మా కథ 

-ఎన్. వేణుగోపాల్ 

గనికార్మికుని భార్య దినచర్య

నా భర్తకు మొదటి షిఫ్ట్ ఉన్నప్పుడు నాకు ఉదయం నాలుగింటికే తెల్లవారుతుంది. లేచి ఆయనకు ఉపాహారం తయారు చేస్తాను. నేనప్పుడే సత్తనాలు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సల్లేనా అంటే మాంసం, బంగాళాదుంపలు, మిరియాలపొడి మసాలా కూరిన బూరె. నేను రోజుకు వంద సత్తనాలు తయారు చేసి బజార్లో అమ్ముతాను. నా భర్త సంపాదన మా అవసరాలకు పూర్తిగా సరిపోదు. గనుక వేన్నీళ్ళకు చన్నీళ్ళలాగా నేనూ కొంత ఇట్లా సంపాదిస్తాను. ముందు రోజు రాత్రే పిండి తయారు చేసి పెడతాను. నాలుగింటికల్లా సత్తనాలు తయారు చేసి పిల్లలకు తిండి తినిపిస్తాను. పిల్లలు నాకు పనిలో ఎంతో సాయపడతారు. బంగాళాదుంపలు, కారట్లు పొట్టు ఒలిచి, పిసికి ముద్దచేసి ఇస్తారు. – ఆ తర్వాత బడికెళ్ళే పిల్లలు తయారవుతారు. రాత్రి నానబెట్టిన బట్టలు ఉతికి ఆరేసీ ఎనిమిదింటికి నేను సత్తనాలు అమ్మడానికి బయటికి పోతాను. మధ్యాహ్నం మాత్రమే బడి ఉండే పిల్లలు నాకు సత్తనాలు అమ్మడంలో సాయపడతారు. కంపెనీ దుకాణానికి వెళ్ళి తిండి దినుసులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ దుకాణం ముందట ఎంత పొడవాటి వరుసలుంటాయంటే పదకొండింటి దాకా నిలబడితేనే మనక్కావల్సినవి దొరుకుతాయి. మాంసం కోసం ఓ వరుసలో నిలబడాలి, కూరగాయల కోసం ఓ వరుసలో నిలబడాలి, నూనెకోసం మరో వరుసలో నిలబడాలి. అంటే ఓ వరుస తర్వాత మరో వరుస – అలా నిలబడుతూనే ఉండాలన్నమాట.

ఒకొక్క సరుకు ఒక్కొక్క చోట ఇస్తారు గనుక అదంతే. సత్తనాలు అమ్ముతూనే నేను నా సరుకులు కొనుక్కోవాల్సి వస్తుంది. సరుకులు తీసుకోవడానికి నేను వెళ్ళినపుడు పిల్లలు సత్తనాలు అమ్ముతారు. ఆ తర్వాత పిల్లలు వరుసలో నిలబడితే నేను అమ్ముతాను. మా పని ఇట్లా నడుస్తుంది.

నేను తయారుచేసే వంద సత్తెనాలకు సగటున రోజుకు ఇరవై పిసోలు సంపాదిస్తాను, మొత్తం ఒక్కరోజు అమ్మితే యాభై విసోలు వస్తాయిగాని, ఒక్కోరోజు ముప్పై, సత్తెనాలే అమ్మితే నష్టమే వస్తుంది. కనుకనే సగటున రోజుకు ఇరవై పిసోలు వస్తాయని చెపుతున్నాను. నాపనింకా నయం – నేనందరికీ తెలుసుగనుక చాలా మంది నా దగ్గరే కొంటారు కాని నాతోపాటు అమ్మే ఇంకొందరు

 స్త్రీలు రోజుకు ఐదో, పదో పిసోలే సంపాదిస్తారు. నేనూ, ‘నా భర్తా సంపాదించేది కలిపితే మా తిండికీ బట్టలకూ ‘ బొటాబొటిగా సరిపోతుంది. మాకు తిండి ఖరీదు చాలా ఎక్కువ. కిలో మాంసానికి ఇరవై ఎనిమిది పిళలు, కారట్లకు నాలుగు పిసోలు, ఉల్లిగడ్డలకు ఆరు పిసోలు… నా భర్తకు రోజుకు ఇరవై ఎనిమిది పిసోలు సంపాదిస్తాడని చెప్పానుగదా- అవి ఏ మూలకు సరిపోతాయి?

‘బట్టలా – అమ్మో! వాటి ఖరీదు మరీ ఎక్కువ. నేను తయారుచేయగలిగిన బట్టలన్నీ నేనే చేస్తాను. కుట్టి సిద్ధంగా ఉన్న దుస్తులు మేం ఎప్పుడూ కొనుక్కోం. ఉన్ని కొనుక్కొని అల్లుకుంటాం. ప్రతి సంవత్సరం మొదట్లో నేను మా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బట్టలకూ చెప్పులకూ కలిపి రెండువేల పిళలు ఖర్చు పెడతాను. ఈ మొత్తాన్ని కంపెనీ నెలనెలా నా భర్త జీతంలోంచి కోసుకుంటుంది. జీతం కాయితాల మీద ఈ కోతను “కట్ట” అని రాస్తారు. ఈ “కట్ట” కోత ఇంకా ముగియక ముందే మా చెప్పులు చీలికలు వాలికలైపోతాయి. ఇదీ మా పరిస్థితి.

సరే – నేను ఉదయం ఎనిమిది నుంచి పదకొండు దాకా సత్తనాలు అమ్ముతాను. దుకాణానికి పోతాను. గృహిణుల సంఘంలో పనిచేస్తాను. సలహాలకోసం అక్కడి కొచ్చే స్త్రీలతో మాట్లాడుతుంటాను. మధ్యాహ్నానికల్లా మళ్ళీ భోజనం తయారు చేయాలి. ఎందుకంటే మిగిలిన పిల్లలు తిని, మధ్యాహ్నం బడికిపోతారు. మధ్యాహ్నం పూట బట్టలుతుకుతాను. మా దగ్గర బట్టలుతికి ఇచ్చే కొట్లేమీ లేవు. గోతులు తవ్వుకొని పంపుల నుంచి నీళ్లు తెచ్చి గోతులు నింపుకుంటాం. ఇంకా నేను పిల్లల నోట్ పుస్తకాల్లో తప్పులు దిద్దాల్సి ఉంటుంది. మర్నాటి సత్తనాల కోసం అవసరమైనవి చేయాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు అప్పటికప్పుడే పరిష్కరించాల్సిన సమస్యలను మా గృహిణుల సంఘం మధ్యాహ్నం పూట చర్చకు పెడుతుంది. అప్పుడు నేను ఉతికే పని పక్కన పెట్టాల్సి వస్తుంది. సంఘంలో దాదాపు రోజూ రెండుగంటలు చేయాల్సిన పని ఉంటుంది. ఇది పూర్తిగా స్వచ్ఛందమైన పనే. ఇంక మిగిలిన పనులు రాత్రిపూట చేయాల్సి ఉంటుంది. పిల్లలు బడినుంచి బండెడు ఇంటిపని మోసుకొస్తారు. వాళ్ళు రాత్రంతా ఆ పని, బల్లమీదనో, కుర్చీమీదనో, పెట్టెమీదనో చేసుకుంటూ ఉంటారు.

ఒక్కోసారి అందరికీ పని ఉన్నప్పుడు రాసుకోవడానికేమీ లేకనేను పక్కమీద పళ్ళెం తిప్పి పెడితే దాని మీదొకరు రాసుకుంటారు. మొదటి ‘షిప్టు చేసే రోజుల్లో నా భర్త రాత్రిపదింటికే పడుకుని నిద్రపోతాడు. ఆయనతోపాటే పిల్లలు కూడా నిద్రపోతారు. రెండో షిఫ్ట్ చేసే రోజుల్లో రాత్రిలో ఎక్కువ భాగం ఆయన బయటే ఉంటాడు. మూడో షిఫ్ట్ చేసే రోజుల్లో రాత్రిపూట ఇంట్లోనే ఉండడుగదా! ఇట్లా ఆయన పనులనుబట్టి నా పనులు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది నేను.

సాధారణంగా మేం పనిమనిషికోసం చూడం. మా భర్తల సంపాదన తక్కువయినప్పుడు, నేను సత్తనాలు అమ్మడంలాంటి ఆలోచనలు చేసినట్టుగానే అదనంగా సంపాదించడం ఎట్లా అని ఆలోచిస్తుంటాం. కొందరు అల్లికల పనులు చేస్తారు. మరికొందరు బట్టలు కుడతారు. కొందరు దుప్పట్లు తయారుచేస్తారు. మరికొందరు. బజార్లో సరుకులు అమ్ముతారు. పాపం ఏ పనీ చేయలేని స్త్రీల విషయంలోనే సమస్య వస్తుంది.

చేయడానికే వృత్తీ మిగలదు. ఒక్క స్త్రీలు మాత్రమే కాదు, సైన్యం నుంచి తిరిగివచ్చిన యువకులు కూడా ఇలాగే ఏ పనీలేకుండానే ఉన్నారు. ఈ నిరుద్యోగ సమస్య మా పిల్లల్ని బాధ్యతారహితంగా తయారు చేస్తోంది. వాళ్ళకు కుటుంబంమీద, తల్లిదండ్రులమీద ఆధారపడటం అలవాటైపోతోంది. చాల తరచుగా వాళ్ళు సంపాదనేమీ లేకుండానే పెళ్ళి చేసుకొని భార్యతోసహా ఇంటికొస్తున్నారు. ఇదీ మేం బతికే పద్దతి. మా రోజులిట్లా గడుస్తాయి. నేను రోజూ పడుకునేసరికి అర్ధరాత్రి అవుతుంది. రోజూ నాలుగుగంటలో, ఐదుగంటలో మాత్రమే పడుకోడానికి అలవాటై పోయాం మేం. ఇది. చూస్తే గని కార్మికుడు ఎట్లా రెండు రకాలుగా దోపిడీ చేయబడుతున్నాడో తెలుస్తుంది గదూ. అతి తక్కువ సంపాదనతో స్త్రీలు ఇంట్లో చాల పని చేయాల్సి ఉంటుంది. నిజానికి స్త్రీలు ఇంట్లో చేసే పనంతా యజమాని కోసమే. ఇదంతా డబ్బివ్వకుండానే చేయించుకునే చాకిరీయే. కదూ?

ఐతే గని కార్మికులను దోపిడీ చేయడంతో పాటు వాళ్ళ భార్యలను మాత్రమే కాదు, కొన్నిసార్లు పిల్లల్ని కూడా దోపిడీ చేస్తారు. ఇంట్లో చేయాల్సిన పనుల్లో చాలా భాగం పిల్లలు కూడా చేస్తారు గదా, వాళ్ళు మాంసం కొనుక్కొస్తారు, నీళ్ళు తెస్తారు. ఎంతెంతో సేపువరుసల్లో నిలబడి తోపుళ్ళకు గురవుతారు, పిసికివేయబడతారు. మాంసం కొరత ఏర్పడ్డపుడు వరుసలు ఎంత పొడుగైపోతాయంటే మాంసం కోసం తొక్కిసలాటలో పిల్లలు కొన్నిసార్లు చనిపోతారు కూడా.  అప్పుడక్కడ భయం తాండవిస్తుంది. అలా చనిపోయిన పిల్లలూ, ఎముకలు విరిగిపోయిన పిల్లలూ ఎంతోమంది నాకు తెలుసు. అంతెందుకు – మా ఇంట్లోనే మేమే స్వయంగా పిల్లల్ని వరుసల్లో నిలబెడతాం. ఆ వరుసల్లో తొక్కిసలాటల్లో పిల్లలు ముద్దయిపోతారు. ఈ మధ్య సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలెన్నో జరిగాయి. మాంసం కోసం ఎదురుచూస్తూ రెండు మూడు రోజులు వరుసలో నిలబడి బడి పోగొట్టుకునే పిల్లలూ ఉంటారు.

చెప్పవచ్చిందేమంటే కం పెనీ వాళ్ళు కార్మికులకు ఏ సౌకర్యమూ ఇ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కార్మికులు తమ పనులన్నీ తామే చేసుకోవాలి. మా కుటుంబం సంగతే తీసుకోండి, నా భర్త పనిచేస్తాడు, నేను పనిచేస్తాను, నా పిల్లలతో పని చేయిస్తాను. మొత్తానికి అందరికందరమూ పనిచేస్తూ ఉంటాం. యజమానులు రోజు రోజుకూ మరింత ధనికులైపోతారు. కార్మికుల పరిస్థితి నానాటికీ హీనాతి హీనంగా మారిపోతుంది. ఐతే ప్రతి పనీ మేం చేసినప్పటికీ మేం చేసే పనులు ఆర్థికంగా ఏమీ తోడ్పడవనీ, డబ్బు తెచ్చే పని భర్త చేస్తూంటాడు గనుక, భర్త చేసేదే ఫని అనీ, స్త్రీలేమీ పని చేయరని ఒక అభిప్రాయం ఉంది. మా పట్ల ఎప్పుడూ ఈ చిన్న చూపు ఉంటుంది.

 

ఓ రోజు నాకోపట్టిక తయారు చేయాలనిపించింది. ఆ పట్టికలో ఒక డజను బట్టలుతికితే బయట ఎంత తీసుకుంటారో, మేం నెలకు ఎన్ని డజన్ల బట్టలుతుకుతున్నామో రాశాం. ఆ తర్వాత వంట మనిషి జీతం వేశాం. ఆయా జీతం వేశాం. పనిమనిషి జీతం వేశాం. మా గని కార్మికుల భార్యలం రోజూ చేసే పనులన్నీ రాశాం. ఇవన్నీ కలిపితే మా భర్తలు నెలకు సంపాదించేదానికన్నా ఎంతో ఎక్కువ కావాలి. ఇట్లా మేమూ పని చేస్తామని మా భర్తలకు అర్థం చేయించాం. అంతేకాదు, మేం పొదుపు చేసేదాన్ని కూడా మళ్ళీ ఇంటికే వాడుతుంటాం కదా. కనుక ఇళ్ళలో మేం చేసే పనిని ప్రభుత్వం గుర్తించక పోయినా, దేశం మా పనులతో లాభపడుతోంది. ఎందుకంటే మేం చేసే పనులకు మాకు చిల్లిగవ్వ ప్రతిఫలం కూడా ముట్టటం లేదు. – ఈ వ్యవస్థ ఉన్నంతకాలం విషయాలిట్లాగే ఉంటాయి. అందుకే నేనేమనుకుంటానంటే మన విప్లవకారులు గెలవవలసిన మొట్టమొదటి యుద్ధం ఇంట్లోనే జరపాలి. స్త్రీని పురుషుణ్ని, పిల్లల్నీ కార్మికవర్గ పోరాటాల్లో పాలుపంచుకునేట్టుచేయడం అనే ఈ యుద్ధం మనం తప్పకుండా గెలవవలసింది. అప్పుడు మాత్రమే ఇల్లు శత్రువు చొరబడలేని ఒక దృఢమైన కేంద్రం అవుతుంది. ఇంట్లోనే మనకో శత్రువు మిగిలిపోతే మన ఉమ్మడి శత్రువుకు మనమీద ప్రయోగించడానికి, మనకు నష్టపరచడానికి ఓ ఆయుధం మిగిలి ఉన్నట్టే. కనుకనే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలని, సంఘాలు, రాజకీయాలు వంటి బయటి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పే బూర్జువా భావాల్ని తోసేసి మనం పరిస్థితిపట్ల సరైన భావాలు ఏర్పరచుకోవడం అత్యవసరం. ఆమె ఇంట్లోనే ఉన్నా బయట ఆమె భర్త బతుకుతున్న దోపిడీ వ్యవస్థలో ఆమె కూడా భాగమే అది గనిపనైనా కానివ్వండి, ఫ్యాక్టరీ పనైనా కానివ్వండి – అదంతే గదూ?!

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.