నీ జీవితం నీ చేతిలో…

– విజయ గొల్లపూడి

“ఆశా! నీకు పెద్దవాళ్ళు ఏ ముహుర్తంలో ఈ పేరు పెట్టారో తెలియదు గానీ  నీకు పేరుకు మించి అత్యాశ ఎక్కువగా ఉంది.”

“ఊ! చాల్లే గోపాల్, నీ వేళాకోళానికి అదుపు ఆపు ఉండటం లేదు.”

“మరి లేకపోతే ఏమిటి, చెప్పు. నీకు ఏ విధమైన హక్కు ఉందని, నీ మేనల్లుడికి దక్కిన అదృష్టానికి సంతోషపడకుండా అతన్ని రోడ్డుకీడుస్తానంటావ్?”

“ఏదో నా శ్రేయోభిలాషివి, నా ఆప్తమిత్రుడివి అని నమ్మి నీతో చెప్పుకోవడం నాది బుద్ధి తక్కువ. నువ్వు లాయర్ వి కదా అని నాకు కాస్త ఫేవర్ చేస్తావనుకుంటే, నువ్వు డబ్బు చూసి నా మేనల్లుడి వైపు తిరిగిపోయావు.”

“అదే ఇన్నాళ్ళ నా స్నేహాన్ని నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనన్నమాట. ఏదో నీ మంచి కోరి నువ్వు చేస్తున్న పని సరి కాదు అని చెప్పినందుకు, నా మీదే అభాండాలు వేస్తున్నావు.” 

“నువ్వు నా బాల్య స్నేహితుడవనే నా వ్యక్తిగత విషయాలు కూడా నీతో చెప్పి, నీ సలహాలు తీసుకుంటాను.”

“సరే! ఆశా! చాలా పొద్దు పోయింది. రెస్ట్ తీసుకో. కాస్త స్తిమితంగా ఆలోచించు. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. మనశ్శాంతిని స్వంతం చేసుకో. హాయిగా, ఆనందంగా జీవితాన్ని గడుపు” అని జాగ్రత్తలు చెప్పి గోపాల్ తన ఇంటికి వెళ్ళిపోయాడు.

ఆశ గోపాల్ వెళ్ళినవైపే చూస్తూ తలుపులు వేసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చింది. ఆమెకు గత కొద్దిరోజులుగా బుర్రంతా గజిబిజిగా ఉంది. దానికి పెద్ద కారణమే ఉంది. ఆమె ఉండే సిడ్నీ మహానగరంలోనే మేనల్లుడు కౌశిక్ ఉంటున్నాడు. ఈ మధ్యనే ఒక బిడ్డకి తండ్రికూడా అయ్యాడు. ఈ సందర్బంలోనే ఆశ ఆడపడుచు కమల, భర్త పోయిన తరువాత కొడుకు దగ్గరకు మొదటిసారిగా వచ్చింది.

కూతురు బారసాల, అదేరోజు తన పుట్టినరోజు కావడంతో కౌశిక్ మేనత్త ఆశని పార్టీకి పిలిచాడు.

ఆశ ఈ మధ్యే భర్తనుంచి విడాకుల కోసం పిటిషన్ పెట్టింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక, స్థలం కొని, ఇల్లు తనకు కావలసినవిధంగా కట్టించుకుంది. ‘ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు’ అని ఎందుకు అన్నారో ఆమెకు అర్థం కాసాగింది. అనుకున్న బడ్జెట్ కు మించి కూడబెట్టిన సొమ్మంతా ఇంటికోసం ఖర్చు ఐపోగా ఇంకా ఎదురు బ్యాంకు నుంచి మరింత మోర్టగేజ్ లోన్ అప్లై చేసి మొత్తానికి ఒక ఇంటిని సమకూర్చుకుంది. ఐతే తనకు వచ్చే జీతం, ఖర్చులు, నెల నెల బ్యాంక్ లోన్ కట్టిన తరువాత ఏమీ మిగలటం లేదు. తల్లి, తండ్రి పోవటంతో భారతదేశం వదిలి, ఆస్ట్రేలియాలోనే స్థిరపడిపోయింది.

ఈ మధ్యనే తనకు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన మురళీధర్ ని రిజిస్టర్ మేరేజ్ చేసుకుంది. స్వతహాగా స్వంత అభిప్రాయాలు, తనకు తానుగా నిర్ణయాలు తీసుకుని సాగిపోయే ఆశ, మురళీధర్ తో అడ్జెస్ట్ కాలేకపోయింది. బేధాభిప్రాయాలతో కొన్నాళ్ళనుంచి ఇద్దరూ విడిగా ఉంటున్నారు.

“నాకు వచ్చే జీతంతో అనవసరంగా స్వంత ఇల్లు ఆర్భాటంగా పెద్దది తీసుకున్నాను, కమ్యూనిటీలో అందరిముందు నా డాబు ప్రదర్శించాలని గొప్పలకు పోయాను. ఏదో ఏడాదిలో ఒకటి, రెండుసార్లు జరిగే పార్టీలకోసం అందరూ తన ఇంటికి వస్తే బ్రహ్మాండగా ఉండాలి అనుకుంటూ అన్ని నగీషీలతో కట్టుకున్న ఇల్లు. ఇపుడు పరిస్థితి చూస్తే పెరుగుతున్న ఖర్చులు, బిల్లులు కట్టుకోవడం, ఇంటి లోన్ వీటితో నాకు మనశ్శాంతి కరువైంది.” మనసులో అసంతృప్తిని వెలిబుచ్చుతూ అద్దం ముందు తనలో తాను మాట్లాడుకోవడం ఆమెకు అలవాటే.

ఆశలో ఉన్న ప్రత్యేకత అనుకున్న లక్ష్యం ఎంత కష్టమైనా సరే, సాధించేదాకా వదిలిపెట్టదు. ఆశకున్న బలహీనత లేదా ఒక వ్యసనం ఇప్పుడున్న అశాంతికి ఒక కారణమని చెప్పచ్చు. ఒకసారి వర్క్ లో క్రిస్మస్ గిఫ్ట్ హ్యాంపర్ బ్యాగ్ లో తనకు వచ్చిన లాటరీ టికెట్ కు $500 పైజ్ మనీ పొందింది. అప్పటినుండి గత ఏడాదిగా నెలకు కనీసం $100 నుంచి $300 ఖర్చు పెట్టి మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ కోసం లోటో అనీ, స్క్రేచీస్ అనీ, లాటరీ టికెట్ లు అనీ, పవర్ బాల్ ప్లే అనీ విపరీతంగా కొనసాగింది. దానికి సంబంధించి వార్తలు, ఎవరికి మిలియన్ డాలర్లు అదృష్టం పట్టింది, ఫలితాలు చూస్తూ ఇలా రోజులో కొంత సమయం కేటాయిస్తూ దానిపై రీసెర్చు చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా తనను అదృష్టం తలుపు తడుతుంది. అపుడు హాయిగా ఈ అప్పులన్నీ తీర్చేసి, జాబ్ కి రిజైన్ చేసేసి, యూరోప్ కంట్రీస్ అన్నీ చుట్టబెట్టి వచ్చేయాలని కలలు కనసాగింది. ఒకసారి వార్తలలో తను కొన్న స్టోర్ లో ఒక మహిళ ఐదు మిలియన్ డాలర్లు గెలుచుకుందని సదరు న్యూస్ ఏజెన్సీ వారు ఆమెకు ఫోన్ చేసినా, అది స్పామ్ కాల్ గా భావించి అసలు పట్టించుకోలేదుట. కానీ ఎట్టకేలకు తను లాటరీ టికెట్ కొన్న విషయం గుర్తొచ్చి, ఆ డబ్బుని తీసుకుంది. ఆ మహిళ ఇంటర్వ్యూ చూస్తూ, ఆశ తనని ఆ కుర్చీలో ఊహించుకుంది. లాటరీ టికెట్స్ కొంటోదన్న మాటే గాని, ఈ ఏడాది కనీసం తను ఖర్చు పెట్టిన మొత్తానికి ఒక్క డాలర్ కూడా తగలకపోవడం ఆమెను నిరాశకు గురి చేసింది. అవును మరి తన చేతిలో ఉన్న లక్ష్యసాధన ఐతే కష్టపడి ఫలితం సాధించగలదు. లాటరీ టికెట్ అంటే దేశం మొత్తం ఇలాంటి బలహీనులనుంచి వసూలైన సొమ్ము నూటికో, కోటికో ఎపుడో ఎవరో ఒకరు గెలుచుకుంటారు.  తన బడ్జెట్ స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేసి, టాక్స్ రిటన్ లాడ్జ్ చేస్తూ ఏడాది మొత్తం తను లాటరీ కోసం తగలేసిన డబ్బు మొత్తం వేలలో ఉండటం చూసి తీవ్ర వేదనకు గురైంది డబ్బు అలా వ్యర్థంగా పోయినందుకు. ఇకపై లాటరీ టికెట్లు కొనడం మానేయాలి అని గట్టి నిర్ణయం తీసుకుంది.

ఆ తరుణంలో మేనల్లుడు కౌశిక్ ఫోన్ చేసి పార్టీకి రమ్మని, అందరూ నీ కోసం ఎదురుచూస్తున్నామని పిలవడంతో అదరా బాదరగా చీర కట్టుకుని తయారైంది. చేతిలో లిక్విడ్ కాష్ రడీగా లేదు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొని ఇవ్వడానికి. ఆ పరిస్థితిలో కవర్ లో వచ్చేవారం డ్రా ఉన్న వన్ మిలియన్ లాటరీ టికెట్ కనిపించింది. అది $20 పెట్టి కొన్నది. ఫ్రిజ్ లో చాక్లెట్ పాకెట్, లాటరీ టికెట్ కవర్లో పెట్టి గిఫ్ట్ ప్యాక్ చేసి పార్టీకి వెళ్ళింది. 

అక్కడ వదిన కమల, ఆశని చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుని క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు.

కౌశిక్ మురిపెంగా కూతుర్ని చూపిస్తూ, “భాగ్యలక్ష్మి అని పేరు పెట్టాను అత్తయ్యా!” అని చెప్పాడు.

తరువాత కౌశిక్ బర్త్ డే కేక్ కట్ చేస్తున్నపుడు, ఆశ అతనికి కేక్ నోట్లో పెడుతూ చేతిలో గిఫ్ట్ పాక్ పెట్టింది, మనసులో “ఈ లాటరీ టికెట్ పనికిరాని కాగితం ముక్క, ఇక జన్మలో వీటిని ముట్టను” అని విరక్తిగా నవ్వుకుంది.

పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా తనకు పేద్ద భవంతి, కానీ ఏం లాభం. ఇపుడు చేతిలో చిల్లి గవ్వ లేదు. సేలరీ వచ్చే వరకు ఇంకా పదిహేను రోజులు జాగ్రత్తగా గడుపుకోవాలి. ఇవేమి పైకి కన్పించకుండా మొహం నిండా నవ్వు పులుముకుని, మెడలో డైమండ్ నెక్లెస్ తగిలించుకుని అందరితో సోషలైజ్ అవుతూ ఉన్న రెండు గంటలు అక్కడ కాలక్షేపం చేసి ఇంటికి చేరుకుంది ఆశ,

మరుసటి రోజు ఉదయమే ఆఫీస్ కి బయలుదేరింది. తను చేయవలసిన పనుల జాబితా లిస్ట్ చూసుకుంది. ఇంతలో భర్త మురళీధర్ నుంచి ఫోన్ వచ్చింది. “ఆశా! ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను వదులుకోను. ఇద్దరికీ నలబై ఏళ్ళు పైబడ్డాయి. భార్యా, భర్త అని కాదు గాని, మంచి స్నేహితులుగా కలిసుందాం. ఏ విషయమైనా మనం చూసే కోణాన్ని బట్టీ ఉంటుంది. కొద్దిగా సమయం తీసుకుని, మానవ సంబంధాలపై దృష్టి పెడితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కోర్ట్, కౌన్సెలింగ్ ఇవన్నీ మనకు అవసరమా? మన సమస్యల్ని మనం ఇద్దరం కలిసి సామరస్యంగా పరిష్కరించుకోలేమా? వచ్చే శనివారం బైరాన్ బే లాంగ్ డ్రైవ్ కి వెడదాము.” అని త్వరగా తను చెప్పవలసిన విషయాన్ని చెప్పేసాడు మురళీధర్.”

“నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైమ్ ఇవ్వు మురళీధర్, నేను వర్క్ కు వెళ్ళే హడవిడిలో ఉన్నాను.”

“సరే వెళ్ళు. కానీ ఇది మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం, ఆలోచించు, జీవితం చేజారనీకు. ఉంటాను బై” అని ఫోన్ పెట్టేశాడు మురళీధర్.

ఆశ మురళీధర్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఆఫీస్ కి చేరుకుంది. 

అలా తెలియకుండా వర్క్ లో బిజీగా రెండు రోజులు గడిచిపోయాయి. ఒకరోజు కారు స్టార్ట్ చేసి బయటికి వెళ్ళబోతుండగా, ఫోన్ మ్రోగింది. ఈసారి ఫోన్ అనానిమస్ కాల్. అవతలి కంఠం “మేడం మీరు గతవారం మా దగ్గర తీసుకున్న లాటరీ టికెట్ కు వన్ మిలియన్ వచ్చింది. మా స్టోర్స్ నుంచి మీరే ఆ విజేత కావడం సంతోషంగా ఉంది. కంగ్రాట్యులేషన్స్” అని చెప్పాడు.

ఒక్కసారి ఆశాకు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ వివరాలు కన్ ఫం చేసుకుంది.

ఈ హఠాత్ వార్త విని ఉక్కిరిబిక్కిరైంది.  తల పట్టుకుంది. “యస్ అదే లాటరీ టికెట్ తన మేనల్లుడు కౌశిక్ కు కానుకగా ఇచ్చింది మొన్ననే.”

వెంటనే కౌశిక్ కు ఫోన్ చేసింది. “కౌశిక్ నేను నీకు ఇచ్చిన లాటరీ టికెట్ నాకు తిరిగి ఇచ్చేయ్. నీకోసం నేను ప్రత్యేక కానుక తీసుకున్నాను.”

“అత్తా! ఏమంటున్నావ్? నేను ఇపుడే ఫలితాలు చూస్తున్నాను. నువ్వు నాకిచ్చిన టికెట్ కు లాటరీ తగిలిందనేగా, తిరిగి ఇచ్చేయమంటున్నావ్?”

“ఇది నా లక్కీ డాటర్ భాగ్యలక్ష్మి తీసుకువచ్చిన అదృష్టం. తిరిగి నీకెలా ఇస్తాను?” అంటూ ఫోన్ పెట్టేసాడు.

తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కౌశిక్ ఫోన్ ఎత్తలేదు. 

ఆమె తను చేసిన పిచ్చిపనికి, తనను తానే నిందించుకోసాగింది. కంటిమీద కునుకుండటం లేదు. కనీసం కొంత షేర్ ఐనా ఖచ్చితంగా కౌశిక్ నుంచి రాబట్టాలని చూస్తోంది.

కౌశిక్ ఇంటినంబర్ కి ఫోన్ చేసి, ఆమె భార్య ద్వారా, వదిన కమలద్వారా లాటరీ టికెట్ ఇచ్చేయమంటూ, తెగ ప్రయత్నించింది.

మనిషి నైజం ఎపుడూ, తనవల్ల అవతలవారికి మంచి జరిగితే అది తనవల్లే జరిగిందనుకుని, తెగ బాధపడిపోతాడు. ఇదే చెడు జరిగితే తన నెత్తిన పెట్టుకోడు. కానీ పైన భగవంతుడున్నాడు, మనిషి రూపంలో సాయం చేస్తాడు అని భావించడు. అదే ఇక్కడ ఆశ జీవితంలో జరుగుతున్న విధినాటకం.

తనకున్న ఆవేదనని పంచుకోవడానికి సోదరసమానుడైన గోపాల్ ని సంప్రదించి విషయం చెప్పింది.

గోపాల్ వివరాలు పూర్వాపరాలు విని, హితబోధ చేసాడు. “ఒకసారి నువ్వు ఎవరికైనా వస్తువు, ధన, కనక, వాహనాలు ఇచ్చిన తరువాత అది నీది కాదు. ఇన్నాళ్ళు దక్కని అదృష్టం, ఇపుడు మహాలక్ష్మిలా కౌశిక్ కు తన కూతురు తీసుకువచ్చింది అనుకోవచ్చుగా!” అని అన్నివిధాలా చెప్పి చూసాడు.

ఆ రాత్రి నిద్ర పట్టక టివి ఆన్ చేసి, ఛానల్స్ అన్నీ కలయతిరిగింది. అర్థం, పర్థంలేని అత్తా, కోడళ్ళ వైరం, అసూయలు, బిగ్ బాస్ ఇవన్నీ బుర్రని పాడుచేసి, మనిషిలోని మృగాన్ని తట్టి లేపుతున్నాయా అనుకుంటూ, సడన్ గా ఛానెల్ మారగానే, భక్తి ఛానెల్ లోబ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ప్రవచనాలు వస్తుంటే చతికిలబడి, శక్తిమంతమైన ఆయన వాక్కులు వింటూ అలా ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ప్రతివ్యక్తికి ఒక దివ్యమైన సమయంలో జ్ఞానోదయం అవుతుంది. సరిగ్గా తను ఏ విషయం గురించి ఐతే మధనపడుతోందో అదే విషయం గురించి ఆయన సందేశాత్మకంగా, “అసలు సంపద అంటే ఏమిటి? జీవిత పరమార్థం, అమ్మవారి కృపాకటాక్షం పొందటానికి చేయవలసిన విధులు, కర్తవ్యం” ఇవన్నీ వింటుంటే, ఆశ కనులనుంచి అప్రయత్నంగా అశ్రువులు జాలువారాయి. సరైన సమయంలో, పండు వచ్చి చేతిలో పడటమంటే ఇదేనేమో! 

“ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది” అన్న కోట్ ఆమెకు గుర్తుకు వచ్చింది. “ఒక మంచి మాట సరైన సమయంలో నిరాశ, నిస్పృహలలో కూరుకుపోయిన వ్యక్తికి చేరిననాడు, ఇన్ని అనర్థాలు, చావులు ఉండవుగా. అదేనేమో గ్రహస్థితి, గతులు కలసిరావడమంటేను. నా విషయంలో నేను అనుకున్న లాటరీ నాకు తగలకపోయినా, నా జీవితానికి, జన్మ సార్థకం కావడానికి ఇహంలో, పరంలో కావలసిన శాశ్వత పరిష్కార మార్గం దొరికింది.

నేను ఎక్కవలసిన రైలు ఇంకా నాకోసం వేచి ఉంది. నాకు నడమంత్రపు సిరి అవసరం లేదు. నేను ఆచరించవలసిన ధర్మం, పూజాదికాలు నిర్వహిస్తాను. కౌశిక్ నిజంగా నిష్టాగరిష్టుడు. అందుకే నానుంచి చేజారిన అదృష్టం, నేనిచ్చిన లాటరీ టికెట్ ద్వారా అతడికి సిరిసంపదలను ప్రసాదించింది. ఇప్పటికీ నన్నే కోరుకుంటున్న సహనశీలి మురళీధర్ తో జీవితాంతం కలిసి ఉండాలి. ఇన్నాళ్ళు నా మాటే నెగ్గాలి, నా ఆస్తికోసమే నన్ను పెళ్ళి చేసుకున్నాడేమోనని అపోహపడ్డాను. తప్పంతా నాదే. రెండు జీవితాలు సజావుగా సాగాలంటే సర్దుబాటు, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం, పరస్పర ప్రేమానురాగాలు ఉండాలి. అదే జీవిత పరమార్థం అని ఇంకా గురువుగారి మాటలు చెవిలో మారుమ్రోగుతుండగా, అమృతధారలై తన జీవితాన్నే మార్చేసాయి కదా” అని స్తిమితపడ్డ మనసుతో నిద్రలోకి జారుకుంది ఆశ.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.