కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-2

 -డా. సిహెచ్. సుశీల

పొణకా కనకమ్మ కథారచన
         
ఊయల లూగించే కోమల కరాలే
రాజ్యాలు శాసిస్తవి
తూలిక పట్టే మృదు హస్తాలే
శతఘ్నులు విదిలిస్తవి
జోలలు బుచ్చే సుకుమారపు
చేతులే జయభేరులు మోగిస్తవి
              — పొణకా కనకమ్మ
 
          నెచ్చెలి గీత గారి సూచన మేరకు 1950 కి పూర్వం రచయిత్రుల కథలను విశ్లేషించటం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఆ క్రమంలో శ్రీమతి పొణకా కనకమ్మ గారి కథలు గురించి అన్వేషిస్తున్న సమయంలో ఆమె చేసిన పోరాటాలు, సంఘ సంస్కరణలు, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం వంటి ఎన్నో విషయాలు అబ్బురపరచాయి. కనకమ్మ వ్రాసిన కథల విశ్లేషణకు ముందు ఆమె గురించిన ఆ విశేషాలు కూడా ఉపోద్ఘాతంగా నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందనిపించింది.
 
పొణకా కనకమ్మ.
ఆమె జీవితం ఒక ఆదర్శం.
భూస్వామ్య వ్యవస్థ పై ఒక పోరాటం.
స్త్రీ స్వేచ్చా స్వాతంత్రయాలకు ఒక చైతన్యం.
భారత స్వాతంత్రయ సంగ్రామంలో ఒక సాహసం.
 
          కనకమ్మ గారి పోరాట జీవితమంతా పరిశీలిస్తే ఈనాటి ఆధునిక మహిళ ఆశ్చర్య పోతుందని చెప్పవచ్చు. ఆమె ధైర్యసాహసాలు చూసి నాటి పురుషస్వామ్యం అట్టుడికి పోయింది.
     
          ఎంతగా అణిచి వేయాలని చూస్తే అంతగా విజృంభించి తనంటే ఏమిటో నిరూపించుకున్న ధీరవనిత పొణకా కనకమ్మ. స్త్రీ విద్య కోసం, చైతన్యం కోసం, స్త్రీలకు సాంఘిక రాజకీయ అవగాహన కొరకు తన ఆస్తినంతా వెచ్చించిన త్యాగశీలి ఆమె.
 
          ఎక్కడో మినగల్లు గ్రామం, కోవూరు తాలూకా, నెల్లూరు జిల్లాలో 1892 జూన్ 10 న జన్మించిన పొణకా కనకమ్మ నెల్లూరు జిల్లాకే గర్వకారణంగా పేరు గాంచారు.
 
          కనకమ్మ పెద్ద చదువు చదువుకోలేదు. కానీ చిన్ననాటి నుండి ఆమెకు విద్య మీదనే గౌరవం. సమాజంలో ఎటువంటి అవకాశమూ లేని వారికి చదువు నేర్పాలి అన్నది ఆమె ఆశయం. దళిత బాలికల కోసం విద్యాసంస్థను స్థాపించడం ఆమె ఆశయం. స్త్రీలకు విద్యావశ్యకతను గుర్తించి తన మనసులో పూజ్యస్థానంలో ఉన్న గాంధీజీ మరియు కస్తూరిబాయి జ్ఞాపికగా ” జాతి వివక్ష లేని బాలికా పాఠశాల” గా ” కస్తూరీదేవి విద్యాలయం” నెల్లూరులో 1923 అక్టోబర్ 18న నెలకొల్పారు. తరువాత గాంధీజీ ఆంధ్రా పర్యటన సందర్భంగా 1929 లో  మహాత్ముని స్వహస్తాలతో ఆ విద్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.
 
          ఒక రైతు కుటుంబంలో జన్మించి, వెంకటగిరి జమీందారు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం లేవదీసి, ఒక బలమైన సంఘం ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే “జమీన్ రైతు” పత్రిక ఆవిర్భవించింది. (కానీ తర్వాత కాలంలో కనకమ్మకే కాదు పొణకా కుటుంబానికే జమీన్ రైతు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం.)
 
          పొణకా కనకమ్మ గారి కుటుంబానికి రాజకీయ పూర్వచరిత్ర లేదు. కానీ ఆమెకు నాటి జాతీయోద్యమం పట్ల పూర్తి అవగాహన ఉంది. మొదట్లో అతివాదుల చర్యలకే తన మద్దతునిచ్చినా, గాంధీజీ ప్రభావంతో పూర్తిగా మితవాద ధోరణిలో, సహాయ నిరాకరణ ద్వారా ఆంగ్లేయుల నెదిరించాలని నిర్ణయించుకున్నారామె. 1924 లో విజయవాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ సభలో బులుసు సాంబమూర్తి ప్రవేశపెట్టిన సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానాన్ని కనకమ్మ బలపరిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యత్వం, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పదవి, నెల్లూరు జిల్లా స్త్రీల కాంగ్రెస్ నాయకత్వం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాలుపంచుకోవడం, యజ్ఞ యాగాదుల్లో జీవహింసను నిరసిస్తూ నెల్లూరులో ఉద్యమం చేపట్టడం, వితంతువులకు పునర్వివాహం జరిపించడం వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాతికేళ్ల వయసుకే గొప్ప వక్త గా పేరుగాంచారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం అందుకున్నారు. 1962లో దుర్గాబాయి దేశ్ ముఖ్ మద్రాసులో స్థాపించిన ఆంధ్ర మహిళా సభ రజతోత్సవ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ డాక్టర్ సుబ్బరాయన్ చేతులమీదుగా సన్మానం అందుకున్నారు.
 
          కస్తూరీదేవి విద్యాలయంలో సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు బోధించడంతోపాటు రాట్నం మీద నూలు వడకటం, పేము అల్లకం, కుట్టుపని, శాస్త్రీయ సంగీతం, వ్యాయామం, యోగాసనాలు నేర్పించేవారు. వీటితో పాటే బాలికలకు గృహవిద్య, పౌరాణిక కథలు కూడా బోధించేవారు. అచ్చమైన గాంధీయవాది, నిష్కలంక దేశభక్తుడు రాళ్లపల్లి రామసుబ్బయ్య విద్యాలయం ప్రధానోపాధ్యాయుడు. జాతీయ ఉద్యమంలో జైలు శిక్ష పూర్తి చేసి వచ్చిన కందాడై శ్రీనివాసన్, పాటూరి బాల సరస్వతమ్మ మరి కొంతమంది పిల్లలకు పాఠాలు చెప్పేవారు. తొలి ఏడేళ్లలో ఈ పాఠశాలలో 300 మంది బాలికలు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో విద్యాలయానికి గుర్తింపు గ్రాంటు ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపినా, ఆ సహాయాన్ని తృణీకరించి సామాన్య ప్రజలిచ్చిన  ధాన్యం, విరాళాలతో కనకమ్మ విద్యాలయాన్ని నిర్వహించారు.
 
          భర్త మరణానంతరం ఆ ఒంటరి స్త్రీ నెల్లూరుకు గర్వకారణమైన విద్యాసంస్థ నిర్వాహకురాలిగా ఖ్యాతి నొందటం సహించలేని కొందరు పురుషులు ఆమెకి ప్రాణ ప్రదమైన ఆ విద్యాసంస్థ నుండి బయటకు పంపే కుట్రలు ఎన్నో చేశారు. ఓటమిని అంగీకరించని కనకమ్మ ఆత్మస్థైర్యంతో ఒంటరి పోరాటం చేశారు. కానీ అర్థబలం, అంగబలం  ముందు నిలవలేక పోయారు. గొడవలు పెరిగి విద్యాలయం భవిష్యత్తుకు భంగం కలుగుతుందని తలచి సంస్థని వదిలిపెట్టారు. కానీ మొక్కవోని వ్యక్తిత్వం, కార్యదీక్షతో పారిశ్రామిక పాఠశాల వైపు పయనించారు. తిరస్కృతులు, బహిష్కృతులు, అనాధలు, అభాగ్యినులు అయిన మహిళలను చేరదీసి చేతివృత్తులు, హస్తకళలు నేర్పి వాళ్లకు జీవనోపాధి కల్పించారు. హరిజనులకు చదువు నేర్పేందుకు పొట్లపూడిలో పాఠశాలను ఏర్పాటు చేశారు. వాడలో కలరా సోకితే మందులు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. వారి కోసం గంజి స్వయంగా తయారు చేసి పంచారు.
 
          1907 లో బిపిన్ చంద్రపాల్ దంపతులు నెల్లూరు వచ్చినప్పుడు (16 ఏళ్ల వయసులోనే) కనకమ్మ వారికి ఆతిథ్యం ఇచ్చారు. మద్రాస్ వెళ్లి తిలక్ ని కలిసారు. బెజవాడ వచ్చిన లాలా లజపతిరాయ్ ని కలిశారు. 
 
          ఆంధ్రదేశంలో వందేమాతరం ఉద్యమాన్ని విస్తృతం చేస్తూ మగ్గాలు నెలకొల్పారు. ప్రత్తి నుండి తాను స్వయంగా తీసిన దారాలతో గాంధీజీ గారికే వస్త్రాలు పంపారామె. అందరూ జాతీయ ఉద్యమంలో గాంధీజీకి ధనమిస్తే, కనకమ్మ ‘పల్లిపాడు సత్యాగ్రహా శ్రమానికి’ గాంధీజీ నుండి డబ్బు వసూలు చేశారు. సంవత్సరం పైనే బెజవాడ గోపాల రెడ్డి గారితో పాటు జైలు శిక్షను అనుభవించారు.
 
పొణకా కనకమ్మ గారి రచనా-వ్యాసంగం :
 
          కనకమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ సాహిత్యంలో ప్రవేశం ఉంది. ఎందరో కవి పండితులు, కళాకారులను ఆహ్వానించి అతిధి మర్యాదలు ఇచ్చేవారు. 20 ఏళ్ల వయసులోనే శశిరేఖ, హిందూసుందరి, అనసూయ వంటి పత్రికలలో పద్యాలు, వ్యాసాలు రాయడంతో కనకమ్మ గారి రచన వ్యాసంగం మొదలైంది. “చెట్టు నీడ ముచ్చట్లు” పేరుతో వ్యాసాలు, జాతీయోద్యమ స్ఫూర్తితో 1920 లలో “రాణి పద్మిని” చారిత్రక నవల రచించారు ఆమె జైల్లో ఉన్నప్పుడు హిందీ భాష బాగా నేర్చుకున్నారు. ఆది దంపతులు ఆడమ్, ఈవ్ ల కథ “ఆది కథ” పేరుతో అనువదించగా భారతి, 1935 నవంబర్ లో ప్రచురించబడింది. కనకమ్మ అనువదించిన టాగూర్ కథ కృష్ణా పత్రికలో అచ్చైనది ( అలభ్యం).  గృహలక్ష్మి 1934 అక్టోబర్ లో ప్రచురింపబడిన “స్వప్న దృశ్యం” ఒక స్కెచ్. భావ కవిత్వ ప్రభావంతో వచ్చిన మధురమైన ఊహ.
 
          పొనకా కనకమ్మ ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ సుమారు 30 సంవత్సరాలు కలిసి తెలుగులో తొలి జంట కవయిత్రులుగా రమణ భక్తులై భగవాన్ మీద స్తుతి గీతాలు రాశారు. భగవద్గీతలో కొన్ని శ్లోకాలను “జ్ఞాన నేత్రం” పేరుతో తెలుగులో అనువదించారు. రమణ మహర్షి మీద “ఆరాధన” పేరుతో మంజరీ ద్విపదలో చిన్న స్తుతి కావ్యం రచించారు. “నైవేద్యం” పేరుతో రమణ భగవానుల మీద ఒక పద్య కృతి రచించారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కనకమ్మ రాసిన పద్యాలు భారతి, గృహలక్ష్మి తదితర పత్రికల్లో ప్రచురించారు. ఆమె దువ్వూరి రామిరెడ్డి గారి మీద రాసిన పద్యాలు, మరికొన్ని రచనలు కూడా జమీన్ రైతు పత్రికలో ప్రచురించబడ్డాయి.” గురుదేవుడు” పేరుతో రామయోగి చరిత్రను కనకమ్మ వచనములో రాశారు. మద్రాసు రేడియో కేంద్రంలో కనకమ్మ గారు అనేకసార్లు ప్రసంగించారు కనకమ్మ గారి రచనల సమగ్ర సంపుటం రావాల్సిన అవసరం ఉన్నది.
 
          ఆర్థిక నష్టాలు, శారీరక మానసిక కష్టాలు, భర్త మరణం, చిన్న వయసులోనే కుమార్తె మరణం, వయసు పైపడటంతో పాటు పక్షవాతంతో మంచం పట్టారు కనకమ్మగారు. తనకు గుర్తు ఉన్నవి చెప్తూ ఉంటే (ఏ రికార్డులు, డైరీలు లేవు) పారిశ్రామిక విద్యాలయం లోని అధ్యాపిక శ్రీమతి నలుబోలు సరస్వతిగారు రాయటం వల్ల నాటి పరిస్థితులన్నీ తర్వాత తరాలకు అందే అవకాశం కలిగింది. ఆ వ్రాతపతి దాదాపు 50 ఏళ్ళ తర్వాత అందుకున్న డాక్టర్ కాళిదాసు పురుషోత్తంగారు దాని పూర్వాపరాలను పరిశోధించి, పట్టుదలతో స్థానికంగా వివరాలు సేకరించి, ఎందరినో అడిగి “కనకపుష్యరాగం” పేరిట కనకమ్మ గారి స్వీయ చరిత్రను ప్రపంచానికి అందించారు.
 
          డా.కాళిదాసు పురుషోత్తం గారి “కనకపుష్యరాగం” ప్రచురింపబడ్డాక కనకమ్మ గారి పూర్వ విద్యార్థిని నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ వి. వరలక్ష్మి గారు “జమీన్ రైతు” పత్రికలో మంచి వ్యాసం రాశారు. మరొక పూర్వ విద్యార్థిని డాక్టర్ డి. సావిత్రి గారు మరియు తనతో పాటు విద్యాలయంలో చదివిన చిన్ననాటి స్నేహితురాళ్ళు అందరూ కనకమ్మ గారి విగ్రహ స్థాపనకు పూనుకొన్నారు. ఆ తర్వాత కొందరు కృషిచేసి, పట్టుదలతో ప్రయత్నించి విద్యాలయంలో కనకమ్మ గారి విగ్రహ స్థాపనకు పూనుకోగానే వితరణశీలురు కొందరు ఉదారంగా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. 2017 అక్టోబర్ రెండవ తారీఖున, గాంధీజీ జయంతి రోజు కనకమ్మ గారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. కనకమ్మ గారి జీవిత చరిత్రను చదివిన ఆనాటి విద్యార్థినులు తమ బాల్య స్మృతులను రాశారు. అలాగే ప్రముఖ స్త్రీ వాది ఓల్గా “కనకమ్మ గారిని పురుషాంకారం ఎంతగా వేధించింది” ఉదహరిస్తూ  ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో కనకపుష్యరాగం మీద సమీక్ష రాశారు.
 
లభ్యమైన కథలు:
 
నేను అభాగ్యుణ్ణి:
 
          సౌందర్యారాధకుడైన కథానాయకుడి అభిరుచికి తగినట్టే మంచి వర్ణనతో కథ మొదలవుతుంది. ఒంటరి మగాడు హోటల్ కు వెళ్లి భోంచేసి, సినిమా హాల్ దగ్గరికి వెళతాడు. అక్కడికి కొందరు స్త్రీలు కూడా వస్తారు. వారిలో ఒక అమ్మాయికి కాలికి ఏదో కుట్టి కింద కూలబడుతుంది. అతను ఏడుస్తున్న ఆమెకు ప్రథమ చికిత్స చేసి, ఆకారులోనే ఆసుపత్రికి తీసుకుపోయి ఇంజక్షన్ చేయిస్తాడు. ఆ కృతజ్ఞత తర్వాత స్నేహంగా, అతని సాంగత్యంలో ప్రేమగా మారుతుంది. ఆ ఉషా రాజశేఖరంల  ప్రణయాన్ని ఆ రోజుల్లో  కనకమ్మగారు అంత అందంగా, హృద్యంగా వర్ణించటం కొంత ఆశ్చర్యమే. 
 
          స్త్రీల యొక్క చదువు, స్వేచ్ఛ పట్ల అంతరంగంలో ఆమెకున్న భావాలు దీనివల్ల తెలుస్తుంది.
 
          కానీ రాజశేఖర్ ఒకనాడు ఇంటికి వెళ్ళినప్పుడు, తల్లి అంతిమ సమయంలో ఆమె కోరిక ప్రకారం మేనమామ కుమార్తె మాలతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినది.
 
          కొన్నాళ్ళకు గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి భార్యతో పాటు రాజశేఖరం వెళ్ళినపుడు ఆ జనసందోహంలో విరాగిని వంటి వేషధారణలో ఉష కనిపించి స్థాణువులా నిలబడిపోయాడు. క్షమించమని అడగాలనుకొన్నా గుండె, పెదవులు దుఃఖభారంతో  వణికిపోయాయి. ఉష అతనిని, మాలతిని చూసి ” ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసాను. మీరు సుఖంగా ఉండండి” అని అతని పాదాలను తాకి కన్నులకద్దుకొని చరచరా వెళ్ళి పోయింది. “నేను అభాగ్యుణ్ణి” అనుకొన్నాడతను.
 
          ఈ రోజుల్లో ఈ కథ చదివితే నాన్సెన్స్ అనుకోవచ్చేమో. కానీ 1930 ల్లో పురుషులతో పాటు స్త్రీలు కళాశాలలో చదువుకోవడం, తమ ఆశల్ని, ఆశయాలను స్వేచ్ఛగా వెల్లడించుకోవడం, ప్రేమ… వంటి విషయాలు రాయడం అంటే – నాటి కాలానికి ఎదురీదడమే.
 
ఉరి :
   
          జైలు జీవితంలో ఉన్నప్పుడు కనకమ్మ హిందీని బాగా నేర్చుకున్నారు. చాలా రచనలను హిందీ నుండి తెలుగులోకి అనువదించారు.
 
          అందులో “ఉరి” అనే ఫ్రెంచ్ కథ అద్భుతమైనది. ఎడ్గార్ యాలన్ పో రాసిన కథను మహారాజ నందకుమార్ హిందీలోకి అనువదించారు. కనకమ్మ గారు దానిని తెలుగులో రాసారు. ఎక్కడా అనువాదం అని గానీ, కృతకంగా కానీ ఉండదు. 
 
          ఫ్రెంచ్ విప్లవ నేపధ్యం కలిగిన ఈ విషాదాంత కథను ఉద్యమ స్పూర్తితోనే తెలుగు లోకి తెచ్చారని… ఆ ధైర్యం, త్యాగం తనకు నచ్చి, అందరికీ తెలియజేయాలన్న ఆమె ఉద్దేశం అని స్పష్టమౌతోంది.
 
          లూసీ, చార్లెస్ డారన్ న్యాయ శాస్త్ర విద్యార్థులు. ప్రేమికులు. అత్యంత సౌందర్యరాశి, చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. డారన్ సాధారణ యువకుడు. స్వతంత్ర ఆలోచనలు కలవాడు. అతడు గంభీర స్వరంతో ఉపన్యసిస్తుంటే యువకులు మంత్ర ముగ్ధులవుతారు. ఉపన్యాసకులు ” నీవు ఒక స్వాతంత్య్ర జాతీయ విప్లవకారి సమితి సంచాలకుడవై, ఫ్రాన్స్ నందు అపూర్వ స్వాతంత్య్ర జాగ్రత్తను సృజింపజేయగలవు” అంటారు. 
 
          పరీక్షలు సమీపించు సమయంలో లూసీ, చార్లెస్ డారన్ తమ భవిష్యత్ గురించి చర్చించుకొంటారు. ప్రాక్టీస్ పెట్టి మంచి న్యాయవాది కావాలని లూసీ ఆశయం. వకీలుగా ఉండజాలనని, సాంఘిక విప్లవ కారుడిగా కార్యోన్ముఖంగా సాగడం అతని ఆశయం. 
 
          పరీక్షలు పూర్తి చేసిన తర్వాత  “నేను ఫ్రాన్స్ నందు జాతీయ విప్లవమును వ్యాపింప జేయుదును. ఒక విప్లవకారుడనై, ధనవంతులు బీదవారి పైన ఇష్టం వచ్చినట్టు చేయు క్రూర దౌష్ట్రములను ప్రతిఘటింతును. స్త్రీల యెడల ధనవంతులు సల్పుచుండు అత్యాచారములను కూకటి వేళ్ళతో పెకిలించి వేసెదను. ధనవంతుడు పేదవాడు అనుభేదము లేకుండా నిర్మూలన చేయుదును. అప్పుడే ఫ్రాన్స్ దేశములకు శాంతి లభించగలదు” అని లూసీకి తన నిర్ణయం చెప్పి వెళ్ళిపోయాడు.
 
          లూసీ న్యాయవాద వృత్తిని చేపట్టి మంచి పేరు సంపాదించుకుంది. డారన్ చేస్తున్న విప్లవ కార్యాలు అప్పుడప్పుడు ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి.
 
          మార్క్వీన్ అనే దుర్మార్గుడు ధనాన్ని, స్త్రీలను దోచుకొంటూ, అనేక దుశ్చర్యలకు పాల్పడడంతో ఫ్రాన్స్ దేశ వాసులు హడలిపోసారు. 
 
          మార్క్వీన్ ను సంహరించి, ప్రజలకు ఊపిరి పోసిన చార్లెస్ డారన్ హత్యానేరం పైన న్యాయస్థానానికి గొనిరాబడ్డాడు. న్యాయాధికారి లూసీ. అశ్రువదనయైనది. విషాదాంతరంగ అయినది. 
 
          తమ ప్రేమ జ్ఞప్తికి వచ్చి హృదయం అల్లకల్లోలమైంది. కానీ, వృత్తి ధర్మం కఠినమైనది. సర్వదా అనుసరణీయమైనది. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ డారన్ కు మరణశిక్ష విధించింది. ఆ ప్రాంగణమంతా  “ఉరి… ఉరి…” అని బాధతో ప్రతిధ్వనించింది.
 
          ఉరి తీసే సమయంలో నిర్వికారంగా ఉన్న డారన్ కళ్ళు ఎందుకో ఎవరి కోసమో వెదికాయి. తాను కోరిన స్త్రీ మూర్తి దూరంగా కనిపించింది. నాలుగు కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ధార కట్టాయి. 
 
          ఉరి అమలు చేయబడింది. ఆ తర్వాత లూసీ ని ఫ్రాన్స్ ప్రజలెవరూ చూడలేదు.   
     అప్పుడప్పుడు ఆ సాంద్రారణ్య ప్రాంతంలో ఒక యోగిని కనబడుతుండేదని ప్రజలు చెప్పుకొనేవారు.
 
          ఇదీ ఉరి కథ సంక్షిప్తంగా. కానీ కనకమ్మగారి చక్కని తెలుగు, కథా కథనం పాఠకుల గుండెను లాగేసి, ముగింపుతో భారంగా మార్చేస్తుంది.
 
          అనువాద కథ అయినా తెలుగు “నేటివిటీ” స్పష్టంగా ఉంది. ఈ కథను స్వీకరించడమే కనకమ్మగారి మనసు, వ్యక్తిత్వం, ఆశయం కచ్చితంగా వెల్లడవుతోంది.
 
          1962 మే 28 న ఆంధ్ర మహిళా సభ రజతోత్సవం మద్రాసులో వైభవంగా జరిగింది. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షులు. వేదిక పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ డాక్టర్ పి. సుబ్బరామన్, సి. రాజగోపాలాచారి, డాక్టర్ చింతామణి దేశముఖ్, కామరాజు నాడార్ మొదలైన విశిష్ట అతిధులు ఆశీనులైన సభలో కనకమ్మ రజిత ఫలకాన్ని, సన్మానాన్ని అందుకొన్నారు.
 
          జీవితమంతా ప్రజల కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు పాటు బడిన పొణకా కనకమ్మ తన 71వ ఏట 1963 లో కీర్తిశేషులైనారు.
 
          ఓల్గా అన్నట్లు ” ఆమె చరిత్ర కెక్కితే ఎందరో చరిత్ర హీనులౌతారు”. పొణకా కనకమ్మ గారి జీవితగాధను పుస్తక రూపంలో తెచ్చిన డా. కాళిదాసు పురుషోత్తం గారికి, నాటి పత్రికల్లో వచ్చిన కథలను నాకందించిన శ్రీ అశోక్ పారా గారికి ధన్యవాదాలు.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.