కనక నారాయణీయం -30

పుట్టపర్తి నాగపద్మిని

మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గాంధారం, మేక గొంతులోనూ, మధ్యమం క్రౌంచ పక్షి  అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం స్వరానికి మన కోకిలమ్మ పెట్టింది పేరు. అశ్వముఅంటే గుర్రము, దైవతానికీ, ని నిషాద స్వరానికి గజము అంటే ఏనుగు ప్రసిద్ధాలు. ‘

     పుట్టపర్తి యీ మాటలని ఆగగానే, అక్కడ కూర్చుని వున్న పిల్లల్లో ఎవడో ఒకడు, మే..మే..అంటూ మేకలాగా అరిచాడు. వాణ్ణి చూసి మరొకడు, కోకిల వలె కూ కూ అనటం మొదలు పెట్టాడు. మరొకడెవడో గుర్రం  వలె  సకిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటే, తక్కిన వాళ్ళు ఒకటే నవ్వులు!!  వాళ్ళతో పాటూ  పుట్టపర్తీ,   కృష్ణమూర్తీ కూడా గట్టిగా నవ్వేశారు!!

  నవ్వులు ఆగిన తరువాత పుట్టపర్తి అన్నారు,’నవ్వుకోవటం కోసం కాదురా పిల్లలూ, ఋషులు,  అదీ స్వయంగా పరమ ఋషితుల్యులైన   నారదులవారే  ‘నారద పురాణం’ లో యీ మాటలు చెప్పారంటే, మాటలు కావు, అవి మంత్రాలు!!  ప్రకృతి సర్వమూ మనకు ఏదో విధానంలో మనకు పాఠాలు చెబుతూనే ఉంటుంది. అంతే కాదు, ఎవరిదైనా స్వరం అంటే గొంతుక (పాడే విధానంస్వర శుద్ధంగా ఉండాలంటే కూడా గాయకులు పాటించవలసిన నియమాలు కూడా చెప్పబడ్డాయి.’

     ‘సార్, ఇదిగో యీ మల్లికార్జున్ గాడు ఊరికే బొంగురు గొంతుతో పాడుతూ మమ్మల్ని చంపుకు తింటుంటాడు . వీడి గొంతు ఘంటసాల గారిలాగా వినబుద్ధిగా కావాలంటే ఏమిచేయాలో చెప్పండి సార్!!’ అన్నాడో బడుద్ధాయ్!!

          పిల్లలంతా మళ్ళీ నవ్వులు.

      పుట్టపర్తి అన్నారు,’ మంచి గాయకుడు కావాలనుకునే వాడు, కొన్ని నియమాలు పాటించవలె!! మేడి, కడిమి(కదంబ) వంటి చెట్ల పుల్లలతో దంతధావనం చేసుకుంటే గొంతు తీయగా సాగుతుందట!! క్రమం తప్పకుండా త్రిఫలా చూర్ణం తీసుకుంటే కూడా గొంతులో మాధుర్యమే కాదు, మేధస్సు కూడా వికసిస్తుందిరా!’.

     ‘ఒరేయ్, మల్లిగా!! సార్ చెప్పేది నీకోసమే!! రేపటినుంచీ మొదలుపెట్టు, మమ్మల్ని చంపక!!’అన్నాడో కొంటె కుర్రాడు.

          మళ్ళీ నవ్వుల కెరటం ఉవ్వెత్తున లేచింది.

   మాటలు అంటుంటే, బెల్ కొట్టటంతో పిల్లలందరూ వాళ్ళ సంచీలు సర్దుకుంటూ ఉండగా, పుట్టపర్తీ, కృష్ణమూర్తీ కూడా లేచి నిలబడ్డారు.

***

          ఒకసారి మర్రి చెట్టుకింద పాఠం సాగుతున్న సమయంలో, అక్కడికి  వాట్కిన్స్ (డ్రాయింగ్ టీచర్) కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అతనికి క్లాస్ లేదు. పుట్టపర్తివారంటే అతనికి ఎంతో గౌరవం.

   అప్పుడప్పుడు క్లాస్ మధ్యలో పిల్లలకు తన చిన్నప్పటి విశేషాలు కూడా చెబుతుంటారు పుట్టపర్తి. ఇద్దరు కుర్రాళ్ల అల్లరి మితిమీరి పోతూందని వాట్కిన్స్ చెప్పాడు.

    పుట్టపర్తివారన్నారు,’ చూడరా! వాట్కిన్స్!! పిల్లలు కాకుండా ఇంకెవరు చేస్తారు అల్లరి!! అల్లరిలోనే వాళ్ళ సృజనాత్మకత కూడ పెరుగుతుంది తెలుసా!! వాళ్ళ అల్లరిని అదుపులో ఉంచుతూ, పాఠాలు చెప్పగలిగేవాడే అసలైన టీచర్.’

    ఇంతలో ఒక కుర్రాడన్నాడు,’సార్!! మీరు చిన్నపుడెట్లా ఉండేవారు మరి?’

  బైట తెగ అల్లరి చేసేవాళ్ళం, నా స్నేహితులతో కలిసి!!దుష్ట చతుష్టయం అని పిలిచేవాళ్ళుమేము మొత్తం నలుగురు నారాయణులం. అల్లరి కేమిగానీ, ఇంట్లో పిల్లిలాగానే ఉండేవాణ్ణిరా!! మా అయ్యగారు గొప్ప పండితులు. మా ఇంట్లో ఎపుడూ కావ్య సంగీత గోష్టులే!! నేను హైస్కూల్ లో చదువుకుంటూ ఉండేవాణ్ణి. కానీ, స్కూల్ పాఠాలలో లెక్కలంటే పడేది కాదు. (పిల్లల నవ్వులు) అక్కడి పాఠాల కంటే ఇంట్లో యీ గోష్టులే నాకు తెగ నచ్చేవి.ఖ్యంగా సంగీత సాహిత్య గోష్టులు. ఇంట్లో నాకు ఆంధ్ర సంస్కృత పాఠాలు జరిగేవి. మా అయ్యగారు గొప్ప పౌరాణికుడు. వారు భారతం భాగవతానికి చెప్పే వ్యాఖ్యానాలు చాలా గొప్పగా ఉండేవి. నేను భారతం చదువుతూ ఉంటే ఆయన వ్యాఖ్యానం చెప్పేవారుభారతం చదివి చదివి, భారతమంటే, నాకు ఒకటే పిచ్చి ప్రేమ ఏర్పడిందిరా!!’

    ఇంతలో పెనుగొండ లో అసిష్టెంట్ కలెక్టర్  భార్య పిట్ దొరసానమ్మ వల్ల ఆంగ్ల సాహిత్యంలో ప్రవేశం ఏర్పడింది. ఆమె వల్ల  షేక్స్పియర్   ,బైరన్వర్డ్స్ వర్త్బ్రౌనింగ్యీ కవులంతా పరిచయమైనారు. వీళ్ళను పిచ్చిగా చదివేవాణ్ణి. ఎప్పుడూ ఏదో వేరే లోకంలో ఉన్నట్టే ఉండేదిసీరియస్ గా  నా మొహం!!(పిల్లల నవ్వులు) ఎంగ్ హ్యాంలెట్ (Hamlet) అని పిలిచేవాళ్ళు నన్ను అందరూ!!

    ఆయనెవరు సర్?

    షేక్స్పియర్ 16 శతాబ్దానికి చెందిన నాటక రచయితగొప్ప నాటకాలు వ్రాశాడు ఇంగ్లిష్ లో!! వ్రాసిన గొప్ప నాటకంలో హీరో రా!! షేక్స్పియర్ తనకంటె ముందు వాళ్ళెవరో వ్రాసిన ఒక రచన ఆధారంగా యీ నాటకాన్ని వ్రాశాడట!! ఇక హ్యాంలెట్!!   ఆయన ఒక రాజకుమారుడు. అతని జీవితంలోని సంఘటనలు గొప్ప నాటకీయతతో, సంఘటనలతో, సంభాషణలతో వ్రాశాడు షేక్స్పియర్. అన్యాయంగా తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నాల్లో అతని మనోవ్యధ, మానసిక సంఘర్షణఇవన్నీ అద్భుతంగా వ్రాశాడు షేక్స్పియర్!! నేను ఎప్పుడూ ఇవన్నీ చదివి మూడీ గా ఉండేవాణ్ణి కదా!! అందుకే నన్ను అందరూ ఎంగ్ హ్యాంలెట్ అని పిలిచేవాళ్ళు!!’

    మరొక రోజు మర్రి చెట్టుకింద పుట్టపర్తి క్లాస్ సాగుతున్నది. ఆరోజు అంశం, భాగవత పద్యాలు. పాఠం మధ్యలో

      సార్!! మన క్లాస్ లో ఒక వేమన ఉన్నాడు సార్!!’ అన్నాడెవడో!!  

         ఎవడురా వాడు??

      పిల్లలంతా అరిచారు, ఒరేయ్..ఎక్కడున్నావ్రా!!’ అని!!

  సిగ్గుపడుతూ ఒక అబ్బాయి లేచి నిలబడ్డాడు.

  పుట్టపర్తి అబ్బాయిని దగ్గరికి రమ్మని పిలిచారు.

  ‘నీ పేరేమిటి రా?’

  ‘పిచ్చయ్య సార్!!’

  ‘మరి వీళ్ళెందుకు నిన్ను వేమన అంటున్నారు?

  ‘మా అబ్బకు వేమన పద్యాలంటే ఇష్టం సార్!! చిన్నప్పటినుంచీ బాగా చెప్పించినారు. ఎప్పుడూ ఏదో ఒక వేమన పద్యం చెప్పుకుంటూ ఉంటానని వీళ్ళందరూ నాకు ‘ వేమన’  అని పేరు పెట్టేసినారు సార్!!

      ఏదీ, నీకొచ్చిన పద్యం ఒకటి చెప్పురా!!

  ‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు

   చూడ చూడ రుచుల జాడ వేరు,

   పురుషులందు పుణ్య పురుషులు వేరయా,

   విశ్వదాభిరామ వినుర  …’

అని సిగ్గుగా ఆగిపోయాడు పిచ్చయ్య అనే అబ్బాయి.

         ‘ఎందుకురా ఆగిపోయినావు? తరువాత?’

       ‘సార్..నేనాపేరు చెప్పిన వెంటనే వీళ్ళుఇసుకలో తేమాఅని ఎగతాళి చేస్తారు సార్!!’అని సిగ్గుపడిపోయాడు.

          ‘ఎవర్రా వీణ్ణి ఇలా ఏడిపించేది?’

    అంతవరకూ హుషారుగా మాటలు చెప్పిన పుట్టపర్తి గొంతులో కోపం చూసి పిల్లలందరూ  కిక్కురుమనకుండా ఉండిపోయారు.

    ‘ఇంకమీదట యీ పిల్లవాణ్ణి ఎగతాళి ఎవరైనా చేస్తే నేనూరుకోను. తెలిసిందా?? మీలో ఎవరికైనా తెలుసురా వేమన అంటే ఎవరో?? ఎన్నెన్ని మంచి విషయాలను , చిన్న చిన్న పద్యాల్లో కొండంత అర్థం  వేమన  ఇమిడ్చి చెప్పాడోసమాజంలో ఉన్న చెడు గురించి చిన్న పద్యాల్లోనే వాతలు పెట్టే విధంగా చెప్పి మార్చేందుకు ప్రయత్నించిన కవిరా!! కేవలం కవే కాదు. ఇంకా ఆయన జీవితంలో విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. అసలు, మీకు తెలిసిన తెలుగు కవుల పేర్లు చెప్పండిరా?’ అడిగారు పుట్టపర్తి.

            క్లాసంతా పిన్ డ్రాప్ సైలెన్స్!!

           కాసేపటికి   ఒక అబ్బాయి లేచి చెప్పాడు.’ నన్నయ, తిక్కన. ఎర్రన. ఇంకా..’

            మరి    కాసేపటికి  రెండోవాడు లేచాడు,’ పెద్దన, గురజాడ, కృష్ణదేవరాయలు.’

    గురజాడ తరువాతైనా కృష్ణదేవరాయలు వాడికి గుర్తుకు వచ్చినందుకు  సంతోషించారు పుట్టపర్తి.

    తరువాత ఎవరూ లేచే సాహసం చేయలేదు.

   పుట్టపర్తి అన్నారు.’ ఒరేయ్, మన తెలుగు కవుల్లో పది మంది కవుల పేర్లే తెలియవు మీకు!! వీణ్ణి ఎగతాళి చేస్తార్రా మీరు?? ఒరేయ్.. ఎవరైనా పోయి వాట్కిన్స్ ని పిల్చుకుని రాపోండి.’ అన్నారు పుట్టపర్తి.

       తెలుగు కవులకూ, డ్రాయింగ్  సార్ వాట్కిన్స్ కూ ఎమి సంబంధమో అర్థం కాలేదు వాళ్ళెవరికీ?? ఆయనేమైనా తెలుగు కవులగురించి పాఠం చెబుతాడా ఇప్పుడు??’ 

  ఒక కుర్రవాడు లేచి తుర్రున వెళ్ళాడు వాట్కిన్స్ సర్ కోసం!!

  వాళ్ళకేమి తెలుసు, ఒక గొప్ప నూతనాధ్యాయానికి యీ క్షణం నాందీ కాబోతున్నదని!!

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.