
అప్రమత్తత
-కందేపి రాణి ప్రసాద్
అనగనగా ఒక అడవిలో అనేక మడుగులు ఉన్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉన్నాయి నదులు, చెరువుల వద్ద పెద్ద జంతువులు నీళ్ళు తాగుతాయి. వాగులు వంకల్లో చేప పిల్లలు జలకాలాడుతుంటాయి. చిన్న చిన్న మడుగుల్లో బాతులు, కొంగలు నివసిస్తుంటాయి. పెద్దగా లోతులేని నీళ్ళ వద్ద బాతులు, కొంగలు తమ పిల్లలతో కాపురం ఉంటాయి.
అడవిలోని ఒక మడుగు వద్ద బాతు తన పిల్లలతో నివసిస్తోంది. రోజూ తన పిల్లల్ని వెంట బెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. పిల్లలకు ఆహారం ఎలా తీసుకోవాలో నేర్పిస్తుంది. వేటాడే జంతువుల నుండి ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తుంది. ప్రమాద సమయాల్లో తప్పించుకుని బయట పడే విధానం చెపుతుంది. ఏదైనా తాను చేస్తూ ముందుకు వెళుతుంది.
బాతులకు మెడ పొట్టిగా ఉంటుంది. ఈ బాతులు మంచి నీరు, ఉప్పు నీరు అనే భేదం లేకుండా ప్రతి చోటా బతకగలవు. వీటికి నీటి పక్షులని పేరు కాబట్టి నీటిలోనే జీవిస్తాయి. నీటిలో ఉండడానికి వీలుగా కాళ్ళకు వెడల్పుగా వల లాంటి చర్మం ఉంటుంది. ఇవి మొక్కల్ని కీటకాలని, విత్తనాలని ఏదైనా తినేస్తాయి. అందుకే వీటిని సర్వభక్షక జీవులు అంటారు. పెంపుడు జంతువులుగా ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలలో జీవిస్తాయి.
ఒక బాతు గుడ్లను పొదిగి పిల్లలను చేసింది. తల్లి నీళ్ళలో ఈత కొడుతుంటే పిల్లలు చూసి నేర్చుకుంటున్నాయి. చిత్తడి నేలల్లో నివసిస్తాయి కాబట్టి నేల మీద బాతులు నడుస్తుంటే తమాషాగా ఉంటుంది. తల్లి బాతు పిల్లలను వెనకే తిప్పుకుంటూ అన్ని విషయాలు నేర్పిస్తుంది. పిల్లలన్నీ కలసి ఒకే చోట ఉండాలని కూడా చెపుతుంది. తల్లి మాట పెడచెవిన పెట్టవద్దనీ హిత బోధ చేసింది.
పిల్లలు తల్లి చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నాయి. విష మొక్కల్ని గుర్తించి తల్లి చెపితే వాటిని వదిలేసి వెళ్తున్నాయి. కీటకాల్ని ఒడుపుగా ఎలా పట్టుకోవాలో చెపితే తెలుసుకుంటున్నాయి. వేటగాడి బాణాలు ఎలా తప్పించుకోవాలో తల్లి చెపుతుంటే విన్నాయి.
ఒక రోజు తల్లి తన పిల్లల్ని వెంట బెట్టుకుని అడవి అంతటా తిరుగుతున్నది. పిల్లలు తల్లి వెనకే తిరుగుతూ నేలను కాళ్ళలో పెళ్ళగిస్తూ పురుగుల్ని గింజల్ని తింటూ వస్తున్నాయి. తల్లి అలా వెళుతూ వెళుతూ ఒక వాగు దగ్గరకు వచ్చింది. వాగు నీళ్ళు బండల మధ్య నుంచి జోరుగా పారుతూ ఉన్నాయి. తక్కువ జలధార ఉన్న చోట మెల్లగా నడుస్తూ వెళుతోంది తల్లి. పిల్లలు కూడా అటూ ఇటూ తల తిప్పి చూస్తూ కూడా మరల తల్లి వెనక పరిగెడుతూ ఉన్నాయి. తల్లి వెళ్ళేటపుడు వెనకే పిల్లలంతా వస్తున్నాయా లేదా అని చూస్తూ వెళుతోంది.
కొంచెం దూరం వెళ్ళాక జలధారల వేగం పెరిగింది. అక్కడకు వెళితే నీటికి కొట్టుకు పోయే అవకాశం ఉన్నది. అది గమనించి తల్లి పక్కకు వచ్చింది. తల్లిని చూస్తూ పిల్లలు కూడా పక్కకి వచ్చాయి. అక్కడి నుంచి తల్లి తక్కువ వేగం ఉన్న వైపుకు వచ్చింది. పిల్లలు కూడా గమనించుకుంటూ తల్లి వెళ్ళిన బాటలోనె వస్తున్నాయి.
తీరా అక్కడి కెళ్ళాక అక్కడి నీటి వేగం పెరగడంతో తల్లి గట్టు పైకి ఎక్కింది. తల్లిని చూస్తూ వెళుతున్న పిల్లలు మెల్ల మెల్లగా గట్టును ఎక్కాయి. రెండు పిల్లలు ఎక్కిలేక ఎక్కలేక ప్రయత్నించి చివరకు విజయం సాధించాయి. ఉన్న ఆరు పిల్లల్లో ఐదు బాతు పిల్లలు మెల్లగా ఎక్కగలిగాయి. ఒక్క బాతు పిల్ల మాత్రం తల్లిని చూడకుండా దిక్కులు చూస్తూ నిలబడింది. తల్లి తన తోటి పిల్లలు గట్టుపైకి ఎక్కిన విషయమే గమనించలేదు.
తల్లి ఈ పిల్లను గమనించింది. కానీ పిలవలేదు. మిగతా పిల్లలు చూసి “అమ్మా చెల్లి రాలేదు” అని చెప్పాయి. కానీ తల్లి ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. పిల్లలు కూడా గబగబా అనుసరించాయి కానీ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ తమ చెల్లి రాలేదని భయం భయంగా చూస్తున్నాయి. చెల్లిని పెద్దగా పిలిచాయి. కానీ అది ఎటో చుస్తూ ఉన్నది. చెల్లి కోసం ఆగితే అమ్మ ముందుకు వెళ్ళి పోతుందేమో అని భయపడి పరిగెత్తి వెళ్ళాయి.
తల్లి చాలా ముందుకు వెళ్ళి ఆగింది. అక్కడ ఒక చెట్టు చాటున ఆగింది, తల్లి ఆగగానే పిల్లలు కూడా ఆగాయి. నీళ్ళలో ఆగిన బాతుపిల్ల కాసేపటికి తల తిప్పి చూసింది. అమ్మ, తోబుట్టువులు కనిపించలేదు. ఒక్కసారిగా భయమేసింది. పెద్దగా కేకలు పెట్టింది. ఎవరూ పలకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.
ఎదురుగా కనిపించిన దారి వైపు వెళ్ళింది కొద్దిగా ముందుకు వెళ్ళగానే కొండ అడ్డొచ్చింది. దారి కనిపించలేదు. మరల వెనక్కు తిరిగి వచ్చింది. మరో దిక్కుకు వెళ్ళింది. ఇటువైపు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో వెనక్కు వెళ్ళింది. మరోవైపు వెళ్ళాలని ప్రయత్నించింది. అక్కడ నీళ్ళు వేగంగా పరిగెడుతూ ఒక లోయలోకి పడిపోతున్నాయి. అక్కడ నీళ్ళు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఒక్క క్షణం ఆప్రమత్తంగా లేక పోతే బాతు పిల్ల నీటి ప్రవాహంలో పడి పోయేదే. ఉలిక్కిపడి చూసింది. లోతైన లోయ కనిపించింది. పిల్లకు కాళ్ళు విరిగి పోయాయి అమ్మో ఎంత ప్రమాదం తప్పించుకున్నాను అని భయపడింది. ఎటువైపు వెళ్ళాలా అనే చుట్టూ చూసింది.
చుట్టూ తిరిగి తిరిగి చూసింది తల్లి తోబుట్టువులు ఎటు వెళ్ళారో తెలియలేదు. బాగా భయం వేసింది. కొద్దిసేపు అలాగే ఉండి ఆలొచించింది చుట్టూ చూసినపుడు ఒకవైపు నేల కనిపించింది. ఆ నేల మీదకు వెళ్ళాలని నిర్ణయించుకున్నది.
నేల వైపు మళ్ళింది. కానీ నీళ్ళలో నుంచి పైకి ఎక్కలేక పోయింది. చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఎక్కలేకపొయింది అక్కడ నుంచి ఇంకొంత దూరం ముందుకు వెళ్ళి ప్రయత్నించింది. కానీ ఎక్కలేకపోయింది. అక్కడ గట్టు ఇంకా ఎత్తుగా ఉండి ఎక్కలేకపోయింది. మరల వెనక్కి వచ్చి తొలిసారి ప్రయత్నించిన చోటే మరల ప్రయత్నించింది కానీ ఎక్కలేక పోయింది. ఎగురుతోంది అందినట్లే అంది మరల కింద పడిపోతున్నది. కొద్దిసేపు ఆగి చుట్టూ చూసింది.
ఇప్పుడు తక్కవ ఎత్తున్న చోటు కనిపించింది. అక్కడకు వెళ్ళి ఎగిరింది. రెండు సార్లు ప్రయత్నించాక నేల మీదకు వెళ్ళింది. హమ్మయ్య అంటూ ముందుకు వెళ్ళింది. చెట్టు చాటున నిలబడిన తల్లి ముందుకొచ్చింది. తల్లిని చూసి పిల్లబాతు అమ్మా అంటూ అతుక్కుపోయింది.
“భయపడకు తల్లీ! ఆపద సమయంలో తెలివి ఉపయోగించాలి ధైర్యంగా ఉండాలి. దాని కోసమే మేము ఇక్కడ చెట్టు పక్కన దాక్కున్నాము. నువ్వు ఆపదను చక్కగా ఉపాయంతో దాట గలిగావు. అయితే అలా అపాయం కొని తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడాలి. మేమందరం ఎటు వెళ్తాన్నామో నువ్వు గమనించలేదు అది తప్పు. నీ తప్పును తెలియజేయాలనే మేము నీకు కనిపించలేదు” అన్నది తల్లి బాతు.
“అమ్మా అక్కడ ఏదో మెరుస్తూ కనిపిస్తే, చూస్తూ ఉండిపోయాను. అంతలోనే మీరందరూ ఎటు వెళ్ళారో కనిపించలేదు. తర్వాత ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ముందుకు వెళితే లోయ కన్పించింది చాలా భయమేసిందమ్మా” అంటూ కన్నీళ్ళతో తల్లితో చెప్పింది పిల్లబాతు.
“భయపడకమ్మా. నువ్వు నా దగ్గరకు వచ్చేశావు” అంటూ పిల్లను దగ్గరకు తీసుకున్నది తల్లి.
ప్రమాదాల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఆలోచిస్తూ ఉంటే ప్రమాదం ముంచుకొస్తుంది. జీవితం ముగిసిపోతుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలతో ఉంటావు. ఆ విషయం తెలుసుకున్నావు. మరెప్పుడూ అజాగ్రత్త వహించవు” అంటూ తల్లి తన పిల్లలను వెంట తీసుకుని ఇంటి బాట పట్టింది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
