రాగో

భాగం-24

– సాధన 

          “ప్రాజెక్టుకు సంబంధించిన బోర్డు, పునాది రాళ్ళు అవి. ఇంద్రావతి మీద పెద్ద డాం కట్టి భూపాలపట్నం వరకు నీటి సౌలత్ కి, బిజిలి (కరెంటు) తీయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో సర్కార్ ప్లాన్ చేసింది. ఆ డాం పూర్తయితే 150 ఊర్లతో పాటు ఈ అడివంతా నీటిలో మునిగిపోతుందట. ఇవి దాని బోర్డులు” అంటూ గిరిజ వివరించింది.

          “అబ్బో. ఇంత అడవి, ఇన్ని ఊర్లు పోతే ఎట్లక్కా? మన అందరం ఏం అవుడు? దున్నుకోను భూమే లేకపోతే నీటి సౌలత్ లు, బిజిలీలు ఏం చేసుకోను?” అని మాట కలపింది రేఖ.

          “బిజిలి అంటే పట్నంల మిల్లుల కోసం కదా! మన అడవి ముంచేసి షావుకార్లకు సౌలత్ లు చేస్తారన్నమాట” అంటూ చర్చను పొడిగించింది ఇర్పి..

          “ఔనక్క బాగ చెప్పారు. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్ని మనల్ని ముంచి వాళ్ళ బంగ్లాలు లేపుకునే బాపతే తప్ప నిజంగా జనానికి పనికొచ్చేవి గావు. అందుకే మనం దున్నేవాడికే భూమి గావాలని కొట్లాడుతున్నాం. ఈ ప్రాజెక్టులు కూడ ఖిలాఫ్ చేస్తున్నాం” అంటూ చెప్పుతున్న గిరిజ మాటకు జైని అడ్డు తగిలింది. ,

          “అక్కా గవి పొలాలు, అవుతల ఊరు. ఈ వాగులో మొఖం కడుక్కొని పోదాం” అని ఆగింది జైని.

          “ఊళ్ళోకి ఇద్దరక్కల్ని పంపి కబురు పెడతాం. మనకు ఆలస్యం అయినా ఊరి వాళ్ళు ఉంటారు” అంది గిరిజ.

          “మనమెందుకక్క ఊర్లో కబురుకి. ఆ ఖేతుల్లో పొగ వస్తుంది. ఎవరన్న ఉండచ్చు” అని అంది సిదో.

          “వానకాలం కద అక్కా. దాదలు ఎవరో బట్టి పెట్టి ఉంటరు” అని తేల్చేసింది మెంతక్క.

          “అరే! చూద్దామా! నేను ఎపుడు కల్లు దించంగ చూడలేదు – మెంతక్కా తర్వాత మొఖాలు” అంటూ అందర్ని అటు మళ్ళించింది గిరిజ. వారందరికి ఆ కల్లు వ్యవహారం లోతుపాతులు తెలిసినా గిరిజ కోసం ‘పదక్కా’ అంటూ నడిచారు. ,

          కల్లు తీస్తున్న దాదతో ఊళ్ళోకి కబురు పంపించి వచ్చిన అక్కలంతా నీళ్ళల్లోకి దిగారు. దళం అక్కలు బట్టలు ఉతుక్కుంటుంటే ఊరి అక్కలు స్నానాల కుపక్రమించారు. పిల్లీ బాయి బాబును ఒడ్డుమీద పడుకోబెట్టి వచ్చి వారితో కలసింది.

          గబగబా స్నానం చేసిన ఊరి అక్కలు ఒడ్డెక్కసాగారు.

          “ఏయ్. మెంతక్క ఇక్కడ చూడు. ఆ రొండి పుండ్లు పొక్కులు తీసి మంచిగ స్నానం చెయ్యి. లేకుంటే ఆ సొన కారి జన్మల పోవు పుండ్లు. ఇదిగో సబ్బు” అంటూ అదించింది గిరిజ.

          చెడ్డీల పై స్నానం చేస్తున్న దళం అక్కలను చూస్తున్న రేఖ, నవురులు గుస గుసల్లోకి దిగారు.

          “రేఖా-చూడవే-అక్కలు ఎంత సేపు అయ్యిందో స్నానం చేయబట్టి!” అంది నవురి. “పాపం. ఎన్ని రోజులయ్యిందో” – అంది రేఖ.

          “కాదే. ఆ రాసుడు చూడు. సబ్బులేక ఓసారి, సబ్బుతో ఓసారి. అటు తర్వాత ఓసారి. లేకుంటే చిటికెల చెయ్యొచ్చు” అంది నవురి.

          “అక్కలూ! ఇక అయిపోయినట్టే. వస్తున్నం!” అంటూ కిట్లో నుండి మరో డ్రెస్సు తీసి ఎక్కిస్తూ గిరిజ కేకేసింది.

          దళం వచ్చిందన్న వార్త తెలిసిన తాండవాయి ఊరి దాదలందరు గోటుల్ ముందు హాజరై ఉన్నారు.

          “లాల్ సలాం దాదలు” అంటూ అక్కడికి చేరుకున్న దళాన్ని చూస్తున్న దాదల కళ్ళు మరెవరి కోసమో వెతుకుతున్నాయి.

          “దాదలెవరు లేరు బాయి” అన్నాడొక దాద.

          “ఈసారి రాలేదు. దాద. మేమే వచ్చినం” అంటూనే గిరిజ “అందరు రండి. మీటింగ్ చేద్దాం దాద” అంది.

          “రెండు పాటలు పాడుదాం అక్కా! ఊరోళ్ళందరు జమయితరు” అంది జైని.

          “ఇంగో – మన ఇర్పి ‘కమలక్క పాట’ బాగ పాడుతుంది. కానీయ్ ఇర్పక్క” అంది సీదు. ఆ పాట ముగిసాక మిన్కో కోరికపై రేఖ ‘కోనిలే’ పాట పాడింది.

          వచ్చిన వాళ్ళందరు అక్కడే చోటు చేసుకొని కూచుంటున్నారు. గోటుల్ ముందున్న చింతచెట్టు వీరందరికి నీడనిస్తుంది. పిల్లగాండ్లు దడుల మీద కూచుంటే మగాళ్ళకు కొద్దిగ దూరంలో ఆడవాళ్ళు జమయిండ్రు. సీదో సెంట్రీ పోయింది.

          కరపత్రాల గురించి మాట్లాడిన గిరిజ తామనుకున్నట్టు రివాజులపై జరుగనున్న మీటింగ్, రివాజుల విషయం చెప్పమంటూ జైని వైపు చూసింది.

          మెల్ల మెల్లగా అలవాటు అవుతున్న ఉపన్యాసాలు జైనిలో బెరుకును పోగొడు తున్నాయి. జైని ఉపన్యాసం జోరుగా నడుస్తుంది. ఆడవాళ్ళ మధ్యలో కూచున్న బూది ఏమో అడగడానికై అవకాశంకై ఎదురుచూస్తుంది.

          ఛాయ్ తెచ్చిచ్చిన లామడే అక్కలందరికి అందిచ్చాడు. అన్నలెవరు రాలేదని అర్థమైనా ‘సెంట్రీ దగ్గర ఎవరన్న ఉన్నారేమో’ అన్న ఆశతో ‘సెంట్రీ దాదకు ఛాయ్ ఇచ్చి రావాల్నా బాయి’ అంటూ అడుగుతున్న లామడే రైనుతో పరధ్యానంలో ఉండిపోయిన గిరిజ “ఇంగో” అంది.

          ఛాయ్ గిలాసతో నడుస్తున్న లామడేకు అక్కడ అన్న ఉన్నడన్న నమ్మకంతో కొండంత ఆశ పెరిగింది. తన సమస్య వివరంగా చెప్పొచ్చుననుకుంటూ నడుస్తున్నాడు. “బూది ముచ్చట అక్కలో ఆ దాదే చెప్పుకుంటాడు. ఆయినె చెవుల ఊదుతె అయిపోయె” – ననుకుంటూ సెంట్రీ పోస్టు చేరుకున్న లామడె కళ్ళు కలియజూస్తున్నవి.

          “ఏయ్ దాద ఇక్కె” – (ఇక్కడ) అన్న ఆడగొంతు విని విస్తుపోయి అటు నడిచి నిరాశతో గ్లాసందించాడు.

          “దాదల్ హిల్లోర్” – రైను

          (అన్న లేడా)

          “ఇంగో” – సీదు.

          ఖాళీగ్లాసుతో వస్తున్న రైనులో నైట్ స్కూలు గురూజి మెదులుతున్నాడు. బూదికి తను లామడే ఉన్నాడు. రెండేండ్లు నిండినయి. నాలుగేండ్లు బాకీ ఉన్నాయి. బూది వానికి అలవాటు అయ్యి తన దగ్గరికి వస్తులేదు మాటలేదు ముద్దు ముచ్చట లేదు. ఎవరికి చెప్పొద్దంటే వాళ్ళ వ్యవహారం ముదురుతుంది. చెప్పుదామంటే ‘అయింత నాలుగేండ్లు నిండనీ. నీకు పిల్లనిచ్చి పెళ్ళి చేయనా’? అంటడు మామ. కానున్న పెండ్లాం కళ్ళ ముందు పరాయి మగాడితో సంసారం చేస్తుంటే ఏమి చేయలేక బాధను దిగమింగుతున్న రైను గోటుల్ వద్దకు చేరుకున్నాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.