
యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-13
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
సరిగ్గా ఏడాది కిందట 2023లో మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి. మొదటి పన్నెండు భాగాలు రాసి దాదాపుగా ఏడాది కావొస్తోంది. మళ్ళీ మొదలుపెట్టడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పటివరకు చదవని వారు వీటన్నిటినీ నెచ్చెలిలో (https://www.neccheli.com/ధారావాహికలు/ట్రావెలాగ్స్/యాత్రాగీతం/) ధారావాహికలుగా త్వరలో చదవవొచ్చు.
ఇంగ్లాండ్ -లండన్ (రోజు-2) లండన్ నగర విహారం – బకింగ్ హామ్ ప్యాలెస్ -టవర్ ఆఫ్ లండన్
బకింగ్ హామ్ ప్యాలెస్ చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. అయితే ప్యాలస్ వైపు కాకుండా మరోవైపు బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది కదా అని చెప్పి ఆ వైపుగా నడుచుకుని వెళ్లాం. అక్కడ కూడా జనమే. బేరెక్స్ బయట ఫెన్సింగ్ ని ఆనుకుని ఉన్న వందలాది జనంలో ఎలాగో స్థలం చేసుకుని ఓ చోటు సంపాదించి బేరెక్స్ లోపల ఆవరణలో సైనిక వందనానికి సిద్ధం అవుతున్న వారి విన్యాసాల్ని కాస్సేపు ఊచల్ని ఆనుకుని నిలబడి చూసాం. ముఖ్యంగా సిరికి వీల్ ఛైర్ ఉండడంతో ఊచలకి దగ్గరగా జరుపుకుని కూర్చుని అత్యంత ఆసక్తిగా చూడసాగింది.
బ్యాండ్ అక్కడి గేటులో నుంచి ప్యాలెస్ వైపు బయలుదేరే సమయానికి అంతా గుంపుగా ఇటువైపే తోసుకురాసాగేరు. అనుకోకుండా మేం ఆ గేటు పక్కనే నిలబడడంతో ఈ సారి బ్యాండంతా దగ్గర్నించి చూడగలిగేం. బొత్తిగా కళ్ళు కనిపించకుండా ఉన్నట్టు నుదుటిని మూసేస్తూ పొడవాటి నల్లని కుచ్చు టోపీలు, ఎర్రని చొక్కా , నల్లని ప్యాంటు, నలుపు బూట్లు, భుజాన నల్లని రైఫిల్స్ , ఒక్కొక్కరి చేతిలో మెరిసి పోతున్న వివిధ వాయిద్యాలు వారి ప్రత్యేక వస్త్రధారణే ఒక గొప్ప విశేషం. చూడడానికి కన్నుల పండుగగా ఉన్న వాళ్లని చూస్తేనే ఉత్సాహం తన్నుకొస్తూ ఉంది అందరికీ.
తర్వాత వాళ్ళ వెనకాలే రోడ్ల పక్కగా ఉన్న బారికేడ్స్ లోపల నడుచుకుంటూ వెళ్తున్న జనంతో పాటూ మేమూ నడిచి ప్యాలెస్ గేటు ముందు వరకు వచ్చాం. కానీ అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. మాకు ఎలాగైతేనే వారి మధ్యలో నుంచి ప్యాలెస్ ఎదురుగా సైనిక వందనం కనిపించే చోటు వరకు నడిచాం. ఎక్కడా నిలబడడానికి కూడా చోటు లేదు. నిరాశగా వెనుతిరుగుతూ ఉండగా మా దగ్గర వీల్ చైర్ లో పిల్లని చూసి తాళ్ళకి అవతల పహారా కాస్తున్న పోలీసు ఒకాయన త్రోవ ఉన్నవైపుగా మమ్మల్ని రమ్మని ప్రత్యేకంగా అతనితో తీసుకెళ్లి బకింగ్ హామ్ ప్యాలెస్ కి ఎదురు గుండా వీల్ చైర్ వాళ్ళ కోసం ఉంచిన చిన్న స్థలంలో కూర్చోబెట్టారు. అక్కడ నిలబడడం కష్టం. తప్పనిసరిగా కూర్చోవలసిందే. ఎందుకంటే మా వెనుకగా ఉన్న తాళ్ల వెనక చాలా మంది వీక్షకులు ఉన్నారు. మేం నిలబడితే వాళ్ళకి కనిపించదు.
మొత్తానికి ప్యాలెస్ ఎదురుగుండా మాంఛి చోటు దొరికింది మాకు. అక్కడే చదునుగా రాళ్లు పరిచిన నేల మీద చక్కగా చతికిలబడి ప్యాలెస్ గేటు లోపల అటూ ఇటూ నడుస్తూ వాయిద్యాల్ని మోగిస్తూ సంగీతానికి అనుగుణంగా మార్చ్ చేస్తున్న బ్యాండ్ ని పరికించి చూడడం మొదలుపెట్టాం. అంతా బావుందనుకునే సమయంలో, సరిగ్గా పది నిమిషాల్లో వర్షం మొదలైంది.
నెత్తిన కప్పుకోవడానికి ఏమీ లేదు. మేము పట్టుకెళ్లిన రెయిన్ పాంచోలు, గొడుగులు అన్నీ కారులో వదిలేసి వచ్చినందుకు సరైన శాస్తి జరిగింది మాకు. సిరికి వానలో తడవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మొదట మారాం చేస్తుంది. వినిపించుకోకపోతే ఏడుపు మొదలుపెడుతుంది. ఇక లాభం లేదని అక్కణ్ణించి బయలుదేరి వచ్చెయ్యాల్సి వచ్చింది. ఇక మళ్ళీ వెనక్కి అంతదూరం తడుస్తూనే నడిచాం. అంతదూరం నడిచింది, కష్టపడి చోటు సంపాదించినది అన్నీ వృథా అయ్యాయి. అయితేనేం ఏదో కాసేపయినా ఆ విశేష తతంగాన్ని చూడగలిగాం అన్న సంతృప్తి మిగిలింది. ఈ ప్రయాణానికి ముందే టీవీలో బేకింగ్ హాంగ్ ప్యాలస్ గురించీ, మహారాణి గురించీ డాక్యుమెంటరీలు, సీరియల్స్ చూసి బయలుదేరామేమో, ప్యాలెస్ చుట్టూ ఎక్కడేమేం ఉంటాయో బాగా గుర్తు పట్టగలిగాం. ఇక ప్యాలెస్ లోపలికి సందర్శకులను రానివ్వడానికి అక్కడి వేసవిలో అంటే జూలై నించి సెప్టెంబరు వరకు కొన్ని ప్రత్యేక దినాల్లో టూరులుంటాయట. మేం వెళ్ళినది ఏప్రిల్ నెలలో కావడం, పైగా ఎలిజబెత్ మహారాణి మరణించి, యువరాజు ఛార్లెస్ కింగ్ గా మారేందుకు పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండడంతో ప్యాలెస్ లోపలికి వెళ్లే అవకాశం మాకు దక్కలేదు.
మొత్తానికి వానలో వెనక్కి నడిచి వచ్చి వ్యాను ఎక్కేసరికి మధ్యాహ్నం 12 అయిపోయింది. భోజన సమయం కాబట్టి లంచ్ కి ఇండియన్ ప్లేస్ కి ఎక్కడికైనా తీసుకువెళ్లమని అడిగాం. దార్లో ఇక మధ్యాహ్నం నించి చేయాల్సిన కార్యక్రమాల గురించి, చూడాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడుకున్నాం.
వ్యాను డ్రైవరు యథావిధిగా మేం ఎక్కడికి వెళ్లాలనుకుంటామో చెప్తే తీసుకువెళ్తానని చెప్పేడు. ఇక అతనితో లాభం లేదని మాకు మేముగా ఆన్ లైనులో ఆ రోజుకి వేటికి టిక్కెట్లు ఉన్నాయో వెతకసాగేము.
లక్కీగా ఆ మధ్యాహ్నం మూడున్నర టైంలో టవర్ ఆఫ్ లండన్ లోని “ప్యాలస్ ఆఫ్ జ్యువెల్స్” టూరుకి టిక్కెట్లు దొరికాయి మాకు.
ఇక అక్కడికి వెళ్లేలోగా లంచ్ పూర్తి చేసుకుని, గాంధీ నివాసాన్ని చూడడానికి వెళ్ళాలి అన్నది ప్లాను. తీరా ఇండియను రెస్టారెంటుకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేసిన అరగంటైనా భోజనం పెట్టరే!
తీరిగ్గా కూర్చుని భోజనం చేసేటప్పుటికి ఒంటిగంటన్నరయింది. మూడున్నర టైం కి టవర్ ఆఫ్ లండన్ కి వెళ్ళాలి.
దార్లో “సెయింట్ పాల్స్ కేథెడ్రల్” దగ్గిర ఆపాడు మా వ్యాను డ్రైవరు. అప్పటికి దాదాపు రెండయ్యింది. ఇంకా గంటన్నర వ్యవధి ఉంది కానీ లోపలికి వెళ్లేందుకు ముందే రిజర్వేషను చేసుకుని ఉండాల్సి రావడంతో ముగ్గురం బయటి నించే ఫోటోలు తీసుకున్నాం.
“సెయింట్ పాల్స్ కేథెడ్రల్” నించి రెండున్నర సమయంలోనే టవర్ ఆఫ్ లండన్ కి చేరుకుని ఎందుకైనా మంచిదని లైనులో నిలబడ్డాం. అయితే ఇంకా గంట సమయమున్నా మమ్మల్ని లోపలికి పంపేశారు.
లోపలంతా నేలమీద ఇటుకలు పేర్చినట్టు మధ్య కాస్త కాస్త ఖాళీలతో రాతి రాళ్లు పరిచి ఉండటం వలన వీల్ ఛైర్ ని తోసుకొని వెళ్ళటం బాగా కష్టమైంది. టవర్ ఆఫ్ లండన్ పెద్ద కోటన్నమాట. ఆ లోపల బురుజులు, మొదటి ఆవరణ దాటి లోపలోకి మెట్లెక్కి వెళ్తేనే భవంతులు ఉంటాయి. మెట్లు ఉన్నచోట సిరి మెల్లగా కష్టపడి బానే ఎక్కింది.
ఎంట్రన్సులో ఉన్న మొదటి టవర్ పేరు బైవార్డ్ టవర్ (Byward Tower). ఇది 1280లో నిర్మించబడింది.
భవంతులు ఉన్న లోపలి ఆవరణలోని ప్రధానభవంతిలో మొత్తం బ్రిటిష్ రాజులకు సంబంధించిన బంగారం, వజ్రాలు, నగలు నట్రా ఉంటాయి. అదే “ద క్రౌన్ జ్యువెల్స్” (The Crown Jewels). బయట నించి చర్చిలాగా కనిపించే మరొక భవంతి ఆయుధాగారం. అక్కడ కత్తులు, కటారుల వంటివే కాకుండా, బ్రిటిష్ రాజులు యుద్ధాలలో ధరించిన కవచాలు, ఇనుప ముసుగులు వగైరా ఆయుధాలు కూడా ఉంటాయి.
ఆ రోజంతా అలా వర్షం పడుతూనే ఉంది. పైగా చలి ఒకటి. అయినా ప్రతీ చోటా చాలా పెద్ద లైన్లు ఉన్నాయి. అయితే లక్కీగా వీల్ చైర్ ఉండడం మూలాన ఏ లైన్ కీ చివర నిలబడాల్సిన పనిలేదు. “ద క్రౌన్ జ్యువెల్స్” భవంతి గుమ్మం దగ్గరలో ఉన్న గార్డుల దగ్గరకి వెళ్ళగానే లోపలికి పంపించేసారు. పైగా ఇక్కడున్న లైను చివరి నించి భవంతి ఎంట్రన్సు ఎత్తులో ఉంది. అలా వీల్ చైర్ ని అతికష్టమ్మీద తోసుకెళ్లే పని లేకుండా డైరెక్టర్ గా లోపలికి వెళ్లగలిగాం.
ఇక లోపలికి అడుగుపెట్టగానే కళ్ళ ముందు ఏవీ కనబడని చీకటి కమ్ముకుంది. అయితే ఎందుకంత చీకటి చేసారో రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా కళ్ళు చెదిరిపోయే నగలు ప్రత్యక్షమయ్యాయి.
లోపల ఫొటోలు, వీడియోలు తియ్యడం నిషేధం. అత్యంత కట్టుదిట్టాల మధ్య అద్దాల బీరువాల్లో వరుసగా నగలు, కిరీటాలు, చర్చిలో వివిధ తంతులకు సంబంధించిన అతిపెద్ద నీళ్ల కూజాలు, పళ్ళాలు వంటి సామగ్రి ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి ముద్దలు ముద్దలు బంగారంతో తయారుచేసినవి. అందులో రెండుమూడు వందల కిలోల బరువున్న ముద్ద బంగారపు పెద్ద ఫౌంటెన్ లాంటి చూస్తే ఆశ్చర్యమూ, ఆందోళనా ఒక్కసారిగా కలిగాయి నాకు. హాలుకి మధ్య ఒకే వరుసలో ఉన్న అద్దాల పెట్టెల్లోని కిరీటాలన్నీ గొప్ప గొప్ప వజ్ర వైఢూర్యాలతో, మణిమాణిక్యాలతో తళత్తళ్లాడుతూ ఉన్నాయి. కోహినూర్ వజ్రం అతికించి ఉన్న కిరీటం ప్రత్యేకంగా కాకుండా, అన్నిటితో కలిసిపోయి ఉండడంతో మొదట సరిగా చూడలేదు. అయితే లైను వన్ వే అయినా వెనక్కి వచ్చిన నాకు, సిరికి మళ్ళీ ఒక గార్డు దగ్గిర ఉండి మరీ మళ్ళీ చూపించారు. ఒక విధమైన లేత తెలుపు రంగులో చూడడానికి వట్టి గాజు రాయిలా ఉంది.
అక్కడున్నవన్నీ చూడడానికి దాదాపుగా 30 నిమిషాలు పడుతుంది. అంతకంటే ఎక్కువ సేపు ఎవరినీ ఉండనివ్వరు కూడా. వీటన్నిటి వెనకాల ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న బ్రిటిషు రాజరికపు రక్త చరిత్ర, బానిసల ఆక్రందనలు కంటి ముందు కదలాడినట్టయ్యి మనస్సులో గొప్ప బాధ మెదిలింది.
తరువాతగా ఆ కాంప్లెక్స్ లోనే యుద్ధ సామగ్రి ని, సైనిక సరంజామాని భద్రపరిచిన పెద్ద చర్చి లాంటి బిల్డింగుకి వెళ్లాం. పైకి వెళ్లే లిఫ్ట్ పనిచెయ్యడం లేదు. మెట్లు భారీగానే ఉన్నాయి, పైగా చెక్క మెట్లు. ఇక సిరి రానని మొడికేసింది. సత్యని ముందు వెళ్లి చూడమని, నేను మెల్లగా నచ్చచెప్పి సిరిని తీసుకుని పైకి వెళ్లేను. మొదటి అంతస్తులో ఉన్న రకరకాల కవచాలు, ఆయుధాలు ఒక్కోటిగా చూసుకుంటూ నడిచేం. ముఖ్యంగా గుర్రాలకు కూడా కవచాలు ఉండడం విశేషం. ఇలా యుద్ధసామగ్రిని చూస్తే నాకు చెప్పలేని నిర్వేదం వస్తుంది. చంపడం, చావడం మాత్రమే న్యాయమైన యుద్ధాలు ఎందుకు? రాజ్యాదాహాలేనా?రాజకీయప్రయోజనాలేనా? ప్రతి యుద్ధంలోనూ బలయ్యీ, లిఖించబడని సామన్యుడి కథ ఎక్కడ రాయబడింది? …ఎన్నో ప్రశ్నలు నా మనసు నిండా.
అక్కణ్ణించి పైకి వెళ్లేవి కూడా చెక్క మెట్లే. ఇక సిరిని తీసుకువెళ్లడం నా వల్ల కాలేదు. సత్య తిరిగి అదే త్రోవన వస్తాడులే అన్న ధీమాతో అక్కడే మెట్ల దాపున నేలమీదే కూచున్నాం ఇద్దరం. అయితే మాకు తెలియని విషయం ఏవిటంటే ఆ బిల్డింగుకి ఎంట్రన్సు, ఎగ్జిట్లు వేరు వేరు. దాదపు అరగంట పైన అక్కడ వేచి చూసి ఇక లాభం లేదని నేను సిరిని తీసుకుని కిందికి వచ్చేసి వెనకగా ఉన్న గిఫ్ట్ సెంటరు దగ్గిర వెయిట్ చెయ్యసాగేను. మొత్తానికి కిందికి వచ్చాడు సత్య. సత్య ఎంతకీ రాకపోయేసరికి ఆ కాస్సేపు సిరి కంగారు చూడాలి. డాడీ ఎందుకు ఇంకా రావడం లేదు అంటూ ఎన్నో ప్రశ్నలు వేసింది.
తనని చూడగానే ఒక్క ఉదుటున కుర్చీ లోంచి దుమికి సంతోషంగా పరుగెత్తుకుని ఎదురెళ్లి నడుం చుట్టుకుంది. ఆ దృశ్యం చూడగానే నాకు మా డాడీ గుర్తుకు వచ్చి కళ్ళల్లోకి అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. మా చిన్నతనంలో ఆయన పుస్తకాల నించి కథలు కథలుగా చెప్పిన లండను విశేషాలు గుర్తుకు వచ్చాయి.
ఆ కాంప్లెక్సులో ఇటువంటి రకరకాల బిల్డింగ్స్ ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా శిక్షా గృహం చూడవలసినది.
https://www.facebook.com/geetamadhavikala/posts/
*****
(సశేషం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
