పునాది రాళ్లు -8

-డా|| గోగు శ్యామల 

కుదురుపాక   రాజవ్వ కథ

కుల పితృ భూస్వామ్య వంటి వివిధ అధికారాలను ఏక  కాలంలో ఎదురిస్తూ పోరాడిన ఆ  స్త్రీలది కుదురుపాక గ్రామo .  వారు  అనుభవించిన వేదనలకు,  గాయాలకు మరియూ నిర్వ హించిన పోరాటాలకు  కుదురుపాక గ్రామం సాక్షంగా నిలిచింది. వారే చిట్యాల చిన రాజవ్వ, కనకవ్వ, బానవ్వా.  ఈ ముగ్గురూ దళిత మాదిగ స్త్రీలే.  కమ్యూనిస్ట్ పార్టీకి అనుబoదంగా ఏర్పాటైన  సంఘాలకు  పురుషులు నాయకత్వంలో ఉన్నా గాని  ఈ ముగ్గురు స్ర్తీలు కూడా  నాయకత్వం వహించడం విశేషం. అందులో రాజవ్వ రైతుకూలి సంఘానికి నాయకురాలు  కాగా, మిగితా ఇద్దరు మహిళా సంఘానికి  నాయకులుగా పనిచేశారు. వీరు మాదిగ  స్త్రీలు అయినప్పటికీ వీరి నాయకత్వాన్ని గ్రామంలోని అన్నికులాలైన గొల్ల ,పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, చాకలి, కాపు, పేద రెడ్డి, పేద వెలమ, మంగళి, మాల, పంచదాయి,  మాదిగ, బ్రాహ్మణ   కులాల ప్రజలతో సహా  వీరి కుటుంబ సభ్యులూ వీరిని గౌరవించారు  వీరినాయకత్వంను  అనుసరించారు. వీరందరి జీవితానుభవంలో వెట్టి దోపిడీ   భూఆక్రమణలు, కౌలు దోపిడీ, అత్యాచారాలు, వివక్ష వంటి అన్యాయాలు అదుపు అనేదే  లేకుండా  మూకుమ్మడిగా జరిగింది కనుక  అందరూ ఒక తాటిపైకి  వచ్చి పోరాడింర్రు.  ఐతే 1970 -80 కాలంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాలంలో   ఈ పోరాటాలు వచ్చాయనే గుర్తించుకోవాలి. ఈ   పోరాటాలకు సలహాలు దర్శకత్వం వహించింది  మాత్రం కమ్మూనిస్టు నక్సలైట్  పార్టీ అని  చెప్పాలి.   ఇది ఇలా ఉంటె గ్రామంలో మనువాద కులవ్యవస్థలో అంటబడని వారీగా చూడబడే మాదిగ స్ర్తీల నాయకత్వమును గ్రామంలో అన్ని కులాల ప్రజలు   గౌరవించిన సందర్భాలను, కారణాలను  పరిశీలిద్దాం.  కుదురుపాక గ్రామంలోని వందలాది ఎకరాల భూమి పంటలతో పచ్చగా ఉండడానికి కారణం మాదిగలు మాలలు  మరియూ ఉత్పత్తి కులాలు . కారణం వీరికి వ్యవసాయమ్ అంటే ఒక  వ్యాపకము,  ఆహార భద్రత గా  భావిస్తారు. అంతే కాక  భూమిని, వాతావరణాన్ని గురించిన  పరిజ్ఞ్యానం కూడా వీరికి అధికమే. బీడు సౌడు భూములనుకూడా ఎవుసం భూములుగా మార్చే తెలివి  వారిది. ఎవుసాన్ని నడిపే  పశుసంపదను, దానికి కావాల్సిన పచ్చి, ఒట్టి మేత ను  పెంచడం, వాటికీ దున్నే పని నేర్పడంతో పాటు పశువులకు వైద్యం చేస్తూ వాటి సంతతిని పెంచగలిగిన పనితనం వారిది.  అంతే కాక ఎవుసపు పనిముట్లు ఐన తాళ్లు బ్యారళ్లు, చర్నకోలాలువంటివి వీరు మాత్రమే తయారు చేయ గలిగిన  తీరును  ‘మాదిగ విజయం’ నవలలో కాలువ మల్లయ్య కొంతమేరకు  వివరిస్తాడు.  ఎద్దు ఎవుసాన్ని  నిర్వ హించే మాదిగ మాలలకు  కుమ్మరోళ్లు, ఒడ్లోళ్లు, కమ్మరోళ్లు తాము ఉత్పత్తి చేసే ఎవుసపు పనిముట్లు ఇవ్వడం ద్వారా మాదిగలతో ఉత్పత్తి సంభందాన్ని కలిగి ఉంటారు. ఈ రకమైన సంబంధాన్నీ ఉత్పత్తి  సంప్రదాయ సంస్కృతీ గా  కూడా సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇందులో భాగంగానే తల్లి దేవతలను  ప్రకృతిని ఆరాధించే 
 మాతృ వ్యవస్థ సాంప్రదాయ జీవన శైలిని కలిగి ఉంటారు.  దీనికి తోడు  కుదురుపాకతో సహా తెలంగాణలో ఏ గ్రామంలో  చూసినా మాదిగల గడపలు  మిగితా గడపల కంటే ఎక్కువ. ఇదే అంశాన్ని ప్రో భాoగ్యా భూక్యా తన  రచనలో సబ్బండ కులాల నడుమ ఉన్నఉత్పత్తి సంబంధాలె  భారతదేశంలోని జీవావరణాన్ని పచ్చదనాన్ని నిలిపాయని  పేర్కొన్నాడు. ఈ అంశాలు తెలంగాణా ప్రాంతానికి  అందులోని కుదురుపాక గ్రామానికీ వర్తిస్థాయి. ఇందులో భాగంగా ఎస్సిబీసీ  ఎస్టీ కమ్యూనిటీల నడుమ చరిత్ర పొడుగునా పెనవేసుకొని ఉన్న ఉత్పత్తి సంబంధాలు ప్రకృతిలో భాగమై, ప్రకృతికి ఆలంబనగా ఉంటూవచ్చాయి. ఈ బoధం ప్రకృతిఫై నియంత్రణ అనే సంబంధానికి పూర్తిగా భిన్నమైందనేది గమనించాలి. ఈ ఉత్పత్తి సంబంధమే  గ్రామ ఆర్థిక సాంకృతిక వారసత్వాన్ని నిలిపింది. ఈ వెలుగులోనే కుదురుపాక గ్రామలోని వివిధ  ఉత్పత్తి శ్రేణుల మధ్య, మనుషుల మధ్య మానవ సంబంధాలు కొనసాగుతూవచ్చాయనేది కుదురుపాక గ్రామానికున్న మొదటి పార్శ్వం. కుల దొంతర్ల అంతరాలు, ఒక మనిషికి  ఒక కులం. ఆ కులానికి పైన ఒక కులం కింద ఒక కులం అనే  హెచ్చు తగ్గుల వ్యవస్థ  కుదురుపాక గ్రామానికి  రెండవ పార్శ్వం.  ఇందులో పేర్కొన్న మొదటి పార్శ్వం రాజవ్వను గౌరవం కలిగిన  స్త్రీగా, ఉత్పత్తి కమ్యూనిటీ స్త్రీగా,  పార్టీ నిర్వహించిన పోరాటాల్లో బలమైన నాయకత్వoగా  నిలబెట్టింది.  కులవ్యవస్థ అంతరాల్లో  అట్టడుగు అంటబడని స్త్రీగా,  ఉత్పత్తి తాలూకు వెట్టిమాదిగ స్త్రీగా  రెండవ పార్శ్వమును  చూడవచ్చు.  దీనినే భూస్వామ్య గడీల దొరతనం అనుసరించింది.  అదే సమయంలో  మొదటి పార్శ్వాన్ని కుదురుపాక గ్రామ సబ్బండ ప్రజలు అనుసరించారు.  ఇక పార్టీ విషయానికొస్తే  గ్రామంలోని మొదటి  పార్శ్వం గురించిన స్పష్టత పార్టీకి ఉన్నట్లు అనిపించదు. ఇక భూపోరాటం విషయానికొస్తే భూమికోసం గడి దొరలఫై  పోరాడింది కుదురుపాక దళితులనే చెప్పాలి. అందులోకూడా దళిత మాదిగ స్త్రీలనే చెప్పాలి. వారే ఆ ముగ్గురు రాజవ్వ, బానవ్వా కనకవ్వ.  ఈ ముగ్గురు 44సం .. నుండి  50 సం.ల వరకు వయసు కలిగి ఉన్నారు.  వీరు గృహిణులుగా, వ్యవసాయ కూలీలుగా, వెట్టి కూలీలుగా తదితర జీవన శైలిని సాగిస్తూ తమ పిల్లలను చాలీచాలని గంజి మెతుకులతో  పోషించుకుంటున్నస్థితి.  ఒక వైపు భర్త వెట్టికూలీగా, పిల్లలు వెట్టి బాలాకూలీలుగా పని చేస్తూ ఉన్నాఆకలికి, భూమిలేని తనానికి గురవుతూ ఉన్న స్థితిలో ఊరు దొరకు వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చింది.  ఒక పక్క పార్టీ ‘దున్నేవాడిదే  భూమి’ అని పిలుపు నందుకొని, ఊరిలోని సబ్బండ పనిబాటోళ్లంతా ‘ సంఘo ‘ నిర్మాణం చేసుకున్నారు. దానికొరకు   ఈ ముగ్గురు చొరవ తీసుకొని పనిచేసారు. ఈ సందర్భంలోనే  ”రండిరో కూ లన్న సంఘము పెడదాము దొరల సంగతి సూద్దాం”అనే పాట అందరినోట ఆడింది. కుదురుపాక భూపోరాటం పక్క ఊర్లకు పాకుతున్నది అన్న సంగతిని దొరలు పసిగట్టి  పోరాటాన్ని ఇక్కడే ఆపేయాలని దృఢ నిర్ణయం తీసుకున్నారు. నాయకత్వం వహిస్తున్న స్త్రీల ఫై దాడికి తెగబడ్డారు. దొర తన గుండాలను తెల్లవారాక ముందే వాడలోని గుడిసెల మీదికి పంపాడు.   గుండాలకు కావలిగా   పోలీసులను పంపాడు దొర . ముందుగా ఆడవాళ్లను లైంగికంగా అణిచివేయడం ద్వారా  పోరాటాన్ని ఆపేయాలనుకున్నారు. గుండాలు గ్యాంగులుగా  వెళ్లి నిద్రలో ఉన్న రాజవ్వ కుటుంబం మీదపడి లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు.     

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.