తీక్షణ వీక్షణంలోంచి…

-గవిడి శ్రీనివాస్

ఈ క్షణం
తీక్షణంగా నిరీక్షణ చేస్తున్నాను
అక్షరాల దొంతరల్ని పేర్చుకుంటున్నాను.

నిరీక్షణ వీక్షణంలోంచి లేచి
ఏవో క్షణాల్ని ఏరుకుంటున్నాను.

ఏకాంతం రాలుతుందో
ఆక్షరం ఏలుతుందో
మదిలో తుపానులు తరుముతుంటాయి.
మనిషి మనుగడని తురుముతుంటాయి.

అస్తిత్వం ప్రశ్నలు కుదుపుతూ ఉంటాయి.

కాలంతో పోటీ పడటం
సవాళ్ళకు పరిష్కారాలు అన్వేషించడంతోనే
క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నాది కాని ప్రపంచంలో
నెగ్గుకు రావాల్సిన సందర్భాలు ఉంటాయి.

ఏం క్షణం నాది కాకపోయినా
తీక్షణంగా పరీక్షణ చేస్తే
ఏదో కొత్త రూపంలో
వెలుగు రేఖలు కన్పిస్తుంటాయి.

*****

Please follow and like us:

One thought on “తీక్షణ వీక్షణంలోంచి… (కవిత)”

  1. ఆశావహదృక్పథం వుట్టిపడే కవిత. చివరి కవితాభాగం నిరాశలో వున్న వారికి కూడ ఆశను కలిగించే ప్రేరణ ఉన్నది.. “ఏ క్షణం నాది కాకపోయినా..వెలుగురేఖలు కనిపిస్తుంటాయి” కవితను నిలబెట్టిన పాదాలు. ఎప్పటిలా స్పూర్తిదాయకమైన కవితను అందించిన గవిడి శ్రీనివాస్ గారికి అభినందనలు…

Leave a Reply

Your email address will not be published.