వెనుతిరగని వెన్నెల(భాగం-14)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-14)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. పెద్ద వాళ్లు  ఒప్పుకుని  ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తన్మయి, శేఖర్ విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన ఆరు నెలల్లోనే  తన్మయి  గర్భవతి అవుతుంది.

***

“ఇదిగో, ఈ సంచీలో కూరలు లోపల సర్దు” అంటూ “నేను ఊరెళ్లి వచ్చే వరకూ ఖర్చులకు ఈ వంద ఉంచుకో” అన్నాడు శేఖర్ తన్మయితో.

తన్మయి ఏవీ మాట్లాడకపోవడం చూసి “విన్నావా? డబ్బులున్నాయి కదా అని మీ అమ్మతో ఫోన్లు మాట్లాడడం కోసం తగలెయ్యక, పొరబాటున ఈ మధ్యలో డాక్టరు దగ్గిరికి వెళ్లాల్సొస్తే  అందులోనే సర్దుకో.” అన్నాడు.

తన్మయి లెక్కబెట్టుకుంది. పగటి పూట ఎస్. టీ. డీ మాట్లాడితే నిమిషానికి 10 రూపాయలు అవుతాయి. అదే రాత్రి 7 తర్వాత  మాట్లాడితే అదే డబ్బులకి నాలుగు నిమిషాలు మాట్లాడొచ్చు. ఎస్.టీ.డీ వీథి చివరే ఉంది కాబట్టి ఇప్పుడు 7 దాట గానే ఫోను చేయడం పెద్ద సమస్య కాదు. ఎంట్ర్రెన్సు అప్లికేషను ఇవ్వడానికి యూనివర్శిటీకి వెళ్లి రావాలి.  వెళ్లి రావడానికి ఆటో ఎక్కితే 40 రూపాయలు అవుతుండొచ్చు.  డాక్టరు దగ్గిరికి వెళ్లాల్సి వస్తే 50 డాక్టరుకే ఇవ్వాలి. మరి ఆటో ఛార్జీ లో? ఇక రోజూ పాలపాకెట్టు 5 రూ|| ..అమ్మో… సరిపోయేట్టు లేవు.

“ఏవిటా తలకాయెక్కడో పెట్టుకుని ఆలోచించుకోవడం? విన్నావా నేను చెప్పింది?” అన్నాడు శేఖర్.

“ఊ… “అని తల ఊపింది అన్యమనస్కంగా.

“ఏం విన్నావో చెప్పు” అన్నాడు నడుమ్మీద చెయ్యి వేసుకుని అసహనంగా. 

“డబ్బులు…” అంది నెమ్మదిగా.

“అదే  కాదు…నీకు ఏదైనా అవసరమైతే మా పిన్నికో, మావయ్యకో ఫోను చెయ్యి.  వచ్చి నిన్ను వాళ్లింటికి తీసుకు వెళ్తారు. మీ అమ్మా వాళ్లకి ఫోను చేసి నానా రాద్ధాంతం చెయ్యకు.” అన్నాడు.

శేఖర్ ఊరికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరితనం హాయిగా అనిపించసాగింది.  ఆ రాత్రి కంటి నిండా నిద్రపట్టింది తన్మయికి. అర్థరాత్రి నిద్రాభంగాలూ, మానసిక ఆందోళనలూ లేవు. 

రెండో రోజు యూనివర్శిటీకి అప్లికేషను ఇవ్వడానికి బయలుదేరింది.

తనకు నచ్చిన లేత రంగు కాటన్ చీర కట్టుకుని,  మెడ చుట్టూ కొంగు కప్పుకుంది. డబ్బులు మరోసారి లెక్కబెట్టుకుంది. 

“ఆటోకి ఎటూ సరిపోయేటట్టు  లేవు. కాబట్టి బస్సులో వెళ్లి రావడం మంచిది” అనుకుంది.  లక్ష్మిని అడిగి బస్సు నంబర్లవీ రాసుకున్న కాగితం సరిచూసుకుంది. ముందు రోజే ఎక్కడ దిగాలో, ఎటు వెళ్లాలో అడిగి తెలుసుకుంది. అయినా బెరుకుగా ఉంది. 

 మెయిన్ రోడ్డు వరకు నడిచి బస్టాండులో నిలబడింది. వచ్చిన జనం కిట కిటలాడుతూ వేళ్లాడుతూ ఉన్నారు. రెండు మూడు బస్సులు వదిలెయ్యవలిసి వచ్చింది.  

“సిటీ బస్సుల్లో ఇలా వేళ్లాడుతూ వెళ్లడం తనకి సాధ్యమేనా?” అని ఆలోచిస్తూండగా అదృష్టం కొద్దీ ఒక బస్సు ఎదురుగా డోరు వచ్చేట్టు ఆగింది.  పొట్టతో చూడగానే బస్సులో ఎవరో లేచి గబుక్కున సీటిచ్చారు.  

మొట్టమొదటి సారి ఒక్కతే ఇంటి నించి బయటకు రావడం వల్ల ఒక్కసారిగా స్వేచ్ఛా విహంగమైనట్టు అనిపించింది. స్టాపులు దాటుతున్నంతసేపూ ఇక మీదట తను ఇలా ఎప్పుడూ స్వేచ్ఛగా ఎవరి మీదా ఆధారపడకుండా బయటకు ఎక్కడెక్కడకు వెళ్లి రావాలో ఆలోచిస్తూ  కూచుంది. 

“యూనివర్శిటీ” బిగ్గరగా కండక్టరు అరుపు విని ఈ లోకంలోకి వచ్చి పడింది.

ఈ రోజు కోసం ఎన్ని రోజులుగానో కలలుగన్నందు వల్ల నడుస్తూంటే అడుగులు తడబడి కాళ్లలోంచి సన్నగా ఒణుకురాసాగింది.

రోడ్డు మీంచి కొంత దూరం లోపలికి నడిచి, మూడంతస్థుల ఆఫీసు బిల్డింగులో యాభై అరవై మంది పనిచేస్తున్న పెద్ద హాలులోకి అడుగు పెట్టింది. రెండో అంతస్థులో ఉన్న హాలులోకి మెట్లెక్కి రావడం వల్ల బాగా అలసటగా అనిపించింది. టేబుళ్ల  వెనక మనుషులు కనబడనంత పెద్ద పెద్ద ఫైళ్ళ దొంతర్లు ఉన్నాయి. 

“అప్లికేషను ఎవరికివ్వాలండీ” గుమ్మంలో కనబడ్డ  ప్యూన్ ని అడిగింది.

 “అప్లికేషను పోస్టులో పంపొచ్చుగా” అన్నాడతను ఎగాదిగా చూసి.

“మేం ఇక్కడికి దగ్గర్లోనే ఉంటామండి” అంది నెమ్మదిగా.

“సర్లే, ఆ పదో టేబుల్ దగ్గిరికి వెళ్లండి” అన్నాడు. 

అక్కడి క్లర్కు కనీసం తన్మయి వైపైనా చూడకుండా చూడకుండా “టేబుల్ మీద పెట్టి వెళ్లండి” అన్నాడు ప్లైళ్లలోకి చూసుకుంటూ. 

బయటికి వచ్చి బళ్లన్నీ పార్కు చేసి ఉన్న చోటి నించి పచ్చని చెట్ల మధ్య ఉన్న నాలుగు బెంచీల వైపు నడిచింది.

మధ్యాహ్నం వేళ కాబట్టి బాగా ఎండ కాస్తూంది. అటూ ఇటూ పుస్తకాలు, ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్న వాళ్లని పరిశీలిస్తూ పది నిమిషాలు విశ్రాంతిగా కూచుంది.

స్టూడెంట్సు కాబోలు ఇద్దరూ, ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటూ నడుస్తున్నారు. యూనివర్శిటీ అంతా ఒకసారి తిరిగి చూస్తేనో!

పక్క రోడ్డు మీంచి మలుపు తిరగగానే కాంటీన్ కనిపించింది.

“యూనివర్శిటీ అంతా తిరిగి రావడానికి ఎంత సేపు పడుతుందండీ?” కాంటీన్ బయట కనబడ్డ మొదటి వ్యక్తిని అడిగింది.

“యూనివర్శిటీ చాలా పెద్దది. మీరే డిపార్టు మెంటుకి వెళ్లాలి?” అన్నాడు.

అవును కదూ, ముందసలు తనెక్కడ చదవాలనుకుంటుందో ఆ ప్రదేశం చూడాలి. 

తన్మయి  సమాధానం విని “అలా అయితే  బస్సో, ఆటోనో ఎక్కి  యూనివర్శిటీ వెనక గేటు వైపు అంటే మొత్తం వేరే వైపుకి వెళ్లాలి. ఇలా నడుచుకుంటూ మీరు వెళ్లడం కష్టం” అన్నాడతను పొట్ట వైపు చూస్తూ.

“థాంక్సండీ” అంది. 

వెనక్కి బస్సులో వస్తూ “ఆటో ఎక్కి యూనివర్శిటీ అంతా తిరగడానికి సరిపడా డబ్బులు పోగుచెయ్యాలి ముందు”. మనసులో దృఢంగా అనుకుంది.

ఇంటికి వెళ్లేసరికి బాగా నిస్సత్తువ వచ్చేసింది. కాస్త అన్నం తిని మంచమ్మీద వాలిపోయింది.

ఎంట్రెన్సుకి  మోడల్ ప్రశ్నలు  అప్లికేషనుతో బాటూ ఇచ్చిన బుక్ లెట్ లో చూసుకుని ఆ ప్రకారం చదవడం మొదలుపెట్టింది.

శేఖర్ వారంలో వచ్చేడు. అప్పటికే  రాత్రి బాగా పొద్దుపోయింది.  

స్నానమైనా చెయ్యకుండానే మంచమ్మీద పక్కన చేరేడు. అతని దగ్గిర ఏదో ఒక విధమైన దుర్గంధం వస్తూంది. 

“కాస్త స్నానం చేసి రారాదూ” అంది.

“రైల్లో రిజర్వేషను దొరక్క నానా కష్టాలూ పడి ఇంటికొస్తే నీ గోలేవిటే?” అన్నాడు తన్మయిని తన వైపు తిప్పుకుంటూ.

అతనికి సుఖాన్నిచ్చే శారీరక పనులన్నీ చెయ్యడానికి తన్మయికి వెగటుగా ఉంది. అదే చెప్పింది. 

“అసలెప్పటికి నేర్చుకుంటావే నువ్వు? ఛీ.. ఛీ..వారం రోజులు గొడ్డులా కష్టపడి ఇంటికొస్తే కాస్త సుఖం కూడా లేదు.” విసుగ్గా అన్నాడు.

ఎన్ని కలలు కంది శేఖర్ తో జీవితం పంచుకోవడానికి!!

ఎన్ని రోజులు ఎదురు చూసింది! వాస్తవం ఇంత కఠినంగా, మింగలేక, కక్కలేక బాధామయంగా ఉంటుందని తనస్సలు ఊహించలేకపోయింది. 

పెళ్లి కాకముందంతా తామిద్దరి సమాగమం గురించి తనకెప్పుడూ గొప్ప ఊహలే వచ్చేవి. తెల్లని లాల్చీ, పైజమా వేసుకుని శేఖర్ తనని మృదువుగా చేతుల్లోకి తీసుకున్నట్లు, తనని అతనొక అపురూప స్త్రీగా ఆరాధించినట్లు కలలు వచ్చేవి.  

ఈ మధ్య అసలతన్నిలా చొక్కా లేకుండా చూడడం కూడా తనకెందుకో నచ్చడం లేదు. ఒంటి నిండా వెంట్రుకలతో అతను దగ్గిరకొస్తే తెలీని వెగటు కలుగుతూంది. 

శుభ్రత పాటించకపోతే అసలతన్ని ముట్టుకోవడానికి కూడా మనస్కరించడం లేదు. 

ఇక అతని శరీరం కంటే అపరిశుభ్రమైన మనస్సు ఇంకా చికాకు కలిగిస్తూంది. 

“అవునూ, ఆ పుస్తకాలేవిటే? ఇంటికి రాగానే “నువ్వొక పెద్ద వెధవ్వి” అని నాకు చెప్పడానికా?” అన్నాడు అంతలోనే మాట మారుస్తూ. 

తన చదువుకీ, అతను వెధవ కావడానికీ సంబంధం ఏవిటో అర్థం కాలేదు తన్మయికి. 

అదే అడిగింది. 

“ఏవిటా? నేను కాలేజీ ముఖం చూడలేదని నన్ను ఎద్దేవా చెయ్యడానికే గదా నువ్వు యూనివర్శిటీకి బయలుదేరేవు? రేపో మాపో ఎమ్మేలు చదివేసి ఏదైనా పెద్ద ఉద్యోగంలో చేరిపోయి, నువ్వు వంట చెయ్యిరా అనడానికా? అన్నాడు. 

“ఉ..హూ..” అని తల అడ్డంగా ఆడించింది. 

“ఏదో చిన్న ఉద్యోగంలో  గుట్టుగా సంసారం చేసుకుని,  ఒకళ్లో, ఇద్దర్నో పిల్లల్ని కని, ఒక మొగుడికి పెళ్లాంగా పడి ఉందామని ఉందా నీకు? అయినా రేపో, మాపో కనీదానికి చదువులెలా వెలగబెడదామనుకుంటున్నావ్? రేప్పొద్దున్న చంటి బిడ్డనేసుకుని కాలేజీలకి తిరుగుతావా? ” 

శేఖర్ ఒక విషయం మీద కసి మరో విషయమ్మీద తీర్చుకొంటున్నాడో, లేక కావాలని అలా మాట్లాడుతున్నాడో  అర్థం కాలేదు తన్మయికి. 

గోడ వైపుకి తిరిగి ఏడుస్తూ పడుకుంది. 

“ఛీ… ఆపు. నీ ఎదవ ఏడుపు చూడలేక చస్తన్నాను.” అన్నాడు. 

 “వారం రోజులు అతను దగ్గిర లేనప్పుడే ప్రశాంతంగా ఉంది కదా. మళ్లీ పీడన మొదలయ్యింది.” అని బాధ మొదలయ్యింది తన్మయికి. 

దు:ఖంతో మూలుగుతున్న శరీరాన్ని, మనసుని పట్టించుకోకుండా అతని సుఖం కోసం అతను మృగంలా మీద పడ్డాడు. మనసుతో సంబంధం లేని మొరటు సుఖానికి అలవాటుపడ్డ అడవి మృగం తనని చెరుస్తున్న బాధని పళ్ళ బిగువన అదుముకుంది. 

***

మరో నెల రోజుల్లో ఎంట్రెన్సు పరీక్ష దగ్గిర పడ్తూండగా శేఖర్ మళ్లీ క్యాంపుకెళ్లేడు.

శారీరక గాయాలు మానినంత సులభంగా  అతను కలిగిస్తున్న మానసిక గాయాలు అసలే మానడం లేదు. శేఖర్ బయటికెళ్ళినంతసేపూ  తన్మయి చదువులో తలమునకలయ్యి ఉండసాగింది. చదువొక్కటే తన పాలిటి పెన్నిధి అయ్యింది. పుస్తకం మూస్తే ఒక విధమైన బాధ మనస్సులో చొరబడుతూంది. 

ఫెన్సింగు చప్పుడు వినబడితే తొంగిచూసింది తన్మయి.

ఎదురుగా  జ్యోతి, భాను మూర్తి ని చూసి ఆత్రంగా హత్తుకుంది.

“కిందటి వారం ఫోను చేసినప్పుడు చెప్పలేదేం వస్తున్నామని?” అనడిగింది. అంతలోనే తల్లి  ముఖం ప్రసన్నంగా లేకపోవడం చూసి ఏమయ్యిందో అని జంకుగా “అమ్మా, అంతా బానే ఉన్నారా?” అంది. 

“ఊ….ఇంటి పక్కని గేదె  రొచ్చు కంపు ముందు వరండా వరకూ వస్తూంది. వెనక బాత్రూముకి అసలు గాలే లేదు. ఇదేం కొంప తల్లీ” అంది జ్యోతి ముఖం చిట్లించి.

తన్మయి నిశ్శబ్దంగా విని ఊరుకుంది.

 “ఇక్కడతనేదో గొప్ప ఉద్యోగం వెలగబెడ్తున్నట్లు మీ అత్త గొప్పలు పోతూందక్కడ. నీకు  సీమంతం చేస్తే అత్తగారి తరఫున ఏం పెట్టబడ్తాయోనని ఆనవాయితీ లేదని చెప్పింది. మంచం, కుంచం అని ఇచ్చే వరకూ పీకెల మీద కూచున్నారు…” అంటూ మొదలెట్టి తనకి మనసులో ఉన్న కోపమంతా వెళ్లగక్కసాగింది.

భానుమూర్తి బయటి వరండాలో సిగిరెట్టు వెలిగించుకుని కూచున్నాడు.

పొయ్యి మీద అన్నం ఉడుకుతూండగా బియ్యం సంచీ వైపు చూసి “ఇదేం ఖర్మ నీకు? రేషను బియ్యం తింటన్నారా!” అని నిర్ఘాంతపోయింది జ్యోతి.

తన్మయికి తల్లి తన మీద జాలి పడ్తూందో, తన స్థితికి బాధ పడ్తూందో అర్థం కాలేదు.

“కావాలని పట్టుబట్టి చేసుకున్నావు. నీకు మంచి జరిగిందా, మాకు మంచి జరిగిందా? మంచమ్మీద పరుపు ఇవ్వలేదని మీ అత్తగారు మాకు ఫోను చేసి డిమాండు చేస్తే, ఇదిగో -ఏవో తాకట్టు పెట్టి ఈ పైకం పుచ్చుకుని వచ్చేం”. అని ముక్కు చీదుతూ కూచుంది.

ఇదంతా  తన స్వయంకృతాపరాధమని, శేఖర్, తను కలిసి వాళ్లను వేధిస్తున్నామని తన్మయికి లోపల్నించి ఇన్ ఫీరిరియాటీతో కలిసిన బాధ మొదలయ్యింది.

సాయంత్రం కొత్త పరుపు తెచ్చేడు భానుమూర్తి. “గాజువాకలో చిన్నాన్న వాళ్లింటికి వెళ్లి, అట్నించటే రేపెళ్తామమ్మా అమ్మా, నేను. నువ్వూ మాతో వచ్చేయకూడదూ. అల్లుడు వచ్చేక వద్దువు గాని”  అన్నాడు.

శేఖర్ కి చెప్పకుండా వెళ్తే వచ్చేక నానా రాద్ధాంతం చేస్తాడు. పైగా శేఖర్  ఇంట్లో ఉండగా అసలు చదువు కొనసాగడం లేదు. ఎంత చదివినా ఇదే మంచి సమయం.   తను రాయాల్సిన ఎంట్రెన్సు పరీక్ష  ఎన్ని అవాంతరాలెదురైనా రాసి తీరాలని పట్టుదలగా ఉంది తన్మయికి. 

తనకి సీటు వస్తుందా, లేదా? చంటి బిడ్డ పుట్టాక చదవ గలదా, లేదా ఇవన్నీ తనకు అప్రస్తుతాలు. అసలు ఎంట్రన్సు ఎలా ఉంటుందో చూడాలి. అంతే. 

ఇలా వచ్చి అంతలోనే వెళ్తున్న తల్లిదండ్రుల మీద లోపల్లోపల  బెంగ పడింది  తన్మయి. 

పొద్దుట్నించీ ముక్కు మూసుకుని బలవంతంగా అక్కడుండాల్సి వస్తున్నట్లు ఉంటున్న తల్లిని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక, ” లేదులెండి నాన్నా, నేనిప్పుడు రాలేను. మీరు వెళ్లండి. వచ్చే నెలలో ఎలాగూ  వస్తానుగా ” అంది దు:ఖాన్ని లోలోపల అణుచుకుని.

***

“పొద్దున్నొచ్చి, సాయంత్రం వెళ్లిపోయారా మీ అమ్మా, నాన్నా? కడుపుతో ఉన్నావు. నాల్రోజులు ఉండి నిన్ను చూసుకోవచ్చుగా” అని విస్తుపోయింది లక్ష్మి మర్నాడు.

“వాళ్లిక్కడ ఉండలేరు. నన్నే రమ్మన్నారు. కానీ చదూకోవాలని…” అని చిర్నవ్వు నవ్వింది బలవంతంగా తన్మయి

ఇంటి బయట ఏదో కోలాహలం వినబడి వీధిలోకి వచ్చారిద్దరూ. 

గోనె సంచి మీద చిలక, కార్డులు  పేర్చుకుని జోతిష్యుడు కూచుని ఉన్నాడు.

చుట్టుపక్కల  ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు జాతకం చెప్పించుకుంటున్నారు.

“దా, జ్యోతిష్కం చెప్పించుకో. ఇతను సరిగ్గా చెప్తాడు” అంది లక్ష్మి తన్మయితో.  

తన్మయి నవ్వుతూ “నాకిలాంటివి నమ్మకం లేదు” అంది.

చిలక ఇచ్చిన కార్డుని  ప్రార్థిస్తున్నట్లు కళ్ల మీద  పెట్టుకుని, కళ్లు మూసుకుని ఉన్న చిలక జోస్యపు మనిషి తీక్షణంగా తన్మయి వైపు చూసి, “జోతిస్యాన్ని సులకన సూడకు తల్లి, నీకు కొడుకు పుట్టబోతున్నాడు. ఆ బిడ్డడే నీకు ఆలంబన, ఆదారం. ఏ కస్టమొచ్చినా సెదరవు, బెదరవు. ఆకాసమే నీకు అద్దు.” అన్నాడు.

విస్తుపోయి చూసి, అంతలోనే చిలక జోస్యపు మనిషి మాటల్ని నమ్మడవేవిటని నవ్వుకుంది తన్మయి.

మర్నాడు డాక్టర్ దగ్గిరికి వెళ్లేరు తన్మయి, శేఖర్.

“స్కానింగు చేయిద్దాం, ఎందుకైనా మంచిది” అంది డాక్టర్.

స్కానింగు చేసేటప్పుడు “డాక్టర్, జెండర్ తెలుస్తూందా?” అంది.

“నిజానికి మేం ముందే చెప్పడం నిషిద్ధం. అయినా నీ సంతోషం కోసం చెప్తున్నాను. ‘మగ పిల్లవాడు’ ” అంది.

తన్మయి కి ముందు రోజు జోస్యం గుర్తుకు వచ్చింది. “నీ కొడుకే నీకు ఆలంబన. ఆకాశమే నీకు హద్దు.” ఎంత స్పష్టంగా తన మనస్సుని చదివినట్లు చెప్పాడు !!

అవును. ఈ పసి పాపడే కదా ఎప్పటి కప్పుడు  బాధా విముక్తుణ్ణి చేస్తున్నది. 

ఇన్నాళ్లూ అమ్మాయని తను కబుర్లు చెప్తున్నది అబ్బాయితోనన్నమాట.

శేఖర్ బండి నడుపుతూ “నాకెప్పుడో తెలుసు. అబ్బాయే పుడతాడని. విత్తనం ఎవరిదిక్కడ! మా వంశంలో అందరికీ ముందు మగ పిల్లలే పుడతారు.” అని గట్టిగా అరుచుకుంటూ చెప్పుకెళ్లిపోతున్నాడు.

తన్మయి కుదుపుల్నించి తప్పించడానికన్నట్లు పొట్టలో బిడ్డని ఒక చేత్తో గట్టిగా పట్టుకుంది.

“నాన్నా! నువ్వు మాత్రం ఇలాంటి మగవాడివి కాకూడదురా” అని గాఢంగా మనస్సులో అనుకుంది. 

తల్లి మాటలు వినబడినట్లు కుంచించుకు పోయి కడుపంతా చేతిలో ఒదిగిపోయింది. 

దారిలో కొబ్బరి బొండాం తాగడానికి ఆపేడు.

“వచ్చే నెలలో నేను నెల మొత్తం క్యాంపుకి వెళ్లాల్సి రావొచ్చు. నిన్ను వచ్చే నెలలోనే డెలివరీకి తీసుకు వెళ్తామని మీ వాళ్లు అన్నారు కదా! నేను వెళ్లే ముందు రోజు రమ్మని ఫోను చెయ్యి.” అన్నాడు.

తన్మయి ఎంట్రెన్సు తారీఖు గుర్తు తెచ్చుకుంది. సరిగ్గా శేఖర్ ఊరికెళ్లే రోజు అది.

***

తన్మయిని తీసుకు వెళ్లడానికి భాను మూర్తి ఒక్కడే వచ్చాడు.

ఉదయం శేఖర్ ఊరికి వెళ్తూ “నా కొడుకుని క్షేమంగా కనిచ్చే వరకూ కాస్త జాగ్రత్తగా ఉండు. మీ పల్లెటూళ్లో డెలివరీకి మంచి డాక్టర్లెక్కడ ఉన్నారు? అందుకే  డెలివరీ దగ్గిర పడ్డాక మన ఇంటికి వెళ్లిపో. నీ కోసం మా అమ్మ తెలిసిన డాక్టరుతో మాట్లాడి పెట్టింది.  ఎప్పటికప్పుడు వివరాలు ఫోను చేసి చెప్పు మా అమ్మకి ” అన్నాడు.

“అబ్బాయి  చెప్పింది నిజమే. మనూళ్లో సరైన డాక్టర్లు లేరు. కానీ మీ అమ్మ ఏమంటుందో చూడాలి” అన్నాడు భానుమూర్తి కూతురితో.

మధ్యాహ్నం ఎంట్రెన్సు కి వెళ్లాల్సిన ఆలోచనల్లో తన్మయి ఇవన్నీ పట్టించుకోలేదు. శేఖర్ ని వదిలి వెళ్ల్తున్నాననే ఆలోచన కూడా లేదు.

తండ్రి దగ్గరుండి తన్మయిని పరీక్ష హాలుకి తీసుకు వెళ్లేడు.

దారిలో “ఇప్పుడెందుకమ్మా నీకు చదువులు?” అన్నాడు.

సమాధానంగా చిర్నవ్వు నవ్వింది తన్మయి.

పరీక్ష హాలు మూడో అంతస్థులో. మెట్లన్నీ భారంగా ఎక్కి  అతి కష్టమ్మీద అయ్యిందనిపించింది.

పరీక్ష అయ్యి మెట్లు దిగి వస్తూంటే  “యూనివర్శిటీలో సీటు రావాలంటే యాభై లోపు ర్యాంకు రావాలి”. అని పక్కనే తనతో బాటూ మెట్లు దిగుతున్న వాళ్లు మాట్లాడుకుంటున్నారు.  

 గబ గబా లెక్కబెట్టుకుంది. తనకి డెలివరీ అయ్యి, మూడో  నెల వచ్చి తను వెనక్కి వచ్చే సరికి అడ్మిషన్లు మొదలవుతాయి.

“మనకి ఏమి రాసి పెట్టి ఉందో, చూద్దాం కన్నా” అంది కడుపు మీద చెయ్యి పెట్టి.

 “వెళ్లేలోగా ఒకసారి సముద్రాన్ని చూడాలని ఉంది నాన్నా!” అంది తండ్రితో.

“ఇట్నించిటే వెళ్దాం మరి” అని ఆటో మాట్లాడేడు భాను మూర్తి.

ఒక పక్క ఎండ కాస్తూన్నా, సముద్రమ్మీంచి పొగ మంచేదో వచ్చి కళ్లకు అతుక్కున్నట్లు మసక బారిన కెరటాల్ని చూస్తూ ఒడ్డున కూచుంది తన్మయి. ఇంట్లో ఎప్పుడూ కలగని ప్రశాంతత ఇక్కడ కలగసాగింది. మనసంతా నిండిన ఆనందంతో పొట్ట మీద తడుముకుంది. 

తల్లి సంతోషానికి ప్రతీకగా కాళ్లు చాచినట్లు విశాలంగా కదిలింది బిడ్డ.

తన్మయి తండ్రి వైపు చూసింది. భాను మూర్తి సిగిరెట్టు వెలిగించుకుని నీళ్ల ఒడ్డున  అటూ ఇటూ తిరగసాగేడు.

చుట్టూ చూసింది. తన కలల సముద్రం ఒక వైపు, అందమైన నగరం ఒక వైపు. దూరాన ఇరువైపులా సముద్రం లోకి పొడుచుకు వచ్చిన పర్వతాల కొనలు. ఆకాశం, సముద్రం కలిసిపోయి ఒక్కటిగా అగుపిస్తున్న దిగంతం.

ఇసుకలో చెయ్యి పెట్టి  ఆప్యాయంగా తడుముతూ “వెళ్లొస్తాను సాగర మిత్రమా! మళ్లీ కలుద్దాం. నీ కోసం ఎన్నో కలలు కని ఈ నగర ప్రాంగణంలో తలదాచుకుంటున్నా. ఇన్నాళ్లూ నిన్ను చూడడానికి రాని ఈ అశక్తురాల్ని మన్నిస్తావు కదూ. నేను తిరిగొచ్చే వరకూ ఈ చల్లని పవనాల్ని నా కోసం దాచిపెట్టవూ!” అంది.

తన మాటలు విన్నట్లు మబ్బు తొలగి నీళ్లు కాంతివంతమయ్యాయి. ఎండ తళుక్కున మెరిసే  నురగల కెరటాల వెనకెక్కడో అంచుల్లో కదులుతున్న కాగితపు పడవల్లా ఓడలు ఒకటీ, రెండూ కదులుతున్నాయి.

తండ్రి తనవైపు రావడం గమనించి  లేచి నిలబడింది తన్మయి.

సాయంత్రం రైలు సమయానికి గంట ముందే బయలుదేరారు. 

లక్ష్మి వీధి బయట ఆటో కదిలే వరకూ నుంచుంది. “పండంటి బిడ్డను కని క్షేమంగా తిరిగిరా! ” అంది ఆప్యాయంగా చేతిలో చెయ్యి వేసి. 

ఆ ఆప్యాయతకి తన్మయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ చేతినలాగే పట్టుకుని ”తల ఊపింది”.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.