డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు

                                                                – కె.శ్రీదేవి

లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా సంపుటాలు వచ్చాయి. “నడుస్తున్న కథ”, “రాబోవుతరం స్త్రీ”  అనే నవలలు “లవ్ ఇన్ ఒన్” , “కొత్తచిగుళ్ళు”, “రాబందులు”, అనే కవితా సంపుటాలు ప్రచురించారు.  సావనీర్లకు కూడా పని చేశారు. 2010 సంవత్సరంలో వచ్చిన ’గాయాలే…గేయాలు’ కవితా సంకలనానికి సహసంపాదకులు,   బుల్లె(టి) న్  నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. స్త్రీల చైతన్య, ఉపాధి కార్యక్రమాలు చేపడుతుంటారు.   

స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పురుషులు చేస్తున్న దుండగాల్ని గురించి ఎన్నో కథలు వస్తున్నాయి. ఇలాంటి వస్తువుతో స్త్రీ, పురుష రచయితలు ఇద్దరు రాస్తున్నారు. ’స్త్రీకి న్యాయం జరగాలి’ అని తెలుగుకథ అవిర్భావం నుండి నేటి వరకు ఎంతో మంది రచయితలు తమ కలాలకు పదును పెట్టారు. వీరు స్త్రీలు సామాజికంగా ఎదగించడం ఒక సామాజిక బాధ్యతగా భావించి రచనలు చేశారు. చలం లాంటి రచయితలు స్త్రీల లైంగిక సమస్యను ప్రధాన అంశంగా చేసుకొని రచనలు చేసారు.  కాని, డెబ్భైదశకంలో స్త్రీ దృక్పథం నుంచి వచ్చిన కథలు మాత్రం  చాలా తక్కువ. ఆ కాలంలోనే  ప్రత్యేక దృక్కోణంతో “ కొత్తనిజం” చెప్పడానికి రచయిత్రి రాజీవ పూనుకోవడం అభినందనీయం.

ఆనాటి సమాజంలో తమ ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి సంబందించి వికాసం పొందాలని కాంక్షించే వారు అరుదుగానే వున్నారు. స్త్రీ అభ్యుదయాన్ని సరైన దిశలో అర్థంచేసుకోగలిగిన పరిస్థితులు స్త్రీలకు లేకపోలేదు. కానీ అవి కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం. పురుషులను నమ్మడం, పొరపాటుగా (కాలు జారే) ప్రమాదంలో పడటం, ఆసమస్యను పరిష్కరించుకునే అవకాశం  చాలా తక్కువ. కాని ఒకసారి కాలు జారిన(ఈ ప్రయోగం రచయిత్రిది.) స్త్రీకి సంఘంలో రక్షణగాని, సానుభూతి కాని, గౌరవం కాని, లేవని రచయిత్రి గుర్తించారు, స్థూలంగా చెప్పాలంటే చావుతప్ప మరోమార్గాంతరం ఏదీ లేదని   రచయిత్రి భావన. ఈవిషయంలో పురుషునికి, స్త్రీకి మధ్య అమలవుతున్న అసమానత్వ భావాన్ని ఆవేదనతో పలువిధాలుగా తన కథలన్నింటిలోను రాజీవ వ్యక్తంచేశారు. ఈకథలో రచయిత్రి కోరుతున్నది వ్యవస్థాగత సంస్కరణ కాదు. హక్కులు కాదు, స్త్రీశీలం పట్ల వ్యక్తిత్వం పట్ల పురుషుల దృక్పథంలో రావాల్సిన మార్పు. అలాగే నైతిక వ్యవస్థలో రావల్సిన మౌలికమైన భావ విప్లవం. ఈమె కథల్లోని విప్లవాత్మకత మౌలికమైనదే కాదు ఆలోచింప చేసేదికూడా.

“కొత్తనిజం’ అనే కథలో వివాహ వ్యవస్థను పురుషుడు తన స్వార్థానికి ఉపయోగించుకోవటమే కాకుండా  అడుగడునా స్త్రీని వేటాడటానికి ఎలా అయుధాలు ప్రయోగిస్తాడో చిత్రించారు. కాని రచయిత్రి చూపిన పరిష్కారం ఏమిటి? మోహన్  ఆమె దృష్టిలో స్వాప్నిక రాజకుమారుడు. ఎందుకంటే, చక్రం అడ్డు వేసి “దగాపడిన స్త్రీగా తనను చేపట్టాడు”. స్త్రీసమస్యలకు ఆత్మహత్య ఎలా పరిష్కారం కాదో అలాగే కలా, కల్పన కూడా స్త్రీ సమస్యకు పరిష్కారం కాదంటుంది. రచయిత్రి పలు కథల్లో వ్యక్తిత్వం అంటూ స్త్రీలో ఏ ప్రవృత్తిని వర్ణిస్తున్నదో, ఆప్రవృత్తితో  సృజన్నాత్మకంగా యధార్థ ప్రపంచాన్ని ఎదుర్కొనే దారుడ్యం అలవర్చుకోవడమే స్త్రీల సమస్యలకు పరిష్కారం అవుతుందని రచయిత్రి  వుద్దేశ్యం. వ్యక్తిత్వం, స్వాతంత్ర్యం ఒకరిచ్చేవీ కావు మరొకరు పుచ్చుకునేవి కావని రచయిత్రి గాఢమైన విశ్వాసం.

రాజీవ కథల్లో స్త్రీ వ్యక్తిత్వాన్ని గురించి, సహజ ప్రవృత్తిని గురించి ముసుగు లేకుండా నిర్భయంగా చెప్పిన మనస్తత్వ సంబధిత అంశాలే రాజీవ కథలకు ఆనాటికి కొత్తదనాన్ని చేకూర్చాయి.

 “అంతా ఇంతే” అనే  కథలో రాణి అనే నర్సు మాధవ్ అనే విలాస పురుషుడికి  భోగవస్తువు అవుతుంది. ఫలితంగా ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది మామూలు కథా వస్తువే. కాని రచయిత్రి వేసే ప్రశ్నలు ఆకాలానికి క్రొత్తవి. ఈ కథలో రాణి మనస్తత్వాన్ని ఆపాత్ర మాటల్లోనే గమనించవచ్చు.

“డ్యూటి చేయడం, పుస్తకాలు చదవడం విసుగ్గా వుంది.    కోయిలమ్మలా రెక్కలు చాచి, దిగంతాలకి ఎగిరి, ఎలుగెత్తి ప్రకృతిలో పాడు కోవాలని వుంది. కనీసం సీతమ్మలా ఏ రావణాసురుడో వచ్చి ఎత్తుకపోయి ఏ అరణ్యం లోనో వదిలేస్తే భాగుండు” అని అనుకొంటుంది. నియంత్రిత ఆంక్షల మధ్య స్వేచ్చను ఆశించినపుడు ఇలాంటి కోరికలు వుత్పన్నం కావడం సహజం. వాటికి సరైన, ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వం లేనపుడు యువతలో ఎలాంటి పెడధోరణులు ప్రబలమవుతాయో ఈ కథలో ఋజువుచేయడానికి రచయిత్రి ప్రయత్నించారు. రాణి చేసిన ఆలోచనలు, ఆమె మనస్తత్వానికి అనుగుణంగా, అలాగే జరుగుతుంది. 

“రాగమయి” కథలో స్త్రీల వ్యక్తిత్వం వికసించకుండా చేసి అవరోధమైన, నియంత్రిత  వాతావరణాన్ని సానుభూతితో అర్థం చేసుకొంటుంది హాస్టల్ వార్డన్  లూసి. రాగమయి అనే సంగీత జ్‘నం వున్న అనాథను పైకి తేవాలి అనుకుంటుంది. అందుకే ఆమెపై ఆంక్షలు సడలిస్తుంది. కాని లూసి ఇచ్చిన స్వేచ్చతో  “విశృంఖలంగా, విచ్చల విడిగా పతనమైపోయింది రాగమయి రగుల్చుకున్న వ్యక్తిత్వం” అని రచయిత్రి వ్యాఖ్యానిస్తుంది.

 “ఆకలి” కథ ఒక టీచర్ స్వగతం.  “తనకి అందం వుంది.  ఆకలితో అరకాగిన అందం. ఆకలి కప్పేసిన అందం తనకూ వుంది. ఆకలి ఆశను దోచేసింది ముప్ఫైయేండ్లకే” అంటుంది. అంతేకాదు, ఆమెకు కావాల్సింది “ఎవరూ? ఎవరో ఒకడు మగాడు.”   ఉద్యోగంవల్ల ఒక ఆకలి తీరినా మరో ఆకలి తీరదు ఏమిటి పరిష్కారం?”  అని ఆలోచిస్తుంది ఆమె. చైతన్య స్రవంతి శిల్పంలో  రాయబడిన చిన్నకథ  ఇది. శక్తివంతమైన రచన. చలం  ప్రభావంతో రాసిన కథలా అనిపిస్తుంది. 

“ఎవరుగొప్ప” అనే కథలో “మంచివాళ్ళం అనిపించుకోవడం కోసం ప్రేమను, తమ కోర్కెలను వ్యక్తం చేసుకోలేని బలహీనులం. జీవితం అనుభవించే ధైర్యం లేని చవటదద్దమ్మలం” అంటుంది. అందరూ మంచిపిల్ల అనుకునే రమ నలుగురిని మార్చిన విమల ప్రవర్తనని సమర్థిస్తుంది అని కథకురాలు తన విస్మయాన్ని ప్రకటిస్తుంది. అది పెద్ద అనైతిక చర్య అనే  భావన  వల్లనే  అలాంటి స్థితి కలిగివుంటుందనిపిస్తుంది.   

 “మార్పు వస్తుంది” అనే కథలో పెళ్ళైన సూర్యం మంజుల అనే వృత్తి చేసే స్త్రీతో స్నేహంచేసి, ఆమెను ఇష్టపడుతాడు. తన భార్య మోహినితో ఆమెను తనదాన్ని చేసుకోవాలన్న నిర్ణయాన్ని వెల్లడిస్తాడు. అతని భార్య మోహిని ఆమెను పెళ్ళి చేసుకోవడాన్ని అంగీకరించడమే కాకుండా “నాకు భలే గర్వంగా వుందండీ!” అంటుంది.  ఆమె అలా సమర్థించడానికి కారణం, ఆమె భర్త తన కోరికను భార్యకు నిజాయితీగా వెల్లడించడమే, ఆమె హర్షించడానికి కారణంగా  చెబుతుంది. అంతే కాదు, “ఒకరికి కట్టుబడని వాడు, ఇద్దరి మధ్య అయితే కట్టు బడతాడనే భరోసా కూడా ఆమెకు వుందంటుంది” రచయిత్రి. స్త్రీదృక్పథంలో కూడా ఇలాంటి విప్లవాత్మకమైన మార్పు రావాలని రచయిత్రి ఊహ కాబోలు! ఇది సాధ్యమా? అసాధ్యమా? అనే మీమాంస పక్కన పెడితే, సమాజంలో ఇలా ఆలోచించే స్త్రీలు వున్నారని చెప్పడం ఒక కారణం అనుకుంటే, భర్తల అసంబద్ధ కోరికలను ఆమోదించి అంగీకరించడం తప్ప మరోమార్గం లేదని, రాజీపడటం మరో కారణం కావచ్చు. కానీ భార్య పాత్ర ప్రతిపాదించిన  “ఒకరికి కట్టుబడని వాడు, ఇద్దరి మద్య అయితే కట్టు బడతాడనే భరోసా”  కూడా ఆమెకు వుందని చెప్పడంలోని ఔచిత్యమేమిటో పాఠకులకు అర్థంకాదు. రచయిత్రి కథలను కొంచెం జాగ్రత్తగా ఎడిట్ చేసుకొని వుంటే బావుండేదనిపిస్తుంది. 

స్త్రీవాద ఉద్యమం రాకముందు సాధారణస్త్రీల ఆలోచనల్లోనే కాదు రచయిత్రుల ఆలోచనల్లో కూడా భావజాల స్పష్టత కొరవడడానికి ఇలాంటి కథలను ఉదాహరణగా చెప్పుకోవాల్సి వుంటుంది.

“గృహహింస చట్టం”కథలో చట్టం రావటంవల్ల మగవాళ్ళలో భయం, స్త్రీలప్రవర్తనలలో చోటుచేసుకుంటున్న  ధోరణులను చిత్రించిన కథ. స్త్రీల వేదనలను, హత్యలను  నియంత్రిండానికి  వుద్దేశించిన చట్టం ఇది,  వేదించే వారికి కొంతవరకు బెరుకు, భయం కలిగించిన మాట వాస్తవం. ఈచట్టం స్త్రీ సమూహానికి ఎంతవరకు ఉపయోగపడిందన్న విషయం పక్కనపెడితే, సామాజికంగా ఒక వాతావరణాన్ని కలగించడం వరకు విజయవంతమైనట్లే. ఈ చట్టం వల్ల పురుష సమాజం నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావడాన్ని ఈకథ నమోదు చేసింది. వ్యతిరేకత సాధారణంగా హింసించే భర్తలనుండి మాత్రమే వ్యక్తమవుతుంది. కానీ పురుష సమూహం ఈ చట్టంపట్ల  తమ నిరసనను సమీపంలో వున్న స్త్రీలపై చూపించడం ఆశ్చర్యం కలుగుతుంది.  

ఈ కథ వేరు వేరు సంధర్భాలలో వేరు వేరు పాత్రల మధ్య జరిగిన అనేక సన్నివేశాల కూర్పు. ఒక సన్నివేశంలో పనివేళలు ముగిసిన తరువాత కూడా స్త్రీలకు పనిఒత్తిడి కల్పించడం, పురుష ఉద్యోగులకు పనిచెప్పకుండా ఉండటం లాంటి చర్యలకు సిధ్ధపడటాన్ని చిత్రించారు.  “వెళుతున్నా సర్” అని చెప్పడా నికి వెళ్ళిన నవనీతకు ’అర్జంటు మాటర్” అంటూ ఫైలు అప్పగించిన ఆఫీసర్ ప్రవర్తనలో వ్యక్తమయ్యింది గృహహింస చట్టం ప్రవేశపెట్టండం పట్ల కలిగిన నిరసనే.

మరో ఘట్టంలో “ఇవ్వాళ పేపరు చదివాను. గృహహింస చట్టం!” అని భార్య రుక్మిణి మాట పూర్తయ్యే లోపలే ఆమె చెంప చెళ్ళు మనిపిస్తాడు భర్త కృష్ణారావు. పైగా ఇల్లు వదిలివెళ్ళమని ఆదేశాలు జారీచేసి, తలుపులు బిగించుకుంటాడు.  చేసేదిలేక రుక్మిణి పిల్లలతో సహా “మిమ్మల్ని మించిన దైవం” లేడని ఏడుస్తూ, పిల్లలతో సహా బతిమాలు కుంటుంది. 

మరో సన్నివేశంలో సరళ స్నేహితురాలు ఇందిరను ఇరుగు పొరుగుకు వినబడేంత పెద్దగా  భర్త  పెరట్లో తిట్టడం గురించి అడుగుతుంది. “అదేదో ఏక్ట్-…చట్టం వచ్చిందంట! గృహంలో ఆడవాళ్ళను హింస పెడితే మగాళ్ళను బొక్కలో తోస్తారట అందుకని పెరట్లో తిడుతున్నాడు”. అంటుంది. ఇంట్లోకాక పెరట్లో తిడితే  చట్టం వర్తించదని వక్ర భాష్యం ఇచ్చి అపహాస్యం చేయడాన్ని కూడా రాజీవ నమోదు చేశారు. ఇలా మొత్తం కథంతా వ్యంగ్య ప్రతిఫలనాలను రికార్డు చేశారు.

కథ చివరలో ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్న ఆచారిని వదిలేస్తుంది. రాజేశ్వరి స్వతంత్రంగా గుడిమెట్లు శుభ్రంచేసి పిల్లలను ప్రయోజకుల్ని చేస్తుంది. చదువున్నా లేకపోయినా తప్పు చేసిన భర్తను రుక్మిణి లాగా ప్రాదేయపడకుండా కూడా బ్రతకొచ్చు అన్న సందేశం వుంది ఈ సంఘటనలో. కథాంశమేమో “గృహహింస చట్టం”, సందేశం మాత్రం “పునర్వివాహానికి”(బైగమీ)కి సంబంధించింది. దీన్ని కథ అనడం కంటే, ఒక  నమోదు పత్రం అనడం సమజసం.

గృహహింస చట్టం రావడంతో మగవాళ్ళ ప్రవర్తనలోని అనూహ్య పరిణామాలను ప్రతిఫలింపజేయటం రచయిత్రి రాజీవ కథాలక్ష్యం. కానీ ఆమె కథాశిల్పంలోని వ్యంగ్యాత్మక లక్షణం, పాఠకుణ్ణి  సీరియస్ గా ఆలోచించాల్సిన ఒక కథాంశాన్ని పరిహాస్యం పాలు చేసింది. విషయానికి ఎంత ప్రాధాన్యత ఉందో శైలికి కూడా అంతే ప్రాధాన్యత అవసరమన్నవాస్తవాన్ని నొక్కి చెప్పినకథ.

“రెండూ రెండే” అనే కథలో పెళ్ళికాని యువతి, పెళ్ళైన రెండేళ్ళకే వితంతువుగా మారిన యువతి ఇద్దరు కూడా లైంగిక జీవితం లేని, మోడువారిన బ్రతుకు గడుపుతున్నారన్న సాదృశ్యాన్ని వ్యక్తం చేసింది రచయిత్రి. స్త్రీ వ్యక్తిత్వాన్ని గురించి ఇంచు మించుగా చలం భావాలతో ఏకీభవిస్తూ, తన ప్రత్యేకమైన రచనా విధానాన్ని శక్తివంతంగా   అభివ్యక్తం చేయగల  రచయిత్రి, విస్పష్టమైన సామాజిక స్పృహతో యధార్థ సమాజాన్ని గమనించి, నిర్మాణాత్మక ఆలోచనా ధోరణి పెంపొందించుకోవటం అత్యవసరం.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.