పిల్లకోడి   ప్రయత్నం

-అనసూయ కన్నెగంటి

పిల్లలకు జాగ్రత్తలు చెప్పి  బయటికి వస్తూనే తలెత్తి ఆకాశం వైపు చూసింది తల్లికోడి.  అది చూసినంత మేరలో ఎక్కడా కాకిగాని, గ్రద్ద కానీ దానికి కనపడలేదు. “ ఎప్పుడూ నా పిల్లల్ని అవే ఎత్తుకుని వెళతాయి. పాపం. మిగతా పక్షులు నా పిల్లల వైపు కన్నెత్తి కూడా చూడవు..” అని మనసులో అనుకుంటూ అక్కడికి  దగ్గరలో ఉన్న చెట్ల పైనంతా మరింతగా పరికించి చూసింది ఎక్కడైనా మాటుకాసాయేమోనని. ఏవీ కనపడకపోయేసరికి..” కొ..కొక్కొక్కొ..”అంది పిల్లలకి అర్ధం అయ్యేట్లుగా..

        అక్కడికి దగ్గర్లోని రాళ్ల గుట్ట మాటున దాక్కుని తల్లి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న కోడి పిల్లలన్నీ గబ గబా బయటికి వచ్చేసి  ఎంతో ఉత్సాహంగా, ఉరకలెత్తుకుంటూ గోలగోలగా ఒకర్ని తోసుకుంటూ ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి  తల్లిని చేరాయి. తల్లి కోడి  చూపు మాత్రం  వాళ్లందరి వెనకా మెల్లగా వస్తున్న చిన్న పిల్ల మీదే  ఉంది. 

     దాని గురించే తల్లి కోడి బెంగ అంతా. 

   అది అందరి కంటే ఆఖర్న పుట్టింది. అది పుట్టినప్పుడు చాల బాధపడింది రెండు రోజులపాటు తల్లికోడి. గుడ్డు  లోపల అరుస్తుంది కానీ ముక్కుతో పెంకుని పొడుచుకుని బయటకు రాలేకపోయింది. దానంతట అది వస్తే తప్ప మనం లాగితే దానికి ప్రమాదమని తనలో తనే బాధ పడుతూ అదెప్పుడు బయటికి వస్తుందా అని  ఎదురు చూసింది తల్లికోడి.  అది అలా ఎదురు చూసినంత సేపూ ఈ పిల్లలందర్నీ తన  పొట్త కిందే దాచి ఉంచింది.  అప్పుడప్పుడూ అవి ఇబ్బంది పెట్టినా తల్లికోడి పట్టించుకోలేదు.

    “ పిల్లలందరూ తల్లికి సమానమే. కాస్తంత బలహీనంగా ఉన్న పిల్లల్ని తల్లి పట్టించుకోకపోతే ఎవరు పట్టింఛుకుంటారు?” అని కూడా అనుకుంది. చివరికి ఎలాగోలా పిల్ల గుడ్డులోంచి బయటపడింది.  వచ్చింది అన్నమాటేగానీ  బలహీనతతో.. రగా తన కాళ్ల మీద తాను నిలబడలేకపోయింది.

         పిల్లలకి ఆహారం తినటం కానీ, నీళ్లు తాగటం కానీ, ఆరు బయట ఆహారాన్ని వెదుక్కోవటం కానీ, కుక్కలు కానీ గ్రద్దలు కానీ వస్తే తాను చేసే హెచ్చరికలని అర్ధం చేసుకోవటం కానీ మిగతా పిల్లలన్నీ ఒక్కసారి చెబితే అర్ధం చేసేసుకున్నాయి. మరోసారి చెప్పనవసరం లేకపోయింది. 

   కానీ ఈ పిల్ల ఒక్కటే ఏదైనా ఆలస్యంగా నేర్చుకుంటుంది. 

       తిండి ఆలస్యంగా తిన్నా పర్వాలేదు. ప్రమాద సమయాల్లోనే ఏ గ్రద్దకైనా చిక్కుకుపోతుందేమోనని తల్లి కోడి బెంగ.  అందుకే ..తన పిలుపు విని పరుగు పరుగున తనని చేరిన మిగతా పిల్లల్ని వదిలేసి గబుక్కున చిన్నదాని వైపు వెళ్ళింది..ఏదైనా ప్రమాదం వస్తే ఎదుర్కోవటానికి అన్నట్టుగా. 

    నిజానికి దానికి పిల్లల్ని ఇలా ఆరుబయట ప్రాంతానికి తీసుకు రావటం ఇష్టం లేదు. కానీ నిన్న జరిగిన విషయం దానిని భయపెడుతూంది. 

   నిన్న ఇలాగే అందర్నీ తీసుకుని బయటికి వస్తూ..
    “ మిమ్మల్ని మొదటిసారిగా ఖాళీ ప్రదేశానికి తీసుకు వెళుతున్నాను. అక్కడ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఎత్తుకుపోవటానికి వస్తే దాక్కోవటానికి ఏమీ ఉండవు. ఒక్క నేను మాత్రమే ఉంటాను. కాబట్టి  ఏదైనా ప్రమాదం వస్తే నేను అరుస్తాను. గబుక్కున నా రెక్కల కిందకి వచ్చెయ్యండి. నేను హెచ్చరించే దాకా మీరు హాయిగా మీకు దొరికిన ఆహారాన్ని మీరు తినండి..” అని చెప్పింది. 

   అలాగే అన్నాయి పిల్లలు. అదృష్టవశాత్తూ ఇతర ప్రాణుల వల్ల ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. కానీ

   అలా వెళుతుంటే చిన్న కోడిపిల్ల మాత్రం దార్లోని చిన్న గుంటలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేక పోతుంది. దగ్గరకంటా వెళ్ళి..ఎన్నో రకాలుగా చెప్పింది..గబుక్కున ఎగరమని..శక్తినంతా రెక్కల్లోకి తెచ్చుకుని ఒక్క గెంతు గెంతమని. అయినా అది ఎగరలేకపోయింది. దాంతో తల్లి కోడి తనే స్వయంగా గుంటలోకి దిగి దానిని తన వీపు మీద కూర్చోమని బయటికి తీసుకు వచ్చింది.  

    అయితే “ తాము నడిచే దారిలో ఎక్కడన్నా గుంతలు ఉంటాయేమోనని ముందుగానే చూసుకుంటూ నడవాలని, ఒక్కసారి అందులో పడ్దామంటే  నేను దగ్గరలో ఉంటే ఫర్వాలేదు. ఒకవేళ నేను చూడకపోతే గనుక..నిను నువ్వే రక్షించుకోవాలి. లేదంటే నిస్సహాయురాలవైన నిన్ను ఎత్తుకుపోవటం పక్షులకు తేలిక” అని ఆ రాత్రంతా ఎంతో చెప్పింది. చెప్పింది అంతా  విని..” ఈసారి జాగ్రత్తగా ఉంటానమ్మా..!” అంది పిల్ల కోడి.

   ఇపుడు దానిని పరీక్ష చేయటానికని మళ్ళీ ఇలా బయటికి తీసుకు వచ్చింది తల్లికోడి పిల్లలు అందర్నీ.

   పాఠాలు నేర్పినప్పుడే పరీక్షలు కూడా పెట్తేస్తే..ఎంత వరకూ గ్రహించారు..అనేది తెలిసిపోతుందని తల్లికోడి అభిప్రాయం. 

    తల్లి కోడి ఇలా ఆలోచిస్తున్నంతలో పిల్ల కోడి తల్లి వెనకే వచ్చి అందర్లో కలసి పోయే సరికి  ముందుకు బయలుదేరింది తల్లికోడి. అనుసరించాయి పిల్లలన్నీ.కాస్తంత ముందుకు వెళ్ళాకా..కావాలనే నిన్న పిల్లకోడి పడిపోయిన గుంట పక్కగా పోసాగింది తల్లికోడి. కాసేపటికి అది ఆ గుమ్టను దాటింది. 

      పిల్లలన్నీ తల్లి కోడిని అనుసరించాయి. 

   అయితే నిన్నటి వలెనే పిల్ల కోడి మళ్ళీ గుంతలో పడిపోయింది. అది గమనించిన  తల్లికోడి ఈసారి పట్టించుకోలేదు దాన్ని. నిన్న అంతగా చెప్పినా మళ్ళీ అదే తప్పు చేసిందని కోపంతో కాదు. పడిన ప్రతీసారీ ఇలాగే సహాయం చేస్తే పిల్లలు అలాగే తల్లుల మీద ఆధారపడిపోతారనే దాని ఉద్దేశ్యం.

    ముందుకు వెళుతూనే  ఓర చూపుతో పిల్లని గమనిస్తా ఉంది ఏం చేస్తుందో చూద్దామని. 

ఇదేమీ పట్టించుకోని మిగతా పిల్లలందరూ తమ ఆహారాన్ని తాము తినసాగాయి.

 పిల్ల కోడి అరుస్తూనే ఉంది..సహాయం చేయమని. ఎవరూ పట్టించుకోవటం లేదు. తల్లి కోడి కూడా ఆ అరుపులు వింటూ..ఒక్కోసారి చుట్టూ పైనంతా చూస్తూ మరోసారి పిల్లనే గమనిస్తూ తనకేమీ వినపడనట్టు నటించసాగింది. 

    అయితే తల్లి ఇలా తనను గమనిస్తూనే ఉంది అన్న విషయం పిల్ల కోడికి తెలియదు. దాంతో దానిలో భయం ఎక్కువైపోయింది. ఒక్కోసారి పైకి ఎగరటానికి ప్రయత్నం చేస్తూ..మరోసారి పైన ఎవరన్నా పక్షులు తిరుగుతున్నాయేమోనని చూస్తూ..మరోసారి సహాయం చెయ్యమని అరుస్తూ భయం భయంగా తన చుట్టూ తానే తిరుగసాగింది. 

  ఇంతలో  ఎక్కడో దూరాన్నించి  గ్రద్ద అరుపు పిల్లకోడికి వినిపించింది.  దానితో పిల్ల కోడిలో భయం మరింతైంది..

“ అమ్మ..దగ్గర్లో లేదు. అందుకే నా ఏడుపు అమ్మకి వినపడలేదు. ఎక్కడో  గ్రద్ద ఎగురుతూంది. చూసిందంటే కిందకి దిగిపోతుంది..ఈలోపే తాను ఎలాగైనా ఈ గుంత నుండి బయట పడాలి” అని తనకి తానే ధైర్యం చెప్పుకుని ..

తనకున్న బలమంతా తన రెక్కల్లోకి తెచ్చుకుని ఒక్క గెంతు గెంతింది. అంతే. గట్టు మీదకు వచ్చి పడింది. 

     అయితే  గ్రద్ద కూతని విని అదెంత దూరంలో ఉందో ఇట్టే అంచనా వేసిన తల్లికొడి, కింద పిల్లకోడి ప్రయత్నాన్ని దూరం నుండి గమనిస్తున్నదేమో..పిల్ల పైకి రాగానే ..ఇంత సంతోషంతో..తన పిల్లను చేరి..కొక్కొక్కొ క్కొ అని అరుస్తూ పిల్లలందర్నీ దగ్గరకు వచ్చెయ్యమని ఇంత పొడుగున చాచింది తన రెక్కల్ని. 

    క్షణంలో పిల్లలన్నీ తల్లిని చేరాయి.

     సరిగ్గా అప్పుడే పైనఎగురుతూ అప్పుడే అక్కడికి వచ్చిన గ్రద్ద కిందకి దిగకుండా  తన దారిన తాను పోయింది.

     “హమ్మయ్య..” అనుకుంది తల్లికోడి. అంతేకాదు..పిల్ల కోడిని  బయటకు రమ్మని….

   “ చూసావా! భయమూ నీలోనే ఉంది..ధైర్యమూ నీలోనే ఉంది. నీలో నువ్వే భయపడి బలహీన పడ్దావు. ప్రమాదం మీదకు వచ్చేసరికి నీలోని ధైర్యాన్ని  ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడ్దావు. ఇప్పుడు మిగతా అందరిలాగా నిన్ను నువ్వే రక్షించుకోగలవు..నాకు ఇక నీ గురించిన చింత లేదు” అంది తల్లికోడి..మిగతా పిల్లలకు కూడా అర్ధమయ్యేలాగా.

    “ అవునమ్మా..! ఇప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురైనా నన్ను నేను రక్షించుకోగలను..” అంది పిల్లకోడి..తల్లి రెక్కల కిందకి దూరిపోతూ….

  తృప్తిగా చుట్టూ చూసింది తల్లికోడి. 

           *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.