కొత్త అడుగులు-4

ఆత్మగల్ల కవిత్వం

– డా|| శిలాలోలిత

రమాదేవి బాలబోయిన ఈతరం కవయిత్రి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కవిత్వరంగంలో ఎందరెందరో వెలికివస్తున్న కాలంలో ఎన్నదగిన కవయిత్రి ఈమె. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైనప్పటికీ, ప్రవృత్తిరీత్యా కవయిత్రి. సామాజిక కార్యకర్త. ‘సాంత్వన’ అనే సేవా సంస్థను నడుపుతున్నారు. చాలా మందికి బాసటగా, ఊరటగా నిలబడ్డారు. తనవంతు సాయం అందించడమనేది మనిషిగా తన కర్తవ్యం అని భావించే వ్యక్తి. రాష్ట్ర నలుమూలలలో తననెరిగిన వారందరూ ఆమెను గౌరవించిన తీరులో ఆమె వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తోంది.

ఇక, రచనా విషయానికొస్తే, ‘ప్రాణం వాసన’ అనే పేరు పెట్టుకున్న కవిత్వాన్ని నాదృష్టికి తెచ్చింది. తెలంగాణ నుడికారం భాషా సొబగులతో కొన్ని కవితలున్నాయి కవిత్వ వస్తువుల్లో విభిన్నత వుంది. తన చుట్టూ ఉన్న సమాజం గురించి తనదైన దృష్టితో వ్యక్తీకరించినవే ఎక్కువున్నాయి. సమాజంలో వృద్దురాలైన ఒక తల్లి పట్ల సంతానం చూపే నిరాదరణను సహించలేక పోయింది. ఇదే ఇతివృత్తంతో మూడు, నాలుగు కవితలు రాసింది. ‘యాదికున్నదా బిడ్డ’ కవితలో తల్లి కడుపున పడ్డ కాడ్నుంచి, కని, పెంచి, పోషించి పెళ్ళి చేసిన తరువాత కూడా ఆ తల్లిని వృద్ధాశ్రమం పాలుచేస్తే, ఆమె అంటుందప్పుడు

ఇదొక్కటన్న యాదుంచుకో

నేనుండగలుగుతున్నా బిడ్డా నీకోసం

నీగతి కూడా ఇలాగే అయితే మాత్రం

ఈ అమ్మ గుండె తట్టు కోలేదనే సత్యం ! (యాదికున్నదా బిడ్డ)

అనడంతో కవిత పూర్తయిపోతుంది. ఈ తల్లులకి ఇంత క్షమాగుణం ఎందుకు? ఎక్కడ్నించి వస్తుంది ? అనిపించకమానదు.

మనం చిన్నప్పుడు చదువుకున్న కథల్లో, ప్రియురాలి కోరిక మేరకు ఒక కొడుకు తన తల్లి గుండెను కోసి తీసుకెళ్తున్న క్రమంలో రాయి తగిలి కిందపడ్తాడు. వెంటనే అరచేతిలో నెత్తురోడుతున్న తల్లి గుండె ‘నాయినా ! దెబ్బతగిలిందా’ అని అడగడంతో కథ పూర్తవుతుంది.

మనిషితనం కోల్పోయిన మనిషిని

‘ప్రాణం వాసన గొడ్తలేదు

పీనుగ కంపు తప్ప’ అంటుంది.

రైతు జీవనాన్ని చెబుతూ రైతన్నను ఆకుపచ్చ జాబిల్లైతడు, అన్నం ముంద్దైతడు అని సరికొత్తగా ఊహిస్తుంది.

సమాజంలో మార్పు రావాలంటే దృష్టిలోపం ఉండకూడదు. మానసిక చైతన్యం ఉండాలి. స్త్రీని చూసే దృష్టిలోనే మార్పు రావాలన్న ఆకాంక్షను చెప్పింది, సూటిగా ప్రశ్నలు వేసింది. చివరి స్నానపు బరాత్ ను ఎంతో హృద్యంగా చిత్రించిన కవిత ‘స్నానం పూర్తయింది’. తన చుట్టూ ఉన్న బ్రతుకులే ఆమె రచనల్లో భాగమయ్యాయి. చూడగలిగే మనసుంటే వినగలిగే చెవులుంటే ఒక్క ఉదయమే చాలు పెక్కు బ్రతుకు కథల్ని పరిచయం చేస్తుందంటుంది. పుస్తక ప్రేమికురాలీమె. అందుకే ‘అక్షరాలతో సోపతి’ చేయగలిగింది. ‘మనుగడ కోసం పోరాటం’ సలుపమని అస్తిత్వాన్ని సాధించే దాకా ఆగని ఒంటరి యుద్ధం చేయమని విడమర్చి చెబుతుంది. జెండర్ డిస్క్రిమినేషన్ గురించి చాలా స్పష్టంగా, సూటిగా, వ్యంగ్యంగా రాసిన కవిత “శనార్తులు చేసుకుంట అడుగుతాన.”

భరించలేని ఆకలితో దొంగతనం చేసారన్న నేరం మోపి నలుగురు కలిసి చంపేసిన అతన్ని తలుచుకుంటూ కన్నీళ్లని కవిత్వంలో ఒంపింది.

 ఇల్లంటే ఒక్క ఇల్లుకాదు లోకపు ఇల్లు

గడపదాటిన ప్రాణం గడపలొకొచ్చేదాక

ఎదురుచూస్తూ కొన్ని కళ్ళు

లాంతర్లు వెలిగించుకుని ఆ గడపలోనే… (హృదయాంతరం)

ఇది స్త్రీకి వర్తిస్తుంది. విప్లవవీరుడికి వర్తిస్తుంది. పట్నమొచ్చి ఆగమైపోయిన బతుకులకీ వర్తిస్తుంది. ఇలా ఏకకాలంలో విభిన్న భావాలను ఈ కవిత కళ్ల ముందుంచుతుంది.

‘హృదయాంతరం’ కవితలో. అలాగే ఆడపిల్లల పట్ల చూపించే వివక్షారూపాన్ని వేదనా రూపంలో (నేరం నాది కాదు) ప్రశ్నించింది. స్వయంబంధీయై ఉన్న స్త్రీలు బయటపడాలంటుంది. ఆమెకి పొగరంటారు కాని ఆత్మ విశ్వాసంతో గౌరవం కోసం పోరాడుతున్నదని అనుకోరు. మానసికంగా ఒంటరి దశనుంచే స్త్రీ, పురుషులు సమానమనే స్థితి వరకు పోరాడాలంటుంది.

మనుషుల్లో

ఉన్న ‘ద్విముఖ’ రూపాల్ని మరో

కవితలో బట్టబయలు చేసింది. జీవన సందేశాన్ని వినిపిస్తూ స్త్రీ ఔన్నత్యాన్ని ‘కాలం సాక్షి’ గా

నిరూపించిందందులో.

అందుకే…

నీ మౌనం

కాలం సాక్షిగా ఓ విస్ఫోటనం

నీ నడక

యావత్ ప్రపంచానికి ఓ మార్గం

నువ్వు

నడిచివచ్చే ఓ అద్భుతానివి

అని చాలా నిజాయితీతో రాసింది. ‘లేక లేక ఓ లేఖ’… కన్నీళ్ళు తెప్పించే కవిత. అత్తింట కూతురు పడుతున్న నరకాన్ని కన్నీరునిండిన అక్షరాలలో చూసిన పుట్టింటి వారి ఆవేదనా రూపమది. అసిఫా మీద రాసిన కవితలో కూడా కవయిత్రి కన్నిళ్ళు అక్షరాలై కనిపిస్తాయి. గుచ్చుతున్న జ్ఞాపకాల అంపశయ్య కు కూడా ఆలోచనాత్మకమైన కవిత. స్త్రీని దేహంగా తప్ప మరింకెలాగు చూడలేని వెకిలి చూపుల్ని గురించి ‘జ్వలిత దేహం కవిత రాసింది. బహుజనుల సావిత్రీబాయి అచంచలమైన దీక్షను గురించి మంచి కవిత రాసింది.

“నిన్ను ప్రేమిస్తున్నాను” అని ఓ కవిత ఉంది. భావ కవిత్వం రోజులో “ప్రియుడా అని సంబోధిస్తూ రాస్తే అదొక పెద్ద సంచలనమయ్యేది. 1930 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామ క్రమంలో స్త్రీల రచనలలో సాధించిన స్వేచ్ఛను స్పష్టంగా గమనించవచ్చు మనం.

ప్రేమంటే శారీరక ఆకర్షణ కాదు

మానసిక సంతులత

ప్రేమంటే యవ్వన ఉద్రేకాలు కాదు

ఎన్నో జన్మల పసిడి పంట

అది తెలిసిన నిన్ను నేను ప్రేమిస్తున్నాను

ఒక మనిషిగా ప్రేమిస్తున్నాను…

“నే’బాల’నోయి కూడా ప్రేమను వ్యక్తీకరించిన మరో కవితే.

స్త్రీ శక్తిని ‘అన్నీతానే ఐన ఆమె’ కవితలో చాలా బలంగా, స్పష్టంగా వ్యక్తీకరిస్తుంది. నెల పింఛనుకు తప్ప మల్ల రాకపోతివే అంటూ ముసలితల్లి రూపాన్ని కన్నీటిలో ముంచి తానే ఆమైన విధంగా రాసిన కవిత అది. రమాదేవి కవిత్వంలో జీవితం వుంది. జీవన క్రమం వుంది.

జీవితేచ్ఛవుంది. అందుకే దేనికదే ప్రతికవితా ప్రాణాలతో మనముందు నిలబడి మట్లాడుతుంటాయి. ఆడపిల్లను నువ్వెంత నిర్లక్షంగా చూసినా నీ బతుక్కు ఊతమయ్యేది ఆడపిల్లే అనే నిజాన్ని చెప్పింది ఒక చోట.

బ్రతుకు రంగోళి కవితలో సూర్యుని విన్యాసాలన్నింటిని కవితాత్మకంగా నారింజ రంగు బట్టలేసుకొని, బంగారు రంగు సొమ్ములేసుకుంటడు అని రాసింది.

కవిత్వపు చిక్కతనం ఉంది ఇందులో స్త్రీ జీవితంలో పోరాడి పోరాడి అలసి పోయిన స్థితిని తెలిపిన కవిత ‘అలిసిపొయ్యా’…

చదువుకున్న మా అన్నలకు అయ్యకు సుతా అంతా అర్ధం చేసుకునే మనస్సులేక పాయే బడికి పంపనీకి బయటికి పంపనీకి బతుకంతా తుమ్మముల్లు లెక్కాగుచ్చుతున్న బాధలతో అలసి పోయాం. ఇలా ప్రాణవంతమైన తెలంగాణ భాషలో ఎంతో వేదనార్తులతో చెప్పడం రమాదేవి ప్రత్యేకత. ఫీలింగ్స్ బాగున్నాయి. అనుభూతులు అర్ధవంతంగా వున్నాయి. కవిత్వంగా మలిచే క్రమంలో మరికొంత ప్రయత్నం అవసరం. ఇవి తొలి అడుగులు. చిరు ప్రాయపు తప్పటడుగులు పడి లేచే కెరటాలు. పట్టుదలతో పయనించే అడుగులు. ఓడిన ప్రతీ సారీ, అలసిన ప్రతీ సారీ, లేచి గెలుపు సాధించి విజేతగా సాగాలనే నా ఆశ. తొలి ప్రయత్నం లోనే వస్తువును ఎన్నుకున్న తీరు తాను అక్షరాలు సమాజంతో సంభాషించే తీరు అభినందించతగినవి. ‘నీకు నాకు మధ్య’ ఎలాంటి శబ్దాలు స్పందనలు ఉండవు. అదే నిశ్శబ్ధయుద్ధంలాంటిదంటూ భార్యా భర్తల మధ్య ఉండే అనుభూతి రాహిత్యాలను తేట తెల్లం చేస్తుంది. బాల్య వివాహాల వల్ల చితినెక్కిన బాల్యం తీరవుతుందని నిజాల మూటలు విప్పింది అందులో తూరుపు పిట్ట గురించి కొత్తగ చెప్పింది.

ఒకటి మేల్కొంటి

మరొకటి నిశ్శబ్దమౌతూ

కాలాన్ని చలనపరుస్తూ

లోకానికి వెలుగునిస్తాయి (తూరుపుపిట్టలు)

పసి పిల్లల మీద రెండు, మూడు కవితలు రాసింది. రజస్వల అయిన పాపపై ఒక్క సారిగా కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు అందరూ చూసే చూపులలో మార్పు ముట్టుకోకూడదని

దూరంగా ఉంచడం పాపిష్టిదని సంబోధించడం కవితగా మలిచింది. ఆ చిన్నారి పాప పై ఎంత మానసిక ఒత్తిడి ఉందో చెప్పింది “ముట్టుకోకు” కవితలో.

గతంలో అంటే 75లో వాణి రంగారావు గారు ముద్దమందారం అని తొలిసారిగా కవిత రాసారు అప్పట్లో అది పెద్ద సెన్సేషనల్ తరువాత కె. గీత, “నేను ఋతువునైన వేళ” రాసింది. ఆ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, భయాల గురించి రాసింది. తర్వాత తర్వాత చాలామంది ఈ అంశాన్ని తీసుకొని రాసారు. అది నీచమూ, పాపమూ కాదని శారీరక చర్య మాత్రమేనని. స్త్రీకి పునఃసృష్టి చేసేందుకు అర్హతను సంపాదించుకోవడమేనని అవగాహన కల్పించే ప్రయత్నం చేసారు.

” కొంరమ్మ బ్రతుకు తెల్లారింది.” అంటూ జీవిక కోసం పల్లీలు అమ్ముకొని బ్రతికిన స్థితినీ, రాని కొడుకు కోసం కన్నీళ్లు కార్చి మరణించిన వైనం చదివిన వాళ్ళను ఆలోచింపచేస్తుంది.

‘అందెశ్రీ’ రాసిన “మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు” అన్న పాట గుర్తొచ్చేట్లుగా ‘మనిషి కరువైతుండు’ అనే కవితలో ఆవేదన రూపం ఇచ్చింది. తన తల్లి యశోదమ్మను తలుచుకుంటూ రాసిన కవిత ఆర్ధంగా ఉంది.

తాను చూసిన అనేకుల జీవితాలు తనను అల్లకల్లోలం చేసినపుడు ఆ సంఘర్షణలోంచి పుట్టిన భావోద్వేగాలను కవితలుగా మన ముందుకు తీసుకువచ్చింది. ఇవన్నీ ఆమె నిండిన గుండె చెరువు నుండి అలుగు పారిన భావజలాలు. ఉవ్వెత్తున ఎగిసి పడి లేచిన కవిత్వపు అలలు.

ఇంత మంచి కవిత్వాన్ని చదివే అవకాశాన్ని కల్గించినందుకు సంతోషపడూ మరింతగా ఎదగాలని అభిలషిస్తున్నాను.

 

లేక లేక ఓ లేఖ

బయట గేటుకు

వేలాడదీసిన నా చూపులకు

ఘనీభవించి కణతలకి తాకాయి కనుగుడ్లు

 

ఎండిపోయిన కళ్ళలో జీవం కరువై

నిస్తేజంగా మారి వ్యాకులపడిపోతున్నాయి

ఎదురుచూపులకి ఓ బహుమతిలా

కన్నకూతురు రాసిన ఓ లేఖ

 

కనగానే సరిపోదు

కాస్త ఇంగితజ్ఞానం ఉండాలి మీవాళ్ళకు

అన్న అత్తమాటను మెత్తగా రాసేసింది కూతురు

 

పెట్టుపోతలకు పెట్టే సరిపోతలేదు గాని

పైకమేమన్నా పంపేదుందా మీవాళ్ళు

అన్న భర్తమాటను భయంభయంగానే రాసింది కూతురు

 

రాకపోకలేనా కాస్త రూకలేమన్నా రాలుస్తారంటావా

పెళ్ళికైన ఋణం దీర్చేదెవడటా

అన్న మామ మాటను మహాఘాటుగా రాసింది కూతురు

 

ఇన్ని మాటలు గుండెను గుచ్చలే గాని

అక్కడక్కడ అక్షరాలు నీటితడికి అలుక్కుపోయినట్లు కనబడతానై

అవి నా చిట్టితల్లికి నాపై ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ

లేక లేక

వచ్చిన ఆ లేఖ పై రాల్చిన

కన్నీటిబొట్లనేది అర్ధమై గునపంలా గుచ్చాయి…

 

బతుకు పుస్తకంలో

అనుభవాల

చిట్టా అనుకుంటా

అత్తరు వాసనలకు బదులు

నెత్తురు వాసన కొడుతోంది…

 

జ్ఞాపకాల

దొంతర్లన్నీ

అంతరంగాన్ని

చీల్చుకు బయల్పడి

ఒక్కొటిగా ఒదిగిపోతున్నాయి

నల్లని అక్షరాల సాక్షిగా గతించిన కాలం తిరిగిరానంది

గమనానికి సూచనలిస్తానంటూ

అడుగడుగూ అతిజాగ్రత్తగా వేయమంది

 

కలం

ఎర్రసిరాను నింపుకుని

నిమిషానికో పేజి లిఖించబడుతున్నది

తిరిగేసిన పేజి చదివేటంతలోనే

జీవితానుభవసారం అశ్రువులుగా

ఆనంద బాష్పాలుగా తనలో నింపుకుంటూ

మరో పేజీ మొదలవుతుంది.


*****

Please follow and like us:

One thought on “ కొత్త అడుగులు-4 (రమాదేవి బాలబోయిన)”

  1. కొత్త అడుగులు లో,రచయత్రి పరిచయం, వారి కవితలు బాగున్నాయి..!ధన్యవాదాలు శిలాలోలిత మేడం!💐💐

Leave a Reply

Your email address will not be published.