మరల సేద్యానికి  –  శివరాం కారంత్ (1902-1997)

-అనురాధ నాదెళ్ల              

                                     ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ భారతదేశపు అగ్రశ్రేణి రచయితల్లో ఒకరు. ఆయన సాహిత్యంతో పాటు యక్షగానకళ ఉధ్ధరణకు, వితంతు పునర్వివాహాలకు, పర్యావరణ సంరక్షణకు ఉద్యమాలను నడిపారు. నవలలు, నాటికలు, పిల్లల సాహిత్యం విస్తృతంగా రాసారు. వీరికి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అనేక విశ్వవిద్యాలయాల డాక్టరేట్లు, పద్మభూషణ్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి ఎన్నో గౌరవాలు దక్కాయి. 

                                       ఈ నవల దాదాపు మూడు వందల పాతిక పేజీల నవల. దీనిని కేవలం ముప్ఫై రోజుల్లో రాసారు. ఇది పూర్తిగా మంగుళూరుకు చెందిన మాండలికంలో రాయబడి, 1968 నాటికి ఏడు ముద్రణలు పొందింది. తెలుగులో ప్రథమ ముద్రణ 1977 లో సాహిత్య అకాడమీ ద్వారా జరిగింది. దీనిని మరింతమందికి చేరువ చేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు 2015 లో తిరిగి ముద్రించటం జరిగింది. 

                                      ఈ నవలని శ్రీ తిరుమల రామచంద్రగారు తెలుగులోకి అనువదించారు. నిఘంటువుల్లో కూడా దొరకని కొన్ని మంగుళూరు మాండలిక పదాలను కన్నడంలోంచి అందమైన, సరళమైన రూపంలో తెలుగులోకి తీసుకొచ్చి దీనిని తెలుగు నవలే అన్నంత సహజంగా తీర్చిదిద్దారు. 

                                      ఈ పుస్తకానికి శ్రీ వకుళాభరణం రామకృష్ణగారు చక్కని పరిచయం రాసారు. వీరి మాటల్లో చెప్పాలంటే ఒక వంద సంవత్సరాల క్రితం భారతీయ సమాజాన్ని ఈ నవల కళ్లకు కట్టినట్టు చూబిస్తుంది. ప్రజలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆధారంగా జీవిస్తూండేవారు. గ్రామాలన్నీ చాలావరకు స్వయం పోషకంగా ఉండేవి. ప్రజల అవసరాలు, ఆశలు కూడా తక్కువగానే ఉండేవి. 

                                    అప్పుడప్పుడే పట్టణ చదువులు, కాలేజీ చదువులు సంపన్నులకి అందుబాటులోకి రావటం మొదలైంది. మధ్యతరగతి వారికి ఈ చదువులు ఖరీదైనవే అయినా ఇంగ్లీషు చదువులు మంచి ఉద్యోగాల్నిచ్చి ఆర్థికంగా మెరుగైన జీవితాల్నిస్తాయన్న ఉద్దేశ్యంతో వీటికి ఆదరణ పెరగటం, ఆ క్రమంలో పట్టణీకరణ మొదలవుతూ వచ్చింది. పూటకూళ్ల ఇళ్లు మాయమై హోటళ్లు వెలిసాయి. వెనుక వదిలివచ్చిన ఇంటి సభ్యులతో, గ్రామాలతో అనుబంధం తగ్గుతూ పట్టణజీవితాల్లో అనేక దుర్వ్యసనాలు ప్రారంభమయ్యాయి. 

                                         నవలలో ఒకచోట రచయిత “ఇంగ్లీషు చదివితే ఇంటివారే పరాయివారవుతారు” అంటారు. ఈ పరాయీకరణ (alienation) ఎలాటి ఫలితాల్నిచ్చిందంటే దైహిక శ్రమపై చిన్న చూపు, పల్లెటూరి జీవితంపై ఏవగింపు, దుబారా ఖర్చులు, తెంపరితనం లాటివి పెద్ద చదువులు చదువుకున్నవారిలో కనిపించటం మొదలైంది. తరాలు మారుతున్న కొద్దీ ముందుతరాలు మంచి అనుకున్నది తర్వాత పనికిరాకుండా పోవటం మొదలైంది. 

                                       వంద సంవత్సరాల క్రితమే సమాజంలోని ఇలాటి మార్పుకు పట్టణీకరణ కారణమైందంటే ఇప్పటి మన జీవనశైలి ఆశ్చర్యం కలిగించదు. కౌలు కి భూమిని ఇవ్వటం పట్టణాల దారి పట్టటం అప్పటికే మొదలైంది. 

మన గ్రామాల్లో ఇప్పుడు జీవన పరిస్థితులు మారాయి. చదువులు పేరుతో, ఉద్యోగాల పేరుతో గ్రామాలు వదులుతున్నారు. వర్షాధారమైన మన వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోతోంది, సహజంగానే దానిపట్ల శ్రధ్ద తగ్గింది. గ్రామాల్లో పనులు లేక పని వెతుక్కుంటూ పట్టణదారి పట్టే వారి సంఖ్య బాగా పెరిగింది. 

ఇలా వలసలు వెళ్లినప్పుడు వారికి పట్టణాల్లో మౌలికమైన సౌకర్యాలేవీ లేవు. తలదాచుకుందుకు నీడలేదు. పనులూ అంతంత మాత్రమే. ఇలాటప్పుడు తిరిగి గ్రామాలకు వెళ్లే అవకాశం లేక, జీవిక దొరికే మార్గం లేక కుటుంబాలు విచ్ఛిన్నం అవటం, వ్యసనాలకు అలవాటుపడటం, మంచి చెడుల మధ్య అంతరం పట్టించుకోక మరింతగా జీవితాలు దిగజారటం చూస్తున్నాము. 

                                         ఈ నవలలోని కథ కుటుంబంలోని మూడు తరాలవారి జీవితాన్ని చూబిస్తుంది. మొదటి తరం కథ సముద్రపొడ్డున ఉన్నఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. అక్కడ ఒక ఇరవై, పాతిక కుటుంబాల వారు వ్యవసాయం, తదితర వృత్తులనూ నమ్ముకుని స్వయం పోషకంగా, క్లుప్తంగా జీవించటం చూస్తాము. రెండవ తరానికి పట్టణ చదువులకున్న విలువ, గౌరవం అవగహనకొచ్చి, వాటిద్వారా మంచి జీవికని పొందవచ్చన్న కోరిక మొదలవుతుంది. అది ఖర్చుతో కూడుకున్నదైనా పిల్లల భవిష్యత్తు మీద ఆశతో దానికి పూనుకుంటారు. అయితే ఒక్కసారిగా దొరికిన స్వేచ్ఛ, పట్టణ ఆకర్షణలు కొందరిని చదువు మీంచి దృష్టి మళ్లించి జీవితాల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తాయి. వాళ్లను నమ్ముకుని, వాళ్ల భవితపైన ఆశలు పెట్టుకున్న పెద్దలకి తీవ్రమైన నిరాశ, దుఃఖం మిగులుతాయి. 

                                 అయితే మూడవతరంలో నాదన్నది ఏదీ మిగలక, నావాళ్లన్నవారు గ్రామంలో కరువై తప్పని పరిస్థితుల్లో పట్టణంలో చదువుకుందుకు రావటం జరుగుతుంది. పట్టణ సంస్కృతితో తను వదిలి వచ్చిన గ్రామీణ జీవితపు సంస్కృతిని పోల్చి చూసుకుని విశ్లేషించుకోగల కథానాయకుడు కనిపిస్తాడు. చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగపు ప్రయత్నాల్లో నగరజీవితంలోని అరాచకాన్ని, అసంతృప్తిని అర్థం చేసుకుని తన తాతలాగా, తల్లిలాగా గ్రామంలో ప్రకృతికి దగ్గరగా బతకటంలో ఉన్న సహజత్వాన్ని అర్థంచేసుకుని వెనక్కి వస్తాడు. 

                             ఇది రక్తమాంసాలతో నిండిఉన్న ఒక సజీవ నవల. సహజమైన జీవనకావ్యం. చదువుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో పాత్రలతో మమేకమయేలా చేసి, తీవ్రమైన ఉద్వేగాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. జీవితం ఇంత కఠినమెందుకు కొందరి విషయంలో అనిపిస్తుంది. అయితే ఇందులోని కొన్ని పాత్రల ఔన్నత్యం జీవితం పట్ల మమకారాన్ని, ధైర్యాన్ని, పోరాడి గెలవగలమన్న నమ్మకాన్ని, గెలిచితీరాలన్న పట్టుదలనీ ఇస్తుంది. ఇది అనుభవంలోకి రావాలంటే ఈ నవల చదివి తీరవలసిందే. 

కథ వివరంగా తెలుసుకుందాం. 

                                   కోడి గ్రామం ఒక సముద్రతీరంలో ఉంది. చుట్టూ ఇసుక దిబ్బలు. వ్యవసాయానికి అనువైన నేల కాదు. అయినా తృణధాన్యాలు, జీడి మామిడి తోటల పెంపకంతో అవసరమైన తిండి సదుపాయం చేసుకునే ప్రజల్ని చూస్తాం. రామ ఐతాళులు పౌరోహిత్యం వృత్తిలో ఉంటారు. భార్య పారోతి, భర్త పోయిన చెల్లెలు సరసోతి ఆఇంట్లో మిగిలిన సభ్యులు. ఇంటి విషయాలను పూర్తిగా ఆడవారికి వదిలిపెట్టి తన పౌరోహిత్యపు పనులలో మునిగి ఉండే రామ ఐతాళులు డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చుచేస్తూ, పొదుపు చేసిన డబ్బుని రహస్యంగా తన ఇంటి గోడల్లో దాచిపెడుతుంటాడు. బయటి వ్యవహారాలు ఇంట్లో ఆడవారికి అనవసరమనే అభిప్రాయం కలవాడు. 

                                   ఒక వర్షాకాలపు ముసురులో రామ ఐతాళ్లులుతో పెళ్లి జరిగి, ఆ ఇంటికొచ్చిన పారోతి పెద్దదైనప్పట్నుంచీ తానొక పాపకి తల్లి కావాలని సంవత్సరాల తరబడి ఎదురుచూస్త్తుంది. తన బిడ్డకి రాగులు రుబ్బి, హల్వా చేసిపెట్టాలని ఆశపడుతుంది. తనతోటి బంధువులు, స్నేహితురాళ్ళు పిల్లల తల్లులైనప్పుడు తన కలలన్నీ విఫలమయ్యాయని నిట్టూరుస్తుంది. తన కడుపులో ఉన్న ప్రేమ, ఆదరాల్ని ఎవరిమీద చూబించాలి అని విచారిస్తుంది. తన ఆడపడుచు సరసోతి పట్ల ఎంతో మర్యాద, ఆదరం చూబిస్తుంది.

                            ఇంట్లో ఉన్న కపిలవర్ణపు ఆవు ‘గోపి’ అంటే ప్రేమ. అది ఇంట్లో దేవుని నైవేద్యానికి అవసరమైనంత పాలు మాత్రం ఇస్తుంది. తనకి సమయం చిక్కితే దానితో కబుర్లు చెబుతుంది. 

పారోతి, సరసోతి ఇద్దరూ ఇంటికోసం, తమ పొలంకోసం చేసే శారీరక శ్రమ చూస్తే ఆశ్చర్యం, దిగులు వేస్తాయి. పని, పని… ఇదే దినచర్య. అలిసిపోయి నిద్రపోతే తెలవారిలేచి మళ్లీ పని. శ్రమజీవనంలో సౌందర్యం ఉంది, కానీ ఇక్కడ మితిమీరిన శ్రమ. కనీసంగా తిండి జరుగుబాటుకు మాత్రం ఫలసాయం వస్తుంది. చెట్లనుంచి రాలిన ఆకులను పోగేసి వంటచెరుకు కోసం జాగ్రత్త పరచటం, పొన్నకాయలు ఏరి, వాటితో ఇంట్లో దీపాలకి కావలసిన నూనెను సేకరించేందుకు గానుగకి ఇవ్వటం వంటి పనులు, ఆ జీవన శైలి ఆశ్చర్యం కలిగించక మానవు.

                              పిల్లలు లేకపోతే సద్గతి ఉండదని అన్నని ఒక పిల్లవాణ్ణి దత్తు తీసుకొమ్మని సరసోతి చెబుతుంది. దత్తత తీసుకున్న పిల్లవాడు తనవాడెలా అవుతాడని, మరోపెళ్లి చేసుకుంటే రెండో భార్య ద్వారా తనకు సంతానం కలుగుతుందని తన జాతకంలో ఉందని నమ్మి, అందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు రామ ఐతాళులు. ఇంటిని అలికి, అలంకరించమని పురమాయిస్తాడే కానీ ఇంట్లో ఆడవాళ్లకి పెళ్లిమాట చెప్పడు. ఆపనులు ముగించి, ఇంటి వ్యవహారాల్లో తనకి, పారోతికి ఏప్రమేయమూ లేకుండా చేస్తున్న అన్నగారిమీద కోపంతో సరసోతి తన అత్తవారింటికి వెళ్లిపోతుంది. పెళ్లి విషయం పక్కింటి శీనమయ్యరితో భర్త చెబుతున్నప్పుడు పారోతి విని గ్రహించుకుంటుంది. తన భవిష్యత్తు ఏమిటి అని దుఃఖిస్తుంది కానీ తమ జీవితాల్ని ఉధ్ధరించేందుకు తన భర్తకు మరో స్త్రీవల్లనైనా ఒక బిడ్డ పుడతాడని సరి పుచ్చుకుంటుంది. ‘ఆమె మనస్సు ఆషాఢంలోని ఉప్పెనలాగు పొంగిపొరలింది.”

                                     అలిగి, అత్తవారింటికి వెళ్లిపోయిన చెల్లెల్ని తన పెళ్లి విషయం చెప్పి ఇంటికి తీసుకువస్తాడు రామ ఐతాళులు. పెళ్ళిలో తను విచారంగా కనిపిస్తే అందరూ ఏమనుకుంటారో అని అందరితో కలుపుగోలుగా, నవ్వుముఖంతోనే తిరుగుతుంది పారోతి. 

                                     రామ ఐతాళుల రెండోభార్య సత్యభామ. ఆమెను భర్త చాలా ప్రేమగా చూస్తాడు. ఆమెకి మొదట ఒక పిల్లవాడు, తర్వాత ఒక ఆడపిల్ల కలుగుతారు. పిల్లవాడి పేరు లక్ష్మినారాయణ. అందరూ లచ్చడు అని ముద్దుగా పిలుస్తారు. అమ్మ, పెద్దమ్మ, అత్త, తండ్రి ప్రేమలో మునిగి పెరిగే లచ్చడు పెద్దమ్మ చూబించే ప్రేమకు ఆమెకు బాగా దగ్గరవుతాడు. సత్యభామ అసూయతో భర్తకి ఫిర్యాదు చేస్తుంది. కానీ పిల్లవాడికి ఎవరేం చెప్పలేని పరిస్థితి అవుతుంది. దీనివలన కనిపించని దూరాలు పారోతి, సత్యభామ మధ్య ఏర్పడతాయి. లచ్చడి చదువు గురించి ఆలోచించి సర్కారు బడికి పంపాలని నిర్ణయించి, తాతగారింట పెడతారు. 

                                      క్రమంగా లచ్చడు స్వంత ఊరు, అమ్మ, పెద్దమ్మల ప్రేమను మరిచి చదువులో పడతాడు. హైస్కూల్ చదువుకి పొరుగూరులో ఉంచినపుడు లచ్చడి చుట్టూ చేరిన స్నేహితుల వలన చెడు అలవాట్లకు అలవాటుపడతాడు. డబ్బును నీళ్లప్రాయంగా ఖర్చుపెట్టటం, అప్పులు చెయ్యటం, పేకాట, ఆడవాళ్ల స్నేహాల్లో పడి తిరగటం వంటివన్నీ నేర్చుకుంటాడు. తన చదువు బాధ్యతను తీసుకున్న తాతగారు కానీ, తండ్రి కానీ నిలదీసినప్పుడు జవాబు చెప్పకుండా తప్పించుకుంటాడు. సెలవులకి ఊరు రావటానికి కూడా ఇష్టపడడు. ఇంట్లో వాళ్ల శారీరక శ్రమను, క్లుప్తమైన జీవితాన్ని ఏవగించుకుంటాడు.

                                  తల్లి, పెద్దమ్మల ప్రేమకి వాడి దృష్టిలో ఎలాటి విలువా లేదు. రామ ఐతాళులు కొడుకు వృధ్ధిలోకొస్తాడన్న నమ్మకాన్ని క్రమంగా పోగొట్టుకుంటాడు. నిరాశలోనూ కొడుక్కు మంచిమాటలు చెప్ప ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే వాడు చెయ్యి దాటిపోయాడని సరసోతి గ్రహించి, లచ్చడికి పెళ్లి చెయ్యమంటుంది, కనీసం అప్పుడైనా మార్పొస్తుందేమో అన్న ఆశతో. 

                                       లచ్చడి పెళ్లి ఒక పెద్ద వకీలుగారి అమ్మాయితో జరుగుతుంది. ఆమె నాగవేణి. ఆమె పెద్దలపట్ల వినయం, మర్యాద, ప్రేమ ఉన్న పిల్ల. అల్లుడి చదువు బాధ్యత మామగారు తీసుకుంటారు. నాగవేణి మొదటిసారి గర్భవతి ఐనప్పుడు భర్త ద్వారా పొందిన వ్యాధివలన గర్భాన్ని పోగొట్టుకుని, జీవితం ఇకపైన ఇంతేనా అని భయపడుతుంది. విషయం అర్థమైన మామగారు అల్లుణ్ణి దూరం పెడతారు. తల్లిదండ్రులు కోడలి గురించి అడిగినపుడు నిష్టూరంగా జవాబు చెబుతాడే కానీ తన తప్పును తెలియనివ్వడు లచ్చడు. 

                                    రామ ఐతాళులు కోడలిని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాడు. పారోతి, సరసోతిల వెనుకే పనుల్లో జొరబడుతూ వాళ్లని అర్థం చేసుకుని వాళ్లతో కలిసిపోతుంది నాగవేణి.

                                    పారోతి పసివాడిగా చేరదీసి ప్రేమగా పెంచిన లచ్చడి ప్రవర్తనలో మార్పుకు, వాడి చెడు నడతకి కృంగిపోతుంది. ఆ కృంగుబాటుతో వయసును మించి ముసలితనం వస్తుంది. ఆమె లచ్చడిని చూడాలన్న ఆశను తెలియజేస్తుంది మరణశయ్య మీదుండగా. కానీ లచ్చడికి ఆఖరి చూపులు దక్కవు. రామ ఐతాళులు పారోతిని తను సరైన విధంగా ఆదరించక అన్యాయం చేసానని తలుచుకుని దుఃఖిస్తాడు.

                                   రామ ఐతాళులు కొడుకు వ్యవహారం పట్ల తీవ్ర నిరాశతో, తన తదనంతరం ఆస్తినంతా కొడుకు నాశనం చేస్తాడని గ్రహించుకుని కోడలిపేర రాసి మరణిస్తాడు. భర్త తీరుకి నాగవేణి నిర్లిప్తంగా, విరక్తిగా తయారవుతుంది. ఆమె మళ్లీ మరోసారి గర్భం ధరించి కొడుకుని కంటుంది. ఆ పిల్లవాడికి నామకరణం చెయ్యాలని ఆశ పడుతుంది. భర్త చదువు ముగించి రెవెన్యూ ఇనస్పెక్టరుగా ఉద్యోగం, హోదా తెచ్చుకుంటాడు. కానీ ధనదాహంతో పక్క దారుల్లో సంపాదించి, సంపాదించినదంతా వ్యసనాలకు వ్యయపరుస్తాడు. క్రమంగా ఇంటిని మరిచిపోతాడు. భర్త రాకుండానే నాగవేణికి పుట్టిన బిడ్డ చనిపోతాడు.

                                   సరసోతితో ఒక అపురూపమైన అనుబంధం ఏర్పడుతుంది నాగవేణికి. ఆమె చెప్పే దుఃఖినులు, అభాగినులలో ఒకరిగా తానూ మిగిలింది అని అనుకుంటుంది ఆమె. సరసోతి తన జీవితంలో కాశీయాత్ర చెయ్యాలన్న కోరిక మిగిలిపోయిందని చెప్పినప్పుడు, తన తండ్రితో చెప్పి అత్త సత్యభామ, సరసోతిలను కాశీయాత్ర చేయిస్తుంది. ఆ యాత్ర తరువాత సరసోతి అనుభవించిన సంతృప్తి, మనసారా నాగవేణిని దీవించిన సన్నివేశం చదవాల్సిందే కానీ చెప్పశక్యం కాదు. 

                                   ఇలాటి అపురూపమైన సన్నివేశాలు, మనుషుల్లోని అమృత హృదయాల్నికళ్లముందు ఆవిష్కరించే సందర్భాలు ఎన్నో ఈ నవలలో ఉన్నాయి. ఆ కాశీయాత్ర సమయంలోనే ఉద్యోగం పోగొట్టుకుని, అప్పులపాలైన లచ్చడు అనారోగ్యంతో ఇల్లు చేరి తన దీనావస్థను భార్యకు చెప్పుకుంటాడు. నాగవేణి భర్త పట్ల సానుభూతితో అతనికి సపర్యలు చేస్తుంది. కానీ అతనికి శారీరకంగా దగ్గరవటానికి మనస్కరించక, దూరదూరంగా మసులుతుంటుంది. దానికి లచ్చడు ఆమెను నిష్టూరమాడతాడు. నాగవేణి భయపడుతూనే మళ్లీ భర్తకి దగ్గరవుతుంది. 

                                   భార్య దయాధర్మాల మీద బ్రతుకుతున్నందుకు ఊళ్లో అందరూ నవ్వుతున్నారని చెప్పి, తనతండ్రి నాగవేణికి రాసిన ఆస్తిని లచ్చడు తనపేరున మార్పించుకుంటాడు. ఇల్లు వదిలి మళ్లీ వెళ్ళిపోతాడు. సత్యభామ కొడుకు దుర్మాగాన్ని తట్టుకోలేక తాత్కాలికంగా కూతురింటికి వెళ్లిపోతుంది. నాగవేణి మళ్లీ గర్భం ధరించి, కొడుకును కంటుంది. 

                       సరసోతికి డెభ్భై ఐదు సంవత్సరాలు పైబడ్డాయిప్పుడు. కళ్ళు కనిపించవు. నాగవేణి ఆమెను కంటిపాపలా   చూసుకుంటూ ఉంటుంది. కానీ భవిష్యత్తు పట్ల తీవ్ర నిరాశతో చనిపోవాలని నిర్ణయించుకుని సరసోతిని, కొడుకు రాముణ్ణి వదిలి ఒక రాత్రి ఏట్లో దూకుతుంది.

                      అక్కడి పల్లెకారులు ఆమెను రక్షించి ఇంటికి చేరుస్తారు. సరసోతి బాధ పడుతుంది. ‘కొడుకుని ఏంచెయ్యదలుచుకున్నావే?’ అని అడుగుతుంది. ఆ పిల్ల పడుతున్న బాధలు ఆమెను నిస్సహాయను చేస్తాయి. విషయం తెలిసి నాగవేణి తండ్రి వచ్చి తనతో రమ్మంటాడు. కళ్లు కనిపించని ఆ వృధ్ధురాల్ని వదిలి రానంటుంది నాగవేణి. పైగా మామగారు నమ్మకంతో ఆ ఇంటిని తనకు అప్పగించారని చెబుతుంది.

                    ఒక సందర్భంలో పెద్దవాడవుతున్న రాముడికి తినేందుకు ఏమీ చిరుతిళ్లు చెయ్యటం లేదనీ, కనీసం బియ్యంతో అప్పడాలైనా చేసిపెట్టాలంటుంది సరసోతి. తగినన్ని బియ్యం లేవు అని సత్యభామ అంటుంది. 

‘పోనీలే, ఒక్కక్కరం మూడు ఏకాదశులు చేద్దాం. ఈ లోపు కష్టాలు తీరిపోతాయి’ అంటుంది సరసోతి. ఆ త్యాగం, పేదరికం, వాళ్లమధ్య ప్రేమలు, ఆ చిక్కని అనుబంధం చదువుతున్న మన మనసుల్ని ఆర్ద్రతతో నింపేస్తుంది. సత్యభామ శ్రమకోర్చి కూతురింట్లో ఉన్న పనస కాయలు దింపించి వాటితో అప్పడాలు, వడియాలు చేసి మనవడికోసం తెస్తుంది. 

                           ఆదాయం వచ్చేమార్గం లేక పేదరికంలో ఆ కుటుంబ బాధ్యతను తీసుకున్న నాగవేణి పడే అవస్థలు కంటతడి పెట్టిస్తాయి. భర్త ఆస్తినంతా అమ్మివేస్తాడు. ఆస్తి అతని పేర మార్చినందుకు సత్యభామ, సరసోతి భాధపడతారు. అన్నంలో నీళ్ళు పోసి గంజి కాచి ఆకలి తీర్చుకుంటారు. అదీ మిగిలిన వారికోసం త్యాగం చేస్తుంటూంది నాగవేణి. 

                         మూడో తరం వాడైన రాముడు పుట్టినప్పట్నుంచి తల్లి, నానమ్మ, అవ్వల ప్రేమ, ఆ ఇల్లు, అక్కడి సముద్రం తప్ప ఏమీ తెలియనివాడు. చిన్నవయసుకే ఎంతో అవగాహన, పరిస్థితులకి అనుగుణంగా సంతృప్తిగా జీవించటం నేర్చుకుంటాడు. సముద్రంతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. నిత్యం తల్లితో కలిసి సముద్రాన్ని చూసి, దాని ఘోష వింటూ ‘అమ్మా, సముద్రానికి ఏమి కావలట? ఎవరు కావాలని అలా గోల చేస్తోంది’ అని అడుగుతుంటాడు. వీధినాటకాల్ని శ్రధ్ధగా చూస్తుంటాడు. 

సరసోతి మరణం తర్వాత అత్త సత్యభామ, కొడుకుతో ఆ ఇంట్లోనే ఉంటూ తనకు చేతనైనంత వ్యవసాయం చేసి ఇల్లు గడుపుతుంది నాగవేణి. 

                         ఒకసారి సాలిగ్రామ జాతరకి కొడుకుని తీసుకుని వెళ్తుంది. వాడు మరమరాలు కావలని అడుగుతాడు. ఉన్న కొద్ది డబ్బులతో కొనాలని నిశ్చయం చేసుకుంటుంది కానీ జాతరలో పినతండ్రి ఎదురయేసరికి తన పేదరికం కనిపించకూడదని ఆయన నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన కంట పడనే పడుతుంది. ఆయన రాముడికి ఒక చొక్కా, కొన్ని తినుబండారాలు కొనిపెడతాడు. అన్నకూతురి దీనావస్థ ఆయనకి అర్థం అవుతుంది. తన ఇంటికి రమ్మని ఆయన ఆడిగినప్పుడు ఏవో సాకులతో తప్పించుకోచూస్తుంది. కానీ అత్తగారి మాటలకి కొడుకుని తీసుకుని పినతండ్రి వెంట వెళ్తుంది. మనసులో పండుగపూట కొడుకు విందు భోజనం తింటాడన్న ఆశ. 

                             పినతండ్రి ఇంట్లో భోజనం చేసేప్పుడు రాముడు ‘అమ్మా, నువ్వు ఇవన్నీ చెయ్యవుకదే’ అంటూ తల్లిని చిన్న గొంతుతో అడుగుతాడు. ఆ మాటల్ని అందరికీ వినిపించేలా అనకూడదన్న ఇంగితం పసివాడైన రాముడిది. ఆ మాటలకి నాగవేణి కన్నీరు పాయసంలో పడుతుంది. 

                              ఊళ్లో అందరికీ విషజ్వరం వస్తుంది. అత్త సత్యభామ చనిపోతుంది. ఆ జ్వరం నుంచి పినతండ్రి సాయంతో నాగవేణి, రాముడు కోలుకుంటారు. తల్లి మరణవార్త విని తొమ్మిదో నాటికి లచ్చడు వచ్చి ఉత్తరక్రియలు ముగిస్తాడు. ఆస్తినంతా అప్పటికే తన వ్యసనాలకి పోగొట్టుకుంటాడు. ఇల్లు వదిలి మళ్లీ వెళ్లిపోతాడు.

                             కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న నాగవేణి ని తమ ఇంటికి రమ్మని, తమ బాధ్యతలన్నీ తీరిపోయి ఇల్లంతా చినబోయిందని చెప్పి, ఒప్పించి తండ్రి ఆమెను తీసుకెళ్తాడు. అక్కడ చక్కని పోషణ, ప్రేమ దొరుకుతాయి నాగవేణికి, రాముడికి. చిన్నప్పుడు నేర్చుకున్న ఫిడేలు తీసి అభ్యాసం చేస్తూ కొడుకుని చదివించు కుంటూంటుంది నాగవేణి. తల్లి దగ్గర ఫిడేలు తీగెల మీద ప్రయోగాలు, రాగాలు అలవాటవుతాయి రాముడికి.

                         నాగవేణి తండ్రి మరణంతో తల్లితో సహా అన్నఇంటికి వెళ్లవలసి వస్తుంది. పిల్లవాడి చదువు, పోషణ జరుగుతున్నా పరాయి ఇంట్లో ఉండటం ఇష్టం లేక తల్లితో మళ్లీ పల్లె చేరుతుంది. రాముడు స్కూలు చదువు పూర్తై, కాలేజీ చదువుకు మేనమామల మీద ఆధార పడకుండా తల్లి ఇచ్చిన డబ్బుతోనూ, తను ప్రైవేట్లు, సంగీత పాఠాలు చెప్పి సంపాదించిన సొమ్ముతోనూ కష్టం మీద చదువు ముగిస్తాడు. మద్రాసులో బి.ఎ. చదివే సమయంలో నాగవేణి చెల్లెలు కృష్ణవేణి, ఆమె భర్త రాముడిని ప్రేమతో ఆదరిస్తారు. అక్కడ చదువుకుంటున్నప్పుడు దేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమం, వామపక్ష భావాల ఆకర్షణలో పడి, జైలు జీవితం కూడా చూస్తాడు. 

                             చదువు ముగించి, ఉద్యోగం సంపాదించుకుని తల్లి కష్టాన్ని తీర్చాలన్న సంకల్పంతో మద్రాసు, బొంబాయి నగరాల్లో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అక్కడి జీవితం, పట్టణ జీవితంలోని పోరాటం, కృత్రిమత్వం వాడిని విసిగి వేసారేలా చేస్తాయి. 

                            తల్లి నమ్మిన భూమినే తానూ నమ్మి వ్యవసాయం చెయ్యాలన్న సంకల్పంతో పల్లె చేరతాడు. అక్కడ జాలరులకి, పేదవారికి మద్యపానం వలన కలిగే చెడుఫలితాల్ని చెప్పి మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఒకపక్క బడిలో పిల్లలకి పాఠాలు చెబుతూ, మరోవైపు వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తూ, తన పల్లె ప్రజలకి ఆధునిక పధ్ధతులను నేర్పే ప్రయత్నం మొదలెడతాడు. 

                               ప్రకృతితో సహజీవనం చేస్తూ జీవితానికి అవసరమైన శక్తిని, ధైర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. వెనకటి తరాలవారు ఆచరించిన అలాటి ఒక ఆదర్శవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని తన తరంలో సాధిస్తాడు. తల్లి పెళ్ళిప్రస్తావన తెచ్చినప్పుడు తనకు భార్యగా వచ్చే అమ్మాయి తనతో పాటు పొలంలో పనిచెయ్యగలిగేదై ఉండాలని స్పష్టంగా చెబుతాడు. నమ్మిన ఆదర్శాన్ని రాబోయే తరాలకి తను మార్గదర్శిగా చూపాలనుకుంటాడు.

                           ఈ నవల పొడవునా సముద్రం ఒక ముఖ్య పాత్రధారిగా కనిపిస్తుంది. రాముడు తనకు చిన్ననాటినుంచి సముద్రంతో ఏర్పడ్డ అనుబంధాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. పల్లె సహజ వాతావరణంలో ఉన్న సముద్రం రాముడికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కానీ అదే సముద్రం మద్రాసు, బొంబాయి నగరాల్లో ఎలాటి ఓదార్పునీ ఇవ్వలేకపోతుంది. ఈ వ్యత్యాసాన్ని రాముడు స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. జీవితానికి అతి ముఖ్యమైనదేదో నగర జీవితంలో తాను పోగొట్టుకుంటున్నాడన్న స్పృహ కలుగుతుంది.

                                నవల చదవటం అయిపోయినపుడు దిగులేస్తుంది. చదివినంత సేపూ ఆ జీవితాల్లోకి వెళ్లిపోయిన మనం వర్తమానంలోకి వచ్చేందుకు కష్టపడాలి.

                                 మన మూలాల్లోకి తిరిగి వచ్చి సంతోషంగా, సంతృప్తిగా జీవించే అవకాశం మనమందరం ఎందుకు కోరుకోవటంలేదు అనిపిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు కలిగే సంతోషం ప్రతివారికీ అనుభవమే. అలాగే అతిచిన్న విషయాలకి పొంగిపోయే మనసుకి అవసరమైనది సాధారణ జీవనశైలి అనీ, అది మనకి చాలని మనమెందుకు తెలుసుకోలేకపోతున్నాం. అలాటి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రత్యక్షంగా జీవించి చూపించిన వెనకటి తరాల్ని మనమెందుకు అనుసరించటం లేదు.

                              ఈ సమీక్ష రాస్తున్న సమయానికి కరోనా ని ఎదుర్కొందుకు మనమంతా ఇళ్లకే పరిమితమై ఉన్నాం. ఎలాటి సంబరాలు, ఆర్భాటాలు లేని అతి సాధారణ జీవితాల్ని, అందులోని సంతోషాల్ని మన కుటుంబ సభ్యుల మధ్య అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. ప్రకృతిని స్వేచ్ఛగా వదిలి ఇన్ని సంవత్సరాలుగా అభివృధ్ధి పేరుతో చేసిన దోపిడీకి విరామమిచ్చాం. ఇదంతా మనకి కొత్త పాఠాల్ని నేర్పుతోంది. మన పూర్వీకుల జీవనశైలిని మనకి పరిచయం చేసి, సహజంగా బతకమంటూ మనకి చెప్పేందుకే ఇలాటి ఒక సందర్భం వచ్చిందేమో అనిపిస్తోంది.  


*****

Please follow and like us:

3 thoughts on “మరల సేద్యానికి – శివరాం కారంత్”

  1. Very beautiful sameeksha done by Anuradha Nadella on Sankar gari ” marala sedyaniki”. I also went to the village and the setting there while reading this. Thanks!

  2. Review has a given clear picture of the novel. Could successfully put 325 pages in short highlighting the essence of the novel. Will grab the earliest opportunity to read the original!!

Leave a Reply

Your email address will not be published.