ఆవిష్కృత ఆలాపన

-ఉదయగిరి దస్తగిరి

దేవుని గూట్లో
పూలన్నీ ఆత్మార్పణం చేసుకుంటున్నాయి
నా క్షేమాన్ని తలుచుకుంటూ
చీకటి నేల కింద స్వప్నిస్తున్న విత్తనంలా
ఆమె నాకోసం నేను పూలకోసం
వొక్కటిగా విలపిస్తాము

నెత్తికెత్తుకున్న పనిబుట్టని
ఎటూ కదలనివ్వని జ్ఞాపకాల మోపుని
ఎవరి భుజం మీదనో మోపలేక మోయలేక
మూగ రోదనతో
రాత్రిగర్భంలో కునుకు తీయాలనుకుంటాను

కూతుర్లు పుట్టింది మెదలే
రెక్కల గుఱ్ఱంపై వచ్చే రాజకుమారునికై
తిప్పలు పడే చొక్కాలకీ రాత్రులుంటాయి కానీ –
వాటికి దయ వుండదు

తెలుసా
సంకల్పితంగా
ఘాడ నిద్రా తునకల్ని కళ్లలో దాచుకుంటానా
గుండెలోపలి పొరల్లో నాటుకున్న
కలల మొక్కకి పూయబోయే చిర్నవ్వుల పూలని
ఎవరో గిల్లినట్టుగా సురుక్కున లేస్తాను

మోకాలి పుండుపై
ఆకతాయి రాయి విసిరినట్టుగా
అస్పష్ట ఆకస్మిక పదతీగని
మెదడు గుబురులో నుండి
సగం ఎల్లపీకుతుందీ రాత్రి

కలత కునుకులో
ఊపిరాడని అనావిష్కృతాలన్నీ
ఆవిష్కృతమవ్వాలని తొక్కిసలాడతాయి
కంటి ఉప్పునీళ్ల కుండ తొణికి
మసకబడ్డ పదాలతో
యేమ్ రాయాలో తబ్బిబ్బవుతాను

ఉన్నట్టుండి
వేడుకలచేత వేలేయబడ్డ హృదయాల
నిట్టూర్పులపిట్టలన్నీ కలంపై ఉడుగుతాయి
అప్పటిదాకా
బురదమట్టలా జారిపోయే పదాలన్నీ
పూలగుత్తుల్లా రాలిపడతాయి

ఆ క్షణం
పిల్లగాలిని ఏవో మధుర పరిమళాలు
నిమిరినట్టుగా
పిల్లవాడు పసికుక్కపిల్ల గాయాన్ని
ప్రేమగా తడిమినట్టుగా
జీవిత లోయల్ని పూడ్చుకునే
పసుపు వాక్యమై
అటు కాగితంలోకి ఇటు నిద్రలోకి
ఏకకాలంలో జారిపోతాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.