అంతు తెలియని కథ

-అక్షర

ముందు మాట

          “అంతుతెలియని కథ” లోని విచిత్రమైన దుఃఖ దుస్సంఘటన నాకు బాగా కావల్సిన వారి కుటుంబంలో దాదాపు పది ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన సంఘటన. మనకి నమ్మశక్యం కాకపోయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని పాఠకులకి తెలియ చేయటానికి  ఆ సంఘటనని ఆధారంగా  చేసుకుని, కొంత ఊహించి రాసిన కథ.

ఇక అసలు కథకు వద్దాము…

***

అంతు తెలియని కథ

          ‘మౌంట్ అబు’ ప్రకృతి సిద్ధంగా తీర్చి దిద్దినట్టుండే సుందరమైన ప్రదేశం.

          నలభై ఏళ్ల తరవాత వెళ్లాము మళ్లీ. మౌంట్ఆబు కొండపై ఉన్న చిన్న నగరం అని చెప్పవచ్చు. నలభై ఏళ్ల క్రితం చూసినప్పుడు ఆ ప్రదేశం చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా కనిపించింది. ప్రకృతి రచించిన ఆ ప్రదేశంలో మానవ-నిర్మిత  దిల్వారా మందిరాల్ని ఎంత చూసినా తనివి తీరని శిల్పాకృతులు, పైకప్పు పై అందంగా చెక్కబడిన ఆకృతులు, పాలరాతి పై చెక్కబడిన వర్ణనాతీతమైన కళాకృతుల సౌందర్యం మాటలకు అందనివి.

          అసలు కొన్ని వందల ఏళ్ల క్రితం ఆధునిక సౌకర్యాలు ఏవీ లేని రోజుల్లో పెద్ద-పెద్ద పాల రాళ్లు అంత ఎత్తు కొండ పైకి ఎలా తరల్చి ఉంటారో మన ఊహాకి కూడా అందని విషయం. మళ్లీ ఆ ప్రాకృతిక సౌందర్యాన్ని కళ్లారా ఆస్వాదించాలన్న తపన, ఆతృత నన్ను మౌంట్ ఆబు కి లాక్కెళ్లింది. ప్రకృతిలో కాలుష్యం పాళ్లు ఎక్కువ అవటం వల్ల అక్కడ కళాకృతులు కూడా ఏమైనా నష్ట పోయాయా? లేక అలాగే శోభలు విరజిల్లు తున్నాయా? అనుకుంటూ నా మిగతా స్నేహ బృందంతో కలసి కొండ పైన నడుస్తున్నా. బ్రహ్మకుమారాశ్రమం దాటుకుని నడుస్తున్న నాకు దాహం వేసి నలుపక్కల చూస్తే ‘తాగే నీరు’అని గుజరాతీలో, హిందీలో రాసి ఉండటం కనిపించింది. అక్కడ మట్టి కుండలో నీరు యాత్రికుల కోసం ఉంచారు. పక్కన ఒక హుండీ లాంటిది కూడా పెట్టారు. తోచిన డబ్బులు అందులో వేయమని. నేను అటు వెళ్లి కుండపైన ఉన్న మూత తొలగించేంతలో తెల్లటి గెడ్డం, తెల్లటి దుస్తుల్లో ఒకాయన నా కన్నా ముందే కుండ పై మూత అందుకున్నారు. నేను అనాలోచితంగా ఆయన వేపు చూసాను. గడ్డం మధ్య దాగి ఉన్న ఆయన ముఖం సుపరిచితంగా అనిపించింది. ఆయన నీరు తాగేంత వరకు వేచి ఉన్న నేను ఇంకా పరీక్షగా చూశాను. ఆయన ముఖం పై భావం తటస్థంగానే ఉన్నా, నేను పరీక్షగా తన వేపే చూడటం వల్లనేమో కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేను కూడా నీళ్లు తాగి, వేచి ఉన్న నా స్నేహ బృందాన్ని కలిసాను.

          యాత్రికులు గుంపు గుంపులుగా దిల్వారా టెంపుల్స్ వైపు వెళుతున్నారు. మునపటి కంటే జన సందోహం చాలానే పెరిగింది. ఒకొక్క మందిరంలో సౌందర్యాలు విరజిమ్ముతున్న పాలరాతుల పై కళాకృతుల్ని కళ్లలో నింపుకుని ఇహ-పరం మర్చి పోయాము మేమంతా.

          సాయంత్రం అలిసిపోయి మా రూమ్స్ కి వచ్చి పెందరాళే రాత్రి భోజనాలు ముగించుకుని అలసట తీర్చుకోవటానికి మంచం పై చేరి కళ్లు మూసుకోంగానే మంచినీటి కుండ దగ్గర చూసిన మనిషి ముఖం నా ముందుకు వచ్చింది. ఎవరో మనిషిని పోలిన మనిషి అని సరిపెట్టు కుందామనుకున్నా, ఆ ముఖం నన్ను వెంటాడుతూనే ఉంది. అంత అలిసి పోయి ఉన్నా నిద్ర పోయింది నా కళ్లకు. మంచం పై అటు ఇటు దొర్లాక, గత స్మృతుల మధ్య ఒక మెరుపు మెరిసింది. ఆయన చలపతి రావు గారా!!

***

          మనిషి గుర్తుకు రాంగానే, అయిదేళ్ల క్రితం ఆ విచిత్ర, దుఃఖ దుస్సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. మా వంటగది కిటికీ నుంచి పొరుగిల్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం పదకొండు గంటల వేళ. వంట చేసుకుంటున్న నాకు ఒక్కసారిగా చలపతిరావుగారింటి నుంచి పెద్ద సంచలనం. పోలీసు అధికార్లు ఇద్దరు కనిపించారు. వెనువెంటనే కమలమ్మగారి సన్నటి ఏడుపు గొంతు వినిపించింది అస్పష్టంగా. ఏమై ఉంటుందా’ అనుకుంటూ, మా అమ్మాయిని తలుపు వేసుకోమని చెప్పి పొరుగింటి వైపు నడిచాను.

          ‘మొన్నే కదా కలిసాను, వారి రెండో కూతురు సరళని. చాలా సరదా పడుతూ చెప్పింది నాతో, 

          ‘ఆంటీ, రేపు నా పుట్టిన రోజు. మా నాన్న కి నేనంటే చాలా ఇష్టం .అందుకని ఎక్కడ ఉన్నా సరే నాన్న నా పుట్టిన రోజుకి తప్పనిసరిగా ఇంటికి వచ్చేస్తారు.’ సంబర పడిపోతూ చెప్పింది సరళ. మరి చలపతిరావుగారు రాలేదా తిరిగి? వెంటనే కీడు శంకించింది మనసు. నన్ను చూడంగానే సరళ వచ్చి పరుగున నన్ను వాటేసుకుని భోరుమని ఏడుస్తూ చెప్పింది-‘చూడండి ఆంటీ ! పోలీసులు వచ్చి ఏదో చెప్పారు. అమ్మ ఏమో ఏం చెప్పకుండా ఏడుస్తున్నది.” అక్కడే బిక్కమొహం పెట్టి నిల్చున్న సరళ అన్న ప్రదీప్ ని అడిగాను. అతను చెప్పాడు, “అవును ఆంటీ. అదిగో ఆ పోలీసులు ఎవరివో అస్థికలు తెచ్చి నాన్నవి అంటున్నారు. అప్పుడు చూశాను-వారిలో ఒకరి చేతిలో చిన్నకుండ ఎర్ర బట్టలో చుట్టి ఉంది. విస్తు పోయాను నేను. కమలమ్మ ఏమీ మాట్లాడే స్థితిలో లేరు. ఆ పోలీసు చేతిలోంచి ఎవరు ఆ అస్థికల పాత్ర అందుకోవటం లేదు. విషయం చెప్పమని అడిగాను. అక్కడ నేను తప్పితే పెద్దవారు ఇంకెవరూ లేరు. “అవును మేడమ్, చలపతిరావుగారు తన ఫార్మసీ వ్యాపార రీత్యా గుంటూరులో ఉన్నప్పుడు మొన్న రాత్రిహార్ట్-అటాక్ తో మరణించారు. పోలీసు అధికారులు,ఆయన స్నేహితులు దగ్గర ఉండి అంతిమక్రియలు  చేసి ఈ అస్థికలు మీకు ఇచ్చి రమ్మని పంపించారు.” నాకు ఏం మాట్లాడటానికి తోచలేదు. మా వారు కూడా ఆఫీస్ లో ఉన్నారు.ఇంతలోకి మరో పొరుగింటి ఆయన కూడా వచ్చి గట్టిగా అడిగారు,“ఆదేమిటయ్యా, ఎంత హార్ట్-అటాక్ వచ్చి మరణిస్తే మాత్రం వారి ఇంట్లో వారికి కబురు చేయకుండా అంత్యక్రియలు ఎలాచేశారు? ఇలా ఉన్నట్టు ఉండి అస్థికలు పట్టుకు వచ్చి ఇస్తే ఎలా నమ్ముతాము.” అని. “మాకు మాత్రం ఏం తెలుసు బాబు, మా పై అధికారి ఏం చెప్తే అది చేస్తున్నాము. మీరు దయ చేసి మా పైఅధికారి ఇచ్చిన ఈ లెటర్ చదివి ఇక్కడ సంతకం పెట్టి ఈ అస్థికలు తీసుకుని మమ్మల్ని పంపించండి. మా విధి మేము నిర్వహిస్తున్నాము.” అన్నాడా పోలీస్. ఈ లోపున వైజాగ్ లోనే ఉంటున్న సరళ అక్కా- బావా వచ్చారు. చలపతిరావు గారి తరువాత ఆ ఇంటి అల్లుడే పెద్ద మగదిక్కు. సరళ  బావగారు ఇంక చేసేది లేక అస్థికల పాత్ర అందుకుని, చెప్పిన చోటు సంతకం పెట్టారు. “మీ  సందేహాలు తీర్చుకోవాలన్నా, ఇంక ఏ వివరాలు తెలుసుకోవాలన్నా మా పైఅధికారి ఫోను నంబర్ ఇస్తున్నాము. వారితో మాట్లాడండి.” చెప్పి మాకు ఓ సలాము కొట్టి వారి దారిన వారు వెళ్లిపోయారు ఆ పోలీసులు. కబురు తెలిసి కమలమ్మ, చలపతిరావుగారి వైపు బంధువులు,స్నేహితులు ఒకొక్కళ్లు రావటం మొదలెట్టారు. అందరూ ఒకటే మాట“సెల్ ఫోన్స్ సౌకర్యం ఉన్న ఈ రోజుల్లో వ్యక్తి మరణిస్తే వారి ఇంట్లో వారికి కబురు చేయకుండా వారి అంత్యక్రియలు ఎలా జరిపించారు?”అని. ఆ రాత్రికే సరళ అన్న , బావగారు బయల్దేరి గుంటూరు వెళ్లారు, అసలు విషయం తెలుసుకుందామని. ఇటు కమలమ్మని అనునయించటం మా తరం కావటం లేదు. పొరుగింటివారిగా మా విధి మేము నిర్వహిస్తున్నా, మేమెవరం కూడా జరిగింది నమ్మలేక పోతున్నాము. విన్నకబురు అసలు నమ్మశక్యంగా లేదు. హృదయ సంబంధ రోగంతో బాధపడుతున్న వారు ఆకస్మికంగా మృతి చెందటం సహజమే, కానీ వారి మృతదేహానికి కుటుంబం అనుమతి లేకుండా అంతిమ క్రియలుచేసి ఏకంగా వారి అస్థికలు కుటుంబానికి పంపటం మాత్రం ఎవరం స్వీకరించలేక పోతున్నాము. ఏదో జరగకూడనిది జరిగిందని అనిపిస్తున్నది. మాకంతా చాలా అయోమయంగా ఉంది. చలపతిరావుగారి కుటుంబీకుల సంగతి వేరే చెప్పాలా ??సరళ బావగారూ, ప్రదీప్ గుంటూరు బయల్దేరి వెళ్లారు. అసలు సంగతి తెలుసుకుని వద్దామని. వాళ్ళు రెండు రోజుల్లో తిరిగి వచ్చారు.

          ప్రదీప్ వాళ్ళు  తిరిగి వచ్చారని తెలియంగానే నేనూ మా వారూ కలిసి వెళ్లాము.“మావగారు ఫోనులో నంబర్స్ సేవ్ చేసుకోవటం అలవాటు లేదు. అన్నినంబర్స్ చిన్న డైరీలో పదిల పర్చుకున్నారు. మావగారు రాత్రి నిద్రలో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. ఏమంటే మరునాడు ఉదయం స్నేహితులు, ఆయన దగ్గర్నుంచి ఏ కబురు లేకపోతే రూమ్ కి వచ్చి పిలిస్తే పలకలేదుట. తలుపు బద్దల కొట్టి లోపల్కి వెళ్తే ఆయన అప్పటికె మృతి చెంది ఉన్నారు. మేము ఆ స్నేహితుల్ని కలిసాము. వారు చెప్పిన వృత్తాంతమిది. వెంటనే కాల్ చేసి కబురు చెపుదామని ఆయన సెల్ ఫోన్, డైరీ కోసం వెతికితే, దొరకలేదుట. దేహాన్ని అలా ఉంచకూడదని, ఆ స్నేహితులే దగ్గర ఉండి అంతిమ-క్రియ చేశారు. తరవాత కాల్ లిస్ట్ లో వెతకగా వెతకగా మన ఎడ్రస్ దొరికి అస్థికలు పంపించారుట.”ఏమో, మాకు మాత్రం ఈ వృత్తాంతం చాలా అసహజంగా అనిపిస్తున్నది. అదేమిటి బాబు, కాల్ లిస్ట్ వెతికి అస్థికలు పంపిన వారు ఆయన మృత దేహం దొరికినప్పుడు ఇంట్లో వారికి ఎందుకు కబురు చేయలేక పోయారు? ఇందులో  చాలా పెద్ద లొసుగే ఉన్నట్టుంది.“మన వేపు నుంచి పోలీస్ రిపోర్ట్ చేసి తణిఖి చేయిస్తే మంచిది కదా.” అన్నారు మావారు.“ అదే మా అత్తగారి తో మాట్లాడాలి.” అన్నాడు సరళ బావగారు రాఘవేంద్ర.

          రెండు రోజులు పోయాక రాఘవేంద్ర కనిపిస్తే ,అడిగాను “ ఏ నిర్ణయానికి వచ్చారని”.“ పోలీస్ తణిఖి కి మా అత్తగారు ఒప్పుకోవటం లేదండి.” ఏం లాభం బాబు. పోయినవారు ఏమైనా తిరిగి వస్తారా? పోలీస్ కేసు వల్ల, అందరి పై అనుమానం. తీగ లాగితే డొంక అంతా కదిలిందన్నట్టు ఉన్నవారి మధ్య కూడా కలహాలు చెలరేగుతాయి. ఏం ప్రయోజనం ? అన్నారు. కొంత వరకు నాకు కూడా ఆమె చెప్పింది సబబు గా అనిపించి, ఇక ముందు జరగవలసింది చేస్తున్నాము.” అన్నాడు. కమలమ్మ ఈ విషయాన్ని అంతా తేలికగా ఎలా తీసుకోగలుగుతుందో మాకు అర్థం కాలేదు. నాకు కమలమ్మ పై కూడా అనుమానం వచ్చింది.

          అంతే. ఆ తరవాత యథాప్రకారంగా జరగాల్సినవన్నీ జరిగి పోయాయి. చలపతిరావుగారి కుటుంబీకులు మెల్లగా మామూలు దినచర్యలో పడిపోయారు. ఇవాళ ఇన్నేళ్ల తరవాత ఆ మనిషి ని చూసి అంతా సినిమా రీలులా కళ్ల ముందు తిరిగింది.

          రేపు మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లి చూడాలి ఆయన కనిపిస్తారేమో అని ఒక నిశ్చయానికి వచ్చాక నిద్ర పోవటానికి ప్రయత్నించాను. తెల్లవారిన దగ్గర నుంచి నాకు ఒకటే ధ్యాస. నిజానికి ఆ రోజే మధ్యాహ్నం మా తిరుగు ప్రయాణం. అయినా ఒక ప్రయత్నం చేయాలనిపించింది. మా బృందానికి ఒక గంటలో వస్తానని చెప్పి నా సందేహం తీర్చుకోవటానికి మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లాను. ఆ చుట్టు ప్రక్కల ఎంత వెతికినా మళ్లీ అతని ఆచూకీ దొరకలేదు. ఆయన్ని తెల్లటి దుస్తుల్లో చూశాను. ఒకవేళ బ్రహ్మకుమారీల ఆశ్రమంలో ఉంటున్నారేమో. ఆశ్రమం లోపల్కి అందరికీ ప్రవేశం లేదు. చేసేదిలేక ఇంకాసేపు అక్కడ వెతికి తిరిగి వెళ్లటానికి తయారు అయ్యాను. మనసంతా మాత్రం అవే ఆలోచన్లతో నిండి ఉంది. ఇంట్లో వారికి తెలిస్తే ‘ఒప్పుకోరని ఇలా తను హార్ట-ఎటాక్ తో పోయినట్టు నాటకం ఆడారా చలపతిరావుగారూ ఆయన మిత్ర-బృందం కలసి?హృద్రోగంతో ఉన్న మనిషి హఠాత్తుగా పోయారంటే ఎవరైనా నమ్మేస్తారు అని తెలిసి, బ్రహ్మకుమారాశ్రమంలో చేరటానికి ఇంత నాటకం ఆడారా? ఐనా అదెలా సాధ్యం ? అసలు మౌంట్ ఆబూ ఇంక బ్రహ్మకుమారీల జ్ఞాన-యోగ ఆశ్రమం గురించి చలపతి రావుగారే మాకు చెప్పారు. ఏనాటి నుంచో ఆ ఆశ్రమంలో ఉన్న కార్యకర్తలు నిర్వాహకులు తప్పితే ఇంకెవరికి ఆశ్రమంలో ప్రవేశం లేదు .  కొన్ని ఏళ్ళగా బ్రహ్మకుమారి గా సంస్థకు పరిచయము అయితేనే కాని  ఆశ్రమంలోకి ప్రవేశం లేదు. ఐనా పెళ్లి కావల్సిన పిల్ల, చదువు పూర్తి కావల్సిన కొడుకు ఉండగా, బాధ్యతలు తీరకుండా చలపతిరావుగారిని ఆశ్రమంలో ఎలా చేర్చుకుంటారు? అసలు ఆశ్రమంలో లైఫ్ మెంబర్గా చేరే ప్రసక్తే లేదు . నిత్యం ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ వాటిలో పాల్గొని చూసి విని ఆనందించి వచ్చేయాలి కాని అక్కడ ఉండి పోవటానికి ఆస్కారమే లేదు. మరి ఏమై ఉంటుంది!!

మనసొప్పక ఇంకాసేపు ఆ ప్రాంతంలోనే ఆయన కోసం వెతికి, ఇదంతా నా భ్రమ కాదుకదా…,మనిషిని పోలిన మనిషి ఉండవచ్చు కదా. నేనే విపరీతంగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూ తిరిగి రూంకి వచ్చేశాను. ఆశ్రమంలో చేరలేక అక్కడే మౌంట్ ఆబు లో స్థిర పడిపోయారేమో, సంసారం అంటే విరక్తి చెంది!!‘వైజాగ్ వెళ్ళాక ఈ విషయం కమలమ్మకి చెప్పటమా మానటమా!! అయినా ఏ ఆధారం లేకుండా ఏమని చెప్పటం?’ కాలం కప్పిన సంఘటనని కదిలించి ఆ కుటుంబానికి లేని ఆశ పెట్టిన దాన్ని అవుతానేమో!!’ ఇలా విభిన్న వ్యతిరేక ఆలోచనలు తలెత్తేసరికి ఆ గడ్డం మనిషిని మర్చిపోవటమే మంచిదనిపించింది. ఇంత కాలం మర్చిపోయిందాన్నే. వ్యాపారంలో చలపతిరావుగారంటే గిట్టని వాళ్ళు చేసిన పనేమో అని కూడా మాకందరికి అనుమానం వచ్చింది. ఇంక ఒక్కటే వికల్పం మిగిలింది అది పర స్త్రీ సంబంధం . మాకేవరికి ఆయన స్వవిషయాలు తెలియక పోయినా వారి కుటుంబీకులు  చలపతిరావుగారి మరణాన్ని  ఎలాంటి తనిఖీ చేయకుండా విషయాన్ని కప్పి పుచ్చటం చూస్తే ఈ కోణమే సరైందిగా అనిపించిది. 

          ఆ పర స్త్రీ తాలూకు వాళ్ళు చలపతిరావుగారిని తమ గిరఫ్టులో  ఉంచుకుని , పోలీసు అధికార్లుకు లంచం ఇచ్చి తమ వేపు కలుపుకుని ఇంత నాటకం ఆడి  ఉంటారా!!!  ఆ పని చేసిన వారు ఎవరైనా కానీ, వారికి చలపతిరావుగారి ఆస్తి పై కన్ను లేదని తెలుస్తోంది. అదే నిజమైతే ఈ పాటికి అసలు విషయం బయట పడి  పోయేది. మనిషి శవాన్ని చూపకుండా చలపతిరావుగారి కుటుంబీకులకి ఆయన మరణ ధృవీకరణ పత్రం ఎలా దొరికింది? దాని అవసరం లేకుండానే ఆయన పేరు మీద ఉన్న అనేక పత్రాలు ఆస్తి వివరాలు వారి కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చాయి? కుటుంబం పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మన సమాజం,లంచగొండితనానికి అలవాటు పడ్డ మన రాజ్యాధికార్లు ఉన్నంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అనేది మాత్రం ఖాయం.

          గత ఇన్నేళ్ళుగా నా మనస్సులో  మరుగున పడిన ఆ సంఘటన ఆ గడ్డపు మనిషిని చూసి మళ్ళీ బయటకు వచ్చి నా మనస్సుని అల్లకల్లోలం చేసింది. మనసును ఆక్రమించిన అన్ని రకాల అనుమానాలను పక్కకు నెట్టి, మౌంట్-ఆబు ప్రకృతి సౌందర్యాన్ని, దిల్వారాటెంపుల్స్ కళాకృతుల్నిమరీమరీ గుర్తు చేసుకుంటూ తిరుగు ప్రయాణానికి మా స్నేహితులుతో కలసి తయారయ్యాను. వైజాగ్ తిరిగి వచ్చి ఇంటి ముందు ఆటో దిగంగానే అనాలోచితంగా చలపతిరావుగారి ఇంటివేపు చూశాను. అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. ప్రదీప్ తండ్రికి తిలోదకాలు వదులుతున్నాడు.

*****

Please follow and like us:

4 thoughts on “ఏది నిజం (కథ)”

  1. మంచి రచనా శైలి ఉన్న రచయిత్రి! ఆఖరి వరకూ చదివేలా, ఉత్కంఠ భరితంగా సాగిన కధ !

  2. Strange course of events presented interestingly. The dilemma of narrator of the story depicted very well .
    Good flow in writing. Congratulations to akshra.

Leave a Reply

Your email address will not be published.