
అట్లాంటిక్ మహా సాగర జలాలు
-డా.కందేపి రాణి ప్రసాద్
గ్రీకు పురాణంలోని అట్లాస్ అనే రాక్షసుని పేరు మీదగా మహా సముద్రాలలో రెండవ సముద్రానికి అట్లాంటిక్ మహా సముద్రమని పేరు పెట్టారు. ఈ సముద్రం భూ మధ్య రేఖకు రెండు వైపులా వ్యాపించి నిలువుగా S ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఈ రెండు భాగాలను ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్ సముద్రాలని పిలుస్తారు. ఈ సముద్రం వయస్సు 130 మిలియన్ సంవత్సరాలు. మొట్ట మొదటగా ఏర్పడిన భూమి ముక్కలవడం వల్ల ఈ సముద్రం ఏర్పడిందని చారిత్రక ఆధారాలున్నాయి. ఈ సముద్రం భూమిపై ఐదవ శాతం నీటిని కలిగి ఉన్నది. ఈ సముద్రంలో 12 రకాల కొత్త జీవులున్నాయని పరిశోధనల్లో తేలింది. దీనిని చీకటి సముద్రం అని కూడా అంటారు. టార్పాన్ అనే చేప ఫసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలలోనే జీవిస్తుంది. ఈ సముద్రపు అలలు చాలా ఎత్తుగా 50 అడుగుల ఎత్తులో వస్తాయి. ఈ అట్లాంటిక్ లో బెర్ముడా ట్రయాంగిల్ ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం ఇంతవరకు కనగొనబడలేదు. దీనికి సరిహద్దుగా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్ ఆఫ్రికా, వంటి దేశాలెన్నో ఉన్నాయి.
అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రపు జలాలు ఎప్పుడూ కలుసుకోవు. ఎందుకంటే రెండింటి మధ్య ఉష్ణోగ్రత, లవణస్థితి, సాంద్రతల్లో తేడా ఉండటం వలన రెండు సముద్రాల నీళ్ళ మధ్య తేడా స్పష్టంగా గుర్తించవచ్చు. “గల్ఫ్ ఆఫ్ అలస్కా” వద్ద ఈ రెండు సముద్రాలు కలిసినప్పటికీ వాటి మధ్య బేదం తెలిసిపోతుంది. ఫసిఫిక్ మహా సముద్రం వలె అట్లాంటిక్ మహా సముద్రంలోనూ అగ్ని పర్వతాలు లీనమై ఉన్నాయి అట్లాంటిక్ మహా సముద్రం ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలను యూరప్, ఆఫ్రికా ఖండాలనూ తాకుతూ వెళుతుంది.
అనేక సముద్రాలనూ, నదులనూ, జలసంధులనూ, కాలవలనూ మహా సముద్రాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఉన్న మూడు అతిపెద్ద నదుల నుండి నీటిని ఈ సముద్రం సంగ్రహిస్తుంది. అవేమిటంటే పశ్చిమ దిశగా అమెజాన్ నది, ఉత్తర దిశగా ఒరినోకో నది, తూర్పున కాంగోనది. అండీస్ పర్వతాల యొక్క హిమానీ నదులతో ఏర్పడిన అమెజాన్ నదీ జలాలు అట్లాంటిక్ లోనే కలుస్తాయి. అమెజాన్ నది ప్రపచంలోనే అతిపెద్ద నదిగా గుర్తింపు పొందింది. అట్లాంటిక్ మహాసముద్రం నీరు ఎక్కువ సార్లు నీలం రంగులో కనిపిస్తుంది. అయినా అమెరికా రాష్ట్రాల తూర్పు తీరంలో ఆకుపచ్చగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎరుపు రంగులో కూడా కనిపిస్తుంది. సముద్రంలో ఉండే ఆల్గే సూర్యకాంతిని గ్రహించడం వల్ల రంగుల్లో కనిపిస్తుంది.
అట్లాంటిక్, హిందూ మహా సముద్రాలు తీరంగా కలిగిన దక్షిణాఫ్రికాను చూశాం. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో ‘కేప్ అగుల్ హౌస్’ అనే ప్రాంతంలో అట్లాంటిక్, హిందూ మహ సముద్రాల కలయిక అద్భుతంగా ఉంటుంది. కేప్ టౌన్ కు దగ్గరగా 170 కిమీ.. దూరంలో ‘ కేప్ అగుల్ హౌస్ ‘ ఉంటుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే ప్రదాన ఆకర్షణ. ఎత్తైన కొండ మీద వ్యూ పాయింట్ ఉంటుంది. టేబుల్ మౌంటెన్ మీదకు ఎక్కి చూసినపుడు ఈ రెండు మహా సముద్రాల కలయిక అద్బుతంగా కనిపిస్తుంది. ఈ రెండు మహాసముద్రాల జలాలు రెండు రంగులలో ఒక స్పష్టమైన గీతను ఏర్పరుస్తాయి. ఈ అద్బుతమైన అందాన్ని చూసి తీరవలసిందే. నేను ఈ చిత్రాన్ని నా పుస్తకానికి కవర్ పేజీగా వేసుకున్నాను. కేప్ అగుల్ హౌస్ కు ఇసుక బీచ్ లతో పాటుగా రాతి బీచ్ లు కూడా ఉంటాయి. ఈ జలాల్లో వెచ్చని వాతావరణం ఉంటుంది. ఇక్కడ అద్బుతమైన జీవ వైవిధ్యం, ఉంటుంది. సముద్ర జీవులు, స్థానిక వణ్యప్రాణులు అధికంగా కనిపిస్తాయి. ఆఫ్రికా అందాలకు అరుదైన దృశ్యాలను అస్వాదిస్తూ ఫోటోలు తీసుకున్నాం. కేప్ టౌన్ పట్టణ సరిహద్దుల జలాలలో పెంగ్విన్ ల సందడి అధికంగా ఉంటుంది. సముద్ర తీరంలో ఒక చోట ఆపి పెంగ్విన్లను చూపించారు. తెలుపు నలుపు రంగుల కాంబినేషన్ తో వేల కొలది పెంగ్విన్ లు కనిపించాయి. వాటి నడక తమాషాగా ఉంటుంది నిలబడి రెండు కాళ్ళతో నడవటం వింతగా అనిపిస్తుంది. పెద్ద పెంగ్విన్ల మ్యూజియంలో వాటిలోని రకాలు, పేర్లు, వాటి ప్రత్యేకతలు వివరించారు. కేప్ టౌన్ లోని బౌల్డర్స్ బీచ్ లో ఎక్కవగా కనిపించాయి. మేము ఫోటోలూ తీసుకున్నాం. నేను ఇంటికి వచ్చాక పెంగ్విన్ బొమ్మల్ని చేశాను. బాధాకరమైన విషయమేముంటే వీటిని కూడా అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు. నేషవల్ పార్క్ దగ్గరున్న విల్లీస్ వాక్ దగ్గర కూడా వీటిని చూపించారు. ఆఫ్రికన్ పెంగ్విన్లుగా పేరున్న ఈ పెంగ్విన్లు ప్రస్తుత పరిస్థితిలో చాలా జంతువుల్లాగే అంతరించి పోవడం వల్ల వాటిని సంరక్షించే దిశగా కృషి చేస్తున్నారు. నేను పెంగ్విన్ బొమ్మల్ని చేయడమే కాదు వీటికి గేయాలు పొడుపు కథలూ రాశాను. నేను ఎక్కడ అరుదైన జంతువుల్ని చూసినా వాటికి కవితలు, పొడుపు కథలు రాయడం ఇష్టం.
కేప్ టౌన్ నుంచి సముద్రంలో కొంత దూరం ప్రయాణించాక సీల్ ల నుమూహం కనిపించింది. దూరంగా ఉన్న బండల మీద సేద తీరుతూ కనిపించాయి. వీటికి దక్షిణాఫ్రికా సీల్ లని పేరు కేప్ టౌన్ హార్బర్ నుండి దౌట్ బే దాకా సముద్రంలో ప్రయాణించి సీలయన్లను చూశాము. అక్కడి దాకా వెళ్ళే ఫెర్రీ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. మామూలుగా సిలయన్స్ చెసే విన్యాసాలు చాలా బావుంటాయి. పిల్లలనూ పెద్దలనూ అలరిస్తాయి. ఇక్కడ మాత్రం సీలయన్ల విన్యాసాలు చూడలేదు. వాటిని దూరంగా సముద్రంలో ఆడుతూ తేలుతూ ఉండగా చూశాం అక్కడ పెద్ద బండ రాళ్ళున్నాయి. ఈ బండ రాళ్ళ మీదకు చేరి కాసేపు విశ్రాంతి తీసుకుని మరల సముద్రంలోకి వెళుతున్నాయి. అలా అది సహజంగా ఆడుకుంటుండగా వాటి ఆటలను వీక్షించాము.
అట్లాంటిక్ మహా సముద్రాన్ని తీరంగా కలిగిన ప్రాన్స్ ను సైతం చూశాము. ఈ దేశానికి తీరంగా అట్లాంటిక్ తో పాటు మధ్యధరా సముద్రం, ఇంగ్లిష్ ఛానెల్ కూడా ఉన్నాయి. పారిస్ నడి బొడ్డున ఉన్న సియాన్ నది సైతం అట్లాంటిక్ మహా సముద్రంలోనే కలుస్తుంది. సియాన్ నదిలో పడవ ప్రయాణం చాలా బాగుంది. ఒక సారి మధ్యాహ్యం సమయంలో మరొకసారి సాయంత్రం సమయంలో షికారు చేశాము. ఫ్రాన్స్ కున్న తీర ప్రాంతం ఇసుక బీచ్ లకూ, ప్రముఖ యాచింగ్ కేంద్రాలకూ ఆఫ్ షోర్ ఫిషింగ్ లకూ పెట్టింది పేరు.
అట్లాంటిక్ మహా సముద్రానికి స్విట్జర్లాండ్ దేశం దగ్గరగానే ఉన్నప్పటికీ ఆల్ఫ్ పర్వతాలు అడ్డంగా ఉన్నాయి. ఐరోపా ఖండానికి దగ్గరగా ఉన్న అట్లాంటిక్ మహా సముద్రాన్ని యూరోపియన్ అట్లాంటిక్ అంటారు. దీనికి ఉత్తరాన అర్కిటిక్ మహా సముద్రం పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రం దక్షిణాన మధ్యధరా సముద్రం ఉన్నాయి. ఇలా అట్లాంటిక్ మహా సముద్ర పరివేష్టిత దేశాలు, నగరాలు చూసి ఆనందించాం.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
