మెరుపులు- కొరతలు

“నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ

                                                                – డా.కే.వి.రమణరావు

 

     అన్నివిధాలా బావుండి భార్యపట్ల ప్రేమగా కూడా ఉండి ఒక చిన్న బలహీనతను అదుపులో పెట్టుకోలేని భర్తతో భార్య పడే ఇబ్బంది గురించిన కథ ఇది. పెళ్లైన మగవాళ్లలో చాలా సాధారణంగా కనిపించే ఈ బలహీనతను భార్యలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియని ఒక స్థితిగురించి చాలా క్లుప్తంగా చర్చిస్తుంది ఈ కథ. 

     చిన్నదిగా రాసిన ఈ కథ సారాంశమిది.

     కథ ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ లో చెప్పబడింది. కథాకాలానికి మనోహర్ యూనివర్సిటిలో ఎకనమిక్స్ ప్రొఫెసరుగా, రాజ్యలక్ష్మి కాలేజిలో సోషియాలజి లెక్చెరరుగా పనిచేసి రిటైరై ఉంటారు. మనోహర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూంటాడు. వాళ్ల ఒకే అమ్మాయి కావ్య న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తూ రెండేళ్లుగా ఆమె బాయ్ ఫ్రెండ్ రిషితో సహజీవనం చేస్తుంటుంది. తల్లిదండ్రుల కోరికమీద ఆమె మరో సవంత్సరం తరువాత అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునివుంటుంది.

     కథా ప్రారంభంలో ఒక ఉదయం రాజ్యలక్ష్మికి కూతురు కావ్యనుంచి ఫోన్ వస్తుంది. భర్తకు నిద్రాభంగం కలుగకుండా ఆమె పక్కగదిలోకి వెళ్లి మాట్లాడుతుంది. ఈమధ్య రిషి తనతో ప్రేమగా ఉంటూనే ఇతర ఆడవాళ్లతో చనువుగా ఉంటున్నాడని అది తను భరించలేక పోతున్నానని, తను అతనితో విడిపోయి మరో ఫ్లాట్ కి మారుదామనుకుంటున్నాని బాధతో ఏడుస్తూ చెప్తుంది కావ్య. 

     రాజ్యలక్ష్మి కూడా బాధపడి, తొందరపడి తెగతెంపులు చేసుకోవద్దని, కొన్నాళ్లు మరో ఫ్లాట్ కి వెళ్లి విడిగా ఉండి అతనిలో మార్పు వస్తుందేమో చూడమని కూతురికి సలహా ఇస్తుంది. కావ్య ఒప్పుకుంటుంది. 

     కావ్య ఫోన్ పెట్టేసాక రాజ్యలక్ష్మి గతంలోకి వెళ్లి తనుకూడా పెళ్లికి ముందునుంచే అదే సమస్యతో బాధపడుతూ ఎలా సర్దుకుందో గుర్తుకు తెచ్చుకుంటుంది. దాదాపు కథంతా ఇదే వివరణ ఉంటుంది.

     యూనివర్సిటిలో మనోహర్ ఎకనమిక్స్, రాజ్యలక్ష్మి సోషియాలజి శాఖల్లో పీహెచ్ డి చేస్తున్నప్పుడు ప్రేమించుకుంటారు. స్థిరపడ్డాక ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అంతా బాగానే నడుస్తున్న సమయంలో ఎకనమిక్స్ కే చెందిన సంధ్య అనే మనోహర్ జూనియర్ తో అతను కలసి పనిచేయాల్సి వస్తుంది. అతను ఆమెతో చనువుగా ఉంటాడు. అది ఎక్కువై అందరూ వాళ్లిద్దర్ని గురించి మాట్లాడుకునేవరకు వెళ్తుంది. రాజ్యలక్ష్మి హతాశురాలై అతన్ని నిలదీస్తే అతను ‘వాళ్ల స్నేహం కేవలం రీసెర్చికే పరిమిత’మంటాడు. రాజ్యలక్ష్మి స్నేహితురాలు చొరవతీసుకుని సంధ్యతో మాట్లాడ్డంతో ఆమె అతనికి దూరంగా వెళ్లిపోతుంది. రాజ్యలక్ష్మి పట్ల మనోహర్ ప్రేమలో మార్పు లేకపోవడంతో ఆమె సమాధాన పడుతుంది. 

     వాళ్ల పీహెచ్ డి లు పూర్తయి ఉద్యోగాలొచ్చాక వాళ్లు పెళ్లి చేసుకుంటారు. వాళ్లవి వేరు కులాలు కాబట్టి ఇంట్లోవాళ్లను కష్టపడి ఒప్పించాల్సొస్తుంది.

     పెళ్లైయ్యాక రాజ్యలక్ష్మి ఒక టీచింగ్ అసైన్ మెంటుకోసం ఆర్నెల్లు అమెరికా వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యే మరోసారి తెస్తాడు ఇండియాలోనే ఉన్న మనోహర్. వాళ్ల ఇంటిదగ్గరే చేరిన రాజ్యలక్ష్మి సహోద్యోగి వసంతతో చనువు పెంచుకుంటాడు. తిరిగొచ్చిన రాజ్యలక్ష్మి వాళ్ల చనువును భరించలేక ఆమెతో మాట్లాడుతుంది. ఆమె తన పొరపాటును గ్రహించి మనోహర్ కి రాఖీ కట్టడంతో ఆ సమస్య పరిష్కారమౌతుంది.

     ఆతరువాత రాజ్యలక్ష్మి చాలా జాగ్రత్తలు తీసుకుని మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా కాలం నెట్టుకొచ్చింది. ఆమె మనోహర్ని గాఢంగా ప్రేమించింది కాబట్టి అతనితో విడిపోలేదు. రిటైరైన కొంతకాలానికి మనోహర్ కి క్యాన్సర్ వస్తుంది. రాజ్యలక్ష్మి అతనికి సేవలు చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇదీ గతం. 

     ఇప్పుడు కావ్యకూడా రాజ్యలక్ష్మి ఎదుర్కున్న సమస్యనే ఎదుర్కుంటూంది.

     రాజ్యలక్ష్మి గతంనుంచి  వర్తమానంలోకి వచ్చాక కూతురి సమస్య గురించి అలోచిస్తుంది. తనలా కూతురుకూడా సర్దుకోవాలా లేక విడిపోవాలా అనే డైలమాలో ఆమె పడుతుంది. అలా ఉండగానే కథ ముగుస్తుంది.

     మొదలు, తుది వర్తమానంలో, మధ్యంతా ఫ్లాష్ బ్యాక్ తో సంప్రదాయ శిల్పంలో ఒకే పాయింటును ఫోకస్ చేస్తూ క్లుప్తంగా ఈ కథ రాయబడింది. కథా సమయం బహుశా ఒక గంటసేపు ఉండొచ్చు. కథనంలో అధికభాగం (గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం) ముఖ్యంగా రెండు ప్రధాన పాత్రల మధ్యే నడుస్తుంది. అవసరాన్ని బట్టి మధ్యలో మూడునాలుగు పాత్రలు వచ్చిపోతాయి. 

     కూతురుతో సంభాషణతో సహా కథంతా రాజ్యలక్ష్మి పరంగా ప్రధమపురుషలో ఎక్కడా తొట్రుబాట్లు లేకుండా నడుస్తుంది. పాత్రలన్నీ విద్యాధికమైనవే కాబట్టి సంభాషణల్లో పాత్రోచిత భాష అవసరం లేకపోయింది.

     ఆదిమ సమాజపు పూర్వకాలంలోని విశృంఖలతనుంచి మాతృస్వామ్యానికి, దాన్నుంచి కుటుంబ వ్యవస్థలకు మనుషులు పరిణామం చెందే క్రమంలో మిగిలిన పితృస్వామ్య అవశేషాల్లో ఒకటైన ఫ్లర్టింగ్ ముఖ్యంగా న్యూక్లియార్ కుటుంబాల్లో కలిగించే మానసిక సమస్యను ఈ కథ ప్రధానవిషయంగా ప్రస్తావించినా దాని లోతుల్లోకి వెళ్లలేదు. ఆధునిక పాశ్చాత్య సమాజంలో ఫ్లర్టింగ్ ను ఒక ప్రమాదకరం కాని బలహీనతగా తీసుకోవచ్చని కొందరు మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్న సందర్బంలో ఈ కథ ముగింపులోని డైలమాను అర్థం చేసుకోవచ్చు.

     చెప్పాలనుకున్న విషయం అనుభూతి ప్రధానమైనదైనా సూటిగా క్లుప్తంగా చెప్పే ఉద్దేశ్యంతో రాయడంతో కథనం బౌద్ధికంగా సాగింది. అవసరమైన చోట్ల కొన్ని పదాలతో మాత్రమే కోపాన్ని, నిరాశను, దుఖాన్ని వర్ణించడం జరిగింది. ఆధునిక శిల్పంలో అనుభూతి ప్రధానంగా రాసివుంటే కథనం పూర్తిగా మరోపద్ధతిలో ఉండేది. 

     బౌద్ధికంగా రాసినా చిన్న చిన్న సహవర్ణనలతో వాస్తవికతను అక్కడక్కడా చూపించివుంటే కథ ఇంకా కళాత్మకంగా వచ్చేది. ఇవేవీ లేకపోయినా సందేశం పాఠకులకు చక్కగా చేరుతుందనడంలో సందేహం లేదు.

     కథలో కొన్ని వైరుధ్యాలను మరీ క్లుప్తంగా రాయడంతో వాటి పాత్ర స్పష్టంగా తెలియడం లేదు. ఉదాహరణకు మనోహర్ రాజ్యలక్ష్మిలది కులాంతర వివాహం. అలాగే కావ్య రిషిల సహజీవనం కూడా. అంటే అవి ప్రేమ బంధాలు. కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు ఒకరిపట్ల ఒకరికి పూర్తి విశ్వాసం ఆధారంగా జరుగుతాయని అందుచేత ఫ్లర్టింగ్ అలాంటిచోట్ల ఇంకా అసందర్భం అని రచయిత్రి సూచిస్తున్నారా? ఈ విషయం పాఠకులకు మొదటిసారి చదివినప్పుడు స్పురించే అవకాశం తక్కువ.

     ఇలాంటిదే మరొకటి కావ్య తను ప్రేమించిన రిషితో సహజీవనంలో ఉండడం. సహజీవనంలో ఉంటే విడిపోవడం సాపేక్షంగా సులభం. రచయిత్రి సహజీవనాన్ని రెండు తరాల మధ్య మార్పుని లేదా కేవలం పాశ్చాత్య ఆధునిక పరిణామంగా చూపారా లేక దాన్ని మరేరకంగానైనా ఈ సమస్య కోణంలో చూపారా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. అలాగే మనోహర్ క్యాన్సర్ తో బాధపడడం కూడా. నిజానికి ఇవి కథకు అంతగా అవసరం లేని విషయాలు.

     అయితే పైన చెప్పినవన్నీ కథ పాఠకులను చేరడానికి అవసరం కాకపోయినా కథకు చేరే అదనపు విలువలే. 

     కథ ముగింపులో రచయిత్రి పరిష్కారం చూపించలేదు. అలా చూపించాల్సిన అవసరం లేదుకూడా. పరిష్కారాన్ని పాఠకులకే వదిలేయడం కథా శిల్పంలో ఒక పద్దతి. 

     రాజ్యలక్ష్మి కూతురికి వేచి చూడమని సలహా ఇస్తుంది. తన అనుభవంతో ఖచ్చితమైన పరిష్కారం సూచించదు. అంతేకాదు కూతురు బాగా చదువుకుని అత్యాదునిక సమాజంలో ఉద్యోగమేకాక సహజీవనం చేస్తున్న స్థాయికి చెందిన వ్యక్తి. ఆమె తగిన నిర్ణయం తీసుకోగలదు. కాబట్టి ముగింపు సమంజసమే అని చెప్పవచ్చు.

     క్లుప్తంగా, సూటిగా చెప్పబడిన ఈ కథ పాఠకుల్ని ఆలోచింపచేసి తన ప్రయోజనాన్ని సాధించగలదు. ఆ విషయంలో రచయిత్రి ఉద్దేశ్యం నెరవేరిందనడంలో సందేహం లేదు.

      

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.