కన్నీటి కెరటాల కొన్నెత్తుటి పతాకాలు

(పద్మకుమారి రాసిన “అపురూప” కథల సంపుటానికి ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట-)

-ఎన్ వేణుగోపాల్

చిరకాల స్నేహితురాలు పద్మ రాసిన ఈ అపురూపమైన కథల సంపుటం ‘అపురూప’ ఒక్క ఊపున చదవడం కష్టం. కనీసం నావరకు నాకు చాల కష్టమయింది. కావడానికి ఇది నూట ముప్పై పేజీల, పది కథల గుచ్ఛమే గాని, అడుగడుగునా పదపదమూ వాక్యం వాక్యమూ రక్తాశ్రు బిందువుల తడి కళ్లకు మాత్రమే కాదు, ఆ ప్రయాణం పొడవునా పాదాలకూ దేహానికీ తగులుతూ ఊపిరి బిగబట్టుకుంటూ చదవవలసి ఉంటుంది. నావరకు నేను కళ్ల నీళ్లు నిండకుండా, హృదయం ద్రవించకుండా ఒక్క పేజీ కూడా తిప్పలేకపోయాను. ప్రతి కథలోనూ ఎవరో ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసిన మనిషి, ఒక ఒరిగిపోయిన స్నేహితుడు, స్నేహితురాలు, ఆ స్నేహితుల ఆత్మ బంధువులు, వాళ్ల దుఃఖం అక్షరాల మీది నుంచి మన చెంపల మీదికి ధార కడుతూనే ఉండింది. మునివేళ్లతో పేజీ పేజీ తిప్పుతున్నప్పుడు ఆ వేలికొసల కన్నీటి తడి, త్యాగభరితమైన కవోష్ణ రుధిరధార, ఆరిన నెత్తుటి ఉప్పన తగులుతూనే ఉన్నాయి. 

చదవడమే ఇంత కష్టమైన కథల గురించి విశ్లేషిస్తూ రాయడం సాధ్యమేనా?

అసలు వీటిని కథలు అని ఒప్పుకోవడానికి యథాస్థితివాద మర్యాదస్తుల ప్రపంచం సమ్మతిస్తుందో లేదో తెలియదు. కల్పన ఎంత మాత్రమూ లేని, కల్పన కన్న అద్భుతంగా ఉండే కఠోర వాస్తవికతను యథాతథంగా అక్షరీకరించినప్పుడు దానికదిగా ఎంత కళాత్మకంగా పర్యవసిస్తుందో ఉదాహరణగా నిలిచే కథలివి, వాస్తవాలివి, కాల్పనిక వాస్తవాలివి. డాక్యుమెంటరీ ఫిక్షన్ అనే కొత్త ప్రక్రియలో నిలిచే కథనవాస్తవాలివి, వాస్తవికకథలివి. వీటిలో అక్కడక్కడా కొంత ఊహ, కొంత కల్పన, కొంత రచన, కొంత అతిశయోక్తి, కొంత అల్పోక్తి ఉండవచ్చు గాని వీటిలో ఏ ఒక్క కథా మొత్తానికి మొత్తంగా ఊహ కాదు, కల్పన కాదు, రచన కాదు. విప్లవోద్యమ నేపథ్యంలోని ఒకానొక కఠిన వాస్తవం లేకుంటే ఈ కథావస్తువే ఉండేది కాదు, ఎంత అభూత కల్పనలు, అతీత ఊహలు చేయగల కాల్పనిక మాంత్రికులు కూడా ఈ కథన ఊహలు చేయడం అసాధ్యం.

ఇదంతా అమరుల బంధు మిత్రుల సంఘం అనే ఒక సంఘం ఏర్పడి, అమరుల అంత్యక్రియలను గౌరవప్రదంగా జరపాలని, కుటుంబ సభ్యులకూ బంధువులకూ మిత్రులకూ తమ ఆత్మీయులను చివరిసారి ప్రేమతో గౌరవంతో చూసుకునే అవకాశం అయినా దక్కాలని ఒక మానవీయ ఆకాంక్షను ప్రకటించినప్పుడు రూపొందిన కథావస్తువు. ఆ మానవతా స్పర్శను కూడా అత్యంత దుర్మార్గంగా అడ్డుకుంటున్న రాజ్యం కల్పించిన బీభత్సం ఈ కథల వస్తువు. ప్రజా జీవన పురోభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆ వీరుల హత్యే రాజ్యం చేసిన ఒక దుర్మార్గం కాగా, ఆ హత్యానంతర వ్యవహారం మరింత అమానుషంగా, దుర్మార్గంగా, బీభత్సంగా సాగుతున్న వర్తమానంలోని వర్తమానాలివి. ఆ బీభత్సాన్ని యథాతథంగా చిత్రించి అందులోంచి విషాదాన్నీ కరుణనూ ఒరిగిన వీరుల ఆశయం పట్ల నిబద్ధతనూ ప్రేరేపించడం ఈ కథల లక్ష్యమూ సారమూ కూడ. ఆ సారాన్ని యథాతథంగా, విశ్వసనీయంగా, కళాత్మకంగా, ఆర్ద్రంగా ప్రతిబింబించే రూపంలో పట్టుకున్న నైపుణ్యం పద్మది. 

విప్లవోద్యమం తొలి దశాబ్దాలలో విప్లవకారులను గ్రామాల్లోనో పట్టణాల్లోనో ఎక్కడో ఒకచోట పట్టుకుని అడవులలోకి తీసుకువెళ్లి ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపడం ప్రారంభమయ్యాక ఆ మృతదేహాలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు జరపడానికి రాజ్యం ఎప్పుడూ అనుమతించలేదు. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల చివరి చూపుకు అవకాశాలు ఎప్పుడూ ఇవ్వలేదు. తెలుగుసీమలో ఎన్ కౌంటర్ పేరు మీది మొట్టమొదటి హత్యాకాండలో పంచాది కృష్ణమూర్తినీ ఆరుగురు సహచరులనూ 1969 మే 27న చంపినప్పుడు గాని ఆ తర్వాత 1994 దాకా అటువంటి వందలాది బూటకపు ఎన్ కౌంటర్ హత్యల సందర్భంలో గాని ఆ అమరవీరుల మృతదేహాలను పోలీసులే దహనం చేశారు. మృతదేహాలను ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో వదుల్చుకున్నారో తెలియదు. అసలు మృతదేహాలను బంధుమిత్రులకు ఇవ్వాలనే, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరపాలనే, బందుమిత్రులకు చివరి చూపైనా దక్కనివ్వాలనే ఆలోచననే రాజ్యం సహించలేదు. నాటి భయ భీతావహ పరిస్థితులలో బంధుమిత్రులను బెదిరించి, ఎన్ కౌంటర్లు జరిగిన మారుమూల ప్రాంతాలను చక్రవలయాలలో ఉంచి, పోలీసు రాజ్యం సాక్ష్యాలు, వివరాలు బైటపడని పరిస్థితులు కల్పించింది. విప్లవ కార్యకర్తలను అరెస్టు చేశారనీ, ప్రాణహాని లేకుండా కోర్టులో హాజరు పరచాలనీ పౌరహక్కుల సంఘమో, స్థానిక ప్రజా నాయకులో పత్రికా ప్రకటనలు ఇచ్చిన తర్వాత, పత్రికా ప్రకటనలు కూడ ఇవ్వలేని స్థితిలో ఏ బస్సు దగ్ధం ద్వారానో, ప్రభుత్వ కార్యాలయ దగ్ధం ద్వారానో అరెస్టు వార్త బైటికి తెలిసేలా చేసిన తర్వాత కూడ బూటకపు ఎన్ కౌంటర్లు చూపడమూ, మృతదేహాలను బంధుమిత్రులకు ఇవ్వకపోవడమూ జరిగింది. దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన ఈ సుదీర్ఘ విషాద చరిత్రలో ఎంతో మంది ప్రజల ప్రేమను చూరగొన్న విప్లవోద్యమ నాయకుల మృతదేహాలు కూడ చివరి చూపు కూడ దక్కకుండా అనామకంగా, దుర్మార్గంగా పోలీసుల చేతిలోనే రెండోసారి కూడ హత్యకు గురయ్యాయి. 

ఎన్ కౌంటర్ మృతుల దేహాలకు గౌరవప్రదమైన అంత్యక్రియల కోసం, చివరి చూపు కోసం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అప్పగించాలనే డిమాండ్ గులాం రసూల్, విజయప్రసాద్ ల ఎన్ కౌంటర్ హత్య సందర్భంగా దాదాపు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పటికి ఉదయం పత్రికలో విలేఖరిగా పనిచేస్తున్న గులాం రసూల్ ను, ఆయనతో పాటు స్కూటర్ మీద ఉన్న విజయ ప్రసాద్ ను హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారి మీద పట్టుకుని శివార్లలో కాల్చి చంపి “గుర్తుతెలియని” నక్సలైట్లు ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టుగా ప్రకటించారు. ఒక పోలీసు అధికారి జరిపిన భూదందాలను బైట పెట్టినందుకు గులాం రసూల్ మీద కక్ష తీర్చుకోదలచి, కేవలం సాక్ష్యం లేకుండా చేయడం కోసం వెంట ఉన్న వ్యక్తిని కూడ హతమార్చిన దుర్మార్గ సంఘటన అది. ఆ మృతదేహాలు “గుర్తు తెలియని వ్యక్తులవి” కాదని గుర్తించిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతదేహాలను బంధువులకు ఇవ్వాలని జర్నలిస్టు ఉద్యమ ప్రతినిధి బృందం హోం మంత్రితో చర్చలు జరుపుతుండగానే, అరగంటలో మృతదేహాలను ఇస్తామని వాగ్దానం చేసి ఆ ప్రతినిధి బృందాన్ని మంత్రి దగ్గర వేచి ఉండేలా చేసి, మరొకవైపు పోలీసులు ఆ మృతదేహాలను దహనం చేసేశారు. అది 1991 డిసెంబర్ 28-29. ఆ తర్వాత పది నెలలకు పులి అంజయ్య, భాగ్యలక్ష్మిలను బెంగళూరులో పట్టుకుని, జనగామకు తీసుకు వచ్చి, అక్కడ బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయారని చెప్పినప్పుడు, వరంగల్ జిల్లాలో వేలాది మంది ప్రేమాభిమానాలు చూరగొన్న ఆ ఇద్దరు అమరవీరుల మృతదేహాల చివరి చూపు కూడ బంధుమిత్రులకు దక్కలేదు.

ఒకరకంగా ఈ అమానుష చరిత్రలో మార్పు తెచ్చినది 1994 సెప్టెంబర్ లో చింతల వెంకటస్వామి, పద్మల బూటకపు ఎన్ కౌంటర్. వారిని కాల్చి చంపి ఎన్ కౌంటర్ ప్రకటించినప్పుడు, ఆ ఎన్ కౌంటర్ బూటకత్వాన్ని రుజువు చేయడానికి మృతదేహాలకు రిపోస్ట్ మార్టమ్ జరిపించాలనే డిమాండ్ వచ్చింది. దాన్ని హైకోర్టు కూడ ఆమోదించి, రిపోస్ట్ మార్టమ్ జరపాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎన్ కౌంటర్లు చూపిన చోట చిన్న పట్టణాలలోని ఆస్పత్రులలో పోస్ట్ మార్టమ్ సౌకర్యాలు సరిగా లేనప్పుడు, లేదా ఆ చిన్న ఆస్పత్రుల వైద్య నిపుణులు పోలీసుల ఒత్తిడి మేరకు పోస్ట్ మార్టమ్ నివేదికలు రాస్తున్నప్పుడు, రిపోస్ట్ మార్టమ్ చేయాలనే డిమాండ్ మీద హైకోర్టుకు రావడం, కొన్ని సందర్భాలలో హైకోర్టు అందుకు అనుమతించడం, అందువల్ల మృతదేహాలను కొన్ని రోజుల పాటు మార్చురీలలో భద్రపరచడం, చివరికి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే డిమాండ్ పెరగడం, కుటుంబ సభ్యులకు ఇవ్వడం మొదలైంది. మృతదేహాలు కూడ గాయాలతో, బుల్లెట్ గుర్తులతో సాక్ష్యం చెప్పగలవు గనుక రిపోస్ట్ మార్టమ్ నూ, మృతదేహాలను బంధుమిత్రులకు అప్పగించడాన్నీ పోలీసులు గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఆ చరిత్రలో మరొక మలుపు నర్సాపూర్ ఎన్ కౌంటర్. 1997 ఫిబ్రవరి 17న నర్సాపూర్ ఎన్ కౌంటర్ లో మృతదేహాలను పోలీసులు చితి మీద కూడ పెట్టి నిప్పు అంటించబోతుండగా అక్కడికి చేరుకున్న రామేశ్వర్ తల్లి, సోదరుడు మృతదేహాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గద్దర్ నాయకత్వంలో ఈ డిమాండ్ కు పెద్ద ఎత్తున మద్దతు చేకూరి ఈ కేసు హైకోర్టుకు చేరింది. హైకోర్టు జోక్యంతో రెండో పోస్ట్ మార్టమ్ మాత్రమే కాక, రామేశ్వర్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించడం జరిగింది. ఫిబ్రవరి 20న రామేశ్వర్ అంత్యక్రియల ఊరేగింపు వేలాది మందితో జరిగింది. ఎటువంటి సభలకూ ఊరేగింపులకూ అనుమతి లేని తెలంగాణలో రామేశ్వర్ అంతిమయాత్రే పెద్ద ప్రజా ప్రదర్శనగా, ఊరేగింపుగా, సభగా జరిగింది. అలా మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలనే డిమాండ్ విస్తృతం కావడం మొదలయింది. రామేశ్వర్ అంతిమయాత్ర సాగుతున్న రోజునే రాచకొండ గుట్టల్లో బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించిన మారయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేయడానికి నల్లగొండ వెళ్లిన గద్దర్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. మరొకవైపు మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇచ్చి వెంటనే దహనం చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో 32 ప్రజా సంఘాల ఐక్య వేదికగా, గద్దర్, ఎంటి ఖాన్ కన్వీనర్లుగా ఎన్ కౌంటర్ మృతదేహాల స్వాధీన కమిటీ ఏర్పడింది. అలా 1997 మొదటి మూడు నెలల్లోనే 37 మంది విప్లవ కార్యకర్తలను ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లలో కాల్చి చంపగా, ఈ అన్ని సందర్భాలలోను మృత దేహాల రిపోస్ట్ మార్టమ్ కోసం, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయడం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఎన్నో ఒత్తిడుల మధ్య, గద్దర్ మీద కాల్పులతో సహా తీవ్ర నిర్బంధం మధ్య, మృతదేహం ఇచ్చినా వెంటనే దహనం చేయాలని కుటుంబ సభ్యుల మీద పోలీసుల ఒత్తిడి మధ్య, మృతదేహాల స్వాధీన కమిటీ మూడు నాలుగు సంవత్సరాలు పనిచేసింది. ప్రతి బూటకపు ఎన్ కౌంటర్ సందర్భంలోనూ ఒక వైపు న్యాయపోరాటం చేస్తూ, మరొక వైపు మానవీయ విలువలతో మృతదేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు చెపుతూ అమరుల మృతదేహాల ఊరేగింపులు, సభలు నిర్వహించింది. 

ఈ చరిత్ర వారసత్వంగా, ఎన్ కౌంటర్ మృతదేహాల స్వాధీన కమిటీ తదనంతరం, 2002లో పుట్టింది అమరుల బంధుమిత్రుల సంఘం. ఈ పద్దెనిమిది సంవత్సరాలలో అది రెండు రాష్ట్రాలలోనూ ఎక్కడ ఎన్ కౌంటర్ జరిగినా కొన్ని గంటల్లో అక్కడికి చేరింది. కుటుంబ సభ్యుల వెంట వెళ్లి వందలాది మంది అమరవీరుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు చేర్చింది. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను పరామర్శించింది. అమరుల స్మరణలో బంధుమిత్రులను భాగం చేసింది. బంధుమిత్రులకు అండగా నిలిచి, అమరుల అంత్యక్రియలు, అంతిమయాత్రలు నిర్వహించింది. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసింది. వార్షిక సంస్మరణ సభలు నిర్వహించింది. అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. 

ఇదంతా కళ్ల ముందర జరిగిన చరిత్ర. వ్యాసప్రక్రియలో రాస్తే నిస్సారమైన అంకెలుగా, పేర్లుగా, స్థలాలుగా, నామవాచకాలుగా కుదించబడే చరిత్ర. కాని వాస్తవంగా ఇది చరిత్ర మాత్రమే కాదు, ఇది ఒక విషాద వాస్తవం. ఇందులో నిండి ఉన్నవాళ్లంతా మనుషులు. వాళ్ల ఉద్వేగాలు, మానవ సంబంధాలు, కోపం, దుఃఖం, ఆవేదన, ఆందోళన, వియోగబాధ, ఎప్పుడో దశాబ్దాల కింద తమను విడిచిపోయిన బిడ్డలు, దశాబ్దాలుగా ఉజ్వల చరిత్ర నిర్మాతలుగా వినబడుతూ, కనబడుతూ వచ్చిన బిడ్డలు హఠాత్తుగా విగతజీవులుగా ఇంటికి చేరిన ఉద్విగ్న దృశ్యాలు. ఏ ఇంట్లో పుట్టారో, ఏ ఇంట్లో అంబాడారో, ఏ ఇంటితో లక్ష జ్ఞాపకాలు పెనవేసుకుని ఉన్నారో, ఏ ఇంటితో సజీవ సంబంధంలో ఉన్నారో ఆ ఇంటి ముంగిలికి నిర్జీవ మృతదేహాలుగా రావడం… ఇది మాటలకందని, గుండెను మెలిపెట్టే విషాద దుర్భర దుఃఖగాథ. ఇందులో ఎన్నెన్నో ఉద్వేగాలున్నాయి. అంతులేని దుఃఖంలోనే ఒక స్మృతి వీచిక మేల్కొలిపే దరహాసం ఉన్నది. ఇక తిరిగి రారని తెలిసినప్పటికీ ఎప్పటికీ సజీవ స్మృతిగా ఉండిపోతారనే గర్వం ఉన్నది. ఇవాళ్టి పెనుచీకటి దుఃఖమూ నిజమే, నిన్నటి జ్ఞాపకపు ఉజ్వలానందమూ నిజమే. ఎంత ప్రియాతిప్రియమైన ఆత్మీయ వ్యక్తి అయినా భౌతిక ధర్మం ప్రకారం కుళ్లి పురుగులు పడి భరించరాని దుర్గంధం వెదజల్లే శవమూ నిజమే. ఆ శవాల గది ముందరే ఆ దుస్సహ వాసనను ఎదిరిస్తూ గంటల తరబడీ రోజుల తరబడీ వేచి చూసే ఓపికా నిజమే. అపారమైన దుఃఖం మధ్యనే లేచి నిలబడడానికీ, ఒరిగిన బిడ్డను తలచుకుని నినదించడానికీ శక్తి అవసరమనీ, అందుకోసం అక్కడే గుక్కెడు చాయ్ నీళ్లయినా తాగాలనీ, నాలుగు మెతుకులైనా తినాలనీ భౌతిక స్పృహ కూడ నిజమే. ఒక్క మాటలో చెప్పాలంటే సకల వర్ణాలతో, సకల అనుభవాలతో, సకల రాగద్వేషాల ఉద్వేగాలతో, అనేకానేక స్థాయిలలో పొరలలో విచ్చుకునే మానవ జీవితం ఇది.  

ఇంత అగాథ జలనిధి వంటి మానవజీవితం చరిత్రకో, వ్యాస ప్రక్రియకో లొంగేది కాదు. అది కథ, నవల వంటి కాల్పనిక ప్రక్రియలకో, కవిత్వం వంటి సృజనాత్మక ప్రక్రియలకో మాత్రమే అందేది. ఇక్కడ పద్మ చేసినది సరిగ్గా ఆ పనే. తనకు తెలిసిన జీవితాన్ని, తాను తలమునకలుగా గడుపుతున్న జీవితాన్ని, తాను భాగమై ఈదుతున్న విషాదాశ్రు నదిని, విలాపాగ్ని ధారను దాని సకల స్థాయిలలో తాను అనుభవించడం మాత్రమే కాదు, తన వెంట నడిపించి పాఠకులకు కూడ అనుభవైకవేద్యం చేయడానికి ఈ ప్రక్రియను ఎంచుకుంది. 

ఇతర రాష్ట్రాలలో, ముఖ్యంగా చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశాలలో, బూటకపు ఎన్ కౌంటర్ లలో చనిపోయినవారిలో తెలుగు రాష్ట్రాల బిడ్డలెందరో ఉండడం వల్ల మృతదేహాల కోసం వెళ్లడంలో అమరుల బంధుమిత్రుల సంఘం అనేక రాష్ట్రాలకు, ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈ ప్రయాణాలు అత్యంత దుఃఖభరితమైనవి. ప్రయాణ ప్రారంభమే ఒక విషాద వార్త తెలిసి, ఆ విషాదాన్ని పూర్తిగా అనుభవించడానికి సిద్ధపడి మొదలవుతుంది. వెళ్లేవాళ్ల మనసుల్లో దారి పొడవునా ఏ భావాలు, ఏ సంఘర్షణలు, ఏ జ్ఞాపకాలు ఏ కందిరీగల తుట్టెలను కదుపుతుంటాయో బహుశా ఒక్కొక్క వ్యక్తీ ఒక బృహన్నవలకూ దీర్ఘకావ్యానికీ వస్తువులు కాదగిన వారు. ప్రయాణ ప్రారంభపు ఆందోళన మాత్రమే కాదు, ప్రయాణం మధ్యలో ఏ ఆటంకాలు ఎదురవుతాయోననే ఆందోళన, గమ్యం చేరాక ఆసుపత్రిలో, పోలీసుల అదలింపులలో, అధికారవర్గపు సాచివేతలో ఉండే ఆందోళనలు, చివరికి ఆత్మీయుల మృతదేహం చూసినతర్వాత ఆందోళన, గుర్తుపట్టలేనంతగా మారిన మృతదేహం తమ ఆత్మీయులది అవునో కాదోననే ఆందోళన, ఏ ఆనవాలుతో గుర్తించాలో ఆందోళన, అప్పటికే సమయం గడిచిపోయి మృతదేహం కుళ్లిపోయి, ఆత్మీయులను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందిగదా అనే దుఃఖాందోళన, ఇంతచేసీ చివరికి ఆ మృతదేహం తీసుకుపోయే స్థితిలో లేకపోతే అక్కడే అంత్యక్రియలు జరిపించవలసిన ఆందోళన, తీసుకుపోగలిగితే తిరుగు ప్రయాణమంతా ఆందోళన, చివరికి స్వస్థలం చేరాక స్థానిక పోలీసుల ఒత్తిళ్ల ఆందోళన… ఇన్ని ఆందోళనలనూ ఈ కథలు పట్టుకుంటాయి. ఈ ఆందోళనల్లో ఏదో ఒక ఆందోళన పాఠకులకు ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది గనుక అది పాఠకులను కథతో మమేకం చేస్తుంది.   

ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇవాళ మృతదేహాలుగా మిగిలిన ఆ మహోన్నత వ్యక్తులు చేసిన అద్భుత కృషి సంగతేమిటి? మరణానంతర జ్ఞాపకంగా అది మళ్లీ మళ్లీ బీడు భూమిలో చిగురులా వికసిస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తులను కన్న తల్లిదండ్రులు, రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు, కన్న బిడ్డలు, సహచరులు వాళ్ల ఆందోళనల, ఉద్వేగాల సంగతేమిటి? చూసి పోయేవారికి, పరామర్శించేవారికి అది ఒక్కరోజు దుఃఖం కావచ్చు కాని ఆ తల్లుల వేదన, బిడ్డల వేదన, అసంపూర్ణ కర్తవ్యం పట్ల వారి సహచరుల తపన, వీటిని చిత్రించడమెట్లా? మిగిలిపోయిన తల్లిదండ్రులు ఏమి ఆలోచిస్తారు? మిగిలిపోయిన బిడ్డలు ఏమి ఆలోచిస్తారు? సహచరులలో ఆ మరణం ఏ భావోద్వేగాలను, ఏ ఆవేశాలను ప్రేరేపిస్తుంది? ఇవన్నీ కూడ అమరవీరుల సందర్భంలో అనివార్య, అవిభాజ్య భాగాలైన ఆలోచనలే. అందుకే వాచ్యంగానో, ధ్వని రూపకంగానో పద్మ కథలు ఆ ఉద్వేగాలన్నిటినీ కూడ చిత్రిస్తాయి. అందువల్ల ఇవి కేవలం దుఃఖపు కథలో, లేదా కేవలం కర్తవ్యపు కథలో మాత్రమే కావు. ఒకానొక విషాద సందర్భంలో అటు చివరా ఇటు చివరా ఉన్న ఆ రెండు ఉద్వేగాలు పద్మ కథలకు ప్రధాన భూమికలు. కాని ఈ రెండు కొసల మధ్య ఉన్న మిగిలిన అన్ని ఛాయల ఉద్వేగాలకు కూడ పద్మ కథలు చోటు కల్పిస్తాయి. ఆ అన్ని ఉద్వేగాలనూ గొప్ప నేర్పుతో చిత్రించి సహజంగానే, అనివార్యంగానే కన్నీటి కెరటాల మీది కొన్నెత్తుటి పతాకాల్ని గుర్తించి వాటిని మరింత సమున్నతంగా ఎగరేసే లక్ష్యానికి చేరుతుంది పద్మ. చరిత్ర నిర్మాణంలో పాల్గొంటూ చరిత్ర రచన కూడ చేయదలచిన వారికి ఆ సమ్యగ్ పరిశీలనా అవసరమే, ఈ కర్తవ్య దీక్షా అవసరమే.

రెండున్నర దశాబ్దాలుగా ఆత్మీయ మిత్రురాలిగా ఉన్న పద్మ సృజనాత్మక జీవిగా, కళాస్రష్టగా ఎంత ఎదిగిందో ఈ కథల్లో అక్షరాలా చూసి ప్రగాఢ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది వ్యక్తిగా, నైపుణ్యం సాధించిన కథకురాలిగా తనను అభినందించడం కన్న ఎక్కువగా తన తాత్విక దృక్పథాన్ని, అపారమైన మౌలిక ఆచరణను అభినందించడం. ఈ కథల వెనుక తాను చేసిన కృషినీ, ఈ కథల ద్వారా ఏ ప్రేరణనూ స్ఫూర్తినీ సాధించడానికి ప్రయత్నించిందో ఆ ప్రయత్నాన్నీ అభినందించడం. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.