తపస్సు

-వసుధారాణి 

ఒక తపస్సులా గమనించు

తూనీగల రెక్కల చప్పుడు కూడా

వినిపిస్తుంది.

కొండ యుగయుగాల

కథలు చెపుతుంది.

జలపాతం చిలిపితనం

నేర్పిస్తుంది.

నది ఆగిపోని జీవనగమనం

చూపిస్తుంది.

ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో

ఒక్క క్షణంలో మార్చేస్తుంది.

ముని అవ్వటం అంటే ఇదేనేమో

జనజీవనంలో నిలబడి కూడా.

 

ఏమయినా సముద్రుడు

నాకు బోలెడు కబుర్లు చెపుతాడు.

నది వచ్చి నాలో చేరేటప్పుడు

ఆ మంచినీరు నేనేమి చేసుకోనూ?

వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాను.

ఐనా నది సంగమించే తీరుతుంది.

ఆ కరిమబ్బుకూ చెపుతాను

నాపై కురవబోకు 

అడవిగాచిన వెన్నెలల్లే అని

అయినా కురిసిపోతుంది.

నీకూ చెపుతున్నా 

ఎగసే అలది ఆహ్వానం అనుకునేవు

దరికి రాబోకని హెచ్చరిక అంటూ !

ఏమయినా సముద్రుడు 

నాకు బోలెడు కబుర్లు చెపుతాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.