
పి.శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత
– ప్రొ.కిన్నెర శ్రీదేవి & పి.శ్రీదేవి
పరిశోధక తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం.
సమాజం ప్రతికాలంలోను తన ఉనికి కోసం, మనుగడ కోసం కొన్ని విలువల్ని, కొన్ని ఆచారాలను నీతులను, జీవనవిధానాన్ని రూపొందించుకుంటుంది. వాటిని ఆచరణలో పెడుతుంది. ఈవిధానాన్ని ఆయాకాలాల్లోని జనసమూహం నిర్ణయిస్తుంది. అలా జనసమూహం నిర్ణయించడానికి ఆయాకాలాల్లో ఉండే మానవసంబంధాలే ఆధారమౌతాయి. ఒకసారి ఏర్పడిన జీవన విధానం కొంతకాలం అప్రతిహాతంగా కొనసాగుతుంది. అలా కొనసాగిన తరువాత సంప్రదాయంగా రూపుదిద్దుకొంటుంది. ఒకసారి రూపొందించుకున్న సంప్రదాయంలో మానవజాతి కొంతకాలం మనుగడ సాగించిన తర్వాత ప్రజల అవసరాలలో అభిరుచులలో మార్పులు వస్తాయి. అప్పటిదాకా కొనసాగిన జీవనవిధానంలో యథాతథంగా బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో కొత్త కొత్తగా పుట్టుకొచ్చే సామాజిక వర్గాలకు అది యథాతథంగా అన్వయించదు.
అలాంటప్పుడు ఆయా సామాజిక వర్గాలు మార్పును కోరుకుంటాయి. కోరుకున్న వాటిని ఆచరణలోకి తీసుకురావడంకోసం ప్రయత్నిస్తాయి. ఆప్రయత్నాల ఫలితమే ప్రయోగం. సమాజంలో గుణాత్మకమైన మార్పులు వచ్చినప్పుడు గత కాలంలో ఏర్పరచుకున్న సంప్రదాయం ఇక నుంచి పనికిరాని స్థితికి చేరుకుంటుంది. అప్పుడు కొత్త విలువలు, విశ్వాసాలు, జీవనవిధానం అవసరమౌతాయి. గతాన్ని పూర్తిగా తిరస్కరించిగానీ, కొంతవరకు విస్మరించిగానీ కొత్త జీవన శైలిపట్ల మొగ్గుచూపడం వలన అంతకు ముందు లేని ఒక కొత్త సంప్రదాయాన్ని నిర్మించుకోవలసి వస్తుంది. ఇదికూడా ప్రయోగమే. మొదటి ప్రయోగం పరిణామ సంప్రదాయాన్ని కాలానుగుణంగా సంస్కరించుకుంటే, రెండవ ప్రయోగం పాత సంప్రదాయాన్ని పూర్తిగా ధిక్కరించి కొత్త సంప్రదాయాన్ని నిర్మిస్తుంది. అయితే ఏ కాలంలోనూ ఏ సంప్రదాయమూ లేకుండా సమాజం మనుగడ సాగించలేదన్నది వాస్తవం.
“సమకాలీనత, ఆధునికత ఇవి రెండూ రెండు భావసంపుటులు. మొదటి భావసంపుటిలో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మొదటి దాన్ని సంస్కరిస్తూగాని, లేదా దానిని తిరస్కరిస్తూ గాని రెండవది వస్తుంది. రెండవదానిలో ఒకే కాలంలో రెండూ ఉండవచ్చుగాని, రెండూ విరుద్దాంశాలు. మొదటిది గతకాలపు అవశేషంగా మిగిలిపోగా, రెండవది గతాన్ని ధిక్కరిస్తూ వస్తుంది. ఈ వాస్తవ అధిగమన, తిరోగమన లాక్షణికత, భిన్నభావనా తాత్వికగా పరిణమిస్తుంది”‘. ఈ క్రమాన్ని పి.శ్రీదేవి రచనలు ‘కాలాతీత వ్యక్తులు’ నవల, కథాసాహిత్యంలోనూ దర్శించగలం.
సంప్రదాయం, ప్రయోగం ఈ రెండూ విడదీయరాని రెండు జీవన పార్శ్వాలు. ఈ రెండు సమాజానికి రెండు అవసరాలు. సంప్రదాయ పునాదిపై నుంచి సమాజం పురోగమిస్తుంది. ఏ సంప్రదాయమూ లేకుండా మానవుడు అనేక పోరాటాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోలేడు. అలాగే అభివృద్ధిని, మార్పును తిరస్కరించినా కూడా సంప్రదాయం నిలవదు. పరిణామశీలమైన, మార్పును సహించి స్వీకరించే సంప్రదాయం మాత్రమే నిలుస్తుంది.
ప్రతిమనిషి శరీరంలోను, అతని పూర్వికుల రక్తం జీవలక్షణాలు అంతర్గతంగా ఉంటాయి. ప్రతికుటుంబంలోను వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిని తర్వాతి తరాల వాళ్ళకు అందజేస్తూ పోతుంటారు. ఇది సంప్రదాయం. ఒక వ్యక్తిని పలకరించడం మొదలుకొని జీవితంలోని సమస్త విషయాలు సంప్రదాయంలో ఒదిగిపోతాయి. సాధారణంగా సంప్రదాయవాది అంటే గతాన్ని అభిమానిస్తూ బతికే వ్యక్తి అని ఇవాళ వున్న అర్థం. ప్రాచీన భావజాలాన్ని పలవరించే వ్యక్తిని సంప్రదాయవాది అనడం పరిపాటి. మార్పును ఆహ్వానించని వాళ్ళను, ద్రవించే స్వభావం లేనివాళ్ళను సంప్రదాయవాదులని అంటుంటాం.
సంప్రదాయం మానవజీవితానికి అనివార్యమైనదైనా, వర్తమానానికి సరిపడని దానిని వదులుకోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. వంశపారంపర్యంగా వచ్చిందని గతాన్ని యథాతథంగా వర్తమానానికి అన్వయించాలనుకోవడం అశాస్త్రీయం. సంప్రదాయాన్ని హేతుబద్ధమైన ఆలోచనతో, చారిత్రకదృక్పథంతో వర్తమాన జీవితమనే ఒరపిడిరాయి మీద పరీక్షించి, పరీక్షకు నిలచిన దానినే స్వీకరించాలి. అలా కాకుండ గతమంతా గొప్పదేఅని కౌగలించుకోవడం మురికినీళ్ళు ముఖాన చల్లుకోవడమే అవుతుంది. గతమనే నీటిని వడపోతబట్టి మురికిని వదిలిపెట్టి, తేరిన నీళ్ళను తాగితే ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే జబ్బుల పాలవుతాం. టి.ఎస్. ఇలియట్ “Novelty is better than repetition Tradition and Individual talent”” అనే గ్రంథంలో సంప్రదాయం జీవనది వంటిది. నేలస్వభావాన్ని బట్టి నదీ జలాల రుచి మారుతూ ఉంటుంది. ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేయనట్లే ఒకే సంప్రదాయంలో ఎల్లకాలం బ్రతకడం సాధ్యంకాదు.
స్థలకాలాలను బట్టి సామాజిక అవసరాలను బట్టి సంప్రదాయాలు మారడం అనివార్యం. ఈ మారడమే ప్రయోగం. ప్రయోగానికి నిలవని సంప్రదాయం విస్మరణీయమే కాదు, విసర్జనీయం కూడా. కాలానికి నిలబడగలిగినదీ, మనగలిగినదీ వద్దన్నా పోదు. యుగయుగానికీ స్వభావం మారుతుంది. కనిపించని ప్రభావాలకి లొంగుతుంది. అంతమాత్రాన మనల్ని మనం చిన్నబుచ్చుకొన్నట్టు ఊహించరాదు.
ఒక సంప్రదాయంతో యథాతథాంగా సుదీర్ఘకాలం జీవించడానికి వీలు కలగనప్పుడు సమాజం కాలానికి అనుగుణంగా సంప్రదాయాన్ని మార్చుకుంటుంది. జీవితంలో ప్రయోగం లేకుండా ప్రగతి సాధ్యంకాదు. అతిప్రాచీన మానవుడు సంచారజీవి. అలా బ్రతకడం ఒకప్పుడు సంప్రదాయం. ఆ తర్వాత స్థిరజీవితాన్ని గడపడం నేర్చుకున్నాడు. అది ప్రయోగం, స్థిరజీవితంలో కూడా చెట్టు తొర్రల్లో, కొండ గుహల్లో జీవించే దశ ఒకటి కాగా ఇల్లు నిర్మించుకున్న దశ మరొకటి అని శాస్త్రజ్ఞులు చెబుతారు. ఒకప్పుడు మనిషి పచ్చిమాంసం తినేవాడు. అప్పటికది సంప్రదాయం. ఆ తర్వాత మాంసం కాల్చుకొని తినడం నేర్చుకున్నాడు. అప్పటికది ప్రయోగం. ఆ తర్వాత అదే సంప్రదాయమైంది. అటుపిమ్మటు మాంసాన్ని ఉడకబెట్టుకొని తినడం నేర్చుకున్నాడు. అప్పుడది ప్రయోగం. ఒకప్పుడు మనిషి నగ్నంగా తిరిగేవాడు. ఆ తర్వాత ఆకులుమొలకు చుట్టుకున్నాడు. అటు పిమ్మట బట్టలు కనిపెట్టాడు. ఇలా మనిషి నిన్నటి కన్నా ఇవాళ, నేటికన్నా రేపు సుఖంగా అందంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అంటే సంప్రదాయం నిరంతరం ప్రయోగాలకు లోనవుతూ వస్తున్నదన్నమాట.
సామాజిక జీవితంలో సంప్రదాయ ప్రయోగాలున్నట్లే సాహిత్యంలోను అవి ఉంటాయి. ప్రయోగాలు లేకపోతే సాహిత్యంలో నేటి వైవిధ్యం ఉండేదికాదు.
“Tradition in literature, as in any other field of human activity, is a set of opinions and values consolidated at a given point of time, based on accumulated experience and usage and held sacrosanct. As for experiment, it is important that we do not view it in its narrow sense of effecting changes in the external form and technique only, but as a dialectical process which, under the impact changing social needs, questions the validity of the hither to-held opinions and values and revolts against them to usher in new ones to serve the changing needs. And in order to achieve what it wants, it adapts new stylistic devices at the level of form and technique”3
మానవాచరణలోని ఇతర రంగాలలో లాగే, సాహిత్యంలో కూడా నిర్దిష్ట కాలపరిమితిలో సంపాదించిన అనుభవం మీద ఆధారపడి రూపొందించిన విలువలు, ఆలోచనల మొత్తమే సంప్రదాయం అనబడుతుంది. హ్రస్వదృష్టితో చూస్తే, కేవలం రూపపరంగా లేదా శిల్పపరంగా వచ్చేమార్పుగా మాత్రమే భావింపరాదు. ప్రయోగాన్ని సామాజిక అవసరాల ప్రభావంతో స్థిరపడిన ఆలోచనలను విలువలను ప్రశ్నిస్తూ, భవిష్యత్ అవసరాల కోసం వాటి మీద తిరుగుబాటు చేసే ఒక గతి తార్కిక క్రమంగా అర్ధం చేసుకోవాలని డా. బాలు రావు అభిప్రాయం.
ఇందులో మొదటిది ఒక సామాజిక వ్యవస్థలోపల జరిగే ప్రయోగమైతే, రెండోది ఆ వ్యవస్థను తిరస్కరిస్తూ వచ్చేది. సజావుగా జరగడానికి ప్రవేశపెట్టిన ఆర్ధిక రాజకీయ విధానాల ఫలితంగా సామాజిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. అప్పటిదాకా రాజ్యమేలిన భూస్వామ్య భారతదేశంలో పాశ్చాత్యులు రాజకీయంగా స్థిరపడిన వ్యవస్థలో కదలికలు మొదలై పెట్టుబడిదారీ వ్యవస్థకు పునాదులు వేశాయి. ఫ్రెంచి విప్లవం, పారిశ్రామిక విప్లవం ఆధునిక సమాజానికిచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదం యథాతథంగా కాకపోయినా ముతక రూపంలోనైనా భారతదేశంలోకి ప్రవేశించింది.
క్రొత్త విద్యా విధానం భారతీయుల్ని తట్టి లేపింది. సంప్రదాయ విద్యకు కాలంచెల్లింది. మెకాలే విద్య అమల్లోకి వచ్చింది. పాశ్చాత్య సాహిత్యం పరిచయమైంది. సాహిత్యంలో వైవిధ్యం వచ్చింది. ప్రక్రియలు విస్తరించాయి. ఖండ కావ్యం, నవల, కథానిక, నాటకం, వచ్చాయి. సంప్రదాయ సాహిత్యంలోని మహాకావ్య సంప్రదాయం కూడా కొనసాగుతూనే వచ్చింది.
ఉత్తర తెలంగాణా పోరాటం శ్రీకాకుళ ఉద్యమాలు దళిత మహిళోద్యమాలు, సంఘసంస్కరణోద్యమం, జాతీయోద్యమం, తెలంగాణా ప్రజాసాయుధ వంటి సామాజికోద్యమాలు ఇరవయ్యవ శతాబ్దంలో వచ్చాయి. భావకవిత్వం, సంఘసంస్కరణ సాహిత్యం, జాతీయోద్యమ సాహిత్యం, అభ్యుదయసాహిత్యం, దిగంబరకవిత్వం, విప్లవసాహిత్యం, దళితసాహిత్యం, తులనాత్మకసాహిత్యం, మైనారిటీసాహిత్యం, ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం వంటివి ఆధునిక తెలుగు సాహిత్యంలోకి వచ్చాయి. ఆధునికసాహిత్యం ప్రయోగాల సముద్రం.
భావకవిత్వం, సంఘసంస్కరణ, జాతీయోద్యమ సాహిత్యాలు తరతరాల భారతీయ సామాజిక వ్యవస్థను, దాని ప్రతిబింబమైన సంప్రదాయ సాహిత్యాన్ని ప్రశ్నించాయి. పరాయి పాలనను, దాని పర్యవసానాలను ప్రశ్నించాయి. ఇవి నిస్సందేహంగా ప్రయోగాలే కాని జాతీయోద్యమకాలంలోనే మొదలైన అభ్యుదయసాహిత్యం సంప్రదాయాన్ని పూర్తిగా ధిక్కరించే ప్రయోగంగా వచ్చింది. సంప్రదాయ సాహిత్యం సమాజాన్ని వర్ణదృష్టితో విశ్లేషిస్తే, అభ్యుదయసాహిత్యం వర్గ దృష్టితో విశ్లేషించింది.
ఆధునిక ప్రాపంచిక దృక్పథం:
రచయిత తీసుకునే వస్తువు. ఆధునిక సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలందించిన జ్ఞానంతో వర్తమాన సమాజ జీవితాన్ని వస్తువుగా తీసుకొని రచన చేస్తే అది ఆధునిక రచన అవుతుంది. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం, మార్క్సిజం ప్రతిపాదించిన గతితార్కిక, చారిత్రక భౌతికవాదం, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనస్తత్వ సిద్ధాంతం, ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షసిద్దాంతం, రూసో ప్రతిపాదించిన స్వేచ్ఛా సమానత్వ సౌభ్రాతృత్వాలతో కూడిన మానవతావాదం. ఇంకా హేతువాదం వంటి జ్ఞాన సిద్ధాంత నేపథ్యంతో రచనలు చేసేవాళ్ళు ఆధునిక రచయితలు. ఇవి మనిషి ఆలోచనల్ని, మనిషి ఆచరణల్ని మానవసంబంధాలను మార్చిన సిద్ధాంతాలు గనక వీటి నేపథ్యంతో వచ్చే రచనలు ఆధునిక రచనలు.
ఆధునికతకు గీటురాయి శాస్త్రీయత. ఆధునిక మానవుడు ఆధునికతకు గీటు రాయి. ఆధునిక రచయితకు లక్ష్యం మరో ప్రపంచం. పాత సమాజాన్ని కొత్త ప్రక్రియలో చెబితే అది ఆధునిక రచన కాదు. రచయిత ప్రాపంచిక దృక్పథం ఆధునికమై, అతని స్వప్నం ఆధునిక ప్రపంచం అయినప్పుడే అతని రచన ఆధునికమౌతుంది. అందువల్ల ఆధునికత సాహిత్య వస్తువుకు సంబంధించినది తప్ప రూపానికి సంబంధించినది కాదు. పాత ఛందస్సులను వాడుకొని వాటిలో సమకాలీన జీవితాన్ని ప్రగతిశీల దృక్పథంతో చిత్రించినా అది ఆధునిక సాహిత్యంలో భాగమౌతుంది. నవల, కథానికలలో వెనుకటి వేదాంతాన్నిచెబుతూ భూస్వామ్య వ్యవస్థను కీర్తిస్తే అది సాహిత్యపరంగా సమకాలిక సాహిత్యమౌతుంది. ఆధునికం మాత్రం కాదు.
భావ వైరుధ్యాలతో నిండిన సమాజంలో అనేక రచనలు అమలులో ఉంటాయి. సృష్టికర్త సిద్ధాంతాన్ని పూర్వకర్మ, పూర్వజన్మల సిద్ధాంతాన్ని వర్ణాశ్రమ వ్యవస్థను ఇంకా అనేక ప్రాచీన కాలంలో ఏర్పడిన విశ్వాసాలను సమర్థిస్తూ ఏ ప్రక్రియలో వచ్చినా అది సమకాలీన సాహిత్యం అవుతుంది. నిన్నటికన్నా భిన్నమైన, ఆరోగ్యకరమైన, నాగరికమైన శాస్త్రీయమైన సమాజాన్ని ప్రతిపాదిస్తూ పురోగామి స్వభావంగల సాహిత్యం ఆధునిక సాహిత్యమౌతుంది. పాత మానవ సంబంధాలనే ఇవాళ కూడా చిత్రిస్తూ రచన చేస్తే అది సమకాలికం. నూతన మానవ సంబంధాలను నిన్నటికన్నా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలను ప్రతిపాదిస్తే అది ఆధునికం.
ఆధునిక మేధావి వర్జీనియా ఉల్ఫ్ 1924లో ఒక విశ్లేషణ జరిపింది. ఒక విస్పష్టకాలముద్రను గుర్తిస్తూ ఆమె ఇలా అంటుంది.
“1910లో ఆంగ్ల సాహిత్యంలో ప్రప్రథమంగా ఒక ఆధునిక సంవిధానం ప్రబుద్ధమైంది. ఈ విశ్లేషణను ఆంగ్ల విమర్శకులంతా అంగీకరించారు. సరిగ్గా అదే సంవత్సరం ఆధునిక భావ చేతన ఆంధ్ర కవిత్వంలో నవజీవనాంకురాలనెత్తింది. ఈ అంతర్జాతీయ చారిత్రక సంఘటన తొలి ‘ముత్యాల సరాలు’లో – తోకచుక్క దర్శనం రికార్డు చేయబడింది. ఇది యిటు కవితా రచనలోను అటు నవసమాజ రచనలోనూ ఆధునికతకు ప్రారంభం” అంటారు ఆవంత్ససోమసుందర్ (సాహిత్యంలో ఆధునికత, స్రవంతి, జనవరి1980) కవిత్వం వరకే పరిమితమై ఆలోచిస్తే ఇది నిజమే. కాని మొత్తం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూచినప్పుడు 1892 లోనే ప్రదర్శింపబడిన కన్యాశుల్క నాటకం 1897లో దాని ముద్రణను పరిగణలోకి తీసుకోవాలి.
ఆధునిక మానవజీవితం క్రమక్రమంగా సంక్లిష్టంగా మారుతున్నది. యంత్రనాగరికత పెరిగి, ఒక మనిషి మరొక మనిషితో సంబంధాల్ని తగ్గించుకుని యంత్రంతో సంబంధం పెట్టుకున్నాడు. దానితోపాటే మనిషికి డబ్బుతో మునుపెన్నడూ లేనంత దగ్గరి సంబంధం పెరుగుతున్నది. ఈ రెండు కారణాలచేత మానవ సంబంధాలు కృత్రిమంగా తయారవుతున్నాయి. అందరికీ ఒక బావిగాని వీధికొళాయిగాని ఉన్నప్పుడు నీటికోసం మనుషులు ఒకచోట చేరేవారు. సామూహికత ఉండేది. ఊరి చెరువు నీళ్ళతో వ్యవసాయం జరిగేటప్పుడు కూడా ఆ సామూహికత ఉండేది. మనుషులు పొలాన్ని దున్ని, పైరునాటి కలుపుతీసి, కోతకోసి, పంటనూర్పిడి చేసేటప్పుడు రైతులు, రైతుకూలీలు, భిన్నవృత్తులవాళ్ళు వ్యవసాయ సంబంధిత పనిలో భాగస్వాములయ్యేవాళ్ళు. ప్రతి రైతుకు బోరు బావులు, వ్యవసాయంలో యంత్రాలు వచ్చి మనుషులతో పని తగ్గింది. మనుషులు ఒకరితో ఒకరు దూరమవుతున్నారు.
ఆంగ్లంలో ambiguity అనే పదానికి సమానంగా తెలుగులో ‘అస్పష్టత’ అనే మాటను వాడుతున్నాం. ‘అస్పష్టత’ కొన్ని రకాల ఆధునిక కవిత్వంలో కనిపిస్తున్న లక్షణం. ప్రాచీన కవిత్వంలో దీని ప్రసక్తి రాదు. ఇదొక ఆధునికమైన భావన. భావ కవిత్వయుగం మలిదశలో ‘అస్పష్టతా భావన’ తెలుగు కవిత్వంలోకి ప్రవేశించింది. కవి ఏమి చెప్పదలచుకున్నాడో పాఠకుడికి తెలియకపోతే అస్పష్టంగా ఉంది అని అంటాం. పాఠకుడికి రచయితకు మధ్య భావ ధార తెగిపోవడం సాహిత్యంలో అస్పష్టత అవుతుంది. రచయితలు పాఠకులతో కలిసే కేంద్రబిందువు అదృశ్యం కావడమే అస్పష్టత.
ఈనాటి నాగరికతలో కవిత్వం సంక్లిష్టంగా ఉండక తప్పదు. ఆధునిక నాగరికతలోని తీవ్ర వైరుధ్యాలు సంక్లిష్టతలు మనిషి సున్నితత్వం మీద చూపించే ప్రభావం విభిను పరిణామాలాకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని భాషలో కి1980) కవిత్వం వరకే పరిమితమై ఆలోచిస్తే ఇది నిజమే. కాని మొత్తం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూచినప్పుడు 1892 లోనే ప్రదర్శింపబడిన కన్యాశుల్క నాటకం 1897లో దాని ముద్రణను పరిగణలోకి తీసుకోవాలి.
ఆధునిక మానవజీవితం క్రమక్రమంగా సంక్లిష్టంగా మారుతున్నది. యంత్రనాగరికత పెరిగి, ఒక మనిషి మరొక మనిషితో సంబంధాల్ని తగ్గించుకుని యంత్రంతో సంబంధం పెట్టుకున్నాడు. దానితోపాటే మనిషికి డబ్బుతో మునుపెన్నడూ లేనంత దగ్గరి సంబంధం పెరుగుతున్నది. ఈ రెండు కారణాలచేత మానవ సంబంధాలు కృత్రిమంగా తయారవుతున్నాయి. అందరికీ ఒక బావిగాని వీధికొళాయిగాని ఉన్నప్పుడు నీటికోసం మనుషులు ఒకచోట చేరేవారు. సామూహికత ఉండేది. ఊరి చెరువు నీళ్ళతో వ్యవసాయం జరిగేటప్పుడు కూడా ఆ సామూహికత ఉండేది. మనుషులు పొలాన్ని దున్ని, పైరునాటి కలుపుతీసి, కోతకోసి, పంటనూర్పిడి చేసేటప్పుడు రైతులు, రైతుకూలీలు, భిన్నవృత్తులవాళ్ళు వ్యవసాయ సంబంధిత పనిలో భాగస్వాములయ్యేవాళ్ళు. ప్రతి రైతుకు బోరు బావులు, వ్యవసాయంలో యంత్రాలు వచ్చి మనుషులతో పని తగ్గింది. మనుషులు ఒకరితో ఒకరు దూరమవుతున్నారు.
ప్రాచీన సాహిత్యంలో లేని సంక్లిష్టత ఆధునిక సాహిత్యంలో ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే, ప్రాచీన సమాజంలో సంక్లిష్టత లేకపోవడం ఆధునిక సమాజంలో సంక్లిష్టత ఉండడమే ఇందుకు కారణం. ఆధునిక సమాజమంటే పెట్టుబడిదారీ సమాజమని అర్థం. భారతదేశం ఇప్పటికి కూడా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజంగా మారకపోయినా, పాశ్చాత్యులరాకతో ఆ లక్షణాలు ప్రవేశించాయి. అందువల్ల సాహిత్యంలోకి సంక్లిష్టత ప్రవేశించింది. ఇది కూడా సంఘసంస్కరణ, జాతీయోద్యమ భావవాద సాహిత్యంలో లేదు. పద్యగేయ కవిత్వాల్లో కూడా లేదు. వచన సాహిత్యంలోనే ఈసంక్లిష్టత కనిపిస్తుంది. గద్దర్ పాటల్లో సంక్లిష్టత లేదు. వచన కవుల్లో కూడా అందరి కవిత్వాల్లోనూ సంక్లిష్టత లేదు. పట్టణ నాగరికతా వాసన వంటబట్టిన వాళ్ళలోనే ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా వైయక్తికవాద రచయితలలో కనిపిస్తుంది. గ్రామీణ వ్యవస్థలో ఉండే జీవనస్పష్టత పట్టణంలో ఉండదు. పట్టణ మధ్యతరగతి జీవితం సంక్లిష్టతకు మారు రూపం. గ్రామీణ జీవితంలో స్థిరపడిన విలువలు పట్టణ జీవితంలో అడుగుపెట్టేసరికి తలక్రిందులౌతాయి.
మతానికీ సైన్సుకీ వైరుధ్యం ఏర్పడడం కూడా సంక్లిష్టతకు కారణమౌతుంది. జీవితంలో ఆర్థిక ప్రాధాన్యం పెరిగే కొలదీ మంచిచెడుల మధ్య నీతి అవినీతుల మధ్య, గీత చెదిరిపోతుంది. యంత్రంతో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ మనిషితో దూరం పెరుగుతుంది. పట్టణీకరణ పెరిగేకొలదీ ఒంటరితనమూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రచయిత సమాజాన్నీ సృజనాత్మకంగా నిర్వచించడంలో అనేక చిక్కుల్ని ఎదుర్కొంటారు. సాంకేతికాభివృద్ధి వల్ల ముక్కలైన సమాజంతో రచయిత ఎలాసంబంధం పెట్టుకోవాలన్నది పెద్ద సమస్య. ఇందులోంచే సంక్లిష్టత పుడుతుంది.
ఈ సంక్లిష్టతను అర్థంచేసుకోడానికి నిఘంటువులు సహకరించవు. రచయిత నిలబడి మాట్లాడుతున్న సాంఘిక నేపథ్యాన్ని పట్టుకుంటే తప్ప అది అర్ధం కాదు. ఈ సంక్లిష్టత అంతా తెలుగులో అధివాస్తవిక సాహిత్యంలో రూపుదిద్దుకుంది.
స్త్రీ పురుష సంబంధాలలోని లైంగిక సంబంధాన్ని పదజాలాన్ని బహిరంగంగా సాహిత్యంలో ప్రయోగిస్తే అది అసభ్యతగా అశ్లీలంగా భావింపబడుతున్నది. నిజానికి మనిషి చరిత్రలో స్త్రీ పురుష సంబంధాలు చాలా సున్నితమైనవి. స్త్రీ పురుష లైంగిక సంబంధాలు కేవలం శారీరకాలే కాదు. మానసికాలు కూడా. చరిత్రలో పితృసామ్య వ్యవస్థ బలపడి స్త్రీ పురుషుడి చేతిలో కీలుబొమ్మగా మారిన క్రమంలో స్త్రీ పురుష లైంగిక సంబంధాల్లోకి విధినిషేధాలు ప్రవేశించాయి. ఒకవైపు కామాన్ని కళగా భావించే సమాజమే దానిపట్ల అనేక ఆంక్షలు విధించింది. స్త్రీ పురుషుల కలయిక ప్రేమ గౌరవాల పునాదిమీద జరగాల్సింది అది కేవలం ఒక శారీరక క్రియగా మాత్రమే మిగిలిపోయింది. ఈ పరిణామాల తర్వాత అశ్లీలత అనే భావన ఏర్పడింది.
కాల్పనికోద్యమ భూమిక:
సాహిత్యరంగంలో ఒక ప్రధాన ఉద్యమంగా సాగి ప్రసిద్ధికి వచ్చిన ‘కాల్పనికవాదం’, 1789లో ప్రారంభమైన ఫ్రెంచి విప్లవానికి దారితీసిన సాంఘిక తాత్విక ధోరణులతో ముడిపడివుంది. ఫ్రెంచి విప్లవాన్ని ప్రభావితం చేసిన రూసో రచనలలోని భావాలు తరువాత తరువాత కాల్పనిక వాదమనే కీరుగార్డు అభిప్రాయాన్ని గోపిచంద్ వివరిస్తూ ఇలా అంటారు. కీర్క్ గార్డ్ తత్వం అస్తిత్వతత్వం. అంటే మానవుని అస్తిత్వం దీనికి పునాది. అస్తిత్వం అంటే ఆయన దృష్టిలో జీవించడం కాదు. అస్తిత్వం అంటే తనను తాను తెలుసుకొని జీవించడం. అంటే జ్ఞానంతో జీవించడం. జ్ఞానంతో జీవించడం వల్ల మానవునికి స్వతంత్రత లభిస్తుంది. తనకు తానే పునాది అయ్యాడు. వ్యక్తి అస్తిత్వం వాస్తవం. మిగిలినవన్ని పిచ్చికగూళ్లే. అంటే, నిజమైన వాస్తవికత వ్యక్తి యొక్క అస్తిత్వం. వాస్తవికతను ఆలోచనా విధానాలవల్ల తెలుసుకోలేం ప్రత్యక్షానుభవం వల్ల మాత్రమే తెలుసుకోగలం” అని అన్నారు.
అస్తిత్వవాదం – భిన్న నిర్వచనాలు:
అస్తిత్వవాదాన్ని గురించి అనేకులు అనేక నిర్వచనాలు చెప్పారు. వాటిలో ముఖ్యమైన కొన్ని నిర్వచనాలు జాన్ మెక్యూరి అభిప్రాయం ప్రకారం:
“Existence is not an idea or an essence that can be intellectually manipulated indeed man becomes something less than human life if he allows himself and his being to be a absorbed into some organised scheme of being or something rational system of thought. Man fulfils his being practicely by existing by standing out as the unique individual that he is and refusing to be abserver into a system” 6
అస్తిత్వం అంటే ఒక భావమో, ఒక సిద్ధాంత సారమో కాదు. అది ఒక జీవన సరళి. మనిషి తనకు రక్షణలేదని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడే అస్తిత్వ ఆలోచనాసరళి అతడిలో ప్రవేశిస్తుంది. అప్పటి నుండి అతడిలో అస్తిత్వ సంఘర్షణ ప్రారంభమౌతుంది.
దీన్ని నిర్వచనం అనడం కంటే వివరణ అంటే బాగుంటుంది. ఎందుకంటే అస్తిత్వానికి సంబంధించిన ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ వివరణ ఉపయోగపడుతుంది.
‘ప్రపంచంలో మానవ జీవనగతికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేక జీవనగతి నుండే జీవన సమరం ప్రారంభమౌతుంది. ఆ జీవన సమరం నుండే వ్యక్తి రూపుదాల్చుతున్నాడు. అలా రూపుదాల్చిన వ్యక్తి, తన వ్యక్తిత్వంతో మనుగడ సాగిస్తాడు. ఈ స్థితిని అస్తిత్వవాదులు ‘Standing out’ అంటారు. అదే వారి దృక్పథంలో అస్తిత్వం””
“Interpreting life which is based upon an attitude of seriousness in living Existen- tialism is a method of living”
అస్తిత్వమనేది జీవితాన్ని అన్వయించుకొనే ఒక విధానం. జీవించడంలోగల సీరియస్నెస్ అనే దృక్పథాన్ని భూమికగా కలిగి ఉంటుంది. ఇక్కడ అస్తిత్వం కలిగి ఉండడం అంటే వైయక్తిక ప్రామాణికతకు విలువనివ్వడమే తప్ప శాస్త్ర ప్రామాణికతతో దానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే మైకెల్ సన్ తన స్థితికి సంబంధించిన గుణాలను బహిర్గతపరచడమే అస్తిత్వం అన్నారు.
కాల్పనికోద్యమ భూమిక:
సాహిత్యరంగంలో ఒక ప్రధాన ఉద్యమంగా సాగి ప్రసిద్ధికి వచ్చిన ‘కాల్పనికవాదం’, 1789లో ప్రారంభమైన ఫ్రెంచి విప్లవానికి దారితీసిన సాంఘిక తాత్విక ధోరణులతో ముడిపడివుంది. ఫ్రెంచి విప్లవాన్ని ప్రభావితం చేసిన రూసో రచనలలోని భావాలు తరువాత తరువాత కాల్పనిక వాదమనే కీరుగార్డు అభిప్రాయాన్ని గోపిచంద్ వివరిస్తూ ఇలా అంటారు. కీర్క్ గార్డ్ తత్వం అస్తిత్వతత్వం. అంటే మానవుని అస్తిత్వం దీనికి పునాది. అస్తిత్వం అంటే ఆయన దృష్టిలో జీవించడం కాదు. అస్తిత్వం అంటే తనను తాను తెలుసుకొని జీవించడం. అంటే జ్ఞానంతో జీవించడం. జ్ఞానంతో జీవించడం వల్ల మానవునికి స్వతంత్రత లభిస్తుంది. తనకు తానే పునాది అయ్యాడు. వ్యక్తి అస్తిత్వం వాస్తవం. మిగిలినవన్ని పిచ్చికగూళ్లే. అంటే, నిజమైన వాస్తవికత వ్యక్తి యొక్క అస్తిత్వం. వాస్తవికతను ఆలోచనా విధానాలవల్ల తెలుసుకోలేం ప్రత్యక్షానుభవం వల్ల మాత్రమే తెలుసుకోగలం” అని అన్నారు.
అస్తిత్వ చైతన్యం: సృష్టిలో మానవజన్మ ప్రారంభమైన నాటినుండి నేటివరకు అస్తిత్వపోరాటం లేదా అస్తిత్వ ఘర్షణ మానవ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. మనిషి తనలో తాను, సమాజంతో తాను నిత్యం సంఘర్షణకు గురికావడం మూలంగా అతని ఆలోచనల్లో, భావాల్లో మార్పు అనేది అనివార్యమైంది. మనిషిలోని ఆలోచనలు ఒక దానితో ఒకటి విభేదించి మార్పులు, చేర్పులు జరిగి కొత్త కొత్త సిద్ధాంతాలు రూపుదిద్దుకుంటూ వచ్చాయి. ఈ అస్తిత్వపు సంఘర్షణ వలన ఏర్పడిన సిద్ధాంతం అస్తిత్వవాదంగా పరిణమించింది.
వ్యక్తి తన చైతన్యాన్ని బట్టి విమర్శనాదృష్టితో వాస్తవాన్ని పరిశీలించడం ప్రారంభిస్తాడు. తద్వారా భావచైతన్యానికి అంకురార్పణ జరుగుతుంది. ఇది క్రీ.పూ. 4,5 శతాబ్దాల కాలంలో ప్లేటో, అరిస్టాటిల్ మొదలైన వారిలో తాత్వికచింతనగా ప్రారంభమై మానవత్వపు విలువలకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది. ఈ భావచైతన్యంతోనూ, సామాజిక చైతన్యంతోనూ కూడిన ఆలోచన, జిజ్ఞాస మేధావుల చేత ముందడుగు వేయించింది. ఫలితంగా వ్యక్తి చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం మానవజీవితంలో చోటు చేసుకున్నాయి. ఇలా చైతన్యం అనేక విధాలుగా విస్తరించిన సంధి కాలంలోనే అస్తిత్వవాదపు బీజాలు మొలకెత్తాయి. మానవుడు ప్రకృతినిపరిశీలించడంతోపాటు తనని తాను పరిశీలించుకోవడం ద్వారా (ఆత్మ పరిశీలన) వ్యక్తి తన అస్తిత్వాన్ని గుర్తించి దానికి ఒక ప్రత్యేక గుర్తింపు కోసం అన్వేషణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. వ్యక్తి తనను తాను అర్ధం చేసుకోవడమే తన అస్తిత్వాన్ని గుర్తించడం.
“తనని తాను వెతుక్కునే కృషికి కారణం, ఫలితం కూడా వ్యవస్థతో తలపడటమే అవుతుంది. దాదాపు ఇలాంటి భావాలే అస్తిత్వవాదం ఏర్పడడానికి అంకురార్పణ చేసాయి”” అంటారు కోడూరి శ్రీరామమూర్తి. అస్తిత్వం, అస్తిత్వ సంబంధమైన భావాలను నిర్వచనాల ద్వారా అర్థం చేసుకోవడం కంటే నిజజీవితానుభవాల ద్వారా సరిగ్గా అర్థం చేసుకోవచ్చు.
మనిషి తన గురించి తాను ఆలోచించుకోవాలి. తన జీవితానికి, తన మనుగడకు ఒక అర్థాన్ని ఆపాదించుకోవాలి. జీవిత అసంతృప్తిలోంచే అస్తిత్వసంబంధమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. కీ· గార్డు అభిప్రాయం ప్రకారం ‘మనం జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటాం. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తాం. దీనివల్ల మనలను బాహ్య జీవితమనేది ఒకటి పెనవేసుకుంటూ వుంటుంది. అందువల్ల ప్రయత్నం ఎక్కువైన కొద్దీ వాస్తవికత దూరమౌతుంది. వాస్తవికత ఎవరికి వారికి వారి అస్తిత్వంలో ఉంది అంటారు. అస్తిత్వవాదులు.
అయితే అస్తిత్వస్పృహ ఎప్పుడు కలుగుతుంది? అనేప్రశ్నకు సమాధానంగా “విషమ పరిస్థితి సంభవించినపుడు’ అని కీర్క్ గార్డు చెప్పడం జరిగింది. పరిస్థితులన్నీ సజావుగా కొనసాగుతున్నంత కాలం ఏ వ్యక్తి తన గురించి తాను ఆలోచించడు. బాహ్య ప్రపంచం నుంచి కొన్ని కావాలని కోరుకుంటాడు. వాటిని సంపాదించుకుంటూ ఉంటాడు. తాను అనుకున్నది సజావుగా జరగనపుడో, విషమపరిస్థితి వచ్చినపుడో తనను గురించి తాను ఆలోచించుకుంటాడు. కాబట్టి మానసిక సంఘర్షణ కలిగినపుడు మాత్రమే వాస్తవికతను తెలుసుకోగలం అంటాడు కీరగార్డు.
‘అతృత వల్ల, భయం వల్ల మానసిక ఆందోళన తీవ్రమైనప్పుడు ఎవరికి వారికి తమ అస్తిత్వపు స్పృహ ఏర్పడుతుంది. ఆందోళన అధికమైనకొద్దీ ఈ స్పృహ బలపడుతూ వుంటుంది. ఇది బాహ్య లక్ష్యాలను అధిగమించినపుడు ఒక మొత్తంగా తయారై తాత్వికచింతనగా రూపొందుతుంది. అస్తిత్వమంటే ఏమిటో అప్పుడుగానీ తెలియదు’ అని హెన్రీ డి. ఐకర్ వ్యాఖ్యానించారు.
అస్తిత్వాన్ని గురించి వివరించిన వారిలో డార్విన్ను గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతడు ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’ (Evolution Theory) వెనుక ఉన్నది కూడా అస్తిత్వవాద సిద్ధాంతమే. డార్విన్ దృష్టిలో అస్తిత్వమంటే మనుగడ కోసం పోరాటం. (Struggle for Existence) ఈ విషయాన్ని 1859లో ప్రచురించిన జీవజాతుల పుట్టుక (Origin of species) అనే గ్రంథంలో వివరించాడు.
ప్రతి ప్రాణి కూడా తన అస్తిత్వపోరాటంలో జయించాలని ప్రయత్నిస్తుంది. ఏ జీవి అయితే అస్తిత్వపోరాటంలో నిలుస్తుందో అదే తన మనుగడ సాగిస్తుంది. తక్కినవి అంతరించిపోతాయి. ఇదే సిద్ధాంతం మానవ జీవితానికి కూడా వర్తిస్తుంది. మానవుడు ఇతర జీవులతో పోరాడి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.
అస్తిత్వాన్ని గురించి వివరించే సందర్భంలో వ్యక్తికి అస్తిత్వం ఎలా కలుగుతుంది? అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. దీనికి అనేకులు అనేక రకాలైన సమాధానాలు చెప్పారు. వాటి సారాంశం వ్యక్తి స్వయంకృషి వల్ల తనని తాను ఉద్దరించుకోగల అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతర్ముఖంగా కలిగివున్న భావాలను నిజజీవితంలో సఫలం చేసుకోగలిగిన ప్రాణి మానవుడు ఒక్కడే. కాబట్టి వ్యక్తికి తనని తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోగల శక్తి ఉంది. ‘నేను’ అనే అహంభావంతో ప్రాపంచిక అస్తిత్వాన్ని అభిలాషిస్తూ, ప్రేమిస్తూ తాదాత్మ్యతను పొందాలి. అలా త్వమేవాహం (నీవే నేను)గా జీవిస్తూ స్వతంత్రయాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకుని భౌతిక శరీరంపై ఆధిపత్యం పొందగలడు. అదే వ్యక్తి యొక్క అస్తిత్వ స్థితి. వ్యక్తి అస్తిత్వానికి ఆత్మాన్వేషణ, వైజ్ఞానిక దృష్టి ఇరు పార్శ్వాల వంటివి. అస్తిత్వవాదులు వ్యక్తి అస్తిత్వానికి ప్రధానంగా మూడు అంశాలు చెప్పారు 1. స్వేచ్ఛ (Freedom)2. నిర్ణయం(Decision) 3. భాధ్యత (Responsibility)
వ్యక్తి జీవితంలో సంపూర్ణంగా ముగ్ధుడైనప్పుడు, అంటే… జీవితంలో తాదాత్మ్యం చెందినప్పుడు వ్యక్తి ప్రామాణిక జీవితానికి సంబంధించిన భావాలతో తన ఆలోచనలను నింపుకున్నప్పుడు వ్యక్తికి అస్తిత్వం సిద్ధిస్తుంది. వ్యక్తి ఒక సుస్థిరత్వాన్ని సంపాదించడం అస్తిత్వం. వాస్తవ ప్రపంచంలో సముచిత స్థానాన్ని సాధించడం అస్తిత్వం అంటాడు. యునామునో.
అస్తిత్వవాదుల్లో ఆస్తికులు ఉన్నారు. నాస్తికులు ఉన్నారు. అస్తిత్వవాదులు ఆస్తికులైనా నాస్తికులైనా ఆసక్తికి, అనుభూతికి, అనుభవానికి ప్రాధాన్యమిస్తారు. ఇలా అనుభవానికి ఆస్తికులా నాస్తికులనేది అప్రాధాన్యమవ్వడంవల్ల నాస్తికుల నిర్వచించలేని కొన్ని అంశాలను ఆస్తికులు నిర్వచించగలిగారు. నాస్తికుల జీవితాలలో తొంగిచూడని ఒకానొకస్థితిని ఆస్తికులు తమతమ జీవితాల్లో, అనుభవం ద్వారా సిద్దింపచేసుకోవడం జరుగుతుంది. వారి దృష్టిలో ఈ స్థితి నిర్వికారం, ఆనందమయం. ఈ నిర్వికార స్థితినే అస్తికుడైన వ్యక్తి తన అస్తిత్వానికి మూలం అని విశ్వసించడం జరిగింది. జాస్పర్స్, గాబ్రియేల్ మార్సెల్ ఈ కోవకు చెందినవారు. అయితే నాస్తికులు ప్రతిదానికి ఎదురు నిలిచి, ధైర్యంగా పోరాడి తృప్తిపొంది, జయాపజయాలతో కూడిన తమ అనుభూతినే అస్తిత్వ నిరూపంగా భావిస్తారు. జీన్ పాల్ సార్రే, మార్టిన్ హెడిగర్ ఈ కోవకు చెందినవారు. సార్టీ లాంటి వారు భగవంతుడనే భావాన్ని తోసిపుచ్చి భౌతికస్థితుల్లోనే ఉన్నతాంశాలను గుర్తించడం మొదలు పెట్టి, వాటిలోనే జీవితపు విలువలను ఆపాదించుకోవడం జరుగుతుంది. అయితే వాస్తవిక సత్యాన్వేషణ లేదా యథార్థ సత్యాన్వేషణే ఆస్తిక, నాస్తికవాదుల ప్రధాన ధ్యేయం. వ్యక్తి అస్తిత్వానికి అత్మాన్వేషణ, వైజ్ఞానిక దృష్టి రెండూ ముఖ్యమే. అంటే అస్తిత్వం అనే నాణానికి ఆత్మాన్వేషణ, వైజ్ఞానిక దృష్టి అనే రెండు ఇరు పార్శ్వాలవంటివి.
పైన వివరించిన అస్తిత్వవాదుల దృక్పథాలను పరిశీలించినట్టైతే వ్యక్తి వైశిష్ట్యాన్ని గుర్తించి మానవుల్లో ఒక్కొక్క వ్యక్తికి అనిర్వచనీయమైన వ్యక్తిత్వం ఉందని, దాని అభివ్యక్తి భిన్నంగా ఉండక తప్పదని, తద్వారా వ్యక్తిజీవితం, ప్రవర్తన వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు వ్యక్తి ధర్మాన్నే ఉత్కృష్టమైన విలువగా అంగీకరించి, వ్యక్తినే సమర్థించడం అస్తిత్వవాదం యొక్క సారాంశంగా చెప్పవచ్చు. అస్తిత్వవాదం వ్యవస్థకంటే వ్యక్తి ధర్మానికి, అంటే…. వ్యక్తి వైశిష్ట్యానికి, స్వేచ్ఛకు, సహజ వికాసానికి అస్తిత్వవాదం ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అస్తిత్వవాదం గురించి వివరించిన వివరణంతా ఈ వాదాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అవగాహనతో పి. శ్రీదేవి సాహిత్యంలో ప్రధాన భాగస్వామ్యం వహించిన అస్తిత్వవాద కథలను సరిగా అర్థం చేసుకొవడానికి తోడ్పడుతుంది.
మనస్తత్వ శాస్త్రం:
మనస్తత్వశాస్త్రం మానవ ప్రవర్తనను, ప్రవృత్తి లక్షణం నుంచి యధాతధంగా చూపి సామాజిక నియమాలకు, అవసరాలకు అనుగుణంగా దాని చైతన్య లక్షణాన్ని రూపొందించే స్వభావం కలిగివుంటుంది. మానపుణ్ణి అర్ధం చేసుకోవటానికి మనస్తత్వ శాస్త్రజ్ఞులు అనుసరించే దృక్కోణాలు అనేకం. కొందరు వ్యక్తుల బాహ్య ప్రర్తనను పరిశీలిస్తే, మరికొందరు మానవుల అంతరంగాలలోని అంతః సంఘర్షణలను స్పృశిస్తారు, మనస్తత్వశాస్త్రం భిన్నదృక్పథాల (Schools of Thoughts) ద్వారా రూపుద్దుకొంది.
20వ శతాబ్దిలో ప్రసిద్ధి పొందిన దృక్పథం మనోవిశ్లేషణ శాస్త్రం. ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎన్నో కొత్త భావనలను ప్రవేశ పెట్టింది. ఈ భావనలు మానవుని ప్రవర్తనను అర్ధంచేసుకోవటానికి కొత్త పంథాలను సూచించటమే కాకుండా ప్రయోగాత్మక పరిశోధనలకు తావిచ్చాయి. ఈ మనోవిశ్లేషణా విధానానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సాహిత్యపరంగా చూసినా మనస్తత్వ శాస్త్రపరంగా చూసినా మనోవిశ్లేషణా సిద్ధాంతానికి అనితర ప్రాధాన్యం వుంది. ప్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రభావాలు ప్రేరణగా అటు సృజనాత్మక సాహిత్యంలోనూ తత్ఫలితంగా ఇటు విమర్శన సాహిత్యంలోనూ మనోవైజ్ఞానిక ధోరణులు ప్రవేశించాయి. ఇది పాత్ర పరమైన ఇతివృత్తంగల నవల కనుక ఈ నవల మీద విమర్శనలన్నీ ఇందిర మనస్తత్వ పరిశీలన’గా తేలాయి. అభివృద్ధి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞానం ఆధారంగా ఆమె ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనంచేసి ఆ ప్రవర్తనకు కారణాలను ఆమె జీవితం నుండి ఆమె నివసించిన “దేశకాల పరిమితుల నుండి వెతికి కనుక్కోవాలన్న జిజ్ఞాస ఈ రకమైన విమర్శకు మూలం. ఇది పునాదిగా ‘కాలాతీత వ్యక్తులు’ నవలలో ఇతివృత్త నిర్మాణంలో భాగమైన మనో వైజ్ఞానిక ధోరణులను సమగ్రంగా పరిశీలించాలి. ఈడిపస్ భ్రాంతి (Oedipus Complex) అందులో నుండి పుట్టిన ఆత్మన్యూనతా భ్రాంతి (Inferiority- Complex) తత్ఫలిత మైన అంతర్మఖీనత ఇవన్నీ కలిసి రూపెత్తించిన- అపసామాన్య ఆలోచనలు, ప్రవర్తనలు. వీటి నుండి బయటపడటానికి తెలిసికొంత తెలియక కొంతవరకు చేసిన ప్రయత్నాలు, పొందిన అపజయాలు, సాధించిన విజయాలు ఈ నవలలో ఇందిర పరంగా కనబడే మనోవైజ్ఞానిక ధోరణులు. ఇవి నవలా కథను ప్రవర్తింప చేయటంలో ప్రధాన కారణాలు.
ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవైజ్ఞానిక సిద్ధాంతాలలో ‘ఈడిపస్ కాంప్లెక్స్’ చాలా ముఖ్యమైనది. సాహిత్య విషయంలో దీని ప్రభావం చెప్పుకోతగ్గది. వ్యక్తి మనసులో అజ్ఞాత మనస్సు అనే పొర వున్నదని సంకుచితమైన కార్యకారణ ప్రణాళికలో సమన్వయంకాని మానవ మనోవికారాలకు అది జన్మస్థానమని ఫ్రాయిడ్ స్పష్టం చేశాడు. ఈ అజ్ఞాత మనస్సులో మగపిల్లలకు తల్లిని గురించి సాధారణంగా వుండే అనురాగభావం తీవ్రంగా వుంటే అది ‘ఈడిపస్ కాంప్లెక్స్’ అనబడుతుంది. విరివిగా చేసిన పరిశోధనల తరువాత విస్తారమైన పరిశీలన తరువాత ఫ్రాయిడ్ మూర్తిమత్వ వికాసంలో ఈ మూడు దశలు (sexuality) చాలా ముఖ్యమైనవని నిర్ణయించాడు. ఇందులో మళ్ళీ మూడు దశలు వున్నాయని చెప్పి వాటిలో మూడవదైన శిశ్నదశ (Phallic stage) లోని భావనలు మగపిల్లల విషయంలో ఈడిపస్ కాంప్లెక్స్ గానూ, ఆడపిల్లల విషయంలో ఎలక్ట్రా కాంప్లెక్స్ గానూ పరిణమిస్తాయని పేర్కొన్నాడు. అయితే ఈ సిద్దాంతం తరువాత తరువాత చాలా విమర్శలకు గురి అయింది. ఈడిపస్ కాంప్లెక్స్ యొక్క సార్వజనీనతను అతనితో కలిసి కొంతకాలం పనిచేసిన అడ్లర్ తదితరులు నిరాకరించారు.
‘కాలాతీత వ్యక్తులు’ మనో వైజ్ఞానిక నవలగా ప్రసిద్ధి చెందకపోయినా, అభివృద్ధి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞానం ఆధారంగా ఇందిర ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనంచేసి ఆ ప్రవర్తనకు కారణాలను ఆమె జీవితం నుండి ఆమె నివసించిన “దేశకాల పరిమితుల నుండి వెతికి కనుక్కోవాలన్న జిజ్ఞాస ఈ రకమైన విమర్శకు మూలం. ఇది పునాదిగా ‘కాలాతీత వ్యక్తులు’ నవలలో ఇతివృత్త నిర్మాణంలో భాగమైపోయిన మనో వైజ్ఞానిక ధోరణులను సమగ్రంగా పరిశీలించాల్సి వుంది. ఈడిపస్ భ్రాంతి (Oedipus Complex) అందులో నుండి పుట్టిన ఆత్మన్యూనతా భ్రాంతి (Inferiority- Complex) తత్ఫలితమైన అంతర్ముఖీనత ఇవన్నీ కలిసి రూపెత్తించిన అపసామాన్య ఆలోచనలు, ప్రవర్తనలు. వీటి నుండి బయటపడటానికి తెలిసి కొంత తెలియక కొంత చేసిన ప్రయత్నాలు పొందిన అపజయాలు, సాధించిన విజయాలు ఇవి ఈ నవలలో ఇందిరపరంగా కనబడే మనోవైజ్ఞానిక ధోరణులు. ఇవి నవలా కథను ప్రవర్తింపచేయటంలో ప్రధాన కారణాలు.
‘కాలాతీత వ్యక్తులు’ ఇందిరకి ‘ఈడిపస్ కాంప్లెక్స్’ వుంది. తల్లి దండ్రులపట్ల శిశువు ఏవిధమైన దృక్పథాలను పెంపొందించుకొంటారనేది కుటుంబ పరిస్థితిపై ఆధారపడి వుంటుందని అంగీకరించినట్లయితే ఏ కుటుంబ పరిస్థితులైతే వున్నాయో అవే కుటుంబ పరిస్థితులు గల ఎవరికైనా కూడా ఈడిపస్ కాంప్లెక్స్ పుండాలి. ఇందిరలో ఇలాంటి భావనలు లేవు. కానీ ఈ సందర్భంలో “కేవలం అనుభవాలకన్నా వాటికి వ్యక్తి ప్రతిస్పందనగా ఫ్రాయిడ్ వాదాన్ని పరిగణనలోకి తీసుకోవలసి వుంటుంది.
విశిష్టమైన మానసిక కారణాలవల్ల పెంపొందించుకొన్న వ్యక్తిగత నైతిక విలువల కోసమైన అన్వేషణ కారణంగా ఇందిర స్వేచ్ఛా ప్రవృత్తిని తండ్రి పూర్తిగా అంగీకరించాడు. అలా అంగీకరించారు కనుక సంఘంలో స్థిరపడి వున్న విలువలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ప్రేమించలేక పోవటమన్న విషాదానికి లోనయ్యారు. తన తండ్రి నేపధ్యాన్ని బట్టి తాను చేతనలో పొందిన తాదాత్మ్యం వల్ల ఇందిర ఆ తండ్రిని ఇతరులెవరైనా అగౌరవపరిస్తే లేక చులకన చేస్తే సహించలేక వారి మీద అసహ్యం, అయిష్టత పెంచుకొన్నది. ఇది తండ్రి దగ్గర నుండే ప్రారంభమైంది. తండ్రి ప్రవర్తనను గురించి మాట్లాడి అతన్ని బయటకు పంపివెయ్యటం ద్వారా తమ సంసారాన్ని చక్కదిద్దబోయిన వారి ప్రవర్తనను హర్షించలేదు.
ఇందిరకు లోపల, వెలుపల కలిగే మార్పులకు అనుగుణంగా ప్రవర్తించగలిగిన విశిష్టమైన శరీర, మెదడు నిర్మాణం, మానసిక నిర్మాణం ఆమెకుంది. అందువలన భంగపాటు వల్ల బాధాకరమైన, ఉద్వేగపూరితమైన మానసిక ప్రయాస ఏర్పడ్డా, ఆ మానసిక ప్రయాసే ఆ వ్యక్తిని, ప్రయాసాన్ని సడలించుకొనే ప్రయత్నాలు చేసుకొనేటట్లుగా చేస్తుంది. ఆ ప్రయత్నాల వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను ప్రతిచర్యలకు వెనక శారీరకమైన అంశాలుగానీ, మానసికమైన ప్రేరకాలుగా పనిచేసాయి. ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల, తన అనుభూతికి వస్తున్న ఉద్వేగపూరితమైన మానసిక ప్రయాసల నుండి సమాజంలో తన జీవిత విధానాన్ని ఆమోదయోగ్యంగా చేసుకొనే ప్రయత్నంలో ఇందిర ప్రేమకోసమైన తపన, సౌందర్యాన్వేషణ లక్ష ప్రేరకాలుగా పనిచేశాయి. ఈ రెండూ ఆనాటి కాల్పనిక సాహిత్యం అన్వేషిస్తున్న లేదా ఆరాధిస్తున్న విలువలు కూడ ఆయా వ్యక్తుల ప్రవర్తనను రూపొందించటంలో ప్రతిచర్యలయ్యాయి.
సమాజంలో స్థిరపడిన విలువల దృష్ట్యా, పురుషుడికి ఎంతమంది స్త్రీలతో సంబంధం వున్నా పెద్ద తప్పుకాదు. నైతిక విలువలులేని స్త్రీలతో సంబంధాల విషయంలో విమర్శకు తావేలేదు. కానీ ఆమె స్త్రీ అయినందున ఆమె స్వేచ్ఛాయుత నైతిక ప్రవర్తన విమర్శకు గురి అయింది.
దైహిక వ్యాధులకు వున్నట్లే మానసిక వ్యాధులకు కూడా వ్యక్తి శారీరక బాధలకు డాక్టర్ దగ్గర చికిత్సను ఎట్లా పొందుతాడో అట్లాగే మానసిక బాధలకు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవీణులైన వారి దగ్గర చికిత్సను పొందవలసి వుంటుంది. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు చికిత్స ద్వారా వ్యక్తి మానసిక స్థితికి అతని పరిసరాలకు మధ్య రాజీ కుదురుస్తాడు. అంటే ఆ వ్యక్తి తన చుట్టూ పున్న పరిస్థితులను అర్థం చేసుకొని వ్యక్తిగతమైన తన సమస్యలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి, ఆ పరిస్థితులలో తన జీవనవిధానం సాఫీగా గడిచిపోయే మార్గం వెతుక్కొనేటట్లు చేస్తాడన్నమాట. ఇక్కడ మానసిక వ్యాధితో బాధపడు తున్నది, ఆ వ్యాధిని గుర్తించి దానిని నయం చేసుకోవటానికి ప్రయత్నించిందీ ఒకే వ్యక్తి. పై నుండి సూచనలనివ్వటం ద్వారా మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన జీవనవిధానం సాఫీగా గడిచిపోయే మార్గం వెతుక్కొనేటట్లు చేసే శాస్త్రజ్ఞుడి అవసరాన్ని ఇందిరకున్న మనోవైజ్ఞానిక పరిజ్ఞానం తీర్చింది. అందువల్ల ఆమె తన మానసిక ఇబ్బందులను తానే గుర్తించి వాటినుండి బయటపడే ప్రయత్నాలు ప్రారంభించింది. తనకు ఏం కావాలో చాలా స్పష్టంగా తెలుసుకొంది. అలా తెలుసుకోవడం వలనే వాటిని పొందేందుకు తన శాయశక్తులా కృషి చేసింది.
స్థలకాలాల సిద్ధాంత భూమిక :
స్థలకాలాలనే ఈ రెండు మాటలు వ్యస్తంగా నిర్దిష తత్వాన్ని చేశాయి. ఈ స్థలకాలాలనే ద్వంద్వాలను గూర్చిన తాత్విక జిజ్ఞాస ప్రాచీన కాలం నుండి ఒకదానితో ఒకటి పెనవేసికొన్న సంబంధాన్ని కలిగివున్నాయి. స్థలకాలాల అస్తిత్వం పదార్థసంబంధంలోనే అన్న మాట అర్థాన్ని కలిగివుండి ఒకదాని నొకటి ఆశ్రయించుకొని అంగికమైన అంతర్గత పరిస్థితి కల్సి నిరూపించబడుతుంది. దర్శించబడే వస్తులక్షీణంగా దేశకాలాలు గోచరమవుతాయి పదార్థం ద్వారా నిర్దేశితమవుతుంది. అందుకే దేశకాలాలను చలనంలో వున్న పదార్థ పుబాహ్యాత్మక వలలో స్థలం పదార్థం యొక్క సహస్థితి అయి పదార్థం అణువులు విభక్తమై గతిశీలమైన శక్తిగామారి ఆశక్తి ద్వారా కాలం వాస్తవ రూపాలనటం జరుగుతున్నది. అట్లాగే ఉత్పత్తి గల సర్వవస్తువులకు దేశకాలాలు ఆధారభూతములని చెప్పబడుతున్నది. దీనిని బట్టి దేశము, కాలము, జీవి ప్రధానం. ఈ మూడూ పరస్పర సంబంధాలలో వున్న అంశాలుగా తేలుతున్నది. అలాగే స్థలం లేనిచోట కాలంలేదు. కాలం లేనిచోట స్థలం లేదు. అందువలననే దేశకాలాల పదార్థ సంపుటి జగత్స్వరూపానికి మూలకారణనిమిత్తంగా చెప్పబడుతున్నది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రరంగంలో దేశకాలాలకు సంబంధించిన విషయంలో ఉద్యమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. విజ్ఞాన రంగంలో సంచలనం కలిగించిన డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేసింది. ముఖ్యంగా నవలా సాహిత్యంలో ఇతివృత్తాన్ని పరిణమింప చేసుకోవటంలోనూ, పాత్రల ప్రత్యేక వ్యక్తిత్వాలను నిరూపింప చేయటంలోనూ ఈ సిద్ధాంతం ప్రయోజనవంతంగా పుపయోగపడుతున్నది. పి. శ్రీదేవి ‘కాలాతీతవ్యక్తులు’ నవలలోను, ‘చక్రనేమిక్రమాన’, వాళ్ళు పాడిన భూపాల రాగం, ‘రేవతీ స్వయంవరం’, ‘జ్వరపీడితులు’ కథలులోనూ ఇతివృత్త నిర్మాణంలో ఈ స్థలకాలాల సిద్ధాంతాన్ని తెలిసి, సమర్థవంతంగా వాడుకొన్నారు. ‘తెలిసి’ అనటం ఎందుకంటే పి. శ్రీదేవి నవలలో మొత్తం పదిసార్లు స్థలకాలాల సిద్ధాంతం దాని స్వభావాన్ని అర్థం చేసుకొని నవలేతివృత్తాన్ని నడపటానికి సంబంధించిన భావనలను అక్కడక్కడా స్పృశించి, అర్థం చేసుకోవటానికి వీలుకల్పిస్తూ ఇందిర స్వభావం అర్థం కావడానికి ఎలా తోడ్పడిందో ఆలోచించటానికి ప్రేరణనిస్తుంది. కనుక, మార్పు కాలలక్షణం, పరిమాణం, స్థలలక్షణం. కొంత పరిమాణం గలవి స్థలంలోనూ, మారే కాలంలోనూ పదార్థం వుంటుంది. నిజానికి ఈ మూడు మూడు సందర్భాలలో వుంచిన అంశాలు కావు. ఎందుకంటే స్థలకాలాలు చలనంలో వున్న పదార్థ బాహ్యరూపాలు.
స్థలకాలాలు అనేకాంశాలలో ఏకలక్షణ లక్షితాలే అయినప్పటికి ఒక చివరికి ఇందిర విషయంలో మాత్రం ఈ రెండూ ఒకదాని నుండి మరొకటి గణనీయంగా భేదిస్తున్నాయి. ఆదేమిటంటే స్థలం బహు విస్తృతి స్వభావం కలిగివుండటం. కాలం అప్పటికీ ఆ ఏకవిస్తృతి స్వభావాన్ని కలిగివుండటం వలన స్థలంలో వస్తువు ముందు వెనుకలకు పక్కలకు కదలటానికి వీటుంటుంది.
ఇందుకు స్థలానికి వున్న బహువిస్తృత స్వభావమే కాలానికి పెద్ద కారణం. కాలంలో జరిగే సంఘటనలు మాత్రం ఒక క్రమంలోనే కదలాలి. తప్పితే వెనుకకు కాని, పక్కకుకానీ కదలటానికి వీలులేదు. అంటే ఆ ఘటనలు గతం నుండి వర్తమానానికి వర్తమానం నుండి భవిష్యత్తుకు ఒక దిశలో మాత్రమే జరుగుతాయి. గతించిన కాలం పునరావృత్తి చెందదు కాబట్టి ఈ ఘటనల క్రమం కూడా కాలప్రవాహాన్ననుసరించి ఒక సమయం నుండి మరోకొత్త సమయానికి అనవరతంగా అనంతంగా కొనసాగుతుంటుందే కాని ఎదురుతిరుగదు. స్థలకాలాలకు సంబంధించి రెండింటి విస్తృత స్వభావంలోని లేక ’కాలాతీత వ్యక్తులు ఇతివృత్త నిర్మాణంలో చక్కగా ఉపయోగించుకున్న నైతిక ప్రవర్తన ఆమె మరణించినా నీడలా వ్యాపించి ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
ఈ విధంగా పి. శ్రీదేవి స్థలకాలాలను గురించిన ప్రాచీన ఆర్వాచీన సిద్ధాంతాలన్నింటి అవగాహనతో ఇందిర జీవితాన్ని ఆద్యంతాలు లేని నిరంతర వాహినిగా చిత్రించారు. స్థలకాలాలను ఈ జీవితానికి షృష్టభూమిగా స్వీకరించి వాటి స్వరూప స్వభావ లక్షణాలతో జీవితాన్ని సవరింపచేసి ప్రపంచాన్ని జీవితం స్థలం, కాలం ఈ మూడింటి సంపుటిగా నిరూపించింది.
ఆమె రచనల్లోని కాల్పనిక, అస్తిత్వ, మానసిక తత్వ భూమికల సమ్మేళనంగా ఒకింత సంక్లిష్టతను పొందాయి. పి. శ్రీదేవి రచనలను భిన్న భావనా తాత్విక భూమిక నుండి పరిశోధించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఆమె నవల, కథాసాహిత్యం కాలాతీత స్వభావాన్ని సంతరించుకున్నాయని తెలుస్తుంది.
పాథసూచికలు:
1. ఆచార్య శ్రీదేవి. కిన్నెర., ‘సాహిత్యతత్వం’: చినుకు పబ్లికేషన్స్, విజయవాడ, 2019.
2. నారాయణరెడ్డి, సి.,’ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు’
3. S. Balu Rao – Tradition and Experiment in Indian Literature: Indian Literature – March, April 1989.
4. శ్రీనివాసరావు, శ్రీరంగం, ‘మహాప్రస్థానం’ విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 1987.
5. సోమసుందర్ అవంత్స, ‘సాహిత్యంలో ఆధునికత, స్రవంతి 1980 సంచిక.
6. John Macquarie, ‘Existentialism’ – 1982, p: 66.
7. John Macquarie, ‘Existentialism’ – 1982, p: 66.
8. Carl Michelson, ‘what is Existentialism’ – 1987.
9. శ్రీరామమూర్తి కోడూరి, ‘మూడు దశాబ్దాల తెలుగు నవలా సాహిత్యంలో అస్తిత్వవాద ధోరణలు – 1978 ఏప్రిల్, భారతి మాసపత్రిక.
10. ఆంజనేయశర్మ వేమూరి, ‘అస్తిత్వవాదం…. అబ్బర్డ్ నాటకం వ్యాసాలు కొన్ని – 2009. p. 5,6.
11. John A. Mackay, Christianity and the Existentialism – 1956, p. 53.
***
వ్యాసరచయిత్రులలో ఒకరైన పి.శ్రీదేవి పరిచయం:

పి.శ్రీదేవి పరిశోధక విద్యార్థిని, ద్రావిడ విశ్వవిద్యాలయం. కుప్పం తెలుగు శాఖ విభాగంలో ఆచార్య కిన్నెర శ్రీదేవి పర్యవేక్షణలో ‘కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత’ అనే అంశం పైన పరిశోధన చేస్తున్నారు.
*****

కె.శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం కడప. 12 పుస్తకాలు రాశారు. మూడు పుస్తకాలు ఎడిట్ చేశారు. ఆరు అవార్డులు అందుకున్నారు. 112 ఆర్టికల్స్ రాశారు.
