కాదేదీ కథకనర్హం-21

తిరిగిరాని గతం – 4

-డి.కామేశ్వరి 

ఇప్పటివరకూ ఏ పురుషుడు ఆమెని ఎట్రాక్ట్ చెయ్యలేదు. యూనివర్శీటీలో కొలీగ్స్ అంతా పెళ్ళయిన వాళ్ళు…..ముసలి భావాలి, సంసారజంజాటాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప స్మార్ట్గా, చలాగ్గా వుండే మగవాడే ఆమెకి పరిచయం కాలేదు. అలా అనేకంటే ఆమె పరిచయం చేసుకోలేదు. ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమ పెళ్ళి కానిదని కాస్త చొరవ తీసుకోడానికి ప్రయత్నించి, ఆకర్షించాలని ప్రయత్నం చేసినా మహిమ అలాంటి అందరినీ దూరంగానే వుంచేది. జీవితం అంటే యూనివర్శీటీ, పాఠాలు మాత్రమే కాదు ఇంకేదో కావాలి – అనిపించే వేళకి ముప్పై నాలుగు నిండాయి.

ఆ టైములో ఓసారి వల్లి పుట్టింటికి వచ్చింది. ఇద్దరు టీనేజ్ పిల్లలతో పక్కా యిల్లాలు అయిపొయింది. అక్కడికి మహిమ వెళ్ళే సరికి వల్లి పినమామగారి కొడుకు నరేష్ అంటే మహిమ కోసం చూసిన అతను భార్యతో సహా – ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయింది వల్లి పరిచయం చేస్తుంటే, ఇతన్నా తను వద్దంది…..ఎంత స్మార్ట్గా, ఎంత హుందాగా వున్నాడు. అతని భార్య అయితే ఎంత బాగుంది….ఇద్దరినీ చూస్తె, వాళ్ళ జోక్స్ మాటలు వింటుంటే “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటే యిదేనేమో అనిపించింది. పిల్లలిద్దరూ కడిగిన ముత్యాల్లా వున్నారు. ఆ ముచ్చటైన దంపతులని, సంసారాన్ని చూస్తె —— తనది కావాల్సిన దాన్ని చేతులారా వదులుకుంది అన్న భావం ముల్లులా మనసుని తాకింది. పెళ్ళి అంటే నరకంలోకి అడుగుపెట్టడం మాత్రమే కాదు – అదృష్టం బాగుంటే స్వర్గంలానూ వుండొచ్చు అనిపిం చింది. ఒకసారి అతన్ని తను చూసి వుంటే ఎంత బాగుండేది — పెళ్ళిచూపులు వద్దని ఎంత పొరపాటు చేసింది. ఆమె మొహంలో హావభావాలు కనిపెట్టిన వల్లి స్నేహితురాలి వంక “చూసావా నీవేం పొందలేక పోయావో” అన్నట్టు చూసింది.

ఇద్దరు స్నేహితురాళ్ళు డాబా మీద కూర్చుండగా — “ఏం ఇప్పటికన్నా పెళ్ళి కావాలనిపిస్తుందా లేదా…’ అడిగింది వల్లి. తల ఆడించింది. అది వద్దనో, కావాలనో మహిమకే తెలియదు. స్నేహితురాలిని చూసి నిట్టూర్చింది వల్లి- అందంగా వుండే మిసమిసలాడే ఆ రంగువన్నె తగ్గడం ఆరంభించింది. మొహంలో ఆ కళ, నునుపు తగ్గిపోయాయి. కళ్ళకింద నల్లచారలు వచ్చాయి. మొహంలో “గ్లో” పోయింది. “లైఫ్ బోర్ కొట్టడంలేదు….. ఒక్కర్తివి ఒంటరితనం ఫీలవడంలేదూ…..’ మహిమ తలదించుకుంది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గుటక వేసింది. “చేసుకో మహీ —-బి ఫోర్ యిట్ జీ టూ లేట్…..జీవితంలో ప్రతి మనిషికి మార్పుండాలి…..ప్రతి దశలో మనిషికి మార్పు లేకపోతే పిచ్చేత్తుతుంది. పసితనంలో ఆటపాటలు, చిన్నప్పుడు చదువు సంధ్యలు – యవ్వనంలో పెళ్ళి, ఆ తరువాత పిల్లలు, సంసారం….ఇంకా పెద్దయ్యాక మనవలు…..ఇలా ప్రతి స్టేజిలో జీవితంలో కొంత అనుభవాలు, అనుభూతులు కావాలి మనిషికి. ప్రతి స్టేజిలో మనిషికి ఓ తోడుండాలి. మనసులోని మాట చెప్పేందుకు నా అనే మనిషి వుండాలి. జీవితం నడిచే రైలు బండిలా వుంటేనే, ఓ గమ్యం చేరాలన్న ఆరాటంతో, ప్రయాణంలోని అన్ని ఇబ్బందులు సహించగలడు మనిషి – ఎంత రద్దీ, చమట, చీదర వున్నా రైలు కదులుతున్నంత సేపు మనిషి సర్దుకుపోతాడు – అదే రైలు ఆగిపోతే ఎంత అసహజంగా, ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకు. రైలు కదలాలి. నీవెంత ఏ.సి. క్లాసులో కూర్చున్నా రైలు కదలకపోతే ఆ ఏ.సి చల్లదనం, నీకు తృప్తి నివ్వలేదు. కదలని రైలులో ఎన్ని రోజులు మార్పు లేకుండా కూచోగలవు. నీకు డబ్బుంది, చదువుంది, బంగాళా, కార్లు, చీరలు నగలు అన్నీ వున్నాయి. కాని నీ జీవితానికి పరిపూర్ణత వుందనిపిస్తుందా – ఏదో లోటు కన్పించడంలేదూ. మహిమా…..ఇప్పటికయినా తొందరగా ఎవరినన్నా చేసుకో…..అన్నింటికన్నా మనిషికి శాపం ఏమిటో తెలుసా? ఒంటరితనం….అది నీవు ఇప్పటికన్నా గ్రహించలేదూ….”

“నన్నెవరు చేసుకుంటారు ఇప్పుడు…..’ వినిపించీ వినిపించనట్లుంది.

“ఇన్నేళ్ళల్లో నీకు నచ్చిన మగాడే కన్పించలేదా…..ఫరవాలేదు. ఈ వయసుకి సరిపోయిన వాళ్ళుంటారు. పోనీ పేపర్లో వేయి…..వల్లి” సలహా.

ఇంటికి వెళ్ళాక ఎందుకో ఏదో దిగులు, గుండెల్ని మెలిపెట్టినట్లు ఇబ్బంది…..మహిమకి ఎందుకో అకారణంగా కళ్ళనీళ్ళు వచ్చాయి.

కాలక్షేపానికి అన్న కూతురిని యూనివర్శీటీలో తన దగ్గిర చదివిస్తానని తెచ్చి పెట్టుకుంది పల్లవిని. అప్పటినుంచి కాస్త యింట్లో కాలక్షేపం ఆవుతోంది. అన్నగారు పెళ్ళిపెటాకులు వద్దన్న మహిమ దగ్గర కూతురిని ఉంచడానికి చాలా సందేహించాడు. వున్న చోట సీటు దొరక్క ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు.

ఆరోజు అన్నగారు ఆ పూరోలో పల్లవికి ఏదో మంచి సంబంధం వుందంటే మాట్లాడడానికి వచ్చాడు. “ఇప్పుడా, నా పరీక్షలు అయితే గాని నేనేం చేసుకోను.ఇప్పుడెం సంబంధాలు చూడద్దు. చూసి నన్ను ప్రాణం తీయకండి. ముందే చెపుతున్నాను….’ అంది పల్లవి.

అన్నగారు ఏదో అనేలోపలె “పరీక్షకేంలే….అవే అవుతాయి. పెళ్ళి చేసుకుంటే ఎగ్జామ్స్ రాయకూడదనేం వుందా…..ఫోటోలో అబ్బాయి బాగున్నాడు మంచి ఉద్యోగం…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.