ఒక భార్గవి – కొన్ని రాగాలు -16

నేనూ–భాగేశ్వరి

-భార్గవి

అప్పుడప్పుడే యుక్త వయస్సులోకి అడుగుపెడుతున్న రోజులు.పెద్దవాళ్లేం చెప్పినా రుచించని,ఎదురు సమాధానం చెప్పాలనిపిస్తూ వుండే కాలం.ఈ లోకం మన కోసమే సృష్టించబడిందనీ,దాన్ని మరామ్మత్తు చెయ్యగలమనీ,ఇంకా దాన్ని మనకిష్టం వచ్చినట్టుగా మలుచు కోగలమనీ,కొండలనయినా పిండి చెయ్యగలమనీ, ఆత్మవిశ్వాసంతో  అలరారే కాలం.(ఈ దశ ప్రతి ఒక్కరి జీవితంలోనూ  వుంటుందని నా నమ్మకం).అప్పుడే పెద్ద వాళ్ల అభిరుచులతో కూడా విభేదించి మన కంటూ సొంత అభిరుచులను వెతుక్కునే ఒక ఆరాటం కూడా వుండేది

సరిగ్గా అలాంటి సమయంలోనే మా ఇంట్లో ఒక రికార్డ్ ప్లేయర్ అడుగు పెట్టింది.,మా పెదనాన్న తన కిష్టమైన యం.యస్  .సుబ్బలక్ష్మి భజ గోవింద శ్లోకాలూ,పురుష సూక్తం,నమకం,చమకం,అబ్బూరి వరప్రసాద రావూ,పులిపాక వెంకటేశ్వర్లూ గార్ల పాండవోద్యోగ విజయాల పద్యాలతో ఇల్లు హోరెత్తిస్తూ వుండేవాడు,మధ్య మధ్యలో బి.బి.సి. వాళ్ల ఇంగ్లీషు ప్రొనన్సియేషన్  రికార్డుల భజన కూడా వుండేది.

సరే వీటి మధ్యలో నేను మెడికల్ కాలేజ్ నుండీ వేసవి శెలవుల్లో వస్తూ వస్తూ ,హిందీ సినిమా పాటల రికార్డులు రెండు పట్టుకొచ్చాను.

ఒకటి లతా మంగేష్కర్ హిట్లూ,రెండు “చిత్ చోర్ “సినిమాలో పాటలూ.

ఈ రికార్డులు యే ప్రాతిపదిక మీద సెలెక్ట్ చేశానో సరిగా జ్ఞాపకం లేదు.

మొట్టమొదట రికార్డ్  ఆన్ చేయంగానే “ఆజారే మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్ “అంటూ ఒక స్వరాల జలపాతం ఉరికింది,ఆ తర్వాత “నైనా బరసే రిమ్ ఝుమ్ “అంటూ ఇంకో పాట మత్తుగా మెత్తగా చుట్టుకుంటే ,”హమ్ ప్యార్ మె జలనే వాలోంకో”అనీ,”మెరీ వీణా తుమ్ బిన్ రోయే” అనే పాటలు మధుర ,విషాదాల కలయికగా పలకరించేవి,

ఇక “చిత్ చోర్ “లో పాటలు సరే సరి మోగిపోతూ వుండేవి.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే,అలా వినపడ్డ “ఆజారే పరదేశీ “అనే పాట అంత మధురంగా అనిపించడానికి కారణం భాగేశ్వరి అనే రాగం అని ఈ మధ్య వరకూ తెలియదు నాకు.

వరసగా భాగేశ్వరి ఆధారంగా కూర్చిన పాటలు హిందీ సినిమాలలోనూ,తెలుగు లోనూ వింటుంటే మతిపోతుంది నాకు.ముందస్తుగా ఈ రాగం గురించిన విశేషాలు కొన్ని

 భాగేశ్వరి  ప్రధానంగా హిందూస్థానీ  సంగీతానికి సంబంధించిన రాగం(అసలు భాగేశ్వరి అనకూడదనీ “భాగేశ్రీ “అనాలనీ ప్రముఖ గాయని గంగూబాయ్ హంగల్ గారంటారు )

మొట్టమొదట అక్బర్ ఆస్థాన గాయకుడయిన తాన్ సేన్ ఈ రాగాన్ని పాడి బాగా ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చాడంటారు.

రాత్రి రెండో జాములో పాడ దగిన రాగంగా పరిగణిస్తారు.

ఒక రకమైన జాలినీ,ఆర్తినీ పలికించే రాగం అందుకనే విరహాన్నీ, భక్తినీ,కరుణని  పలికించడానికి బాగా పనికొస్తుంది.

ముఖ్యంగా విరహోత్కంఠిత అయిన నాయిక తన ప్రియుడి కోసం ఎదురు చూస్తూ  పడే విరహ తాపాన్ని పలికించడానికి అనువైన రాగంగా భావిస్తారు.

ప్రధానంగా హిందూస్థానీ రాగమైనప్పటికీ ,ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి కర్ణాటక సంగీతంలో కూడా యెక్కువగా వాడుకలోకి వచ్చింది.ఇరవై రెండవ మేళకర్త అయిన ఖరహరప్రియ లోనుండీ జన్య రాగము.ఆరోహణలో అయిదు  స్వరాలుంటాయి,అవరోహణలో యేడు స్వరాలుంటాయి కానీ వరసగా రావు,అందుకే వక్ర రాగము అంటారు.

ఈ రాగంలోని ప్రముఖుల రచనల గురించి చెప్పాలంటే యం. డి.రామనాథన్  గారి “క్షీరసాగర శయన విభో”అనే కృతి బాగా ప్రాచుర్యంలో వుంది.

“గోవింద మిహ గోపికా నంద కందం” అనే నారాయణ తీర్థ తరంగం ఈ రాగంలో చేసిన వరస చాలా బాగుంటుంది.

ఇక తెలుగు,హిందీ ,తమిళ సినిమాల్లో చాలా విరివిగా వినిపించిన రాగం గా చెప్పుకోవాలి.అయితే చాలా సినిమా పాటలలో భాగేశ్వరి కి దగ్గరగా వుండే రాగేశ్వరి రాగ ఛాయలు కూడా మిళితమై వుంటాయి అందుకే భాగేశ్వరి రాగం ఆధారంగా చేసిన పాట అని చెప్పినప్పుడు రాగేశ్వరి రాగ ఛాయలు వినపడితే అన్యథా భావించ వద్దని మనవి ,ఎందుకంటే సినిమా పాటలలో ఇలా దగ్గరగా వుండే రాగ ఛాయలు వినపడటం సర్వ సాధారణం ,జనరంజకత్వమే దాని పరమావథి కాబట్టి.

తెలుగు సినిమాలలో సంగీత దర్శకులు కొంతమందికి ఇది అభిమాన రాగమేమో అనిపిస్తుంది.ముఖ్యంగా ఘంటసాల,రాజేశ్వరరావు ఈ రాగాన్ని ఎక్కువ ఇష్టపడినట్టు కనపడుతుంది

ఘంటసాల గారు చేసిన పాటలు—

“రామ సుగుణ ధామా రఘువంశ జలధి సోమా —లవకుశ—-లీల,సుశీల

“ఓం నమో నారాయణాయ “—శ్రీ సత్య నారాయణ వ్రత మహత్యం”   –ఘంటసాల 

“నీకోసమె నే  జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో “—-“మాయాబజార్ “–(సంగీత దర్శకుడుగా ఘంటసాల పేరున్నా,ఈ పాట చేసింది యస్ .రాజేశ్వరరావు అంటారు.)

“మదిలో మౌనముగా”—–శకుంతల—-ఘంటసాలపాడారు—-దర్శకుడు ఘంటసాల

“లోకమెరుగని బాలా”—-“బాటసారి”—-భానుమతి—-మాస్టర్ వేణు

పెండ్యాల దర్శకత్వంలో—–“రారా కనరారా కరుణ మాలినారా”—-“జగదేక వీరుని కథ”—ఘంటసాల

“అలిగితివా సఖీ ప్రియా కలత మానవా”—-“శ్రీ కృష్ణార్జున యుధ్ధం”—-ఘంటసాల

“అందాలు చిందు సీమలో వుందాము లే హాయిగా”—–“రాజనందిని”—-జిక్కి,ఎ.యమ్ రాజా–టి.వి రాజు సంగీత దర్శకత్వం,మల్లాది రచన

“మంటలు రేపే నెలరాజా “–“రాము”–దాశరథి-ఘంటసాల-సంగీతం –ఆర్ .గోవర్థనం అయితే ఈట్యూన్ చేసింది యం.యస్ .వాశ్వనాథన్ ,తమిళ మాతృకలోని ట్యూన్ ని యథాతథంగా వాడుకున్నారు.

తమిళ్ లో పి.బి .శ్రీనివాస్ “నిలవే ఎన్నిడం నిరుంగాదే “అని పాడారు.

చెప్పేదేముంది తెలుగులో ఘంటసాల గొంతు మందార పూవు రేకు అనుకుంటే పి.బి.శ్రీనివాస్ గొంతు మెత్తని గులాబీ పూవు రేకు.

“పగడాల జాబిలి చూడు”—-మూగనోము–ఘంటసాల ,సుశీల—-మళ్లీ ఆర్ . గోవర్థనమే 

“నగుమోము చూపించవా గోపాల”—-“అమరశిల్పి జక్కన—పి.సుశీల బృందం—యస్ .రాజేశ్వరరావు.

“కిల కిల నగవుల నవ మోహినీ”——–వసంత సేన”—దాశరథి—ఘంటసాల—యస్ .రాజేశ్వరరావు

“రావోయి రావోయి ఓ మాధవా”—భానుమతి–“చింతామణి”—-అద్దేపల్లి రామారావు—అయితే ఈ పాట సి.రామచంద్ర “అజాద్” సినిమా కోసం చేసి,లతా చేత పాడించిన -“నాబోలే నాబోలే రే” పాటకి కాపీ.

ఇవేకాదు ఈ మధ్య కాలంలో వచ్చిన సంగీత దర్శకులు ఇళయరాజా,ఎ.ఆర్ రహ్మాన్ లు కూడా ఈ రాగంలో చక్కటి హిట్ పాటలు చేసి తమ ప్రతిభ చాటారు.

“నాదవినోదము నాట్య విలాసము “—-అనే రాగమాలిక లో పల్లవి—“సాగరసంగమం”—–బాలు,యస్ .పి.శైలజ—-వేటూరి—ఇళయరాజా

“ఆమనీ పాడవే హాయిగా”—గీతాంజలి—-యస్ .పి.బాల సుబ్రహ్మణ్యం—వేటూరి—-ఇళయ రాజా యెంత చక్కటి పాట!

“కన్నానులే కలయికలు యేనాడు ఆగవులే”—-“బొంబాయి”–చిత్ర బృందం—-ఎ.ఆర్ రహ్మాన్ 

ఇక  ఈ రాగంలో వున్న కొన్ని హిందీ పాటలు కూడా చూద్దాం.

“ఫిర్ వొహీ షామ్ వొహీ గమ్ “—–“జహనారా”—తలత్ మెహమూద్ -మదన్ మోహన్ స్వరపరచిన ఈ పాటంటే నాకెంత వ్యామోహమో చెప్పలేను,యెప్పుడు తలుచుకున్నా గబుక్కున నోటికి వచ్చేపాట.

ఒక్క సారిగా ఒక చల్లని సాయంకాలం,మదిలో సన్నగా మెలిపెట్టే ఒక తియ్యని బాధ ఇవన్నీ తవ్వి తీసే పాట

అలాంటిదే మరోటి “ఆయే బహార్ బన్ కే లుభా కర్ చలేగయే”—-“రాజ్ హట్ “–మహ్మద్ రఫీ —శంకర్ జైకిషన్ —ఈ పాటలో  మహ్మద్ రఫీ  గొంతులో కురిసేది  విరహ వర్షమే.

సి.రామచంద్ర కి చాలా ఇష్టమైన రాగం భాగేశ్రీ

ఆయన చేసిన పాటల్లో “జాగ్ దర్ద్ ఇష్క్ జాగ్ ” అనే పాట ఈ రాగానికి చిరునామాలాంటిది,ఆ పాటని అనితర సాధ్యంగా పాడిన వారు హేమంత్ కుమార్ ,లతామంగేష్కర్ 

ఇందాక చెప్పుకున్నట్టు ఇంకో పాట “నాబోలె నాబోలె నాబోలెరే “—“అజాద్ “—లతా

ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు సలీల్ ఛౌధురీ ,ఆయన చేసిన భాగేశ్రీ

“ఆజారే పరదేశీ”—-“మధుమతి”—లతామంగేష్కర్.

“సీనేమె జలన్ ఆంఖోమె తూఫాన్ స క్యూం హై”—-“గమన్ “—సురేష్ వాడేకర్ —-జయదేవ్ 

“జీవన్ సే భరీ తేరీ ఆంఖే “—-“సఫర్ “—-కిషోర్ కుమార్ –కల్యాణ్ జీ ఆనంద్ జీ 

అదండీ భాగేశ్రీ సుసంపన్నం చేసిన కొన్ని పాటల సంగతి మనసుకి ఓదార్పునీ ,సాంత్వననీ ఇచ్చే ఈ రాగం మిమ్మలిని సేద తీర్చి వుంటుందని భావిస్తూ 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.