అసలు రహస్యం

-ఆదూరి హైమావతి 

           హనుమకొండ రాజ్యాన్ని ఆనందవర్మ పాలించే కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజధాని చుట్టు పక్కల గ్రామ ప్రజలంతా యాడాదికి మూడు పంటలు పండించుకుంటూ సుఖశాంతులతో జీవించేవారు. ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఒక బందెపోటు ముఠావచ్చి గ్రామాల మీద పడి,  దోచుకో సాగింది. సరిగ్గా పంటలు పండి ధాన్యం ఇల్లు చేరేలోగా వచ్చి మొత్తం దోచుకుపోయేవారు. ఎదురు తిరిగిన వారిని చావబాదేవారు. వారి దెబ్బలకు బతికున్నా మళ్ళాలేచి పని చేసుకునే స్థితి ఉండేది కాదు రైతులకు.

           ఏం చేయాలో తోచక ఒకమారు సిస్తు వసూలు చేయను వచ్చిన రాజోద్యోగులతో చెప్పుకున్నారు రైతులంతా. మహారాజు కొందరు సైనికులను పంపి రాజ్యంచుట్టూతా బందెపోటుల కోసం వెతికించాడు. ఒక్కరినైనా పట్టుకోలేక పోయారు సైనికులు.

           ప్రతీ ఏడాదీ పండిన పంట బందెపోటుల పాలపడుతుండటాన రైతులంతా తిండికి నోచుకోక దైన్యంతో, భయంతో జీవించసాగారు. పంటవేసి పండించను ఓపిక లేక, పండినా దక్కదన్న భావనతో శ్రధ్ధగా పనిచేయలేక పోయారు.

           ఇలా ఉండగా ఒక రోజున ఆ రాజ్యపు సరిహద్దులో ఉన్న మఱ్ఱిపాడు అనే గ్రామానికి ఒక సాధువు వచ్చి ఆ ఊరి మధ్యలో ఉన్న మఱ్ఱిమాను క్రింద కూర్చోనుండటం గ్రామస్థులు చూసి బందెపోటులు ఆ మాయా వేషంలో వచ్చారేమోని భయంతో ఆ వైపు రాకుండా దూరంగా వెళ్లసాగారు. కొందరు చిన్న పిల్లలు, మహిళలు దగ్గరకు వచ్చి ఒంగిఒంగి నమస్కరించసాగారు.

           ఆ సాధువు కళ్ళు తెరచి చూసి ” మీరంతా నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో నాకు తెలీడం లేదు. నేను దొంగనూ కాను, మోసకారినీ కాను, నేను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ దక్షిణాన ఉన్న రామేశ్వరంలో భగవంతుని దర్శించను బయల్దేరాను. ఏ గ్రామంలో రాత్రి ఐతే అక్కడ చెట్టుక్రింద పడుకుని, గ్రామస్తూలేమైనా బిక్షఇస్తే తిని తెల్లారి బయల్దేరి వెళతాను. రాత్రి నేను వచ్చే సరికే మీరంతా సూర్యోదయానికి ముందే నిద్రించి నట్లున్నారు. మీరంతా ఎందుకో  భయపడుతున్నట్లున్నారు. చెప్తే నాకు చేతనైన సాయం చేస్తాను.” అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అక్కడున్న పదేళ్ళ బాలుని దగ్గరకు పిలిచి , ” బాలకా! చిన్నవారు నిజం చెప్తారు. నీవు చెప్పు విషయం, నీకేమీ భయం లేదు. నా వద్ద ఉన్న మూలిక ఇస్తాను” అని తన జోలెలోంచీ ఒక మూలిక తీసి ఆ బాలుని చేతికి కట్టి, ” ఇప్పుడు చెప్పు” అనగానే ఆ బాలుడు విషయమంతా చెప్పాడు.” ఓస్ ఇంతదానికి ఎంతో బలమున్న మీరంతా భయపడ్డమా! మీరాజ్యానికే కాక మీ అందరికీ  సిగ్గుచేటు.  నేనోమాట చెప్తాను. ఈ బాలునికి ఇచ్చిన మూలిక మీ అందరికీ ఇస్తాను. మీకో మంత్రోపదేశం చేస్తాను. ఒక భస్మం ఇస్తాను. నేను చెప్పినట్లు చేశారంటే మీకు బందెపోటుల భయం పోతుంది. అంతా మీకే దొరికిపోతారు. ” అని చెప్పి ఎప్పుడు ఏం చేయాలో వివరించి అందరికీ ఒక మంత్రం ఉపదేశించాడు.

           ఆ సాధువు తాను చెప్పిన అమావాస్యనాటికి రాజ్యం చుట్టుతా ఉన్న గ్రామాలన్నీ చుట్టబెట్టి అందరికీ ధైర్యం చెప్పి, ఏం చేయాలో బోధించాడు. ఆ అమావాస్యరానే వచ్చింది. ఆ రోజు రాత్రి అన్ని గ్రామాలవారూ ఊరిమధ్య చలికాచుకోను అన్నట్లు ‘నెగడి’ వేసుకుని చుట్టూ కూర్చున్నారు. సాధువు చెప్పిన మంత్రం జపిస్తూ ఆయన ఇచ్చిన భస్మం చేతుల్లో భద్రంగా పట్టుకుని ఉన్నారు. బందెపోటులు ఇద్దరు పెద్ద కర్రలు పట్టుకుని ఊపుతూ రానే వచ్చారు.

           గ్రామస్తులు వారికి ఒంగి ఒంగి నమస్కరిస్తూ వారు మధ్యకు రాగానే అంతా ఒక్కాసారిగా లేచి ఆ భస్మాన్ని వారి కళ్ళలో చల్లి, దాచుకున్న పెద్ద మోకులు వారిచుట్టూ త్రిప్పి మఱ్ఱి మానుకు కట్టేసి, అరవకుండా నోళ్ళలో సాధువు ఇచ్చిన రసం పోశారు. బందెపోటులు స్పృహతప్పారు. ముందే సాధువు కబురుచేసి ఉండటాన ఆ పాటికి అక్కడికి చేరిన సైనికులు దొంగల పెడరెక్కలు విరచి కట్టేసి బండ్లలో  వేసుకుని రాజ్యానికి తరలించారు.

           మహారాజు ఉదయాన్నే సాధువును సభకు రావించి “మహనుభావా! మా సైనికులు చేయలేనిది రైతులు ఎలా చేయగలిగారు?. మీరు బోధించిన మంత్రమేది? ఆ భస్మమేది? ఆ మూలిక ఏమి?” అని అడగ్గా, సాధువు చిరునవ్వుతో,”మహారాజా!మీ రైతులు మహా బలశాలురు. ఐతే భయం వారిని భీతులను చేసింది. వారి బలం వారికే తెలీకుండా చేసింది. నేను వారికి చెప్పిన మంత్రం ‘అహం బ్రహ్మాస్మి’. ఇచ్చిన భస్మం కేవలం బూడిద. మూలిక అర్జున చెట్టువేరు. అది రక్తప్రవాహాన్ని సజావుగా జరుపుతుంది అంతే. కేవలం భయం పోగొట్టను మాత్రమే నేనీ పనిచేశాను. దీని వలన ఐకమత్యం, ధైర్యం కలిగి అంతా కలసికట్టుగా బందెపోటులను ఎదుర్కున్నారు, అంతే. భయం వీడితే అంతా విజయమే.” అంటూ ,అని గుట్టు విప్పి లేచి  సభ నుండీ వెళ్ళిపోయాడు ఆ సాధువు.  

ధైర్యే సాహసే లక్ష్మీ  .

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.