తిరిగి చేరిన నమ్మకం 

-అనసూయ కన్నెగంటి         

         ఆహారం వెదుక్కుంటూ  హడావిడిగా అటూ ఇటూ ఎగురుతున్న పిచ్చుకకు ఒక చోట చెట్టుకు వ్రేలాడ  తీసిన ధాన్యపు కంకుల గెల కనిపించింది. అప్పటికి చాలా రోజుల నుండి సరిపడా ఆహారం ఎంత వెదికినా దొరకని పిచ్చుకకి  దాన్ని చూడగానే నోరు ఊరింది. 

    ఆత్రుతగా తిందామని గబుక్కున వెళ్లబోయి  సందేహం వచ్చి ఆగిపోయింది. 

     “ గతంలో ఇలా వ్రేలాడదీసిన వరి కంకుల మీద వాలి చాల సార్లు ఆహారాన్ని తిన్నాను. వాళ్లంతా  వాళ్లకు పండిన ఆహారంలో కొంత పక్షులకు పెడదామనో, లేదంటే కిచ్ కిచ్ మనే తమ స్వరాన్ని విందామనో ఇంకా లేదంటే  ఎక్కడెక్కడో తిరుగుతున్న అనేక పక్షుల్నిఒక చోట చూడవచ్చనే ఆశతోనో ఇళ్ళల్లో వ్రేలాడ తీసేవారు. కానీ ఇలా చెట్టుకి ఎవరూ వ్రేలాడదీయలేదు. ఇక్కడ కూడా చుట్టూ చిన్న చిన్న మొక్కలూ , చెట్లూ చాలా ఉన్నాయి.  ఆహారానికి కొదవ లేదు. కాబట్టి పక్షులు రావటానికైతే కాదు. ఇది అతని ఇల్లు కూడా కాదు. రాత్రికి ఇంటికి వెళ్ళిపోవాలి.

మరి ఇంటికి వెళ్ళేటప్పుడు దాన్నిఇంటికి పట్టుకు వెళ్ళి పోతాడా ? లేక అలానే వదిలేసి వెళ్ళిపోతాడా?

అలా వదిలి వేసి వెళ్ళిపోయే వాడైతే  ఇక్కడెందుకు కడతాడు? ఇందులో ఏదో స్వార్ధం ఉంది.

     బహుశా గింజల్ని తినటానికి ఆ కంకుల మీద వాలిన పక్షుల్ని గబుక్కున వల విసిరి పట్టుకుంటాడేమో? అమ్మో..! అలా అయితే ఇంకేమైనా ఉందా? అసలే అమ్మ చెప్పింది..” ఆహారం కనిపించగానే ఆబగా వెళ్ళి  తినెయ్యద్దు. కాసేపు గమనించి చూడు “ అని. కాబట్టి కనిపించింది కదా అని ఆశ పడి వెళ్ళిపోను. కొద్ది సేపు వేచి చూస్తాను..”

    అనుకుని ఆ కంకులను వ్రేల్లాడదీసిన చెట్టు పై కొమ్మ మీద అలానే కూర్చుని తమ వాళ్ళు ఎవరైనా వచ్చి తింటారేమో అప్పుడు తను కూడా వెళ్ళి తినవచ్చని ఆశగా ఎదురు చూడసాగింది. 

       కాసేపటికి రెండు పిచ్చుకలు ఎక్కడి నుండో ఎగిరి వచ్చి  వాటి మీద వాలి కిచ కిచమని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గింజల్ని వలిచి తినసాగాయి. 

    అవలా తింటుంటే  అతనేం చేస్తాడా అని పిచ్చుక అతన్నే గమనించసాగింది.  

    దూరంగా కూర్చున్న అతను..ప్రేమగా వాటి వైపే చూస్తూ..ఆనందించటం పిచ్చుక గమనించింది. 

     ఇంతలో ఆ దారిన పోయే బాటసారి ఒకడు అక్కడ కూర్చున్న అతన్ని, అతని ఆనందాన్ని చూసి తనూ అతని పక్కన కూర్చుంటూ..” అది మీరే కట్టారా అక్కడ ?” అని అడిగాడు.

   అవునన్నాడు అతను. 

    “ సాధారణంగా ఇలాంటివి కొత్త ధాన్యం ఇంటికి చేరిన కొత్తలో ఇంటి దూలానికి కడతారని తెలుసు. అప్పుడు ఆనందం మన ముంగిటకు వస్తుంది. అంతే కాదు. అవి అయిపోయే దాకా వాటి కిచకిచల ఆనందాన్ని  మనం పొందవచ్చు. కానీ మీరు ఆనందాన్ని వాటి ముంగిటకు తెచ్చారు? మరి ఇంటికి వెళ్ళి పోయేటప్పుడు దాన్ని పట్టుకు పోతారా? “ అని అడిగాడు.

    “ లేదు .పట్టుకుపోను. దానిని ఇక్కడే వదిలేస్తాను. ఎందుకంటే మన గుమ్మానికి మనం వ్రేల్లాడదీస్తే  తినటానికి వాటి భయం వాటికి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు రోజుల తరబడి ఒక్క పక్షీ తినటానికి రాని సందర్భాలూ ఉన్నాయి. అది మన మీద పక్షులకు పోయిన నమ్మకాన్ని తెలుపుతుంది. అదే ఇక్కడ వ్రేల్లాడదీస్తే…స్వేచ్చగా తినటమే కాదు అవి మన మీద నమ్మకాన్ని పెంచుకుంటాయి..మనం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేలా చేయటమే నా ఉద్దేశ్యం..”

      “ అలాంటప్పుడు ఇలా ఒక్క రోజు కడితే సరిపోదు కదా?”

    “ఒక్క రోజే కడతానని నేను మీతో చెప్పలేదు కదా? ఎన్నో ఏళ్ల నుండీ ధాన్యం వచ్చే రోజుల్లో ఇది నా అలవాటు. ఇవ్వాళ ఇక్కడ కట్టాను. రేపు మరొక చోట” అనగానే..

    అక్కడే చెట్టు మీద కూర్చున్న పిచ్చుక సందేహాలన్నీ తొలగిపోయి హాయిగా వెళ్ళి కంకుల మీద వాలింది.

    “బాగుందండి మీ ప్రయత్నం. ఇక నుండీ నేనూ ఇలాగే చేస్తాను..” అని అతనికి నమస్కరించి  తన దారిన తాను పోయాడు బాటసారి. 

           “ మంచిదండి” అంటూ కంకులపై పక్షులు చేస్తున్న అల్లరిని గమనిస్తూ ఉండిపోయాడు అతను. 

                                       *****                                                    

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.