రాగో

భాగం-4

– సాధన 

రోజులు గడుస్తున్నాయి. రాగో మనసు ఓ పట్టాన నిలవడం లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దస్తమానం ఎటూ పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడికి పోయినా, ఏ పరిచయస్తుల వద్దనైనా, చిన్ననాటి స్నేహితుల వద్దనైనా తలదాచుకోవడానికి పూట, అరపూట ఉండాల్సి వచ్చేసరికి అక్కడి వారంతా ‘కేర్లే (భర్తను వదలి మరో సంబంధం వెతుక్కునే ఆడది) అంటూ అదో రకంగా చూస్తుంటే దిన దిన గండంగా సాగుతుంది. ఏ కాలం నాడు ఏ పెద్దలు నామకరణం చేశారో గానీ నేటికీ ఏ మాత్రం జంకు లేకుండా మొగం మీదే కేర్లే అని పిలుస్తూ భర్తను విడిచిన ప్రతి స్త్రీని వేధించడం ఒక ఆనవాయితీగానే వస్తుంది. ఈ మధ్యకాలం గడపడానికి తాను తిరుగుతున్న ఊర్లల్లో కొందరు యువకులు వెటకారంగా వెంట పడుతుంటే, మరికొందరు నిస్సంకోచంగా ఊరి పెద్దలతోనే సోల్జీ (రాయబారం) పెట్టడం భరించరానిదిగానే ఉంటుంది. 

మాడియా మహిళ తరతరాలుగా అనుభవిస్తున్న ఈ చిత్రహింసలు తెల్లారేదెపుడు అనేది ఆనాటికి రాగోకు అర్థం కాని, పరిష్కారం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏ వయసుకు ఆ ముచ్చట ఉండాలని కొందరు మొగం పైనే అంటుంటే, ఎక్కడో దగ్గర జోడైతే సరిపోతుందని మరికొందరు ఊరికే ఊదరగొడుతున్నారు. పుట్టింటి మర్యాదలు, తల్లి తరపు సంబంధాలు నిలబెట్టేదానికి పుటుల్ వారికే పోతే మంచిదని అంటారు కొందరు సాంప్రదాయక పెద్దలు. వీరెవరికి రాగో మనసు తెలియదు. రాగోకు ఒక మనసుంటుందనే సంగతి వారు పట్టించుకోరు. 

కేర్దే ముద్ర క్రమంగా స్థిరపడిపోతుంటే తన తోటి ఆస్తులు కూడ తేలిగ్గా చూస్తున్నారు. కన్నవారికి, కొన్నవారికి దొరకకుండా రోజుల తరబడి గడపాలంటే కష్టంగానే ఉంది. ఎక్కడా పూటకేమి దొరకనపుడు, ఏ ఖేతుల్లోనయినా అదృష్టవశాత్తు ఏది కంటపడితే దానితోనే చాటుమాటుగా పొట్ట నింపుకొని తిరిగి అక్కడి నుండి ఎవరూ చూడకుండా ఉడాయించడం. ఇలా తిరుగుతుండడం అభిమానాన్ని చంపుకొని పొట్టకోసం చేసే నీచమైన పనులే అని మనసులో కుమిలిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ ఖేతుల్లో ఎవరైనా గడుసువాళ్ళు వెంటపడితే తప్పుకోవడం సవాలుగానే ఉంటుంది. ఒక వేళ బలవంతంగా బలైపోవడమే తప్పకపోతే ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడుతూ అడవి పట్టుకొని తిరగడమూ, రేపేదో ఒక రోజు కోరుకున్న తీరుగా బతుకొచ్చుకదా అని ఎదురుచూడడం ఇదంతా దండుగమారి తిప్పలే అవుతుంది కదా అనే రంధి నిత్యం వెంటాడుతుంది. ఈ

అలా ఒకనాడు విపరీతంగా ఆకలిగా ఉన్నపుడు ఎదురుగా కనపడ్డ ఓ ఖేతుల్లో చొచ్చింది రాగో. బోర్లేసి ఉన్న డూటి (వెగురు గంప)ని పక్కకు పడేసి గంజులో నుంచే గబగబా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుంది. ఇంతలోనే బయట ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. ఒక్క గెంతులో బయటపడి అడవి దారి పట్టింది రాగో. ఆ వచ్చిన వారెవరో ఆమె చూడలేదు. కానీ ఆమె మాత్రం వారి కంటపడనే పడింది. 

ఆ ప్రాంతం రాగో పుట్టిన ఊరికీ, మేనమామల ఊరికి మధ్యగా ఉంటుంది. అడవిలో పడ్డ రాగో వెనక్కి చూడకుండా చరచరా చెట్లు తుప్పలు దాటుకుంటూ లోలోపలికి పోతుంది. ఒంట్లో ఓపిక లేదు. పైగా ఆనాటికి బహిష్టయి ఆఖరి రోజు. వాగులో దిగి బండల చాటుకు పోయి స్నానం చేస్తే బావుండనిపించి రాగో ఆ దారి పట్టింది.

రాగోను చూసింది ఆ ఊరి వాళ్ళు కాదు. ఆమె మేనమామ, అతని కొడుకే. రాగో చేయిజారిపోయినప్పటి నుండి కసిగా ఉన్న బావ ఆమెను ఖేతుల్లోంచి గెంతిన క్షణమే గుర్తుపట్టాడు. వెంటనే తండ్రి కొడుకు కూడబలుక్కొని వచ్చిన పని వదలిపెట్టి ఆ ఊరి లెయ్యోల్లను (యువకులని) వెంటేసుకొని అడవిలో వెతకడం ప్రారంభించారు.

కంటపడ్డ జంతువునే వదలని వారికి ఈ ఆడదాన్ని పట్టుకోవడం ఒక కష్టమా? ఇంకేం? వేట ప్రారంభించారు. దొరక్కుండా ఎటు పోగలదనే ధీమాతోనే రాగో తండ్రికి కూడ కబురు పెట్టారు.

వారు జట్లు జట్లుగా విడిపోయి అడవంతా గాలిస్తున్నారు. చెట్లు, చేమలు, ఒర్రెలు, ఒంపులు ఏదీ విడవడం లేదు. చుట్టూ వలపెట్టి జంతువును వేటాడినట్టే వెతుకుతున్నారు. ఏ పొదను విడవడం లేదు. వాగులో స్నానం చేసి గుడ్డలుతుక్కుంటున్న రాగో ఒక జట్టు కంట్లో పడనే పడింది. ఆ జట్టులో నున్న నలుగురూ ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. దాన్నెలా పట్టుకోవాలో కళ్ళతోనే మాట్లాడుకున్నారు. రాగో బావ ఆ జుట్టులోనే ఉన్నాడు. పిల్ల అడుగులో పిల్లను చేరుకున్నారు. ఆకుల అలికిడి కూడ కాకుండా జాగ్రత్తగా దగ్గరికి చేరుకున్నారు. తన ధ్యాసలో తానున్న రాగో పరాయి మగాడు మీదపడే చేయి పట్టేవరకు గమనించనేలేదు. తత్తరపడిన రాగో తేరుకునేసరికి బావతో పాటు మరో ముగ్గురు ఎదురుగా ఉన్నారు. పట్టుబడ్డ పిట్టలా వజవజ వణుకుతున్న రాగోను చేతులు విరిచికట్టి వెంట నడిపించుకుంటూ ఈడ్చుకుపోయారు.

ఊరు చేరుకున్న రాగోను గోటుల్ ముందు నిలబెట్టారు. ఊరి జనాలందరూ అక్కడ గుమిగూడారు. వియ్యంకుల కబురు అందుకొని వచ్చిన రాగో తండ్రి కూడా ఆ గుంపులో ఉన్నాడు. పిల్లలు వింతగా చూస్తుంటే తిట్టేవాళ్ళు తిడుతున్నారు. వెక్కిరిచ్చేవాళ్ళు వెక్కిరిస్తున్నారు. పిల్ల పంచాయితి మొదలయ్యింది. రాగో మామ నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. దెబ్బలు కొట్లతో కమిలిపోయిన రాగో ఒళ్ళంతా పుండులా సలుపుతుంది. ఆ రాత్రికే పెళ్ళి జరిపించాలని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంది మధ్యలో తలవంచుకుని నిలబడ్డ రాగో సగం ఏడుపు సగం మాటలుగా “నేను వానికి పోను” అని గొణగడం తప్ప మరో మాట అనడం లేదు.

‘ఎప్పటికైనా నీ ఇంటికివ్వాల్సిందే. నువ్వు ఏం చేసుకుంటవో “నీ ఇష్టం, అన్నట్టు మెదలకుండా కూచున్నడు దల్సు. ఆ తండ్రి చేసేది అంతే. అతడు ఆదుకుంటాడనే ఆశ రాగోకి లేదు. తండ్రి చేతికే దొరికినా తనని ఈ ఊరికి తెచ్చి అప్పజెప్పేవాడే. అప్పుడయినా జరిగే తంతు ఇదే. రాగో మామ మాత్రం ‘ఇవ్వాళ దొరికింది పోరి. ఇక నా తిప్పల తప్పింది’ అన్నట్టు ధీమాగా తెగ వాగుతున్నాడు. ఈ రాత్రితో రాగో తనది కాబోతుందని రాగో బావ మాత్రం తెగ మురిసిపోతున్నాడు.

ఆనాడు గది నుండి బయటపడడానికి కూచిని బోల్తా కొట్టించగలిగింది. మరి ఈ రోజు ఏ కూచి దొరుకుతుంది? ఈ నరకం నుంచి తాను బయటపడుతుందా? మేకపిల్లలా బలైపోవలసిందేనా? తన బతుకు ఏం కానుంది? గోటుల్ ముందు అందరి మధ్యలో నిల్చున్న రాగో బుర్రలో, అడవి మండుతూంటే వెదుర్లు ఫట్ ఫట్ మని పేల్తున్నట్లు అంతా గందరగోళంగా ఉంది.

చీకటి పడగానే అమ్మలక్కలు తలంటి పోసి గదిలోకి తోస్తారు. ఆ రోజున పెళ్ళి అంటే అదే… బలవంతంగా చేయాల్సివస్తే గొట్టెద్దలు పాటించే తంతే అంత. ఆ పూట ఊరివాళ్ళకు చేయి కడుగుతారు. కొంత కల్లు పోస్తారు. రాగో మామ వంటల వద్ద ఉన్నాడు. రాగో బావ హుషారుగా తోటివాళ్ళతో అటిటు తిరుగుతున్నాడు. రాగో అత్త కేడోలను పిలచుకుంటూ రాగోకు తలంటిపోయడానికి ఏర్పాట్లు చేస్తుంది. అంతటా చీకటి. నెగడు వెలుతుర్లోనే పనులన్నీ సాగుతున్నాయి. మరో గంటలో రాగోను గదిలోకి తోస్తారు. రక్కినా, గిల్లినా, ఏడ్చినా, తన్నినా, తన్నులు తిన్నా చివరికి రాగో బావకి దొరక్కుండా ఉండగలదా! ఆనాడెంత అల్లరైనా సరే ఊరంతా అదో సరదాగా ఆనందిస్తారే తప్ప ‘అయ్యో’ అనే వాళ్ళే ఉండరు.

శేడోలు రాగోకు తలంటి పోస్తున్నారు. ఒంటికి పోతానని చెట్ల చాటుకి పోయిన రాగో ఎంతకీ తిరిగి రాలేదు. చేతుల్లో పసుపు ముద్దలు, నీళ్ళ ముంతలతో ఎదురు చూస్తున్న కేడోలు పిలుస్తున్న అరుపులూ, పెళ్ళి ఇంట్లో చెలరేగుతున్న గందరగోళమూ రాను రాను దూరమౌతుంటే తడి బట్టలతో గజగజలాడుతూ రాగో మళ్ళీ అడవి కడుపులోకి జారుకుంది.

అత్తగారింటి నుండి బయటపడ్డ రాగోకు పెద్ద గండం గడిచినట్టయింది. కానీ మళ్ళీ ఇలా జరక్కుండా ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? –

కాళ్ళకి అడ్డం పడుతున్న తడి కుచ్చెళ్ళు రొంటిన చెక్కి పరుగులంకించుకుంది. మినుకు మినుకుమని చుక్కలు దిక్కులు చూపెడుతున్నా దిక్కుతోచని రాగోకి వాటితో పనేలేదు. వెళ్ళరాని దిక్కల్లా ఒక్క తల్లిగారిల్లు, అత్తగారిల్లే. అటుకాకుండా ఎటుపోయినా ఒకటే. అయినవాళ్ళకు అందకుండా అవస్థలన్నిటికీ దూరంగా పారిపోతే చాలు. అల్లకల్లోలంగా ఉన్న ఆలోచనల్లాగే ఆగకుండా పరిగెడుతోంది రాగో. పడుతూ, లేస్తూ దొడ్డ (వాగు) దాటినా, రోడ్డు దాటినా, గడ్డ ఎక్కినా ఆగకుండా పరిగెడుతూ తీగ తట్టుకొని తూలి ముందుకు పడబోయి చెట్టును అందుకుని తమాయించుకుంది.

చెట్ల సందుల్లో నుండి పడుతున్న మసక వెలుగులో రాగో ఆ మద్ది చెట్టును ఆనుకుని కూలబడిపోయింది. నడిచే ఓపిక, శక్తి లేదు. నిద్ర కమ్ముకొస్తుంటే బలవంతంగా ఆపుకోవడానికి తిప్పలు పడుతూంది. అందనంత దూరం వచ్చేసింది గానీ ఎలుగుబంట్లు, పెద్దపులులు వస్తాయనే భయంతోనే ఆ అవస్థ. కానీ తెల్లవారుజాము చల్లగాలి తనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి లాగేసింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.