కనక నారాయణీయం -27

పుట్టపర్తి నాగపద్మిని

సాహిత్య అకాడమీ నుంచీ వచ్చే ఆనరోరియం డబ్బు, సుబ్రమణ్యం ప్రొద్దుటూరు రేషన్ దుకాణంలో పనిలో ఉన్న కారణంగా,వారానికోసారైనా తనతో తెచ్చే బియ్యం, చక్కెర, మరో శిష్యుడు సుబ్బన్న రాకపోకలప్పుడు పంపే సరుకులతో –  ఇలా ఏదో విధంగా రోజులు గడిచి, మొత్తానికి కాస్త ఇబ్బందులతోనే,    పుట్టపర్తి మళ్ళీ పూర్వ రూపానికి చేరుకున్నారు

       కోలుకున్న తరువాత, శ్రీ ఆర్. రంగనాథం గారి సహృదయాహ్వానం తో మళ్ళీ, శ్రీ రామకృష్ణ  ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండితులుగా పున:ప్రవేశం చేశారుపుట్టపర్తి !!

      ప్రతిరోజూ మోచంపేట ఇంటినుండి రామకృష్ణా హైస్కూల్ వెళ్ళటం పుట్టపర్తి దినచర్య. వెళ్ళేటప్పుడు, తనతో తాను సొంత దస్తూరీతో వ్రాసుకున్న భాషా నిఘంటువులో, మిల్టన్, షేక్స్పియర్, వంటి వ్రాత ప్రతులో, లేదా నన్నయనో, తిక్కననో తీసుకుని వెళ్ళటం, అక్కడి తోటలో మర్రి చెట్టుకింద ఉన్న బండమీద కూర్చుని పుస్తకాలు వల్లె వేసుకుంటూ కూర్చోవటం, ఇదే దినచర్య. స్కూల్ హెడ్ మాస్టర్ యై.వీ.సుబ్బయ్యగారుకానీ, కరస్పాండెంట్ రంగనాథం గారు కానీ పుట్టపర్తిని క్లాస్ లు తీసుకొమ్మని బలవంత పెట్టేవారు కాదు. కారణం, అప్పటికే లబ్ధ ప్రతిష్టుడైన పుట్టపర్తి తమ పాఠశాలలో ప్రవేశించటమే భాగ్యంగా భావించేవారు వారు!!

        విద్యార్థులకు, మర్రి చెట్టుకింద కూర్చుని, పుస్తకాలు వల్లె వేసుకుంటూ ఎల్లప్పుడూ కనిపించే యీ  శ్వేతాంబరధారిని చూస్తే ఏదో ఆరాధన మొదలైంది.

    ఆజానుబాహువు. స్ఫురద్రూపి. కాస్త గిరజాల జుట్టు. కళ్ళద్దాలు.   మౌనమే భూషణం వారికి!! పుట్టపర్తి వారి బిరుదే బ్రహ్మాండంగా ఉంది. ‘సరస్వతీపుత్ర ‘ !! ఒకసారెప్పుడైనా తలెత్తి చూస్తారేమోనని, పరిసరాల్లో తిరిగే ధైర్యం చేసిన విద్యార్థులకు మాత్రం, వారెప్పుడూ, కదిలీ కదలని పెదవులతో ఏదో నామం జపిస్తున్నట్టుగా అనిపించేది!!

        అమ్మో!! దగ్గరికి వెళ్తే శపిస్తారేమో అనిపించేలా తీష్ణమైన చూపులు!! ఒక వేళ యధాలాపంగా విద్యార్థుల వైపు చూసినా,  చూపుల్లో    విద్యార్థులను గుర్తించినట్టుగా కానీ, వారి పట్ల కోపం ప్రదర్శించటం కానీ ఉండేది కాదు. అసలు, వారి దగ్గరికి వెళ్ళగానే అదేమిటో, గంభీర మూర్తి    దరిదాపుల్లో   గొంతు  పెగిలేది కాదెవరికీ!! కానీ వారు వ్రాసిన ప్రార్థనా గీతం ప్రతి ఉదయమూ గొంతెత్తి పాడుతుంటే అందరికీ అదేదో నూతనోత్సాహం మనసుల్లో నిండిపోయేది!!

         పాఠశాల ప్రార్థనా గీతాన్ని స్కూల్ కరస్పాండెంట్ రంగనాథం గారు ప్రత్యేకంగా పుట్టపర్తిని అడిగి వ్రాయించారుట!!

సంగీతం సారు, కొండప్పగారు దానికి అద్భుతంగా బాణీ కట్టారు. స్కూల్ చాలా పెద్దది.    దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు.    సంగీతం సారు, కొండప్పగారు దానికి అద్భుతంగా బాణీ కట్టారు. స్కూల్ చాలా పెద్దది.దాదాపు ఐదు వందల మంది విద్యార్థులుమధ్యలో ఇంతమందీ ఉదయం వచ్చీరాగానే, పాఠశాల  ప్రార్థన  గీతం పాడేందుకు ఖాళీ స్థలం. అందరికీ కనిపించేలా ఎత్తైన స్టేజ్. కొండప్ప సారుస్కూల్ లో చక్కని కంఠస్వరం ఉన్న పిల్లలను ఎంపిక చేసుకుని వారికి నేర్పారీ పాట!తాను పెడల్ హార్మోనియం వాయిస్తూ వారితో పాటూ పాడుతుంటారు. శిక్షణనందిన విద్యార్థులు, పెద్ద గొంతులతో శ్రావ్యంగా పాడుతుంటారు. కింద ఆయా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో, క్రమశిక్షణతోవరుసల్లో నిలుచున్న విద్యార్థులంతా స్టేజ్ పై పాడే పిల్లలతో గొంతులు కలిపి పాడుతుంటే, ఆహావిద్యకున్న ప్రభావమేదో అర్థమైనట్టే ఉంటుంది, ప్రతి రోజూ!!

                          పల్లవి. మాతా నమో పాఠశాల

                     అను. అమోఘ భావాంబర పరిధానా..

                                 అనంత రుచి పరిణతాo మూర్తీ.  .  నమో పాఠశాలా

                  . 1. …………….   .(మొదటి లైను గుర్తుకు రావడం లేదు..)

                         నీ చరణంబుల కడ   శిరములు వంచగ

                         నిత్య ఋషుల సంగీతము వేదము

                               నీ దగు  వీణగ నిభృతము వెలుగునునమో..

                .2. రామ కృష్ణ ఋషి కావ్య కదoబము

                       నీ మహిమలు గని   నిరతము బొగడగ     

                       కన్న తల్లి వలె కరుణను భక్తుల  

                       మన్నన గనవే మాతా! ఎల్లర!! నమో.. పాఠ శాల..

        కానీ అదేమిటో విచిత్రం, ఆయన చేతిలో నిరతాగ్నిహోత్రం వలె, ఎప్పుడూ వెలుగుతున్న బీడి మాత్రం, ఉండేది, వీడని ఆభరణంలాగ!! అప్పుడప్పుడూ దాన్ని పీల్చి, పొగ వదులుతూ, ఆలోచనల్లో తేలిపోయే వారిని చూస్తుంటే, భలే బాగుండేది!!  

     విద్యార్థుల్లో పుట్టపర్తి వారి పట్ల ఆకర్షణకు మరో కారణం, వారేదో శివతాండవము అన్న కావ్యం వ్రాశారనీ, అది వారు పాడుతుంటేనే విని తీరాలనీ,సాక్షాత్తూ కైలాసంలో కూర్చుని శివతాండవం చూస్తున్నట్టే ఉంటుందనీ తక్కిన ఉపాధ్యాయుల ద్వారా వినటం!! పైగా, మరీ చిత్రమేమిటంటే, వారు పన్నెండు, పదమూడేళ్ళ వయసులోనే ఒక కావ్యం వ్రాస్తే, అది, వారు మళ్ళ్ళీ విద్వాన్ పరీక్ష వ్రాసినప్పుడు వారికే పాఠ్య గ్రంధంగా ఉండటం!! తామంతా ఇప్పుడు, నన్నయ్య, తిక్కన్న, పోతన్న వంటి వాళ్ళ కావ్యాలలోని పద్యాలు చదువుతున్నారు కదా!! అచ్చం అలాగ ఆయనెప్పుడో 30 ఏళ్ళ వయసులో విద్వాన్ పరీక్ష వ్రాసినప్పుడు ఆయన కావ్యం, ఆయనే విద్యార్థి వలె చదువుకోవటం, అందులో పరీక్ష వ్రాయటం, పైగా   fail  అవటం కూడా!!మొట్టమొదట విన్నప్పుడు ఆశ్చర్యం, నవ్వూ కూడా వచ్చాయి కానీ,ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకు!!    పుట్టపర్తి సారు పరీక్షలో, ఒకే ప్రశ్నకు సుమారు 50 పేజీల సమాధానమే వ్రాశారటమూడు గంటలూ కూర్చుని!! ప్రశ్నకు ఎన్ని మార్కులున్నాయో అన్నీ ఇచ్చేశారు , దిద్దే వాళ్ళు!!    ఒక ప్రశ్నకు అదీ బిట్ ప్రశ్నట,   అది!! రెండో మూడో మార్కులు వచ్చాయి!! ఫలితం వారు అనుత్తీర్ణులయ్యారట!! తరువాత, పుట్టపర్తి వారు, విశ్వవిద్యాలయానికి ఆవేశాంగా లేఖ వ్రాస్తే, అధికారులు గుర్తించి    తప్పు సవరించుకున్నారని, కర్ణాకర్ణిగా విన్నారుఅప్పుడున్న విద్యార్థులు!! పైగా ఎక్కడో తిరువనంతపురంలో పని చేశారట!!  ఢిల్లీలో కూడా పేద్ద ఆఫీస్ లో పనిచేసి, ఏదో కారణాలవల్ల, ఇప్పుడు, ఇక్కడ యీ రామకృష్ణా హైస్కూల్ లో వచ్చి చేరారట!! ఇన్ని సంగతులు తెలిసిన తరువాత, విద్యార్థుల్లో పుట్టపర్తి వారిపట్ల ఆరాధనా భావం పెరగటంలో ఆశ్చర్యమేముంది??

       ఒకసారి వారొక క్లాస్ కు పాఠం తీసుకున్నారట!! అదెక్కడ?? తరగతి గదిలో కాదు. ఇదిగో, యీ అందమైన తోట మధ్య, తానెప్పుడూ కూర్చునే మర్రి చెట్టు కిందే!! మిత్ర లాభం నుచీ పాఠం తీసుకున్నారు. మధ్య మధ్య పిట్ట కథలతో నవ్విస్తూ, చెబుతున్న వారిని చూస్తుంటే, ఎప్పుడూ ఏదో ధ్యానంలో ఉన్నట్టు మర్రి చెట్టు కింద కూర్చుని వుండే యీనేనా ఇలా పాఠం చెప్పేది, అని ఆశ్చర్యపోయి, నోళ్ళు వెళ్ళబెట్టేశారట, క్లాశ్ విద్యార్థులు!!

         మధ్య మధ్య హిమాలయాల్లో తాను చూసిన వింతలూ, కేరళలో ప్రకృతి సౌందర్యం, తాను పాల్గొన్న సభల కబుర్లూ, తన చిన్నప్పుడు తాను చేసిన పిచ్చి అల్లరీఇవన్నీ దొర్లుతూ ఉంటే,   పిల్లలంతా    కేరింతలు కొడుతూ వినేవారు!!

  తక్కిన అద్యాపకులవలె, చాలా స్త్రిక్ట్ గా బిగుసుకుపోయి చెప్పటం లేనేలేదు.   మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలా ఉండేవా క్లాసులు!!   కానీ ఎప్పుడో కానీ భాగ్యం దక్కేది కాదు అందరికీ!!

    అప్పుడప్పుడు పుట్టపర్తి అక్కడి మర్రిచెట్టుకింద కూర్చుని తన గమ్యం ఏమిటని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవారు కూడా!! వారి జ్ఞాపకాల పేటికలోంచీ ఎన్నెన్నో మేమంటే మేమని వరుస కట్టి నిలిచేవి.

    తన రచనల్లో పెనుగొండ లక్ష్మి సృష్టించిన చరిత్ర అవిస్మరణీయం. ఇక  శివతాండవము తరగని ఖ్యాతి తెచ్చి పెట్టింది. నిజమే!! ‘పాద్యం’  గురుభక్తి కి నీరాజనం పట్టింది. ‘షాజీ’  తనలోని తాత్వికతను దర్శింపజేసింది. ‘మేఘ దూతంసోషలిజం పట్ల తన మొగ్గుకు అద్దం పట్టింది. విమర్శకునిగా, చారిత్రక పరిశోధకునిగా  కూడాప్రబంధ నాయికలు,’ ‘రాయలనాటి రసికతా జీవనము’,  ‘రామకృష్ణుని రచనా వైఖరి’   వంటి రచనలు సాహిత్యంలో  తనకొక ప్రత్యేక స్థానాన్ని సంతరించి పెట్టాయి.     కానీ, ఎప్పుడొ, పెనుగొండలో, బాల్యంలోనే,  నూనూగు మీసాల వయసులో, పిట్ దొరసాని ద్వారా  ఆంగ్ల సాహిత్యంతో ఏఋపడిన గాఢానుబంధం వల్ల,   వ్రాసిన    ఆంగ్ల రచన   ‘Leaves in the wind’  ముద్రించుకునేందుకు సాహసం చాలటం లేదు. అంతటి ఆర్థిక స్థోమతా లేదు నిజానికి!!  ఏదైనా రచన ఏ సంస్థ వారి ద్వారానైనా  ముద్రితమైతే,   దాన్ని ఏ రకంగానైనా తప్పు పట్టేందుకు వీలు ఇవ్వని విధంగా ఉండాలి.  లేకపోతే సాహిత్య రంగంలో చులకనైపోమూ!! తాను చిన్న తనం నుంచీ చదివిన  ఋషితుల్యులైన వారందరూ తనను నిలదీసేలా వుండకూడదు కదా!! పైగా, తానీ స్థితికి రావటానికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వచ్చింది?? ఎన్నెన్ని విమర్శలు, ఎన్నెన్ని అవమానాలు??  

     పుట్టపర్తికి గత సంవత్సరం జరిగిన అనుభవం గుర్తొచ్చింది. సందర్భం స్నేహితులతో ధవళేశ్వరం వెళ్ళారు. అక్కడి గోదావరి పరుగులు చూసి ఆశువుగా తాను చెప్పిన శ్లోకం గుర్తుకు వచ్చింది.

                          ‘అల రామయ్య పదంబులే కడిగెనో, యా వహ్ని సంపూత మై

                          థిలి కెమ్మోమరవంచి తుడ్చుకొనెనో తేజ:స్సమాయుక్త మాం

                           సలితాంసమ్ముల మైల దీసికొనెనో మా లక్ష్మణస్వామి

                           ల్కుల యొయ్యారివి నిల్చి పల్కగదవే!! గోదావరీ హ్రాదినీ!!

  తానీ పద్యం చదవగానే అందరూ భలే భలే అంటూ కరతాళ ధ్వనులు చేశారు. వారి ప్రోత్సాహం చూసి మరో ఆశువు అందుకున్నాడు తాను,

                               అలసాందోళిత వీచికాంబరముతో నానర్థివా:పక్షి సం

                                  కుల కూహూకృతి మేఖలా రవళితో గొండల్ ప్రతాపించుటెన్

                                  దులకే రామునకేకపత్ని గదవే!! నీ యాస నీరాస, కో

                                  ర్కెలు నీలో గుడుసుళ్ళు చుట్టుకొనులే, గోదావరీ హ్రాదినీ!!!

       మళ్ళీ చప్పట్లు!! మెచ్చుకోళ్ళు!! 

                ఇదంతా బాగానే ఉంది కానీ, తరువాత, రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న సమయమది. వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు. మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు. ‘ కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడుతన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి తెచ్చిపెట్టిన ధైర్యమది. శివతాండవం పెట్టిన కిరీట కాంతులవి!!  తన మాటలు వినిన శ్రీపాదవారి అనుయాయులెవరో వెటకారంగా అన్న మాట తన హృదయానికి సూటిగా, బాణం వలె తాకింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. హృదయం కుతకుతలాడింది

(సశేషం)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.