కథా మధురం 2

 చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే” 

జగద్ధాత్రి 

 

డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి గంగకు’ హిందీ నుండి అనువాదం చేశారు. ఇటీవల తాను పి హెచ్ డి చేసిన రచయిత్రి  ‘మహాదేవి వర్మ గీతాలు’ కూడా తెలుగు లోకి తీసుకొచ్చారు. “ఒడిశా జానపద కళలు” కూడా ఉపద్రష్ట అనురాధ గారితో కలిసి తెలుగు లోకి అనువాదం చేసి అందించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ క్రియాశీలక సభ్యురాలిగా కూడా పనిచేశారు. గత 28 ఏళ్ల నుండి ప్రతి ఏటా ‘చాసో పురస్కారం’ మంచి కథకులకు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే , ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిన, ఎందరో మెచ్చుకున్న కథ ఇది. 

యాష్ ట్రే కథా వివరాలు : 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరం లో శ్రీకాకుళం లో సభలో పాల్గొన డానికి బరంపురం నుండి వెళ్లేరు తులసి గారు. దిగుమర్తి వారి ఇంట్లో ఉప్పల లక్ష్మణ రావు గారు తదితరులతో ఉన్నారు. అప్పుడు రాసిన కథ ఇది. దిగుమర్తి కమలమ్మ  గారు తాను నడిపే పత్రిక లో అచ్చు వేయడం జరిగింది. 1976-85 మహిళా దశాబ్ది సందర్భంగా 1976 లో ఆంధ్ర దేశం మొత్తం తెలిసేలా అచ్చయింది. ఆ తర్వాత ఏ కె ప్రభాకర్ గారు వేసిన ‘స్త్రీవాద కథలు’ పుస్తకం లో వచ్చింది. 

1992 లో అరుణా సీతేష్ సంపాదకత్వం లో Glimpses: The Modern Indian Short Story Collection లో ప్రచురించబడింది. జయశ్రీ హరిహరన్ ఆంగ్లం లోకి అనువదించారు. హిందీ, ఒడియా భాషల్లోనూ అనువాదమై అచ్చయింది. 

ఫెమినిస్ట్ కథలేవీ రాక ముందే వచ్చిన ఈ కథ, స్త్రీ ఆత్మ గౌరవం , ఉన్నత వ్యక్తిత్వం కు అద్దం పడుతుంది. యాష్ ట్రే లో స్త్రీ పాత్ర సమాజం లో కొత్తగా పుడుతున్న పాత్ర. మానవి గా ఎదిగిన స్త్రీమూర్తి  పాత్ర. అందుకే ఆమెకు పేరు లేదు. అటువంటి స్త్రీలు పెరిగాక పేర్లు స్థిరపడతాయి అన్నది రచయిత్రి ఉద్దేశం. బతుకుని కత్తిరించి మళ్ళీ అమర్చుకోవడం తెలియాలి. వికారంగా ఉన్న బతుకును అందంగా చేసుకోవడం ఈ కొత్త స్త్రీకి తెలుసు. ఆ స్త్రీమూర్తిని పట్టుకోవడం లో కథకురాలు కృతకృత్యురాలైంది. అందుకే ఆమె తాను పొయెట్ కాదు అని ఎంత చెప్పినా ఆమె లైఫ్ లోని పొయెట్రీ ని, ‘poetry of life’ పట్టుకున్న కథకురాలని జర్మన్ ప్రొఫెసర్ , విమర్శకుడు, గెర్ట్ హాఫ్ మెన్  ఈ కథ అనువాదాన్ని ఇంగ్లీషులో చదివి ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. 

ఇది ప్రేమ కథ కాదు. బతుకులోకి కొద్ది రోజులు వచ్చినవాడు స్వార్ధం తో వెళ్లిపోయాడు, తిరిగి స్వార్ధం తో వచ్చాడు. కొద్దిరోజులు పాటు వచ్చి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాడి పట్ల ఏ భావం ఉంది? ప్రేమ భావమా ? కానే కాదు, బాహ్య ఆకర్షణ. రూపు రేఖలు మొదట లాగుతాయి, లేని గుణగణాల భ్రమ కలుగుతుంది. ఆ ముద్రా ఇంకా కొద్దో గొప్పో మిగిలి ఉండటమూ  సహజమే అందుకే కాస్తంత డైలమా పడ్డట్టు అనిపించినా కేవలం అయిదే ఐదు నిమిషాల్లో అతని తగనితనాన్ని మర్యాదగానే చెప్పినా అది మరి చెంప పెట్టే!

కథా వస్తువు, భాష , కథ చెప్పిన తీరూ, ప్రతీకాత్మకంగా , కొత్త స్త్రీమూర్తి ఆచరణాత్మక ఆలోచనలతో, తనను తాను, ప్రతిష్టించుకున్న విధానం కథను అత్యుత్తమ స్థాయిలో చేర్చాయి. కథ గుండెను పట్టుకుంటుంది …ఆలోచించమంటుంది…చదవండి కథను  

*****

యాష్ – ట్రే

-చాగంటి తులసి 

“అమ్మా! మీ కోసం ఎవరో వచ్పేరు!” కమల గది గుమ్మంలో నిల్చుంది. చికాకు వేసింది. ఆదివారం నాడూ హాయిగా రిలాక్స్ అయి గడపడానికి వీల్లేకుండా ఎవరా వచ్చింది. ఈ మనుష్యులు ప్రాణాలు తోడేస్తున్నారు.

‘‘ఎవరూ? వచ్చినవాళ్ళు ఆడవాళ్లా? మగవాళ్లా”

‘‘మగే!’’

‘‘ఒకరేనా? ఇద్దరు ముగ్గురా? పేరూ గట్రా కనుక్కోలేకపోయావా? ఎలా ఉన్నారూ?’’ తన మొహం మీద చికాకుని, విసుగునీ కమల చూసింది. దానికి తెలుసు తన మూడ్ పాడైపోతూందని.

“ఒకాయనేనండీ! ఒడ్డూ పొడుగూ దొరబాబులా ఉన్నాడు.” వచ్చినాయన గురించి చెప్పి పేరు కనుక్కోడానికి వెళ్లబోయింది.

ఏముందీ! ఏ స్టూడెంటు తండ్రో, అన్నో అయి ఉంటాడు. ఏ సీటుకోసమో, హాస్టలు గురించో అడగడానికి పొద్దున్నే వచ్చి ఉంటాడు. ఆదివారం ఉదయమే తలారా స్నానం చేసి మొదటి కప్పు కాఫీతాగి పడక కుర్చీలో పడుకుని ఇష్టమైన కావ్య పఠనం చేస్తూ ఉంటే పానకంలో పుడకలా ఎవడో ఈ మహానుభావుడు దొరబాబు వచ్చిపడ్డాడు. ప్రిన్సిపాల్ అయి కుర్చీలో కూర్చున్నప్పటినుంచి పోయిట్రీ లేదూ, పాడూ లేదు, బ్రతుకులో పోయిట్రీ జావకారిపోయినా తట్టుకుంది కాని, బాధ్యతల మధ్య కనీసం ఆదివారం పూటైనా గొంతెత్తి కవిత్వం చదువు కోడానికి వీల్లేక పోతూ ఉంటే ఎలా చావడం?

‘‘పేరూ అదీ కనుకోనక్కర్లేదులే. నేనే వస్తున్నా” అంటూ లేచింది.

పడకగదిలోంచి డ్రాయింగు రూములోకి వెళుతూ వెళుతూ డైనింగు టేబిల్ మీద ప్లవర్ వేస్ లో పువ్వులు సరిగ్గా లేనట్టు చూసి ఆగిపోయింది. లేస్తూనే తనే ఆ నలు చదరపు వేసుని సర్దింది. కిందికి పెట్టిన పువ్వు కొమ్మలు మరీ పొడుగైపోయి అందం పోయింది. ఆ పువ్వునీ,  కొమ్మల్నీ స్టెమ్ హోల్డరునుంచి తీసి అడుగు భాగాలు తెంచి మళ్లీ పెట్టింది. చిన్న తేడాతో ఎంత అందం వచ్చింది. నవ్వుకుంది. బ్రతుకూ అంతే. చిన్న చిన్న తేడాలతో చక్కదనాల సొగసుతో నిండనూవచ్చు. ఆ కొద్ది తేడాలు లేకపోతే బోసిపోయి వెలవెలలాడిపోనూవచ్చు. కొందరి చేతులు సొగసు పెంచితే, కొందరి చేతులు మసి చేస్తాయి!

డ్రాయింగ్ రూమ్ కర్టెను ఎత్తి లోపలకి అడుగు పెట్టి బొమ్మలా నిలుచుండిపోయింది. వచ్చిన పెద్దమనిషి నిల్చునే ఉన్నాడు. లిప్తపాటు తత్తరపాటుతో చూసి “మీరా?” అన్నాది. శేఖర్! పది హేనేళ్లు! ఒకటా రెండా? పూర్తిగా పదిహేను సంవత్సరాల తరవాత చూడ్డం.”

“పోల్చుకున్నారే!” అన్నాడు.

ఎందుకు పోల్చుకోలేదూ? నిజమే! పదిహేనేళ్లలో మనిషిలో మార్పు బాగానే వచ్చింది. ఒత్తుగా ఉంగరాల జుత్తుతో క్రాపు ఉండేది. ఇప్పుడు ముందు భాగం అంతా బట్టతలే. మిసమిసలాడే తెలుపు. విదేశంలో ఉండడం నుంచి ఇప్పుడా తెలుపులో మరోవన్నె ఎక్కువగా కనబడుతూంది. అందుకే లిప్తపాటు తత్తరపాటు. కాని ఆ కళ్లు, తీక్షణమైన కళ్లు, అందమైన కళ్లు, చురుకైన కళ్లు – వాటిని పోల్చుకోలేదూ? ఆ కళ్లని తను ఎప్పుడు మరిచిపోలేదు.

“కూర్చోండి. నిల్చున్నారేం!” అన్నాది.

తనవేపు రెప్ప వేయకుండా చూస్తున్న ఆ చూపుల్ని తను తట్టుకో లేకపోతూంది. ఆదివారం తల రుద్దుకుని, జుట్టు ఆరుతుందని జడ వేసుకోలేదు. తడిగా ఉన్న జుత్తుని అలాగే వదిలి పెట్టింది. ముడికూడా పెట్టుకోలేదు. మోకాళ్లవరకూ పడుతున్న తన జుట్టునీ, తనని మార్చి మార్చి చూస్తున్నాడు. అనుకోకుండా పమిటని నిండుగా జుట్టుమీద నుంచి కప్పుకుంది.

“మీరు అలాగే ఉన్నారు. ఏం మారలేదు,” అన్నాడు సోఫాలో కూర్చుంటూ. నిజమే. తను ఏమీ మారలేదు. అందరూ అదే అంటారు. నలభయ్యోపడి వచ్చినా జట్టు ఊడనూ లేదు – నెరవనూ లేదు. ఒళ్ళు వచ్చి వికృతంగా బస్తాలా అవనూ లేదు. తన పొడుగుపాటి నల్లని జుట్టుని చూసి అందరూ అడుగుతారు. “ఒక్క’’ వెంట్రుకన్నా నెరవలేదు. ఏం నూనె రాసుకుంటారూ?” అంటారు. “సన్నగా సలాగ్గా ఆవిడ అప్పటికీ ఇప్పటికీ ఒక్కలా ఉన్నారు. ఎంత చకచకా పనిచేస్తారు? మనం ఆవిడతో పనిచేయ్యలేం” అని తన ముందర తనని పొగుడుతారు. నలభై ఏళ్ళొచ్చినా, తెలియనివాళ్ళు తనకి ముప్ఫై ఏళ్ళనే అనుకుంటారు.

చిన్నగా నవ్వి ఊరుకుంది, ఈ పెద్దమనిషి దేశానికి ఎప్పుడు తిరిగివచ్చాడో! దేశం వచ్చినవాడు ఈ ఊరు ఎందుకు వచ్చాడో? ఈ ఊరు వచ్చి తన గురించి భోగట్టా చేసి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడా? తనని గుర్తుంచుకున్నాడా? మరిచిపోవడం కష్టమైన సంగతే! అయితే తన ఇంటికి రావడం ఆశ్చర్యమైన విషయమే!

“ముందు ఉత్తరం రాసి వద్దామనుకున్నాను. కాని రాయకుండా వెంటనే బయల్దేరి వచ్చేశాను. బాబులు మీరు ఇక్కడ వుమన్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉన్నారని, ఇల్లూ అదీ కట్టుకుని ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారనీ చెప్పాడు. నిన్న రాత్రి ట్రెయిన్లో వచ్చాను.’’

‘‘బాబులు? ’’

“అదే మన రామశాస్త్రి.”

బాబులు అంటే ముందు ఎవరో అనుకుంది రామశాస్త్రి ! అవును. ఆయన్ని ’బాబులు’ అని పిలిచేవారు.

“రామశాస్త్రిగారా? ఆయన ఇప్పుడు ఎక్కడుంటున్నారు ?”

‘‘బొంబాయిలో ఉన్నాడు. వాడుకూడా ‘నాతోపాటు వస్తాడనుకున్నాను, కాని వాడికి వీలుపడలేదు”

రామశాస్త్రి! శేఖర్ ని తీసుకువచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు. హాండ్ సమ్ ఇంజనీర్ అంటూ! అమ్మా నాన్నా అన్నయ్య-అంతా శేఖర్ని చూసి మురిసిపోయారు! వాళ్లేనా మురిసిపోయింది? తనో? తనని తానే మరిచిపోయింది.

తరువాత ఆ రామశాస్త్రి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తను పట్టించుకోలేదు. అవసరం ఏముంది! శేఖర్ తో పాటు రామశాస్త్రి బ్రతుకులోనుంచి పక్కకి తప్పుకున్నాడు. తను ఎక్కడుందో. ఏంచేస్తోందో, ఆఖరికి ఇల్లుకట్టుకున్న సంగతివరకూ అన్ని భోగట్టాలూ బొంబాయిలో ఉన్న రామశాస్త్రి తెలుసుకున్నాడా ! శేఖర్ రామశాస్త్రి దగ్గర భోగట్టా చేసి ఇక్కడికి వచ్చేడా? పదిహేనేళ్ళ క్రితం సంగతులు నిన్న మొన్న జరిగిన సంగతుల్లా కళ్లముందు కదులుతూ కనిపిస్తున్నాయి.

“కమలా! ఓ కమలా!” కేకేసింది.

శేఖర్ నవ్వేడు. “మీరు ఏమీ మారలేదు. కమలా ! ఓ కమలా ! ‘ఓ’ లేకుండా పిలవడం మీకు రాదుగా”.

శేఖర్ కి అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. అన్నయ్య తనని వెక్కిరించేడు. “అన్నయ్యా  ఓ అన్నయ్యా !” అంటుందనీ, రేపు పొద్దున్న మిమ్మల్ని “శేఖర్! ఓ శేఖర్!” అని పిలుస్తుంది సుమండి”అని వెక్కిరిస్తూ చెప్పేడు. శేఖర్ నవ్వేడు కాని తనకి నవ్వురాలేదు. ఆ విషయం జ్ఞాపకం వచ్చి బాధ అనిపించింది. “శేఖర్ ! ఓ శేఖర్ !” అని పిలిచే క్షణం రాలేదు. పెద్దవాళ్ళ భాషలో యోగంలేదు. పదిహేనేళ్లు గడిచిపోయేక, నడివయస్సు పై బడ్డాక శేఖర్ కేవలం పరిచయస్థుడు తప్ప ఏం కాడని ఎరిగాక ఇప్పుడు ఈ బాధ ఏమిటి? గుండెల్లో ఈ బాధ గిలిగింతతో “అమ్మో” అని కొట్టుకుంటూంది.

కమల వచ్చింది.

“రెండు కప్పులు కాఫీ తీసుకురా” అని కమలకి చెప్పింది.

“ఎన్నేళ్ళయిందో మీరు పెట్టిన కాఫీ తాగి ! కమల చేతి కాఫీనా నాకిప్పిస్తారు ?” అన్నాడు శేఖర్.

తను పెట్టిన కాఫీ బ్రహ్మాండమని శేఖర్ తెగ మెచ్చుకునేవాడు. అన్నయ్య స్నేహితులూ తన కాఫీకోసం ఆలాగే వచ్చేవారు. ఇప్పటికి తన స్నేహితులు అందరూ “కమల కాఫీ కాదు నీ కాఫీ కావాలి” అంటూ వంటింట్లో నిలబడి మరీ చేయించుకుంటారు. మీ చేతి కాఫీ తాగుతాను అని అంటున్న శేఖర్ లో పదిహేనేళ్ళ క్రితపు శేఖర్ కనిపించేడు. కాలం ఎంతమార్పు తెస్తుంది! ఆఖరిసారి శేఖర్ గాని కనిపించి ఉంటే తను కాఫీ ఇచ్చేదా? అప్పుడు ఆ క్షణాన్ని శేఖర్ అంటే ఎంత కోపం! అసహ్యం! ఒళ్ళుమంట! ఎంత స్వార్థపరుడు! మాటమీద నిలబడ లేని అప్రాచ్యుడు! ఎన్ని రకాలుగా అందరూ తిట్టారు!

ఇప్పుడు పదిహేనేళ్ళ తర్వాత, నలభయ్వోపడిలో ప్రిన్సిపాల్ హోదాలో, సోషల్ స్టేటస్ తో ఉన్న తన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించి పంపాలి. ఇన్నేళ్ళ తేడాయే లేకపోతే నిలువునా నిలబెట్టి తిట్టి దులపవలసినదంతా దులిపి పంపించి ఉండేది. ఇప్పుడు ఆ కోపంలేదు. తిట్టడం దుయ్యబెట్టడం మర్యాద కాదు. అవసరమూ లేదు.

తను లేచి లోపలికి వెళ్ళబోతూ ఉంటే- “మీ ఇల్లు నేను చూడొచ్చా? డ్రాయింగు రూములోనే కూర్చోవాలా?” అంటూ శేఖర్ లేచి నిల్చున్నాడు.

“అమ్మగారింటికి ఎవరూ రారు. ఆవిడా, ఆవిడ పుస్తకాలూ, ఆవిడ కాలేజీ, ఆవిడ తోటా మొక్కలూ తప్ప ఆవిడికి మరో ప్రపంచం లేదు. అడపాతడపా ఆవిడ అన్నయ్య వస్తాడు. అలాంటిది ఈ పెద్ద మనిషి ఎవడో ఇలా మాట్లాడుతున్నాడు!” కమల అనుకుని ఉంటుంది. దానికేం తెలుసు? ఈ పెద్దమనిషి అమ్మగారి బ్రతుకులో చిన్న చిచ్చు పెట్టి వెళ్ళి పోయేడని, నాటికి నేడు ప్రత్యక్షమయ్యేడని దానికేం ఎరుక!

“రండి లోపలికి. ఇల్లు చూడనా అని అడుగుతున్నారా? భలే వారే!” అంటూ శేఖర్ ని తీసుకుని లోపలికి వెళ్ళింది. మంచీ మర్యాదా మొహాన్ని పూత పూసుకుని ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటాయి, మనస్సు లోపల జరిగే మధనకీ, మొహం మీద రంగుకీ ఏం సంబంధంలేదు!

తన ఇంటినీ తననీ శేఖర్ చూడవలసిందే. ఒకప్పుడు తనని కాదని తోసిపుచ్చి వెళ్లిపోయినవాడు. చూడనీ, తనకాళ్ల మీద తాను నిల్చుని ఏ స్టేటస్ కి రైజ్ అయిందో ఎంత గొప్పగా బతుకుతుందో చూడనీ! తనవాళ్లకి డబ్బులేక, డబ్బు ఇవ్వలేక పోవడంవల్ల తనని కాదని శేఖర్ చదువుకోని అనాకారిని పట్టుకున్నాడు. చదువుకోని అనాకారికొంగుని బంగారం ఉంది. దాన్ని పుచ్చుకొని ఇంగ్లండు వెళ్ళేడు. పెద్ద ఇంజనీరై అక్కడే సెటిలయ్యేడని విన్నాది. పెళ్లాంతో దేశంవచ్చి ఉంటాడు. దేశం తిరుగుతూ తిరుగుతూ తన ఇంటికి వేంచేశాడు.

శేఖర్ ఇంగ్లాండు వెళ్ళిపోయేక, సంగతి తెలిసేక ఇంట్లో అందరూ శేఖర్ని తిట్టారు. “ఆ మాత్రం మాట నిలకడ లేనివాడు మన అమ్మాయిని చేసుకుంటానని మాటెందుకిచ్చాడూ?” అన్నారు. “మనమ్మాయి దగ్గరికి రోజూ సాయంత్రం పూట ఎందుకు హాజరయ్యేవాడూ?” అన్నారు. “అంతా డబ్బు, డబ్బులో ఉంది మహాత్మ్యం అన్నారు. “డబ్బే కావాలని సరిగ్గా ఏడిస్తే ఇల్లు అమ్మి అయినా ఇచ్చేవాణ్ణి. పిల్లదాని సుఖం కోసం ఏమన్నా చేసి ఉండేవాణ్ణి!” అని నాన్న బుర్ర మొత్తు కున్నారు. కట్నం గట్రాలతో పనిలేదని శేఖర్ని పరిచయం చేసేరు. శేఖర్ రంగు ఇలా తేలేసరికి “కాలికి బలపం కట్టుకుని తిరిగి వాడి తాతలాంటి సంబంధం తేకపోతే చూడు” అని ప్రతిజ్ఞ పట్టేరు. కాని తన మొండితనం దగ్గర ఎవరిమాటా చెల్లలేదు. ససేమిరా తను పెళ్లి చేసుకోను కాక చేసుకోను అంది! “వాడంటే అలాంటి అప్రాచ్యుడు. అందరూ అలాంటి వాళ్లుటే!” అని తెగ నచ్చచెప్పబోయేరు. “అదో శిఖండి! ఇంక వదిలెయ్యండి దాని ఖర్మ ఎలా వుంటే అలా ఏడుస్తుంది” అని ఓ జోత పెట్టేసేరు. ఇదిగో దాని ఫలితం తను సంఘంలో తనకి తానుగా, ఓ కళాశాల ప్రిన్స్ పాలుగా, మంచి వ్యక్తిత్వం ఉన్న చక్కని ఎడ్మినిస్ట్రేటర్ గా, మంచి మేడమ్ గా, చుట్టూ ఉన్న వాళ్లకి దయగల తల్లిగా పేరూ ప్రతిష్ఠా తెచ్చుకుంది. ఇప్పుడు ఇల్లుకూడా కట్టుకుంది! ముందుకు చక్కని తోట, మంచి లైబ్రరీ. చేతినిండా కావలసినంత పని. తన హితాభిలాషులందరికీ ఆశ్చర్యమే ! ఇంత చక్కటి ఆవిడ, ఇంత మంచి మనస్సుకలావిడ, అంత నేర్పుతో ఇంటాబైటా పనిచెయ్యగలిగే ఆవిడ పెళ్ళి చేసుకోలేదేమీ? అని! ఆవిడ ఎంచక్కటి గృహిణి అయి ఉండేది. మగవాళ్లు దౌర్భాగ్యులు” అని వాళ్లలో వాళ్లు తనకి వినిపించేటట్టుగా కూడా వాపోతూ ఉంటారు. చూడనీ శేఖర్ని-తనని, తన ఇంటిని, తన స్టేటస్ ని. తన వ్యక్తిత్వాన్ని! పెళ్ళి ఒక్కటే ఆడదాని జీవితంలో మహత్తరమైన విషయం కాదనీ, బ్రతుక్కి కావలసినవి అందం, సొగసూ అనీ తెలుసుకోనీ! డబ్బే ప్రధానం కాదని తెలుసుకోనీ.

డైనింగు రూములో టేబిలు మీదున్న పువ్వుల్ని చూస్తూ శేఖర్ చాలాసేపు నిలుచుండిపోయేడు. “పువ్వుల అమరిక బాగుంది. ఎంతో బాగుంది” అని మెచ్చుకున్నాడు. “ఇకోబినా నేర్చుకున్నారా?” అన్నాడు. పువ్వుల్ని ఎలా అమర్చాలో చెబుతూ చిన్న తేడాలతో ఎంత అందం వస్తుందో తను బోధపరిచింది పొడుగ్గా పొట్టిగా కాడల్ని ఎలా కత్తిరించాలో తెలుసుకోవాలని చెప్పింది.

“నిజమే ! మీరు చెప్పింది అప్పుడప్పుడు బతుకుల్ని కూడా కత్తిరించి మళ్ళీ అమర్చుకోవలసి వస్తుంది. వికారంగా ఉన్న బతుకుని కత్తిరించి అందంగా చేసుకోవాలి.” అన్నాడు శేఖర్.

ఎందుకలా అన్నాడో !

“ఇది బెడ్ రూమ్. ఆ పక్కది గెస్ట్ రూమ్.”

“ఇది బెడ్ రూమా ! రీడింగ్ రూమో, లైబ్రరీనో అనండి. చాలా పుస్తకాలు కలెక్టు చేశారే” అంటూ శేఖర్ పుస్తకాల రాక్ చూడ్డం మొదలు పెట్టేడు నిజమే, తన బెడ్ రూమ్ నిండా పుస్తకాలే. తను తడువుతూ వదిలిపెట్టిన మోడరన్ పోయిట్రీ ఏంథాలజీని తీసుకుని శేఖరు పడక కుర్చీలో కూర్చున్నాడు.

“మీ ఇల్లు చాలా బాగుంది. మరి కాఫీ ఇస్తారా ?” అన్నాడు.

ఎంత మామూలుగా ఎప్పుడూ వస్తూ పోతూ ఉండే స్నేహితుడిలా చనువుగా అడుగుతున్నాడు. జరిగిపోయినదానికి, తాను ప్రవర్తించినదానికీ ఎక్కడా సిగ్గుపడుతున్నట్టు లేదు. అయినా ఇన్నేళ్ళ తరవాత అప్పటి తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పుకుంటాడా?

“ఓ ష్యూర్ !” అంటూ తను వంటింట్లోకి వెళ్ళిపోయింది.

కాఫీ పెడుతున్నంతసేపు పాతరోజులే కళ్ళముందు తిరిగాయి. శేఖరుకి బట్టతలైనా అందంగానే ఉన్నాడు. శేఖరంటే తన మనస్సులో ఇంకా బలహీనత ఉందా? అందుకే బట్టతలా అందంగా కనిపిస్తూందేమో! ఛత్ ! తనకేం బలహీనత! బలహీనతంటూ ఉంటే ఎవణ్ణో ఒకణ్ణి కట్టుకుని, పిల్లా పాపా కనుకుని సంసారాన్ని ఈడ్చేది. శేఖర్ ఎవడో ఒహడు ఎలా అవుతాడు ? శేఖర్ కాబట్టే బలహీనత ! మనస్సు ఎదురు సమాధానం చెబుతుంది.

శేఖర్ పెళ్ళాం ఎలా ఉందో ? పెళ్లాన్ని కూడా తీసుకువస్తే తను చూసి ఉండేది. పిల్లాపాపా ఉండి ఉంటారు. దేశం ఎప్పుడు వచ్చాడో ? ఎన్నాళ్ళు ఉంటాడో ? శేఖర్ని తను ఏమీ అడగలేదు.

కాఫీ తీసుకుని తను వెళ్లేసరికి కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. పుస్తకం గుండెల మీద ఉంది. తను వచ్చిన సడి విని కళ్ళు విప్పేడు. కళ్ళు చెమర్చి ఉన్నాయి. శేఖర్ బాధపడుతున్నాడన్న మాట! “నో గ్రీవెన్సెస్ ఫర్ ది పాస్ట్ !” అని చెప్పాలనిపించింది. మాట్లాడకుండానే కాఫీ తాగాడు. తనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా మధ్య మధ్య శేఖర్ వేపు చూస్తూ కాఫీ తాగింది. తను చేసిన కాఫీని ఎంజాయ్ చెయ్యవలసినంతా ఎంజాయ్ చేసేడా? జేబులోంచి సిగరెట్టు తీసి “విత్ యువర్ పెర్మిషన్” అన్నాడు. చిన్నగా బుర్ర ఊపింది. పదిహేనేళ్ళ క్రితపు సంభాషణే !

“యాష్ ట్రే లేదూ?” అటూ ఇటూ చూసి అడిగేడు.

“యాష్ ట్రే కొనవలసిన అవసరం రాలేదు!” అన్నాది.

“సిగరెట్లు తెగకాలుస్తూ ఉంటే – ఇహ తప్పేటట్లు లేదు” ఓ యాష్ ట్రే కొనాలి” అన్నాది. ఇంట్లో అన్నయ్యా కాల్చడు. నాన్నా కాల్చరు.

“మరి తొందరగా కొనేసేయండి!” అన్నాడు, పదిహేనేళ్ల క్రితపు సంభాషణ!

శేఖర్ తనవేపు చూసేడు. ఏమనుకున్నాడో ఏమో ముట్టించిన సిగరెట్టుని నలిపి ఆర్పేశాడు.

“మీరు నాతోపాటు ఓసారి గెస్ట్ హౌస్ కి రావాలి. వస్తారా?” అన్నాడు.

“గెస్ట్ హౌసా?

‘‘గెస్ట్ హౌస్ లో దిగేం. మీరు నాతో రావాలి.”

“ఫామిలీతో వచ్చారా? అయితే అందర్నీ తీసుకు రాలేదేం!” అడిగింది.

“ముందు తీసుకువద్దామనే అనుకున్నాను. కాని ఇన్నేళ్ల తరవాత కలుస్తున్నాం కదా అని తటపటాయించాను. మిమ్మల్ని తీసుకు వెళ్దామని అనిపించింది.”

తను వెళ్లాలా? అక్కర్లేదా? రాను అని బ్లంట్ గా ఎలా చెబుతుందీ? ఏం చెప్పి ఎలా తప్పించుకుంటుంది? తీరా వెళ్తే ఆ భార్య ఎలా బిహేవ్ చేస్తుందో? భార్యతో ఏమని చెప్పేడో? తిన్నగా ఇక్కడికి తీసుకువచ్చి పరిచయం చేస్తే బాగుండేది కదా! తప్పదు! వెళ్లాలి! వెళ్లి చూడాలి! చూడాలన్న కోరిక మనస్సుకి గట్టిగానే ఉంది. గెస్ట్ హౌస్ కి వెళ్లింది.

“రండి. ఈ రూములో దిగేం” అంటూ లోపలికి తీసుకువెళ్లాడు. గదిలో ఎవరూ లేరు. మంచం మీద రెండేళ్ల పిల్లవాడు నిద్రపోతున్నాడు. మంచం దగ్గరికి వెళ్లి పిల్లవాణ్ణి చూస్తూ నిల్చుంది. పిల్లవాడు బొద్దుగా అందంగా ఉన్నాడు. ఉంగరాల జుత్తు. తండ్రి పోలికే. నిద్దట్లో నవ్వుతున్నాడు. శేఖర్ వేపు తిరిగింది. శేఖర్ తన వేపే చూస్తున్నాడు.

“కూర్చోండి”

మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని అటూ ఇటూ చూసింది. ఇంకెవరూ ఎక్కడా ఉన్న సడిలేదు.

“బాబు మదరేరి ?

“బాబుకి ఫాదరూ, మదరూ నేనే !”

“వ్వాట్?” అని శేఖర్ వేపు చూస్తూ ఉండిపోయింది.

“తల్లిని చంపి వాడు పుట్టేడు.”

ఆ పసివాడు హాయిగా, నిశ్చింతగా నిద్రపోతున్నాడు. తాను పూర్తిగా దేశం వచ్చేసినట్టూ జాబ్ లో ప్రవేశించినట్టూ, పిల్లవాణ్ణి పెంచడానికి ఎవరికీ ఇవ్వడం తనకిష్టం లేనట్టూ, మనస్సులో కొట్టుమిట్టులాడి కొట్టుమిట్టులాడి రామశాస్త్రి దగ్గరికి వెళ్లినట్టూ, రామశాస్త్రి ద్వారా తన ఎడ్రసు కనుక్కువచ్చినట్టూ చెప్పేడు. “

అంతా చెప్పి ఆఖరికి “యాష్-ట్రే తొందరలో కొంటారా?” అన్నాడు.

తను శేఖరువేపూ, మంచం మీద పడుకుని నిశ్చింతగా నిద్రపోతున్న పిల్లవాడివేపూ మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది.

శేఖరు శేఖరే! ఎన్ని సంవత్సరాలైనా శేఖరు శేఖరే! తను నిర్ణయం చెయ్యవలసిన క్షణం మరోసారి బ్రతుకులో వచ్చింది. ఈ నిర్ణయంతో బ్రతుకు మళ్లీ మరో మలుపు తిరగుతుంది. ఈ తిరిగే మలుపు నడికాలంలో అందమైన మలుపే అవుతుందా? శేఖరు శేఖరే! ఎన్నాళ్లయినా శేఖరు శేఖరే!

ఓ నిమిషం, రెండు నిమిషాలు, మూడు నిమిషాలు, ఐదు నిముషాలు … శేఖరు  తనవేపే చూస్తున్నాడు.

“ఐయామ్ సారీ శేఖర్! నా ఇల్లు చాలా చిన్నది. యాష్-ట్రే పెట్టడానికి జాగా లేదు!” అన్నాది.

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.