పాఠం

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

– పి.రాజేంద్రప్రసాద్

          పెరట్లో ఓ వారగా పనమ్మాయి రత్తాలు అంట్లు తోముతోంది. ఆ రోజు ఆదివారం….మా పిల్లలకెవరికీ ఆఫీసుల హడావుడి లేదేమో ఉదయం తొమ్మిదయినా ఎవరూ పక్కల మీంచి లేవలేదు. వంటలూ, బాక్సులూ అంటూ రంధి లేదు.  పోనీలే వారానికో రోజు అని నేనూ లేపలేదు.  పెరట్లోనే ఇంకో పక్కగా పాతచీర మీద ఎండబెట్టి ఉంచిన మిరప కాయల ముచ్చికలు తీద్దామని కూర్చున్నాను. ఇది గమనించినట్టుంది రత్తాలు.

          “అమ్మగారూ! చిన్నాపెద్దా పనులన్నీ మీరే సేసేసుకుంటే మేం బతికేదెట్టామ్మా! కారమేమో దంపనియ్యరు, మిల్లులో ఆడించుకుంటారు. ఇంక ముచ్చికలు కూడా మీరే వొలుచుకుంటే ఎట్టామ్మా!” అంటూ దీర్ఘంతీసింది.

        “సర్లేవే! ఎట్టాగూ మా దగ్గర రోలూ రోకలీ ఉండనే ఉన్నాయిగా, నువ్వే ముచ్చికలు తీసి దంచుదువు గానిలే. ఎంతిమ్మంటావు కిలోకి? “అన్నాను.

          “మీకైతే డెబ్భయ్యమ్మా!” ఠక్కున అంది. నా గుండె గుభేలుమంది.

          “అదేమిటే! మిల్లులో అయితే ముప్ఫయ్యో ముప్ఫయయిదో తీసుకొని అరగంటలో ఇచ్చేస్తాడు. నువ్వేమో డబల్  రేటు చెప్తున్నావు.” అన్నాను ఒళ్ళుమండి.

          “అమ్మా! మీకు తెలీందేముంది. మిల్లులో సగానికి సగం ఏరే కల్తీ కలిసిపోద్ది. పైగా ముచ్చికలు మనమే తీసుకోవాల. తీసుకోకపోతే ఆడు మొత్తం అలాగే ఆడేస్తాడు. అయినా ఈ రేటు మీకేనమ్మా. ఎదురింటోళ్ల కాడైతే ఏభైయే తీసుకుంటా.” గతుక్కుమన్నాను..

          “అదేంటే! వాళ్లకో రేటు..నాకో రేటు ఎందుకలాగా?” ఆశ్చర్యపోతూ అడిగాను.

          “ఆ….! గవర్నమెంటేమో కరంటుకి మీదగ్గరో రేటు, షాపులోళ్లకో రేటు తీసుకోడం లేదామ్మా! స్కూలు ఫీజులు కూడా మీకో రేటు, మాకో రేటు.  దేవుడి దగ్గిర మీరు డబ్బులిచ్చి గర్భగుళ్ళోకెళతారు, మావు బయట నుంచి ఫ్రీ దర్శనం చేసుకుంటాం. ఎక్కడైనా ఇంతేనమ్మా! మీ ఇంట్లో మీరు , అయ్యగారు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు అందరూ ఉజ్జోగాలు సేస్తా సంపాదిత్తా ఉండారు. ఎదురింటాయన ఆళ్ళింట్లో ఒక్కడే సంపాదించాల. ముగ్గురు చదువుకునే పిల్లలు. నేను కూడా ఆళ్ల దగ్గర గట్టిగా అడిగినా ఆళ్లివ్వలేరమ్మా! మొత్తానికి నాకు సెప్పడం మానేసి ఆల్లే సేసుకుంటారు. ఒకపాలి సేసేసుకుంటే ఆల్లే దంపుకోడం అలవాటయి పోయి మర్నాకు సెప్పరు. అప్పుడు నస్టం ఎవరికి? నాకే కదమ్మా!”

          దాని ఉపన్యాసానికి మతి పోయింది. ఇది ముందు నుంచీ కరోడాయే. దీనితో పడలేంరా బాబూ అనుకుంటూ  మాట మార్చాను. “సరేలే! నువ్వన్నట్టే ఇస్తానుగానీ ఎలా ఉంది నీ సంసారం? ఏవంటున్నాడు మీ ఆయన గారు? ” అంటూ.

          రత్తాలు నిట్టూర్చింది. “ఏవంటాడమ్మా! మనిషి మంచోడేగాని మాయదారి రోగం వచ్చింది గందా! దానికి వొయిద్యమే లేదంతాన్రు. నా నేటి చేతును! ఆ బాద బరించనేక తాగుతాడు. తాగితే నన్నూ పిల్లనీ తంతాడు. తన్నినా  సంపినా ఆడే కదమ్మా నా దిక్కూ మొక్కూనూ ! ఆడ్నికాదని నేనెక్కడికి పోయేను?” గతుక్కుమన్నాను. దానిది విజన్ అనాలా, మూర్ఖత్వం అనాలా అని ఆలోచిస్తే దేనికదే రైటు అనిపించేలా ఉన్నాయి.

          దాని మొగుడికి కాన్సరు. అందువల్లే బాధ భరించలేక తాగుతాడు. తాగితే తంతాడు. తంతున్నాడు కాబట్టి వాడితో విడిపోయి వాడు చస్తూంటే వదిలెయ్యాలా! ఎంతైనా కట్టుకుని సంసారం చేసిన మనిషి కాబట్టి వాణ్ణి భరిస్తూ వైద్యం చేయించాలా! ఏమో ….. చిక్కు ప్రశ్నే. ఇది మనకర్థం కాదేమోలే అని వదిలి పెట్టేసి నా పనిలో నేను పడ్డాను.

***

          పాత ఎన్టీఆర్ గారి ‘దేవత’ సినిమాలో ఓ పాట ఉంది. ‘ఆనందనౌక పయనించు వేళా శోకాల సంద్రాన ముంచేవులే’ అంటాడు కవి. చల్లగా సాగిపోతున్న మా కుటుంబ వాతావరణంలో ఉన్నట్టుండి పెనుతుఫాను చెలరేగింది. మా భార్యాభర్తా ఇద్దరితో బాటు ఇద్దరు అబ్బాయిలూ, కోడళ్ళూ కూడా సాఫ్టువేరు ఇంజనీర్లుగా పనిచేస్తూ  ఉండటం  వల్ల మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. నేను డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాలుగా రిటైరయ్యాను. మా వారూ ఇరిగేషన్ డిపార్టుమెంటు లో  చీఫ్ ఇంజనీరుగా రిటైరయ్యారు.  ఆర్థికంగానూ, కుటుంబపరంగానూ ఏమీ సమస్యలు లేకుండా హాయిగా సాగుతున్న సంసారం మాది. మా ఇద్దరి అబ్బాయిల తరవాతిది మా శాంతి. అది ఎం. ఎస్. చదివి డాక్టరయ్యింది. తనూ ఎం.ఎస్. చదివిన అమెరికా అల్లుడ్ని తీసుకొచ్చాం. వాళ్లకి పెళ్ళయ్యి రెండేళ్లయ్యిందేమో. వాళ్లిద్దరూ అమెరికా లో ఉంటారు. రెండు రోజులకో సారి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటారు. సరదాగా చిన్న కుక్కపిల్లను కూడా  పెంచుకుంటున్నారు. నిమ్మీ దాని పేరు. రెండు రోజులకో సారి జరిగే వీడియో కాల్  కార్యక్రమంలో అది కూడా పాలు పంచుకొంటుంది. అది అమెరికాలోనూ మేం ఇండియాలోనూ ఉన్నా నిమ్మీకి వాళ్లిద్దరూ అమ్మా, నాన్నలైతే నేను అమ్మమ్మనీ, ఆయన తాతగారూనూ. అదేంటో శాంతి ఎంత వివరించి చెప్పినా ఆ కుక్కపిల్ల తోకాడించడం వరకూ సరేగాని మామీద  పెద్దగా ప్రేమ చూపించినట్టు నాకెప్పుడూ అనిపించలేదు.

          ఒక రోజు సాయంకాలం పూట వాకింగ్ కని వెళ్లిన మా అల్లుడు జాత్యహంకారుల దురహంకారానికి బలైపోయాడు. మా దుఃఖానికి హద్దులు లేక పోయాయి. హుటాహుటిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసరికి అదీ, నిమ్మీ శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. దానికి ఏమని చెప్పి ఎలా ఓదార్చామో భగవంతుడికీ మాకే తెలుసు. రెండు నెలల కృషి అనంతరం ఎలాగైతే అక్కడి వ్యవహారాలన్నీ సెటిల్ చేసి శాంతిని ఇండియా తీసుకొని రాగలిగాము. కుక్కపిల్ల నిమ్మీని తీసుకురావడానికి రెండు ప్రభుత్వాలూ ఒప్పుకోలేదు. అది లేకపోతే శాంతికి పిచ్చెక్కి పోయేలా ఉందని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసి హై లెవెల్లో పర్మిషన్లు   సంపాదించి ఎన్నోలక్షలు డిపాజిట్ గానూ టాక్సులు గానూ కడితే అప్పుడు ఆ కుక్కపిల్ల కూడా మా ఇంటికొచ్చింది.

          శాంతి ఇండియాకి వచ్చి దాదాపు నాలుగైదు నెలలైంది గానీ దాని పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. వాళ్ళ అత్తగారి వైపు వాళ్ళు,  వాళ్ళ అబ్బాయి దురదృష్టానికి మా అమ్మాయే కారణమన్నట్టు అసలు మాట్లాడటమే మానేసి సంబంధాలే లేకుండా చేసుకున్నారు. వాళ్ళ బాధను నేనర్ధం చేసుకోగలను. ఒక్కగానొక్క కొడుకుపోతే ఆ కడుపు తీపీ, గుండెకోతా ఎలా ఉంటాయో నేనూహించగలను. శాంతికే అర్థమయ్యేటట్టు చెప్పలేక పోతున్నాను. భర్తకే కాక ఆతని చిన్ననాటి వస్తువులకూ ఫోటోలకూ కూడా దూరమైన నా తల్లిని ఎలా ఓదార్చాలి? ఈ ఆరు నెలల్లో నాకు ఏమీ పాలు పోలేదు. రోజులు భారంగా గడుస్తున్నాయి.

***

          వారానికోసారి మార్కెట్నుండి నేనే వెళ్లి కూరగాయలు తెచ్చుకునే అలవాటు. ఆయనా తోడు వస్తూ ఉండేవారు కానీ పిల్లలూ కోడళ్ళూ ఆఫీసుకెళ్లిపోతే శాంతి ఒక్కత్తే ఇంట్లో ఉండి పోతోందని ఈ మధ్య నన్నే వెళ్లి రమ్మంటున్నారు. ఆ రోజూ అలానే వెళ్ళాను.  మార్కెట్టుకు ఓ పక్కగా పార్కింగ్  ప్లేసు లో కారు పెట్టి  నెమ్మదిగా లోపలి కి వెళుతున్నాను. ఎందుకో తలెత్తి చూస్తే ఎదురుగా ఓ బైక్   మీద ఓ మగాడూ,  అతని వెనకాతల కూర్చుని రత్తాలూ, దాని కూతురూనూ. అతను బైక్ ఓ పక్కనే ఆపి పువ్వులు  కొని రత్తాలు చేతిలో పెడుతూ ఏదో అంటున్నాడు. దానికి ఇద్దరూ నవ్వుకుంటూ  తమ చుట్టూ ప్రపంచంలో మనుషులే లేనట్టుగా తుళ్ళుతున్నారు.  నేను ఆశ్చర్యపోయాను. అంతకంటే ముందు కోపం వచ్చింది. రోగిష్టి భర్తను వదిలేసి ఇది ఇలా తిరుగుతోందని. చిరాకు పడి తల తిప్పుకున్నాను. అంతలో అది నన్ను చూడనే చూసింది. నా కళ్ళల్లోని కోపాన్ని అది గమనించిన విషయం నాకు ఆ తరవాతి రోజే తెలిసింది.

***

          మరుసటి రోజు మధ్యాహ్నం పూట నేను హాల్లో కూచుని ఉన్నాను.  నా ఒళ్ళోని   కుక్కపిల్ల నిమ్మీ అటూ ఇటూ గెంతుతూ ఆడుకుంటూంది. శాంతి సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. ఆ సమయం లో వచ్చింది రత్తాలు.  దాన్ని చూడగానే ముఖం చిట్లించాను. చెప్పొద్దూ. చేసిన వెధవ పని చాలక తగుదునమ్మా అంటూ వచ్చిందిది అనుకునేసరికి ఇంకా ఒళ్ళు మండింది. ముభావంగా తల తిప్పుకున్నాను.

          “దండాలమ్మగోరూ! అంత కోపం సెయ్యకండి. నా నేమీ తప్పుడు పని సెయ్యలేదు.  అమ్మాయి గారొచ్చినారు గందా! అల్లుడుగారి ఇసయమూ తెలిసింది. మా తల్లికి రాకూడని కట్టమే వొచ్చిందమ్మా. ఓ పాలి సూసిపోదామని వొచ్చినానమ్మా! ఇంకేటీ కాదు.” అంది ఉపోద్ఘాతంగా ఎక్కడ  కూర్చుందామా  అని నలువైపులా  చూసుకుంటూ.

          “వచ్చావు..చూశావు కదా! అది బానే ఉందిలే! ఇక్కడ వేరే పనమ్మాయిని పెట్టుకున్నాం గానీ మరెళ్లు!” అన్నాను కటువుగా.

          “ఓలమ్మోలమ్మ! అంత సెయ్యకూడని పాపం నానేటి సేసినానమ్మా! ఓ పాలి నేను సెప్పేదీ ఇనండమ్మా! “ అంది కింద చతికిలబడుతూ. ఇంక తప్పదనుకొని అది చెప్పేదేదో వినడానికి మానసికంగా సిద్ధపడిపోయాను.

          “మా ఆయన సచ్చిపోనాడమ్మా!” తలవంచుకొని అంటూనే బొటబొటా కన్నీళ్లు కార్చింది రత్తాలు.  గతుక్కుమన్నాను. ఇది నేను ఊహించనిది. అంతలోనే కోపం వచ్చింది.

          “అయితే!…..నువ్విలాగ సిగ్గూఎగ్గూ వదిలేసి తిరుగుతావా!” కోపంగా అన్నాను. దెబ్బతిన్నట్టు చూసింది. ఒక్కసారి ఆ కళ్ళల్లోని దైన్యం నా మనసును సూటిగా తాకింది. అంతలోనే కళ్ళు తుడుచుకుని ముక్కు ఎగబీల్చి ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్టు అన్నది రత్తాలు.

          “అమ్మా! మీరు నా  తల్లి లాటోరు. నాకా మా యమ్మ నేదు. అంతా ఇనండి.  ఇన్నంక నాదే తప్పని మీరంటే సెప్పుచ్చుకు కొట్టినా పడతానమ్మా!” అంది స్థిరంగా. అప్పటికీ నా కోపం తగ్గలేదు.

          “నా ఒప్పుకోలుతో నీకేం పనే. నడిరోడ్డు మీదే నీకు ఎవరూ అక్కర్లేక పోయారు. సరేలే! ఏం చెప్తావో చెప్పు!” అన్నాను కొంత విసుగ్గానే. అదేమీ పట్టించుకోకుండానే మొదలు పెట్టింది రత్తాలు.

          “అమ్మా! సచ్చిపోయిన నా మావంటే నాకు పానవేనమ్మా! అలాగని సానా దినాలు ఏడుత్తానే కూసున్నాను. నాతో పాటు అన్నెమూ, పున్నెమూ, సావూ బతుకూ ఏంటో తెలీని పిల్ల ఉన్నాది కదమ్మా! నా తల్రాతని దాన్నెత్తిమింద ఎందుకు రాయాల్నమ్మా! అదేటి పాపం సేసినాది? దానికి తండ్రిని లేకుండా సేత్తే అది నా తప్పు కాదా!”

          “అందుకని..” అని నేనంటుండగానే కట్  చేసింది రత్తాలు.

          “అదొక్క ఇసయవే కాదమ్మా! నా చుట్టూ ఒక పెపంచికం ఉన్నాది. అందులో మడుసులున్నారు. ఆల్లు ఎవరైనా నన్ను సూసి ఎందుకు జాలిపడాల? ఎందుకు బాదపడాల? ఆళ్ల జాలీ, సానుబూతీ నాకేల? అందుకేనమ్మా నన్ను కోరి వొచ్చిండు వొరసకి మా బావ ఐతడంట. దారాల కంపెనీలో మెకానిక్ గా సేస్తాండు. నన్నూ నా పిల్లనీ మంచిగా సూసుకుంటనన్నడు. ఎదురుసెప్పనీకి అందులో నాకు తప్పు తోసనేదమ్మా! తలొంచుకొని మనువాడిన. ఇప్పుడు సుకంగనే ఉన్నా కదమ్మా సుకంగా ఉండ కూడదంటారా? ఏడస్తానే ఉండిపొమ్మంటారా? సెప్పండమ్మా!”

          ఒక్కసారిగా ఖంగుతిన్నాను. అయినా సందేహం తీరక అడిగాను. “మరి చచ్చి పోయిన మీ ఆయనంటే ప్రాణంగా ఉండేదానివి కదే! అతను గుర్తుకు రాడా! ఇతనితో సంతోషంగా ఎలా ఉంటున్నావు?”

          “అవునమ్మా! సచ్చిపోయిన మా ఆయన నాకు గుర్తొస్తాడు. కానీ ఈయనంటే కూడా నాకు పేవే. ఏమ్మా! మీ అమ్మాయి గారి కుక్కపిల్ల వాళ్ళ యజమాని సచ్చిపోయినా మీరంటే తెలీపోయినా పానంగా ఉంటంలేదా! ఒక కుక్కపాటి గేనం కూడా ఉండద్దామ్మా మనిసన్నాక!  అదీ నా లాంటి దిక్కులేని దాన్ని సివర కంటా సూడనీకి నాకు అమ్మా, బావూ కూడా నేరు. నాకూ నా పిల్లకీ కడదాకా కూడెతానన్నాడు ఈడు. సచ్చేదాకా సూసుకుంటానన్నాడు. ఈయనంటే నాకు పేవా, ఇసవాసం ఉండకూడదా!” అది అడిగిన ప్రశ్నకి అవాక్కయ్యాను. శాంతి ఏమంటుందో అని దాని వైపు చూశాను.  నాకు తనకళ్ళల్లో వ్యతిరేక భావమేమీ కనపడలేదు. ఇంతలో రత్తాలే అందుకుంది. శాంతి వైపు తిరిగి సూటిగా చూస్తూ అంది. ”ఇదిగో సిన్నమ్మగోరూ! జరిగిపోనాదంతా ఓ పీడకలను కోండి. ఇప్పుడో అప్పుడో, ఎప్పుడో ఒకప్పుడు మీ మనసు కుదటపరుసుకోండి. మీకు నచ్చినోన్ని, మీరంటే ఇష్టమైనోన్ని సూసుకొని మారు మనువు సేసుకోండి. మీరు సల్లగుండాల. మీరే పానంగా బతుకుతున్న పెద్దమ్మ గోరినీ, పెద్దయ్యగోరినీ అన్నయ్యల్నీ, వదినమ్మల్నీ సంతోస పెట్టాల. బతుకంటే   మూడంటే మూన్నాలు కాదు. ఒక్కల్ల తోనే పోయేదీ కాదమ్మా! సిన్నదాన్ని. నాకు తెలిసిందేదో సెప్పాను. కోపగించు కోకండమ్మా!” అంటూ ముగించింది.

          శాంతి కళ్ళల్లో నాకు లీలామాత్రంగా మెచ్చుకోలు కనిపించింది. మెచ్చుకోలును ఒప్పుకోలుగా మార్చడం ఎంతసేవు? రత్తాలు మాటలు విన్నాక నాకు ఆ విశ్వాసం కలిగింది.  హృదయం పొంగి పోతుండగా అన్నాను. ”ఒసే! రత్తాలూ! బంగారం లాంటి మాట చెప్పేవే! ఉండు ఇంట్లో ఫలహారముంది పట్టికెళుదువుగాని !” అన్నాను మనస్ఫూర్తిగా!

          “అలాగే అమ్మగోరూ! ఈ సారి కారం ఎట్టాగూ దంపుతాను గాని, పసుపూ కుంకం కూడా  దంపించనీకి సూడండమ్మా! పైసలు తీసుకోనే తీస్కోను. ఊకెనే దంపి పెడతా. గింతింత బువ్వెడితేసాలు. సరేనా అమ్మగారూ! ఇక వస్తా!” అంటూ బయలుదేరింది. అది వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాను. సూర్యుడు కుంగి చీకటి పడుతున్నా  భయం లేదంటూ  వెన్నెల వెలుగులు నింపడానికి చంద్రుడు ఉదయిస్తున్నాడు.                           

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.