నా అంతరంగ తరంగాలు-35

-మన్నెం శారద

నేను సిస్టర్ -సిస్టర్ నవల రాయడానికి ముందు కధ
………………….

1984లో హైదరాబాద్ లోని బొగ్గులకుంట లో [తిలక్ నగర్ ]లో చాలా పెద్ద ఎత్తున రచయిత్రుల సభలు మూడు రోజులపాటు జరిగాయి. మొదటి రోజు ప్రముఖ తమిళ రచయిత్రి శ్రీమతి శివశంకరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభ ఉపన్యాసం చేసారు .

రెండవరోజు శ్రీమతి మాలతీచందూర్ గారి అధ్యక్షతన నేను ,శ్రీమతి అరవింద [ప్రముఖ రచయిత్రి A .Sమణిగారు]ప్రసంగించ వలసి వచ్చింది . నా కిచ్చిన టాపిక్… స్త్రీ ఉద్యోగినుల  సమస్యలు కూలంకషంగా చర్చించిన రచనల గురించి ప్రసంగించడం. అప్పటికి నేను రాసినవి రెండే రెండు నవలలు!  రెండూ బహుమతి పొందినవే. ఒకటి’ గౌతమి’…ఆంధ్రజ్యోతి డైలీ పేపర్ లో దీపావళి నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన నవల. రెండవది ‘చంద్రోదయం’.. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రిక లో విజయదశమి నవలల పోటీలో రెండవ బహుమతి పొందిన నవల.

సభలో హేమా హేమీలున్నారు, శ్రీ యుతులు నండూరి రామమోహనరావు గారు .పురాణం సుభ్రమణ్య శర్మగారు, కొమ్మూరి వేణుగోపాలరావు గారూ ,వాసిరెడ్డి సీతాదేవి గారు ,నాయిని కృష్ణ కుమారి గారూ ,లత గారూ ,ఆనందారామంగారు ..ఇలా చాలా మంది ప్రముఖులు ! సభ అంతా సాహితీ దిగ్గజాలతో కిటకిట లాడుతోంది .

నాకసలే సభాపిరికితనం వుంది , వయసులోనూ, రచయిత్రిగానూ నేను అప్పటికి వారందరి ముందు చాలా చిన్నదాన్ని. పైగా అందరినీ చూడటం కూడా అదే ప్రధమం . అందులోనూ నాకిచ్చిన సబ్జెక్ట్ మీద నాకు తగినంత సమాచారం దొరకలేదు.

నా పేరు పిలవగానే వణుకుతున్న కాళ్ళతో నాలుక పిడచ కట్టుకుపోతుంటే డయాస్ మీదకెళ్ళాను. మాలతి చందూర్ గారి పక్కనే నాకు ఎలాట్ చేసిన సీట్! ఆమెకి విష్ చేసి కూర్చుని చిన్నగా అడిగాను… “స్త్రీ ఉద్యోగినుల గురించి నాకు ఒకే నవల గుర్తుంది. అది పార్ధసారధి గారనుకుంటాను, వారు రాసిన ‘రంగులవల’ అని చదివినట్లు గుర్తు ,ఇంకేమైనా ఉన్నాయండీ?”…  అని . ఆమె నవ్వుతూ “You are exactly correct sarada! అంతకుమించి ఎవరూ ఏమీ రాయ లేదు.” అని చెప్పేరు.

ఆమెని అంతకుముందే మద్రాస్ లో జరిగిన తెలుగు మహా సభలకు వెళ్ళినప్పుడు  వాసిరెడ్డి సీతాదేవి గారితో మైలపూర్ లో వారింటికి వెళ్ళినప్పుడు చూడటం జరిగింది. “ఈ అమ్మాయి కొత్తగా రాస్తుందికదూ, గుడ్!” అన్నారు నావంక నిశతం గా చూస్తూ. నాకు కొంత ధైర్యం వచ్చినా’ నేనిప్పుడేమి మాట్లాడాలి’ అని ఆలోచిస్తుండగానే నా పేరు అనౌన్సు చేసేసారు .

ఆ పరిస్థితి వద్దులెండి ఎలాగోలా చివరికి  ధైర్యం చేసి మాట్లాడాను…
‘ ఉద్యోగినుల సమస్యలని ఇంతవరకూ ఎవరూ రచనలలో సమగ్రంగా చర్చించలేదని ..కొన్ని సమస్యలని ఉద్యోగినిగా చెబుతూ నైట్ ద్యూటీస్ వుండే నర్సులు ,టెలిఫోన్ ఆపరేటర్స్ ఎదుర్కొనే సమస్యల మీద ఎవరైనా  నవల రాస్తే బాగుంటుందని. [అప్పటికీ సాఫ్టవేర్ రంగం లేదు ] స్టేజ్ దిగాక ‘భయం భయం అన్నావ్ బాగా మాట్లాడావ్ ‘అని నన్ను సీతాదేవిగారు ,లత గారు అభినందించారు .
నవలలు రాయడం మొదలు పెట్టినా  ఆ సబ్జెక్ట్స్ నేనే రాయాలని అనుకోలేదు.

1988 టెలిఫోన్ ఆపరేటర్స్ మీద ఒక రచయిత రాసిన సీరియల్ పెద్ద గాలిదుమారం రేపింది. వారిని, వారి వృత్తిని కించపరిచే విధంగా వుందని టెలిఫోన్ఆపరేటర్స్ పెద్దగా అజిటే షన్ చేసారు .
నా సలహా అలా వికటించి నందుకు నేను బాధ పడ్డాను.

అప్పుడే సరిగ్గా నా ఫ్రెండ్ చెల్లెలు ప్రమాద వశాత్తు కాలి బర్న్స్ వార్డ్ లో వుందని తెలిసి నేను ఉస్మానియాకి వెళ్లాను.

” మీరు చూడ లేరమ్మా!” అని నర్స్ ఎంతగా వారించినా నేను ఆ అమ్మాయిని చూడాలన్న ఆత్రంతో వార్ద్ల్ లోకి వెళ్ళిపోయాను .

దోమతెరలోంచి కనపడిన ఆమె ఆకారం నన్ను నిర్ఘాంత పోయేలా చేసింది. దానికి తోడుఅక్కడ మనం ఏ మాత్రం సహించలేని దుర్వాసన ! వాంతి ఎంత ఆపుకున్నా ఆగడం లేదు . చేతిరుమాలు అడ్డం పెట్టుకుని పరుగున బయటకి వస్తుంటే అక్కడే కుర్చీలో కూర్చున్న సిస్టర్ “నేను చెబితే మీరు వినరమ్మా ,భరించలేరు మీరు!  ‘అంది.

నేను దారి పొడవునా ఆమె గురించే ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను.

ఒక తల్లి ,భార్య చేయలేని సేవల్ని అందించే ఈ సిస్టర్స్ ని గురించి తక్కువచేసి ఎవరు మాట్లాడినా వారు క్షమార్హులు కాబోరని అనిపించింది. వెంటనే వారిగురించి నేనే రాయాలని నిర్ణయించుకుని కొన్ని రోజులు శెలవు పెట్టి నర్సులని ఇంటర్వ్యూ చేసి వారి సామాజిక ఆర్ధిక ఉద్యోగ సమస్యలు తెలుసుకుని నవలగా రూపొందించాను. మొదట చెప్పడానికి సంశయించినా చివరకూ వారంతట వారే నన్ను కలిసి  వారి పేర్లు బయట పెట్టవద్దని చెప్పి అనేక విషయాలు బయట పెట్టారు. ఆ నవల మయూరి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది.

కన్నడంలో ప్రఖ్యాత అనువాద రచయిత ‘ రాజశేఖర్ గారి చేత అనువదింపబడి అక్కడివారి ప్రసంశలు అందుకుంది . అనేక కేపింగ్ సెర్మనీ లకు నర్సెస్  కాలేజీలకు నన్ను అతిధి గా పిలిచి గౌరవించారు.

ఒకసారి ప్రముఖ నటి విజయనిర్మల గారి చేతులమీదుగా ఒక నర్సెస్  కాలేజీ లో క్యాపింగ్ సెర్మనీ  సందర్బంగాగా నాకు సన్మానం జరిగిన ఫోటోలు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

***

మొదటి ఫోటో 1988లో నర్సెస్ ని ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన ఫోటో ఇది !సిస్టర్ కోరిక మేర ఆమెని తియ్యలేదు ! రెండవ ఫోటో (ఈ ఫొటోలోని నేను కట్టిన పట్టుచీర స్వయంగా కన్నడ అనువాద రచయిత రాజశేఖర్ గారు తనచేతులమీదుగా నేసి బహూకరించినది )

( విజయనిర్మల గారితో పరిచయం, స్నేహం గురించి మరో సారి )

*కొసమెరుపు… సరదాగా మూడవరోజు ప్రముఖ రచయిత్రి తేన్నేటి హేమలత గారి అధ్యక్షుతన   డాక్టరెట్  చేసిన రచయిత్రులు  డయాస్ మీద ఆశీనులయ్యారు. లత గారు అధ్యాక్షోపన్యాసం చేస్తూ ” నిన్నా మొన్న వేదికనలంకరించినవారు  జొన్న విత్తులు… ఈ రోజు మేము మేలిమిముత్యాలం!” అన్నారు.  అంతే… సీనియర్ రచయిత్రులందరికి చెప్పలేని కోపం వచ్చేసింది.
వాసిరెడ్డి సీతాదేవి గారయితే   కోపం తో పళ్ళు నూరి చూడు … ఏమంటుందో అన్నారు ఆవేశం గా ( నిజానికి వాళ్లిద్దరూ మంచి స్నేహితులే ) సభ ముగిసి లత గారు క్రిందకొచ్చాక అందరూ “మమ్మల్ని అంత మాటంటావా!” అని విరుచుకు పడ్డారు.  నేను సడెన్గా “లత మేడం అన్నదాంట్లో తప్పేముంది?” అనేసాను. అందరూ నావైపు సీరియస్ గా చూసారు ఒక్కసారిగా. అసలే అప్పటికి నేను వయసు రీత్యా రచయిత్రి గా కూడా నేను చాలా జూనియర్ ని. ‘ఏమంటున్నావ్ అమ్మాయ్!” అన్నారు వాసిరెడ్డి సీతా దేవిగారు కోపంగా. అవును మేడం, నిజమే కదా… జొన్నవిత్తులు ఆకలి తీరుస్తాయ్… మేలిమి ముత్యాలు దేనికి పనికొస్తాయ్… మెడలో వేసుకోడానికి తప్పా!” అన్నాను నవ్వుతూ.

అంతే!

రచయిత్రులందరూ చప్పట్లు చరచి కేరింతలు కొట్టారు. లత గారు నా వంక నిశతం గా చూసి. “చూస్తున్నా… చూస్తున్నా.. ఎక్కడ చూసినా నీ పేరే మొగుతూంది పత్రికల్లో నీ పేరే…!”అన్నారు నవ్వుతూ.  తర్వాత ఎన్నోసార్లు ఆమె మా ఇంటికొచ్చారు. నేను విజయవాడలో  రైటర్స్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి వారింట్లోనే దిగాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.