫోన్లో నేను, “నేను అంబులెన్స్ కు ఫోన్ చేస్తాను, నువ్వొచ్చేవరకు నేనాగలేను. నువ్వు డైరెక్ట్ గా హాస్పిటల్ కి రా!…”

“మరి అమ్మ ఇంట్లో ఒకతి ఉంటుందా?”

“చైతన్య వస్తాడు ఇపుడు… నువ్వు పెట్టేయ్…నేను అంబులెన్స్ కి కాల్ చేస్తాను….”

“నువ్వు ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టు నేనొచ్చేస్తున్నాను. బయల్దేరాను….” అని ఫోన్ పెట్టేసాడు.

“హలో నేనంత వరకుండలేను ప్లీజ్…. పెట్టేసావా?”

“తనే తీసుకుపోవాలనుకుంటాడు… చెప్పకుండా అంబులెన్స్ కి ఫోన్ చేస్తే బాధ పడ్తాడేమో అని… నొప్పి… అబ్బా… అమ్మా…తగ్గిందనుకుంటే మళ్ళీ ఈ నొప్పేంటమ్మా?”

తలుపు తీసుకుని చైతన్య లోపలికి వచ్చాడు.

నన్ను చూడగానే, స్కూల్ బ్యాగ్ పడేసి, ” ఏమయ్యిందమ్మా? మళ్ళీ నొప్పి వచ్చిందా? తగ్గిందన్నారు కదమ్మా!”

నొప్పితో బాధ పడ్తున్న వారిని చూస్తే కుటుంబంలో అందరికీ బాధే.

“అదే నొప్పో, వేరే నొప్పో తెలియదురా… హాస్పిటల్ కి వెళితే తెలుస్తుంది…నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఏదైనా తిను కన్నా!” ఎటు వైపు కూర్చున్నా కుదురుగా కూర్చోరావటం లేదు.

ఇంతలో శ్రీని వచ్చాడు. “నువ్వు, మంచినీళ్ళు కానీ, టీ కానీ తాగుతావా? వెళ్ళిపోదామా? నాకు కూర్చోరావటం లేదు.” అన్నాను తనని చూడగానే.

“నాకేం వద్దు. వెళ్దాం, మళ్ళీ అదే నొప్పిలా ఉందా? అది కాదన్నారూ? చైతన్య అమ్మమ్మకి ఏమన్నా సాయం కావాలంటే చెయ్యి నాన్న, నీ హోంవర్క్ అయ్యాక చెల్లిని ఆడించు…..”

“చాల్లే అప్పగింతలు, నేను చెప్పేసాను అన్నీ, పోదామా?”

“పద పదా, నువ్వే లేట్ చేస్తున్నావ్. నేనెప్పట్నుండి రెడీగా ఉన్నా…”

నాకు బాధ తట్టుకోలేక కోపం వస్తుంది.

నన్ను జాగ్రత్తగా పట్టుకుని క్రిందకి తీసుకెళ్ళాడు, చైతన్య మాకంటే ముందే వెళ్ళి కార్ తలుపు తీసి పట్టుకున్నాడు.

శ్రీని వీలైనంత త్వరగానే తీసుకెళ్ళాడు. అంబులెన్స్ అయితే రెడ్ లైట్స్ దగ్గర ఆగక్కర్లేదు. ఈ రోజ్ ఎక్కువ రెడ్ లైట్స్ రాలేదు, పర్వాలేదు.

ఎమర్జెన్సీకి వెళ్ళాం. పేరు, ఇతర డిటేయిల్స్ రిజిష్టర్ చేయించి నర్స్ దగ్గర చెక్ చేయించుకున్న తర్వాత లోపలికి పంపించారు.

గౌన్ మార్చుకుని, స్ట్రెచర్ బెడ్ మీద పడుకోబెట్టారు. ఎమర్జన్సీ డాక్టర్ వచ్చి నా అరుపులు, బెడ్ పైన పడుకోరాక నొప్పితో నేను పడుతున్న అవస్థ చూసి వెంటనే నొప్పికి ఇంజెక్షన్ ఇమ్మని ఆర్డర్స్ రాసారు. ఒక నర్స్ వచ్చి ఐ.వి కనెక్షన్ పెట్టి, ఐ.వి ఫ్లూయిడ్స్, నొప్పి మందు తీసుకొచ్చింది. ముందు నొప్పి మందు ఐ.వి ద్వారా ఇచ్చింది.

“ఐ యామ్ సారీ ఫర్ యువర్ పేయిన్ డియర్! లెట్స్ హోప్ దిస్ ఇంజెక్షన్ విల్ గివ్ యూ రిలీఫ్.”  ఐ.వి ఫ్లూయిడ్స్ పెట్టి, ” ఐ విల్ కమ్ బ్యాక్ టు చెక్ ఆన్ యూ.” అని వెళ్ళింది.

నేను శ్రీని వైపు చూసాను, ” మళ్ళీ ఇదేం రోగం? నన్ను వదిలిపెట్టదా? నాకింక నార్మల్ జీవితం లేదా?

శ్రీని నా దగ్గరికి వచ్చి, “ఇపుడు బ్లడ్ టెస్ట్స్, సి.టి. స్కాన్ చేస్తారు కదా! అందులో ఏం వస్తుందో చూద్దాం.” నా తల పైన తన చేతితో మెల్లిగా రాస్తూ అన్నాడు.

“నొప్పి తగ్గటం లేదని చెప్పు వాళ్ళకి. నా ప్రాణం పోతుందని చెప్పు…”

“ఇపుడేగా ఇచ్చింది… కొంచెం టైం పడ్తుంది పని చేయటానికి…..”

“నాకు తెలుస్తుంది అది పని చేస్తుందో లేదో మళ్ళీ డోస్ ఎక్కువ చేసి ఇస్తే పని చేయడం మెల్లిగా మొదలవుతుందేమో ….ప్లీజ్ చెప్పు…” అని అరిచాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.