
చిత్రం-71
-గణేశ్వరరావు
క్రిస్టియన్ మత సంప్రదాయంలో ‘ ఐకన్ ‘ చిత్రకళకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మతాధికారులు బైబిల్ కు సంబంధించిన కథల చిత్రాలను, దైవ రూపాలను చిత్రించమని చిత్రకారులని కోరేవారు. చిత్రకారులకు లొంగని వస్తువంటూ వేరే లేదు. వారు రూప చిత్రాలను అద్భుతంగా చిత్రించే వారు. ఆ ‘ ఐకన్ ‘ లలో కేవలం ముఖాలను మాత్రం చిత్రించే వారు. వాటిని చర్చీలు, జనం ఆదరించే వారు. అవి ప్రజల్లో భక్తి భావాన్ని కలగజేసేవి. ( బహుశా ఆ చిత్రాలు దైవ రూపాలను చూపించే భక్తి సంప్రదాయానికి చెందినవి కావడం వలనే ఏమో, తర్వాతి కాలాల్లో కొన్ని ప్రాంతాల్లో వాటిని జనం నిరసిస్తూ ఆందోళన లేవదీశారు , దానితో అవి ప్రభావాన్ని కోల్పోయాయి. ) 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు శాసోఫరాతో ( Giovanni Battista Salvi da Sassoferrato) ఇటలీలోని తన స్వగ్రామం (Sassoferrato ) పేరుతో ఆయన అలా పిలవబడేవారు) వేసిన ‘ మేరీ మాత ప్రార్థన ‘ ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ రూప పటంలో మేరీ మాత రెండు చేతులు ముడుచుకుని, కళ్ళు మూసుకుని దేవుడి ముందు ధ్యాన ముద్రలో నిలుచుని ఉన్నట్లు కనిపిస్తుంది. మేరీ వెనక ఏ కాంతి చక్రమూ లేదు. మేరీ మాత మొహంలో ప్రశాంతత, కరుణ తాండవిస్తున్నాయి. ఆమె తల వాల్చి నిలుచునే భంగిమ .. కనబరుస్తూన్న హావభావాలు ఎంతటి రాతి హృదయాన్నైనా కరిగించేస్తాయి. మేరీ ధరించిన దుస్తులకు చిత్రకారుడు ఎంతో ప్రాధాన్యతని ఇచ్చాడు .. తెల్లని రంగులో మేలి ముసుగును, నీలి రంగులో ఆమె ధరించిన దుస్తులనూ చిత్రించాడు. వెలుగిచ్చే తెలి మబ్బుల నీలాకాశం, నీరిచ్చే నీలిమబ్బుల వింత వింత మెరుపులనూ అవి మనకు గుర్తు చేస్తాయి. చిక్కని నలుపు రంగు నేపథ్యంలో మేరీ ప్రకాశవంతంగా చూపించడానికి ఒక కారణం వుంది. తెలుపు – నలుపు రంగుల్లోని వైరుధ్యం, వెలుతురు చీకటిని పారదోలుతోందన్నదానికి ప్రతీకగా వాడబడింది. మేరీ మొహం కొంత వరకు నీడలోనే ఉంటుంది, కళ్ళు నేలకి వాలి ఉంటాయి, అత్యంత సున్నితమైన తెలుపు రంగులో ఆమె మొహాన్ని చిత్రకారుడు ప్రకాశవంతంగా చూపిస్తాడు. ఆమె బుగ్గలను గులాబీ రంగుల్లో చిత్రించడంలోనూ మొహంలో మృదుత్వం కనబరచడంలోనూ చిత్రకారుని ప్రతిభ ద్యోతకమవుతోంది. . ప్రార్థన ముద్రలో జోడించిన ఆమె చేతులు చిత్రానికి అదనపు ఆకర్షణను చేకూరుస్తూ, ఎంతసేపూ చూసినా తనివి తీరని ఆనందాన్ని కలగజేస్తుంటాయి. చిత్రంలోని వర్ణ సంవిధాన నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది! మేరీ మాత ముఖ లక్షణాలు గ్రీకు చిత్ర కళా సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నత స్థాయిలో చిత్రీకరించబడ్డాయి. . అదే సమయంలో సహజత్వానికి కూడా చిత్రకారుడు చోటు కల్పిస్తూ మేరీ మాతను చిత్రించడలో వాస్తవికతను కూడా ప్రదర్శించాడు. దీని ఫలితంగా – ఈ చిత్రాన్ని చూస్తూన్నప్పుడు మనకు ఏ తేజోమయమైన మహాలక్ష్మీ దేవి రూపాన్నో చూస్తున్న అనుభూతి కలుగుతుంది, సహజచిత్రం అయినప్పటికీ .. ‘బాహుబలి ‘ లో దేవకన్య వేషంలో మనల్ని మైమరిపించిన తమన్నా దుస్తులను వేసుకున్న మన పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టు అనిపించదు.
ఈ చిత్రంలో ప్రధానంగా మనం గుర్తించాల్సినవి మూడు గొప్ప అంశాలు:
మొదటిది సరళత – సామాన్యులు కూడా ఈ చిత్రాన్ని చూసి పరమానందం పొందవచ్చు. చిత్రకళా మర్మం తెలుసుకోవాలని అవస్థలు పడనక్కరలేదు. భావం వెంటనే గ్రహించి సౌందర్యానుభూతిని పొందవచ్చు.
రెండవది: సున్నితత్వం: మేరీ మాతలో మాతృమూర్తిని మనం దర్శించగలం. అది ఒక మరపురాని అనుభూతి కదా, అమ్మని ఇష్టపడని వారు ఎవరుంటారు?
మూడవది: కళా వైభవం. ఎంతో ప్రతిభతో చిత్రకారుడి కుంచెలోని జాలు వారిన కాంతి లీనుతున్న నీలం.. ఎరుపు రంగుల మిశ్రమం!
ఈ చిత్రానికీ రాఫేల్ చిత్రం ‘మడాన'(Madonna ) కు పోలికలున్నాయి. గ్రీకు పాలరాతి శిల్పాల పోలికలను కూడా వీటిలో చూడవచ్చు. చిత్రకళలో చోటుచేసుకున్న మార్పులను జామినీరాయ్ ఆధునిక పోకడలను ఆయన చిత్రం ‘ Madonna & Child’ లో చూడగలం. శాసోఫరాతో ‘మేరీ మాత ప్రార్థన ‘ చిత్రాన్ని లండన్ లోని నేషనల్ గేలరీ వారు భద్రపరిచారు.
ఈ సందర్భంలో నాకు చలం రాసిన కవిత ‘ప్రార్థన.. ‘ గుర్తొస్తోంది:
‘ఆకాశాన మబ్బుల్లో
జుట్టు విరబోసుకుని,
నక్షత్రాలు పూలుగా
దిక్కులకి చేతులు జాచి
వింత అరన్యాంబరం దాల్చి
సముద్రాలు ఘర్మధారలుగా,
మా బాధల్ని ప్రాణాల్ని మరణాల్ని
కాళ్ళకి కట్టుకు తాండవించి,
నూతన సందేశాన్ని
సుందర ప్రణయాన్ని
సృష్టికాంతా
వినిపించు:
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
