రాగో

భాగం-17

– సాధన 

ప్రభుత్వం లొంగివచ్చి ప్రజల డిమాండ్ మేరకు షేకడా ఇరవై రూపాయలు ఇవ్వడంతో ఊర్లో అందరూ తునికి ఆకులు కోశారంటూ, ఊరూరికి కళ్ళం కావాలని రెండేళ్ళుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నందుకు బుద్ది చెప్పడంలో భాగంగా ఫారెస్టు వారి కలప, కళ్ళాలు ధ్వంసం చేసిన వరకు డోలు ఉత్సాహంగా చెప్పాడు. పోలీసులతో దాగుడుమూతల వ్యవహారంగా సాగిన కళ్ళాల కాల్చివేత చెబుతుంటే, అందరి ముఖాల్లో తామెంతో గొప్ప పని చేశామన్న ఫీలింగ్ కనపడింది. అక్కడి నుండి డోలు వాళ్ల ఊళ్లోకి ‘ఆదివాసీ ముక్తి మోర్చా’ పేరుతో వచ్చిన నాయకుల ప్రస్తావన తెచ్చాడు. ఆల్లపెల్లిలో జూన్ ఒకటవ తేదీనాడు వి.పి.సింగ్, రామ్ జెత్మలానీ, మృణాల్ తాయి మొదలైన లీడర్లు మీటింగ్ పెట్టి, ఇక్కడ రైతాంగం నుండి ఆకు జమ చేసుకొని ప్రాణహిత దాటి ఆంధ్రలో ముప్పయి రూపాయలకు అమ్మి పెడుతామని ప్రచారం చేయడం, దాంతో ఆ రేటు మేమే ఇస్తామని ఆ వెంటనే ఫారెస్టువారు బొంకించే పద్ధతులు కూడ ఆగకుండా పూసగుచ్చినట్లు చెప్పసాగాడు. ఇవన్నీ ఆచరణలో కుదరని వేషాలే అంటూ సంఘం వారు ప్రచారం చేసి, ఇక్కడే ఈ ప్రభుత్వం మెడలు వంచి రేట్లు సాధిద్దాం అనే సంఘం పద్ధతి ప్రజలకు అర్థం చేయించి వారు తీసుకున్న కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున స్త్రీ – పురుషులను కదలించినవరకు రిపోర్టు చెప్పాడు డోలు.

“ఇంకేమైనా ఉన్నాయా దాదా!” అంటూ ఇతరులు కూడ చెప్పాలన్నట్టు ఊబి, లెబుడు వైపు చూశాడు రుషి.

వెంటనే డోబి అందుకున్నాడు. “దాదా వచ్చే సోమారం ఈ పట్టీ (రాజుల కాలంలో వారి ప్రాంతాలను పట్టీలుగా వ్యవహరించేవారు. తహశీల్లు, బ్లాకులు లేవు ఆనాడు) పెద్దలు భూమ్యడు, మాజేరు, సేనల్, షండడు (హోదాలు) మీటింగ్ చేస్తున్నట్టు మా అయ్య చెప్పిండు. పొమ్మంటావురా అని నన్నడిగితే వింటే తప్పేమి లేదు అని నేను అన్నా. మీరేమంటరు దాదా” అంటూ రుషి వంక చూచాడు.

“ఏ విషయాలపై ఆ పెద్దల మీటింగ్?” రుషి.

“పిల్లనిస్తమని ఒప్పుకొని కల్లు తాగితే, ఆడదాన్ని వేరే ఎవడు పెళ్ళి చేసుకోవద్దు. పుట్టిన బిడ్డను మీ ఇంటికే ఇస్తామని ఒప్పందం చేసుకునే వేళల్లో తల్లితండ్రులు వియ్యంకుల నుండి కల్లు పుచ్చుకుంటే ఆ బిడ్డను ఇక వేరే ఎవరికి ఇవ్వరాదు. వేరేవారు చేసుకోకూడదు. పిల్ల ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు. కోరుకున్న వాడికి పోవడానికి ఆడదానికి హక్కు లేదంటున్నారు ఈ పెద్దలు. –

అలాగే ఒకని పెళ్ళాం మరొకడికి పోవద్దు. అలాపోతే పట్టి రివాజు ప్రకారం ఆ చేసుకున్నవాడు పాత మొగుడికి మూడు వేల రూపాయలు మొగనాలి చెల్లించి గానీ దాన్ని తెచ్చుకోకూడదు. అంటే ఇద్దరికి అతికినా, అతక్కపోయినా అయ్యకట్టిన వాడి దగ్గరే ఆడది పడుండాలనేది వీళ్ళ పంచాయితి. మాడియాల్లో మూడు వేలు ఎవడూ ఇచ్చుకోలేడనే వీళ్ల ధీమా.

లామడే ఇంకోటి.

లామ్ పెట్టుకుంటే ఆరేండ్లు నిండాకనే పెండ్లి చెయ్యాలి. లామడే ఉంటే ఇక ఆ పిల్లను మరెవరూ పెళ్ళి చేసుకోవద్దు.

ఇంట్లో పనులు ఎక్కువగా ఉండి మనిషి అవుసరమైతే ‘మా బిడ్డను నీకే ఇస్తామ’ని ఇల్లరికం చందంగా మగాడిని ఇంట్లో పెట్టుకుంటారు. అలా ఆరేళ్ళు చాకిరి చేశాకనే పిల్లనిస్తారు. ఆరేళ్ళు వెట్టిచాకిరి చేయాల్సిందే. ఈలోగా ఆ పిల్ల ఎవనికయినా ఇల్లు చొస్తే ఈ లామడే మొగనాలి కోసం ఆ చేసుకున్న వాడి చుట్టు తిరగాల్సిందే. ఆ లామడే అయినా తల్లిదండ్రులకు నచ్చడమే తప్ప పిల్ల ఇష్టంతో పనిలేదు.

కులం కానివాడికి ఆడది పోకూడదు. రివాజుల ప్రకారం రవిక చీర తీసెయ్యాలి. అన్ని రివాజులను అమలు చేయాలి” అంటూ కాబోయే పెద్దల మీటింగ్ చర్చనీయాంశాలు ఏకరువు పెట్టాడు.

“ఊఁ!” అంటూ దీర్ఘంగా మూల్గి రుషి మొదలు పెట్టాడు.

“ఉడిగిపోతున్న తరం ఎదిగే తరాన్ని అణచిపెట్టడానికి పడేపాట్లే అవి అన్నీ. కూలిపోయే పెత్తనం నిలబెట్టుకోవడానికే ఈ మీటింగులన్నీ. తొలి నుండి మన పార్టీ వీటిపై మీటింగులు పెడూంది. మన సంఘాలు సైతం పట్టీ మీటింగ్లు ఏర్పాటు చేశాయి. ఈ సనాతన ధర్మాలు మారాలని ప్రచారం చేసేయి. పెద్దల పెత్తనం, ప్రజలపై వారి పట్టు సన్నగిల్లి అడుగంటిపోతుందని వారి బాధ. మన రాజకీయాలతో, మన విధానాలతో మన పార్టీలోనికి వస్తున్న అక్కలను ఆదర్శంగా తీసుకుంటూ, ఇవాళ ఊరూరా మహిళా సంఘాల గాలి వీస్తుంది. దానితో పెద్దల దిమ్మ తిరిగినంత పనవుతుంది. అయితే వారు ఎన్ని సమావేశాలు, సదస్సులు జరిపినా ఏం లాభం లేదు. సరే. వీరి అవతారాలు ప్రజల్లో మరీ ఎండగట్టడానికి మనం అక్కలతోనే క్యాంపెయిన్ చేయిస్తే మరీ బాగుంటుంది” అంటూ కమాండర్ ఒకనాటి ధీకొండను గుర్తు చేసుకున్నాడు.

అదో పంచరంగి (అనేక కులాలు) ఊరు. ఏ ఒకరి మాట సాగేది గాదు. మాడియా పెద్దలు సాంప్రదాయాలను మాత్రం గట్టిగా పట్టుకునేవారు. సంఘమంటే కుదరదని జనాల చేతనే చెప్పించిన ఘనులు ఆ ఊరు పెద్దలు. ఆదివారం (పోల్వ) సాయంకాలం అయితే రిమ్మ ముఖాలతో ఆడ మగ మాట వినిపించుకునేవారు కాదు. కుల పంచాయితీలతో, అనేక దండుగలతో విలసిల్లేది ఊరు. దసరా వచ్చిందంటేనే ఇంటింటికి భత్యం జమ చేసుకొని కోళ్ళు, మేకలతో అహిరి పోవలసిందే. కాలికి గజ్జెకట్టి మహారాజు సమక్షంలో పడుచులందరు ఎగరాల్సిందే. అహిరి దసరకు డోల్లు డప్పులతో పోవలసిందే. వెట్టి చాకిరీకి కొదువుండదు. ఏ కొంచెం తప్పినా దండుగలు కట్టాల్సిందే.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.