ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ

 

          డా.కె.గీత గారి అయిదవ కవితాసంపుటి “అసింట” (కవిత్వం & పాటలు) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం సా.6.30 గం.కు జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె.శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కవులు శ్రీ కందుకూరి శ్రీరాములు గారు, శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు ప్రసంగించారు. గీతగారు కోవిడ్ కాలంలో అమెరికా నుండి రాసిన కవిత్వం “అసింట”. ఇందులో గీతగారు స్వయంగా రాసి, పాడిన లలితగీతాలు కూడా ఉండడం విశేషం. ఇవన్నీ ఇప్పటికే యూట్యూబ్ ఛానెళ్లలో విడుదల అయ్యి అత్యంత ప్రజాదరణ పొందినవి. డా|| కె.గీత కవయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో “తెలుగు భాషా నిపుణురాలి” గా పనిచేస్తున్నారు.

          ఇప్పటివరకు ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురించారు. “అపరాజిత”- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.

          “అసింట” పుస్తకం స్థానికంగాను, అంతర్జాలంలోనూ అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ దొరుకుతుంది లేదా నెచ్చెలి ఎడిటర్ ని ఈ మెయిలు (editor@neccheli.com) ద్వారా సంప్రదించవచ్చు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.