ఒమన్ దేశపు అనుభూతులు

-డా.కందేపి రాణి ప్రసాద్

చమురు దేశం ఎడారి దేశం, గల్ఫ్ దేశం అని రకరకాల పేర్లు కలిగిన ఒమన్ దేశాన్ని చూడాలనుకున్నాం. దుబాయి దేశాన్ని చూసి పనిలో పనిగా ఒమన్, సౌదీ అరేబియా దేశాన్ని కూడా చూడాలని అనిపించింది. మా సిరిసిల్ల ప్రాంతం నుంచి ఒమన్ దేశ రాజధాని మస్కట్ వెళ్ళిన వారు ఇంటికొకరు ఉంటారు. ఈ ఒమన్ దేశం అరేబియా సముద్ర తీరాన ఉన్న దేశం. ఇక్కడ ఒమన్ రియాల్స్ కరెన్సీగా ఉన్నాయి. మన హైదరాబాద్ నగరం కన్నా చిన్న దేశం.వైశాల్యం, జనాభా దేనిలో చూసిన మన తెలుగు రాష్ట్రాల కన్నా చాలా చిన్నది. కానీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడం వలన ధనవంతమైన దేశంగా మారిపోయింది. 230 రూపాయలిస్తేనే కానీ ఒక రియాల్‌కు సమానం కాదు. మన రూపాయికి ఎంత విలువ తక్కువ వున్నదో అర్థం అయితే చాలా బాధగా అనిపించింది.

మా హాస్పిటల్‌కు వచ్చే పేషంట్లు చాలా మంది మస్కట్లో ఉంటారు. ఏ పని చేయటానికి వెళ్ళారమ్మా? అని అడిగితే కార్లకు డ్రైవర్లుగా, భవన కార్మికులుగా, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు వంటి పనులు చేయడానికి వెళ్ళామని చెబుతుంటారు. నా అమాయకత్వం వలన అదేదో పేద దేశమని అనుకున్నాను. కానీ ఈ రోజు ఒమన్ దేశంలో దిగిన తర్వాత గానీ తెలియలేదు ఒమన్ ధనిక దేశమని. ఒమన్ రాజధాని మస్కట్.

తూర్పు పర్షియా సామ్రాజ్యంలో ఒమన్ అనుబంధ రాజ్యంగా ఒకప్పుడు ఉండేది. దీనిని ‘మాగన్’ అనే పేరుతో పూర్వం పిలిచేవారు. 19వ శతాబ్దం తొలి నాళ్ళలో ‘మస్కట్ ఒమన్’ అనే పేరుతో బలమైన రాజ్యంగా పేరు పొందింది. అప్పట్లో బెలూచిస్తాన్, జాంజిబార్ కూడా ఒమన్ రాజ్యం అధీనంలో ఉండేవట. కాలక్రమేణా ఆ ప్రాంతాలన్నీ వేరు పడినాయి. 1970 సం.లో సుల్తాన్ బిన్ సయ్యద్ అస్ సయ్యద్ తన తండ్రి ‘సయ్యద్ బిన్ అనే టైమూర్’ ను అధికారం నుండి తొలగించి అధికారం లోకి వచ్చాక, అభివృద్ధిలో విపరీతమైన మార్పు వచ్చింది. ఆర్ధిక సామాజిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి కనిపించింది. విద్య ఆరోగ్య రంగాలపై శ్రద్ద పెట్టి, మహిళలకు అన్నిరంగాలలో అవకాశాలు ఇవ్వడం వల్ల దేశ అభివృద్ధికి కారణమైంది.

సా.ళ 1వ శతాబ్దం నుండి అరబ్బులు ఒమన్ దేశంలో ఉండేవారు. పూర్వం నుంచి కూడా ఒమన్ అరబ్బుల అధీనంలోనే ఉన్నది. ఒమన్ పురాతన కాలం నుండి ఒక ముఖ్యమైన వర్తక వాణిజ్య కేంద్రంగా ఉండేవి.మస్కట్ నౌకాశ్రయాన్ని ఒకప్పుడు పోర్చగీసు వారు ఆక్రమించారు. ఒట్టోమన్ సామ్రాజ్యం, పర్షియా ఆక్రమణల అనంతరం, సుల్తానుల రాజ్య పరిపాలన ఆరంభమైంది. ఇక్కడ పరిపాలన చేసేది సుల్తాన్ మాత్రమే. సుల్తాన్‌కు 25 మందితో కూడిన మంత్రి మండలి ఉంటుంది. ‘మజ్లీస్ షూరా’ అనే సలహా సంఘాన్ని కూడా ఎన్నుకున్నారు. రాజాజ్ఞలు తప్ప ప్రత్యేక రాజ్యాంగమేదీ లేవట . వారసత్వంగా వచ్చే సుల్తానులే దేశాన్ని పరిపాలిస్తారు.

మేము షార్జా ఎయిరోపోర్టు నుండి ఒమన్ దేశ రాజదాని మస్కట్‌కు 45 నిమిషాల్లో చేరుకున్నాము. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఎయిర్ అరేబియా ద్వారా వచ్చాము. ఈ ఎయిర్ పోర్టు ఒమన్ దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం. ఇది ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. దీనిని ఒకప్పుడు ‘‘సీబ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’’ అని పిలిచేవారు. ఒమన్ ఎయిర్ వేయిన్‌కు మెయిన్ ఆఫీసుగా ఉండేది. బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎమిరేట్స్ ఎయిర్ వేన్, ఎతిహాడ్ ఎయిర్ వేస్, టర్కీష్ ఎయిర్ లైన్స్ వంటి వాటికి ఈ విమానాశ్రయం సేవలు అందిస్తోంది. మేము ఇంతకు పూర్వం దుబాయి వెళ్ళినపుడు ‘‘ఎతిహాడ్ ఎయిర్ వేస్’’ లోనే వెళ్ళాము. మస్కట్లో దిగాక మేము హాటల్‌కు వెళ్ళడానికి టాక్సీ బుక్ చేసుకున్నాము. ఇక్కడ టాక్సీలన్నీ ఆరంజ్, వైట్ రంగుల్లో ఉన్నాయి. ‘‘ఓ టాక్సీ’’ అనే దానిలో మేము ‘‘మస్కట్ ఫ్లాజా హోటల్‌కు చేరుకున్నాం. ఈ హాటల్ చాలా బాగుంది. టాక్సీ నాలుగు రియాల్ అని చెప్పగానే చీప్‌గా దొరికిందని అనుకున్నాను. ‘‘వెయ్యి రూపాయలమ్మా’’ అన్నారు మా పిల్లలు. ‘‘అవునా ఇక్కడ పెట్రోల్ చీప్‌గా దొరుకుతుంది కదా అందుకే టాక్సీకి రేటు తక్కువేమో అనుకున్నాను’’అని అన్నాను నేను. పెట్రోలు ధర చాలా తక్కువగానే ఉంటుంది గానీ, ఒక్క రియాల్‌కే 230 రూపాయలు కదా అని చెప్పారు. ఈ దేశపు రియాల్స్‌ను ‘‘ఒమన్ రియాల్స్’’ అంటారు. అంటే OMR అంటారు. అలాగే సౌదీ అరేబియా దేశానికి చెందిన కరెన్సీ కూడా రియాల్సే. వీటిని ‘‘సౌదీ అరేబియా రియాల్స్’’ అంటారు. దీనిని SAR అంటారు. ఇదీ ఈ దేశపు కరెన్సీ విషయాలు.

మేము హోటల్‌కు చేరుకుని, బుకింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, రూమ్‌కు వెళ్ళాము. మాకు  7వ ఫ్లోర్‌లో 723 రూం ఇచ్చారు. రూమ్ బాగుంది. దుబాయ్‌లో రూమ్ కన్నా బాగుంది. దుబాయ్‌లో ఈ సీజన్‌లో చాలా ఎక్కువ రేటు తీసుకున్నారు. ఈ హోటల్‌లో 8 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి. కానీ చాలా పెద్దగా బిల్డింగ్ అద్భుతంగా కనిపిస్తున్నది. లగేజీ రూమ్ లోపల పెట్టేసి, కాళ్ళు, చేతులు కడుక్కుని బయటకు బయల్దేరాం. కాసేపు హోటల్‌ దగ్గర్లో నడుచుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత దగ్గర్లోనే ఉన్న దిల్‌కుష్  రెస్టారెంట్‌లో భోజనం చేశాం. ఇది తమిళనాడు కాళ్ళు పెట్టిన హోటల్. ఇడ్లీ,దోశ, పూరీ వంటి మన టిఫిన్లు, మన భోజ నాలు దొరుకుతున్నాయి. మేము తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం.

మరుసటి రోజును సిటీ టూరుకు పెట్టుకున్నాం. హటల్లోని బ్రేక్ ఫాస్ట్ బాగాలేదు. బ్రెడ్, ఫ్రూట్స్ కాఫీ, కూలే డ్రింక్స్ ఉన్నాయి. కాఫీ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ ఎక్కువగా బ్లాక్ కాఫీయే తాగుతారట. మేము ఫ్లైట్ దిగగానే వేడివేడిగా బ్లాక్ కాఫీ ఇచ్చారు. దీనితో పాటుగా, ఖర్జూర హల్వాను కూడా పెట్టారు. ఇంత వరకు ఏ ఎయిర్ పోర్టులోనూ ఇలా కాఫీ, హల్వా ఇవ్వడం నేను చూడలేదు. ఎవరూ చెప్పగా వినలేదు కూడా. మొదటగా గ్రాండ్ మజీద్‌కు వెళ్ళాం. ఇక్కడ హిజాబ్ ధరించనిదే లోపలకు పంపరట. చేతులు కూడా పూర్తిగా కనిపించకూడదు. కాబట్టి హ్యాండ్ గ్లోవ్స్ వంటి వాటిని కొనుక్కున్నాను. వాటిని వేసుకున్నాను. నేను వేసుకున్న చున్నిని హిజాబ్ లాగా కట్టారు. కాబట్టి ఇప్పుడు మజీద్‌లోకి ప్రవేశించవచ్చు. మా డ్రైవర్ చాలా చక్కని ఇంగ్లీషులో నవ్వుతూ వివరిస్తున్నాడు. మేము ఫోటో కూడా తీసుకున్నాం.డ్రైవర్లు నచ్చితే మా టూర్‌లలో ఫోటోలు తీసుకుంటాం.

సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదు చాలా పెద్దదిగా ఇస్లామిక్ శైలిలో కట్టబడి ఉన్నది. ఈ మసీదు హాలులో ఒకేసారి 21,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. డ్రైవరు మా వెంటే ఉంటూ ప్రతి విషయాన్ని వివరించాడు. గైడు అవసరం లేకుండా పోయింది. లోపల సీలింగ్ నుంచి పెద్ద షాండ్లియర్లు వేలాడుతూ ఉన్నాయి. సిలింగ్ అంతా కూడా చిత్ర పటాలతో అందంగా కట్టబడి ఉన్నది. సీలింగ్‌లో ఉన్న వాటిలో షాండ్లియర్లలోనూ బంగారాన్ని వాడి తయారు చేశారట. మసీద్ గోపురం 300 అడుగుల ఎత్తులో ఉంటే, షాండ్లియర్ 46 అడుగుల ఎత్తును కలిగి ఉన్నది. ఈ షాండ్లియరీ బరువు టన్నులట. 60,000 స్ఫటికాలు, వెయ్యికి పైగా ఎలోజిన్ బల్బులు ఉన్నాయట. డ్రైవర్ చాలా చెప్పాడు. కానీ నేను గుర్తు పెట్టుకోలేక పోయాను. ఇది ఇటలీలో తయారయిందని చెప్పాడు.

ఈ హాల్‌లో నేల మీద పరిచిన కార్పెట్ గురించి వివరాలు చెప్పాడు. 21 టన్నుల బరువును కలిగిన ఏకైక కార్పెట్ ఇది. ఇది మొత్తం విడివిడి భాగాలు కాదు. ఒకే కార్పట్ మొత్తం రసాయనిక రంగుల్ని వాడకుండా కూరగాయల సహజ రంగులతో నేయబడింది. ఈ కార్పట్ మీద పువ్వులు, తీగలు తప్ప మనుషులు, జంతువుల బొమ్మలు ఉండవు. ఇరాన్ నుంచి తెప్పించారు. సందర్శకులు నడిచేంత మేర కార్పెట్ మీద వేరే వస్త్రాన్ని పరిచారు. చాలా ఫోటోలు తీసుకున్నాము. ఈ మసీద్ భవన నిర్మాణం కోసం మన దేశం నుంచి ఇసుక రాయిని దిగుమతి చేసుకున్నారట. తలుపులు, కిటికీలకు గాజు ముక్కలతో అలంకరణ వల్ల సూర్యకిరణాలు రంగురంగుల్లో లోపల ప్రతిఫలిస్తున్నాయి. మసీద్ చుట్టూ నాలుగు మీనార్‌లు ఉన్నాయి. ప్రార్థనా మందిరం గానూ, పర్యాటక ఆకర్షణ గానూ ఉపయోగపడుతున్నది ఈ మసీద్.

ఆ తర్వాత అల్ అలమ్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం చూశాం. అల్ అలమ్ ప్యాలెస్ బయట నుంచి మాత్రమే చూడాలి. అక్కడే ఫోటోలు తీసుకున్నాం. ఎక్కడ చూసినా రెండు కత్తులు, డ్రాగన్ ఉన్న లోగోలు ఉన్నాయి. ఈ సింబల్ పైన కిరీటం బొమ్మ ఉంటే కేవలం సుల్తాన్ మాత్రమే వాడతారట. సముద్రంలో పెద్ద పడవలు కనిపించాయి. అవి సుల్తాన్‌వి అని చెప్పాడు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఒమన్ 2016లో మొదలు పెట్టారట. రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి దాకా ఒమన్ రాజ్య చరిత్ర, సుల్తాన్‌ల చరిత్రను తెలిపే ఫోటోలు, చిత్రాలు ఉన్నాయి. ఒక తరం నుండి మరొక తరం వచ్చేసరికి మారిపోయిన సాంప్రదాయ కళలు, జీవన నైపుణ్యాలు ఎలా ఉన్నాయో ఇక్కడి చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇక్కడ నుండి రాయల్ ఒపేరా హౌన్‌కు వెళ్ళాము. తెల్లని పాలరాయితో అలంకరించబడిన థియేటర్లు బాగున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయబడిన ఒపేరా హౌస్ విలాసవంతమైన వేడుకలకు వేదికగా నిలుస్తుంది. నేను ఆస్ట్రేలియా ఒపేరా హౌస్ చూశాను కాబట్టి, నాకు అద్భుతంగా అనిపించలేదు. లోపల కారిడార్లు తిరిగి తిరిగి ఒక హాల్‌ లోపలకు ప్రవేశించాము. అక్కడ కుర్చీలకు టీవిలు ఉన్నట్లుగా అక్కడున్న కుర్చీలకు అమర్చబడి ఉన్నాయి. ఇక్కడ సాంప్రదాయ ఒమాన్ సంగీత కచేరీలు జరుగుతాయి. నాటకాలకు అనుగుణంగా వేదికను పైకి, కిందికి జరుపుకునే వీలుంటుంది. అక్కడి కుర్చీలలో కూర్చుని గైడ్ చెప్పింది వింటున్నపుడు నా పక్కనున్న మహిళ ‘‘ఇండియా నుంచి వచ్చారా’’ అని అడిగింది. అవుననగానే ‘‘మేం పాకిస్తాన్ నుంచి వచ్చామని చెప్పింది.’’ నేను ఫొటో తీసుకున్నాను.

అప్పటికే 2 గంటలు దాటడంతో భోజనానికి వెళ్ళాం. భోజనం తర్వాత క్రూయిజ్ షికారుకు వెళ్ళాలనుకున్నాం. మెరీనా భూడార్‌కు వెళ్లితే బోలెడు పడవలు సిద్ధంగా ఉన్నాయి. మేము టికెట్లు తీసుకుని డెక్కీలతో నగిషీలు దిద్దిన ఒక పడవలోకి ఎక్కాము. ఇందులో సన్ సెట్‌ను చూడవచ్చని చెప్పారు. సముద్రం మీద నిలిపిన ఈ పడవలో ఎక్కగానే సీట్లో పడుకున్నాను. చల్లని గాలితో ఆహ్లాదంగా అనిపించింది. రెండు మూడు గంటల సమయంలో క్రూయిజూ షికారు తర్వాత బయటకు వచ్చి ‘‘మస్కట్ సూఖ్‌కు’’ వచ్చాం.

‘‘మస్కట్ సూఖ్‌’’ అంటే మన హైదరాబాద్ బడీ చౌడీ గుర్తు వచ్చేలా ఉన్నది. పూర్తిగా దుకాణాల సముదాయం దొరకొని వస్తువే లేదు. బొమ్మలు, బట్టలు, కార్పెట్లు, అలంకరణ సామాగ్రి, కాశ్మీర్ శాలువాలు, ఇత్తడి నగిషీల పాత్రలు ఎన్నో ఉన్నాయి. నేను బంగారం ఎలాగూ కొనుక్కోవటం లేదు కదా. కనీసం మామూలు గాజులు కొందామని వన్ గ్రామ్ గోల్డ్ షాపులోకి వెళ్ళాను. చాలా రద్దీగా ఉండటంతో చూసేందుకు ఖాళీ లేక రెండు గాజులు కొనుక్కొని వచ్చేశాను. ఒంటె బొమ్మను కొనాలని ఆశపడ్డాను. కానీ కుదరలేదు. ఎడారి దేశంలో ఎడారి ఓడను కొనుకున్నాను. బయట రోడ్డుకు ఒక వైపంతా సముద్రమే.

హోటల్ రూముకు వచ్చి రిఫ్రెష్ అయ్యి, మా డాక్టరు గారి ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. వారిక్కడ మిలటరీ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. కొద్ది సేపటికి డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని కారులో ఎక్కించుకుని, బయటకు తీసుకెళ్ళారు. అలా రోడ్లు, బీచ్‌లు చూశాం. ఆ తర్వాత డిఫెన్సీ వారి మిలిటరీ హాస్పిటల్‌కు వెళ్ళాము. ఇది చాలా పెద్దదిగా ఉన్నది. ఎటు వెళ్తున్నామో, ఎటు బయటకు వస్తున్నామో తెలియటం లేదు.

ఈ డిఫెన్స్ హాస్పిటల్‌కు వెళ్ళే దారంతా కొండలమయం. అప్పుడు గుర్తొచ్చింది డ్రైవరు చెప్పిన మాట ఒమన్ దేశంలో 70%. కొండలు ఆక్రమిస్తాయట. కొండల మధ్యలో నుంచి కారు వెళ్తుంటే డాక్టర్ గారు ఆన్నారు.‘‘ కొండలను తొలిచి ఈ రోడ్డు వేశారు’’ అని చెప్పారు. ఒక్క చిరు మొలక కూడా కనిపించలేదు. దారిపొడుగునా నల్లని టార్పాలిన్లు కప్పిన ట్రక్కుల వలె కనిపిస్తున్నాయి. ఇక్కడి కొండలు గమ్మత్తుగా ఉన్నాయి. మట్టి దిబ్బలే పెద్ద సైజులో ఉన్నాయనిపిస్తుంది. బంకమట్టి నీళ్ళతో కలిపినపుడు ముద్దులుగా కనిపిస్తుంది కదా. అలాంటి కుప్పల్ని పెద్ద సైజులో నిలబెట్టినట్లుగా కనిపిస్తున్నాయి, తప్ప కొండల వలె కన్పించడంలేదు. ఆసుపత్రి మాత్రం అధునాతన హంగులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ డ్యాంలను ఆధునిక దేవాలయాలని అన్నారు. ఈరోజు నాకైతే ఆసుపత్రులను దేవాలయాలు అంటే బాగుంటుందనిపించింది. ప్రాణం కన్నా మిన్న ఏదీ లేదు. ఆ ప్రాణం కాపాడబడే ఆసుపత్రులే ఆలయాలుగా అభివృద్ధి చెందాలి. ఆసుపత్రి ఆలయాలే ఆరోగ్య నిలయాలుగా భావించి పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అవి నిజంగా జీవ దాతలవుతాయి మనిషికి ఆరోగ్యం కన్నా, ఐశ్వర్యం లేదని చెబుతాం కానీ, పాటించం. అనారోగ్యకర విషయాల పట్ల ఆకర్షణను పెంచుకుంటారు. సెవెన్ స్టార్ హోటల్ కూడా అంత పరిశుభ్రంగా ఉండదనిపించింది. దారిలో హైదరాబాదీ బిర్యానీలు, ఇండియన్ రెస్టారెంట్లు బోర్డులు కనిపిస్తున్నాయి. రారమ్మని ఊరిస్తూ పిలుస్తున్నాయి. ము దిల్  రెస్టారెంటుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఒమన్ మాల్, మస్కట్ మాల్ అంటూ మాల్స్ కూడా పెద్ద బోర్డులతో, లైట్లతో ఆహ్వానిస్తున్నాయి . రేపు వస్తామని చెప్పి హోటల్‌కు వెళ్ళి పోయాం.

ఈ రోజు వాడి దయాఖ్ డ్యామ్, సింక్ ఆఫ్ హాల్‌ను చూడాలనుకున్నాం. ఈరోజు వచ్చిన డ్రైవరు గురించి చెప్పుకోవాలి. అతను ఎనిమిది దేశాలు చూశాడట. మన ఇండియాలో ముంబయి, ఆగ్రా చూశాడట. ఆశ్చర్యకరమైన విషయమేమంటే అతని ఇల్లు నాలుగు బెడ్రూంలతో అత్యాధునికంగా ఉన్నది. కారు సొంతమట.కు ఇక్కడి డ్రైవర్ల ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉందన్నమాట అనుకున్నాం.

మస్కట్ నుంచి 558 కిలో మీటర్ల దూరంలో మజారా గ్రామం మీదుగా వెళ్ళాం. డ్యామ్ చాలా పెద్దగా ఉంది. ఇది దేశంలోనే అతి పెద్ద మంచి నీటి విస్తీర్ణం కలిగి ఉన్నది. డ్యామ్ పైదాకా కారులో వెళ్ళాం. కొండల మధ్య సన్నని దారిలో కారు వెళుతూ ఉంటే కనీసం ఒక్క మనిషి కూడా కనపడలేదు. గ్రామం అని బోర్డులు కనిపిస్తున్నాయి, తప్ప ఇళ్ళు కనపడలేదు. కొండల మీద ఖర్జూర చెట్లతో ఉద్యానవనం ఉన్నది. అక్కడ కూర్చోవడానికి బెంచీలు, వాటి మీద పరువులు కూడా ఉన్నాయి. మేం ఉదయం 11 గంటల ప్రాంతంలో వెళ్ళినా ఎండా కాలపు మిట్ట మధ్యాహ్నాపు ఎండలా మలమల మాడి పోతోంది. ఆ ఎండలో ఎక్కువ సేపు ఉండలేకపోయాం. ప్రయాణమే కొండల మధ్య బాగుంటుంది. డ్యామ్ కింద నీళ్ళు నీలం రంగులో అద్భుతంగా కనిపిస్తున్నాయి. నేను ఎండదెబ్బకి చున్నిని తలకు చుట్టేసుకున్నాను. నేల గులాబీలు, తంగేడు పూలు కనిపించాయక్కడ. డ్యామ్ చివరి దాకా నడిచి పాహాలు తీసుకున్నాము. నల్లటి టార్పాలిన్లు కప్పిన మట్టి దిబ్బల్లానే ఉన్నాయి కొండలు. కొండలను చూడటానికే వెళ్ళాలి. నిజ్వా కోటకు వెళ్తామనుకుని సమయం లేదని వెళ్ళలేదు. పెద్దగా బాగా లేదని చెప్పారు.

హవియత్ నజ్మ పార్కులోని బిమ్మా సింక్ హాల్ చూడటానికి వెళ్ళాం. ఇది తూర్పు మస్కట్ ప్రాంతంలోని సుర్‌కు వెళ్ళి హైవేలో ఉంటుంది. అల్ షర్మీయా ప్రాంయలోని పార్కు మధ్యలో ఒక గొయ్యి వలె ఏర్పడింది. దీని అడుగు బాగాన నీళ్ళు ఉన్నాయి. ఈ లోయ సున్నపురాయితో ఏర్పడింది. వచ్చిన వారిలో ఫారెనర్స్ కొంత మంది ఆ గొయ్యిలోని నీటిలో ఈత కొట్టారు. అక్కడ ఎలాంటి రక్షణ లేదు. మా బాధ్యత కూడా లేదని మునిసిపాలిటీ బోర్డులున్నాయి . అటువంటప్పుడు సందర్శకులు ఆత్యుత్సాహం చూపించడం ఒకోసారి ప్రమాదాలకు దారి తీయవచ్చు. గోతికి ఒక పక్కగా రంధ్రం వలె ఉన్నది. దానిలో నుంచి సముద్రంలోకి దారి ఉండవచ్చుననిపించింది. అడుగున ఉన్న సున్నపురాయి కరిగిపోవడం వల్ల పైనున్న ఉపరితల నేల కూలి పోవడం వల్ల సహజంగా ఈ గొయ్యి ఏర్పడినట్లు తెలుస్తోంది. కొంత మంది స్థానికులు పిడుగుపాటు వల్లో, ఉల్కాపాతం వల్లన ఏర్పడిందని కూడా చెపుతున్నారు. అందుకే దీనికి అరబిక్‌లో ‘‘హరియలో నజ్మ’’ అనే పేరు వచ్చింది. అరబిక్‌లో దీని అర్ధం ‘‘పడిపోతున్న నక్షత్రం యొక్క లోతైన బావి’’ . ఈ పార్కు నిండా గుత్తులుగా కాయలు కాసే ఉద్యానవన చెట్లున్నాయి.

తర్వాత ఒమన్ మాల్‌కు వెళ్ళాం. ఇక్కడ 99% మంది సంప్రదాయ దుస్తుల్లోనే ఉన్నారు. పురుషులంతా వారి పొడవైన అంగరఖా, నెత్తిన టోపిలతో కనిపించారు. దుబాయిలో ఈ వస్త్ర ధారణతో తక్కువ మంది కనిపించారు. ఖర్జూరాలు ప్లేటులో పెట్టుకుని అంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ మాల్‌లో స్థానికులు కనిపించారు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలో దొరుకుతాయి. మేము ఫోన్లు, లాప్ ట్యాప్‌లు కోసం అన్వేషించాము. చివరకు ఒక ఫోను కొనుక్కున్నాము.

క్రిస్మస్ వేడుకలకు మాల్‌లన్నీ రెడీ అయ్యాయి. మాకు మాల్‌లో క్రిస్మన్ తాత, శాంతా క్లాజ్ బొమ్మలు, క్రిస్మస్ ట్రీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అక్కడ ఫోటోలు తీసుకున్నాం. మద్యలో ఒక కుర్చీ వేశారు . అక్కడ కూర్చొని మరీ ఫోటో తీసుకోవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. మా వారు పిల్లలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కొంటుంటే, నేను మాత్రం శాంతా క్లాజ్ బొమ్మలతో ఫోటోలు తీసుకున్నాను. మాల్ అంతా తిరిగి కాఫీలు తాగాం. కాఫీ షాపులో వాళ్ళతో మాటలు కలిపితే ఉగాండా నుంచి వచ్చామని చెప్పారు. మ్యాంగో పల్పీని అప్పటికప్పుడే తీసి ఇచ్చారు. కాపిచ్యునో, లాటే కాఫీలు తాగాం. మేం మధ్యాహ్నాం అన్నం తినకపోవడం వల్ల బాగా ఆకలేసి కళ్ళు తిరగడం మొదలు పెట్టాయి. నేనసలే ఎనీమిక్ పేషెంట్‌ను. అందుకే వెంటనే మ్యాంగో, ఆరెంజ్‌ల జ్యూస్‌లు తాగి, కొద్దిసేపు కూర్చున్నాను.

అక్కడ నుంచి మా హోటల్ దగ్గరే ఉన్నది. అయినా నడవలేమని టాక్సీ తీసుకున్నాం. వారం నుంచీ చేతిలో రియాల్స్ లేకున్నా కార్డులతోనే డబ్బులు కట్టేస్తున్నాం. అలాగే కారెక్కి కూర్చున్నాం. హోటల్‌కు వెళ్ళాక, కార్డుతో పేమెంట్ కుదరదంటాడు. మా దగ్గర క్యాష్ లేదు. మేమసలు మనీ ఎక్చేంజ్ చేసుకోలేదు. హాటల్ వాళ్ళను అడిగితే మేమివ్వం అన్నాడు. దగ్గర ఉన్న ATM  సెంటర్‌కు వెళ్ళి ప్రయత్నిస్తే, అది పనిచేయడం లేదని చెప్పారు. కార్డుతో డబ్బులు ఇస్తామన్నా ఎవరు ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడ్డాం.టాక్సీకి ఇవ్వాల్సింది రెండు రియాల్సే. కానీ ఎవరూ ఇవ్వడం లేదు. అప్పటికే రాత్రియిపోయింది. దానికి రెండితలు ఇండియా డబ్బులు ఇచ్చి, టాక్సీ వాడిని శాంత పరిచాము.

దారి పొడుగునా ఉన్న కొండలు, బీచ్‌లు చాలా బాగున్నాయి. వాటి వివరాలు మరో వ్యాసంలో రాస్తాను. ఇంటికి వెళ్ళి పడుకున్నాం. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఇండియా వెళ్ళే ఫ్లైటుంది, కాబట్టి ఉదయాన్నే వెళ్ళాలి. డీమానియెంట్ ద్వీపాలకు వెళ్ళాలని ఉన్నా సమయం లేకపోయింది.

ఉదయమే తయారై, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చాం. డిపార్చర్ టెర్మినల్ కూడా చాలా బాగుంది. బోలెడు ఫోటోలు తీసుకున్నాం. ఫ్రెండ్స్‌కు కావాల్సిన చాక్లెట్ బాక్సులు కొనుక్కున్నాం. ఇక్కడి లాంజ్ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నది. విమానాశ్రయం అంతా చూశాము. ‘‘బి’’ గేట్ల దగ్గర నిలబడ్డాం. ఈ సారి ఒమన్ ఎయిర్ వాళ్ళ  ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఇది మామూలు డొమెస్టిక్ ఫ్లైట్ వలె ఉన్నది. సీ బ్లూ ప్యాంటు, కోటు  వైట్ షర్టు, టై ధరించిన ఎయిర్ హాస్టెస్‌లు ఉన్నారు. ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉన్నది. అందుకని మమ్మల్ని చివరి సీట్లలో కూర్చోబెట్టారు. కనీసం టీవీలు కూడా లేవు. కాకపోతే సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి పడుకుని నిద్రపోయాం. విమానం బయల్దేరాక సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఒమన్ దేశం మొత్తం ఏరియల్ వ్యూ కనిపించింది. చాలా బాగుందని వీడియో తీసి ఫేస్ బుక్‌లో అప్లోడ్ చేశాను. ఏరియల్ వ్యూలో మొత్తం కొండలే కనిపించాయి. కింద సముద్రంలో తోక చుక్కల్లా కదులుతున్నావేమిటా అని చూశాను. నీళ్ళను చీల్చుకుంటూ పడవలు వెళుతున్నాయని అర్థమయింది. మొత్తానికి ఒమన్ దేశ ప్రయాణం ముగించుకుని హైదరాబాద్ చేరాము.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.