కనక నారాయణీయం -41

పుట్టపర్తి నాగపద్మిని

          తరువాత కొన్ని రోజులకే  కృష్ణమాచార్యుల అధ్వర్యంలో శ్రీమాన్ దేశికాచార్యుల వారి తండ్రిగారు బాణగిరి రామాచార్యులవారి సమక్షంలోనే హొసపేట కామలాపురంలో, చిరంజీవులు కరుణాదేవి రాఘవాచార్యుల పరిణయానికి సంబంధించి నిశ్చితార్థం, లగ్న పత్రిక పెట్టుకోవటం కూడా దివ్యంగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి కాబోయే వియ్యంకుడు దేశికాచార్యులవారు ముందే చెప్పినట్టు, శ్రీమాన్ బాణగిరి శింగరాచార్యుల వారు కూడా రావటం జరిగింది. అక్కడే, వారి ఏకైక పుత్రుడు, రామానుజాచార్యుల పెళ్ళి సంబంధం కోసం చి.సౌ. తరులత జాతకాన్ని కూడా పుట్టపర్తి దంపతులు వారికి సమర్పించారు. ఈ సంబంధం గురించి తమకందిన మరొక  ముఖ్యమైన విషయం పుట్టపర్తి దంపతులను మరింత ఆనందింపజేసింది.

          పుట్టపర్తి వారికి వరుసకు చెల్లెలు లక్ష్మీనరసమ్మ కూడా బాణగిరి ఇంటి కోడలే!! ఇప్పుడు సంబంధం చూస్తున్న బానగిరి శింగరాచార్యులు, లక్ష్మీనరసమ్మ భర్త శ్రీమాన్ బాణగిరి రామకృష్ణమాచార్యులు – ఇద్దరూ, అన్నదమ్ముల పిల్లలు. అలా పుట్టపర్తి కుమార్తెలు కూడా బాణగిరి ఇంటి కోడల్లు కాబోతూ వుండటం విశేషమే కదా!!

          కామలాపురంలో చెల్లెలు లక్ష్మీనరసమ్మ ఇల్లు కూడా, శింగరాచార్యులవారి ఇంటి ప్రక్కనే వుండటం, ఆ ఇళ్ళమధ్య స్నేహ సౌహార్ద్ర  బంధాలు ఎంతో పటిష్టంగా వుండటం పుట్టపర్తి దంపతులకు మరింత సంతోషాన్నిచ్చే విషయమైంది.

          చెల్లెలు భర్త రామకృష్ణమాచార్యులు, మంచి వ్యక్తి. పైగా హాస్య ప్రియుడు కూడా!! పుట్టపర్తిలోనూ తండ్రి శ్రీనివాసాచార్యుల ద్వారా సంక్రమించిన హాస్య ప్రియత్వం, ఇరువురినీ మరింత దగ్గర చేసింది.

          నిజానికి పుట్టపర్తిది ఎప్పుడూ గంభీర ముద్రే!! కానీ వచన రచనల్లో వారి హాస్య ధోరణి రెక్కలు విప్పుకుంటుందన్న విషయం, వారి ప్రబంధ నాయికలు, రామకృష్ణుని రచనా వైఖరి వంటి విమర్శ గ్రంధాలను పరికిస్తే విదితమౌతుంది. అంతే కాదు, వివిధ వేదికల మీద వివిధ విషయాల పై గంగా ఝరీసదృశంగా సాగుతూ, సభికులను నవరస భరిత సమ్మోహితంచేసే వారి ప్రసంగాలలోనూ, హాస్య, వ్యంగ్య వైఖరే ఎక్కువగా అన్ని వయస్సుల వారినీ అలరిస్తూ వుంటుంది కాబట్టే, వారి ఆరాధకులు బాగా పెరిగారు అప్పట్లో!! చాలా విస్తృతంగా వారిని ఆహ్వానించి సముచిత గౌరవాన్నందించి, తన్మయ మయేది – అలనాటి సాహితీ సమాజం !!

          ఈ కారణాల వల్ల చెల్లెలు భర్త బాణగిరి రామకృష్ణమాచార్యులకూ, పుట్టపర్తికీ కూడా చక్కటి జోడీ కుదిరింది.                

          దీనికి తోడు, మరో బంధం వారిద్దరినీ మరింత దగ్గర చేసింది.  రామకృష్ణమాచార్యులు, రాళ్ళపల్లి అనంత కృష్ణమాచార్యులవారి అన్నయ్య శ్రీమాన్ రాళ్ళపల్లి గోపాల కృష్ణమాచార్యులవారి దగ్గర (సువిఖ్యాత జ్యోతిష్య పండితులు) జ్యోతిష్య శాస్త్రంలో శిష్యరికం చేస్తూ వుండటం!! 

          జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన గోపాలకృష్ణమాచార్యులవారి అనేకానేక పరిశోధక ఆంగ్ల వ్యాసాలు, జ్యోతిష్య సంబంధ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురింపబడేవి. వారి భవిష్య వాణి, అత్యంత నిర్దిష్టంగా వుండేదని ప్రతీతి. వారేదైనా విషయాన్ని గురించి ఒక మాట చెబితే, దానికిక తిరుగే వుండేది కాదట అప్పట్లో!! పుట్టపర్తికీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వారెలా దగ్గరి చుట్టాలో, గోపాల కృష్ణమాచార్యులవారు కూడా అంతే దగ్గర కదా మరి!! పైగా పుట్టపర్తికి కూడా, జ్యోతిష్య శాస్త్రం పట్ల అభిరుచి, నేర్చుకోవలెనన్న ఆసక్తీ మెండుగా వున్నాయి ఇప్పటికీ!!

          అందుకే బాణగిరి రామకృష్ణమాచార్యులు, పుట్టపర్తి నారాయణాచార్యుల మధ్య సాన్నిహిత్యం దినదినాభివృద్ధి చెందిందనే చెప్పవలె!! పైగా కుమార్తెలిద్దరికీ హంపీ కామలాపురం మూలాలున్న బాణగిరి సంబంధాలే కుదరబోతుండటం, కలిసి వచ్చిన అదృష్టం.

          చెల్లెలు లక్ష్మీ నరసమ్మ, నోరారా, అన్నయ్యా అని పిలుస్తూ, ఆదరిస్తూ వుంది. ఎంతైనా పుట్టింటివాళ్ళు కదా!! అన్నా చెల్లెళ్ళిద్దరూ వాళ్ళ చిన్నప్పటి ముచ్చటలు సరదాగా నెమరు వేసుకుంటూ వాళ్ళ పెద్దవాళ్ళ సంభాషణలను గుర్తు చేసుకుంటూ తెగ నవ్వుకుంటూ వుంటే కనకమ్మకు కూడా ముచ్చటగా వుంది. పుట్టపర్తిలోని యీ కోణం ఆమెకు బొత్తిగా పరిచయమే లేదు కదా మరి !!  ఇంట్లో ఎప్పుడూ దీర్ఘాలోచనాలోచనాలే కదా వారివి !!

          కాగా, వరుడు చిరంజీవి బాణగిరి రామానుజాచార్యులు, చదువు, ఉద్యోగం చక్కగా చేసుకుంటూ ఉండటమే కాదు, జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యం ఉందట కూడా! పిన్నయ్య బాణగిరి రామకృష్ణమాచార్యుల వారి వద్ద జ్యోతిష్యం నేర్చుకుంటూ ఉన్నాడట!!  అంటే, శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి అన్నగారు శ్రీమాన్ రాళ్ళపల్లి గోపాల కృష్ణమాచార్యులవారి ప్రశిష్యుడన్న మాట!!

          ఇన్ని కారణాల వల్ల, పుట్టపర్తి దంపతులకు, ఈ సంబంధం కూడా త్వరగా కుదిరిపోవాలని పెరుమాళ్ళుకు మొక్కుకున్నారు, మనసారా!! పుట్టపర్తి వారి ఇంటి దేవుడు, తిరుమలేశుడే!! ఇంటి పేరే తిరుమల వాళ్ళు. అప్పటికే నారాయణాచార్యుల వారి మనసులో శ్రీనివాస ప్రబంధం అన్న పేర, తిరుమల వేంకటేశ్వర స్వామికి అంకితం ఇస్తూ మహాకావ్యం వ్రాయవలెనన్న సంకల్పం కలిగింది కూడా!! దానికి తగినట్టు శ్రీ వేంకటాచల మాహాత్యం, విష్ణుపురాణం వంటి రచనలలోని ఇతివృత్తాలను పరిశిలిస్తూ ఉన్నారు.

          మొత్తానికి కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్టు, చి.సౌ. తరులత జాతకం కూడా, చి. బాణగిరి రామానుజాచార్యుల జాతకానికి అతికినట్టు సరిపోయిందట!! కాకపోతే, వాళ్ళు పెద్ద మోతుబరులు. తీయనైన తుంగభద్ర నదీ జలాల పరిధిలో, వందల ఎకరాల భూ స్వాములు. ధాన్యలక్ష్మీ వాళ్ళఇంట్లో నిరంతరం కొలువయ్యే వుంటుంది. పచ్చని వరి చేలు, చెరకు, మామిడి తోటల నుండీ, కోతలైనప్పుడల్లా  కౌలుకు ఇచ్చిన రైతులు తెచ్చి ఇంట నింపే రాసులకొద్దీ బస్తాలతో ఇల్లు నిండి పోయేదంటే అతిశయోక్తి కాదని లక్ష్మీ నరసమ్మ మాటల్లో తెలిసింది. దీనికి తోడు లంకంత ఇల్లు. బంధువర్గం కూడా ఎక్కువే!! రోజూ వచ్చి పోయే చుట్టాల సంగతి చెప్పనక్ఖరలేదు. ఇన్నిటిలోనూ వచ్చే కోడలు, చక్కగా  ఇమిడిపోవాలని వాళ్ళ అభిలాష.  

          పుట్టపర్తి కీర్తి ప్రతిష్టలు కన్నడిగులకూ పరిచయమే ఐనా, వరకట్నం, పెట్టుపోతల విషయం ఎలా వుంటుందోనని శింగరాచార్యులవారికి సందేహమట!! ఇది కూడ లక్ష్మీ నరసమ్మ ద్వారానే తెలిసింది. కానీ, ఆమే అన్నదట, మన ఇంటిలో అడుగు పెట్టిన తరువాత, ఇక మన పిల్లకు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అణకువ, పనితనం వున్న ఆడపిల్ల కాబట్టి, ఇట్టే ఒదిగిపోతుంది. ఐనా పక్కనే నేనూ వుంటున్నాను కదా!! నేనూ  చెబుతూనే వుంటాను లెండి బావగారూ!!’ అందట!! అంతే కాదు, వరుడు  రామానుజాచార్యులు కూడా పట్టు  పట్టుకుని కూర్చున్నాడట, యీ జాతకం నాకు బాగా సరిపోయింది, ఈ అమ్మాయినే చేసుకుంటాను. అంతే!!’  అని !!  

          ఈ విషయాలన్నీ లక్ష్మీ నరసమ్మ, అన్నయ్యకు ఉత్తరాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియ జేయటం వల్లే పుట్టపర్తి దంపతులకు తెలిసింది. ఆ తరువాత, పెళ్ళి చూపుల ఏర్పాటు గురించి !! శింగరాచార్యుల అన్నగారు, వెంకట్ నరసిమ్హచార్యులవారి కుమారుడు నిగమాంతాచార్యుల వివాహం జరుగుతున్న చోటే పెళ్ళి చూపులు ఏర్పాటు చేయటం, అమ్మాయి వాళ్ళందరికీ నచ్చటం కూడా జరిగి, నిశ్చయ తాంబూలాలు కూడా అక్కడే తీసేసుకోవటంతో పుట్టపర్తి దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పెళ్ళి ముహుర్తం కూడా త్వరలో పెట్టుకుంటే మంచిదని వాళ్ళ అభిప్రాయం. వీలైతే ఇద్దరు కుమార్తెలకూ రాబోయే మాఘమాసంలో దగ్గరి దగ్గరి ముహూర్తాలు పెట్టేస్తే సరి పోతుందని వాళ్ళ అభిప్రాయం.

          ఇప్పుడు పుట్టపర్తి దంపతులు ఆలోచనలో పడ్డారు. పెళ్ళిళ్ళు కుదరటం బాగానే వుంది కానీ, అతి తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు. ఇద్దరు అల్లుళ్ళకూ వరోపచారాలు, వెండి తట్టా, చెంబూ, లోటా, బట్టలు, వారి వారి ఇంటి ఆడపడుచులకు పెట్టుపోతలూ – ఇవి కాక, పెళ్ళికి సత్రం (అప్పట్లో విశాలమైన సత్రాల్లో పెళ్ళిళ్ళు చేయటం ఆనవాయితీ) విడిదిల్లు – యేర్పాట్లు, మేళతాళాలూ, భోజనాల ఏర్పాట్లూ – వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచీ తేవటం?

          పుట్టపర్తి ఉద్యోగ  కారణాల వల్ల కడపకు మారినా, పుట్టపర్తి ఆరాధకులు ఇంకా ఎంతో మంది ప్రొద్దుటూరులో ఉన్నారు. శిష్యవర్గమూ బోలెడంత మంది!! అన్ని వర్గాలవారూ ఉన్నారు. ముఖ్యంగా నాలుగైదేళ్ళుగా కడపలో ఉంటున్నా, ప్రొద్దుటూరులో పుట్టపర్తి స్థిరపడటానికి కారణభూతుడు, శ్రీ కొప్పరపు సుబ్బారావుగారు కాబట్టి ఆయన ఆత్మీయులు, బంధువుల్లో పుట్టపర్తి అంటే అదేవిధమైన ఆదరణ ఇంకా గూడు కట్టుకునే వుంది. అక్కడ  ఉన్నంత పలుకుబడి కడపలో లేదనే చెప్పవలె!! ఇంక, పుట్టపర్తి దత్త పుత్రుడు,  సుబ్రమణ్యం వైశ్య కుటుంబంవాడైనా, అతని స్నేహితులు కూడా అన్ని వర్గాల వారూ ఉన్నారు. అదే ధైర్యం సుబ్రమణ్యానికి!! ఆ ధైర్యంతోనే పెళ్ళి విషయంగా భయపడుతున్న అయ్యా, అమ్మలతో అన్నాడు, ‘అమ్మా, మీకెందుకు!! నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు నిరాటంకంగా చేసే బాధ్యత నాది. నా చేత కాకపోతే, అప్పైనా చేసి చేస్తాను. లేదా, అడుక్కునైనా చేస్తాను. మీరు దిగులు పడవద్దు. సంబంధాలు ఖాయం చేసేయండి మీరు !! ‘ పుట్టపర్తి దంపతులు యీ మాటలకు నిర్ఘాంతపోయారు!!

          వివాహ ముహూర్తాలు వాళ్ళన్నట్టు మాఘ మాసంలోనే కాక, ప్రథమ పుత్రిక  చి. కరుణ వివాహ ముహూర్తం మాఘ మాసంలోనూ, ద్వితీయ కుమార్తె చి.తరులత వివాహ ముహూర్తం, వైశాఖమాసం లోనూ వుండేలా కుదిర్చాడు, ప్రొద్దుటూరు కృష్ణమాచార్యులు!!

          ఇంక రెండునెలల సమయమే ఉంది. ఈ రెండు శుభకార్యాలూ నిర్విఘ్నంగా జరిగేలా చేయమని కనకమ్మ వెంకన్నకు ముడుపు కట్టింది. పుట్టపర్తి మళ్ళీ యధాతథంగా తన రచనా లోకంలోకి ప్రవేశించటం – ఆమెకు ఆశ్చర్య కారణమైంది.

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.