అనుసృజన

ఈ వ్యాపారికి దాహమెక్కువ

మూలం : ప్రజాకవి,గిరీష్ చంద్ర తివారీ (గిర్దా)

అనుసృజన: ఆర్ శాంతసుందరి

ఒక వైపు ధ్వంసమైన మురికివాడలూ…ఒక వైపు నువ్వూ.
ఒక వైపు మునిగిపోతున్న పడవలూ…ఒక వైపు నువ్వూ.
ఒక వైపు ఎండిపోతున్న నదులూ…ఒక వైపు నువ్వూ.
ఒక వైపు దాహర్తితో ఉన్న లోకం…ఒక వైపు నువ్వూ.
అయ్యా శభాష్ ! ఏం చెప్పను నీ వైభవం?
నీళ్ళ వ్యాపారివి నువ్వు,
ఆటా నీదే ఆటగాడివీ నువ్వే,
పరచి ఉన్న చదరంగం పావులూ నీవే.
నీరంతటినీ పీల్చేస్తున్నావు,
నదులూ సముద్రాలు దోచేస్తున్నావు,
గంగా యమునా గుండెలమీద,
బండరాళ్ళనే బద్దలుచేస్తున్నావు.
అబ్బా !నీ ఈ స్వార్థం
ఎన్నాళ్ళీ నీ దాష్టీకం
ఈ నేల కదిలిన రోజున
నీ తల పొగరంతా దిగిపోదా!
ఇళ్ళూ వాకిళ్ళు కొట్టుకుపోవా
శిధిలాలే ఇక మిగులిపోవా
బొట్టు బొట్టుకీ మొహం వాచి
ఇక ఏం చేస్తావో చెప్పు వ్యాపారీ !
ఇవాళ పండగ జరుపుకుంటున్నావు
నదులనే దాహానికి గురిచేస్తున్నావు
గంగని బురదగా మారుస్తున్నావు
ఈ భూమి కంపిస్తే ఏంచేస్తావు?
వరల్డ్ బ్యాంక్ టోకెన్ పట్టుకొని ఎక్కడికి వెళ్తావ్?
ప్రాజెక్టులు వేస్తూ ఏం చేస్తావు?
అప్పుల పాలై దిక్కులు చూస్తావు
ఒకవైపేమో ఎండిన నదులూ…ఒక వైపు నువ్వూ.
ఒకవైపేమో దాహార్తితో ఉన్న లోకం…మరోవైపు నువ్వూ !

***

గిరీష్ చంద్ర్ తివారీ నాటక రచయిత, దర్శకుడు, గేయ రచయిత, గాయకుడు, సామాజిక కార్యకర్త . 1945 లో ఉత్తరాఖండ్ లో పుట్టాడు.’చిప్కో’ ఉద్యమంలోనూ ,’ఉత్తరాఖండ్ ఆందోలన్’ లోనూ పాల్గొన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లోని ‘సాంగ్ అండ్ డ్రామా’ విభాగంలో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తన కవితా రచనకే పూర్తి సమయాన్ని కేటాయించి, వాటిని తానే స్వయంగా పాడేవాడు. 2010 లో అనారోగ్యంతో మరణించాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.