జ్ఞాపకాల సందడి-4

-డి.కామేశ్వరి 

దీపావళి హడావిడి  అయ్యాక తిండి గోలకి కాస్త విరామమిచ్చి  ఇంకేదన్న రాద్దామంటే ఆలోచన తట్టలేదు. సరే, ఇవాళ చిన్న,పెద్ద ల వేళా పాళా లేని తిండి, బయట తినే జంక్  ఫుడ్ తో ఎంత అనారోగ్యాల పాలవుతున్నారో చెప్పాలనిపించింది.

పాతకాలంలో ఏమిచేసుకున్న ఇంట్లోనే  అత్యవసరపడితేనే  హోటల్.  టిఫినో, భోజనామో. చిరుతిండి పిల్లలకి ఇంట్లోనే చేసేవారం. తల్లులు ఉద్యోగాలొచ్చాక టైంలేక అన్నీ బజారు సరుకే, పండగొచ్చినా ఓ స్వీట్ హాట్ (పులిహోరలాటివి  సహితం) కొనేస్తున్నారు.

స్కూల్ నించి పిల్లలు వచ్చాక కాస్త పెద్ద పిల్లలుంటే నూడుల్స్ లాటివి, లేకపోతే  డబ్బులుపెట్టి పక్కనేవున్న షాప్కి పరిగెత్తి పాకెట్స్, కూల్డ్రింక్స్ తెచ్చుకోవడం, ఇదీ వరస. ఇంకా పెద్దలయితే  బస్సు స్టాప్ల దగ్గర దిగగానే (అక్కడ ఉదయం, సాయంత్రాల రష్ చూస్తే జనాలు ఇళ్ళదగ్గర వండుకోడంలేదా అనిపిస్తుంది) వేడి వేడి బజ్జీలు, బొండాలు ఆకలిమీద లాగిస్తారు . ఇంటికెళ్లిన వెంటనే తిండి దొరకదు ఆవిడగారు రావాలి వండాలి గదా!

ఇదిసరే,  ఇపుడు కొత్తగా ఐటి ఉద్యోగాలు షిఫ్టుడ్యూటీలు, అర్ధరాత్రి కూడా ఇడ్లి దోసెలా బళ్ల దగ్గర రాత్రి డ్యూటీ ముగించి ఆకలిమీద రెండుగంటలకు టిఫిన్లు తినేవాళ్ళ రష్, ఇలావుంది పరిస్థితి.

వేళాపాళాలేని తిళ్ళతో ఆరోగ్యాలు ఎలావుంటాయి. సరే ఇంట్లో  టీనేజ్ పిల్లలు అర్ధరాత్రి వరకు పడుకోరు సెల్ల్ఫోన్ చాటింగ్లు , రాత్రి ఎన్ని ఎనిమిదో తొమ్మిదో గంటలకి తిండి అరిగి పోయి ఆకలేస్తుంది. నిద్రపోతే ఆకలి తెలియదు అదే మేలుకుని వుంటే ఆకలి వేస్తే ఫ్రిజ్లు, డబ్బాలు వెతుక్కుని, వంటింట్లో మిగిలిపోయినవి తెచ్చుకు తినడం ఇదీ వరస. అది కడుపా చెఱువు  ఖాళీలేకుండా, విశ్రాంతి లేకుండా కడుపులోమిషన్లు పనిచేస్తుంటే జీర్ణవ్యవస్థ ఏమవుతుంది. అరవయి డెబ్బయి ఏళ్ళు పని చెయ్యాల్సిన వ్యవస్థ నలభయి ఏళ్లకే దెబ్బతిని మూలబడుతుంది.

పిల్లలకి ఎలాచెపితే అర్ధమవుతాయి?

ఒకసారి మా మనవరాలు రాత్రి వంటిగంటకి డబ్బాలు, ఫ్రిజ్లు వెతుకుతుంటే ఉదయం సావకాశంగా పాఠం చెప్పా. “అమ్మా! మనం రాత్రి భోజనాలయ్యాక, మీ అమ్మ వంటిల్లు సర్దుకుని, శుభ్రంచేసి అమ్మయ్య అనుకుని, బయటికి వచ్చాక అనుకోని అతిధులు ముందు చెప్పకుండా వస్తే చచ్చినట్టు మళ్లీ వంట చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనం తిన్న తిండికడుపులోకి వెళ్ళాక,  జీర్ణక్రియ తనపని ఆరంభించి ఆహారం జీర్ణం చేసి ఎక్కడికి పంపాల్సినవి అక్కడికి చేర్చి, అంటే కిడ్నీలు, గుండె, పెద్దపేగుల్లోకి చెత్త, రక్తంలో చేరాల్సినది అక్కడికి అంత సర్ది తనపని పూర్తిచేసి, విశ్రాంతి తీసుకునేవేళకి (ఎంత నిద్ర రానివారికి కూడా రాత్రి రెండుగంటలవేళ కళ్ళు మూతలు పడతాయి అంటే శరీరం అలిసిపోయి విశ్రాంతి కోరుతుందన్నమాట ) అలాటిసమయంలో మళ్లీ అర్ధరాత్రి తింటే, మళ్లీ అవయవాల పని మొదలవుతుంది. మనలాగా ఆలస్యం అయింది రేపుచూద్దాం అని పని పోస్టుపోన్ చేయదు, ఇలా కడుపులో పడగానే ఆటోమేటిక్ గా మిషన్స్ అన్నీ  పని ఆరంభిస్తాయి, అంటే వాటికీ విశ్రాంతి ఎప్పుడు రోజంతా ఆలా నములుతూఉంటే? టైం ప్రకారం అలవాటు లేకపోతే శరీర వ్యవస్థ దెబ్బతిని అనేక రోగాలకి దారితీస్తుంది” అని పాఠం చెపితే నవ్వే పిల్లల భవిష్యత్తు ఎలావుంటుందో ఇప్పుడు అర్ధంకాదు వాళ్ళకి.

ఇది పెద్దలకీ పాఠమే!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.