ఈ-పత్రికలు 

-డా||కె.గీత

తెలుగు భాష సాంకేతికీకరణ త్వరితగతిన పురోగమించడానికి ముఖ్యకారణం “పత్రికలు” అనేది నిర్వివాదాంశం. పత్రికా ప్రచురణలో ముఖ్యభాగమైన  అక్షర అచ్చు యంత్రాల నుంచి కంప్యూటరు రంగానికి బదిలీ అవుతున్న 2000 వ దశకం తొలి నాళ్లలోనే తెలుగు భాషలో “స్థానిక” ఫాంట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడ “స్థానిక” అనే పదానికి అర్థం “యూనికోడ్” కానవసరం లేనిదన్న మాట. 

ముందు ప్రకరణాల్లో చెప్పుకున్నట్టు  ఫాంట్ల రూపకరణ అంత సులభమైనదేవీ కాదు. అయితే అవసరమే కొత్త ఆవిష్కరణలకు మూలం  కాబట్టి తెలుగు భాష సాంకేతికీకరణలో పత్రికలు ప్రధాన భూమికని  వహించాయి. అధిక సర్క్యులేషన్ ఉండే పత్రికలు స్వయంగా ఫాంట్లని రూపొందించుకున్నాయి. 

1835 లో ప్రారంభమైన తొలి తెలుగు పత్రిక మద్రాస్ క్రానికల్ నుంచి 2019 ద్వితీయార్థంలో ప్రారంభమైన అంతర్జాలపత్రిక “నెచ్చెలి” వరకు దాదాపు 175 సం.రాల పత్రికా ప్రస్థానంలో ప్రచురణ పూర్తిగా ముద్రణా రంగం నుంచి పూర్తిగా అంతర్జాలానికి బదిలీ అయ్యి విప్లవాత్మకమైంది. 

2000 వ దశకం తొలినాళ్ల లో లేఖ, రంగవల్లి, పోతన వంటి ఫాంట్లు అంతర్జాల తెలుగుపత్రికలకి అంకురార్పణ చేసేయి. తెలుగు లిపిని కంప్యూటర్ తెరపై చూపడానికి, టైపు చెయ్యడానికి అవసరమైన వ్యవస్థను, వనరులను 2003లో మైక్రోసాఫ్టుఆపరేటింగ్ సిస్టమ్ లోనే పొందుపరచడంతో తెలుగు పత్రికలకు మార్గం సుగమం అయ్యింది. అంతేకాక స్థానిక ఫాంట్లతో పత్రికను తయారుచేసి పిడిఎఫ్ లు గా ఆన్ లైన్ లో ఉంచడమన్నది పరిపాటి అయ్యింది. దానితో బాటూ పేజీలు లోడ్ అయ్యే టెక్నాలజీ కూడా త్వరితగతిన అందుబాటులోకి రావడం వల్ల, యూనికోడ్ విప్లవం వల్ల అతి త్వరలోనే అంతర్జాల పత్రిక అనే అంశానికి రూపకల్పన వేగవంతంగా జరిగింది. 

కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చెందిన టెక్నాలజీతో వస్తున్న అనేక అంతర్జాల పత్రికల్ని ఇప్పుడు మనం అంతర్జాలంలో చూడొచ్చు. 

తొలినాళ్ళ నాటి తెలుగు అంతర్జాల పత్రికల్లో ప్రాణహిత, పొద్దు, తూలిక మొ.వి, దశాబ్దానికి పైగా నిర్వహింపబడుతున్న ఈమాట, కౌముది, సుజనరంజని, పుస్తకం వంటి సాహితీ పత్రికలు,  గత దశాబ్దంలో ప్రారంభమై కొనసాగుతున్న సారంగ, నెచ్చెలి (స్త్రీల పత్రిక), కొలిమి, గోదావరి, అక్షర, మధురవాణి, సిరిమల్లె, అచ్చంగా తెలుగు, మాలిక, కొత్తపల్లి (పిలల్ల పత్రిక),  వంటివి, 

పాక్షికంగా కొనసాగుతున్న భూమిక, విహంగ వంటి స్త్రీల పత్రికలు, పూర్తిగా ఆగిపోయిన వాకిలి, రస్తా, వసంతం వంటివెన్నో అంతర్జాల పత్రికలు యూనికోడ్ తెలుగుతో వెలుగులోకి వచ్చినవే.

వీటిల్లో ఎన్నో బ్లాగు ఆలోచన నించి రూపుదిద్దుకున్నవే. 

ఇప్పుడు ప్రింట్ పత్రికలుగా వస్తున్న ప్రతి పత్రికా ఆన్లైన్ ఎడిషన్లగా కూడా ముద్రింపబడడం పరిపాటి అయ్యింది. రానున్నకాలం పూర్తిగా డిజిటల్ పత్రికల యుగం అనడంలోఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.