కథాకాహళి- 27

కరోనా కష్టాలను చిత్రించిన అత్తలూరి విజయలక్ష్మి కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

అత్తలూరి విజయలక్ష్మి గారు 1956 జూన్ నెలలో 7వ తేదీన తెనాలిలోజన్మించారు. ఈమె కీ.శే. అత్తలూరి నరసింహారావు, అనసూయమ్మల సంతానం. ప్రముఖ జర్నలిస్టు. ఎం.ఎన్.రాయ్ సిద్ధాంతాల  స్ఫూర్తిపొంది, అబ్బూరి రామకృష్ణారావుగారితో కలిసి రాయిస్ట్ ఉద్యమంలో  చురుకుగా పాల్గొని రాయిస్టుగా ఈమె తండ్రి పేరుపొందారు. 1971లో యస్.యస్.సి. పూర్తిచేశారు. తెలంగాణా ఉద్యమం కారణంగా ఆగిపోయిన చదువును ఉద్యోగంలో కొనసాగుతూనే, పి.జీ. వరకూ ప్రైవేటుగా కొనసాగించారు. 

అత్తలూరి విజయలక్ష్మిగారు మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ 1972లో రాసిన కథ శకునాలు‘. ఈ కథతోనే ఈమె రచనా వ్యాసంగం ప్రారంభం అయ్యింది. ఈమె మొదటి నవల దత్తపుత్రుడు.  చతురలో 2003లో మహావృక్షంనవల, 2013 చతురలో నేనెవరిని నవల, 2004 ఆంధ్రజ్యోతి దినపత్రికలో అమావాస్య తార, ఆంధ్రజ్యోతి వీక్లీలో 2006లోప్రతిమాదేవి నవల, ఆంధ్రభూమి దినపత్రికలో 2008లో గూడు చెదిరిన గువ్వలునవల, 2012 నుండి 2017 వరకూ నవ్య వీక్లీలో తెల్ల గులాబినవల, 2014లో చతురలోఆ గదిలోనవల, స్వాతి మాస పత్రికలో 2014లో శ్రీకారంనవల 2012లో ఆంధ్రభూమి దిన పత్రికలోఅతిథినవల. నటినవల కౌముది అంతర్జాల పత్రికలో 2012 నుండి 2014 వరకూ ప్రచురితం అయ్యాయి. కౌముది అంతర్జాల పత్రికలోనే అర్చననవల, 2017లో ఆంధ్రభూమి దినపత్రికలో పేరైనా అడగలేదునవలలు ప్రచురించారు. రాగం తీసే కోయిలఅనే నవల 2014 నుండి 2015 వరకూ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమయ్యింది.

అత్తలూరి విజయలక్ష్మి ఆరు కథా సంపుటాలను వెలువరించారు. వాటిలో మొదటిది అపూర్వదీన్ని 1996లో ప్రచురించారు. రెండవది అపురూపఇది 2001లో ప్రచురింపబడింది. మూడవది ఈనాటి చెలిమి ఒక కలను 2003లో ప్రచురించారు. నాల్గవది ఒప్పందంకథా సంపుటిని 2013లో ప్రచురిం చారు. ఐదవ కథా సంపుటి ఒక కోయిల గుండె చప్పుడు2018లో ప్రచురించబడింది. ఇక ఆరవది లాక్ డౌన్ వెతలు2020లో ప్రచురించబడింది. 

అత్తలూరి విజయలక్ష్మి  వివిధ సాహిత్య సదస్సులలో ఉపన్యసించారు. 1987లో అక్టోబరులో Prakasam Institute of Development studies వారునిర్వహించిన Regional Course on Voluntary Pariticipation in Social Defence అనే కార్యక్రమంలో ప్రసంగించారు. 1997, ఏప్రిల్ లో ఆధునిక సాహిత్యంలో స్త్రీ పాత్రల పరిశీలనఅనే అంశం పై జరిగిన సదస్సులో ప్రసంగించారు. 2003లో కొల్లాపూర్లో జరిగిన All India Poetess Conferenceలో పాల్గొని కవిత్వం చదవడమే కాకుండా అదే సదస్సులో ఉపన్యాసమిచ్చారు. 2005 జనవరి 31 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ భువనేశ్వర్లో Central Institute of Indian Languages, Mysore వారు నిర్వహించిన మూడు రోజుల సదస్సులో Stylistic Analysis of Fiction and Drama అనే అంశం మీద తెలుగునాటకరంగం మీద ప్రసంగించారు. 2009 నవంబరులో Acharya Nagarjuna University లో నిర్వహించిన మనలో మనంఅనే Women writers conference లో ప్రసంగించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాహిత్య అకాడెమీ వారు నిర్వహించిన సదస్సులో నాటకరంగంలో స్త్రీలుఅనే అంశంపై ప్రసంగించారు. 

రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి రాసిన సుమారు 200ల నాటిక, నాటకాలు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంగా ప్రసారమయ్యాయి. 2016లో ఆకాశవాణి భారతి కేంద్రంలో పదమూడు ఎపిసోడ్లలో హాస్య నాటికలు ప్రసారమయ్యాయి. అలాగే యవనిక, ‘అంతర్మథనం‘, ‘మ్యాచ్ ఫిక్సింగ్అనే రేడియో నాటకాలు 2000లో ప్రచురించారు. అలాగే నివేదితఅనే రేడియో నాటకం 2003లో ప్రచురించారు.

1.ఉత్తరం – 2002లో 2. స్పర్శ – 2007లో 3. రంగస్థలం 4. శ్రద్ధాంజలి – కార్గిల్లో చనిపోయిన యుద్ధ వీరుడి వార్తా స్ఫూర్తి. 5. మేమూ మనుషులమే – వలస కూలీల జీవితం,6. హైటెక్ కాపురం,7. మిస్సమ్మ,8. అనగనగా ఓ రాజకుమారి, 9. ద్రౌపది,10. హ్యాంగ్ మీ ప్లీజ్ – ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాయబడినది. ఈ నాటకాలన్నీ విజయలక్ష్మిగారికి మంచి గుర్తింపునిచ్చాయి.

అత్తలూరి విజయలక్ష్మి ఐదు టి.వి. ధారావాహికలను రచించారు. అవి,1. కాంతిరేఖ,2. నివేదిత,3. మరో ఝాన్సీ, 4. పల్లకిలో పల్లవి,5. అతడు ఆమె అమెరికా. పత్రికలలో కాలమిస్టుగా 1. లోకం తీరు ఈ కాలమ్శీర్షికతో ఆంధ్ర భూమి దిన పత్రికలోనూ, 2. యువతరంశీర్షికతో ప్రజాశక్తిలోనూ,3. శుభాశీస్సులు‘, ‘రిలేషన్ షిప్శీర్షికలతో ఆంధ్ర ప్రభలోనూ,4. వాక్ టాక్శీర్షికతో ఈ వారం మాస పత్రికలోనూ కాలమిస్టుగా పనిచేశారు.

 1997లో సఖ్య సాహితీ సంస్థ వారిచే అబ్బూరి రుక్మిణమ్మ స్మారక పురస్కారం, 2003లో ఆకాశవాణిలో బలినాటకానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం, 2008లో నివేదితసీరియల్ కు యునిసెఫ్ అంతర్జాతీయ పురస్కారం. 2017లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీవారి కీర్తి పురస్కారం, 2017లో అమృతలత అపురూపనాటకానికి ఉత్తమ నాటక రచయిత్రి పురస్కారం, 2017లో యవనికనాటక సంపుటికి కొలకలూరి విశ్రాంతమ్మపురస్కారం, 2017లో నార్ల విశిష్ట సాహితీ పురస్కారం, 2018లో బాదం సరోజాదేవి స్మారక పురస్కారం, 2018లో జ్యోత్స్న కళాపీఠం ఉత్తమ రచయిత్రి పురస్కారం, 2018లో కమలాకర ట్రస్ట్ ఉత్తమ రచయిత్రి పురస్కారం, 2018లో మానస ఇంటర్నేషనల్ ఉగాది పురస్కారం, 2019లో లేఖిని మహిళా రచయిత్రుల సంస్థ  పురస్కారం, 2019లో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ తెన్నేటి లత స్మారక పురస్కారం పొందారు.

ఆధునిక భావాలతో సాంప్రదాయాన్ని తక్కువ చేయకుండా ప్రతికథనీ సామాజికకోణంలో తీర్చిదిద్దారు. కరోనా (వైరస్) వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడించిన వేళ మానవ సమాజం ఎన్ని సమస్యల్ని ఎదుర్కొందో, ఏవిధంగా స్పందించిందో వివరిస్తూ “లాక్డౌన్ వెతలు మరికొన్ని కతలు” అనే  కథల సంపుటిని అత్తలూరి విజయలక్ష్మి రచించారు. ఇవి లాక్డౌన్ సంధర్భంలో రాయబడినవి. కాలక్షేప కథల్లా, కరోనా కష్టకాలంలోని అనుభవాల్ని, ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లు మలిచారు. లాక్డౌన్ సమయంలో ప్రజల మనోభావాల్ని కుటుంబ, సమాజ పరిస్థితులు ఒంటరి స్త్రీలపై సామాజిక దృష్టికోణం ఎంత హీనమైనవో చిత్రించారు. అలాగే పురుషదృక్పథం మానవ సంబంధాలను మంటగలుపుతున్న తీరును పాఠకులకు చాలా సులభశైలిలో అర్థంచేయించారు.

ఛుక్ చుక్ రైలు” కథలో రైల్వేస్టేషన్ ప్రయాణంలో రకరకాల జీవన పోరాటాలు దర్శనమిస్తాయి. కూలీల బేరాలు, బెర్త్ సర్దుబాట్లు, అమ్మకాల జోరు, కూతురి అత్తింటి పయనం, భార్యకు వీడ్కోలు కొంతదూరం వెళ్ళగానే ఫోన్ల ద్వారా పలకరింతలు  జాగ్రత్తలు, బిచ్చగాళ్ల గోల, మానవత్వంలేని మనుషులు అన్నీ కలబోసుకున్న రైలు ప్రయాణం ఒక జీవన గమనం. 

జీవితం రైలు ప్రయాణం లాంటిది. కాలంతో పాటు భారంగా కదిలే మనసులు, వీడ్కోలుల నడుమ మరెన్నో జీవన పోరాటాలు స్పష్టంగా చూడవచ్చు. మానవత్వం ఎలా అడుగంటి పోతోందో మనుషులు ప్రయాణాలు ఎటువైపో ఏస్వార్థంతో అనే ప్రశ్నలను రైలుప్రయాణంలో భాగం చేసిన వినూత్న ప్రయోగంలో మానవత్వపు స్పర్శను గమనించవచ్చు.  మన బరువుని రెక్కలరిగేలా మోసే కూలీతో గీచిగీచి బేరాలు పెట్టడంతో ప్రయాణం మొదలవుతుంది. ఓ రూపాయి అటో ఇటో కానివ్వని డబ్బుపై వ్యామోహం పేదలతో కక్కుర్తితో చేసే బేరసారాలలో లోపించిన అమానవీయతత్వాన్ని ఈకథలలో చూడొచ్చు. 

 రూపాయి కోసం కదిలే ట్రైనులోకి ప్రాణాలు లెక్క చేయక ఎక్కే వికలాంగులైన బిచ్చగాళ్ళు, వృద్ధ భిక్షకులు. వీరికి ఐదో పదో ఇవ్వడానికి ఛీ ఛీ అంటూ అసహ్యించుకోవడాలు, ఏదో ఒక పని చేసుకు బతకొచ్చుగా! అనే ఉచిత సలహాలు అన్నీ రైలు ప్రయాణంలో సర్వసాధారణంగా తారాసపడే సన్నివేశాలే. కానీ వాటికి ఒక సాహిత్యరూపాన్ని ఇవ్వడంవల్ల ఈకథ పోషించిన పాత్ర, పాఠకుల ఆలోచనావిధానంలో కొంతమార్పు చోటుచేసుకునే టుందనిపిస్తుంది. 

కడుపు చేతబట్టుకుని భిక్షాటన చేసేవాళ్ల పరిస్థితి ఎలాంటిదో ఈ కథ వేదనాభరితంగా చిత్రించింది. ఉద్యోగులకు సగం జీతాలైనా కష్టకాలంలో అందాయి. ప్రభుత్వం పేద కుటుంబాలకు ఏవో పంచినా అవి నామమాత్రమే. మానవతావాదుల దానాలు ఒకటి రెండు రోజులవరకే.  దిన వేతనంపై పనిచేసే కూలీలకు మిగిలిన రోజులు గడవడం కష్టం. అలాంటిది వీధి వీధి తిరిగి యాచించి ఏచెట్టుకిందో, రోడ్డుపక్కనో నిద్రించేవాళ్ళ పరిస్థితి ఘోరాతిఘోరంగా తయారైంది. కట్టుకోడానికి బట్ట కూడా లేనివారు, మాస్కులకై ఏం చేయలేని పరిస్థితి. అక్కడా ఇక్కడా తిరగడంవలన కరోనా అంటించుకొని వస్తారని ఎవరూ చుక్క నీరు కూడా  ఇవ్వని కర్కోటక పరిస్థితులు దేశమంతా నెలకొన్నాయి.

, “కరోనా సోకలేదు కదా! సోకితే మాత్రం ముష్టివాళ్ళ ప్రాణాలకు విలువేమిస్తారు?” అన్న చుక్కమ్మ మాటల్లో పూటగడవని దీనుల దుస్థితిని చూపుతోంది. అన్నీ వుండి చికిత్స చేసుకునే వాళ్ళ పరిస్థితులే దయనీయంగా వున్నప్పుడు, ఆకలి కడుపులు చూసే స్వప్నలాంటి వాళ్ళు  కరువౌతున్న క్రమంలో మానవత్వం యొక్క అస్తిత్వాన్ని ఈకథ ప్రశ్నార్థకం చేసింది.

చుక్కమ్మ చెప్పినట్లుఈడ నూకితే ఆడ, ఆడ నూకితే ఈడ..అని కుదురులేని వాళ్ళకు, మామూలు రోజుల్లోనే వాళ్ళకు  ఇంతముద్ద దొరకడం కష్టం. కరోనా కాలంలో రేపటి పరిస్థితి ఏంటో తెలియక, ఇళ్ళలోవున్నవాళ్ళు కూడా దయతో ఒక్క కడుపైనా నింపాలని ఆలోచించలేని స్థితి. ఆకలి అందరికీ వుంటుంది. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇచ్చే దిక్కు  కరువైనప్పుడు వారి బతుకులు ఎలా తెల్లవారినా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదని రోడ్డు పక్కన అనాథ చావులలోని దైన్యతని చుక్కమ్మ పాత్రలో చిత్రించారు.

కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేక మండిపోతున్న ఎండలో ఆడ మగ నెలల బిడ్డల్ని వీపుకుకట్టి, బరువునెత్తికెత్తుకొని తమ తమ రాష్ట్రం దిక్కుకి వెళుతున్నారు. అన్ని బాధలతో వెళ్ళినా రాష్ట్రాలు దాటకూడదని రహదారులు మూసేస్తే రోడ్లపై దిక్కుతోచక నిలబడిన వాళ్ళ బాధ వర్ణనాతీతం. దారిలో రాలిపోయిన బీదా బిక్కి రోడ్డు పక్క మట్టిలో అనాథ శవాలుగా కప్పబడిపోయారు. ఇలాంటి పరిస్థితిని వలసకార్మికులు ఎదుర్కొన్న పరిస్థితులకు స్పందించినవాళ్ళ గొప్ప మనసులని ఈకథ సున్నితంగా ఆవిష్కరించింది.

 “అనుకున్న అతిథి” కరోనా సోకకుండా గృహనిర్భంధాలను సర్కారు అమలుపరిచిన నేపధ్యంలో వచ్చిన కథ ఇది. స్వప్నఉండే వీధికి చుక్కమ్మ అనే బిచ్చగత్తె వస్తుండేది. స్వప్నరోజూ ఆమెకు అన్నం పెడుతుండేది. లాక్ డౌన్ విధించినప్పటి నుండి చుక్కమ్మ కనిపించడంలేదని ఎలావుందో, లేక చనిపోయిందోనని భర్తతో అంటుండగా చుక్కమ్మ స్వరం విని, ఆమెకు పప్పు రొట్టెలు అందిస్తుంది. జాగ్రత్తలు చెప్పిన స్వప్నతో కడుపుకి నీళ్ళు గుక్కెడుకూడా ఇచ్చే వాళ్ళు కరువైనపుడు మా బతుకులింతేనని ఆమె వెళ్ళిపోతుంది.

కరోనా కష్టకాలంలో సాటివాళ్ళు ఆకలికి, దాహానికి, సాయానికి తల్లడిల్లుతుంటే మనకెందుకని కళ్లు మూసుకోవడం సరికాదు. కరోనా లాక్ డౌన్ సమయంలో అలాంటి మానవత్వం ఎందరినో ఆదుకొంది. అన్నీవున్నవాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తరులు. కానీ దీనుల గురించి పట్టించుకొన్నవారే అసలైన మానవతా వాదులని  రచయిత్రి కథనాలు విశదపరుస్తున్నాయి.

కథానాయకుడు కరోనా కష్టకాలంలో ఉన్న ఉద్యోగం కోల్పోతాడు. వసతిగృహం నుంచి వెళ్ళగొడతారు. ఆర్థికస్థితి మెరుగ్గా వున్నవాళ్ళు సొంతవూర్లకు వెళ్ళిపోతారు. నిరుద్యోగి అయిన అతనితో పాటు మరో ఐదుమంది పేదస్నేహితులు నడిచైనా సరే వూరెళ్ళడానికి ఎవరిదారిన వారు నడక మొదలు పెడతారు. నలభై కిలోమీటర్లు నడిచి ఎవరో దాతలిచ్చిన అన్నం, నీళ్ళతో సేదతీరుతారు. రోడ్డుకి ఆవల భాషరాని వలసకార్మికులు పెట్టేబేడలతో, మానవతావాదులిచ్చే భోజనానికై క్యూలు కడతారు. ఇంతలో ఒక వృద్ధురాలు అక్కడకు వెళ్ళడానికి రోడ్డు దాటించమని ప్రాధేయపడినా ఎవరూ సాయం చేయకపోవడంతో ఆమె నీరసంతో పడిపోతుంది. ఆకలిబాధ తెలిసిన బాటసారి ఆమెని లేపి చేయిపట్టి నడిపిస్తాడు. క్యూలో నిలబడిన వాళ్ళు ముసలమ్మకు సాయంచేస్తే తాము వరుస తప్పిపోతామేమోనని భయపడి వాళ్ళు ఎవరూ కదలరు. కానీ మానవత్వంతో స్పందించినతనికి తావిచ్చి క్యూలో ముందుకు పంపుతారు. ఆధునిక యాంత్రికజీవితంలో మరుగునవున్న మానవీయ విలువలు కరోనా కష్టకాలంలో బహిర్గతమవడాన్ని రచయిత్రి అందిపుచ్చుకోగలిగారు. 

కరోనాకి అసలు బాధితులు నిరుద్యోగులు, పేదవారు, వలస కార్మికులు, బిచ్చగాళ్లకు ప్రభుత్వం ముందస్తు సూచన చేయకుండా హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించింది. పొట్టచేత పట్టుకొని వందల మైళ్ళు దాటి వచ్చిన వలసకార్మికులు ఎలా స్వస్థలాలకు చేరాలో తెలియని పరిస్థితి. భాషరాక వివరించే దిక్కుతెలియని పరిస్థితులలో వాళ్ళకు అర్థమైనది, చేతనైనదీ ఒకటే. వున్న రెండు కాళ్ళతో గమ్యం చేరాలన్న తలంపు మాత్రమే. ప్రభుత్వం తీసుకుంటామన్న నామమాత్ర చర్యలను కూడా పేపర్లకే పరిమితం చేసింది. 

రచయిత్రి ప్రభుత్వ పాలనావిధానాన్ని ఎండగడుతూ ప్రజల చైతన్యాన్ని ఉద్దేశించి కథనం చేశారు. ప్రజా సంక్షేమాన్ని, ప్రభుత్వం బాధ్యతలను మరచి స్వార్థంతో వీలైనంత సంపాదనని కూడేస్తుంటారు. కూర్చుని తిన్నా తరగని తరతరాలు తరగని ఆస్తిని, కూడబెట్టేస్తుంటారని నేటి రాజకీయాల తీరుని ఈకథలో విశ్లేషించి చూపారు.

చెయ్యాలంటే అభివృద్ధి మార్గాలు అనేకం ఉంటాయి. కానీ కుర్చీల సాక్షిగా పార్లమెంట్లలో పోట్లాడుకొంటూ ఎందుకు నేతలమయ్యామో కూడా ఆలోచించరు. ఎన్నోఆశలతో, విశ్వాసంతో అక్కడివరకూ పంపిన బడుగుల బతుకుల్ని పదవులు కట్టబెట్టాక నాయకులు విస్మరిస్తుంటారు. దేశమంతటా ఇదే క్రమం. ఇలాంటి వాళ్ళ పట్ల చైతన్యంతో వ్యవహరించాలని రచయిత్రి సూచించారు. అంటే ప్రతి పౌరునికీ ఓటు అనే ఆయుధం ఉంటుంది. కులానికో, మతానికో, అభిమానానికో, సారాయికో, డబ్బుకో అమ్ముడుపోకుండా సరైన అభివృద్ధిని చేసే నాయకుడు ఎవరుంటారో వాళ్ళకు, పార్టీలకు అతీతంగా ఓటు వేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. నేర చరిత్రలేని ప్రజా క్షేమమే ముఖ్యమని, బడుగుల కష్టమెరిగిన వాళ్ళను కుర్చీలో కూర్చొనేఅవకాశం ఇవ్వాలి. సమాజ శ్రేయస్సుని, అభివృద్ధిని కాంక్షించే యువ నేతలకు ఓట్లు వేస్తే మార్పు అనేది రాజకీయ వ్యవస్థలో ప్రారంభం అవుతుంది. మన తప్పిదానికి దేశ భవిష్యత్ ను తాకట్టుపెట్టే హక్కు ఎవరికీ లేదు. సరైన సమయంలో సరైన ఆలోచన అవసరం అని వ్యక్తిచైతన్యం సామాజిక చైతన్యంగా పర్యవసిస్తే రాజకీయ ప్రక్షాళన జరిగి తీరుతుందని, కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. నిర్ణీత సమయంలోనే దుకాణాలు తెరవాలని ఆసమయం దాటకముందే మూసేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నిబంధనల పట్ల సామాజిక మాధ్యమాలలో అప్రమత్తం చేసింది. మనిషికి మనిషి తగలకుండా ముఖానికి మాస్కులతో ఆ కొద్దిసేపటిలో బయటకు రమ్మని ఆదేశించింది. శానిటైజర్లు రుద్దుకుంటూ చేతులు కడుక్కోమని ముఖానికి దగ్గరగా చేతులు ఉంచొద్దని చెప్పడం వైరస్ వ్యాప్తిని అరికట్టడానికే దానికి తగినట్లు అవసరం అయిన వస్తువులు ఒక్కసారిగా అన్నీ తెచ్చుకోవడం, కూరగాయలు వారానికి సరిపడా తెచ్చుకోవడం చెయ్యాలి. అప్పుడే బయట తిరిగే సందర్భాలు తగ్గుతాయి. ప్రమాదం బారిన పడకూడదనే విషయాలన్నీ బహుముఖాలుగా ఈ చిన్నకథలలో రచయిత్రి ప్రబోధిస్తున్నారు.

బయటకు వెళ్ళినవారు అపార్ట్మెంట్ లిఫ్ట్ ద్వారా కాకుండా మెట్లమార్గాన్ని వాడటం, పాల ప్యాకెట్లు కడిగి లోనికి తెచ్చుకోవడం వంటివి కరోనా రాకుండా జాగ్రత్త పడటంలో భాగమే. కూరగాయలైతే ఉప్పు నీటిలో కడిగి ఆరబెట్టడం, సంచులు డెట్టాల్ నీళ్ళలోవేసి ఆరేయడాలూ తప్పడం లేదు. ఎందుకంటే వ్యాధి కారక వైరస్ సోకిన వ్యక్తి వేటిని ముట్టుకున్నా వాటిని మరొక ఆరోగ్యవంతుడు తాకితే వైరస్ అతనికి సోకుతుంది.తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్కులతో ఉండటం మంచిది. రామం సరదాగా ఒళ్ళంతా ప్లాస్టిక్ తొడుగు వేసుకుంటాననడం హాస్యంగా అనిపించినా క్వారంటైన్కి తరలించే వ్యక్తిని అలాగే తీసుకెళతారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏ దారిన వస్తుందోననే భయంతో మానసిక ఆందోళన ఎంతగానో భయపెట్టి కృంగదీస్తోంది. కరోనా రాకుండా అనేక దినుసుల పానీయాలు, వేడినీళ్ళు త్రాగడంతో పాటు ఇంట్లో పెద్దవయస్కులుంటే మరింతగా జాగ్రత్తలు పాటించల్సి వస్తోంది. ఇవన్నీఒక సామాజిక బాధ్యతగా నిర్వర్తించాల్సిందేనన్న చైతన్యాన్నికథాంతర్భాగంగా తెలియజేశారు.

గరంకథలో సహజీవనాల పట్ల స్త్రీల దృక్పథం, దానికి గల కారణాలను అన్వేషించారు. ఈకాలంకథలో విడాకుల కారణాలు, ‘హ్యాపీ యానివర్సరీ‘, ‘స్పర్శదనాల్లో పెద్దవారు, పిల్లల విదేశీవాసాల వలన ఎంత బాధపడుతున్నారో చూపారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని మాతృభాషపై, ప్రకృతిపై ఎలా చూపుతోందో ఆధునిక మనుషుల డబ్బు పిచ్చి, స్వార్థాలను కూడా ఈకథలో వివరించారు. మొత్తంమీద అన్ని కోణాలలో వ్యవస్థపై ఆధునికత ప్రభావాన్ని విశ్లేషించారు. సాంప్రదాయకత, ఆధునికతల మధ్య ఒక చర్చని లేవదీశారు.

సామాజిక చైతన్యంలో భాగంగా స్త్రీలపై జరిగే దారుణాలపట్ల అప్రమత్తతని “హైవే” కథలోనూ, దానం చేసినపుడే సంపదకు విలువని జ్ఞాపికలో, నిబద్ధతని రక్షకుడులోనూ, ‘ మూఢనమ్మకాలపై అమ్మదేవత‘, ‘బొట్టుకథల్లో ఎండగట్టారు. మాతృభాష పట్ల మమకారాన్ని  తల్లిదండ్రులు ఎలా దూరం చేస్తున్నారో వివరించారు, వ్యవసాయం పట్ల యువత బాధ్యతని మట్టి పరిమళం‘ కథలు గుర్తు చేసాయి. సాంప్రదాయాల పాటింపు నేటి వ్యక్తుల బాధ్యతని సెంటిమెంట్‘ రూపంలో ఆలోచింపజేశారు మేరీ ఆవాజ్ సునోలో నిజమైన అభివృద్ధిపై చర్చని లేవదీసారు. దేశభక్తి, రాజకీయాల్లో యువత పాత్రను చెప్పారు. ఇలా అన్నింటినీ చూపి ప్రతి కథనంలోనూ సామాజిక స్పూర్తిని రగిలించారు. నేడు కోల్పోతోంది ఏంటో, దాన్ని పొందడానికి ఎలాంటి స్ఫూర్తి అవసరమో సంపూర్ణంగా వివరిస్తూ యోచింపజేసి, నేటి సామాజిక లోపాల్ని ఎత్తి చూపుతూ పరిష్కార మార్గాలను అన్వేషింపజేసి చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నించారు.

సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ పూర్తి స్థాయిలో అవాహన చేసుకొన్నారని, ఆమె చేసిన జీవన చిత్రణని పట్టిస్తుంది. ఎగువతరగతి కుటుంబాలలోని ఆర్థిక జాగ్రత్తలు, సమస్యలు వారిపట్ల ఇతరుల ప్రవర్తనలను పారాహుషార్, సితార‘ కథలలో చిత్రించారు. అలాగే మధ్యతరగతి కౌటుంబిక వ్యవస్థ పొద్దువాలిపోయిందిలో వాళ్ళ ఎదురుచూపులు, ‘వేడుకకథలో ఆర్థికాంశాలు, ‘సతీసమేతుడిలో స్వార్థాలూ, ‘దిశమార్చిన ప్రత్యూష పవనంలో మనస్తత్వాలు, ‘చట్రంలో బాధలూ, సర్దుకోవడాలు అన్నీ ఆలోచింపజేస్తూ ప్రతీకథలో మనమో, మన చుట్టూ వున్న కుటుంబాలలోనే జరిగాయన్నంత సహజంగా చిత్రించారు. దిగువ తరగతి కుటుంబాల బాధలను ఆకలితీరింది‘, పేదతల్లి బాధ్యతాయుత ప్రవర్తనను కృష్ణవంటి కథలలో చెప్పిన తీరు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ఆయా పాత్రల మనస్తత్వాలు, సమస్యలు, కారణాలు, అధిగమింపు చైతన్యాలను చిత్రించారు.

ఆధునిక కాలంలో గ్లోబలైజేషన్ ప్రభావం స్త్రీలపై, కుటుంబాలపై, సమాజంపై ఏవిధంగా పడ్డాయో కథనాలు, పాత్రల ద్వారా వివరించారు. నవీన దృక్పథాలు తల్లులపై వారి వ్యక్తిత్వంపై ఎంత ఆధునికతని పెంచి, తద్వారా వచ్చిన మార్పుల్ని, సమస్యల్ని గర్భగుడి‘, ‘తల్లిపక్షి‘ ‘మిస్సింగ్ యూ‘, ‘ప్రశ్న‘, ‘గెలుపు‘, ‘యాక్సిడెంట్కథల్లో గమనింపజేసారు. ఆధునిక స్త్రీలో వివాహ వ్యవస్థ పట్ల జరిగిన పరిణామాలు, వాటికి గల కారణాలను తెలిపారు.

ఈమె కథలలో స్త్రీ జీవన చిత్రణ, గ్లోబలైజేషన్ ప్రభావం, వ్యక్తి, కుటుంబ, సమాజాలపై ఏ విధంగా పడిందో, ఆధునిక జీవితంలో మార్పులు ఎలాచోటు చేసుకున్నాయో తెలిపారు. అత్తలూరి విజయలక్ష్మి “అపూర్వ”, “అపురూప”, “ఆనాటి చెలిమి ఒక కల”, “ఒప్పందం”, “ఒక కోయిల గుండె చప్పుడు” అనే ఐదు కథాసంపుటాలను, లాక్డౌన్ వెతలు అనే సంపుటిలోని చిన్న కథలను పూర్తిగా, ఆవిశేషాంశాలన్నింటినీ ఆకళింపుతో రచించారు.

స్త్రీ జీవన చిత్రణలో ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పట్ల ఆమె పొందిన, పొందాల్సిన చైతన్యం వంటివి కథావస్తువులుగా ఎంచుకొన్నారు. వాటిని అధిగమించే ప్రయత్నం చేసిన ఓ ఇంటి పెద్ద ముందడుగు వేడుక‘, పారాహుషార్కథా వస్తువుగాతీసుకున్నారు. అల్లుడి ఆస్తిని అనుభవించాలనుకున్న యువకుడిని దారికి తెచ్చిన అతని మామ, భార్యల వ్యూహం కనిపిస్తుంది. క్షణికానందానికి లోనైతే వ్యక్తిత్వరాహిత్యాన్ని జీవితాంతం భరించాల్సి వస్తుందని తెలివిగా ఆ గండాన్ని దాటిన యువతి ఓర్పు ఈక్షణం దాటనీకథ ఇతివృత్తం. ఆవిష్కారంకథలో పురుషాహంకార సాంప్రదాయ అడ్డు కట్టలు తెంచుకొని వెళ్ళిన ఒక ఆధునిక యువతి విధవరాలైన తన సవతి బాధ్యతని తీసుకోవడం వస్తువు.

తననో మనిషిగా గుర్తించని సంసారంలో బాధ్యతలన్నీ తీర్చుకొని ప్రశాంతతకై, ఆశ్రమానికి తరలిన స్త్రీ వృత్తాంతాన్ని వానప్రస్తంలో చర్చించారు. సాంకేతిక అభివృద్ధి కన్నా పేదరికం, బాలకార్మిక వ్యవస్థని రూపుమాపే చర్యలే నిజమైన కర్తవ్యమని యదార్థాలతో తన గళాన్ని వినిపించిన ఇతివృత్తం “మేరీ ఆవాజ్ సునో”. ఈకథ పాతబస్తీలోని ముస్లిం కుటుంబాల జీవిత నేపథ్యంలో సాగింది.

సెంటిమెంట్కథలోని ఇతివృత్తం దురాచారాలు వేరు, సెంటిమెంట్లు వేరనీ కుటుంబ ఆచారాలను వారసత్వంగా ఆధునిక యువత, ఈనేలపై పుట్టినందుకు చేపట్టాల్సిందేనని ఉద్భోధిస్తుంది. ఈ కథాంశంలోని పాక్షిక సత్యం పాఠకులను  ఆలోచింపజేస్తోంది. ఆడపిల్లవని అనుక్షణం గుర్తు చేసే కుటుంబం, సమాజం  అవగాహనా రాహిత్యాన్నికాపలాకథ నిరూపించింది.

సంకెళ్లుకథావస్తువు పురుషాహంకారం. స్త్రీని వైవాహికబంధం పేర బంధీని చేసే బంధనాలను రచయిత్రి విసిరికొట్టాలంటోంది. మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించి స్త్రీ జీవితానికి రక్షణ నిచ్చినరూపం స్త్రీలకు సంబంధించి అది కుటుంబమైనా, సమాజమైనా, ప్రపంచీకరణైనా ఏవో ఒకమూల అతివని ఆశ్రయించాయి. అది చూడటానికి స్త్రీ పక్షపాతాన్ని చూపుతున్నట్లు కాక సమాజ కోణంలోని చర్చకు పెట్టే నిజ దర్శనీయతని చూపడం రచయిత్రి చేయితిరిగిన నేర్పరితనానికి, ఆమె దర్శించిన జీవితదృక్కోణానికి, విషయ ప్రధానాంశాలలో ఆలోచనలను రేకెత్తించేలా ఉన్నతమైన శిల్పరీతిని ప్రదర్శించాయి. వర్తమాన రచయిత్రిగా ఈమె రచనల్లో సమకాలీన చర్చనీయమైన కథాంశాలుండటం గమనార్హం.

సాంప్రదాయపు తెరను ఛేదించలేని ఒక విద్యాధికురాలిని ప్రభావితం చేసిన యువతి మాటలు ఆమెను పునర్వివాహం వైపు నడిపించే కథావస్తువు తెరకథలో, అభిమానికథా వస్తువుని గమనిస్తే, ఉన్నతుడనుకొన్న రచయితలో దాగున్న పురుషకోణానికి సదరు అభిమాని అసహ్యించుకోవడం మనిషిలో దాగిన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.

సమాజానికి కానుకకథలోని ఇతివృత్తం తన ప్రమేయం ఏమాత్రంలేని యువతి, కాముకుల పశుత్వానికి బలై బిడ్డను మోస్తుంది. కన్నవారి అసహ్యాన్ని కూడా చవిచూస్తుంది. ఆ బిడ్డని చంపుకోకుండా సమాజ సేవకునిగా చేసి స్పందన చూడమన్న డాక్టర్ తీర్పు ఈకథలోని ఇతివృత్తంగా కనిపిస్తుంది. తక్కువ చేసిన వాడి ముందే ఆత్మ విశ్వాసంతో ఎదిగి కాళ్ళ వద్దకు వచ్చిన అతనికన్నా తన కర్తవ్య నిర్వహణే ముఖ్యమన్న స్త్రీ హృదయ నిబద్ధత అపూర్వకథాంశం.తల్లిపక్షిబిడ్డల్ని పొదువుకుని కాపాడటంలోని బాధ్యతని గ్రహించిన ఆధునిక మాతృమూర్తి తనని సరిదిద్దుకున్న వైనమే ఈకథ ఇతివృత్తం.

అత్తలూరి విజయలక్ష్మి కథలలో ఇతివృత్తం వేటికవే ప్రత్యేకమైనవి. ఈమె కథా వస్తువులన్నీ నేటి  యదార్థ సామాజికతలోని  సూటితనాన్ని వ్యక్తపరుస్తున్నాయి. హ్యూమన్ రిలేషన్స్ కానీ ఆచరణలో కనీస మానవతని ప్రదర్శించని తీరుని,  ’లేబర్ గోల, ముష్టిగోల” అంటూ సాటి వారిని నీచంగా చూసే మనస్తత్వాన్ని నిరసించారు.

రచయిత్రి అధికంగా ఇతివృత్తాలను స్త్రీల పరంగానే ఎంచుకొన్నారు. ఆధునిక, సాంప్రదాయాలు సంఘర్షణని చూపుతూ నవీన, పాశ్చాత్య భావజాలాన్ని సమర్థించడం వలన కొంతమేర సాంప్రదాయ భావాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. కుటుంబ, సామాజిక, మానవ సంబంధాల పరంగా స్త్రీ పక్షం వహించినట్లనిపించేలా వున్నాయి. భాషాపర వైవిధ్యానికి కొంత లోపంవుంది. ఉత్తర మాండలికాన్ని కొంత మేర చూపి మరే భేదాలను చూపని పాత్రల సృష్టి కొంత మూసపోసిన్నట్లైంది. కానీ సమకాలీన అంశాలలోని వాస్తవాలను ఎత్తి చూపాలంటే కొన్నింటిని భరించక తప్పదు, కొంతవరకు విమర్శలకు అతీతంగా తనదైన శైలిని ప్రదర్శించారు.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.