
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 27
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహంచేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ప్లోర్చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవనవిధానానికి అలవాటు పడుతూ సాగుతున్న జంట ప్రయాణం.
***
ఇరువురి మధ్య స్నేహ బంధం ఎపుడు ఎలా చిగురిస్తుందో తెలియడం కష్టం. బహుశా కాస్త సర్దుబాటు ఉంటే చాలేమో ఇరువురి మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి. ఒకరు ఏదైనా మాట అన్నపుడు అది కష్టపెట్టేదైనా లేదా సంతోష పెట్టేదైనా ఎక్కువగా భూతద్దంలోంచి చూసినట్టు కాకుండా, స్థిమితమైన మనస్సుతో ఆ మాటని తీసుకుంటే అపుడు ఆ బంధం చాంతాడు లాగ దృఢంగా ఉంటుంది. అతిగా లాగితే సన్నని తీగ మాదిరి ఆ బంధం వెంటనే తెగిపోయి అక్కడితో ముగుస్తుంది.
విశాల, విష్ణు మార్కెట్ నుంచి ఇంటికి నేరుగా వచ్చి, కూరగాయలన్నీ కారులోంచి తీసుకుని, ఫ్రిజ్ లో ఒద్దికగా సర్దారు.
“విశాలా! కూరగాయలు కాస్త ఖరీదు ఎక్కువగానే పెట్టి చాలా రకాలు తీసుకున్నాము. నువ్వు హార్టికల్చరిస్ట్ కదా! నీకు నేను చెప్పనక్కర్లేదు. ఏవి ముందు వండాలి, తాజాగా ఉన్న ఆకు కూరలు ఇవి ఏవి నిలువ ఉండవో అవి త్వరగా వాడెయ్యాలి.” అని చెప్పకనే చెప్పాడు విష్ణు. అతను చెప్పిన విధానం చూసి విశాల చిరునవ్వుతో అతని మాటలు అర్థం చేసుకుంది.
“ఏమండీ! అందరూ ఆంగ్ల సంవత్సరం అనగానే రిజల్యూషన్స్, కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం అంటారు. నేనైతే ఈ రోజు క్రొత్త సంవత్సరం ఉగాది రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటు న్నాను. అలాగే మీరు కూడా మీ క్రొంగొత్త నిర్ణయాలను, ఆశలను చెప్పండి” అంది విశాల మిరుమిట్లు గొలిపే మెరుపుని కనులలో నింపుకుని.
“ఐతే ఆడవాళ్ళు ముందు కదా! నువ్వు చెప్పు” అన్నాడు విష్ణు విశాల చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
“నాలో దాగి ఉన్న కళలను బయటికి తీసుకురావాలి అనుకుంటున్నాను. ఉదాహరణకి ఈ రోజు నుంచి సంగీత సాధన చాలా సీరియస్ గా ప్రాక్టిస్ చేద్దామనుకుంటున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే మూడు నెలల్లో తెచ్చుకోవాలి. తొందరగా ఒక పెర్మనెంట్ జాబ్ తెచ్చుకోవాలి. నా వంతు కర్తవ్యం, బాధ్యతలు నెరవేర్చాలి. ఒకే ఒక్క జీవితం. ప్రతి క్షణం జీవించాలి, అస్సలు వృధా చేయకూడదు. కేప్చర్ ద మోమెంట్” అని చాలా స్పష్టంగా మనసులో భావాలని విష్ణుతో పంచుకుంది విశాల.
“చాలా నిష్కల్మషమైన మనస్సుతో నువ్వు చెప్పిన నీ ఆలోచనలు ఎవరికైనా స్ఫూర్తినిస్తాయి. ఒక రోల్ మోడల్ స్థాయిలో ఉన్నతమైన, ఆదర్శవంతమైన భావనలు నీవి. నా సపోర్ట్ నీకెపుడూ ఉంటుంది. ఎప్పుడూ, ఎట్టి పరిస్థితిలోను ఈ చెయ్యిని వదిలిపెట్టను. ఇక నాకంటూ రిజల్యూషన్స్ అని ఏమీ అనుకోలేదు. ఐ యామ్ నాట్ దట్ ఎక్స్ ప్రెసివ్ లైక్ యూ. కాకపోతే వర్క్ ఈజ్ వర్ షిప్ అని నమ్ముతాను. పని, పని. పని కంటిన్యువస్ గా చేస్తూ ఉంటే దారి కనబడుతుంది. పనిలో దైవాన్ని చూస్తాను. పూర్తి అంకిత భావనతో ఏ పనైనా చేస్తాను. యాంత్రికంగా చేయను” అని ముక్కుకి సూటిగా తన మనసులో దాక్కున్న నిగూఢమైన రహస్యాన్ని విశాల ముందుంచాడు విష్ణు.
వాచీ వంక చూసుకుంటూ, “త్వరగా తెములు. ఉగాది సంబరాలకి వెడదామనుకున్నాము కదా!” అన్నాడు విష్ణు.
విశాల అందంగా అమర్చుకున్న అద్దాల బిల్టిన్ వార్డ్ రోబ్ లోంచి హేంగర్ కి తగిలించిన క్రీమ్ కలర్ విత్ రెడ్ బోర్డర్ సారీ, అత్తగారు పంపిన కొత్త చీర, చేతిలోకి తీసుకుంది. దేముడి పటం ముందు పసుపు తీసుకుని నీటిలో కలిపి, చీర, జాకెట్ కి మూడు వైపులా పెట్టింది. విష్ణుకి పంపిన సిల్క్ లాల్చీ, పైజామాకి కూడా పసుపు బొట్టు పెట్టి అతని చేతిలో పెట్టింది.
ఇద్దరూ ఆకర్షణీయంగా ముస్తాబయ్యారు. విశాల దేముడిముందు దీపం పెట్టి, “శ్రీ గణనాథ సింధూర వర్ణ” అని పిళ్ళారి గీతం పాడి, దేముడికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టింది. అక్షింతలు విష్ణు చేతిలో
పెట్టి, అతని కాళ్లకి నమస్కారం పెట్టుకుంది.
“అయ్యో! ఏమిటిది? ఆధునిక యుగంలో మహిళ ఇంకా భర్త కాళ్ళకు మొక్కడమా?” అని ఏ కళనున్నాడో, “దీర్ఘ సుంగళీ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు, సకల అభీష్ట సిద్దిరస్తూ” అన్నాడు విష్ణు.
“చూసారా, ఒక సద్బ్రాహ్మణుడిగా ఎంత చక్కని దీవెనలిచ్చారో? పైగా ఇక్కడ నాకు ఉన్న పెద్దవారూ అంటే మీరే కదా! మీ దీవెనలకి తోడు, తథాస్తు దేవతలు కూడా ఉంటారండోయ్!” అంది విశాల నవ్వుతూ.
ఇద్దరూ కారులో ఆ సాయంత్రం పేరామట్టా టౌన్ హాల్ ప్రాంగణంకి చేరుకున్నారు. అక్కడకి సంప్రదాయక దుస్తులతో తెలుగుతనం ఉట్టి పడుతూ ఆడ, మగ, పెద్ద, చిన్న అందరూ ప్రాంగణానికి చేరుకుంటున్నారు.
విష్ణు సరిగ్గానే సమయానికి చేరుకుని, కారు పార్క్ చేసుకుని, తెలుగువారు అంతా ఒక చోటికి చేరుకుంటున్న వారివైపు చూస్తూ, విశాలతో ఎంట్రన్స్ దగ్గరకి చేరుకున్నాడు.
అక్కడ మహిళలు, పురుషులు టేబుల్ డెకరేట్ చేసి టికెట్స్ చూసి చేతికి పసుపు రంగు బ్యాండ్ ఇస్తున్నారు. మహిళలు చిన్న కప్పులో ఉగాది పచ్చడి ఇస్తున్నారు వచ్చిన వారికి.
“విశాల చేతికి ఇచ్చిన ఉగాది పచ్చడి చాలా ప్రీతితో రుచి చూసింది. విశాలని చూడగానే అక్కడకి చేరుకున్న మహిళలు పలకరింపుగా నవ్వి పరిచయం చేసుకున్నారు.
“నా పేరు సునంద. మీరు కొత్తగా వచ్చారా? ఎపుడూ చూడలేదు” అన్నారు ఆవిడ.
“విశాల ఆవిడని చూస్తూ సంతోషంగా, మీ పేరు నాకు తెలుసు. నా ఫ్రెండ్ మాధురి మీ గురించి చెప్పారు. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.” అంది.
సునంద గారు మాధురిని మిగతావారికి పరిచయం చేసారు.
అక్కడ ప్రాంగణం ముందు పద్మం మ్రుగ్గు వేసి రంగవల్లులు తీర్చి దిద్దుతున్నారు లంగా ఓణీ వేసుకున్న కొంతమంది యువతులు.
సమోసా, బూందీ లడ్డూలున్న కవర్ వచ్చిన వారికి ఇస్తున్నారు. అందరూ కుర్చీలని తీసి వరుసగా వేస్తున్నారు. దాదాపు మూడు వందలమంది వరకు వచ్చిన ఆ సభా ప్రాంగణం నిండిపోయి
కళకళలాడుతోంది. స్టేజ్ చాలా శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆడియో మైక్ సిస్టమ్ లో తెలుగు ఉగాది వేడుకలకు ‘తెలుగు సంఘం ఆహ్వానం పలుకుతోంది’ అంటూ ఒక యువతి యాంకరింగ్ చేస్తోంది.
అందరూ ఆసీనులు కాగానే, ముందుగా ఆస్ట్రేలియా దేశానికి ఎకనాలెడ్జ్ చేస్తూ యాంకర్ ఈ విధంగా అంది.
“వియ్ ఎకనాలెడ్జ్ ద ట్రెడిషనల్ ఓనర్స్ అండ్ కస్టోడియన్స్ ఆఫ్ ద లాండ్ పే అవర్ రెస్ప్ క్ట్ టు ఎల్డర్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఎమెర్జింగ్” అంది.
అక్కడ స్టేజ్ మీద వినాయకుని ప్రతిమ ముందు ముగ్గురు మహిళలు వచ్చి దీపారాధన చేసారు. ప్రార్థనా గీతం ‘ముదాకరాత్తమోదకం’ అంటూ ఎనిమిదేళ్ళ జాహ్నవి స్టేజ్ మీద ఆలపించింది.
వేదిక మీదకి తెలుగు సంఘం ప్రెసిడెంట్, సెక్రెటరీ, ఇతర కార్యవర్గ సభ్యులు వచ్చి నమస్కరించి కుర్చీలో ఆసీనులయ్యారు. గెస్ట్ గా పేరమట్టా సిటీ కౌన్సిలర్ వచ్చి అందర్నీ గ్రీట్ చేసారు. “మీ దేశ
సంసృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి, ఆస్ట్రేలియా చక్కని అవకాశాలను కల్పిస్తోంది. చిన్నారులకు తల్లి భాష నేర్పితే, అమ్మ ఎమోషన్స్ అర్థం అవుతాయి” అని చక్కని సందేశాన్నిచ్చారు.”
తెలుగు సంఘం ప్రెసిడెంట్ ఆయనకి శాలువా కప్పి, గులాబీ పూల బొకే చేతిలో పెట్టారు. తరువాత చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ప్రదర్శిస్తున్నారు.
విశాల, విష్ణు మైమరచిపోయి, సంభ్రమాశ్చర్యాలతో కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. కార్యక్రమాలు మొదలైన అరగంటకి, హాలులో కోలాహలం మొదలైంది. అందరూ లేచి నుంచున్నారు.
అక్కడకి భారతదేశం నుంచి వచ్చిన కళాకారులు ఉగాది సంబరాలకు అతిథులుగా వచ్చారు. అక్కడకి తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొంది, సాహిత్యప్రపంచంలో ఎనలేని సేవలు అందించిన సి. నారాయణ రెడ్డి గారు, ప్రక్కనే గజల్ శ్రీనివాస్ గారు ఇద్దరూ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వారిని తెలుగు సంఘ సభ్యులు, కార్యకర్తలు తోడ్కొని వచ్చారు. సి. నారాయణరెడ్డి గారి గురించి పరిచయం చేస్తూ, ఆయన రాసిన పాటలు –
‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ అంటూ స్టేజి మీద పాడుతూ నృత్యాలు చేసారు. తరువాత గజల్ శ్రీనివాస్ తన కంజీరాతో, అమ్మ ఒకవైపు అన్న సి. నారాయణరెడ్డి గారి గజల్ అతి హృద్యంగా ఆలపించాడు. సి. నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ, కరుణశ్రీ పుష్పవిలాపానికి ఘంటసాల పేరు తీసుకువచ్చినట్లుగా, నా గజల్స్ కి శ్రీనివాస్ ఈ రోజు ప్రాముఖ్యత తీసుకువచ్చారు అని ప్రశంసించారు. ‘విశ్వంభర’ కావ్యం రాసినపుడు ఆయన అనుభవాలు, ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ అన్న తన స్వీయ సినీగీత చరిత్ర గురించి అద్భుతమైన తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు
సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు. తెలుగు సంఘం ప్రెసిడెంట్ సి.నారాయణరెడ్డిగారికి మెమెంటో, మెడలో దండ వేసి, శాలువా, పారితోషికంతో సత్కరించారు. ఆయనతో పాటు కార్యకర్తలు గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. డిన్నర్ కోసం విరామం ఇచ్చారు. అదే సమయంలో విశాల, విష్ణు నుంచుని ఉండగా, అతి చేరువలో సి. నారాయణరెడ్డిగారు, గజల్ శ్రీనివాస్ అటుగా వస్తున్నారు. సునంద గారు విశాల ని దగ్గరగా పిలిచి, వారితో కలిపి ఫోటో తీసారు. విశాల వెంటనే సి.నారాయణరెడ్డి గారికి నమస్కరిస్తూ, మీరు వ్రాసిన ప్రతీ పాట ఒక గొప్ప కళాఖండం- కర్ణ సినిమాలో గాలికే కులమేది అన్నా, ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ అన్నా ఆ పాటలు ఎప్పటికీ మా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటాయండీ” అంది వినమ్రతతో విశాల చేతులు జోడిస్తూ.
“మంచిది తల్లీ, నీ పేరెమిటన్నావ్? విశాల అన్నావ్ కదా!” అంటూ చేయి ఊపుతూ ముందుకెళ్ళిపోయారు.
విశాల, విష్ణు ఆ రోజు తెలుగు సంఘం ఏర్పాటు చేసిన తెలుగు విందు ఆరగించి, మరపురాని అనుభూతులను మూటగట్టుకుని, కారెక్కారు.
* * * * *
(ఇంకా ఉంది)

నేను సిడ్నీ ఆస్ట్రేలియా లో ఉంటాను. మా తల్లిదండ్రులు శ్రీమతి శ్రీదేవి పెయ్యేటి మరియు శ్రీ రంగారావు పెయ్యేటి గార్లు ఇరువురు రచయితలు. ప్రవృత్తి పరంగా 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో తెలుగు రేడియో కార్యక్రమాలు, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తున్నాను. వృత్తి రీత్యా ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్థానికంగా తెలుగు వాణి రేడియో కన్వీనర్ గా సేవలు అందించాను. వందకు పైగా రేడియో కార్యక్రమాలు 15 రేడియో నాటికలు దర్శకత్వం చేపట్టి ప్రసారం చేశాను. ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చిన్నారులకు పాఠశాలలో religious education లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ద్వారా హిందూ మత బోధన తరగతులు తీసుకున్నాను. జాగృతి కథల పోటీలో నా కథలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు ఇరవై వరకు కథలు రాసాను, కథలు, కవితలు కొత్తవి రాస్తున్నాను. నా కథలు పలు పత్రికలలో, కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు, లలితగీతాలు, పాటలు పాడతాను. పలు వేదికలకు సమన్వయకర్తగా వ్యవహరించాను. సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలు గా నాలుగు సంవత్సరాలు సేవలు అందించాను. స్థానికంగా తెలుగువాణి మరియు జనరంజని రేడియో కార్యక్రమాలు, ఇంకా అంతర్జాలంలో తెలుగువన్ రేడియోలో వారం వారం కార్యక్రమాలు చేయటం నాకు అత్యంత ప్రీతికరం. “సకల కళాదర్శిని” వేదిక స్థాపించి, “స్త్రీ హృదయం” శ్రీ పెయ్యేటి రంగారావు గారి కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ తొలి కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించాను. మున్ముందు కళా, సాహిత్యం, సాహిత్య కార్యక్రమాలు “సకల కళాదర్శిని” ద్వారా అందచేయాలని భావిస్తున్నాను. వాహిని మాసపత్రిక “సాహితీ సదస్సు” అంతర్జాల మాధ్యమం జూమ్ ద్వారా విజయవంతంగా నాలుగు గంటలకు పైగా మూడు సదస్సులు నిర్వహించాను. దాదాపు ఐదు గంటలకు పైగా విజయవంతంగా విభిన్నమైన తెలుగు అంశాలతో కొనసాగింది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక వారోత్సవాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. భారతదేశంలో సాహిత్యంలో పలు అంశాలపై పత్ర సమర్పణ అందచేశాను.
